నువ్వు లేకపోయినా నీ చిత్రపటం  ఉందిగా !

దాదాపు రెండేళ్ల క్రితం మెల్బోర్న్ నుండి ఇండియా వెళ్లేప్పుడు కౌలాలంపూర్ లో ఐదారు గంటలు ట్రాన్సిట్ దొరికింది. లౌంజ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వాడిచ్చిన వైఫైకి కనెక్టు అయ్యి, మొదట ఇంట్లో వాళ్లకి వాట్సాప్ కాల్స్ చేసి, ఒక కప్పు క్యాపుచినో తెచ్చుకునే సరికి ఇంకో రెండు గంటలు మిగిలున్నాయి. చేతిలో ఫోనూ, అందులో ఫ్రీ వైఫై, ఏ అంతరాయమూ లేని రెండు నిండు గంటల సమయం. వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేశాను!

మనం అంతకు ముందు చూసిన వీడియోలను బట్టి మనకు ఏ వీడియోలు నచ్చుతాయో విశ్లేషించి (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సా మజాకా), వాటిని చూడమని సూచించడం అప్పటికే యూట్యూబ్ కి తెలుసు. ఓపెన్ చేయగానే మొట్టమొదటి సజెషన్ బేగం అఖ్తర్ పాడిన ఒక గజల్ కనిపించింది. క్లిక్ చేయగానే నా హెడ్ ఫోన్స్ లోంచి ఒక అద్భుతమైన ఆర్తిభరితమైన స్వరమధురిమ నాలో ప్రవేశించి నా గుండెని బరువెక్కించేసింది. భౌతికంగా కౌలాలంపూర్ లోనే ఉన్నా, అంతరంగం ఎదో లోకానికి వెళ్ళిపోయింది. రిపీట్ లో ఆ గజలే ఒక గంటన్నర పాటు విన్నాను. విన్నంతసేపూ అప్రయత్నంగా కంటనీరు జాలువారింది. ఒక అరగంట మౌనముద్ర వహించి, నన్ను నేను తమాయించుకుని మళ్ళీ ఈ లోకానికి వచ్చాను. లౌంజ్ డిస్ప్లేలో బోర్డింగ్ స్టేటస్ చూసుకుని, ఉద్వేగాన్ని, ప్రశాంతతని సమపాళ్లలో గుండెల్లో నింపుకుని గేటు వైపుకి బయల్దేరాను.  నన్ను అలా ఒక స్పెల్ లో ఉంచిన గజల్:
మేరె హంనఫస్ మేరె హంనవా ముఝే దోస్త్ బన్ కే దగా న దే
మై హుఁ దర్ద్-ఎ-ఇష్క్ సే జాఁ-బ-లబ్ ముఝే జిందగీ కి దువా న దే
 
నా సహచరుడా నా సన్నిహితుడా నాకు స్నేహితుడవై మోసగించకు 
ప్రేమవేదనలో దాదాపు మరణించాను నేను జీవించాలని ప్రార్థించకు 
 
ఈ మాటలు టైప్ చేస్తుండగా కూడా నాలో ఎదో సన్నని అలజడి. ఇలా ఎలా వ్రాయగలరు! మత్లా అంటే ఎలా ఉండాలో ఎవరికైనా వివరించాల్సి వస్తే ఇది అత్యంత ప్రామాణికమైనది. మొదటి వాక్యంలో ఒక స్నేహితుడిని ద్రోహం చెయ్యవద్దని అడగటం. అంటే ఆ స్నేహితుడు ఎదో చేయరాని మోసం చేశాడు అనుకుంటాము. మలివాక్యంలో నా కొనప్రాణం నిలబడాలని ప్రార్థించకు అనడం.ఆ ‘ట్విస్ట్’ ఉన్నప్పుడే మత్లా పండినట్టు. ఒక బరువైన హృదయాన్ని మోసీ మోసీ కలిగే బాధకు ఉపశమనం మరణంలోనే ఉన్నప్పుడు, ఆ మరణం అత్యంత సమీపంలో ఉన్నప్పుడు, మన మిత్రులు మనం బ్రతకాలని ప్రార్థించడం శ్రేయోభిలాష ఎలా అవుతుంది! ద్రోహమే అవుతుంది. ఇంతటి సునిశితమైన పదచిత్రాన్ని గీసిన చిత్రకారుడు:షకీల్ బదాయూని.
***
గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ రెండు గంటల్లో నాకు ఆ గజల్ పూర్తిగా అర్థం కాలేదు. ఇండియాలో ఒక సిమ్ కార్డు వేసుకోగానే అర్థం వెతకడం మొదలుపెట్టాను. అర్థం చేసుకున్నాక మళ్ళీ ఒక పది పదిహేను సార్లు విన్నాను. అప్పుడు గాని తనివి తీరలేదు. ఈ గజల్ నుండే ఇంకో రెండు మంచి షేర్లు చూద్దాం.
మేరే దాగ్-ఏ-దిల్ సే హై రోష్ని ఇసి రోష్ని సే హై జిందగీ
ముఝే డర్ హై ఎయ్ మేరే చారాగర్ యే చరాగ్ తూ హీ బుఝా న దే
నా గుండె గాయాలలో ఒక వెలుగు ఆ వెలుగులోనే జీవితం 
ఓ వైద్యుడా ఈ దీపాలు నువ్వు ఆర్పేస్తావేమో  అని నా భయం 
 
చారాగర్ అంటే వైద్యుడు. సాంప్రదాయ ఉర్దూ కవిత్వంలో మనకు తరచూ కనిపించే పాత్ర ఇది. ఇక్కడ వైద్యుడిని తన గాయాలు మానేలా చెయ్యవద్దని వేడుకోవడంలో మనం ఇదివరలో ప్రస్తుతించిన బాధాప్రియత్వం కనిపిస్తుంది.
మళ్ళీ చారాగర్ తోనే, ఇంకో భిన్నమైన ఐరనీని వాడుతూ తర్వాతి షేర్:
ముఝే ఛోడ్ దే మేరే హాల్ పర్ తేరా క్యా భరోసా హాయ్ చారాగర్
తేరి నవాజిష్-ఏ-ముఖ్తసర్ మేరా దర్ద్ ఔర్ బఢా న దే
ఓ వైద్యుడా  నన్నిలా వదిలెయ్ నిన్ను ఇట్టే నమ్మలేను 
నీ క్లుప్తపరామర్శ నా బాధను మరింత తీవ్రం చేస్తుందేమో 
 
ఒకచోట బాధలు ఎక్కడ తొలగిస్తాడో అని భయం ఇంకో చోట బాధలు ఎక్కడ పెంచుతాడో అని సందేహం!
***
షకీల్ కవిత్వంలో ప్రధానంగా ప్రేమ, ప్రేమకు సంబంధించిన పరిశీలనలు కనిపిస్తాయి. గట్టుపై నిలబడి ఈత గురించి చెప్పినట్టు, ప్రేమ అనే స్థితి ఏమిటో అనుభవపూర్వకంగా తెలియకపోయినా దాని గురించి మాట్లాడే వారి గురించి ఒక షేర్ ఇలా చెప్పారు:
ఎయ్ ఇష్క్ యె సబ్ దునియావాలే బేకార్ కీ బాతేఁ కర్తే హై

పాయల్ కీ గమోఁకా ఇల్మ్ నహీఁ ఝంకార్ కీ బాతేఁ కర్తే హై ఓ ప్రేమా, వీళ్ళందరూ కల్లిబొల్లి కబుర్లే చెబుతారు 

మువ్వ పడే బాధ ఎరుగరు సవ్వడి గురించి చెబుతారు
షేర్ లిఖితంగా కంటే మౌఖికంగా ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ముషాయిరాల్లో గమనిస్తే ‘ ఏక్ షేర్ యూఁ కహా హై’ అంటారు. షేర్ లో స్వాభావికమైన లయ ఉండటం బహుశా కారణం అనుకుంటాను. ఈ కారణంగానే షేర్ కి quotability ఎక్కువ.
ఇంకొక చోట ప్రేమకి వాంఛకి తేడా తెలియని వాళ్ళ దుస్థితిని చూపిస్తారు:
అహల్-ఏ-హవస్ ఘబ్రాతే హై డూబ్ కే బహెర్-ఏ-గమ్ మే షకీల్
పెహలే న థా ఇన్ బేచారో కో అందాజా గెహరాయీ కా
 
వాంఛాలాలసులు శోకసంద్రంలో కొట్టుమిట్టాడుతారు
అమాయకులు, ముందుగా లోతులు ఊహించలేరు
అలాగే ఏకపక్షమైన ఆరాధన గురించి చెప్పిన ఒక షేర్:
కోయీ అయ్ ‘షకీల్’ పూఛే యే జునూఁ నహీఁ తో క్యా హై
కి ఉసీ కె హో గయే హమ్ జో న హో సకా హమారా
‘షకీల్’, ఇది పిచ్చి కాదా అని ఎవరైనా అడుగుతారు 
నేనెవరిని పొందలేదో  వారికే నేను చెందాను 
ఒకప్పటి ప్రేమకథలలో ప్రేయసి చిత్రపటం ఎంతో అపురూపమైనది. వాట్సాప్ ఇంస్టాగ్రామ్ తరానికి ఇది విడ్డూరంగా అనిపించవచ్చు.
వ్యక్తిగతంగా కలవలేని ప్రేయసిని అలా పరోక్షంగా చూసినా హృదయం ఊరడిల్లేది.
దిల్ కే బహల్ నే కీ తద్బీర్ తో హై
తూ నహీ హై తేరి తస్వీర్ తో హై
మనసు ఊరడిల్లేందుకు ఉపాయం ఉందిగా 
నువ్వు లేకపోయినా నీ చిత్రపటం  ఉందిగా 
***
పాత హిందీ పాటలు అంటే చెవి కోసుకునే వారికి షకీల్ బదాయూని పేరు సుపరిచితమే. తన ముద్ర చిరకాలం నిలిచిపోయేలా ఎన్నో సినిమా పాటలు వ్రాశాడు. ఒక తరం యువతులంతా ఇలా ఎవరైనా మనల్ని పొగిడితే బావుండు అని కోరుకునేట్టుగా ‘చౌద్వీ కా చాంద్ హో’ వ్రాశాడు. ముఘల్-ఏ-ఆజం అనగానే గుర్తుకొచ్చేట్టుగా ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ వ్రాశాడు. ఒక మహాసాధువు వ్రాసినట్టు ‘మన్ తర్పత్ హరి దర్శన్ కో ఆజ్’ వ్రాశాడు. రెండు హృదయాలు రెండు నదులలా కలవాలని ‘తూ గంగా కీ మౌజ్ మై జమునా కి ధారా’ వ్రాశాడు. విరహాన్ని గుప్పిస్తూ ‘సుహాని రాత్ ఢల్ చుకీ’ వ్రాశాడు. రాధ యొక్క తీయని బాధను మోస్తూ ‘మోహే పన్ఘట్ పే నందలాల్’ వ్రాశాడు. ఒక ప్రేమికుడి ఆర్తిని ఆరు చరణాలలో విపులీకరించి ‘మేరే మెహబూబ్ తుఝే మేరె మొహబ్బత్ కి కసమ్’ వ్రాశాడు.
షకీల్ ఒక రొమాంటిక్ పోయెట్. ఎక్కడా విప్లవం గురించి, అభ్యుదయం గురించి  వ్రాసిన దాఖలాలు లేవు. సుఖమో దుఃఖమో, చాలా వరకూ ప్రేమ గురించే వ్రాశాడు. ఈ  విషయాన్ని ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు:
మై షకీల్ దిల్ కా హూఁ తర్జుమా, కె మొహబ్బతోఁ కా హూఁ రాజ్దాఁ
ముఝే ఫక్ర్ హై మేరీ షాయరీ జిందగీ సే జుదా నహీఁ
 
నేను హృదయానికి అనువాదాన్ని, ప్రేమ రహస్యాలు తెలిసిన వాడిని 
నా కవిత్వం నా జీవితం వేర్వేరు కాకపోవడం నాకెంతో గర్వకారణం 
 
ఎప్పుడైనా ఎవరైనా తన పేరు ప్రస్తుతిస్తే నేను అమాంతం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ లౌంజ్ లో వెళ్లి కూర్చుంటాను. నేను పొందిన ఆ అనుభూతి మరువలేనిది, మాటలకు అందనిది. అందులో బేగం అఖ్తర్ పాత్ర ఎంత ఉన్నా, షకీల్ పదాల పదును హృదయాంతర హృదయం వరకూ తాకింది. Legendary poet!
*
Avatar

రమాకాంత్ రెడ్డి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • షకీల్ పదాల పదును.. లెజెండరీ పోయెట్ ను,పరిచయం చేసిన మీకు,శత కోటి ధన్యవాదాలు.. సర్..👌👌🙏.ఎన్ని సార్లు చదువుకున్ననోఈ write up!చాలా బాగుంది.సర్!

  • మీరు అప్పుడే చదివేశారా! థాంక్యూ పద్మ గారు🙏

 • చదువుతుంటేనే నాకు మీరు పొందిన భావనలు అన్నీ అనుభూతమౌతున్నాయి. ఇక మళ్లీ మళ్లీ విన్న మీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చును. వినడమే తరువాయి.. అన్నట్టు రాశారు, ధన్యవాదాలు సర్.

 • ఏ మొహబ్బత్ తెరే అంజామ్ పర్ రోనా ఆయా……
  జానే క్యో ఆజ్ తేరే నామ్ పర్ రోనా ఆయా…….
  షకీల్ పదాలని బేగం అఖ్తర్ పాడిన తీరు, కలం గళాన్ని అజరామరం చేసిందో గళం కలాన్నో చెప్పడం కష్టం. మీరు రాసినట్టు ప్రణయ వేదన షకీల్ కలంలో సిరాల ఒదిగిపోతుంది. మీ నుంచి మరిన్ని రచనలు ఆశిస్తున్నాం…..
  సాహిర్ గురించి రాయగలరు.

  • సొగసు మాటలదా గొంతుదా అన్న మీ సంశయంతో ముమ్మాటికీ ఏకీభవిస్తాను. మెహఁదీ హఁసన్ పాడిన ‘రంజిష్ హీ సహీ’ విషయంలో కూడా ఇటువంటి ఆశ్చర్యమే కలుగుతుంది.
   సాహిర్ లిస్టులో ఉన్నాడు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు