“నువ్వు వలస పోతే…… ” వెంట వచ్చేవి కొన్ని!

మెరికాకి 1986 ఆగష్టు 20న వచ్చాను. ఎవరో ఒక ఆఫ్రికన్ రచయిత అన్నాడు: ‘నువ్వు వలస పోతే, నిన్ను నువ్వు వదిలి పోయినట్లే’ అని. అది నిజమే. చిన్నతనాన్ని, పెరిగిన ప్రాంతాల్ని, తెలిసిన మనుషుల్ని మాత్రమే కాదు వదిలేసి వెళ్ళింది. అమ్మ చేతి పచ్చడి రుచినీ, బజార్లో మురుగు వాసనతో కలిసిన మల్లె పూల వాసనలనీ, రొణగొణ ధ్వనుల మధ్య లౌడ్ స్పీకర్ లలో తెలుగు పాటల్నీ మాత్రమే కాదు. అపరిచితుల కుతూహలాన్నీ, చెప్పకుండా వచ్చే అతిథులనీ, ఎప్పుడూ తెరిచి ఉంచే తలుపులనీ మాత్రమే కాదు. అందం, ఆనందం, అర్థం, పరమార్థం — వీటి నిర్వచనాలు వదిలేసి వచ్చినట్లు అప్పుడు అనిపించింది. 

అది నిజమే. నేర్చుకున్నదంతా, తెలుసుకున్నదంతా, అనుకున్నదంతా ప్రశ్నించుకోవడం ఈ వలస ఇచ్చిన శాపం. తెలిసిన భాష, చదివిన భావోద్వేగ కవిత్వం, నేర్చిన మమతలు, మర్యాదలు ఇవి వదిలి రావడం ఒక శాపం లాగ తోస్తే, మరొక విధంగా ఒక వరం. ప్రశ్నించరాని సెంటిమెంటల్ విషయాలు, మతం లాంటి భావజాలం, మందితో కలిసి నేర్చుకొన్న సౌందర్యానుభూతులు, ఇవన్నీ మరొక్క సారి మొదటి నుంచి ప్రశ్నించుకుంటూ నేర్చుకోగలగటం, ఒక సరి కొత్త ప్రపంచ దృక్పథాన్ని ఏర్పరుచుకోగలగటం ఒక వరం. 

అవన్నీ, నాకు అప్పుడు తెలిసింది కాదు. పచ్చళ్ళతో బాటు, పది పుస్తకాలు నాతో తెచ్చుకున్నాను. గీత గోవిందం,  టాగోర్ నాటకాల అనువాదాలు, కొ కు రచనలు, బైరాగి కవితలు — ఇలాగ మాటి మాటికీ చదువుకునే పుస్తకాలు తెచ్చుకున్నాను. ఒక సెమిస్టర్ పాటు ఈ పుస్తకాలే మళ్ళీ మళ్ళీ చదివి చివరికి బోరు కొట్టే వరకు చదువు కున్నాను. సెమిస్టర్ అయ్యేసరికి ఇదీ పరిస్థితి: గీత గోవిందం మటుకు వినడం, చదవడం కన్నా మంచిది. బైరాగి కవితలు చదవగా,  చదవగా  సరి కొత్త అర్థాలు కనబడతాయి. మిగిలినవి ఇక చదివింది చాలు. అప్పుడు అమెరికా సాహిత్యం గురించి చదివి మూలాల నుంచీ తెలుసుకోవాలనిపించింది.

అంతవరకూ నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదివినా, అవి ఇంగ్లాండ్ పుస్తకాలు. ఒక మార్క్ ట్వైన్ ను చదివాను. జాక్ లండన్  ను చదివాను. స్టెయిన్బెక్ చదివాను. ఇలాగ అడపా దడపా చదివినా, నాకు అమెరికా అంటే ఇంగ్లాండు కి వేరే దేశం అనే భావం కలగలేదు. ఫారిన్ అంటే ఒక దేశం లాగ, అన్నిటినీ ఒకే విధంగా భావించాను. ఇంగ్లాండ్ కీ అమెరికా కీ ఉన్న తేడాలు తెలియలేదు. అసలు అమెరికా అంటే ఏమిటి? అమెరికన్ పుస్తకాలు ఏమిటి? ఆ సాహిత్య లోకం ఎలాగ ఉంటుంది? ఇవన్నీ అప్పటికి అసలు అవగాహనలో లేవు. 

నేను అమెరికాకి వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు నా రూమ్ మేట్ ఒక అమెరికన్. అతను సాహిత్యాభిమాని కాడు.  అతడి గర్ల్ ఫ్రెండ్ ఆంథ్రోపాలజీ విద్యార్ధిని. తరువాతి రోజుల్లో వారిద్దరు వివాహం చేసుకున్నారు. అది వేరే సంగతనుకోండి. ఆమె తండ్రి ఇంగ్లిష్ టీచర్.  ఆమె నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చింది. ఇక్కడ ఆదిమ జాతి ప్రజల గురించి పుస్తకాలే కాకుండా, మనం ఇండియాలో చదవని పుస్తకాలు, అంటే న్యూ ఇంగ్లాండ్ రచయితల పుస్తకాలు నాకు పరిచయం చేసింది. అప్పుడే ఎమెర్సన్, థేరో, హాథర్న్, డికెన్సన్ ఇటువంటి వాళ్ళ రచనలు చదివే వాడిని. అవి నాకు మరీ కొత్తగా అనిపించలేదు. అప్పటికే ఇంగ్లాండ్ పుస్తకాలు చదివి ఉన్నానేమో కానీ, వీటికి ఇంగ్లాండ్ పుస్తకాలకీ మధ్య పెద్ద వ్యత్యాసం కనిపించలేదు.  ముఖ్యంగా ఈ పుస్తకాలు అందరూ చదివే పుస్తకాలు కాదు!No description available.

అప్పట్లో, బుక్ అఫ్ ది మంత్ అని ఒక క్లబ్ ఉండేది. ప్రతి నెలా కొన్ని పుస్తకాలు పంపేవారు. మనం వద్దనుకుంటే వారికి ఉత్తరం రాస్తే పంపకుండా ఆపుతారు. మర్చిపోయామా, మనకి పుస్తకాలు వచ్చేస్తాయి, మనం బిల్లు కట్టుకోవాలి. చేరేటప్పుడు ఎర లాగ బోలెడు పుస్తకాలు ఉచితంగా పంపుతారు. నేను అప్పుడు విల్ డ్యూరాంట్ రాసిన స్టోరీ అఫ్ సివిలిజేషన్ 11 వాల్యూములు అలా సంపాదించాను. అవి రిఫరెన్స్ పుస్తకాలు అని తెలియక, మొదటి నుంచీ చదవడం మొదలు పెట్టాను! మొదటి రెండు వాల్యూములు చదివి ఆపి వేశాను. (ఆ పుస్తకాల నిండా అన్నీ పొగడ్తలే. దాంతో పుస్తకాలతో చిక్కు వచ్చేసింది. అప్పుడే చదివిన డిస్కవరీ అఫ్ ఇండియా, గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ లాంటి నెహ్రు రాసిన పుస్తకాలే మెరుగు అనిపించింది. నాకు కావలసినది నిజాలు కాదు, నిజాన్ని అర్థం చేసుకునే విధానాలు! 

ఆ బుక్ ఆఫ్ ది మంత్ క్లబ్ వల్ల మరో ఉపయోగం కలిగింది. అందరూ ఏవేవి చదువుతున్నారు అని తెలిసి వచ్చింది. పోయెట్రీ పుస్తకాలు ఉండేవి కావు కానీ, నాన్ ఫిక్షన్ మటుకు ఎక్కువగా పంపేవారు. పవర్ అఫ్ మిత్ లాంటి పుస్తకాలు ఆ క్లబ్ ద్వారానే చదివాను. ఇంకా ఇంగ్లీష్ భాష చరిత్ర చదివాను. యూరోపు చరిత్రలో మలుపు రాళ్ల గురించి చదివాను. ముఖ్యంగా ఆర్ట్ మీద అనేక పుస్తకాలు చదివాను, బొమ్మలు చూశాను.  కవితా విప్లవాలకి, కళా విప్లవాలకి, రాజకీయ, సాంఘిక, ఆర్ధిక విప్లవాలకి మధ్యన ఉండే సంబంధాలు వెతుక్కుంటూ చదివాను.  

ఆరోజుల్లో రెండు విషయాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. మొదటిది ఏమిటంటే, మొదటి సంవత్సరం వేసవి సెలవుల్లో వచ్చిన అవకాశం. నేను ఫెలోషిప్ మీద చదువుకోవడానికి వెళ్లడం వల్ల అన్ని ఖర్చులూ కాలేజ్ వాళ్ళే పెట్టుకునే వారు. ఎండాకాలం మాత్రం రీసెర్చ్ ప్రోగ్రాం కింద మన ఖర్చుకు డబ్బు తెచ్చుకోవాలి. నేను వెళ్లిన ఆరు నెలలకే పీహెచ్డీ మొదటి పరీక్షలు రాసి పాసయి ఉండటం వల్ల ఒక ప్రొఫెసర్ గారికి నేనంటే బాగా గురి కుదిరింది. ఆయనే వచ్చి, నన్ను ఆ ఎండాకాలం తన ప్రాజెక్ట్ లో  పని చేయమని అడిగాడు. రెండు నెల్ల తర్వాత ఆయన ఎండాకాలం అయిపోగానే ఇండస్ట్రీ కి వెళ్లి పోతాడని తెలిసింది. నాకు రీసెర్చ్ కి డబ్బులు ఇచ్చాడు కానీ, నా మానాన నన్ను వదిలి వేసాడు. 

ఆ రోజుల్లో నా పని ఇలాగ ఉండేది. పొద్దునే తిని, లైబ్రరీ కి వెళ్ళేవాడిని. ఒక మూలకి పోయి, కూర్చొని, సాయంత్రం వరకు వేస్ట్ ల్యాండ్ తీసుకొని చదివే వాడిని. అంటే, ఆ పుస్తకమే కాదు, దాని మీద వచ్చిన పరిశోధనా గ్రంథాలు. ఇంకా, దాన్ని ఎజ్రా పౌండ్ ఎడిట్ చెయ్యక ముందు ఉన్న పాఠాంతరం. ఇంకా తన చేతి రాతతో రాసిన ప్రతి. ఇలాగ చదివాను. ఇంకా దాని వెనక రాసిన ఫుట్ నోట్స్ లో ఉన్న పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను. అంటే ముందు బైబుల్ చదివాను. అసలు కింగ్ జేమ్స్ వెర్షన్ అయితే అందులో అపోక్రిఫా (అంటే అనధికార విషయాలు) ఉండవని, జెరూసలేం వెర్షన్ చదివాను. స్పెన్సర్, డాంటే, బోడిలైర్, గ్రీక్ ఇతిహాసాలు…ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి కూడబలుక్కుంటూ చదివాను. ఎండా కాలం అయేసరికి ఒక నాలుగో వంతు వరకూ ఆ ఫుట్ నోట్స్ శోధించగలిగాను. 

ఈ పుస్తకాలు నాకు అమెరికా గురించి ఏమీ నేర్పలేదు కానీ, పశ్చిమ దేశాల చరిత్రలో ఉన్న రెండు అంశాలు నేర్పింది. ఒకటేమో, యూదు, క్రైస్తవ సంప్రదాయాల నుండి వచ్చిన కథలు, నమ్మకాలు. మరొకటేమో, గ్రీక్, రోమన్, నోర్స్ సంప్రదాయాల నుండి వచ్చిన కథలు, కళాభిరుచి. ఈ రెంటికీ మధ్యన ఉండే సంఘర్షణ ఉన్నప్పటికీ, ఇవి రెండూ ప్రాచీన చరిత్రలాగా ప్రతి ముఖ్య గ్రంథం లో అంతర్లీనంగా కనబడతాయి. నేను ఈ  వేస్ట్ ల్యాండ్ తో మళ్ళీ పాశ్చాత్య సాహిత్యం మొదలు పెట్టడం వల్ల ఐరోపా గురించి అవగాహన ఏర్పడింది. ఇప్పటికీ, నేను పాశ్చాత్య సాహిత్యాన్ని, నమ్మకాలనీ, కళాభిరుచుల్నీ ఈ రెండు దృక్పథాలనుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. 

ఇక రెండవ విషయం నన్ను రానురాను ఎక్కువగా ప్రభావితం చేసింది. దాని వెనక చరిత్ర చెప్పుకోవలసి ఉంది. 

నాకు చిన్నప్పటి నుంచీ, “మంచి” పుస్తకాలు చదివే వాళ్ళతో మాట్లాడాలన్నా, స్నేహం చేయాలన్నా ఇష్టం. ఈ వ్యాస శ్రేణిలో మొదట్లో చెప్పినట్లు, వాళ్లంతా నా లోకానికి చెందినట్లు అనుకునేవాడిని. అలా అని నేను అపరాధ పరిశోధనలు, సినిమా పత్రికలూ, యద్దనపూడి చదవలేదని కాదు. కానీ, అడివి బాపిరాజు, చలం, విశ్వనాథ, రాచకొండ, కొకు, శ్రీ శ్రీ — ఇలాగ గొప్ప రచయితలు అని పేరు మోసిన వాళ్ల పుస్తకాల మూలాన స్నేహాలు కలిసిన సందర్భాలు అనేకం. కానీ, అదే డిటెక్టివ్ నవలాసాహిత్యం ఆధారంగా స్నేహాలు ఏమీ కలగలేదు. ఎటువంటి పుస్తకాలు ఇష్టం అంటే, ఇటువంటి మేధావి రచయితల పేర్లు చెప్పే వాడిని కానీ, షాడో మధుబాబు, గిరిజశ్రీ భగవాన్ ల పేరు చెప్పే వాడిని కాదు. 

ఇటువంటిది నాకు ఇంగ్లాండ్ లోకూడా కనబడుతుంది.  అక్కడ కూడా ఉత్తమ సాహిత్యం అని ఒకటి ఉన్నది. అక్కడ నవలల్లో, ఉత్తమ సాహిత్యం చదివే వాళ్ళు సున్నిత మనస్కులనీ, విశాల హృదయులనీ చూపించడం ఉన్నది. ఉదాహరణకి జేన్ ఆస్టిన్ లో ఎలిజబెత్ చూడండి! సినిమాల్లో సినిమా హీరోల గురించి చెప్పడం లాగ, ఇది ఈ పుస్తకాల గొప్పదనాన్ని మరీ బలవత్తరంగా చూపిస్తుంది. తెలుగు సాహిత్యంలో కూడా ఇలాగ ఉత్తమ సాహిత్యం చదవడం ఉత్తమ లక్షణం అనే భావం అనేక చోట్ల కనబడుతుంది. ఇప్పుడు ఇటువంటివి చదివినప్పుడల్లా, బైబిల్ లో బైబిల్ నిజమని ఋజువులు చూపించడం గుర్తుకొస్తుంది!

అమెరికాలో పుస్తకాలు చదివే వాళ్ళతో మాట్లాడుతుంటే అర్థం అయింది ఏమిటంటే, ఇక్కడ అనేక రకాల సాహిత్యం ప్రాచుర్యంలో ఉంది. సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ సాహిత్యం, మిస్టరీ పుస్తకాలూ, ఫాంటసీ పుస్తకాలు, హారర్, కామిక్ పుస్తకాలు — ఇలాగ ఏ రకానికి ఆ రకం పుస్తకాలు. ఇటువంటివి నేను చూడటం అంతవరకూ లేదు. అంతే కాదు — జేమ్స్ జాయిస్ చదివినంత మాత్రాన గొప్ప మేధావి, లేదా, గొప్ప పాఠకుడు అని ఏమీ లేదు. ప్రతి ఒక్క రకమైన సాహిత్యం లోనూ  ఉత్తమ రచయితలూ, వాటిని చదివి విశ్లేషించుకుంటే ఉత్తమ పాఠకులు ఉంటారు. 

Open Photo
Fondren library

ఆ రోజుల్లో నా ఆఫీస్ రూమ్ మేట్ ఒక అమ్మాయి, అద్భుతంగా రాస్తుంది. ఆ అమ్మాయి రాసిన పేపర్లు చదువుతుంటే ముచ్చట వేసేది. ఇప్పుడు ఒక గొప్ప కంపెనీ లో సి టీ ఓ గా  పని చేస్తుంది. తనకి ఇష్టమైనది మిస్టరీ సాహిత్యం! ఏ విషయాన్నయినా ఎంత బాగా విశ్లేషిస్తుంది! ఎంత బాగా సునిశితంగా ఆలోచిస్తుంది! ప్రపంచాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంది!

హార్వర్డ్ లో చదువుకుని వచ్చిన మరొక కుర్రవాడికి ఫాంటసీ నవలలంటే ఇష్టం. అవే చదివే వాడు. అన్ని ఇజాలూ తెలిసిన మనిషి. ఇంకా, అర్థ శాస్త్రం చదివి, కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్డీ చెయ్యడానికి వచ్చిన మైక్ కి, కామిక్ పుస్తకాలు బాగా ఇష్టం. అందులో ఉండే రక రకాల శైలుల గురించి వివరంగా మాట్లాడ గలడు! 

దీనికి బలమైన కారణాలు రెండు కనబడుతున్నాయి. ఒకటి, ఇంగ్లాండ్ లో లాగ, అమెరికాలో కుల తత్వాలు లేవు. పుట్టుకతో ఒకళ్ళు గొప్ప అనే భావం లేదు. జాతి వివక్షత ఉన్నది. డబ్బు గురించి కూడా వివక్షత ఉన్నది కానీ, అది అంత సులభంగా కనబడదు. మనతో బాటు సినిమా టిక్కెట్టుకి నిలుచున్న వాడు కోటీశ్వరుడు కావచ్చు. వాడు కూడా మనలానే హోండా కారు తోలవచ్చు. మొదటి నుంచీ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఈ వర్గ వివక్షతకి నిరసనగా అమెరికాలో అక్కడి ఉన్నత వర్గ లక్షణాలకు, చిహ్నాలకు వ్యతిరేకంగా ఇతర సంస్కృతులు పెరిగాయి. ఉదాహరణకి, టీ బదులు కాఫీ, క్రికెట్ బదులు ఫుట్ బాల్, వీటన్నితో బాటు, ఉన్నత వర్గాల లక్షణమైన ఉత్తమ సాహిత్యానికి పెద్ద పీట  వెయ్యటానికి నిరసన! 

కానీ, కాల క్రమేణా, ముఖ్యమైన మార్పు మరొకటి వచ్చింది. ఉత్తమమైన రచనలు అన్ని రకాల ప్రక్రియలలోనూ రావడం జరిగింది. ఇది 20 శతాబ్దపు పరిణామం. ఇంగ్లాండ్ లోనూ కనబడుతుంది. ఇది అమెరికాలో ఇంకా బాగా పెరిగింది. ఎక్కువ మంది పాఠకులు ఉండటం మూలాన, పల్ప్ సాహిత్యం పెరిగింది. చిన్నపుడు జేబులో పట్టే డిటెక్టివ్ నవలలు అద్దెకి దొరికేవి. అటువంటి పుస్తకాలు అమెరికాలో మొదటి నుండీ ఉండేవి. కానీ, మిగిలిన చోట్లకంటే తేడా ఏమిటంటే, ఇక్కడ వాటిలో నుంచే గౌరవ ప్రదమైన రచనలు పుట్టుకొచ్చాయి. వీటి నుంచే పేరు మోసిన రచయితలూ  వచ్చారు. No description available.

అంటే, సాహిత్య ప్రయోజనం ఎలా ఉన్నా, సాహిత్య పంథా ఎలా ఉన్నా, సాహిత్యానికి కావలసిన ముఖ్యమైన లక్షణాలు ఎటువంటి రచనల్లో అయినా ఉండవచ్చు అని తెలిసి వచ్చింది. ఉదాహరణకి, నేను ఆ రోజుల్లో రేమండ్ చాండ్లర్ డిటెక్టివ్ నవలలు చదవడం మొదలు పెట్టాను. దాని వెనక ఒక కథ ఉంది. నేను వేస్ట్ ల్యాండ్ మీద వచ్చిన ప్రతి పుస్తకం చదివే వాడిని కదా! ఆ రోజుల్లో, ఒక కామిక్ పుస్తకం వచ్చింది — వేస్ట్ ల్యాండ్ ని బొమ్మల్లో చెప్పడం, బగ్స్ బన్నీ, క్రిస్ మార్లో (రేమండ్ చాండ్లర్ సృష్టించిన ఒక డిటెక్టివ్) మాటల్లో వేస్ట్ ల్యాండ్ మీద పేరడీ గా చెప్పడం అదీ కథ! ఇప్పుడు కాపీలు దొరకవు కానీ, నా దగ్గర ఒక రెండు కాపీలు ఉన్నాయి! 

ఈ రేమండ్ చాండ్లర్ నవలల్లో కర్ణుడి లాంటి పాత్రలు — అంటే, ఏదో ఒక ధర్మానికి కట్టుబడి, నీతికీ, అవినీతికీ మధ్యన ఉండే పాత్రలు, సమాజం అంచున ఉండే స్వార్థపరులైనా, ఒక న్యాయాన్ని నిరూపించే పాత్రలు, తెలుపు నలుపుల మధ్యన ఉండే నీడల్ని కాసిని మాటల్తో చెప్పగలిగిన సంభాషణలు, కొత్త దేశపు, కొత్త ప్రాంతపు కథలు ఇవన్నీ కనబడతాయి. ఇందులో మిస్టరీ మాత్రమే ముఖ్యం కాదు, పాత్రలు ముఖ్యం. అవి ఏమిటి ఎందుకు చేస్తాయో ముఖ్యం. నిజానికి మరొక డిటెక్టివ్ రచయిత రాబర్ట్ పార్కర్ ఈ చాండ్లర్ మీద ఒక పీహెచ్డీ చేసాడు. ఈ రాబర్ట్ పార్కర్ రచనలన్నీ ఆ ఎండాకాలం పూర్తి చేసాను. వీటిలో హీరో స్పెన్సర్ — కవి స్పెన్సర్ లాగ. రకరకాల సాహిత్యజాడలు ఇతడి డైలాగులు కనబడతాయి. 

అంతకు ముందు సాహిత్యంగా భావించని పుస్తకాలు కూడా చదవడం మొదలు పెట్టాను ఆ రోజుల్లోనే. యూనివర్సిటీకి దగ్గరగా ఒక పాత పుస్తకాల షాపు ఉండేది. ఒక సారి రొమాన్స్ నవలలు డాలర్ కి పది బయట పడేసి అమ్మడం మొదలు పెట్టాడు. నేను వెళ్లి ఒక పది తెచ్చుకొని చదివాను. మొదటి మూడు నాలుగు ఆసక్తి కరంగా ఉన్నా, తర్వాత కథ తెలిసి వచ్చేసింది. కానీ, మూస పోసినట్లుండటమే ఆ కథల్లో ప్రత్యేకత. అందులో ఉండవలసింది కొత్త కథ కాదు. హీరో కి, హీరోయిన్ కి మధ్యన మొదట ఎలాగ అపార్థం కలుగుతుందో, ఎలా తర్వాత అనురాగం పెరుగుతుందో, మధ్యన ఎలా అడ్డం వస్తారో, చివరికి ఎలా కలుస్తారో,  ఇవన్నీ మన శాస్త్రం ప్రకారం ఉంటాయి. ఈ సన్నివేశాల కోసం ఎదురు చూస్తూ పాఠకులు చదువుతారు. Open Photo

కానీ, కథ కోసం కాదు చదవాల్సింది. ఆ ప్రాంతం కోసం. ఆ కథల నేపథ్యం కోసం. న్యూజీలాండ్ లో గొర్రెల ఉన్ని ఎలా తీస్తారు? మన కోతల సమయంలో లాగ, ఇంటి దగ్గర ఆడవాళ్లు ఏం చేస్తారు ఆ పని జరుగుతున్నపుడు? ఏం వండుకుంటారు? సాధారణమైన ఆనందాలు ఏమిటి? నాకు కావలసింది అసాధారణమైన మనుషుల గురించి కాదు. వినూత్నమైన కొత్త జీవితాల గురించి కాదు. నాకు కావలసింది సాధారణమైన మనుషుల గురించి. వారి గురించి నిజాలు కూడా కాదు నాకు కావలసింది. వారు ఏది నిజం కావాలని కోరుకుంటున్నారు అనేది నాకు కావాలి. వారి కలలు కావాలి. వారి ఆశలు తెలియాలి. నిజ ప్రపంచం కన్నా, వారి కాల్పనిక జగత్తు తెలియాలి. రచయితను అర్థం చేసుకోవడం కోసం కాదు చదివేది, పాఠకులని అర్థం చేసుకోవడం కోసం!

చాలా మంది ఈ రొమాన్స్ నవలల్ని కొట్టి పడేస్తారు కానీ, చదివితే, వీటినుంచి కూడా నేర్చుకోవలసింది చాలా ఉంది. ఎంత చెత్త పుస్తకమైనా, వాక్య నిర్మాణానికి, సందర్భ సృష్టికి, వర్ణనకీ, ఇచ్చే ప్రాధాన్యం తెలుస్తుంది. ఇలాగే మిస్టరీ పుస్తకాలు కూడాను. డిక్ ఫ్రాన్సిస్ లాగా మొదటి వాక్యం రాయాలని, రేమండ్ చాండ్లర్ లాగ పాత్రల చిత్రీకరణ చేయాలనీ, ఎల్మోర్ లియోనార్డ్ లాగ సంభాషణలు రాయాలని, నీరో ఉల్ఫ్ లాగ ఒక ఇంటిని వర్ణించాలనీ, ఇలాగ అన్ని రకాల సాహిత్యం మీద నాకు గౌరవం పెరిగింది. 

కాకపొతే, చివరగా ఒక్క మాట — ఆ పది పుస్తకాల తర్వాత మరో పది పుస్తకాలు తెచ్చుకున్నాను. కానీ, చదవలేక పోయాను. అప్పటికి నాకు ఫార్ములా అర్థం అయిపోయింది! రచనా శైలి తెలిసి వచ్చింది! ఆ ఆచారాలు, ఊహలు, మాటలు తెలిసి వచ్చాయి. మరో పదేళ్లకు కానీ రీజెన్సీ రొమాన్స్ నవలల మీద పడలేదు. ఇదంతా, మొదటి రెండేళ్ల ప్రయాణమే. ఇక రాను రాను, నేను అనువాదాలు ఎలా చదవడం మొదలు పెట్టాను, సాహిత్య ప్రయోజనం మీద అభిప్రాయాలు ఎలా మార్చుకున్నాను — అది వచ్చే నెల!

*

 

రామారావు కన్నెగంటి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Smooth narration! You took gave me a gripping ride of your reading journey. Very insightful and colorful, what a ride!

  • బాగుందండి. నేను చాలాకాలం తర్వాత మా ఊరు వెళ్ళాను. మేమున్న ఊరు, వీధీ ఏమీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఊర్లో తెల్సున్న వాళ్లందరూ లేరు. ఉన్నవాళ్లకి నేను తెలియదు. టామ్ వోల్ఫ్ రాసిన ‘యు కెనాట్ గో హోమ్ ఎగైన్’ అనేది తెలిసి వచ్చింది. ఓసారి వలస వెళ్తే అంతే. నామటుకు నాకు గ్రిషాం గారి నవలల వల్లా మరో తెలుగు రచయిత వల్లా వాక్యం ఎలా రాయాలి సస్పెన్స్ ఎలా ఉండొచ్చు అనేవి చదవగా చదవగా అర్ధం అయ్యాయి. మొదట్లో మరీ ఒకటో తరగతి వాడిలాగా లాసేవాణ్ణి. ఇప్పుడు కాస్త నయం. 😉 ఒకప్పుడు కధ కోసం మాత్రమే పుస్తకాలు చదివేవాడిని ఇప్పుడు ఎలా రాస్తున్నారు, కధా, గ్రామర్, సస్పెన్స్ ఎలా పెట్టారు అనేవి గమనిస్తూ ఉంటా. కొంతమంది నవలిస్టులు పేజీలకోసం సాగదీయడం తెలుస్తూనే ఉంటుంది. నవ్వుకోవడమే. చిన్న కధ ఒకపేజీలో రాయడం అన్నింటికన్నా కష్టం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు