పాదం మీద ముద్దు

మొన్న నీ పక్కన కూర్చున్నప్పుడు అమ్మ గుర్తొచ్చింది.

నేన్నీకు ఇది ఇలాగే చెప్పాలి. అచ్చంగా నేననుకున్నట్టే. మొన్న ఫోన్ చేసి భయపడిపోయావు నాకు చిన్న జ్వరం వచ్చిందనగానే. మళ్లీ మెసేజ్ చేసి నేనలా ఉన్నానో కనుక్కున్నావు. నేను ఆ మధ్యాహ్నం పూట హాస్టల్లో పడుకున్నట్టు కూర్చున్నాననే మాటే కానీ నాకైతే నిద్ర రాలేదు. మధ్యాహ్నాలు ఎందుకో నాకు నిద్ర రాదు. వచ్చినా ఏదో గుబులు వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది. అదెంటో కూడా తెలీదు కొన్నిసార్లు.

మొన్న నాకు మధ్యాహ్నం అలా కూర్చున్నంతసేపూ, పోయిన ఏడాది నేను ఎక్కడున్నా? అనే ఆలోచిస్తున్నా. మామూలుగా ఎండాకాలాలు మనం ఖాళీగా ఉండాలన్న ఆలోచనలతో నిండిపోతాయి. నాకూ అలాగే ఉంటుంది. ఎండాకాలమంతా సెలవుంటే బాగుంటుందని ఉద్యోగం వచ్చిన రోజు నుంచీ అనిపించేది. కానీ అది కుదరదు కదా!

పోయిన ఏడాది మాత్రం ఇంట్లోనే ఉన్నా. ఎండాకాలమంతా ఇంట్లోనే ఉన్నా. రొటీన్ అంతా ఎలా ఉండేదో తెలుసా? పొద్దున్నే లేచి బ్రష్ చేసుకోవాలి. ఏమన్నా తినాలి. రెండు గంటలు మెడిసిన్. గంటన్నర ఆ మెడిసిన్ కక్కేసుకోకుండా ఉండటానికి శ్రమపడాలి. మధ్యాహ్నం మళ్లీ తినాలి. ఇంకొన్ని మెడిసిన్స్. పడుకోవాలి. మెడిసిన్ తీస్కుంటా కదా, నిద్ర పట్టేస్తుంది.

మధ్యలో ఎందుకో మెలకువ వస్తుంది.

ఈ రోజుకి దాటొచ్చిన వాస్తవాలో, రేపటిని మోసుకొచ్చే ఊహలో కనిపిస్తాయి.

భయమేసేది. ఏడుపొచ్చేది. నేనెక్కడున్నా? ఏం చేస్తున్నా? నేనిలాగే ఇక్కడే ఆగిపోతానా? ఆలోచనలన్నీ వెంటాడుతూ ఉండేవి. గతాల్లోకి వెళ్లాలా, భవిష్యత్ గురించి ఆలోచించాలా కూడా పట్టదు. ఆ వెంటనే కొన్నిసార్లు, ఇప్పుడు తిన్నది ఇలాగే కక్కేస్తానేమో, మంచినీళ్ల కోసమని లేచి రెండడుగులు వేసి అలాగే పడిపోతానేమో, రాత్రంతా ఊపిరికి కష్టపడిపోతానేమో అని భయమేసేది.

ఒకవైపే తిరిగి పడుకోవాలి నేను. ఎటువైపో తెలుసా? నేనెప్పుడూ పడుకునే సైడ్‍కి అపోజిట్. ఊపిరితిత్తుల మీద ఎవరో బరువు మోపినట్టు ఉండేది. దగ్గితే, నిశ్శబ్దంగా ఉన్న గదిలో సన్నటి ఇనుప తీగను లాగితే వచ్చే శబ్దం లాంటిదేదో నా ఒక్కడికే వినిపించేది. నాకు ఆ శబ్దం ఈ రోజు గుర్తొచ్చినా ఒళ్లంతా ఒణికిపోతుంది. అలాంటిది ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, చాలా రోజులు. లెక్కబెట్టుకోలేదు నేను.

లైఫ్ నుంచి బ్రేక్ కావాలనుకుంటాం చూడు.. ఇలాంటివి వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు, రొటీన్ ఎంత బాగుంటుందో! ఇదంతా జరిగినంత కాలమూ అమ్మ ఒక్కతే నాకు ధైర్యం. ఇన్ని ఆలోచించి పడుకొనో, లేచో, సాయంత్రానికి పూర్తిగా లేస్తా కదా, అమ్మ బూస్ట్ చేతిలో పెట్టి తాగమనేది. ఏదైనా పండు కోసిచ్చేది.

ఫోర్ టు సిక్స్ నేననుకుంటాను, ఒక భయంకరమైన నిశ్శబ్దాన్ని మోసుకొస్తుంది. సిక్స్ తర్వాత మళ్లీ నార్మల్ అనిపిస్తుంది. నేను ఆ ఫోర్ టు సిక్స్ అమ్మతో మాట్లాడుతూ కూర్చునేవాడ్ని. ఈటీవీలో వచ్చే రిపీట్ షోస్ చూస్తుండేవాళ్లం. అమ్మ కాసేపు నిద్రపోయేది. కాసేపు నా మాటలు వినేది. నేను ఆమె చెవులు గిల్లుతూ ఉండేవాడ్ని.

మొన్న నీ పక్కన కూర్చున్నప్పుడు అమ్మ గుర్తొచ్చింది.

ఫోర్ ఓ క్లాక్ వస్తే చాయ్ తాగుదామని నువ్వంటే, నేను రానిది కూడా అందుకే. ఏవేవో ఆలోచిస్తూ కూర్చున్నా. నాకు ఆ రోజు, అంతకుముందు రోజూ నిన్ను పట్టుకొని కూర్చోవడం ఎంత బాగుండిందో తెలుసా!

నువ్వు రేప్పొద్దున నాతో ఎప్పుడు ఇలా ఉండకుండా వెళ్లిపోయినా, నువ్వెప్పుడూ పక్కనే ఉంటావు. సరిగ్గా పోయినేడాది ఈ సమయానికి నేను ఎక్కడ ఉన్నానా అని ఆలోచించి, ఈ రోజు నువ్వు పక్కనే ఉండటం చూస్కుంటే, నేనంటూ ఒకడ్ని ఇలా ఉన్నానని నీకు తెలీదు కదా అనుకున్నా.

నన్ను చూడ్డానికి వచ్చి ఉండేదానివేమో!

మొన్న నేను నీతో మాట్లాడుతూ మాట్లాడుతూ నీ కాళ్ళ దగ్గర కూర్చొని, నీ పాదాలందుకొని ఎన్ని ముద్దులు పెట్టానో గుర్తుందా? నువ్వు ఆ పూట నాతో ఉన్నందుకు నేను చూపించాల్సిన ప్రేమ అనిపించింది అది.

ఇవన్నీ ఒకేసారి ఆలోచిస్తే నాకనిపిస్తూ ఉంటుంది, ఒక్కోసారి, ఒక్కొక్కళ్లు లేని జీవితాలు ఎలా ఉంటాయో కదా అని. ఇప్పుడైతే నేను ఏడ్చినప్పుడల్లా నువ్వు గుర్తొస్తావు. నవ్విన ప్రతిసారీ నీకది చెప్పాలనిపిస్తుంది. నీకు మాత్రమే కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేసినవి ఎక్స్‌పీరియన్స్ చేసినట్టు చెప్పాలనిపిస్తుంది, ఒక్క మాట కూడా మిస్ చేయకుండా!

ఇదంతా చేసిన తర్వాత నువ్వలాగే నవ్వుతూ నాకు ఆ పదడుగుల దూరంలో కూర్చొని ఉండాలి. చటుక్కున నేనొచ్చి నీ కాళ్ల దగ్గర కూర్చోవాలి. నీ పాదాన్ని అందుకొని ఒక ముద్దు పెట్టాలి.

ఆ తర్వాత “ఇంకెప్పటికీ కలవను” అని చెప్పి నువ్వలాగే వెళ్లిపోయినా ఫర్వాలేదనిపిస్తుంది, ఇంకో గంటకో ఎప్పుడో నువ్వు నా పక్కనుండాలని కోరుకోగానే వచ్చేలా!

 

 

 

వి. మల్లికార్జున్

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తర్వాత “ఇంకెప్పటికీ కలవను” అని చెప్పి నువ్వలాగే వెళ్లిపోయినా ఫర్వాలేదనిపిస్తుంది, ఇంకో గంటకో ఎప్పుడో నువ్వు నా పక్కనుండాలని కోరుకోగానే వచ్చేలా… wow 💕

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు