పసితనపు కారాగారితో…

గొప్పవాళ్ల లక్షణాలలో ముఖ్యమైనది – పసితనాన్ని జీవితాంతం వసి వాడనివ్వకుండా అలవోకగా కాపాడుకోగలగడం…

1973లో అనుకొంటాను – “యజ్ఞం” పేరు మొదటిసారిగా విన్నాను. ఆటలు, పాటలు, సాహిత్యం, ఓ సాహితీ వేదిక. అందులో చురుగ్గా పాల్గొనడం. చిరంజీవినీకుమారిగారు, అద్దేపల్లి రామమోహనరావుగారులాంటి వాళ్ల సారథ్యం – సాహచర్యం… అదుగో అప్పుడు విన్నాను ‘యజ్ఞం’ గురించి…

అప్పటికే అటు రంగనాయకమ్మ, ఇటు సులోచనారాణి, మధ్యలో ద్వివేదుల విశాలాక్షి, అటు రావిశాస్త్రి, ఇటు మల్లాది వెంకటకృష్ణమూర్తి, మధ్యలో కొమ్మూరి వేణుగోపాలరావు… కానీ మరి ఎంచేతో కాళీపట్నం గురించి పెద్దగా తెలియదు. మా వేదికలో ఆ కథ ప్రస్తావన వచ్చేసరికి దాన్ని వెంటనే వెదికి సంపాదించి చదివాను. నలభై యేళ్లయిపోయినా అప్పల్రాముడు, శ్రీరాములునాయుడు, లక్షుంనాయుడు, సుందరపాలెం, సమిధలవుతోన్న సామాన్యులు మనసులోంచి తొలగలేదు. తెలుగు సాహిత్యం సంగతి ఎలా ఉన్నా – నా వరకూ నాకు దిశానిర్దేశం చేసే దీపస్తంభంగా మారిందా కథ…

ఇరవై యేళ్ల తర్వాత 93లో ఆయన్ను ప్రత్యక్షంగా కలిశాను. ఆంధ్రజ్యోతివాళ్లు పెట్టిన ఓ రెండ్రోజుల వర్క్‌షాపుకు వెళ్లాం. ముగింపు సమయంలో వచ్చారు. యండమూరి నేతృత్వంలో మేమంతా శిల్పమూ శైలీల మధ్య తేడా గురించి మల్లగుల్లాలు పడుతోంటే కారాగారు వచ్చి – ‘నాకూ అంతగా తెలియదు’ అంటూనే – అరటిపండు వలిచి చేతిలో పెట్టేరు. ఆ కొండంత కథకునిలోని పసితనపు వినమ్రత ఛాయలు చూసి సంబరపడ్డాను.

97 అక్టోబరులో ఢిల్లీలో కథాసాహితి వాళ్ల కథ-96 ఆవిష్కరణ పెట్టుకొన్నాం. పదీ పదిహేనుమంది తెలుగు కథకులతో ఓ రోజంతా కథాగోష్ఠి నిర్వహించుకొన్నాం. కళింగ కథ గురించి మాట్లాడారు కారా గారు. ఆ సందర్భంగా ఆయనతో సన్నిహితంగా గడపడం, గంటల తరబడి సాహిత్యం గురించి మాకున్న భావాలనూ, సందేహాలనూ పంచుకోవడం – మూర్తీభవించిన సహనంతో ఆయన మా అరకొర ప్రశ్నలకు స్పందించడం – అన్నింటికన్నా ముఖ్యం స్నేహంలో పడటం…   ఒక ఆత్మీయ అనురాగం. ముప్పైయేళ్ల వయసు అంతరాన్ని దాటగల కారాగారు మానసికంగా నా సమవయస్కులే అనిపించింది. ఆ తర్వాత నాకన్నా పసివాడు అని అర్థమయింది.

ఈ నేపథ్యంలో 2014 ఫిబ్రవరిలో కారాగారిలోని పసిబాలుడిని చూసాను.

కథానిలయం వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాకుళం వెళ్లాను. వివినమూర్తిగారి ఇంట్లో మకాం. పైన వాళ్లబ్బాయి ప్రసాద్‌గారింట్లో కారాగారు. మీటింగుల సంగతి ఎలా ఉన్నా ఉదయమూ, మధ్యాన్నమూ, సాయంత్రమూ మేమంతా ఆయనచుట్టూ చేరి ముచ్చట్లు… వివిన, రామలక్ష్మి, కవన, విజయలక్ష్మి, రజనీకాంత్, తుమ్మేటి, రాయుడు, మరో నలుగురయిదుగురు… గోష్ఠి, కథా గోష్ఠి, సాహితీ గోష్ఠి…

* * *

రెండోరోజు ఉదయం వివినమూర్తి చెప్పారు: “మాష్టారు మిమ్మల్ని, కవనశర్మగారినీ, రజనీకాంత్‌గారినీ తీసుకువెళ్లి వాళ్ల చిన్నప్పటి ఊరు ‘మురపాక’ చూపిద్దామనుకుంటున్నారు” అని. కుతూహలం కలిగింది. సరదా వేసింది. అయినా ‘ఆయన ఈ వయసులో అంత శ్రమ ఎందుకు తీసుకొంటున్నారూ’ అనీ అనిపించింది.

ఉదయం పదిన్నరకు బయలుదేరాం. ఫిబ్రవరి మొదటివారమే అయినా ఎండ కొంచెం శృతి మించే ఉంది. మేవు ముగ్గురం ఏదో సాహితీ చర్చకు దిగితే కారాగారు మృదువుగా హెచ్చరించారు. ‘మిమ్మల్ని తీసుకువెళ్లడంలో నాకో ఉద్దేశ్యం ఉంది. అంచేత మీరు దృష్టిని ఈ రెండు మూడు గంటలూ నా మాటలమీదే నిలపండి’.

పదీపదిహేను నిమిషాల్లో కారు శ్రీకాకుళం వదిలిపెట్టి జీటీరోడ్డు ఎక్కింది. ఎడమకు తిరిగి ఓ పదీ పదిహేను కిలోమీటర్లు… “అదిగో ఆ పక్కన కనబడుతోందే, అదే షేక్ మొహమ్మద్‌పురం. ఓ సమయంలో అక్కడ జమీందారీ ఫాయీ ముస్లిం కుటుంబం ఉండేది. ఇప్పటికీ వెతికితే ఆ ఆనవాళ్లు కనిపిస్తాయి. తరం మారేసరికి వారసులు తగాదా పడ్డారు. కోర్టులకెళ్లారు. పట్టుదలలు పెరిగాయి. వివాదం కోర్టు మెట్లెక్కి మద్రాసుదాకా వెళ్లింది. ఎవరు గెలిచారూ అన్నది మరుగునపడి వారసులందరూ నష్టపోయారు. ఆస్తి అంతా అటు లాయర్లకీ ఇటు వడ్డీ వ్యాపారులకీ వెళ్లిపోయింది… చెప్పుకొచ్చారు కారా.

అలా నైరుతి దిశలో ఓ అరగంట దాటాక కారు జీటీరోడ్డు వదిలి అల్లినగరం మీదుగా వెళ్లే మురపాక రోడ్డు పట్టుకొంది.  నాగరిక వాతావరణం మారి గ్రామీణ దృశ్యాలు విచ్చుకొన్నాయి. తాటితోపులు, మధ్యమధ్య కొబ్బరి చెట్లు, నీళ్లు ఉండలేని మెరక చెరువులు, ఇంకా దారి పొడవున ఏవేవో చెట్లు – పచ్చదనం. కారాగారు అతి సహజంగా తన చిన్ననాటి ముచ్చట్లలో పడ్డారు. “ఆ రోజుల్లో చుట్టుపక్క నాలుగయిదు గ్రామాలకు ఒకే పోస్టు మనిషి. ఉత్తరాలు ఉంటే తప్ప ఊళ్లోకి వచ్చేవాడుగాదు. పత్రికలు ఏ రోజున వస్తాయో తెలుసుగదా –  ఆ పూట అతని కోసం ఆగకుండా నేనే జీటీ రోడ్డుదాకా వెళ్లి పత్రికలు అందిపుచ్చుకొని ఇంటికి వెళ్లేదాకా ఆగలేక అదిగో – ఆ చెరువు పక్కన పెద్ద రాతిబండ ఉందిగదా… దానిమీద కూర్చొని చదువుకొనే వాడిని…”

అందరం ఊళ్లోకి అడుగుపెట్టాం. మరీ చిన్న వూరేంగాదు… “ఈ ప్రాంతాల్లో ఇదే పెద్ద గ్రామం. కరెంటు, పోస్టాఫీసు, హైస్కూలు, లైబ్రరీ, గుడి – అన్నీ ఈ ఊరికే ముందు వచ్చాయి. రోడ్డు పడి కూడా చాలా కాలమయింది. అటు సముద్రం వేపు మెరక భూములు – ఇటు జీటీరోడ్డు వేపు పల్లపు పొలాలు. కాస్తో కూస్తో ఆధరువు ఉన్న ఊరే,” చెప్పారాయన.

మురపాకలో ప్రవేశించాక కారాగారి దగ్గరి బంధువు – తర్వాతి తరం మనిషి, కృష్ణగారనుకొంటాను – వచ్చి కలిశారు. ఊరు వదిలేదాకా మాకు తోడుగా ఉన్నారు. “ఊరి నడిబొడ్డున దేవాలయం ఉంది. అంతా కలిసి అయిదారొందల ఇళ్లు ఉంటాయేమో. ఇప్పుడింకా పెరిగి ఉండొచ్చు. మా చిన్నతనంలో పెంకుటిళ్లూ తక్కువగానే ఉండేవి. ఇప్పుడు డాబా ఇళ్లూ, మేడలూ కూడా వచ్చాయి,” చెప్పుకొచ్చారు కారాగారు.

“ముందు మా చిన్ననాటి స్నేహితుని తమ్ముడిని చూసి వెళదాం.  మాకన్న మూడు నాలుగేళ్లు చిన్నతను. ఈ మధ్యే దగ్గరివాళ్లు పోవడంతో దిగాలుపడి ఉన్నాడు. పలకరించి వద్దాం,” దారిదీశారాయన. కారును రోడ్డుమీద వదిలి చిన్నపాటి సందులో వంద అడుగుల నడక. మెల్లగానే అయినా  స్థిరంగా అడుగులు వేస్తూ ఆ తొంభై యేళ్ల బాలుడు…

ఆయన్ని – తిరుపతయ్యగారనుకొంటాను – కలిశాం. ఓ మండువా ఇల్లు. వందేళ్ల వయసుగలది. వాళ్లిదరూ ఆత్మీయంగా పలకరింపులు. ఆయన కన్నీళ్లు. ఈయన ఓదార్పు… ఆయన అరవై యేళ్ల కూతురు. స్నేహ వాతావరణం. “మాకు ఫోటోలు తియ్యి” అడిగారు కారా! సామాన్యంగా ఆయన ఫోటోలంటే ఆసక్తి చూపించరు. కానీ ఆ రోజు మినహాయింపు. “ఈ మండువా లోగిలి మా చిన్ననాటి ఆటవిడుపు స్థలం. వీళ్ల అన్నయ్యా నేనూ చాలా స్నేహంగా ఉండేవాళ్లం. గంటల తరబడి కలిసి గడిపేవాళ్లం. చదువుకొనేవాళ్లం. ఆడుకొనేవాళ్లం…” వివరించారు కారా. ఎనభై యేళ్లనాటి సంగతులవి!

* * *

“నేను యజ్ఞంలో వివరించిన కథాస్థలమిది. పంచాయితీ జరిగిన మండపం ఇది. జనం కూడిన ఖాళీస్థలం అది – ఇంకా ఖాళీ స్థలంగానే ఉంది.” ఊహించని వివరం అందించారు కారాగారు. ఒళ్లు జలదరించింది.

మండపంలో కూర్చున్న శ్రీరాములు నాయుడు, కుడి ఎడమల లక్షుంనాయుడు, సూర్యంగారు, కొందరటూ కొందరిటుగా పంచాయితీ సభ్యులూ, మునసబు కరణాలు, మండపం మెట్ల దిగువున అప్పల్రాముడు, అతనికి దగ్గర్లో బంధుబలగం, వాళ్లందరికీ వెనగ్గా సీతారావుడు, వాళ్లింటి ఆడంగులు, మండపంలో గోపన్నా; మండపం మెట్లమీదా నీడలోనూ, ముందూ, అరుగుల మీదా, చూరు పంచల నీడల్లోనూ కూర్చున్న మిగతా ఊరి జనం – ఒక్కసారిగా కాలం ఏభై యేళ్లు వెనక్కి నడిచి వాళ్లంతా సజీవంగా కళ్లముందు నిలచినట్లు అనిపించింది; గగుర్పాటు!

“యజ్ఞం కథకు ఈ ఊరి పరిణామాలే నాకు ప్రేరణ. ఈ ఊరే దానికి భూమిక. ఊరి మొగల్లో ఓ రెండంతస్తుల మేడ చూపించాను గదా – అలాంటిదే శ్రీరాములు నాయుడుగారి నివాసం. ఆయన ఊహాపాత్రగాదు. అసలు ఏవీ  ఊహాజనితాలుగాదు. అన్నీ నాకు తెలిసిన వివరాలే”.

ఏమననూ? ఏమనుకోనూ? అది సంతోషమా? ఓ చారిత్రక స్థలాన్ని కళ్లారా చూసిన సంతృప్తా? కాదు. కానేకాదు. యజ్ఞం నేపథ్యం సంతోషాలకూ, సంతృప్తులకూ వేదిక కాలేదు. అలా అని విషాదమా? చెప్పలేం. వివరించలేం. వర్ణించడం అసలే సాధ్యంగాదు.

* * *

ఒడియా సంప్రదాయపు గుడి అది. సుభద్ర బలరామకృష్ణులు పొందిగ్గా ఉన్న గుడి. మండపంలో ఓ ఇరవై నిముషాలు. ఎదురుగా కుడిచేతి వేపున పెద్ద బావి. అరటిచెట్లు, పచ్చదనం. ఆపైన ఎప్పటిదో ఓ నందివర్ధనం. “ఆయన ఆ చెట్టు ఎక్కి ఆడుకొనేవారట” గుడిపక్కనే ఉన్న ఇంట్లోంచి వచ్చి మాకు ఆహ్వానం పలికిన ఓ దూరపు చుట్టపు పెద్దామె వివరణ.

* * *

చివరి మజిలీ కారాగారు తన బాల్యం గడిపిన ఇంటికి. వాళ్ల నాన్నగారు ఆ ఊరి కరణం.

మధ్యస్థపుటిల్లు. ముందు విశాలమైన లోగిలి. లోపలికంతా విస్తరించిన గదులు – ఆనాటి పెంకుటిల్లు కొంచెం శిథిలమయినా ఇంకా నిలిచే ఉంది.

“ఈ ద్వారబంధానికున్న కనిపించని గూడు గమనించారా? దాంట్లోనే నేను బలపలు దాచుకొనేవాడిని. అదిగో ఆ గోడకున్న దట్టమైన మేకు చూసారా? మా నాన్న దానికే చొక్కా తగిలించుకునేవారు. మా చిన్నప్పుడు ఈ గదులు ఎంతో విశాలం అనిపించేవి. ఇపుడు ఇరుకనిపిస్తున్నాయి,” చెపుతోంది తొమ్మిదేళ్ల రాముడుగదూ?!

ఇంటి వెనక్కి నడిచాం. విశాలమైన స్థలం, ఆ పైన ఓ పాక. “ఈ స్థలంలో నూటయేభై యేళ్లుగా బావి ఉండేది. ఈ మధ్యనే కూలిపోయింది. లాభంలేదని పూర్తిగా పూడ్చేశారు. అటుపక్క చూడండి ఓ సన్నపాటి సందు ఉంది గదా – అది నా ఆంతరంగిక రహస్య స్థావరం. నా చదువు, హోంవర్కు, రాయడం, బొమ్మలు వేయడం అన్నీ అక్కడే ఏకాగ్రతతో చేసేవాడిని. ఎవరూ నన్ను కదిలించేవాళ్లుగాదు. నాతో నేనే ఊసులాడుకొనేవాడిని…” మెరుస్తోన్న కళ్లతో రాముడు.

“అప్పటికీ ఇప్పటికీ బడుగు జీవితాల్లో మార్పు వచ్చిందా?” అడిగాను. “వచ్చిందనే అనుకోవాలి. ఒకప్పుడు నేను కనబడితే ఏమన్నా ఇమ్మని అడిగేవారు. ఇపుడు అడగడం మానేశారు. చూడ్డానికి సాధారణ విషయంగా కనిపించినా ఇది చెప్పుకోదగ్గ పరిణామమే…”

* * *

రెండేళ్ల క్రితం ఢిల్లీ కమానీ ఆడిటోరియమ్‌లో భారతీయ విద్యా భవన్ వాళ్లనుకొంటాను – ఓ ఆటాపాటా జుగల్‌బందీ ఏర్పాటు చేశారు.

ఆడింది కథక్ మాస్టర్ బిర్జూ మహరాజ్.

పాడింది మన మంగళంపల్లి బాలమురళి.

చెప్పేదేముందీ – అదో అద్వితీయ ప్రదర్శన.

ఇద్దరూ ఇద్దరే – లివింగ్ లెజెండ్స్!

కార్యక్రమం చివర్లో నిర్వాహకులు ఇద్దరినీ వేదిక మీదకు పిలిచి చిరు సన్మానాలు చేశారు.

అప్పుడు చూడాలి వాళ్లిద్దరి పసిహృదయ విన్యాసాలు.

ఒకరికొకరు బాగా తెలుసుగదా – ఆత్మీయ ఆలింగనాలు, ఛలోక్తులు, చతురోక్తులు, ఆటపట్టించుకోవడాలు, ముసిముసి నవ్వులు – అచ్చం పసిపిల్లల్లా వాళ్ల స్నేహాన్ని ప్రదర్శించారు… ప్రదర్శనగాదు, వ్యక్తీకరణ… అబ్బురం కలిగింది. అదుగో, అదే అబ్బురం ఆ ఫిబ్రవరి ఉదయాన మురపాక గ్రామంలో కలిగింది.

గొప్పవాళ్ల లక్షణాలలో ఒక ముఖ్యమైనది – తమ పసితనాన్ని జీవితాంతం వసి వాడనివ్వకుండా అలవోకగా కాపాడుకోగలగడం…

*

వీడియో: శ్రీనివాస్ బందా 

దాసరి అమరేంద్ర

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • Well narrated …👍 , Keep on posting . If possible, pl send links to my email id please.

  • అద్భుతంగా వ్రాశావయ్యా, అమరేంద్రా…కళ్ళకి కట్టినట్టు..కారా గారే కనపడి మాకు చెప్తున్నట్టు….

  • మాస్టారి బాల్యం గురించి మాస్టారు మాటల్లోనే చాలా విషయాలు చెప్పారు కృతజ్ఞతలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు