అవధి. అంచు. అవతలి వొడ్డు.
వీటిని గుర్తుపెట్టుకుంటే జ్ఞానం. మరచిపోతే ధ్యానం. యానానికే కాదు. కాలానికి కూడా.
ఉత్త జ్ఞానంతో బతికెయ్యాలంటే ఉక్క బోస్తుంది. కొంత ధ్యానం కూడా వుండాలి. ఇంకా చెప్పాలంటే, ఎంతు గురుతో అంత మరపూ వుండాలి. ఈ రెండూ ఒకరిలో చూశాను. ఆయనే ధానం. సన్నిధానం.
నాకయితే ఈ పేరును పూర్తి తెలుగు లిపిలో రాయాలనిపించదు. కొంటెగా కొన్ని ఇంగ్లీషు అక్షరాలను కూడా పొదగాలనిపిస్తుంది. Sunnyధానం. ఆయన్ని కలిస్తే చాలు. నాలోని మబ్బులు విడిపోతాయి. ఎండ కాస్తుంది. వెలుగు వస్తుంది. కలిసిన ప్రతిరోజూ నాకు Sunny Day నే. అంటే మంచి రోజే. రాయటం అంటే అలా రాస్తాను కానీ, ‘శర్మగారూ’ అనే పిలుస్తాను. ఆయన కూడా నోరారా నన్ను ’సతీష్ చందర్ గారూ’ అని పిలుస్తారు. నలభయ్యేళ్ళ స్నేహం మాది. గోదావరి జిల్లాల వాళ్ళం కదా. ‘గారు’ ను పేరులో భాగంగానే వుంచుకుంటాం.
మా శర్మగారు గురుతు, మరపుల మేలు కలయక. అంటే జ్ఞాన, ధ్యానాల సమాహారం. అందుకే ఆయన నాకు ’ధానం’. అంటే అండ. ఎంత మరపంటే, ఎదురుగా రోజంతా కూర్చున్న సొంత బావమరదిని, ’మీరెవరో చెప్పారు కారు,’ అని అఅనేశారు. మరచిపోతే బంధువుల్ని, హితుల్నీ, స్నేహితుల్నీ మరచిపోతారు కానీ, ’ప్రాణహితుల్ని‘ మరచిపోరు. నా అదృష్టం కొద్దీ నేనే ’ప్రాణహితుల‘ ఖాతాలో వున్నాననుకున్నాను. కానీ ఈ మధ్యలో సభలో అనేశారు, నేనంటే ఆయనకు ‘పంచప్రాణాలూ‘ అని. నాకు మాత్రం కారా ఏమి? ఇద్దరమూ ఒకరికొకరం ’పంచప్రాణహితులం‘. (ఆయన కావ్యం పేరే ‘ప్రాణహిత’లెండి). నిజానికి మేం ఇద్దరం కాదు. ముగ్గురం. ఇంకొకాయన ఇప్పుడు లేరు. ఆయన ప్రసిధ్ధ కవి కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ. మమ్మల్ని కలిపింది రాజమహేంద్రవరం.
రస్సెలే పరిచయ కర్త
ఎవరి ఉద్యోగాలు వారివి. నేను రిపోర్టర్ని. శర్మగారు లైబ్రేరియన్. శ్రీమన్నారాయణ గారు ఇంజనీరు. ఎవరికి వారు పొద్దున్నే ఒక్కరం. మధ్యాహ్నానికి ఇద్దరం. సాయంత్రం అయిందంటే ముగ్గురం. ఇలా యేళ్ళు గడిచాయి.
నేను ఆవూరు కి ఎలా వచ్చానూ..?! రావటం కాదు. కొట్టుకొచ్చాను. అవును. అక్కడ వున్నది అఖండ గోదావరి కదా! వరదలకే కొట్టుకొచ్చాను. ’ఉదయం’ దినపత్రికలో సబ్ ఎడిటర్ గా వున్నప్పడు ’వరదల మీద రాయమని’ మునిగివున్న పశ్చిమ గోదావరికి తోసేశారు. నాకు తోచింది రాసిపారేస్తే, అదే పైవారికి తీవ్రంగా నచ్చేసింది. దాంతో రాజమహేంద్రవరం (రాజమండ్రి) స్టాఫ్ రిపోర్టర్ గా తోసేశారు. బెరుకు బెరుకుగా వుంటూనే, ఊరిలో పేరు మోసిన వాళ్ళ మీద ఉరికే వాణ్ణి. మంచి వూరు. మన్నించి భరించింది నన్ను.
నేనెక్కడున్నా గ్రంథాలయాలను వెతుక్కోవటం అలవాటు. ఇది నాకొక్కడికే కాదు, అప్పట్లో నా బోటి గాళ్ళందరికీ ఈ సరదా వుండేది. అలా గౌతమీ గ్రంథాలయానికి వెళ్ళి సభ్యత్వం తీసుకుని, పుస్తకాలు ఇంటికి తెచ్చుకునే వాణ్ణి. అప్పటికే ప్రసిధ్ధ కవి మధునాపంతుల సత్యనారాయ శాస్త్రిగారి చిన్నబ్బాయి మధునా మూర్తి నాకు పరిచయమయ్యాడు. ఓ పూట ఆయనే శర్మగారిని పరిచయం చేశాడు. కానీ ’అది ఒక కరచాలనమూ, రెండు కప్పుల టీల’ పరిచయమే. అసలు నాకు శర్మగారిని నిజంగా పరిచయం చేసింది బెర్ట్రండ్ రస్సెల్. అదేమిటీ రస్సెల్ కూడా రాజమండ్రి వచ్చాడా, అని సందేహించనవసరంలేదు. ఒక రోజు పురాణపండ శ్రీనివాస్ (ఉషశ్రీ గారి సోదరుని కొడుకు) అనే కుర్రాడు నా ఆఫీసుకు వచ్చాడు. ’సర్ మేం బెర్ట్రండ్ రస్సెల్ మీద సభ గౌతమీ లైబ్రరీలో సభ పెడుతున్నాం. మీరు వక్తగా మాట్లాడాలి’. అప్పటికి శ్రీనివాస్ మూతి మీద మీసాలు కూడా సరిగా రాలేదు. అప్పటికే అతడికి రస్సెల్ తెలిసివపోవటం కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అయినా ’ఎవరయితేనేం? దొరికిందే అవకాశం కదా’ అని ఒప్పేసుకున్నాను. ఆ సభలో నేను కాక ఇంకెవరు మాట్లాడుతున్నారో అని నేను అడగనేలేదు. తీరా ఆహ్వనపత్రం వచ్చాక నా సహవక్తల్లో సాహిత్యంలోకంలో పెద్ద పేరున్న ఆర్. ఎస్. సుదర్శనం కూడా వుంది. ముందు భయపడ్డాను. అయితేనేం? ఆయన ఆయనే. నేను నేనే. ఇంతకీ నన్ను పిలవమని పురాణపండకు చెప్పింది సన్నిధానం నరసింహశర్మ గారు. అదెలాజరిగిందీ? ‘అబ్బాయ్, నీకు పేరు రావాలంటే, ప్రపంచ ప్రసిధ్ధుల మీద సభచెయ్యాలి’ అని శర్మగారు అతనితో అన్నారు. ఆ నెలలో అలాంటి వారు ఎవరు పుట్టారో చూశారు. రస్సెల్ దొరికేశాడు. అంతే అదే జయంతి సభ అయిపోయింది. ఇక తర్వాత ప్రశ్న ఎవర్ని పిలవాలీ అని. ’దానిదేం భాగ్యం? ఈ మధ్యకాలంలో రస్సెల్ పుస్తకాలు లైబ్రెరీ నుంచి ఎవరు తీసుకు వెళ్ళారో చూద్దాం.’ అని వెతికితే నా పేరు కనిపించింది. అలా నేను పిలవబడ్డాను. చిత్రమేమిటంటే ఆరోజు నేను మాట్లాడింది శర్మగారికి నచ్చేసింది. తర్వాత గౌతమీ గ్రంథాలయంలో నేను చదివే చదువు నచ్చేసింది.
పరిశోధకులకు పాఠ్యపుస్తకం
అసలు ఆ గ్రంధాలయానికి ఒకప్పడు మా శర్మగారే సర్వాధికారి. ప్రభుత్వ అధీనంలోకి వచ్చాక, వేరే వాళ్ళు ఆ స్థానంలో వస్తూ వుండేవారు. ’మీరేనా లైబ్రెరికీ ఆఫీసరు?’ అని అడిగితే, ’ అయ్యో దానిదేముందడీ? ఇప్పటికీ నా పైన ముగ్గురు సెలవు పెడితే నేనే అధికారిని’ అనేవారు శర్మగారు. నా వరకూ అయితే, అప్పటికే కాదు, ఇప్పటికీ, మరెప్పటికీ మా శర్మగారే గౌతమికి సర్వాధికారి. ఆయన కేవలం గ్రంథాలయాధికారి మాత్రమే కాదు. అక్కడి గ్రంథాధికారి కూడా. నే వెతకబోయిన పుస్తకాన్నేకాదు, నేను వెతకాల్సిన పుస్తకాన్నికూడా ఆయన నా చేతికిచ్చేవారు. గౌతమిలో ఎవరు కాలుపెట్టినా అడిగేది సన్నిధానాన్ని. ఎవరీ సన్నిధానం? అందరికీ వచ్చే సందేహం, అప్పట్లో నాకు మాత్రం రాకుండా వుంటుందా? నివృత్తి కూడా అదే గౌతమిలో అయ్యింది. ఏ సాహిత్య పరిశోధక గ్రంధం చూసినా, కృతజ్ఞతల్లో మొదటి పేరు ఆయనదే వుండేది. ’పుస్తకాలు వెతికి పెట్ట వుంటారులే’ అందుకు కృతజ్ఞతలు చెప్పివుంటారూ అని ముందు సరిపెట్టుకున్నాను. ఆ తర్వాత తెలుగు సాహిత్యంలో పీహెచ్డీ చేద్దామనుకున్న వాళ్ళు రావటం ఆయన ముందు కూర్చోవటమూ చూసేవాణ్ణి. రావటం రావటమే కొందరు సర్వజ్ఞుల్లా వచ్చేవారు. వారు విలాసవంతగా కూర్చుని మా శర్మగారి కొంత జ్జాన బోధ కూడా చేసేవారు. అంతా విన్నాక, వినయపూర్వకంగా ఆయన చేసే వ్యాఖ్య వింతగా వుండేది. ’మీరు ఆధునిక కవిత్వం మీద అయిదు వందల పేజీలు రాసారంటే గొప్పవిషయమేనండి. కానీ శ్రీశ్రీ, తిలక్.. వీళ్ళు కూడా ఆధునికులేమో కదండీ?’ అనేవారు ఇలా అంటే ఇలా కాదు కానీ, ఇంచుమించు ఇలాగే వుంటుంది ఆయన సూచన. ఇక ఆ పరిశోధకుడు ఏమవుతాడు? ముందు నలిగి ముక్కలవుతాడు. తర్వాత తనకు తానే వైద్యం చేసుకుని ’డాక్టర్‘ అవుతాడు. మా శర్మగారికి దొరికి పోయాక పీహెచ్డీ పూర్తికాకుండా వుండదు కదా? సదరు పరిశోధకుడికి ‘గైడ్’ ఎవరయినా కావచ్చు. ’టక్స్ట్‘ మాత్రం మాశర్మగారే.’
‘మేడ’ తాళాలు
శర్మగారికి ఉద్యోగ, సభా పర్వాలు గౌతమిలోనే గడచిపోయేవి. లైబ్రెరీ భవనం మేడమీద వున్న బాబాయమ్మ హాలులో సభలు జరిగేవి. ఊళ్ళో ఎన్నివేదికలున్నా, సాహిత్యసభలు మాత్రం అక్కడే ఎక్కువ జరిగేవి. శర్మగారు ’సఫారీ’ డ్రెస్సు వేశారంటే అక్కడ సభ వున్నట్లే లెక్క. ఎక్కువ సభల్ని ఆయనే నిర్వహించేవారు. ఇలా లైబ్రరీలో పఠన సమయం ముగియగానే అలా శ్రవణ సమయం మొదలయ్యేది. శర్మగారే హాలు తలుపులు తెరిచేవారు. ఆ సన్నాహమే వేరు. ‘మేడ’ తాళాలతో వచ్చేవారాయన. అక్కడనే కాదు కానీ, రాజమండ్రిలో ఎక్కడ సభలు జరిగినా ఒక వింత కనిపించేది. వేదిక మీద కూర్చోవాల్సిన వారు సభలోనూ, సభలో కూర్చోవాల్సిన వారు వేదిక మీదా వున్నట్టుగా వుండేది. ఇది సభా? మయసభా? ఇలాంటి మీమాంస కూడా కలిగేది. వక్తలతో సరిసమానమయిన, ఒక్కొక్కసారి అంతకు మించి ప్రసిధ్ధులు శ్రోతలుగా తమంతటతాముగా వచ్చి శ్రోతల్లో కూర్చోవటమే అందుకు కారణం. అందుకని అక్కడి సాహిత్యసభల్లో మాట్లాడాలంటే, వక్తలకు ఎంత ప్రియమో, అంత భయం కూడాను. పెద్దవాళ్ళ మెచ్చుకోళ్ళు ఊరికే రావు కదా! ప్రయోజనంలేని ఒక్క సభా శర్మాగారు చెయ్యరు. గ్రంథాలయం అంటే ఆయన సంస్థానం కావచ్చు. కానీ ఇతర వేదికల మీద కూడా ఆయన సభావర్వం నిర్వహిస్తుంటారు. ఆయన సాంగత్యం వల్ల నాకు కూడా, రాజమండ్రిలో వున్నంత కాలం నా సాహిత్య యాత్ర మూడు సభలూ ఆరు ఉపన్యాసాల్లా సాగింది.
అంతవరకూ నేను చదివిన చదువు వేరు. గౌతమికొచ్చాక నా చదువు వేరు. అంతకు ముందు పుస్తకాలను చదవాలని చదవటమో, చదవకుండా వుండలేక చదవటమో, లేక రాయటం కోసం చదవటమో వుండేది. అక్కడ మాత్రం మాట్లాడటం కోసం చదివే వాడిని. నిజం కూడాను. అక్కడ ఒక్క మాట మాట్లాడాలంటే వంద పేజీలు చదవాలి. ప్రతి సభా ఒక పరీక్ష. ఎందుకంటే, అక్కడ మా శర్మగారనే కాదు, అందరూ అలాంటి పరీక్షలే పెడుతుండేవారు. శర్మగారయితే మరీను.
’మేం కవులం కాం’
ఒకసారి పెద్ద పరీక్షే పెట్టారు. కవి,పరిశోధకులు ఆరుద్ర పేరు మీద సాహితీ సప్తాహం అని పెట్టారు. వారం రోజుల పాటు ఆరుద్ర గ్రంథాల మీద ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు శర్మగారు. అది కూడా ఆయన ఇలాకా అయిన బాబాయమ్మ హాలు లో కాదు. వీరేశలింగం టౌన్ హాల్లో. ఒక రోజు ఉపన్యాసం నాకిచ్చారు. అది కూడా ఆరుద్ర ’త్వమేవాహం’ మీద. సరిగ్గా నేను హాలు లో ప్రవేశించేసరికి, హాలు నిండివుంది. శర్మగారు ముందు వరసలో కూర్చున్న వారిని పరిచయం చేశారు. వేద పండితులు రేమెళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి, సాహితీ వేత్త జనమంచి కామేశ్వరరావు, కవి పండితులు జొన్నల గడ్డ మృత్యుంజయరావు లు లాంటి వారువున్నారు. ’పైథాగరస్ సిధ్ధాంతాన్ని ఆరుద్ర తన కవిత్వంలో వాడంటున్నారు. అదెలా సాధ్యమో విందామని వచ్చాం‘ అన్నారు మృత్యుంజయ రావు. నేను శర్మగారి వైపు ’ఇరికించారు కదా!’ అన్నట్లు చూశాను. ’మీకేమిటీ? మీరు మాట్లాడేస్తారు.’ అని ప్రారంభించారు. నేను నా తరహాలో దంచేశాను. గణితంలోని ’స్క్వేర్’ కూ, అర్థశాస్త్రంలోని ‘క్లాస్’ కూ తెలుగులో ’వర్గం’ అనే అనువదిస్తారు. ఆ సౌకర్యాన్నికూడా ఆరుద్ర వాడేశారు లెండి. ఆ విషయాలు తర్వాత. సభ ముగిశాక, ముందు కూర్చున్న ప్రముఖులు సహా చాలా మంది అభినందించారు. నాకు ఇలా మార్కులు పడుతుంటే మా శర్మగారు ఆనందం చూడాలి. మా కొత్త పల్లి సత్య శ్రీమన్నారయణగారు సరే. వీరిద్దరూ కొన్ని రోజుల పాటు నా ఉపన్యాసాన్ని విశ్లేషణలు చేస్తూ నన్ను ఊరేగిస్తూనే వున్నారు. ఇంత గొప్పగా జరిగే సభాపర్వంలో చిన్న అపశ్రుతి. ఎప్పటిలాగే శ్రీమన్నారాయణ గారూ, నేనూ ఆ రోజు గౌతమిలో ని ఆయన సన్నిధానం లో వున్నాం. కానీ ఆయన ముభావంగా వున్నారు. అసలు మేం ముగ్గురం కలిస్తే మా భాషే మారిపోతుంది. మాది ’మార్మిక భాష’. తెలుగే. కానీ ఆ తెలుగు వేరు. మాకు మాత్రమే అర్థమవుతుంది. ఎదురుగావున్న నాలుగో వ్యక్తి ఎవరొచ్చినా ఆయన గురించే మాట్లడేసుకుంటాం. కానీ ఆయనకు తెలీదు. మేం వచ్చి చాలా సేపయినా శర్మ గారు మార్మిక భాషలోకి రావటం లేదు. దిగులు గా వున్నారు. కొద్దిసేపటికి ఆయనే చెప్పారు. ’ఈ నోటితోనే మీరిద్దరూ కవులు కారని చెప్పాను.’ అన్నారు. మేం కిసుక్కున నవ్వేశాం. అప్పుడాయన అసలు విషయం చెప్పారు. ’వాళ్ళెవరో భక్తకవి సమ్మేళనం చేస్తున్నాం అంటూ వచ్చి, మీ దగ్గరకి వస్తుంటారు కదా శ్రీమన్నారయణగారూ, సతీష్ చందర్ గారూను. వారిని ఒప్పిస్తే వారి పేర్లుకూడా ఇన్విటేషన్లో వేసేసుకుంటాం’ అని శర్మగారితో అన్నారు. అప్పడు మా మనసునూ, నిబధ్ధతనూ ఎరిగిన శర్మగారు ’అబ్బే. అసలు వాళ్ళిద్దరూ కవులే కాదండీ’ అని చెప్పి, మమ్మల్ని ప్రమాదం నుంచి తప్పించారు.
సంప్రదాయమా? ఆధునికమా?
సన్నిధానం అంటే ఒక సాహిత్యోద్యమం. ఉద్యమం అన్నాక సంస్థలూ వుంటాయి. నేనక్కడికి వెళ్ళేసరికే ఆయనా, శ్రీమన్నారాయణగారూ కలిపి ‘వాగర్థ’ అనే సంస్థతో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ‘సాహితీ వేదిక’ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వాటికి హాజరుకమ్మని నన్ను పురికొల్పింది శర్మగారే. అక్కడే నేను స్ర్తీవాదకవిత్వోద్యమానికి పతాక శీర్షిక ’బందిపోట్లు’ రాసిన సావిత్రిని చూశాను. బక్కపల్చగా బలహీనంగా వున్న ఈవిడా ’పురుష ప్రపంచాన్ని’ తలకిందులు చేశారూ? అనుకున్నాను. అక్కడే మహేష్, గోపీచంద్, సమాచారం సుబ్రహ్మణ్యం, చినవీరభద్రుడూ, చాగంటి శరత్ బాబూ, వంక బాలసుబ్రహ్మణ్యం, ఎర్రాప్రెగడ రామకృష్ణా, ఎమ్మెస్ సూర్యనారాయణా పరిచయమయ్యారు. ఈలోపుగా వాసిరెడ్డి పద్మా, వెస్లీలు ’చైతన్యవేదిక’ ప్రారంభించారు. ఈ సంస్థకు ఇటు శర్మగారూ, అటు శ్రీమన్నారాయణగారూ ఊతమిచ్చారు. దాపరికేం లేదు. ’చైతన్యవేదిక’ కు భూమిక వామపక్ష భావజాలమే. అప్పడు కానీ నా వెంటే వున్న శర్మగారు నాకర్థం కాలేదు. ఆయన గురువు చూస్తే ‘ఆంధ్రపురాణ’ కర్త మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. మా శ్రీమన్నారాయణగారికి గురువేమో, కమ్యూనిస్ట ఉద్యమానికి ఊతమిచ్చే ’వజ్రాయుధ‘ కవి ఆవంత్స సోమసుందర్. దానికి తోడు శర్మగారు మరో వామపక్ష కవి ఆరుద్ర ను తలకెత్తుకుంటాడు. కలిసిన వారందరికీ ఒకటే అనుమానం వస్తుంది. ’ఇంతకీ సన్నిధానం సంప్రదాయ వాదా? ఆధునిక వాదా?’. ఇలాంటి చిక్కుప్రశ్న వచ్చినప్పుడు చాలా మంది తప్పించుకోవటానికి ఇచ్చే సమాధానం ఒకటి వుంది: సంప్రదాయవాదుల్లో ఆధునికుడు, ఆధునికుల్లో సంప్రదాయవాది. కానీ శర్మగారు అలా కాదు. నిర్భయంగానే ప్రకటించేవారు.
ఛందమున్న పద్యం రాస్తే సంప్రదాయవాది అనీ, ఛందం వీడిన వచనం రాస్తే ఆధునికుడనీ తెంపు చెయ్యటం కుదరని పని. అలా చేస్తే పంచె కట్టిన వాడు పాతకాలపు మనిషి అనీ, ఫ్యాంటు తొడిగిన నవనాగరీకుడనీ నిర్థారణ కొచ్చినట్లుంటుంది. ఇక్కడే ఒక చోద్యం చెప్పాలి. శర్మగారికి పెదనాన్న వరసయిన పాత్రికేయుడు అదే ఊరిలో వుండేవారు. ఆయన పేరు ఆర్.బి. పెండ్యాల. ఇలా చెబితే ఆధునికంగానే వుంటుంది. పెండ్యాల రామబ్రహ్మం సాంప్రదాయకంగా వుంటుంది. చూడ్డానికి పాతకాలపు వాడిలా కనిపిస్తాడు. ఆయన కు పంచె, పిలకా, జంధ్యం- అన్నీ వుండేవి. నేను రాజమండ్రి పచ్చిన కొత్తల్లో ఆయన్ని చూసి, పచ్చి సంప్రదాయవాదే అనుకునేవాడిని. కానీ మాతో పాటు మీడియా కాన్పరెన్సు అనంతరం విందులో పాల్గొన్నప్పుడు, ’కెన్ యూ సర్వ్ మీ వన్ మోర్ చికెన్ పీసూ?’ అని ఆయన అడగటం చూసి అవాక్కయ్యాను. ఆయన ఆహార్యానికీ, ఆహారానికి ఎక్కడా పొంతన లేదనిపించింది. తర్వాత తెలిసింది ఆయన నిఖార్సయిన సోషలిస్టు అని. మతం, దేవుడూ, విశ్వాసం- వీటిని దగ్గరకు రానిచ్చేవాడు కాడు పెండ్యాల. ఆయన నన్ను పుత్రవాత్సల్యంతో చూసేవారు. అందుకు శర్మగారు కూడా కారణం. నేను శర్మగారి ప్రాణ స్నేహితుణ్ణని ఆయన ముందే గ్రహించారు. ఒకరి పంచన వుండటం కన్నా, పస్తులండటమే సులభమని మాకు తెలియచెప్పిన మహనీయుడాయన. మరెందుకు ఈ రూపమంటే, తల్లి చనిపోతూ చనిపోతూ ‘జంధ్యం తియ్యకురా’ అని వొట్టు వెయ్యించుకందని పెండ్యాల చెప్పేవారు. పెండ్యాల గారు మరీ కష్టాల్లో వుంటే శర్మగారి దగ్గరకు వచ్చేవారు. అప్పుడు కూడా పెండ్యాల రాజసం తగ్గేది కాదు. ’శర్మా, నీ జేబులో ఎంత వున్నాయిరా?’ అనడిగేవారు. ’పద్నాలుగు రూపాయిలున్నాయి పెదనాన్నా.’ అని శర్మగారు బదులిచ్చేవారు. ’నీకెంత కావాలి రా?’ అని శర్మగారినే ఎదురడిగేవారు. ’నాలుగు రూపాయిలు సరిపోతాయి పెదనాన్నా.’ అంటూ పదీ పెండ్యాల గారి చేతిలో పెట్టేవారు శర్మగారు పరమ సంతోషంగా.
అందుచేత కేవలం రూపాన్ని బట్టి సారాన్ని నిర్ణయించకూడదు. పెండ్యాల జంధ్యమున్న ఆధునికుడు ఎలాగో, అలాగ మా శర్మగారు పద్యం రాసిన ఆధునికుడు. అంటే వచనం రాయలేదని కాదు. ఆయన ’ప్రాణహిత’ వచన కావ్యమే. కేవలం కవనంలోనే కాదు, జీవనంలోనూ శర్మగారు ఆధునికుడు. పద్యమే రాసిన జాషువాను సంప్రదాయవాది అని ఎవరయినా అనటానికి తెగించగలరా? ఆయన శిల్పమూ ఆధునికమే, వస్తువూ ఆధునికమే. ’చుక్కలు మాయమయితే కానీ, ముగ్గులు బయిల్పడవు’ అన్న భావన తో రాసిన కవితలో, ’రాగ చిహ్నాలు దృశ్యాలు/త్యాగ చిహ్నాలు అదృశ్యాలు’. అంటారు. అదృశ్యాలు చుక్కలు. దృశ్యాలు ముగ్గులు. ముఖమాటం లేకుండా చెప్పాలంటే, ఇది విప్లవ కవితోద్యమంలోని డిక్షన్. కాదని నిరూపించే ఆందోళనలో ఏ ’ఆముక్తమాల్యద’ల్నో తడమనవసరంలేదు. ‘ఇప్పుడు కావలిసింది పాదుకా పట్టాభిషేకం కాదు. చెప్పులు కుట్టే శ్రమజీవికి పట్టాభిషేకం.’ అని కూడా సన్నిధానం అనేవారు. ఇందులో ఆయన నిరసించేదిమిటో, స్వీకరించిందేమిటో వేరుగా చెప్పనవసరంలేదు. ఆయన అస్తిత్వవాదాల వరకూ వచ్చేశాక కూడా, పద్యం పేరు చెప్పి ఆయన్ని వెనక్కి పంపించటం భావ్యమా? చెప్పండి.
అగ్రరాజ్యాన్నెదిరించిన ’ఆంధ్రపురాణ’ కర్త
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు మా శర్మగారికి గురువంటే గురువే. పద్యాన్ని అచ్చంగా శాస్త్రిగారు చదివినట్టే చదువుతారు శర్మగారు. మా శర్మగారు చదువుతుంటే, శ్రీమన్నారాయణగారూ, నేనూ అలా లీనమై వినేవాళ్ళం. అంతే కాదు. ఆయన పూర్తి చేసిన కొన్ని నిమిషాల వరకూ మాట్లాడే వాళ్ళం కాదు. ఆ మాధ్యుర్యాన్ని అనుభవించటానికి మేం తీసుకునే సమయం అది. ఇంతకీ ఇంత గొప్పగా పద్యాన్ని నిర్మించి, వినిపించే మధునాపంతులలో ఆధునిక భావాలు లేవా? యవ్వనంలో వున్నప్పుడే సంస్కృత పాఠశాల పెట్టి, అందులో ’అస్ప్సశ్యులకు’ ప్రవేశం కల్పించారు. అవును మధునాపంతుల వారే. (ఇంటర్య్వూలో ఆయనే చెప్పారు.) సీసం పోసిన నోళ్ళల్లో శ్లోకాన్ని వుంచాలనుకున్నారు. సంస్కరణవాదులు తప్స పచ్చి సంప్రదాయవాదులు ఈ పనిచెయ్యగలరా? పక్క రాష్ట్రంలో (తమిళనాడులో) అడపా దడపా దళిత పురోహితుల్ని సృష్టిస్తున్నందుకు, ఈ కాలంలో కూడా ఆయాస పడుతున్నారే! ఆ కాలంలో ఆయన ఎలా చెయ్యగలిగారు మరి?
మధునాపంతుల ఆధ్యక్ష్యంలో జరిగిన కవిసమ్మేళనంలో నేనూ పాల్గొన్నాను. నా కవిత్వాన్ని సరే. ఆయన వాత్సల్యంతో స్వీకరించేవారు. కానీ కొత్తపల్లి సత్య శ్రీమన్నారయణ గారు చదివినప్పుడు మాత్రం ఆయన కవిత్వం ఎంత లోతైన ఆధునిక కవిత్వమో మధునాపంతుల విశదపరిచేవారు.అంతెందుకు? అమెరికా అగ్రరాజ్యాహంకారాన్ని ఏ సంప్రదాయవాది పనిగట్టుకుని నిరసిస్తాడు చెప్పండి? అది కూడా ఒక ముస్లిం దేశాధినేత మీద విరుచుకపడ్డప్పడు. నిజంగా నోరువిప్పుతాడా? కానీ, వాసిరెడ్డి పద్మా, వెస్లీ, నేనూ, మా శర్మగారూ ఇరాక్ నేత సద్దాం హుస్సేన్ ను గురి పెట్టి చేస్తున్న మొదటి గల్ఫ్ యుధ్ధానికి నిరసనగా ’శాంతి యాత్ర’ నిర్వహించాం. ఎక్కడా? రాజమండ్రి పురవీధుల్లో. దానికి అగ్రభాగాన ఎవరు నిలుచున్నారో తెలుసా? సాక్షాత్తూ మా సన్నిధానం నరసింహ శర్మ గారి గురువు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు. శిష్యుడు ఇలా పిలవగానే అలా వచ్చారు. అందుకే మా శర్మగారిక ఇటు మధునాపంతుల, అటు ఆరుద్ర ప్రభావాలు పడ్డా, అవేమీ పరస్పర విరుధ్ధ ప్రభావాలు కావు.
మరపే జ్ఞాపకం
సాహిత్య సంభాషణలంటే శర్మగారు అన్నీ మరచిపోతారు. చిత్రం! ఆయనకు మరపూ ఒక జ్ఞాపకమే. అంత వరకూ మాట్లాడుకున్న సారస్వత విషయాలను నెమరు వేసుకోవటం వల్లనే ఆ మరపు. కొన్నాళ్ళు మేం రాజమండ్రిలో వున్నప్పుడు గౌతమీ గ్రంథాలయం చేరువలోనే నాగదేవి ధియేటర్ వుండేది. దాని వెనకాలనే మా నివాసం. మా ఇంటి మీదుగానే శర్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళుతూ వెళ్ళుతూ మా ఇంటి దగ్గర ఆగటం, మా గౌరి ఇచ్చిన టీ తాగటం, ఇవి మామూలే. ఒక రోజు మా అమ్మాయి (చేతనను) వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తానన్నారు. వెంట వెళ్ళింది. అప్పడు మా పాపకు నాలుగేళ్లు వుంటాయి. ఆయన చెయ్యిపట్టుకునే వుంది. ఇద్దరూ శర్మగారింటికి చేరారు. అంతవరకూ ఆయన ఏదో అడుగుతున్నారు. పాప ఏదో చెబుతోంది. ఇంటికి చేరాక కానీ, ఆయన ఏమి అడుగుతున్నారో, పాప ఏం చెబుతోందో ఆయన గ్రహింపునకు రాలేదు. ’ఎన్నిసార్లు చెప్పాలి అంకుల్?’ అన్నమాటతో మరపు నుంచి ఎరుకలోకి వచ్చారు. అంటే అప్పటికే ’నేపేరేమిటి అమ్మా?’ అని ఆయన అడగటం, పాప జవాబివ్వటం ఓ అరడజను సార్లన్నా జరిగి వుండాలి. అంత సేపూ ఆయన ఏం చేసి వుంటారు? నేనూ ఆయన మాట్లాడుకున్న విషయాలనే గుర్తు చేసుకున్నారన్నమాట.
నాకు శర్మగారికి వున్న స్నేహం మీడియాలో వున్న వాళ్ళ పెదనాన్న పెండ్యాల గారికే కాదు, ఇతర మీడియా మిత్రులకీ, రాజకీయ నాయకులకీ తెలిసిపోయింది. జక్కంపూడి రామమోహనరావుగారు అప్పడు కార్మిక సంఘ(ఐఎన్టియుసి) నేత. అప్పట్లో ’ఈనాడు’ ’ఉదయం’ దినపత్రికలు సర్క్యులేషన్ పరంగా అగ్రపత్రికలుగా వుండేవి. ఆయన ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టినప్పడు ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ సులభంగా దొరికేవాడు. ’ఉదయం’ స్టాఫ్ రిపోర్టర్ గా వున్న నన్ను వెతికిపట్టుకోవటం కష్టంగా వుండేది. ఆయన కార్యకర్తలు నా ఆపీసుకీ, ఇంటికీ వచ్చేవారు. నేను వుండేవాడిని కాదు. అదే విషయం వాళ్ళు వెళ్ళి రామమోహనరావుగారికి చెప్పేవారు. ’మరి గౌతమీ లైబ్రెరీ వెతికారా? ఏ పాత పుస్తకాల మధ్యనో వుంటాడు. శర్మగారిని అడిగితే, ఆయనే సతీష్ చందర్ ని పట్టిస్తాడు.’ అని పంపించేవారు. అలా శర్మగారు గౌతమీ గ్రంథాలయాన్ని నాకు కూడా మరో కార్యాలయం చేసేశారు.
శర్మగారి వల్ల ఎవరూ రాయని వార్తలూ, వ్యాసాలూ, ఫీచర్లూ నేను పత్రికలో రాయగలిగాను. తెలుగు యూనివర్శటీ సాహిత్య కేంద్రాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నారు. అప్పడు అక్కడి నాయకులు కొందరు ’గౌతమీ గ్రంథాలయాన్ని’ తెలుగు యూనివర్శిటీలో కలిపివెయ్యాలని. కర్ణాకర్ణిగా నా వరకూ వచ్చింది. అప్పడు శర్మగారి సాయంతో గౌతమీ గ్రంథాలయం వైశిష్ట్యాన్ని ఏయే ప్రముఖులు ఎలా కీర్తించారో సేకరించి, అలా కలపటానికి వీలు లేదన్న వాదనకు ఊతమిస్తూ ఒక పెద్దవ్యాసాన్ని రాసి ’ఉదయం’ దినపత్రికలోనే ‘తెలుగు సముద్రంలో గ్రంథాల గౌతమి?’ అన్న శీర్షిక కింద రాశాను. అదొక ఉద్యమంగా మారింది. తర్వాత అలా విలీనం చేసే ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
గౌతమిలో దొరికే గౌతమి చరిత
శర్మగారు నాకు గౌతమీ గ్రంథాలయంలో వున్న పాత పత్రికలుండే చోటును చూపించారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్రి నడిపిన ’ప్రబుధ్ధాంధ్ర’ సంచికలూ, పందిరి మల్లికార్జునరావు ’కిన్నెర’ సంచికలూ శ్రధ్ధగా చూసేవాణ్ణి. ఒక సారి వీరేశలింగాన్ని ప్రభావితం చేసిన ’ఇండియన్ సోషల్ రిఫార్మర్’ పత్రిక పాత సంచికలు చూస్తున్నాను. ఇది బొంబాయి నుంచి వెలువడేది. అందులో గౌతమీ గ్రంథాలయం గురించిన ఒక వ్యాసాన్ని శర్మగారికి చూపించాను. ’గౌతమి’ లోనే ’గౌతమి’ చరిత్రను చూపించినందుకు ఆయన సంబరపడ్డాడు. అందులో ఒక్కటే విశేషం. విజయవాడలోని ’రామమోహన గ్రంథాలయానికీ’ , రాజమండ్రిలోని ’గౌతమీ గ్రంథాలయానికీ’ ఒక్కటే తేడా. అక్కడ వసతులు ఎక్కువ పుస్తకాలు తక్కువ; ఇక్కడ వసతులు తక్కువ పుస్తకాలు ఎక్కువ. ఆ వ్యాసాన్ని ఉటంకిస్తూ, శతాబ్దం గడిచినా తీరేమీ మారలేదంటూ ఇంకో వార్త రాశాను. శర్మగారు గౌతమి మీద నాకంత అభిమానం కలిగేటట్టు చేశారు.
పొద్దెరగని తెల్ల బిచ్చగాళ్ళు!
శర్మగారికి వార్త దృష్టి బాగా వుండేది. ఏది వార్త అవుతుందో కూడా గ్రహించేవారు. ఒక సారి మిట్ట మధ్యాహ్నం లైబ్రరీ వెనక నుంచి పశువుల ఆసుపత్రి మీదుగా నేనూ, శర్మగారూ నడుచుకుంటూ వస్తున్నాం. మురికి దుస్తుల్లో వున్న విదేశీ యువతీ, విదేశీ యువకుడూ మమ్మల్ని ఆపారు. ఇద్దరూ తెల్లవాళ్ళే. ’కుడ్ యూ స్పేర్ అజ్ యే రూపీ?’ అంది యువతి. నా జేబులో రెండు రూపాయిలు నోటు (అప్పడు విలువ ఎక్కువే లెండి) ఇచ్చాను. వాళ్ళు వెళ్ళిన పది నిమిషాలకు ’తెల్లవాళ్ళు అడుక్కోవటమేమిటండీ?’ అన్నారు శర్మగారు. ’అవును కదా! ఇది వార్తే’ అనుకుని, వెంటనే వెళ్ళి వెతికి పట్టుకుని, ఇంటర్వ్యూ చేసి, ’రాజమండ్రి వీధుల్లో పొద్దెరగని తెల్లబిచ్చగాళ్ళు’ అని రాశాను. అప్పటికి కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం గారు రాజమండ్రిలోనే ’కోస్తావాణి’ పత్రిక పెట్టించి, తాను సంపాదకుడిగా వుంటూ నడిపిస్తున్నారు. ఆ వార్తను మెచ్చుకుంటూ నాకు ఉత్తరం రాశారు కూడా. ఈ ప్రశంసలో సగభాగాన్ని శర్మగారికి అప్పుడే పంచేశాను. కొన్నాళ్ళకు నేను పత్రిక మారాల్సి వచ్చింది. ’ఆంధ్రజ్యోతి’కి వెళ్ళాను. రాజమండ్రి మీద నాకుండే మక్కువను గుర్తించి నన్ను అప్పటి యాజమాన్యం తూర్పుగోదావరి జిల్లా రిపోర్టర్ గా చేసి, అదే రాజమండ్రిలో వుంచింది. పత్రికా కార్యాలయం ’దామెర్లరామారావు ఆర్ట్ గ్యాలరీ’కి ఎదురుగా వుండేది. అక్కడ రామారావు గారి శిష్యుడు ప్రఖ్యాత చిత్రకారుడు రాజాజీ వుండేవారు. (శీలా వీర్రాజు గారు తన ’మైనా’ నవలను రాజాజీకే అంకితమిచ్చారు.) ఆయన శర్మగారికి స్నేహితుడు కూడా. ఆయన నా ఆఫీసులో కూర్చుని, టీ తాగి, పేపర్ చదువుకుని, కళ గురించి కొత్త కొత్త విషయాలు మాట్లాడి వెళ్తుండేవారు. అదే సమయంలో శర్మగారు కూడా వస్తూవుండేవారు. నా ఆఫీసు కు దగ్గరలోనే నేదునూరి గంగాధరం గారి నివాసమూ, గ్రంధాలయం వుండేవి. జానపద వాజ్ఞ్మయానికి శాశ్వత చిరునామా నేదునూరి. మా శర్మగారికి మరో గురువు. పద్యం తర్వాత, గేయం అంటే శర్మగారికి మహా ఇష్టం. ఇప్పటికీ పేరొందిన సినీ గేయరచయితలు ఈ విషయంలో శర్మగారిని సంప్రదిస్తూనే వుంటారు.
రాజమండ్రిలో కవులు రాశిలో ఎప్పడూ ఎక్కువే. కానీ వాసిలో కూడా అగ్రస్థానంలో వుండాలని తాపత్రయపడేవారిలో శర్మగారు ప్రథములు. అందుకోసం ఆయన చేయని కృషి చెయ్యలేదు. ఒక సారి, ఆయనా నేనూ మాట్లాడుకుంటూ రాజమండ్రిలో ’వంద కవులుంటారా?’ అని లెక్కకట్టాం. అంతే, ఆయన ’శతాధిక కవిసమ్మేళనం’ ఏర్పాటు చేసేశారు. ఆవంత్స సోమసుందర్ అధ్యక్షత వహించారు. అలసిపోతున్నా ఆయన అధ్యక్షస్థానంలో నిలిచారు. ఆయన పరిస్థతి చూసి, ’సొమ్మసిల్లిన సోమసుందర్’ అని ఎక్కడ వార్త రాయాల్సి వస్తుందో అని భయపడ్డాను. అకరాదిగా పేర్లు రాయటం వల్ల నా పేరు చివర్న వచ్చింది లెండి. అప్పుడు చూశాను ఆయన ముఖంలోని నీరసాన్ని. గౌతమీ గ్రంథాలయంలో ఏ సభ జరిగినా నేనూ, మా గౌరీ పిల్లల్ని తీసుకుని వెళ్ళేవాళ్ళం. వాళ్ళను చూసి, ’బాల కవిసమ్మేళనం’ ఏర్పాటు చేస్తే ఎలా వుంటుందీ?’ అని శర్మగారే ఆలోచన చేసి, వెంటనే అమలు చేశారు. చాలా మంది పిల్లలు పాల్గొన్నారు. మా అబ్బాయి (పమ్ము) అయితే మరుసటి రోజు అన్నిపేపర్లలో వాడి పేరు చూసుకుని తెగమురిసిపోయాడు.
ఆయనే నేను
ఇలా వుంటుండగా నేను విజయవాడకు నేను మకాం మార్చాల్సి వచ్చింది. ’ఆంధ్రభూమి’ విజయవాడ ఎడిషన్ పెడుతున్నారు. ’చీఫ్ రిపోర్టర్’ గా రమ్మన్నారు. మంచి అవకాశమే. రాజమండ్రిని వదలటానికి తటపటాయించాను. ’చీఫ్ రిపోర్టర్’ తో పాటు, కోస్తా,రాయల సీమ రిపోర్టింగ్ నెటవర్క్ ను చూడాలీ అన్నారు. ఆ వంకన రాజమండ్రి అప్పుడప్పడూ రావచ్చు అనుకుని అక్కడికి మకాం మార్చేశాను. నేనూ బెంగపడ్డాను. మా శర్మగారూ బెంగపడ్డారు. యోగ క్షేమాలే కాకుండా, సాహితీ మిత్రుల విశేషాలతో ఆయన నాకు ఉత్తరాలు రాస్తుండేవారు. నాకో చెడుఅలవాటు వుంది. ఉత్తరాలు స్వీకరిస్తాను కానీ, ప్రత్యుత్తరాలు రాయను. ఇప్పటి నా సహచరిగా మారిన అప్పటి నా ప్రేయసి గౌరికి తప్ప, ఎవరికీ పెద్దగా ఉత్తరాలు రాయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను నిరుత్తర కుమారుణ్ణి. దాదాపు శర్మగారు నాకు పది ఉత్తరాలన్నా రాసి వుంటారు. కానీ, నేను జవాబు ఇవ్వటం లేదు. అప్పడు ఆయనే నా జవాబు కూడా రాసి నాకు పోస్టు చేశారు: ’శర్మగారూ, మీ ఉత్తరాలు అందుతున్నాయి. పని వత్తిళ్ళ వల్ల మాత్రమే మీకు జవాబివ్వలేక పోతున్నాను. అయినా ప్రతిక్షణమూ మీరే నాకు గుర్తుకొస్తున్నారు. ఇట్లు మీ ప్రాణ స్నేహితుడు, సతీష్ చందర్’ అన్నది ఆ లేఖ సారాంశం. ఆయన నిరసనలో కూడా అంత ప్రేమ వుంటుంది.
మూడేళ్ళయ్యాక నన్ను ’ఆంధ్రభూమి‘ యాజమాన్యం విజయవాడనుంచి, విశాఖపట్నం ఎడిషన్ కు బదిలీ చేసింది. నాకు వెళ్ళటానికి ఇష్టం లేదు. రాజమండ్రికొచ్చెయ్యాలని వుంది. ఈ ముక్క శర్మగారి చెవిలో వేశాను. అంతే. దారి దొరికేసింది. అప్పటికి ’కోస్తావాణి‘ సంపాదకత్వం బాధ్యతలనుంచి కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం గారు స్వఛ్చందంగా తప్పుకున్నారు. కానీ, ఆ పత్రికకు మంచి పేరు వుంది. వెంటనే శర్మగారు ఆ సంస్థ అధిపతి చింతల గోపాలరావుగారితో మాట్లాడేశారు. ఆయన నాకూ పరిచయమే. కానీ శర్మగారి మాటంటే ఆయన గురి. అలా ఆ పత్రికకు సంపాదకుడినయ్యాను. మరి జీతమో? ’మీరు పెద్దవారు. మీ జీతం నేను నిర్ణయించటమేమిటి? మీరెంతంటే అంతే’ అని గోపాలరావు గారు నాకు వదిలేశారు. కడకు నేనే నిర్ణయించుకున్నాను. నా గురించి శర్మగారు ఏ స్థాయిలో గోపాలరావు గారికి చెప్పివుంటారో అప్పట్లో నా ఊహకు అందలేదు.
’ప్రజారస’జ్ఞత
ఆ తర్వాత గౌతమీ గ్రంథాలయ కేంద్రంగా సాహిత్య కార్యక్రమాల ఉధ్ధృతి పెరిగింది. నాకు రాష్ర్టస్థాయిలో సాహితీ మిత్రులు పరిచయమయ్యారు. సాహిత్యోద్యమాలు ఊపు అందుకున్నాయి. నేను ’ప్రజారచయితల సమాఖ్య’ (ప్రజారస) రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణయ్యాను. అద్దేపల్లి రామమోహనరావులాంటి ప్రసిధ్ధ విమర్శకులు కూడా నాస్నేహంతో ఈ సంఘంలో చేరారు. వెలుపలి నుంచి శర్మగారూ, శ్రీమన్నారాయణగారూ, గొప్ప కథకులు ముప్పిడి ప్రభాకరరావుగారూ మద్దతు ఇచ్చేవారు.
నేనూ, శ్రీమన్నారయణగారూ, అద్దేపల్లి వారూ మాట్లాడుకుంటుంటే మాత్రం శర్మగారు చాలా శ్రధ్ధగా వినేవారు. ఆంగ్లసాహిత్య విషయాలు తరచు మా ముగ్గురి చర్చల్లో వచ్చేవి. ఇలియట్ అంటే మా శ్రీమన్నారయణ గారికి ఒళ్ళు తెలియదు. శర్మగారు రాజమండ్రి లో కొత్తగా ఇల్లు కట్టారు. మేడగదిలో మిత్రులుండాలనుకునేవారు. ఒక సారి సరిగ్గా మేం ముగ్గురమే ( శ్రీమన్నారాయణగారూ, అద్దేపల్లివారూ, నేనూ) ఓ సాయింత్రం శర్మగారింట్లో భోజనం చేసి మాటల్లో పడ్డాం. అనుకోకుండా ఆరోజు ఆంగ్ల సాహిత్యం మీద కాకుండా, సైన్సు మీద మా చర్చసాగింది. ఖగోళరహస్యాలు కూడా వచ్చేశాయి. తెల్లవారి పోయింది. శర్మగారికి అలసట వల్ల నిద్ర పట్టేసింది. తెల్లవారాక ఎర్రటి దుప్పటి కప్పుకుని వచ్చిచూస్తే మేం మాట్లాడుకుంటూనే వున్నాం. ఆ రాత్రి సంభాషణ మిస్సయినందుకు ఇప్పటికీ బాధపడుతుంటారాయన. అందుకు కారణం కూడా లేక పోలేదు. మేం మాట్లాడుకున్న సంగతుల్ని శ్రీమన్నారాయణ శర్మగారికి ఊరిస్తూ చెప్పేవారు.
ప్రజారచయితల సమాఖ్య ఆధ్వర్యంలో మేం ఏ సభ జరపాలన్నా, శర్మగారి ప్రమేయంతోనే. గౌతమీ గ్రంథాలయ ప్రాంగణంలోనే వీధి నాటకాలు వేశాం. మా ఇంటి దగ్గర నిత్యమూ సాహిత్య చర్చలు జరిగేవి. ఒమ్మి రమేష్ బాబు, నామాడి శ్రీధర్ తప్పని సరిగా వుండేవారు. తల్లావజ్ఝల శశి వస్తుండేవాడు. అందరికన్నా పెమ్మరాజు గోపాలకృష్ణ, ఆయన శ్రీమతి మాత్రం క్రమం తప్పకుండా వచ్చేవారు. సరిగ్గా ఆ రోజుల్లోనే నేను ’పంచమ వేదం’ కవితలు రాస్తున్నాను. వాటిల్లో శర్మగారి మీద రాసిన కవిత ’Sunny ధానం’ ఒకటి.
’స్నేహభాగ్య’ నగరం
ఎన్నిచేసినా, మొత్తానికి నేను రాజమండ్రి వదలక తప్పలేదు. అక్కడికీ సమాచారం సుబ్రహ్మణ్యం వెక్కిరించాడు కూడా. ’రాజమండ్రి కావాలా? రాష్ట్రపదవి కావాలా.? అంటే రాజమండ్రే కావాలంటాను.. అని అనేవాడివి కదా? మరి ఇదేమిటీ?’ అని. ఏం చేస్తానూ? ’ఇండియాటుడే’ మాదిరి తెలుగులో తెచ్చిన ’సుప్రభాతం’ పత్రికలో సంపాదకత్వ బాధ్యతగా అవకాశం. వదిలేసుకుందామనే అనుకున్నాను. కానీ మిత్రుడు ’కెమెరా’ విజయకుమార్ తిట్టి మరీ బయిలు దేరకొట్టాడు. అలా హైదరాబాద్ నివాసినయిపోయాను. మధ్యమధ్యలో రాజమండ్రి వెళ్ళే వంకన శర్మగారినీ, ఇతర మిత్రుల్నీ కలిసి వస్తుండేవాడిని. ఇక ఎప్పడయితే తొమ్మిది ఎడిషన్ల ’వార్త’ దినపత్రిక వ్యవస్థాపనలో ఏబీకే గారికి తోడుగా సహసంపాదక బాధ్యత వహించాల్సి వచ్చినప్పడు మాత్రం ఊపిరాడని పని. అయినా మా శర్మగారి ‘ప్రాణహిత’ను అందుకున్నాను. సమీక్షకూడా నా అంతట నేనే చేసి ఆ పత్రికలో ప్రచురించాను. తర్వాత ’ఆంధ్రప్రభ’ ప్రధాన సంపాదకుడిగా వున్నప్పడుకూడా శర్మగారు వచ్చిపోతుండేవారు. నేను స్థాపించిన ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం విద్యార్థులతో ఆయన ముచ్చటించేవారు కూడా. శర్మగారితో నాస్నేహం నాలుగు దశాబ్దాలు. నా కోసమే అన్నట్లు శర్మగారు కూడా హైదరాబాద్ వచ్చేశారు. నేను ఏ పుస్తకం రాసి ప్రచురించినా, ప్రతీ ఆవిష్కరణలోనూ శర్మగారు విధిగా వుంటారు. మా జర్నలిజం కళాశాల ’రజతోత్సవం’ లోనూ ఆయన పాల్గొన్నారు. వేలాది నా పూర్వ విద్యార్థుల సమక్షంలో నా స్నేహితుడని మా శర్మగారిని కరతాళ ధ్వనుల మధ్య పరిచయం చేశాను. అప్పుడు ఆయనకే కాదు, నాకూ కళ్ళు చెమ్మగిల్లాయి.
శర్మగారి అతిథి ప్రియత్వం గురించి తెలుగు సాహిత్యలోకంలో తెలియని వారుండరు. మా ఇద్దరి స్నేహం వ్యక్తుల వరకే కాదు, కుటుంబాలు దాటి వుంటుంది. శర్మగారి తమ్ముడు శాస్త్రి పాత్రికేయుడు. వాళ్ళ అన్నయ్య తీసుకున్న చనువునే నేను తీసుకున్నా నొచ్చుకోడు. శర్మగారి సహచరి శతకీర్తి గారికి శర్మగారే ప్రపంచం. శర్మగారింటికి వెళ్ళి భోజనం చెయ్యకుండా వస్తుంటే ఆవిడ డీలా పడిపోతారు. అందుకన్నా తినిరావలసి వుంటుంది.
శర్మగారు 80వ వసంతంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ ఉత్సవం ఏడాది పాటు సాగుతుంది. సాగాలి కూడా. తర్వాత 81 వస్తుంది. అప్పుడు నేను అంకెల స్థానాలు మార్చి చదువుకుంటాను. అంటే 18 అన్నమాట. నా మాట అబధ్ధమయతే, ’శర్మగారూ, మన యువకులంతా కలసి రాజమండ్రిలో యూత్ ఫెస్టివల్ చెయ్యాలనుకుంటున్నాం.’ అని చూడండి. ’నేను సరే, మిగిలి యువకులెవరు ఎవరొస్తున్నారూ?’ అని అడుగుతారు.
శర్మగారూ సారస్వత లోకం తలకిందులుగా కనిపిస్తోంది. కవిత్వం కానిది కవిత్వంగానూ, కథకానిది కథగానూ, పరిశోధన కానిది పరిశోధన గానూ చెలామణి అవుతుంది. విమర్ళ అయితే పరారీలో వుంది. ఆధునిక తెలుగు సాహిత్యానికి కొత్త నెత్తురు ఎక్కించాలి. అందుకు మీలాంటి వాళ్ళు చెయ్యాల్సిన కుర్ర పనులు చాలా వున్నాయి. స్టే యంగ్ ఫర్ టూ మోర్ డికేడ్స్. ఇది మీ పంచప్రాణహితుని వినయపూర్వక ఆదేశం.
*
అద్భుతమైన వ్యాసం అందించిన సహృదయ మిత్రులు సతీష్ చందర్ గారికి ధన్యవాదాలు.
ఆ వచనం హృదయాన్ని తాకి ఆనందపరవశుడిని చేసింది. రాజమండ్రి వెళ్లి వచ్చినట్లే అనిపించింది. శర్మగారికి ఈ అశీతి కానుక అనిర్వచనీయమైనది. నమస్సులు సర్.
నా పేరు గుర్తు పెట్టుకుని ప్రస్తావించడం మీ సహృదయత.
ధన్యవాదాలు మధునామూర్తిగారూ, నాన్నగారే కాదు, మీరన్నా, చలపతిగారన్నా నాకు ప్రత్యేక అభిమానం. అది ఎప్పుడూ నా హృదయంలో పదిలంగా వుంటుంది.