నైజాం ప్రభుత్వానికి సి. వి. కృష్ణారావు ‘నోటీసు’

కేవలం రెండు పేజీల్లో పట్టే అక్షరాల్లోనే కథకుడు ఆనాటి ఉద్రిక్త పరిస్థితిని కళ్ళకు కట్టేలా చెప్తాడు.

  ‘నెల నెలా వెన్నెల’తో తెలుగు నేలలో ఎంతో మంది యువ రచయితలకు స్పూర్తిగా నిలిచిన కవి, కథకులు, గ్రంథ సంపాదకులు చింతలపాటి వెంకట కృష్ణారావు. (3 జూలై 1926 – 12 ఆగష్టు 2019) వీరు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట తాలూకాలో జన్మించినా ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. వీరు రాసిన ‘వైతరణి’ వచన కావ్యం ఎంతో మంది విమర్శకుల మెప్పును పొందింది. ఇదేగాక వీరు ‘మాది మీ ఊరే మహారాజకుమారా’, ‘అవిశ్రాంతం’ అనే కవితా సంపుటాలను కూడా వెలువరించారు. 1993లో లాతూరు భూకంప బాధితులపై ‘కిల్లారి’ అనే దీర్ఘ కవితను వెలువరించారు. ఇది కూడా పలువురి ప్రశంసలను పొందింది. ఇదంతా ఒక వైపైతే వీరు కథకులు కూడా. ‘తోడేలు జగతి’, ‘భిక్షువు’, ‘విద్యా బోధ’ తదితర కథలు రాశారు. తెలంగాణ సాయిధ పోరాటంపై వీరు రాసిన నోటీసుకథ వీరి మొదటి కథ. ఈ కథ 1948 జూన్ లో విశాలాంధ్ర మాస పత్రికలో ప్రచురింపబడింది.

“ఈ ఫిర్కాలో పటేళ్ళు, పట్వారీలు, దేశముఖులు, జాగీర్దార్లు, పోలీసులతో కలిసి అపరిమితమైన దుండగాలు చేస్తున్నారు, కాబట్టి నేటి నుండి ఏ పోలీసు అధికారిగాని, ప్రభుత్వోద్యోగికాని, ఇంకెవరైనాగాని ప్రజలపై జులుం చేస్తే తగిన శిక్ష అనుభవిస్తారు.

షరా. ఈ నోటీసు ఎవరు చించుతారో వాళ్ళ పేరు నోటు చేసుకోబడుతుంది. జాగ్రత్త.”

ఇట్లు

ప్రజా రక్షణ సంఘం.

నైజాం పాలనలోని వైరా అనే గ్రామంలో ఒక గోడ మీద అంటించిన నోటీసు ఇది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఈ నోటీసును చూసిన ఒక పోలీసు దాన్ని ఎవరంటించారు? అని ఎవరి గోడమీదైతే ఆ నోటీసు అతికించబడిందో ఆ ఇంటి షావుకారుని పిల్చి అడుగుతాడు. ఏమో నాకు తెలియదంటాడు ఆ షావుకారు. దాన్ని చించేయమని షావుకారుకు చెప్తాడు. “నీవే చించెయ్యరాదు నాకేం బట్టింది. ప్రాణం మీదికి తెచ్చుకోను.” అంటాడు ఆ షావుకారు. హెడ్ కానిస్టేబుల్, అమీను కూడా వచ్చి ఊళ్ళో ఎవరితోనైనా చెప్పి ఆ నోటీసును చించివేయించాలని చాలా ప్రయత్నిస్తారు. కాని ఎవరూ దాన్ని చించడానికి ముందుకు రారు. “బారెడు తుపాకి మూరెడు టోపీ ఉంటే సరా? గుప్పెడు గుండె లేని ముండా నాయాళ్ళు” అంటాడు వీరప్ప అనే గ్రామస్తుడు. ఆ నోటీసును చూసి అమీను కూడా పెద్ద పులిని చూసి భయపడ్డట్టు భయపడుతూ ఊరు వాళ్ళను అమ్మనా బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు.

ఆ నోటీసు సంగతేందో చూద్దామని ఆ జిల్లా కలెక్టర్ కూడా మంది మార్బలంతో వస్తాడు. కానీ ఆ నోటీసును చించలేకపోతాడు. “అచ్చీ బాత్, నేను వరంగల్ నుంచి ఒక రజాకార్ ను పంపుతాను. అతను హిందువులాగా తలగుడ్డ చుట్టుకొని, ధోతీ కట్టుకొని, మీరడగంగానే ముందుకొచ్చి చించేట్టు ఏర్పాటు చేస్తాను. కానీ మీరు ఒక పని చేయాలి.

“చిత్తం ఏంటది?” అని ప్రశ్నిస్తాడు అమీన్.

వచ్చి చూసే జనంలో ఎవరి వద్దా కాగితం కలం లేకుండా చేయండి!!!” అంటాడు కలెక్టర్.

ఇది చాలా చిన్న కథే కాని ఒక అగ్ని పర్వతాన్ని కడుపులో దాచుకున్న కథ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ‘సంగం’ ఏర్పడటం గొప్ప మలుపు. మొదట తెలుగు భాషను రక్షించుకుందాం అనే ఉద్దేశంతో ప్రారంభమయిన ‘సంగం’ తరువాత పూర్తిగా ప్రజల పక్షం వహించి వెట్టి చాకిరీ, లెవీ ధాన్యం, దొరల, భూస్వాముల, పటేలు, పట్వారీల, రజాకార్లకు వ్యతిరేకంగా, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను పోరాట వీరులుగా మల్చడంలో విజయం సాధించింది.

క్రమంగా ప్రజలకు తలలో నాలుకలా మారి వారి రక్తంలో చైతన్యాన్ని, ధైర్యాన్ని నింపింది. దీనితో ప్రజలు దొరలకు, దేశ్ ముఖ్ లకు ఎదురు తిరిగారు. తరతరాలుగా చేస్తోన్న వెట్టికి వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం పిడికిళ్ళు బిగించారు. ఇట్లా ‘సంగం’ ప్రజలకు వెన్నుదన్నుగా నిల్చింది. ఈ కథ ‘సంగం’ యొక్క పాత్రను చాలా బలంగా చెప్పింది. పోలీసుల భీరత్వాన్ని చాలా సున్నితమైన హాస్యంతో చెప్పిన తీరు కథకుని శిల్పం అమోఘమైంది. ఒక చిన్న పోస్టర్ ద్వారా మొత్తం సాయిధ పోరాట ప్రభావాన్ని, ‘సంగం’ ప్రాధాన్యతను చెప్తాడు కథకుడు. ఆ పోస్టర్ ను చించుమని ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి అన్న్తట్లు “అందరూ క్రింది స్థాయి అధికారులను దబాయిస్తారేగాని, దానిని చించేయడానికి ఎవరూ సాహసించరు. చివరికి ఏం చేశారంటే ఎవరి చేతిలోనూ కాగితం, కలం లేకుండా చేయండి అని చెబుతారు.”

రాజ్యం అప్పుడైనా, ఇప్పుడైనా ఒకేలా ప్రవర్తిస్తుందనడానికి ఈ కథ గొప్ప ఉదాహరణ. కథకుడి క్రాంతదర్శనానికి కూడా గీటురాయి. ఇప్పటికి కూడా విప్లవకారుల చేతిలో కాగితం, కలం లేకుండా చేయడానికి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విఫలయత్నం చేస్తూనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రజా పోరాట శక్తి ముందు ఏ అధికారం నిలబడదని ఈ కథ చాలా సూక్మంగా చెప్పడం అబ్బురపరుస్తుంది. సాయుధ పోరాటాన్ని నేపథ్యంగా తీసుకొని చాలా కథలే వచ్చాయి.

కాని సి. వి. కృష్ణారావు ఒక చిన్న సంఘంటనను కేంద్రంగా తీసుకొని అంత పెద్ద పోరాటాన్ని చిన్న అద్దంలో చూపించారు. కథానికకు క్లుప్తత, సంక్షిప్తత ప్రాణం ఆ ప్రాణాన్ని శరీరం నిండా నింపుకున్న కథ ఇది. కేవలం రెండు పేజీల్లో పట్టే అక్షరాల్లోనే కథకుడు ఆనాటి ఉద్రిక్త పరిస్థితిని కళ్ళకు కట్టేలా చెప్తాడు. మెరుపులాంటి, తుపాకి దెబ్బలాంటి ముగింపునివ్వడం ద్వారా కథకు నాలుగు కాలాలపాటు నిలబడే జీవశక్తి లభించింది. ప్రజా ఉద్యమ శక్తిని, ‘సంగం’ ప్రభావాన్ని దేదీప్యమానం చేయడానికి ఈ కథలోని ప్రతి అక్షరం శక్తి వంచన లేకుండా ప్రయత్నించింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కథల్లో ఈ కథ ఎప్పటికీ వెల్చిపోని ఎర్రెర్రని పోస్టర్.

(12 ఆగష్టు 2019న అనారోగ్యంతో హైదారాబాద్ లో మృతిచెందిన సి. వి. కృష్ణారావు గారికీ అక్షర నివాళి)    

నోటీసు కథ

 

శ్రీధర్ వెల్దండి

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నోటీస్ కథద్వారా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పటేల్ పట్వారీలు దేశ్ముఖ్లు భూస్వాములు సామాన్యజనానికి ఎంత భయభ్రాంతులకు గురయ్యా రో తెలుపుతుంది.

    సంగం ప్రభావం వల్ల ఏ అధికారి అలసత్వం అక్కడ బయట పడింది పూసగుచ్చినట్టు గా వివరించిన విమర్శకు లకు మంచి విశ్లేషణ అందించిన డాక్టర్ వెల్దండి శ్రీధర్ గారికి ధన్యవాదాలు.

    పత్రిక యాజమాన్యానికి సంపాదకులకు కృతజ్ఞతలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు