పడవల్లాంటి మనుషులు కావాలి

“ఖాళీ అయిన ఇల్లు” ఎప్పటికీ మనల్ని వెంటాడుతూనే వుంటుంది.

సుంకర గోపాలయ్య “రాధేయ కవితా పురస్కారం” నిర్వాహక మిత్రత్రయంలో ఒకరిగా, కవిగా సుపరిచితులు. నెల్లూరు జిల్లాలోని ‘రాచపాలెం’  స్వగ్రామం. ప్రస్తుతం కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాలలో తెలుగు శాఖ అధ్యక్షులుగా వున్నారు.
ఈ మధ్యకాలంలో గోపాల్ రాసిన “ఖాళీ అయిన ఇల్లు” కవిత నాకు బాగా నచ్చింది. ఖాళీ అయిన ఇంటిని చూడటానికి వెళ్లినప్పుడు కవి తాను చూసిన దృశ్యాల్ని కవిత్వం చేసిన తీరుకు ముచ్చటేసింది. కొత్తగా కవిత్వం రాస్తున్న కవులకు ఇదొక పాఠ్యాంశంగా నేర్పిస్తే బాగుండునని అనిపించింది. కవి సునిశిత పరిశీలనాదృష్టి మనల్ని ఆకర్షిస్తుంది. మనలో చాలామంది అద్దె ఇంటికోసం కాళ్లరిగేలా తిరిగే వుంటాం. తిరిగేక్రమంలో మనకు రకరకాల అనుభవాలు ఎదురయ్యే వుంటాయి. అవి వ్యక్తిని బట్టి,  సామాజిక, ఆర్ధిక స్థాయిని బట్టి, కులాన్ని, మతాన్ని బట్టి వేర్వేరుగా వుంటాయి. అది వేరే విషయం. అలా ఇంటిని చూసేటపుడు ఇంతకు ముందు ఇంట్లో వున్నోళ్ళు ఏ కారణం చేత ఖాళీచేసారని చుట్టుపక్కలవాళ్ళను అడిగేవుంటాం. ఆ ఇంటి వాస్తు గురించి, ఇంటి ఓనర్ గురించి వాకబ్ చేసే వుంటాం.
అసలు విషయానికి వస్తే,  కవి ఖాళీ అయిన ఇంటిని చూడడానికి వెళ్తాడు. వెళ్లినప్పుడు గతంలో వున్న ఇల్లాలు పెంచిన మొక్క స్వాగతం పలుకుతుంది. ఇంట్లోకి వెళ్లడానికి తలుపులు తెరిస్తే అది నాలుగు గదుల ఇల్లు. లోపల అడుగుపెట్టిన కవికి గోడకు వేలాడుతున్న క్యాలెండర్ , గోడలపై పిల్లలు గీసిన బొమ్మలు, అక్కడక్కడా పగిలిన గాజుముక్కలు, గాలిలేని బంతి, బొట్లుబొట్లుగా నీరు కారుతున్న కుళాయి మొ.నవి కనిపిస్తాయి. వీటి ఆధారంగా కవి వారి సంసారగాథను ఊహించుకుంటాడు. ఓ అంచనాకు వస్తాడు. చివరికి ఓ తాత్విక ధోరణిలో ముగింపు పలుకుతాడు. ఇదీ విషయం. మీరైతే ఇదే వస్తువుతో మీ సొంత అనుభవాల్ని జోడిస్తూ కవితనెలా రాస్తారు? ఆలోచించండి. ఇప్పటికైతే కవి సుంకర గోపాలయ్య ఎలా రాసాడో చూద్దాం.
“ఇల్లు ఖాళీ అని తెలిస్తే
చూడటానికి వెళ్లాం
గతంలో ఉన్న ఇల్లాలు వేసిన మొక్క ఒకటి
జ్ఞాపకాలను పూస్తోంది
తీసిన తలుపు
గత సంసార దుఃఖాన్ని పాడుతోంది
గుండెలో నాలుగు గదుల్లా
ఇంట్లో నాలుగు గదులు ఉన్నాయ్‌
గోడకు
తగిలించిన క్యాలెండర్‌
పోయిన్నెలనే భరిస్తూ ఉంది
అమ్మా నాన్నా గొడవ పడ్డప్పుడు వణికిన
పిల్లల భయం
 ఓ మూలన నక్కి ఉంది
గోడ మీద
పిల్లలు గీచిన దెయ్యం బొమ్మ
ఉన్నట్టుండి భయపెడుతోంది
అక్కడక్కడ
పగిలిన గాజుముక్కలు
సొంతింటి కలల్లా ఉన్నాయ్‌
పిల్లలు ఆడి వదిలిన
గాలి లేని బంతి ఒకటి
చచ్చుగా పడి ఉంది
సరిగ్గా ఆపని కుళాయి నుండి
జీవితం బొట్లు బొట్లుగా
రాలుతోంది
ఆ ఇల్లు
కష్టాలకు దుఃఖించి  ఉండవచ్చు
సుఖాలకు ఎగిరి గంతేసి  ఉండవచ్చు
ప్రతీ ఇంట్లోనూ ఒక  సముద్రముంటుంది
దాటేయడానికి
పడవల్లాంటి
మనుషులు కావాలి” (ఖాళీ అయిన ఇల్లు)
*
  కవికీ, ఇతరులకు వున్న తేడా ఏంటి? అనుకున్నప్పుడు వస్తువుల్ని వారు చూసే దృష్టికోణమే (perspective) అని చెప్పవచ్చు. కవి తాను చెప్పదల్చుకున్న విషయం కోసం తన అనుభవంలోని అంశాలను సృజనాత్మకంగా పురిపెట్టుకుంటూ వెళ్తాడు. ఉపాధ్యాయుడు అనేక ఉదాహరణల ద్వారా నిర్ధిష్టమైన అంశాల్ని గుర్తుచేస్తూ ఒక సాధారణీకరణ వైపు విద్యార్థులను అడుగులు వేయించే టెక్నిక్ ను కవిత్వం చేయడానికి అన్వయించుకోవడం కవి సుంకర గోపాలయ్యలో మనం గమనించవచ్చు. అంతిమంగా కవి చెప్పదల్చుకున్న విషయానికి జీవన తాత్వికతను జోడించి కవితకొక శాశ్వతత్వాన్ని కల్పించడం కవి చేసిన పని. ఇక్కడ కవిని అభినందించాలి. ఏమిటా జీవన తాత్వికత?
“ప్రతీ ఇంట్లోనూ ఒక సముద్రముంటుంది/
దాటేయడానికి పడవల్లాంటి మనుషులు కావాలి”
సంసారం సాగరం లాంటిది. దాన్ని దాటగలిగే ధైర్యం వున్నవాడే బతుకుతాడు. అందుకే పడవల్లాంటి మనుషులు కావాలంటున్నాడు కవి. మనిషికి జీవితం పట్ల ఎంత ప్రేమ వుండి వుండాలి? ఎంత పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకోవాలి? అది అంత అలవోకగా అబ్బదు. ఆ దిశగా సాధన చేయాల్సిందే.
కవి ఇటువంటి ముగింపునివ్వడానికి తన అనుభవంలోని దృశ్యాల్ని ఎలా కవిత్వం చేసాడో ఒకసారి పరిశీలిద్ధాం.
మొక్కలు పూలు పూయడం ప్రకృతి ధర్మం. కవి పూలను జ్ఞాపకాలతో స్థానభ్రంశం(displacement) చెందించడం వల్ల మామూలు వాక్యం కవితా వాక్యం అయింది.
“గతంలో వున్న ఇల్లాలు వేసిన మొక్క ఒకటి జ్ఞాపకాలను పూస్తోంది”
అలాగే కుళాయి నుండి నీరు బొట్లు బొట్లుగా కారుతుంది. ఇది మనకు తెలిసిందే. ఇక్కడ నీటికి బదులు ‘జీవితం’ బొట్లు బొట్లుగా రాలుతుందన్నప్పుడు కవిత్వమైంది.
“సరిగ్గా ఆపని కుళాయి నుండి జీవితం బొట్లు బొట్లుగా రాలుతోంది”
కష్టాలకైనా, సుఖాలకైనా మనుషులు ప్రతిస్పందిస్తారు. అలాగాకుండా మనుషులకు బదులు ‘ఇల్లు’ దు:ఖిస్తే, ఎగిరి గంతేస్తే అది కవిత్వం.
“ఆ ఇల్లు కష్టాలకు దు:ఖించి ఉండవచ్చు/సుఖాలకు ఎగిరి గంతేసి ఉండవచ్చు”
మనుషులు చేసే రకరకాల పనులను నిర్జీవమైన వస్తువులకు ఆపాదించి చెబితే అది మానవీకరణ (personification). ‘పాడటం’ అనే క్రియను ‘తలుపు’ కు ఆపాదించడం వల్ల కవిత్వానుభూతి సిద్ధిస్తుంది.
“తీసిన తలుపు గత సంసార దు:ఖాన్ని పాడుతోంది”
ఇంటిని గుండెతో, గాజుముక్కలను సొంతింటి కలలతో పోలికలు చెప్పడం వల్ల కవిత్వవాక్యాలుగా ఒదిగిపోయాయి.
“గుండెలో నాలుగు గదుల్లా/ఇంట్లో నాలుగు గదులు ఉన్నాయ్ “
“అక్కడక్కడ/పగిలిన గాజుముక్కలు/సొంతింటి కలల్లా ఉన్నాయ్ “
పోయిన్నెలనే భరిస్తున్న క్యాలెండర్ , మూలకు నక్కి వున్న పిల్లల భయం, చచ్చుగా పడివున్న గాలి లేని బంతి మొ.నవి ఇంటిలోపలి వాతావరణాన్ని చెప్పడానికి కవి వాడుకున్న కవిత్వపాదాల్లా అనిపిస్తాయి.
*
“ఇల్లు ఖాళీ అని తెలిస్తే/చూడడానికి వెళ్లాం”
ఎత్తుగడ సాధారణ వాక్యంలా అనిపిస్తూనే  ఉత్సుకతను ప్రేరేపిస్తుంది. ఎత్తుగడ పాఠకుడిని కవిత లోపలికి సాదరంగా ఆహ్వానిస్తుంది. ఈ కవితలో ‘స్థానభ్రంశం’ అనే టెక్నిక్ ద్వారా మంచి ‘మెటఫర్స్ ‘ సృష్టించగలిగాడు కవి.
ఈ కవిత చదివినపుడు పాఠకునికి కలిగే అనుభూతి అనిర్వచనీయం. ఆ ఇంటిలోని కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రుల మధ్య జరుగుతున్న గొడవల వల్ల పిల్లలపై వాటి ప్రభావం ఎలా వుంటుందోనని  “ఖాళీ అయిన ఇల్లు” ఎప్పటికీ మనల్ని వెంటాడుతూనే వుంటుంది. గుర్తుండిపోయే కవితను అందించిన కవి సుంకర గోపాలయ్యకు శుభాకాంక్షలు.
*

బండారి రాజ్ కుమార్

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రాజ్ చాలా బాగా రాశాడు. ఈ కవిత చాలా మంచి కవిత. గోపాల్ కి అభినందనలు

  • తీసిన తలుపు గత సంసార దుఃఖన్నీ పాడుతోoది….
    క్యాలెండర్ పోయిన్నేలనే భరిస్తుంది…
    కుళాయి నుండి జీవితం బొట్లు బొట్లు గా రాలుతోoది….👌👌👌ఇలాంటి మాటలు గోపాలయ్య గారు ప్రతి కవిత్వం లో ఆయన కలాం నుండి జరుతూనే ఉంటాయి అవి ఆలోచిoపచేస్తుంటాయి. సర్ మాకు పరిచయం అవ్వడం ఎంతో ఆనందం …సూపర్ సర్…💐మీకు అభినందనలు

  • మంచి కవితకి మంచి సమీక్ష

  • గుర్తుండిపోయే కవితకి గుర్తుండే విశ్లేషణ చాలా బాగుంది అన్న వివిధ కోణాల్లో కవితను చూడడం విశ్లేషించడం మాకొక మంచి పాఠం. ధన్యవాదాలు💐💐💐

  • చాలా బావుంది అన్న..కవిత, కవితను విశ్లేషణ చేసిన విధం..నచ్చింది.. గోపాల్ సర్ కు మీకూ శుభాకాంక్షలు….
    ఖాళీ అయిన ఇల్లులు మనందరిలో ధ్వనిస్తూ ఉంటాయి…

  • రాజ్ కుమార్ గారికి సుంకర గోపాలయ్య గారికి అభినందనలు. కవిత్వ పాఠ్యాంశం బోధిస్తున్నట్టుగా ఉంది. ఆ పాఠ్య అంశానికి అద్భుతంగా ఒదిగిపోయే ఉదాహరణ కవితగా గోపాల్ కవిత్వం ఉంది. గోపాల్ గారు విషయాలను ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తారో, అంతే లలితంగా వ్యక్తీకరిస్తారు. మొత్తంగా saaranga ఒక కవిత్వ కార్యశాల.

  • పడవ లాంటి కవులు కావాలి
    మనం చూసే ప్రతి వస్తువు వెనక కనిపించని అగాథాలు ఉంటాయి. అగాథాల లోతుల్లోకి కవులు మాత్రమే మే వెళ్లగలరు సాధారణ పాఠకుల కు ఇలాంటి కవులు చేయి పట్టుకుని నడిపించుకుని తీసుకువెళ్తారు ఆ సముద్రాలను తామె పడవలా దాటిస్తారు.గోపాల్ మంచి పడవ.

  • సుంకర గోపాల్ గారు చాలా అద్భుతమైన కవి అయన రచనలు ఎందరికో మార్గదర్శకాలు
    ఆయన కవిత్వం వర్ణించడానికి మాటలు సరిపోవు

  • మిగతా వ్యాసాలతో పోల్చితే ఇది చాలా భిన్నంగ వుంది అన్న.నాకు బాగా ఇష్టమైన కవిత ఇది.గోపాల్ అన్న గురించి అనేక విషయాలు తెలిశాయి.చివరలో కవిత్వనిర్మాణం గురించి మాట్లాడడం చాలా బాగ నచ్చింది అన్న

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు