పాతికేళ్ళ ప్రస్థానం- మైలురాళ్లూ, మేలు కలయికలూ!

డెట్రాయిట్ తెలుగు  లిటరరీ క్లబ్ అడుగు జాడలు కొన్ని ఈ తరానికి మరచిపోలేని పాఠాలు!

 1

రుకాని ఊరికి వెళ్లినప్పుడు సొంతూరు అంటే ఏమిటో తెలుస్తుంది.

తెలిసిన ముఖమే లేక, చుట్టూ కనిపించే అసంఖ్యాక అపరిచితులందరి మధ్యా బిక్క ముఖం వేసుకుంటూ తిరగడం తప్ప ఇంకేమీ చేయలేం. దేశం కానీ దేశం వెళ్లినప్పుడు ఈ బిక్క ముఖం మరీ దీనంగా మారిపోతుంది. ఇప్పుడు భాష కూడా మనది కాదు. మనుషుల రూపాలు కూడా మనకి దగ్గిరగా వుండవు.

అయితే, ఇప్పుడంటే కాలం కొంత మారిపోయింది కానీ, 2000 కి ముందు అమెరికా చేరుకున్న తెలుగువారి జీవన దృశ్యం వేరు. అప్పటికే రెండు మూడు తరాల తెలుగు వాళ్ళు అమెరికాలో వున్నప్పటికీ, 2000 తరవాతి పరిస్థితి కొంచెం వేగం అందుకుంది. అంతకుముందు తరాల వాళ్ళకి అమెరికా వస్తే గాని, అమెరికా అంటే ఏమిటో అర్థమయ్యే స్థితి లేదు. ఇప్పుడు అలా కాదు, కొత్త తరం వాళ్ళకి ఆంధ్రాలోనో, తెలంగాణలోనో ఏ మారుమూల గ్రామంలో వున్నా, అమెరికా అంటే ఏమిటో ఎంతో కొంత తెలుసు.

అట్లా ఏమీ తెలియని కాలంలో ఆ తరాల వాళ్ళు ఏం చేసివుంటారు?! ఏం చేసి వుంటారో వాళ్ళే విడమరచి చెప్పినా, ఈ తరానికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే, తరాలతో పాటు, కాలాలతో పాటు ఎన్నో మారిపోయాయి. అసలు తెలుగుదనం అనే భావనే మారిపోయింది. మరీ దూరమేమీ వెళ్లక్కర్లేదు- పాతికేళ్ళ కిందనే అనుకుందాం!

 2

పాతికేళ్ళ కిందటి తెలుగుదనం అనే భావనలో పుస్తకం అతివిలువైన సాధనం. అప్పటికి ఎలక్ట్రానిక్ మీడియా గానీ, సోషల్ మీడియా గానీ ఇప్పుడున్నంత విశృంఖలంగా లేవు. తెలుగు సినిమా పాటలు వినాలనుకున్నా సరే, ఆడియో కాసెట్ల పెట్టెలు పట్టుకుతిరగాల్సి వుండేది. వొక్క తెలుగు పుస్తకం కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేది. ఎన్నో యూనివర్శిటీలలో భారతీయ భాషా పుస్తకాలు అందుబాటులో వున్నా, తెలుగు పుస్తకాలు మాత్రం కొద్ది చోట్ల మాత్రమే వుండేవి. వున్నా, అవి మామూలు కంటికి కనిపించనంత రహస్యంగా ఎక్కడో వుండేవి. అప్పుడు- ఇండియా నుంచి మోసుకొచ్చే పరిమితమైన లగేజీలో ఎంతో ప్రేమకొద్దీ అయిదారు తేలికపాటి పుస్తకాలు తెచ్చుకొని, వాటినే వొకటికి పదిసార్లు తిరగేసుకుంటూ కాలక్షేపం చేయడం తప్ప వేరే దారి లేదు.

బహుశా, అలాంటి తీవ్రమైన వెతుకులాటలోనే డెట్రాయిట్ తెలుగు  లిటరరీ క్లబ్ పుట్టి వుండాలి. ఇప్పుడు DTLC గా ప్రవాస తెలుగు సాహిత్యజీవుల  మనసులో నాటుకుపోయిన ఈ సంస్థకి పాతికేళ్లు నిండాయంటే వొక వైపు ఆశ్చర్యమూ, మరోవైపు ఇంతకాలంనాటి మనుగడలో ఆ సంస్థని బతికిస్తున్న జీవలక్షణాలేమిటా అన్న ఆసక్తీ కలుగుతోంది. కేవలం మంచి పుస్తకాల అభిరుచి మీద వొక సంస్థకి ఇంత ఆయుష్షు  సాధ్యమా?!

 3

 నిజానికి కష్టమే! ఎందుకంటే, పోను పోనూ పుస్తకం స్థానభ్రంశమవుతూ వస్తోంది. వొక దశలో పుస్తకం అంతరించిపోయే వస్తువుల జాబితాలో కూడా పడిపోయింది. ఇది ప్రతీకాత్మకంగా చెప్తున్న విషయం కాదు. నిజంగానే, పాతిక ముఫై ఏళ్ల కిందట పుస్తకం అంటే వున్న మమకారం ఇప్పటికీ అలాగే వుందంటే నమ్మడం కష్టం. అయితే, DTLC ప్రస్థానమంతా పుస్తకం చుట్టూ పరిభ్రమణమే!

 ఆరి సీతారామయ్య, నాసీ (కొత్త పాళీ నారాయణ స్వామి) లాంటి మిత్రులు చెప్తున్న ప్రకారం- 1998 ప్రాంతాల్లో మొదట్లో కలిసే ఆ కొద్దిమంది మామూలుగా కవిత్వమో, కథలో, ఏ విషయం మనసుకి తోస్తే అదే మాట్లాడుకునే వాళ్ళు. తరవాత నెమ్మదిగా ఆ కబుర్లన్నీ పుస్తకం చుట్టూ కుదరడం మొదలయింది. అంటే, ఏదో వొక పుస్తకం తీసుకొని, దాన్ని శ్రద్ధగా చదువుకొని, నాలుగు మాటలు మాట్లాడుకుంటే బాగుంటుందన్న ఆలోచన కుదురుకుంది. దీని వెనక కూడా బలమైన చరిత్రే వుంది.

ఆరోజుల్లో ఇంటర్నెట్లో తెలుగు వారికి SCIT (Society Culture India Telugu) ) అని ఒక (సోషల్ మీడియా) గ్రూప్ ఉండేదని ఇప్పటికీ మిత్రులు చెప్తూ వుంటారు. బహుశా అది మొట్టమొదటి తెలుగు అంతర్జాల సమూహం అవునో కాదో ఇక్కడి మిత్రులు చెప్పాలి. అంతకుముందు ఇలాంటి ఈ-సమూహాలు వుంటే, అవి ఏం చేశాయో ఈ తరానికి తెలియాల్సిన అవసరముంది. నిజానికి వీటి  గురించి మాట్లాడగలిగిన మిత్రులు అనేకమంది అమెరికా తెలుగు సాహిత్య జీవుల్లో వున్నారు. కానీ, అలాంటి వొక ప్రేరణ ఎంత బలంగా పనిచేసి వుంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

 ఈ క్లబ్ స్థాపనలో కీలక పాత్ర నిర్వహించిన ఇద్దరు ముగ్గురు మిత్రులతో మాట్లాడున్నప్పుడు- క్లబ్ పరిణామంలో రెండు దశలు కనిపించాయి. మొదటి దశ- informal. అంటే, నిర్దిష్టమైన కార్యక్రమమేదీ లేకుండానే ఆన్ అర్బర్ లైబ్రరీలో వూరికే కలుసుకొని, కబుర్లు కలబోసుకోవడం! మొదటి సమావేశానికే 15 నుంచి ఇరవై మంది ఆ లైబ్రరీకి వచ్చారట. లైబ్రరీ వాళ్ళు ఇచ్చిన మూడు గంటల స్లాట్ అయిపోయింది. కబుర్లలో పడి, ఎవరికీ వెనక్కి వెళ్లాలని లేదు. ఇంకో గంటా గంటన్నరా పార్కింగ్ లాట్ లోనే వుండిపోయారట. దాంతో- ఇలా కాదు, కొంచెం ప్రణాళిక పెట్టుకుందాం అనే ఆలోచన వచ్చిందట. అదిగో అదీ తెలుగు అక్షర ప్రేమ- అలా వేళ్లూనికొని, ఇప్పుడు కొమ్మలూ రెమ్మలుగా విస్తరించింది.

అయితే, దీని వెనక “తెలుసా”  లాంటి ఈమెయిల్ గ్రూపుల పాత్ర పెద్ద పునాది అంటారు నారాయణ స్వామి, ఆరి సీతారామయ్య. ఇప్పుడంటే సోషల్ మీడియా కి హద్దులు లేవు గాని, అప్పట్లో కేవలం యూనివర్శిటీలలోనో, రీసెర్చ్ సెంటర్లలోనో పనిచేసే వాళ్ళకే ఈ- గ్రూపులకి అవకాశం వుండేదట.  ఈ నెట్వర్క్ ప్రారంభ వికాసాల్లో మొదటి దశలో పునాది వేసిన వారు అనేకమంది వున్నారు. ముందుతరానికి చెందిన పిల్లలమర్రి శివరామకృష్ణ లాంటి కొందరు ఈ కృషిలో ప్రాతః స్మరణీయులని అప్పటి మిత్రులు చెప్తున్నారు. ఇంకా కొందరు యూనివర్సిటీ పరిశోధకులు కూడా వున్నారు. అసలు సాహిత్యంతో ఆట్టే సంబంధంలేని వారు కూడా ఈ సమూహాల్లో విశేషమైన కృషి చేశారు. నెమ్మదిగా వారి సాహిత్య అభిరుచి క్లబ్ కార్యక్రమాల వల్ల బలపడింది. వారి పేర్లు కూడా ఇక్కడ తలచుకోవాల్సిందే. సులేఖా ఫార్మాట్, డైజెస్ట్ ఫార్మాట్ లాంటివి తెలుగు సాహిత్య సమూహాల్లో పాపులర్ అయ్యాయి. వాటి చరిత్రని కూడా ఇప్పుడు నమోదు చేయాల్సిన అవసరముంది.

తరవాతి దశలో క్లబ్ formal రూపం సంతరించుకుంది. ఈ దశలో నిర్దిష్టమైన విషయాలూ, పుస్తకాలూ క్లబ్ కి కేంద్రమయ్యాయి. ఈ దశలో మద్దిపాటి కృష్ణా రావు చేసిన కృషి క్లబ్ ని ఇప్పటిదాకా నిలబెట్టిందని మిత్రులు అంటారు. వేరే ప్రాంతాల్లో వున్నప్పటికీ క్లబ్బుతో మొదటి నించీ ఆత్మీయమైన బంధం ఏర్పర్చుకొని, సమావేశాలకు కొండంత బలాన్నిచ్చిన జంపాల కుటుంబమూ,  వేలూరి వెంకటేశ్వర రావు, పరుచూరి శ్రీనివాస్   ఇతర  మిత్రుల దోహదం ఇందుకో తోడ్పడింది. అలాగే, పుట్టింటి నుంచి చుట్టపు చూపుగా వచ్చిన చేకూరి రామారావు,  యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్,  మేడసాని మోహన్, దాసరి అమరేంద్ర,  పి. సత్యవతి, జేవీ రమణమూర్తి, వాసిరెడ్డి నవీన్, స. వే. రమేశ్, శ్రీరమణ, నవోదయ రామమోహన రావు,  జయప్రభ, ఎన్. వేణుగోపాల్, ఆర్. ఎం. ఉమామహేశ్వర రావులాంటి వివిధ తరాల  ప్రముఖులు  (నిజానికి ఈ జాబితా కూడా పెద్దదే!) క్లబ్బు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తానా, ఆటా సంస్థల వార్షికోత్సవాలకు వచ్చిన ప్రముఖులు తప్పకుండా ఈ క్లబ్ కార్యక్రమాల్లో ఇప్పటికీ పాల్గొంటున్నారు.  అదే విధంగా, గత పాతికేళ్లుగా క్లబ్ ఎంపిక చేసుకున్న రచనలూ, వాటి మీద క్షుణ్ణంగా- కొండొకచో కఠినంగా- చేసిన చర్చలు అటూ ఇటూ కొత్త సందడినే సృష్టించాయి.  వివిధ స్థానిక తెలుగు సంస్థలతో కలుపుకొని, ఇంకొంచెం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జోడించి, కృష్ణారావు ఈ క్లబ్ ని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు కనిపిస్తున్న క్లబ్ విశ్వరూపానికి బీజం అప్పుడు పడిందే! ఆ కృషిని ఈ తరందాకా తీసుకువచ్చిన కొనసాగింపు అప్పటి వాళ్ళ అక్షర ప్రేమకి సంకేతం.

 4

  క్లబ్ గురించి మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు   నైజీరియన్ కవయిత్రి రాసిన చిన్ని కవిత గుర్తొచ్చింది.

So, here you are
too foreign for home
too foreign for here.
Never enough for both.

– Ijeoma Umebinyuo

ఈ బాధ కేవలం వొక నైజీరియన్ ప్రవాసిదే కాదు.

ప్రవాసంలోకి వచ్చిన ప్రతివొక్కరూ బహుశా నిరంతరం ఎదుర్కొనేదే! పౌరసత్వాలు మారినా, పరాయీ చోటులో ఎంతగా లీనమైపోయినా పుట్టినింటికీ- మెట్టినింటికీ మధ్యలో వొక సన్నటి గీత తప్పకుండా వుంటుంది. ఆ గీత దాటే ప్రయత్నం ఎన్ని రూపాల్లో చేసినా, పుట్టినిల్లు చెరిగిపోదు. ఆ మాటల్లోని ఆత్మీయత కరిగిపోదు.

కానీ, ఆ గీతలో వ్యక్తమయ్యే దిగులు వుంటుందే- అదిగో అక్కడ పుడుతుంది ప్రవాసీ వేదన- డయాస్పోరా అనే ఉనికి బాధ. దీన్ని జయించడం అనేది లేకపోయినా, వొక పోరాటం ఎప్పుడూ వుంటుంది. ఆ పోరాటం వ్యక్తులు వొకమాదిరిగా, సమూహాలుగా ఇంకో మాదిరిగా చేస్తాయి. కానీ, వాటన్నీటి కిందా చాలా సారూప్యాలు వుంటాయి. ఆ సారూప్యాలని వొక చోట కలిపే ప్రయత్నం DTLC లాంటి క్లబ్బులు చేస్తాయి. ఆ ప్రయత్నానికి పాతికేళ్ళ పండగ అంటే అందుకే- అది ప్రవాస తెలుగు సమూహం పండగ! ఇందులో భాగమైన ప్రతివొక్కరికీ అభినందన!

*

ఎడిటర్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ప.గో. జిల్లాలో పుట్టిన నేను ఉద్యోగం కారణంగా 20 నెలలు హైదరాబాద్ లో ఉన్నాను. 1996 నుంచి రాజమండ్రిలో ఉంటున్నాను. అంతకు మించి నేను పుట్టిన ఊరికి 50 కిలోమీటర్లకు పైగా దూరంగా ఉన్నది లేనేలేదు. అయితే సాగరాలకావలకు వలస పోయిన ప్రవాసి బెంగను ఫీల్ నాదే అన్నట్టు అయ్యేలా చేసింది మీ రచన.

 • ప.గో. జిల్లాలో పుట్టిన నేను ఉద్యోగం కారణంగా 20 నెలలు హైదరాబాద్ లో ఉన్నాను. 1996 నుంచి రాజమండ్రిలో ఉంటున్నాను. అంతకు మించి నేను పుట్టిన ఊరికి 50 కిలోమీటర్లకు పైగా దూరంగా ఉన్నది లేనేలేదు. అయితే సాగరాలకావలకు వలస పోయిన ప్రవాసి బెంగను నాదే అన్నట్టు ఫీల్ అయ్యేలా చేసింది మీ రచన.

 • DTLC పాతికేళ్ల ప్రయాణాన్ని క్లుప్తంగా ముచ్చటగా ఒకచోట కూర్చినందుకు బోలెడు నెనర్లు. నా దృష్టిలో DTLC సాధించిన ముఖ్యమైన విజయాలు 3.
  ఇన్నేళ్ల పాటు క్రమం తప్పకుండా కలుస్తూ ఉండడం.
  తమకు సాధ్యమైన రీతిలో మరుగున పడిపోయిన కొన్ని తెలుగు పుస్తకాలను మళ్లీ ప్రచురించడం, దానితో బాటుగానే విమర్శకి పెద్ద పీట వేసి కొన్ని పుస్తకాలు ప్రచురించడం.
  ముచ్చట గా మూడోది, అమెరికాలోని అనేక నగరాలలో కేవలం తెలుగు సాహిత్యం కోసం గ్రూపులు సంస్థలు ఏర్పడ డానికి ఒక ప్రేరణగా నిలవడం.
  ఇటువంటి సంస్థ ఆవిర్భావం లో నేను కూడా ఒక చిన్న పాత్ర పోషించాను అనేది నాకు గర్వ కారణం.

 • I do not recall Nadendla Gangadhar in the early days of Internet. Much later, he supported DTLC very much. Pillalamarri was one of the Telusa founders.

  One interesting person we had in DTLC was Paula Richman from Oberlin college. When we were discussing Ramayana VishsvRuksham, she joined us physically. She wrote the book “Questioning Ramayanas: A South Asian Tradition”. She may have been the only non Indian at DTLC!

 • “వివిధ స్థానిక తెలుగు సంస్థలతో కలుపుకొని, ఇంకొంచెం

  సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జోడించి, కృష్ణారావు ఈ క్లబ్ ని

  ముందుకు తీసుకెళ్లారు.”

  డిటియల్సీ పుట్టుపూర్వోత్తరాల గురించీ, అది పాతికేళ్ళుగా

  నిలబడటానికి ఉన్న కారణాల గురించీ, నాకంటే బాగా తెలిసిన వ్యక్తి

  ఒక్కడే ఉన్నాడు – ఆయన మద్దిపాటి కృష్ణారావు. పాతిక

  సంవత్సరాలుగా, సొంత ఈగోని పెంచిపోషించుకోవడానికి

  కాకుండా, నలుగురినీ కలుపుకుంటూ పోతూ, ప్రజాస్వామికంగా

  డిటియల్సీని నడుపుతూ ఆయన అవిరామంగా చేసిన కృషి

  డిటియల్సీ ఇన్నాళ్ళు నిలబడటానికి కారణం. స్థానిక తెలుగు

  సంఘం, డిటియల్సీల మధ్య సహాయసహకారాలు ఉండటానికి

  కారణం కూడా కృష్ణారావుగారి వ్యక్తిత్వం, స్వభావమే.

  అదృష్ట వశాత్తూ, ప్రస్తుతం సంస్థను నడుపుతున్న మిత్రులు కూడా

  కృష్ణారావు గారి లాంటి వారే – నిస్వార్థంగా ప్రజాస్వామికంగా

  పనిచేసేవారే. డిటియల్సీ చాలా సంవత్సరాలు నిలబడుతుందని

  నాకున్న నమ్మకానికి కారణం వీరే.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు