పల్లె పక్షాన ఉరిమిన గండ్ర గొడ్డలి మద్దూరి…

ద్దూరి నగేష్ బాబు ఆధునిక దళిత కవిత్వం మురిసిపడే  బిడ్డ. రాయాల్సింది రాయడం ఎలానో తెలిసిన కవి. దళిత కవులు ఎట్లా ఆలోచించాలో నేర్పిన కవి. ఉబుసుపోకకు  రాసిన అక్షరాలు అతని కవితల్లో ఉండే అవకాశమే లేదు. పాచిపట్టిన బురద అంటిన మట్టి కాళ్ళని కవిత్వంలోకి నడిపించడానికి ఏమాత్రం వెనుకాడని వాడు. వెనకబడ్డ జనాన్ని, ముందుకు నెట్టడానికి తన వంతు ప్రయత్నంగా సాహిత్యానికి సంబంధించిన ప్రతి అంశం లోనూ వెనుదీయని కృషి చేస్తూనే, దానినో ఉద్యమంగా మలచడానికి ఆధార భూతమైనవాడు.

నల్లగా నిగనిగ లాడుతూ చురుకైన కళ్ళతో పల్లె పక్షాన ఉండే పదునైన భాషతో కూలి తల్లి ఆకటి కళ్ళ స్వప్నానికి పుట్టిన శిశువుగా మద్దూరి నగేష్ బాబు నడిచి వచ్చిన దారిని ఏమాత్రం విస్మరించకుండా అక్షరాలు విరజల్లు కుంటూ వెళ్లినవాడు. కులంతో మతంతో కుళ్ళిన ఈ సమాజం మీద తుపుక్కున ఊయడంతో సరిపెట్టుకోకుండా, దానికి శస్త్ర చికిత్స చేయడానికి రాజ్యాంగం ఇరుసుగా, అంబేద్కర్ తాత్వికత తోడుగా కడదాకా కవిత్వంతో నడిచిన వాడు.

చదవడం మొదలెడితే తన అక్షరాల లోకి లాక్కువెళ్లే అందమైన శక్తివంతమైన కవి. తాను రాస్తూ తనతో ఉండే వాళ్ళని రాసేలా ప్రోత్సహిస్తూ, రాసిన దానిని ప్రింట్ చేయిస్తూ, ఎప్పుడూ చుట్టూ పదిమందిని పోగేసుకుని పిల్లల కోడిలా తిరుగుతూ ఉండేవాడు.

చుట్టూ ఉన్న సమాజంలో ముసిరిన కుల వివక్ష, ఫ్యూడల్ కుల ఆధిపత్యం, బలిసిన పితృస్వామ్యం, వెలివేత, అంటరానితనం, ఆకలి, సాంస్కృతిక ఆధిపత్యం, ఇలా ఒకటేమిటి, వీటన్నింటి మీద నిరసనతో కవిత్వ కత్తి దూసినవాడు.

అసలైన కవిత్వ రహస్యం తెలిసినవాడు మద్దూరి. నంగిరి పింగిరి మాటలు లేనివాడు. మర్యాదస్తుల కోటరీలో స్థానం దక్కని వాడు. చింపిరి జుట్టు గాళ్ళ చిరిగిన కుక్కల తల్లుల మాసిన బతుకుల తమ్ముళ్ల నెత్తుటి గాయాలతో రోడ్డు మీద పడి నిస్సహాయంగా పరిగెత్తుతున్న దళిత చెల్లెళ్ల అవమానాల రసి కారుతున్న పల్లెల చీకటి లోయల కథలలో మద్దూరి తనను తాను వెతుక్కున్న వాడు. వెంటాడే అవమానాన్ని వేటాడిన వాడు.ఈ అన్నింటికీ కారణమైన మనువు అసలు రహస్యాన్ని బట్టబయలు చేసి వాడి చాందస పిలక ని కుతుక తో సహా కోయాలని చూసినవాడు. పల్లె పక్షాన ఉరిమిన గండ్ర గొడ్డలి మద్దూరి.

తాను జీవించిన కాలంలో అంబేద్కర్ మీద ఒక్క ఈగ నైనా వాల నివ్వని ధీశాలి. ఇప్పటిలాగా తూకం వేసి రాసే కెరీరిస్టు అక్షరాలకు భిన్నంగా తనను తాను మలుచుకున్న వాడు. 95 ప్రాంతంలో అనుకుంటా. నరసరావుపేటలో ‘అభ్యుదయ రచయితల సంఘం’ సభ ఒకటి జరుగుతోంది.

మధ్యాహ్నం భోజన సమయంలో, స్థానికంగా ఉండే కొంతమంది థర్డ్ జెండర్ వాళ్లు ఆకలితో భోజనానికి వచ్చారు. క్యూలో నిలబడి ప్లేట్లు తీసుకున్నారు. ఆ సమయంలో, అక్కడి నిర్వాహకులు వాళ్ల చేతుల్లో ప్లేట్లు లాగేసుకున్నారు. ఆ సంఘటన మీద, మద్దూరి’ ఎగిరే పళ్లేలు ‘ కవిత రాశాడు.  ఆ సమయంలో ‘అరసం’ లో ఉన్న నేను, అప్పటివరకు బతుకుతున్న బతుకులోని అబద్దాన్ని తెలుసుకుని దళిత కవిత్వం వైపు నడవడం ఆరంభించాను. అదిగో అట్లా, మద్దూరి ని తెలుసుకోవడం కలుసుకోవడం మొదలయ్యింది.

మద్దూరి కలేకూరి పైడి తెరేష్ బాబు, ముగ్గురూ జట్టుగా కలిసి హైదరాబాద్ యూనివర్సిటీ కి వచ్చేవాళ్లు. అక్కడ జరిగే సాహిత్య సభల్లో కలిసే వాళ్ళు. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతృత్వంలో నిర్వహించే సాహిత్య సభల్లో వాళ్లు పాల్గొనడం జాతర జాతరగా ఉండేది. నిజానికి వాళ్లు అప్పుడు పెద్ద ఫాసినేషన్. వెళ్లిపోయిన సుందర్రాజు, కోయ అన్న, కేశవ్ అన్న ఇప్పటి ప్రొఫెసర్ స్వరూప రాణి, ఇట్లా అనేకమంది వాళ్ల చుట్టూ చేరే వాళ్ళం. ఏం రాయాలి ఎందుకు రాయాలి మన చేతుల్లో అక్షరం రావడానికి పట్టిన కాలం ఎంత. అక్షరాన్ని ముట్టుకోవడానికి దాటిన నెత్తుటి అగడ్తలు ఏమిటి? ఇట్లా అనేక ప్రశ్నలకు ‘నెగడు’ ముందు మసిలో మగిలిన నవ్వులకు జవాబులు తోడు అయ్యేవి. అదంతా ఒక సందోహ కాలం.

సందేహాలు నివృత్తి చేసుకుంటూ ప్రయాణించిన కాలం. మోసపు మూసని బద్దలు కొట్టడం మొదలైన కాలం. అప్పుడప్పుడు సందర్భ వశాత్తు శివ సాగర్ అలియాస్ కేజీ సత్యమూర్తిగారు కూడా వచ్చేవారు. ఆయన చుట్టూ రకరకాల ఆశయాల దారుల స్వప్నాల కళ్ళు కలిగిన వాళ్ళు చేరి కబుర్లే కబుర్లు. యూనివర్సిటీ పచ్చ తురాయి చెట్లు పువ్వులు రాలుస్తూ ఆ కబుర్లు వినడానికి ఉత్సాహ పడేవి. అదిగో అట్లా మద్దూరి లోకి ప్రయాణం.

ప్రెస్ క్లబ్లో కలిసేవాడు. ఒంగోలు అంబేద్కర్ భవనంలో ఎదురయ్యే వాడు. కంచు కంఠం ఉన్నవాడు. తన ప్రతి పుస్తకంలో మస్తకాన్ని వెలిగించే మిణుగురులు కొసరిన వాడు. పల్లె పక్షాన నిలబడ్డ గండ్రగొడ్డలి వాడు. మళ్లీ ఇన్నేళ్ళకి బహుజన కెరటాల నేతృత్వంలో తన పుస్తకాలు అన్నింటితో ఒకచోట నిలబడి చల్లారిన నెత్తురుతో నిలబడ్డ, చెల్లాచెదురైన దళిత పల్లె బిడ్డలని ఒకచోట చేర్చే ఉద్దేశంతో పిలుస్తున్నాడు.

బహుజన రచయితల వేదిక – ఆంధ్రప్రదేశ్ పక్షాన, ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ, మద్దూరి మన చేతుల్లో పెట్టిన వాగ్దానాన్ని పట్టుకోవడానికి ఏర్పడిన అవకాశాన్ని స్వీకరించేందుకు, కవుల అందరినీ మన పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.

*

నూకతోటి రవికుమార్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా రోజులకు మద్దూరి పై మంచి వ్యాసం రాశారు.
    రవి కుమార్ సార్ కి అభినందనలు.

    కలేకూరి, మద్దూరి, పైడి,సుందర్ రాజు..అరచేతి నిప్పు కనికలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు