నేనూ- నా క్రికెట్టూ

క్రిందటి సారి వ్యాసం లో నేను భారత దేశం వదలిపెట్టి అమెరికాలో అడుగుపెట్టిన వివరాలు వ్రాశాను కదా!. ఇక అమెరికాలో నా జీవితం గురించి వ్రాయడం మొదలుపెట్టే ముందు ఇండియా జీవితం లో ముఖ్యమైన పాత్ర వహించిన నా క్రికెట్ జ్ఞాపకాలు కొన్ని ప్రస్తావిస్తాను. ఇంచుమించు నా ఏడూ, ఎనిమిదేళ్ళ నుంచి అమెరికా లో అడుగుపెట్టిన ముఫై ఏళ్ళ దాకా అడపా దడపా క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. ఇక్కడికి వచ్చాక బేట్ ఎత్త లేదు. బౌలింగ్ చెయ్య లేదు. ఆ బేస్ బాల్ చూసినప్పుడల్లా అమెరికాని తిట్టుకోడం మాన లేదు.

మా చిన్నప్పుడు మా చిన్నవాళ్ళందరికీ “గాంధీ నగరం క్రికెట్ టీమ్” అంటే నేను కేప్టెన్ గా సుమారు పదేళ్ళు నడిపిన టీమ్ అనే లెక్క. నేను కాకినాడ గాంధీనగరం లో మ్యునిసిపల్ హై స్కూల్ లో చదివిన మాధ్యమిక, ఉన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి దాకా మా క్రికెట్ టీమ్ లో సభ్యులలో కొంత మంది మా తమ్ముడు ఆంజి అనే హనుమంత రావు, ఏడిద ముని సమ్రాట్ (శంకరాభరణం సినిమా నిర్మాత ఏడిద నాగేశ్వర రావు తమ్ముడు),  నారాయణాచారి, గోపాలాచారి, చంటి గాడు, ముమ్మిడి సూర్యనారాయణ, తంబి అనే దేశికాచారి…..తమ్ముడు అనే బాలాంత్రపు వెంకట రమణ అనే ఈ నాటి ప్రముఖ రచయిత బి.వి. రమణ. వీళ్ళలో మా తమ్ముడు కాలిఫోర్నియాలో ఉంటాడు. నారాయణాచారి చదువు ఆపేసి కాకినాడలోనే బస్సు కండక్టర్ గా పని చేసి, చిల్లర డబ్బుకి కక్కుర్తి పడి దొంగతనం చేసి కొన్నాళ్ళు జైలు లో ఉన్నాడు. ఆ మధ్య కాకినాడ వెళ్ళినప్పుడూ ముని సమ్రాట్ ని కలిశాను. సుమారు 60 ఏళ్ళ తర్వాత తంబి రెండు నెలల క్రితం ఇంటర్ నెట్ లో నా పేరు చూసి కెన్యా లో నైరోబీ నుంచి ఫోన్ చేశాడు. తెగ మాట్లాడేసుకున్నాం. ఈ తంబి గాడు వీర బేట్స్ మన్. వాడు కొట్టిన బంతిని చెయ్యి పెట్టి ఆపామంటే వేళ్ళు విగాల్సిందే!. ఇప్పటి సంగతి అడిగితే నవ్వేశాడు. ఇక బి.వి. రమణ కొన్నేళ్ళు యెమెన్ లో ఉండి ఇప్పుడు ఇండియాలో ఉండి, తెలుగు సాహిత్యం , పద్య మదురిమల మీద మంచి రచనలు చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. చిన్నప్పుడు అతడిని నా సైకిల్ మీద వెనకాల కూచోబెట్టుకుని క్రికెట్ మేచ్ లకి తీసుకు వెళ్ళేవాడివి అన్నయ్యా అని చెప్తాడు రమణ. ఇప్పుడు నాకు సైకిలూ లేదు. ఉన్నా అతనిది వెనకాల సీట్ మీద కూచునే విగ్రహం కాదు.  ఈ మధ్యనే నా మీద అభిమానం కొద్దీ తన తాజా పుస్తకం “పారిజాతాపహరణం’ నాకు అంకితం ఇచ్చాడు రమణ.

ఒక సారి మైన్ బిల్డింగ్ ఎదురుగుండా ఉండే రెండో క్రికెట్ పిచ్ (అసలు పెద్ద మేచ్ లు ఆడే మైన్ పిచ్ వెనకాల పెద్ద గ్రౌండ్స్ లో ఉండేది.) మేచ్ లో నేను టూ డౌన్ బేట్స్ మన్ గా క్రీజ్ లోకి వచ్చాను. అవతల మాధవ్ అనే సీనియర్ ఫాస్ట్ బౌలర్. రెండు, మూడు బంతులు నేను బాగా ఆడగానే అతనికి కోపం వచ్చి పెద్ద బౌన్సర్ వేశాడు. పొట్టి వెధవని కాబట్టి అది తిన్నగా నా ఎడం కన్ను ని పూర్తి స్పీడ్ ఢీకొట్టింది…ఇంకేముందీ….నేను ధభీ మని కళ్ళు తిరిగి, ఒళ్ళు తిరిగి కింద పడి గంట దాకా లేవ లేదు. లేచాక ఆ కన్ను పూర్తిగా దెబ్బ తిని, ఒక నెల పాటు గుడ్డిది అయిపోయింది. ఆ తరువాత చూపు పూర్తిగా వచ్చేసింది కానీ, సైజు మటుకు చిన్నదిగానే ఉండిపోయింది….ఇప్పటికీ…నా కుడి కన్ను కన్నా ఎడం కన్ను చిన్నదిగా ఉంటుంది…కానీ ఎవరికైనా కన్ను కొట్టడానికి అదేం ఇబ్బంది కాదుగా ! ఒక సారి బాపు గారు “మీ బొమ్మ వేసి ఇస్తాను, అభ్యంతరం లేదుగా” అని నా మొహం వేపు చూసి, అర క్షణం లో “మీ కన్ను లొట్టబోయింది. ఎవరైనా చెయ్యి చేసుకున్నారు ఏమిటి?” అని అడిగి నా చేత పై విషయం చెప్పించుకున్నారు.

ఇక మా టీమ్ కి పోటీగా కాకినాడలో ఐ.ఎస్. రాజు నాయకత్వం లో సూర్యారావు పేట టీమ్, జగన్నాధపురం లో ఆంగ్లో-ఇండియన్స్ టీమ్ ఉండేవి. కాకినాడ లో ప్రముఖ డాక్టర్ ఇవటూరి జోగారావు గారి ఆసుపత్రి మైన్ రోడ్ మీద టౌన్ హాల్ క్లబ్ ఎదురుగుండా ఉండేది. ఆయన కొడుకులు సన్యాసి రాజు, రామ్, వెంకటేష్, చావలి రామ సోమయాజులు మొదలైన వాళ్ళు ఆ టీమ్ లో ఆడేవారు. అందులో రాజు నాకు ఇంజనీరింగ్ లో ఒక ఏడాది సీనియర్. ఇప్పుడు వర్జీనియాలో ఉన్నాడు. చావలి రామం, అతని సతీమణీ బాల హ్యూస్టన్ లోనే మంచి కుటుంబ స్నేహితులు. ప్రతీ నెలా మా మూడు టీమ్ లూ పి.ఆర్. కాలేజ్ లోనో, మెక్లారిన్ హై స్కూల్ లోనో “టెస్ట్”  మేచ్ లు ఆడేవాళ్లం. నేను ఆల్ రౌండర్ ని. నెంబర్ టు బేటింగ్, ఆఫ్ స్పిన్ బౌలింగ్మ్ కవర్స్ లో ఫీల్డింగ్ నా ప్రత్యేకతలు. ఆడినన్నాళ్ళూ మంచి పేరే తెచ్చుకున్నాను.  క్రికెట్ ఆడుకోవడమే కాకుండా, అన్ని దేశాల క్రికెటర్ల ఫొటోలు సేకరించి ఒక ఆల్బమ్ తయారు చెయ్యడం మాకు ఒక పెద్ద హాబీ గా ఉండేది. ఈ ఫొటోలకి మూలాధారం ఆ రోజుల్లో వచ్చిన స్పోర్ట్ ఇల్లస్త్ఱేటెడ్ అని జ్ఞాపకం.. ఆ అద్భుతమైన పత్రిక లో  బ్లాక్ & వైట్ ఫొటోలు చాలా గొప్ప స్పూర్తి దాయకంగా ఉండేవి.  మేము వాటిని అదే షేప్ లో కత్తిరించి ఆల్బమ్ లో అతికించుకునే వాళ్ళం. ఆ నాటి అతి గొప్ప క్రికెటర్ లలొ కొంత మంది పీటర్ మే, కోలిన్ కౌడ్రే, కెన్ బేరింగ్టన్, జెఫ్ బాయ్ కాట్(ఇంగ్లండ్),  బాబ్ సింప్సన్, నీల్ హార్వే, రిచీ బెనౌ (ఆస్త్రేలియా), గారీ సోబర్స్, రోహన్ కన్హయ్, క్లైబవ్ లాయడ్ (వెస్ట్ ఇండీస్) మొదలైన వారు. వీరిలో వెస్ట్ ఆటగాళ్ళందరినీ నెను బొంబాయి లో చూసి తరించాను. ఆ వివరాలు తర్వాత…..దక్షిణ ఆఫ్రికా టీమ్ కూడా టెస్ట్ మేచ్ లు ఆడేది కానీ అప్పటి జాతి వివక్షత వలన వాళ్ళు ఇండియా తో ఆడేవారు కాదు. కేవలం తెల్ల దేశాలైన ఇంగ్లండ్, ఆస్త్రేలియా, న్యూజీలండ్ ల తోనే ఆడేవారు. మేము ఏదైనా మా “టెస్ట్” మేచ్ లు ఆడుతున్నప్పుడూ, ఇంటికొచ్చాకా కూడా, ఆ ఆల్బమ్ తీసి అందులో నీల్ హార్వేలా స్క్వేర్ డ్ఱైవ్ కొట్టానా లేదా, గిబ్స్ లాగా ఆఫ్ స్పిన్ వేశానా లేదా అని తెగ మథన పడిపోయేవాళ్ళం.  మా చిన్నప్పటి క్రికెట్ ఫొటోల కోసం వెతికితే మా తమ్ముడిదీ, నాదీ ఒక్కొక్కటి దొరికింది.

కాకినాడలో ఉండగా క్రికెట్ అంటే కొమ్మిరెడ్డి కుటుంబమే. ఆ మాటకొస్తే 1960 లలో ఆంధ్రా క్రికెట్ అంటే కూడా ఈ కొమ్మిరెడ్డి పెద కాపులే. కె. వెంకట రమణ మూర్తి, అతని తమ్ముడు ప్రభాకర రామ్మూర్తి, గోపన్న, భావన్న, నాయన వీళ్ళే ఆ నాటి రంజీ ట్రోఫీ కి ఆంధ్రా టీమ్ ప్రధాన ఆటగాళ్ళు. ఆంధ్రా టీమ్ లో ఇంకా ఏలూరు నుంచి జి,వి.ఎస్ రాజు కూడా ఆడేవారు. ఇక వైజాగ్, గుంటూరు మొదలైన ఇతర నగరాల ఆటగాళ్ళు ఏదో నామకహానే. అప్పుడు హైదరాబాద్ టీమ్ విడిగా ఉండేది.. కొమ్మిరెడ్డి వారు కాక పెద్దడ్డాల (ఎ. ఎస్. శాస్త్రి), చిన్నడ్డాల, గొల్లకోట శ్రీరామ్, ‘బూతుల’ రంగా, అతని తమ్ముడు పంతులు, కూనపులి ప్రసాద్, వి.వి.యస్. భగవాన్, మా ఇంటి ఎదురుగా ఉన్న మా తంబి వాళ్ళ అన్నయ్యలు వేణుగోపాలాచారి, సారధి  కూడా చాలా బాగా ఆడేవారు కానీ వీళ్ళందరూ బ్రాహ్మలు కాబట్టి కె.వి.ఆర్. మూర్తి, గోపన్న ల నాయకత్వం లోనే ఆడేవారు.  వీళ్ళందరితో మా చిన్నన్నయ్య కూడా ఆడేవాడు. అప్పుడప్పుడు శని, ఆదివారాలలో మా పెరట్లోనే ‘పిచ్’ వేసి వాళ్ళు ఆడుతుంటే మేము బంతులు అందించే వాళ్ళం. వీరిలో కె.వి,ఆర్. మూర్తి ఒకడే ఒక సీజన్ లో రంజీ ట్రోఫీలో ఐదారు సెంచరీలు కొట్టి ఇండియా టెస్ట్ టీమ్ కి ఎంపిక అవబోయి అవలేదు. ఆ ఎంపికల మేచ్ నేను బొంబాయి లో చూశాను. ఆ వివరాలు తర్వాత….ఇక ఆ నాటి ఇండియా టెస్ట్ ఆటగాళ్ళ లో నేను చూసిన వారు చాలా మందిలో ముఖ్యులు టైగర్ నవాబ్ ఆఫ్ పటౌడి, చందు బోర్డె, నారీ కాంట్ఱాక్టర్, పోలీ ఉమ్రీగర్, విజయ్ మంజ్రేకర్, సలీమ్ దురాని, ఫరూఖ్ ఇంజనీర్, సుభాష్ గుప్టె, బి. ఎస్. చంద్రశేఖర్, వెంకట రాఘవన్, వడేకర్, బాపు నడ్కర్ణి, పంకజ్ రాయ్, రుసి సూర్తి, మొహమ్మద్ ఆలి, దిలీప్ సర్దేశాయ్, బి.ఎస్. బేడి, ప్రసన్న, బుధి కుందేరన్, గుండప్ప విశ్వనాథ్ మొదలైన వారు. విజయ్ మర్చెంట్, మహరాజ్ కుమార్ ఆఫ్ విజయనగరం (విజీ) మొదలైన వాళ్ళు ప్రముఖ కామెంటేటర్లు. టీవీలలో ప్రత్యక్ష ప్రసారాలు లేని ఆ రోజుల్లో టెస్త్ మేచ్ అయినా రంజీ ట్రోఫీ అయినా భారత దేశం అంతా రేడియో కి అతుక్కు పోయి వాళ్ళ రన్నింగ్ కామెంటరీ వింటూ మిగతా ప్రపంచాన్ని మర్చిపోవలసిందే. ఇక క్రికెట్ ఆటగాళ్ళకి ఒకటే డ్రెస్…తెలుపు…అంతే…ఇప్పటిలాగా రంగు రంగుల షోకులూ, వాటి మీద జోళ్ళు, బూట్లు, కోకోకోలా ల ప్రకటనలూ లేవు. ఆ తెల్ల చొక్కా మీద రంగు బోర్దర్ ఉన్న తెల్ల స్వెట్టర్ వేసుకునే వారు. ఆట ముందు అందరూ నీల బ్లేజర్ వేసుకున్న ఫొటో అద్భుతంగా ఉండేది. చిన్నా, పెద్దా మేచ్ లలో కూడా అలాంటి బ్లేజర్ వెసుకోడానికి  అర్హత సంపాదించుకుంటేనే కుదురుతుంది. నేను ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్ళాక ఆ  అర్హత సంపాదించుకున్నాను.

నేను పి.ఆర్. కాలేజ్ లో పి.యు.సి లో చేరగానే కాలేజ్ టీమ్ కి సెలెక్ట్ అవలేదు కానీ, ఆ క్రికెట్ ముఠా లో ఉండేవాడిని. ఆ రోజుల్లో రామారావు గారు అని మొత్తం ఆంధ్రాకి చాలా పేరున్న ఒక క్రికెట్ కోచ్ ఉండేవారు. ఒక సారి ఆయన ని పిలిపించి నెల రోజుల కోచింగ్ కేంప్ పెట్టించాడు వెంకట రమణ మూర్తి.దానికి స్పెషల్ కోచ్ గా హైదరాబాద్ నుంచి టెస్ట్ స్పిన్నర్ మొహమ్మద్ ఆలీ ని కూడా పిలిపించారు. నెల రోజుల పైగా జరిగిన ఈ కేంప్ కి రోజూ పొద్దున్నే ఐదు గంటలకల్లా పి. ఆర్. కాలేజ్ క్రికెట్ స్థలానికి వెళ్ళి సుమారు ఎనిమిది దాకా….అంటే మా క్లాసులు మొదలయ్యే దాకా ఈ ట్రైనింగ్ చాలా స్ట్రిక్ట్ గా సాగేది.  బేటింగ్, రకరకాల బౌలింగ్, ఫీల్డీంగ్, వికెట్ కీపింగ్…ఒకటేమిటి…అన్ని విభాగాలలోనూ రోజుకి 4 గంటల కోచింగ్ అయ్యాక, ఆఖరి శని ఆది వారాలు మమ్మల్ని రెండు టీములు గా విడదీసి మేచ్ పెట్టారు. అందులో ఒక టీమ్ కి నేనూ, రెండో టీమ్ కి కె.వి.అర్. మూర్తి ఆఖరి తమ్ముడు రాజగోపాల్. ఒక గొప్ప కోచ్ రామారావు గారు అయితే, ఒక టెస్ట్ ఆటగాడి దగ్గర కూడా కోచింగ్ తీసుకునే అదృష్టం నాకు దక్కింది….1960 లో….

1960 అనగానే అప్పుడు జరిగిన ఒక సరదా విషయం చెప్ప బుద్ధి వేస్తోంది. ఆ రోజుల్లో మాకు ఆరాధ్యదైవంగా హైదరాబాద్ కి చెందిన అందాల ఆటగాడు అబాస్ అలి బైగ్. 1959 లో అతను ఇంగ్లండ్ లో ఆక్స్ ఫర్డ్ లో చదువుకుంటూ ఉండగా, ఇండియా క్రికెట్ టీమ్ ఇంగ్లండ్ మీద మూడు టెస్ట్ లు ఓడిపోయింది. నాలుగో దానికి గత్యంతరం లేక అక్కడే ఉన్న అబ్బాస్ అలి బైగ్ ని పిలిచారు. అప్పటికి అతని వయసు కేవలం 20 ఏళ్ళు. అది అతని మొట్టమొదటి టెస్ట్ ఇన్నింగ్స్. అందులో అతను సెంచరీ చేసి, అతి చిన్న వయసులోనే, మైడెన్ సెంచరీ కొట్టిన…అందునా పరాయి దేశం లో ఆ రికార్డు సాధించిన ఘనత అతనిది. అందుకు అతను మాకు ఆరాధ్య దైవం అయితే, ఆ తర్వాత ఏడు..1960 లో అతను కాన్పూర్ టెస్ట్ లో హాఫ్ సెంచరీ కొట్టగానే గేలరీ లో నుంచి ఒక అమ్మాయి పిచ్ దాకా పరుగెట్టుకుని వెళ్ళి అతడిని గట్టిగా, పబ్లిగ్గా ముద్దు పెట్టుకుని మళ్ళీ పరిగెట్టుకుని వెనక్కి వచ్చేసింది. చూస్తున్న యాభై వేల మంది నిర్ఘాంత పోయారు. అతనికి నోట మాట లేదు. అంతా నిశ్శబ్దం.  అందరికీ తేరుకోడానికి చాలా సమయం పట్టింది. ఆ నాటి సాంఘిక వాతావరణం అటువంటింది. టీవీలు లేని ఆ రోజుల్లో రేడియో ద్వారానే దేశం అంతా గుప్పుమన్న ఈ వార్త సంచలనం మీద సంచలనం. ఆ అందాల ఆటగాడు, ఆ ముద్దుల సంఘటన ఫొటో ఇక్కడ పడుతున్నాను. అయితే ఆ అబ్బాస్ అలి బైగ్ టెస్ట్ లలో ఎక్కువ రాణించ లేదు కానీ రంజీ ట్రోఫీలలో రికార్డులు సృష్టించి ఈ మధ్యనే మరణించాడు.

ప్రి యూనివర్శిటీ లో నాకు వచ్చిన మార్కుల ని బట్టి నాకు ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ముందు సీటు వచ్చింది కాబట్టి అక్కడ చేరిపోయాను. అక్కడ చదివినది ఒక్క ఏడాదే. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరానికి కాకినాడ ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాను. అయితే ఆ ఒక్క ఏడాదిలోనూ నా క్రికెట్ మూడు పువ్వులూ, ఆరు కాయలుగానే సాగింది. అదెలాగో ఆ వివరాలూ, నేను ఎబ్ డెన్ టోర్నమెంట్ లో ఆడడం, ఇంకా తర్వాత బొంబాయి లో టెస్ట్ మేచ్ లు చూసి తరించడం….ఇవన్నీ తరువాత సంచికలో…

*

వంగూరి చిట్టెన్ రాజు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు