పాతాళ భేరి

దర గాలి జోరుగా వీస్తోంది.

వనజక్క ఇంటి ముందరి తడిక మీద ఆరేసిన పమిట గాలికి ఎగురుకుంటూ వెళ్లి  చేద బావిలో పడింది. వంకాయ రంగు పమిట అందరూ చూస్తుండగానే నీళ్ళల్లో నాని నెమ్మది నెమ్మదిగా బావిలో మునిగిపోయింది.

“అయ్యో, అయ్యో… మా పాప కౌసల్య పమిట బంగారం లాంటిది, బావిలో పడిపోయిందే” అని అరుసుకుంటూ వచ్చింది వనజక్క.

అక్కడ నీళ్లు చేదుకుంటున్న వారితో “ఏవమ్మీ అందరూ దిష్టి బొమ్మల్లాగా చూడకపోతే బావిలో పడకుండా పట్టుకోకూడదా” అని నిష్టూరంగా అంది.

“ఏమి చేసేదక్కా, పట్టుకునేదానికి కుదరలేదు. ఈ చేదబావికి మెట్లు లేకపాయె, గబగబా దిగి ఎత్తుకొచ్చేదానికి.” అని బదులు చెప్పినారు.

కోపంగా ఉరిమి చూసింది వనజక్క.

“బావిలో పడింది ఎక్కడికి పోతుందిలే అక్కా, విదియ నాడు కాకపోతే తదియ నాడు దొరుకుతుందిలే. రేపు ఎప్పుడన్నా ఏలుమలై ని అడిగితే పాతాళ భేరి వేసి ఎత్తిస్తాడులే” అన్నారు.

అక్కడే ఉన్న ఒక పాప “పాతాళ భేరి”అంటే ఏమిటని వనజక్కను అడిగింది.

“బావిలో వస్తువులు కానీ గుడ్డలు కానీ పడిపోతే బావిలోకి దిగకుండా పైనుంచే చేంతాడుకు కట్టి ఎత్తుకోగలిగిన పనిముట్టును పాతాళ భేరి అంటారు” అని వివరించింది.

పమిట గుర్తుకొచ్చి వనజక్క బాధగా “అయ్యోరామా, మా కౌసల్య రోజూ మధ్యాహ్నం మూడు గంటలకు పుత్తూరుకు టైపింగు నేర్చుకొనేదానికి పోతుంది కదా. ఆ పిల్లకి వచ్చేవారమే తెలుగు టైపింగు లోయర్ పరీక్ష. పోయిన సంవత్సరమంతా కష్టపడి ఇంగ్లీషు లోయర్, హయ్యర్  పాసయ్యింది. తెలుగు లోయర్ హయ్యర్ కూడా నేర్చుకొనిందంటే గవర్నమెంటు ఉద్యోగానికి పోవచ్చంట కదా. ఒక్క రోజు టైపింగుకు పోలేకపోతే కూడా ఆ అమ్మి ఏడస్తా కూర్చొంటుంది. గుడ్డలన్నీ మాసి పోయి ఉంటే, అవసరానికి ఒకటి ఉతికి ఆరేసినాను. ఎట్ల చేసేదిరా భగవంతుడా” అనుకుంటూ ఊర్లోకి నడిచింది.

రాముల వారి గుడికాడి కెళ్ళి నిలబడింది.

కనకక్క కనబడింది.

“కనకక్కా కనకక్కా, మీ ఇంట్లో పాతాళ భేరి వుందా”అని అడిగింది.

“లేదు కదమ్మీ” అంటూ వెళ్లి పోతున్న కనకక్కను నిలబెట్టి “అన్న రోజూ సంకలో పేపరు పెట్టుకుని పుత్తూరు ఎందుకు పోతాడక్కా?” అని అడిగింది.

“ఊర్లో వడ్డీలకు తిప్పతా  వుండాడు కదా,ఎట్ల పోయి ఎట్ల వస్తుందో కాలం, కొంచెం డబ్బు బ్యాంకులో వేసి పెట్టమన్నానక్కా, అందుకని కొంచెం డబ్బు బ్యాంకులో డిపాజిట్టు చేసినాడు. ఉత్త అనుమానం మనిషి కదా, బ్యాంకు ఉంటుందో ఎత్తేస్తారోనని రోజూ తెల్లార్తో పోయి చూసుకుని వస్తాడు” అని చెప్పింది.

విషయం విని  ముక్కు మీద వేలు వేసుకున్న వనజక్కకు పమిట విషయం గుర్తుకొచ్చి ముందుకు నడిచింది.

గంగమ్మ గుడి కాడ పోయి నిలబడింది.

వేప చెట్టు కింద గుడ్డలు ఇస్త్రీ చేసే ఇంద్రాణి కనబడింది.

“ఏవమ్మీ ఇంద్రాణీ, మా పాప పమిట బావిలో పడింది. దానిని బావిలో నుంచి ఎత్తేదానికి పాతాళ భేరి కావాలి. మన ఊర్లో పాతాళ భేరి ఎవరి ఇంట్లో ఉంది” అని అడిగింది.

ఇంద్రాణి తూర్పు దిక్కు కాసేపు, పడమర దిక్కు కాసేపు చూసి చేతి వేళ్ళను  అటూఇటూ తిప్పి చివరికి పొట్ట అయ్యోరు ఇంట్లో  ఉందని చెప్పింది.

“అవునా” అని చెప్పి వెళ్తున్న వనజక్కను ఆపి “అవును వనజక్కా, మీ పక్కింటి కువైట్ ఆమె వారం రోజులుగా  ఇస్త్రీ చేయించుకునే  దానికి రావడం లేదు. అంతకు ముందు రోజూ వచ్చి గంజి పెట్టిన చీరలు ఇస్త్రీ చేయించుకుని పోయేది” అని అడిగింది.

“దాని  మొగుడు గంజి చీరలు గుచ్చుకుంటున్నాయని అన్నాడేమో నాకేమి తెలుసు”  అని చెప్పి వనజక్క  ముందుకు నడిచింది. ఇంద్రాణి ఎగిరెగిరి నవ్వింది.

పొట్ట అయ్యోరు  ఇంటి ముందర కెళ్ళి తొంగి చూసింది. బయట ఎవ్వరూ కనబడలేదు. మూలగా రాయితో  వక్కాకు దంచి నోట్లో పెట్టుకుంటున్న పొట్ట అయ్యోరు  పెళ్ళాన్ని  “మావ ఉండాడా అక్కా” అని అడిగింది.

“ఊర్లో ఇరవై మంది మావలుండారు. నీకు ఏ మావ కావాలి వనజా”  అని బదులిచ్చింది

“నీ నోట్లో తల దూర్చలేను తల్లీ” అని దండం పెట్టింది.

“మరి మావతో పనేమి నీకు? వచ్చిన విషయం చెప్పు” అని అడిగింది.

“పాతాళ భేరి ఉంటే ఇస్తావా” అని అడిగింది. వంటిట్లోని కొత్త కోడలు తొంగి చూసింది. అత్త చెప్పకుండా ఎత్తిస్తే అరుస్తుందని గమ్మున ఉండి  పోయింది.

“ఇచ్చేదానికి ఏమీ లేదు కానీ, తీసుకు పోయిన వస్తువు తీసుకుపోయినట్లు తేవాలి”

అందుకు వనజక్క “ నేను ఎప్పుడైనా విరగ్గొట్టి  తెచ్చి ఇచ్చినానా, మా  వస్తువులకంటే ఊర్లోవాళ్ళ వస్తువులే భద్రంగా చూసుకుంటాను. మీ పాతాళ భేరి మీకు పూలల్లో పెట్టి ఇస్తానులే”అని చెప్పింది.

“విరగగొట్టి తెచ్చిస్తే మాత్రం నేను ఒప్పుకోను” అంటూ కొత్త కోడలికి ఇవ్వమని  సైగ చేసింది.

“అయినా పాతాలభేరితో గుడ్డలు, సామాన్లు ఎత్తడం అంటే సామాన్యమా. పడాల్సిన చేయి పడితేనే అవి బావిలో నుంచి పైకి లేస్తాయి. అందరి వల్లా చేతకాదు. అందరి చేతులూ అచ్చిరావు. దానికి వాటం తెలిసి ఉండాలి.  ఊర్లో ఏలుమలై ఉంటే చూడు. అయినా వాడు ఎరువు మూట తేవాలని తెల్లార్తోనే సైకిల్ ఎత్తుకుని పుత్తూరుకు పోయినట్లు వుండాడే” అని చేతులు తిప్పుతూ చెప్పింది.

“ఏమి చేసేదబ్బా?ఎట్ల చేసేదబ్బా? ఊర్లో పాతాళ భేరి వాడగలిగే  మొగోళ్ళు ఎవ్వరూ కనబడలేదే” అని గొణుగుతూ బావి వైపు నడిచింది.

మంజులా టాకీసులో అక్కినేని దేవదాసు సినిమా 16 సార్లు చూసిన పాండురంగడు అప్పుడే ఊగతా ఊగతా వస్తా వున్నాడు. వనజక్క విషయం చెప్పి చేదబావికాడికి రమ్మంది.

“అక్కా, ఒక్క అయిదు నిముషాలు వుండక్కా. బీడీ కాల్చి వచ్చేస్తా” అంటూ బీడీ తీసుకుని తాటి తోపు కాడి కెళ్లినాడు. కయ్యి కాల్వలకాడికి పోయే వాళ్ళు బీడీ చుట్టలు కాల్చుకునే దానికి ఒక తాటి చెట్టుకు  తిర్రి కట్టి వున్నారు.పాత పొడుగు  గుడ్డను దారం మాదిరి చేసి కొసలో అంటించి వున్న తిర్రితో బీడీ కాల్చినాడు.  తనివి తీరా ఇరవై డమ్ములు లాగి   పరుగులు తీస్తా చేద బావి కాడికెళ్లినాడు.

చేద బావి చుట్టూ అమ్మలక్కలు చేరి వున్నారు. సినిమా  రిలీజు టికెట్లు దొరకతాయో దొరకవో అని ఆతృతగా ఎదురు చూసినట్లు చూస్తున్నారు. కొందరు  బిందెలు,బొక్కెనలు చేతిలో పెట్టుకుని  చేంతాళ్లు పట్టుకుని అవీ ఇవీ మాట్లాడుకుంటూ నీళ్లు చేదుతున్నారు. ఆడోళ్లను చూసిన పాండురంగడు జేబులోని దువ్వెనతో తల వెంట్రుకలు, మీసాలు ఒకటికి రెండుసార్లు దువ్వినాడు. బీడీ గబ్బు రాకుండా మిఠాయి ఒకటి చప్పరించినాడు.

ఊర్లో వాళ్లంతా బావి చుట్టూ చేరేసరికి ఊరి కుక్కలు నాలుగైదు వచ్చి చేరినాయి. వేడుకను చూడసాగాయి. ఇంతలో పక్క ఊరి పొటేళ్లు రెండు దారిన పోతూ ఉంటే అరిసినంత సేపు అరిసి తోక ఆడిస్తూ నిలబడ్డాయి.

పాండురంగడుని చూసిన ఆడోళ్ళు ‘రామారావు ఫైటింగు రామారావు చేస్తేనే బాగుంటుందక్కా. రామారావు ఫైటింగు రాజనాల చేస్తే ఏమి బాగుంటుంది’ అని గుసగుసలాడినారు. ‘అయినా ఈ అబ్బి పావలా యాక్షన్ చేయమంటే రూపాయి యాక్షన్ చేసే మనిషి కదా, వనజక్క కూతురి పమిట ఎక్కడ ఎత్తి ఇవ్వబోతాడు’ అని చెవులు కొరుక్కున్నారు.

పాండురంగడు వచ్చిందే “జరగండి జరగండి, అందరూ పక్కకి జరగండి. పిలకాయలు దూరంగా ఉండండి. గలాటా చేస్తే నేను బావిలో నుంచి ఒక్కటి కూడా  తియ్యను” అని ‘డామ్, డీమ్’  అని ఎగిరినాడు.

బావికి ఆగ్నేయం దిక్కు పోయి పాతాలభేరి వేసినాడు. అటూఇటూ తిప్పినాడు. ఏదో తగులుకుందని కుర్రోళ్ళు కేకలేసినారు. చిన్నగా చేంతాడు లాగినాడు.

పాత పంచె ఒకటి దొరికింది. మాది మాది అని చాలా మంది అరుద్దామనుకున్నారు కానీ పంచె నిండా వున్న బొక్కల్ని చూసి ఎవ్వరూ ముందుకు రాలేదు. దాన్ని తీసి బయటికి విసిరేసినాడు.

నైరుతి దిక్కుకి పోయినాడు. పాతాలభేరి బావిలో వేసి ఆడించి ఆడించి తిప్పినాడు. ముడ్డి కాడ బొక్కలున్న నాడా నిక్కరు ఒకటి  తగులుకొంది. అందరూ నిరాశగా  హుష్ అని గాలి వదిలినారు.

వాయువ్యం దిక్కు పోయినాడు. పాతాలభేరిని నీళ్ళల్లో రౌండ్లు రౌండ్లుగా తిప్పినాడు. ఏదో తగులుకుందని  చిన్నగా చేంతాడు పైకి లాగినాడు. ఆడోళ్ళ బాడీ ఒకటి కొక్కీకి తగులు కొని వుంది. తెల్లటి బాడీకి కొంచెం బురద, పచ్చటి నాచు అతుక్కుని వుంది. బాడీ మధ్యలో ఎర్ర గుండీ తళుక్కు తళుక్కుమని మెరుస్తోంది. కండ్లు ఆర్పకుండా చూసినారు  ముసలి మొగవాళ్ళు.  అది బావిలో నుంచి పైకి తీస్తుంటే కొందరు కుర్రోళ్ళు కుయ్ కుయ్ అని కేకలేద్దామనుకున్నారు. అక్కడే వున్న ఆడోళ్ళు ఈడ్చి ఈడ్చి కొడతారని చిన్నగా ముసిముసి నవ్వులు నవ్వినారు. మరి కొందరు కుర్రోళ్ళు కసికసిగా చూసినారు.  ఊర్లో ఈ సైజు బాడీ ఎవరికి ఉంటుందోనని ఆలోచనల్లో పడినారు. సిగ్గుమొగ్గలైన ఆడ పిలకాయలు కొందరు కళ్ళను అరి చేతులతో మూసి పెట్టుకున్నారు.

సిగ్గు కాబోలు- ఇది మాది అని ఆడోల్లు ఎవ్వరూ ముందుకు రాలేదు. ‘ఎవ్వరూ ఎత్తుకోకపోతే బాగుణ్ణు. చిన్నగా మనం ఎత్తుకుందాము‘ అని ఎదురు చూస్తున్నాడు రేగు చెట్టు కింద కూర్చుని వున్న టైర్డ్, రిటైర్డ్ మిలిటరీ మావ.

చివరిగా ఈశాన్యం  దిక్కు వెళ్లి “నా తడాఖా మీకు తెలియదు. మొన్న మన పక్క ఊరు బొజ్జనత్తం బావిలో  ఆరేడు సామాన్లు బయటికి తీసినా. లక్కీ హ్యాండ్ మనది. ఎవ్వరికీ దొరకనిది కూడా నాకు  దొరుకుతుంది. ఈ సారి చూడండి”అంటూ పాతాళ భేరి బావిలో విసిరి వేసినాడు. పాతాళ భేరి తో పాటు చేంతాడు కూడా జారి బావిలో పడిపోయింది. కుర్రోళ్ళు “గోవిందా, గోవింద అని అరిచినారు.

వనజక్క అక్కడే వున్న కానుగ చెట్టు కొమ్మ ఒకటి విరిచి-

“పోరా, పనికి మాలిన వాడా, చేత కానివాడు చేత కాదని చెప్పాలి. కూర్చుంటే కాంతారావు, లేస్తే ఎస్వీ రంగారావు అని ప్రగల్భాలు ఎందుకు? బంగారం లాంటి పాతాలభేరిని పొట్టన పెట్టుకున్నావు కదరా ” అని తరుముకుంది.

పంచె ఎగగొట్టుకుని పాండురంగడు పరుగో పరుగు.

ఇంతలో-

వెనుక సీట్లో ఎరువు మూట పెట్టుకుని సర్రున సైకిల్ లో రేసు గుర్రం మాదిరి వచ్చినాడు ఏలుమలై.  బావి కాడ జనాలను చూసినాడు. బ్రేకులేద్దామనుకున్నాడు కానీ కయ్యి కాడ కూలోళ్లు కాసుకొని ఉంటారని నిలపలేదు.

చీమిడి ముక్కుల చిన్న పిల్లవాడు ఒకడు “అన్నా, ఏలుమలై అన్నా, కౌసల్యక్క పమిట బావిలో పడింది. ఎత్తివ్వరాదా”అని గట్టిగా అరిచాడు. సడెన్ గా సైకిల్ బ్రేకు పడింది. స్టాండువేసి సరసరా వచ్చినాడు. ముందూ వెనుకా చూడలేదు. మంచీ చెడ్డ ఆలోచించలేదు.

బావి గట్టున వున్న జిల్లేడు చెట్టును స్టయిల్ గా తట్టి

జిల్లేడు  పువ్వా

              జిల్లేడు పువ్వా

              నీకు జరిగింది తెలుసా జిల్లేడు పువ్వా

              నీకు జరిగేది తెలుసా జిల్లేడు పువ్వా …” అంటూ బావి లోకి దూకినాడు.

ఏలుమలై తన పమిట కోసం బావిలోకి దూకినాడని తెలిసి వనజక్క కూతురు కౌసల్య పరిగెత్తుకుంటూ వచ్చి బావి గట్టున నిలబడింది.

మొదటిసారి మునిగినాడు. చిన్న కంచు బిందె ఒకటి పైకి తెచ్చినాడు. పిలకాయలు చప్పట్లు కొట్టినారు.

రెండవసారి మునిగినాడు.  పాతాలభేరి పైకి తెచ్చినాడు. ఊళలు ఈలలు విని తల ఎత్తి పైకి చూసినాడు. తన ప్రియురాలు కౌసల్య కనిపించింది. తట్టుకోలేని ఆనందంతో చేతితో నీళ్లను ఫటీ, ఫటీ మని కొట్టినాడు. జాగ్రత్త సుమా అన్నట్లుగా వున్నాయి  కౌసల్య చూపులు. నీ కోసం బావి లోనే కాదు, నదిలో అయినా దుముకుతా అన్నట్లుగా చూపు విసిరి డుబుక్కున నీళ్ళలోకి మునిగినాడు. బావి మొత్తం ఒకటికి రెండుసార్లు గాలించినాడు.

టిక్ టిక్ టిక్ …

నిమిషం దాకా బయటికి రాలేదు ఏలుమలై.

అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. కౌసల్య గట్టిగా కండ్లు మూసుకుంది. డబుక్కున శబ్దం వస్తే కండ్లు తెరిచింది.

నీళ్ళల్లో ఎడమచేతిలో బిందె,పాతాలభేరి పట్టుకుని కుడి చేత్తో కౌసల్య పమిట ను గాలిలోకి విసురుతున్నాడు.

అందరి ముఖాలు మతాబుల్లా మెరిసాయి. వెండి వెన్నెల  ముఖంతో వనజక్క నవ్వుతూ  చప్పట్లు కొడుతూ వుంది. వీస్తున్న గాలికి బావి గట్టు మీది   జిల్లేడు పూలు బావిలోకి తొంగి చూశాయి. అందరూ చేరి చేంతాడు బావిలోకి వదిలారు.

చేంతాడు పట్టుకుని పైకి వస్తున్నాడు. అందరికీ  ఏలుమలై కనిపిస్తున్నాడు. కౌసల్యకు మాత్రం పాతాళభైరవి సినిమాలో  ఎన్టీయార్ కనిపిస్తున్నాడు.

*

 

ఆర్. సి. కృష్ణ స్వామి రాజు

పుట్టి పెరిగింది చిత్తూరు జిల్లా పుత్తూరు శల్య వైద్య కేంద్రమైన రాసపల్లి. పొట్ట కూటి కోసం తిరుపతిలో నివాసం. ముప్ఫై ఏళ్ల ముందు మూడేళ్ళ పాటు ఈనాడులో విలేఖరి ఉద్యోగం. గత ముప్ఫై ఏళ్లుగా ఎల్ ఐ సి లో డెవలప్ మెంట్ ఆఫీసర్ కొలువు. మూడు వందల పై చిలుకు చిన్నా పెద్దా కథలు ప్రముఖ పత్రికలలో తొంగి చూశాయి.
ఇప్పటి దాకా వెలుగులోకి వచ్చిన పుస్తకాలు ముగ్గురాళ్ళ మిట్ట, సల్లో సల్ల కథా సంపుటిలు. చిత్తూరు జిల్లా మాండలికంలో రాసిన ముగ్గురాళ్ళ మిట్టకు మక్కెన రామసుబ్బయ్య పురస్కారం, సల్లో సల్లకు శివేగారి దేవమ్మ పురస్కారం లభించాయి.ఇవి కాక ప్రస్తుతానికి రాజు గారి కథలు[ముప్పై బాలల బొమ్మల కథలు], పకోడి పొట్లం[అరవై కార్డు కథలు] పుస్తకాలుగా వచ్చి ఉన్నాయి.

24 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సూపర్ ఉంది sir… మంచి కథ చదివిన తృప్తి కలిగింది 👌👌👌

  • భలే వుందండి కథ. పాతాళ భేరి… దీని పేరు విని చాలా యేళ్ళైంది 🙂

    • యాభై ఏళ్ల క్రితం పల్లెలలో పాతాళ భేరి పాత్ర చాలా విశిష్టమైనది

  • మీరు ఈ కథతో మమ్మల్ని ఈశలాపురానికి తీసుకెళ్లారు. యాస, కథనంతో మీరు పుత్తూరు జ్ఞాపకాలను తెచ్చారు.

    • నాతో పాటు మీరు కూడా ఈశలాపురం రావడం సంతోషకరం

      • పాతాళభేరి గురించి ఈ కథ వల్ల తెలిసింది.పల్లె వాతావరణం వివరణ అద్భుతం.జయహో
        రాజు గారు.

  • పాతాళ భేరి అంటే ఏమిటో రాబోయే తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కథల ద్వారా అలాంటి ప్రయోజనం రాబోయే తరాలకు కలుగుతుంది.
    కథ విషయానికి వస్తే రాజు గారు ఎప్పటిలాగే పల్లె వాతావరణాన్ని, పల్లె మనుషులను, వారి జీవన విధానాన్ని చక్కగా ఆవిష్కరించారు.
    అభినందనలు 🌺🌺

  • చక్కని కథ రాజుగారూ..

  • చాలా బాగుంది సార్ “పాతాళ భేరి” కథ….
    మీ శైలి ఎప్పుడూ సింపుల్ గా, సూపర్ గా ఉండి, చదివింపజేస్తుంది…

    – వాడపర్తి వెంకటరమణ
    శ్రీకాకుళం జిల్లా.

  • కథ చాలా బాగుంది సర్. తెలంగాణ లో “పాతాళ భేరి” ని ” పాతాళ గరిగె” అంటారు.

    • మీ సమాధానం వల్ల కొత్త పదం తెలుసుకున్నాను. ధన్యవాదములు.

  • అబ్బా…ఏమి కథ రాసినారు సర్…అద్భుతమైన నడక..కథనం…మన వూళ్ళో మాట్లాడుకునే మాట తీరు..సహజమైన నవ్వుతనాన్ని కడుపునిండా నవ్వుకునే రీతిలో చెబుతూనే..మావూరిని కళ్ళముందు నిలిపినారు. పాతాళ భేరి తో నాకున్న బాల్యపు జీవితమంతా కళ్ళముందు కదలాడింది..కతరాసిన మీకూ…ఇంత మంచి కతను అచ్చేసిన సారంగ సంపాదక వర్గానికి హృదయ పూర్వక ధన్యవాదాలు.. నేను ఎక్కడో ఒక కవితలో పాతాలబెరి మాట వాడిన గుర్తు..కానీ ఆ నేపథ్యంగా మీరు కథను నడిపిన తీరు..ఎక్సలెన్ట్…శుభాకాంక్షలు సర్..

    • మీ ప్రశంస నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
      మీకు ప్రత్యేక ధన్యవాదాలు

  • Very enjoyable story andi. Bhale raasaru! maa chinnappudu enno vastuvulu baavilonchi teesina sandarbhaalu unnayi. Memu padesinave! o madhyahnam antha deenithone gadichedi. The discovery part of the objects that come out is always super fascinating and fun-filled. 🙂 Thank you for a lovely story. -Kiranmayi

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు