నీవు మొదలి జాణవు..!

Mythopoeic Story

రెండో ఝాము జరజరమంటూ జారుతోంది. నాకు నిద్రపట్టకపోక కాదుగానీ, విద్యుత్పర్ణ గురించి యోచిస్తూ ఉండిపోయానంతే. తెమ్మెరలకి ఆ కాస్త తెరగులెందుకని తెరల పరదాలు తొలిగించమన్నాను, కునికిపాట్లు పటుతున్న వ్యాళిందితో. గోమతీ నది అలల మీద సయ్యాటలాడి అదే వివశాన్ని వింత పరిమళాలుగా మోసుకొస్తోంది దక్షిణపు గాలి. ఆ సువాసనల ఆరా తీస్తూ అలా వెనకటి జన్మల వరకైనా వెళ్లిపోవాలన్న వ్యసనం కమ్మేస్తోంది.

కిటికీ దగ్గరకి జోగుతూనే వెళ్లి, ఒక్కసారిగా ఎక్కడలేని ఉత్సాహం తెచ్చుకొంది వ్యాళింది, నన్ను రమ్మని సైగ చేస్తూ. బహుశా బయిల్దేరి ఉంటుంది విద్యుత్పర్ణ, అదే వ్యాళింది ఆత్రం. తాడెత్తు ప్రహరీకి దేవదారు చెక్కల సింహద్వారం తెరుచుకున్న చప్పుడు ఆమడ దూరం వినిపిస్తోంది, విద్యుత్పర్ణ బయిల్దేరిందని ప్రత్యేకంగా చెప్పాలా?

రెండో అంతస్థు గవాక్షం నుంచి చూస్తుంటే- నీలలోహిత కాంతిపుంజం కదులుతున్నట్టు కనబడుతోంది తాను. తనకి పది బారల దూరంలో పూన్చిన జవనాశ్వాన్ని నడిపిస్తూ వెన్నంటి ఉంది మన్మధోద్దపిని.  నిండుపున్నమి నడిరాతిరి, రాకాచంద్రుడ్ని రాకాసిమేఘమేదో కమ్మేసింది, ఒంటికంటి శుక్రుడు ఓరకంట చూస్తున్నాడు.

హేమంతాన్ని  ‘మంచుతెఱి’ అని విద్యుత్పర్ణ పలకడం గుర్తొచ్చి నవ్వొచ్చింది.

విద్యుత్పర్ణ పేరు కూడా తన అసలు పేరు కాదు. చక్షు నదీ తీరంలోని పహ్లవ రాజకుమారి తాను. దరద, ములక, పారద రాజ్యాల మాదిరిగానే వీరిదీ పైశాచీభాష. ఆ భాషలో తన పేరుకు అర్థం- కాగడామల్లె అనో, కాంతిపత్రమనో అట. పలుభాషలు నేర్చిన మన్మధోద్దపినిని తనకి ప్రధాన చెలికత్తెగా నియమించింది పట్టపురాణి రుక్మిణి. ఆ చెలికత్తే ఖాయం చేసింది- విద్యుత్పర్ణ అనే పేరుని. మన్మధోద్దపిని వల్లే తెలుస్తుంటాయి విద్యుత్పర్ణ విశేషాలు. నరకుడి చెరలో ఉన్నప్పుడు అవసరపడని అనువాదం ఇప్పుడు అవసరమౌతోంది.

బాధకి భాషెందుకు?  అగచాటుకి అర్థం అవసరమా? పరితాపాలకి పాఠాంతరాల పనేముంది?

కానీ, ఆ చెరకి, ఈ చెరకీ ఏమిటి భేదం అంటుంది విద్యుత్పర్ణ. ఆ మాట తొలిసారి తన నోట విన్నప్పుడు ఉలిక్కిపడ్డాను. పదారువేల మందీ నాకు తెలియకపోవచ్చు గానీ, తెలిసినంతలో ఇటువంటి అభావం మరెవరికీ ఉన్నట్టు అనిపించలేదు. నా మటుకు నాకైతే ఆమె ఆలోచన ఓ పిడుగుపాటు. మా రాజ్యం మధురకి దాపునే. పశ్చిమతీరాన మధుర అయితే, ఈవలి తూర్పుగట్టున మా రాజ్యం. అయితే, అదే వైపున ఉన్న గోకులం అంత చేరువేమీ కాదు. దూరాబారాల మాట అటుంచితే, ఇటు గోకులం కానీ, అటు మధుర గానీ, ఆ చెంత బృందావని గానీ కాని చోట్లని నాకెన్నడూ తోచలేదు. బృందావనమైతే నాది కాదని అనుకున్నానా ఎప్పుడైనా? ఉగ్గుబాలతో కలిపి అమ్మ చెప్పిన రాధామాధవ గాథలు ప్రతి కొమ్మా, రెమ్మా పలికి పలవరిస్తున్నట్టే ఉండేది నాకు, బృందావనాన్ని దర్శించినప్పుడల్లా. ఆ  ప్రబ్బలి చెట్ల నీడల్లోనే కాబోలు కిట్టయ్య పీనపయోధర మర్దనుడయ్యింది,  ఈ నిగూఢ నికుంజంలోనేనా రాధికాదేవి నిట్టూర్పుల నిరీక్షణై వేగిపోయింది, ఈ చంపకం చేరువేనా గోపకాంతలు గోపాలుడి ధ్యానంలో ధన్యమయ్యింది …  అనుకుంటూ వనమంతా కలియతిరిగేదాన్ని.

యమునా తీరం… వేణుగానం… విరహరాగం… విప్రలంబం… ఈర్ష్యామానసం… కందర్పజ్వరపీడనం… రహోవేదనం… రసచందనం…

తోడొచ్చి ఈడొచ్చిన ఊసులన్నీ ఊహలై… ఊపిరై… ఉనికై ఉన్మీలించి మేఘశ్యామ… గోపికావల్లభ… ముగ్ధ ముకుంద… స్నిగ్ధ మధుసూదన…  మానస మాధవ… సానంద గోవింద..సుప్రీతి ప్రీతాంబర సామోద దామోదరుడికి సాగిలపరిచేవి మనశ్శరీరాల్ని. తిరుగు ప్రయాణానికి పరివారమెంత పోరినా, తనివి తీరేది కాదు, బృందావనిని వదలాలంటే.

“అదే కదటే మన సమస్య, మన తల్లుల తరానికి లంజెకాడు, మనకి మొగుడేమిటి?” అనేసింది విద్యుత్పర్ణ పుసుక్కున.

పదారు వేలు అని నేను అంటే, కాదు పదారు వేల నూరున్నెనిమిది అంటుంది విద్యుత్పర్ణ, అష్టమహిషుల్ని కలిపి. ఆ అందరిలో అతి చిన్నది విద్యుత్పర్ణే అనిపిస్తది నాకైతే. కానీ, మాటలకి ఆరింద, తెగింపుకి మాత్రం అంబికే. గోడకి చెవులుంటాయ్, ప్రభువుల దాకా చేరడానికి చారుచక్షువులే ఎందుకు? అయినా, నదురూ బెదురూ లేదు దానికి.

“మాధవుడితో ఈ మనువు నీకు ఇష్టం లేదా విద్దూ…” లాలనగా అడిగానొకమారు.

ఇంకా విజయహేల ఆగలేదు. రైవతకం ఇంకా వెలిగిపోతూ కనబడుతోంది. దివిటీల వెలుగులు మిణుకుమిణుకు మంటూ పర్వతం మొత్తానికీ రత్నాలు పొదిగినట్టు మెరుస్తోంది దూరంగా. బాణాసంచా చప్పుళ్లు వినిపించడం లేదు గానీ, చీకటాకాశంలో హరివిల్లుల్ని పూయిస్తున్నాయి. ఇక ద్వారక అయితే ఇళ్ళూ…వాకిళ్లూ… వసారాలు…  వీధులు- సర్వం పూలమయం. ఆకాశదేవరలు నింగి నుండి తొంగి చూస్తే పొగడ మాలికల్లో చుట్టిన ద్వారక- తేలే ఓ పూలతెప్పలా కనిపిస్తుందేమో.  విశ్రమించని విజయదుందుభి… విరామమెరుగని వీణానాదం.. తెంపులేని నృత్యగానం… వదరు మేళాల జంత్రగాత్రం… వంధిమాగధుల మించు స్తోత్రం… విప్రబృందాల స్వస్తివచనం… ద్వారకా నగరం- ఒక రవం… నరకాసుర సంహారం అనంతరం మిన్నంటిన సంబరాల ఆరవం!

ఆ కోలాహల సమయంలోనే తన సౌధానికి వెళ్లి కబుర్లాటల మధ్య అడిగేశాను: “పరంధాముడితో పరిణయం నీకు ఇష్టం లేదా విద్యుత్పర్ణ?”

గోధుమత్రాచులా తలతిప్పి చూసింది నా వంక, ఫణాగ్ర దివ్యమణుల్లా వెలిగాయి ఎర్రబారిన ఆమె కళ్లు.

“ఈ ప్రశ్న ఎప్పుడు… ఎవరు అడగాలి? అసలెవరు అడిగారే బృహతి?”

జవాబుతో నిమిత్తం లేని తన ప్రశ్న నన్ను నిన్నలలోకి తోసేసింది. నా తండ్రి బృహత్కర్ముడిని చంపి, రాజ్యం కబళించి, తనని ప్రాగ్జ్యోతిషపురానికి ఎత్తుకుపోయాడు నరకుడు. తన వంటి వారు, ఒక్కరు… ఇద్దరు… పదులు… వందలు కాదు- వేలు, పదారు వేలు. అందరూ ఒకే చోట, ఒకే ఇంట; లంకంత కొంప, కొండ కొసన.

ప్రాగ్జ్యోతిష రాజ్యం- భూమి మీద పరిచిన పచ్చని తివాచి, నేల కప్పుకున్న ఆకుపచ్చ కంబళి. సముద్రతీరం… వరాహ పర్వతం… ఎడతెరిపి లేని వానల్ని వడిసిపట్టే వనాలు… కామాఖ్య దేవి రజస్సులా మెరిసే తెరపి పడ్డ అరుణాకాశం!

ఎంత ప్రాకృతిక రమణీయమైతేనేం, ఎవరి ఎడసాలలో వాళ్లు బందీలు, గడప దాటి బైటకి అడుగుపెట్టే వీలే లేదు. కిటికీ ఒక్కటే బైట ప్రపంచానికి మాధ్యమం.

దాని ముందు నుంచి కదిలేది కాదు విద్యుత్పర్ణ. అప్పుడు తన పేరు తెలీదు, తన వంటి, పదారు వేల మందిలో ఒకానొక అభాగ్య. తన గదికి ఐమూలగా ఉండేది ఆమె వసతి. అందరమూ క్రమేణా ఆ పరిస్థితులకి అలవాటు పడినా, తాను మాత్రం దిగులు ద్వీపంలా ఉండేది. పట్టరాని ప్రాయం పరవళ్లు తొక్కినట్టు ఎప్పుడైనా ఓ పూట చిందులు తొక్కేది అకారణంగా.

ఎవ్వరితో మాట్లాడేది కాదు, భాష కూడా ఆమెని కొంచెం ఎడంగానే ఉంచేది. ఎప్పుడైనా పరిచారికలతో పలకరింపు సైగలకే పరిమితం. భాషలు అవసరం లేని బంధమేదో కలిసింది నాకు తనతో. అప్పుడప్పుడూ తన కొట్టానికి వెళ్ళేదాన్ని. మా మధ్య ఏ మౌఖిక సందేశాలూ ఉండేవి కావెన్నడూ; కానీ, శబ్దశబలతలకి అంతుచిక్కని భావోద్వేగాల ప్రస్తారం తీగలు సాచి అల్లుకుపోయినట్టు ఏదో ప్రసార పారస్పర్యం. అర్కవృక్షపత్రంలా స్రవించే ఆమె ఆర్ద్ర నేత్రంలో ఏదో అన్వేషణార్తి. విరిసీవిరియని ఆమె లేత మనసు ఎవరికో ఇచ్చేసుకుందేమో అనిపించేది అప్పుడప్పుడూ.

ఈ లోపు శౌరి- సహస్రబాహుడై సత్యాసమేతంగా ప్రాగ్జ్యోతిష రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నట్టు వార్తలు. ఆ పరవశంలో ప్రపంచం పట్టలేదు నాకు… కాదు మాకు, బహుశా విద్యుత్పర్ణకి తప్ప. యుద్ధవార్తలు చేరినప్పుడెప్పుడైనా – మౌరవులని మట్టుబెట్టాడని, పాషులని పల్లార్చాడని, నిసుందుడ్ని నిర్జించాడని, నిర్మోచన నగరంలో వేలాది మంది అసురుల్ని  నిహతుల్ని చేశాడనీ సమధికోత్సాహంతో సరసిజనాభుడి గురించి చెబుతానా, బెల్లం కొట్టిన రాయిలా చూసేదే తప్ప ఏ కవళికలు కనబర్చేది కాదామె.

ఇక నరకుడితో రణం మొదలయ్యాక ప్రత్యేకంగా ఏ వార్తల అవసరం లేకపోయింది మాకు. ఆకాశమే అద్దమై చూపించింది మహాసమరాన్ని, దిక్కులు ఢక్కలై వినిపించాయి యుద్ధగుంజన్మృదంగాల్ని. మిడతల దండులా శరవర్షం. సుప్రీతానికి ఇంత కూడా తీసిపోని మహా మదగజ దళాల ఘీంకారాలు, ధూళిమేఘాల్ని రేపుతున్న జవనాశ్వదళాలు, ఇసుక వేస్తే రాలని కాల్బలాలు, అశ్వారూఢుల బల్లెం మొనలు మబ్బుల్ని చీల్చుస్తున్నాయి. కూలిన వంతెనలు… ఆగిన పడవలు… శిధిలమౌతున్న బురుజులు, అగడ్తల్లో శవాల గుట్టలు. సమరశంఖాలు… యుద్ధభేరీలు… మరణమృదంగాలు…

మహాప్రణయమూర్తి ప్రళయరుద్రుడై అరిందముడై చేసిన విలయం… విధ్వంసం!

త్రివిక్రముడు… అగ్నిజుడు… రవినేత్రుడు… యమకీలుడు… ఈశ్వరేశ్వరుడు మురారి మూర్ఛిల్లాడని కబురు. భౌమాసురుడి అంతం అమ్మ చేతిలోనే కాబట్టి, ఆ అపస్మారక అభినయమంతా కన్నయ్య లీలామానుష కేళీనటన అని ఆశ్వయుజ బహుళ చతుర్దశికి ముందే తెలిసిపోయిన అభిజ్ఞ ఆనాటి మా అదృష్టం.

ఆ తర్వాత అంతా ఓ అందమైన కల.

అసంగతాల… అరకొరసత్యాల పాలిన పగటి కాంతుల మెలకువ నుంచి దిగంతాల హద్దుల్లేని… స్మృతి స్పృహల పరిమితులు చూడని… వెలుగు నీడల దోబూచులాడని… ఇహపరాల ఇచ్చకం పోని ఓ స్వప్నసీమ.

అదంతా ఆ పూసగొండి వల్లనేగా అంది విద్యుత్పర్ణ, నారదుడ్ని గుర్తు చేస్తూ. పైశాచీ భాషలో ‘పూసగొండి’ అంటే కలహశీలుడని అనుకోవచ్చట. నారదుడి కలహప్రియత్వం సంగతేమైనా, ఆనాటి మా వివాహాలకి ఆ దేవర్షి పౌరహిత్యం మాత్రం కచ్చితంగా లోకకళ్యాణానికి ఏం తీసిపోయిందంటాను నేను.

అది ప్రణవమూర్తి శ్రీకృష్ణమూర్తి ప్రథమ దర్శనం!

యుద్ధానంతర నిశ్శబ్దం అలుముకుంది. ప్రళయం తర్వాతి ప్రశాంతమది. అభ్యుదయ ఆగమనాన్ని అలికిడి ఎరగని తెలికిరణం చెబుతోంది. తెరలు… పరదాలే కాదు ఆచ్ఛాదనలు కూడా చాటుచేయడం సహించలేని నగ్నోద్విగ్నతతో దిసమొల కావాలని, దేహగేహ బంధనాల్లోంచి విముక్తం కావాలని నా ఆత్మ ఆరాటపడింది, ఆ అభిరూపుడి తొలి చూపులో-

కొత్త కాంతులు పొందిన కళ్ళు రెండూ నిశ్చలించి, కాలాన్ని ఒడిసిపట్టాయా అనిపించిందా క్షణం. ఆదిమధ్యాంతరహితమైన ఆ అనురాగమూర్తి బాహువులు బారచాచి అవలంబిత అనుబంధాన్ని వరమాలగా వేసి, నవనవోన్మేష అనుభవాన్ని కాన్క చేస్తున్నాడని తెలిసిపోయి దేహాణువులన్నీ దూదిపింజలై తేలిపోతున్నాయి. చెరబట్టిన నరకుడి మీద భూమాతని మించిన దయ కలిగింది చప్పున- ప్రారబ్ధానివో… ప్రాప్తానివో, ఐహికవో… లేక ఒట్టి వాహికవో గానీ, ఓ నరకాసురా! నీ వల్ల కదయ్యా ఈ పురుషోత్తముడి తనువులో పుణ్యభాగమయ్యాను అని పులకించాను.

భాషలు… ప్రాంతాలు… భావాలు… నమ్మకాలు… అపనమ్మకాలూ…. ఏమీ లేవు. అసలు ఆ పొద్దు మేమంతా పదారువేల మందిమి కాము. అంతా మధుర మాధవత్వంలో సంగమిస్తున్న… సంయోగిస్తున్న… సమ్మోహిస్తున్న ఏక ఐకాంతిక స్త్రీత్వం. అదేమీ ఒక మూకుమ్మడి మనువు కాదు, సామూహికంగా జరిగిన తంతు కాదు. మధుపర్కాలు, ఎదుర్కోలు, సన్నికల్లు తొక్కడాలు, యోక్త్రధారణాలు, జీలకర్ర బెల్లాలు, మంగళసూత్రధారణలు, లెక్క తప్పని మూడుముళ్ళు, ‘సఖాసప్త పదాభవ, సభాయౌ సప్తపదా బభూవ….’ మంత్రాలు, పాణిగ్రహణాలు, నాతిచరామి బాసలు, అగ్నిహోత్రం చుట్టూ తడబడు అడుగుల సప్తపది. సశాస్త్రీయంగా, సాకల్యంగానూ జరిగిన పెళ్లివేడుక.

అతడు నావాడు- నేను అతడి కంఠాన వైజయంతిని.

అతడు సాంతం నా సొంతం – నేను ఆ పెనిమిటిని పెనవేసిన కౌపీనం.

అతడు నా ఆత్మదీపం- నేను అతడి కౌస్తుభహారం.

… అందరిలో అదే భావం… అందరికీ అదే మైకం!

పసుపంటిన తెల్ల చీరలు… ఏడువారాల నగలు…. బండ్లకెత్తిన రత్నరాసులు… అరణాలు… శుల్కాలు… అశ్వాలు పూన్చిన రథాలు… ఏనుగు అంబారీలు! వాడిపోని పూదొంతులు, ఇగిరిపోని సుగందాలతో బంగారు పల్లకీల్లో ఎక్కించి సాగనంపాడు కన్నయ్య ద్వారకకి. తాను మాత్రం సత్యాసమేతంగా అమరపురికి వెళ్ళాడు. నరకుడు దాచిన దేవమాత అదితీ దేవి మణికుండలాల్ని ఆమెకి అందించడం ఒట్టి సాకు అని, తాను సత్యావిధేయుడ్నని సత్యభామ భ్రమలు తిరిగి నిలబెట్టడానికి పారిజాతవృక్షాన్ని పెకలించుకు రావడానికి వెళ్ళాడని నాకైతే అప్పుడే బోధపడిపోయింది.  ఏమిటా క్రాంతదృష్టి… ఎలా ఆ భవిష్యద్దర్శనం అని అడిగితే మాత్రం చెప్పలేను, కృష్ణప్రేమ తప్ప మరే యితర సాధనసంపత్తి లేనిదానను.

ప్రాణవిభుడు వెంట రాలేదన్న దిగులు తప్ప మరే కొరతా లేదు నేను మధురాపురిలో శ్రీకృష్ణ సతి హోదాలో అడుగిడిన రోజు. ద్వారక అంటే రాతికట్టడాలు, ఇరుకు డొంకలు, మెరక వీధులు, ఎండిన చెరువులు, నిండని దొరువులు, ఆకురాలు వనాలు, ఆకలిదప్పుల అన్నార్తులు, హెచ్చుతగ్గులు, రాజుపేదలు, కలిమిలేములు ఉన్న అనేకానేక కాలుష్య నగరాల్లో ఒకానొకటి కాదు. వాసుదేవుడి మనోవిరాజిత భావానికి విశ్వకర్మ కల్పించిన త్రిమితీయ చిత్రరచన- ద్వారక. దృశ్యానికే కాదు, సమతాభావ సాదృశ్యానికి కూడా సజీవతార్కాణం.

ప్రాగ్జ్యోతిషపురంలో నరకుడితో నల్లదేవర యుద్ధం చేస్తున్నప్పుడు, చేది భూపాలుడు శిశుపాలుడు దొంగదెబ్బ తీసి ద్వారకని ధ్వంసం చేశాడని కబురు విన్నాను. ఒక కమనీయ కౌశల వాస్తునిర్మాణ కళారూపంగా నేను సాక్షాత్కరించుకున్న ద్వారకని కమురు పొగల మధ్య రాళ్లగుట్టగా చూడాల్సి వస్తుందేమోననే భంగపాటుతోనే జరిగింది నా ప్రయాణమంతా, ప్రాగ్జ్యోతిష రాజ్యం నుంచి, యాదవ రాజ్యం వరకూ. కానీ, జీర్ణోద్ధరణానంతరం మరింత అఖండ శోభతో వెలిగే ఆలయంలా మరింత శోభాయమానమయ్యింది ద్వారక, శీఘ్ర పునరుద్ధరణ ప్రతిచర్యలతో.

ప్రాగ్జ్యోతిషపురంలో చెరకీ, ద్వారకలో అంతఃపుర వాసానికీ ఏమిటి తేడా అని విద్యుత్పర్ణ ఆక్రోశించినప్పుడే చెప్పాను, ద్వారకకి ‘ద్వారామతి’… ‘ద్వారావతి’ అని పేర్లు కూడా ఉన్నాయని. నగరానికే కాదు ద్వారాలు, గదికి… మదికీ కూడా ఇక్కడ అనేక ద్వారాలు. అసలు కొన్నింటికి గోడలే లేవు.

నది తనని తాను కోల్పోయి కడలి ఉప్పటి కయ్యల్లో నిలవనీరు కావడమే కదా సాగరసంగమం. అలా సాగరసంగమమంటే ఎక్కడైనా అధీనం… ఆక్రమణం కావొచ్చు గానీ, గోమతీ విషయంలో కాదు. సంగమస్థలిలో పన్నెండు యోజనాలు వెనక్కి తగ్గింది సముద్రం. అలాగని అది గోమతి గయ్యాళితనం కాదు, సముద్రుడి షండత్వమూ కాదు; సామరస్యం, అన్యోన్యం. అదే కృష్ణతత్వం, ద్వారక సాంస్కృతిక సామాజిక మూలతత్వం.

అయితే, నా మాటలేవీ బహుశా విద్యుత్పర్ణకి రుచించినట్టు లేదు. బార్లా చాచిన రాజమార్గాలు, సందడి రేగే సంతకూడళ్లు, ఊటచెరువులు, తోటతొరువుల మీదుగా సాగిన ఆనాటి మా స్వాగతయాత్రలో కూడా తాను ముభావంగానే ఉండిపోయింది.

స్వర్ణ రజిత మణిమయ రాజప్రాసాదాలు మా పదారువేల మందికీ అప్పటికే సిద్ధమయ్యాయి. రుక్మిణమ్మే ఏర్పాట్లన్నీ స్వయంగా చూసుకుందట.  మాకు సేవకులు, పరిచారికలు, చెలికత్తెల పరివారాన్ని నియోగించే విషయంలో కూడా చాలా ఆచితూచి నిర్ణయించిందట. నా ప్రధాన చెలికత్తె వ్యాళింది మేనత్త ఉత్పలి- కీర్తిదేవి దగ్గర పుష్పలావికట. కీర్తిదేవి- విశ్వభానుల గారాలపట్టి రాధాదేవి ఉత్పలికి చాలా చేరువట. బృందావన విహారి రసరాజ్య సమరతి గాథల్ని నృత్యగాన సహితంగా కళ్లకి కడుతుంది వ్యాళింది. నా మనసెరిగినట్టే వ్యాళిందిని రుక్మిణీదేవి నాకు నియోగించడం నాకు పరమాశ్చర్యం. ఇన్నివేల మంది రాచకన్నెల పుట్టుపూర్వోత్తరాలు, ఇష్టాయిష్టాలకి సానుకూలమైన సౌకర్యాలు అమరిన ఈ నెలవుకి, నరకుడి చెరకీ తేడా లేదని విద్యుత్పర్ణ వదరడం నాకు రుచించలేదు.

“జీవితమంటే అన్నపానీయాలు అమరడం, సుఖసౌఖ్యాలంటే గూడు… గుడ్డ అందటం కాదే అక్కా…” అంది విద్యుత్పర్ణ ఓనాడు. అప్పటికి ఇంకా కృష్ణస్వామి వేంచేయలేదు అమరాపురి నుంచి. ఇంద్రుడితో తలపడుతున్నట్టు తెలుస్తోంది.

విద్యుత్పర్ణ మందిరానికి వెళ్లి మాటామంతి కలిపినప్పుడు తాను నోరారా ‘అక్కా’ అని పిలవడంతో చెప్పలేని పులకింత కలిగి కావలించుకున్నాను. కన్నీళ్లెందుకో ధారగట్టాయి ఇద్దరికీ. నన్ను మరింత బిగించి పెదాలతో పెదాలు కలిపి, నాలుకతో పీటముడి వంటిదేదో వేసింది.

అవును- కాదు కాని ఒక డోలాయమాన స్థితిలో స్పృహతప్పినంత పనయ్యింది, ఝల్లుమన్న నా మేనికి. బుగులు బుసపురుగు చీలికనాలుక మంత్రదండమై ఏవో రహస్యోద్రేకాల్లోకి జొనిపినట్టయింది.

తాడు మీద దొమ్మరిసానిలా నా ఊపిరి గిజగిజలాడి సర్దుకున్నాక అడిగింది నన్ను:  “చెరబట్టిన అత్యుత్సాహమే గానీ, ఆ నరకుడు ఏనాడైనా చెరిచాడా? కట్టుకున్న ఉబలాటమే గానీ, ఈ నరకాంతకుడు కాపురమేమైనా చేస్తాడా? వారంలో పెద్దరాణులకి ఐదారు దినాలు పోతే, అష్టభార్యల్లో మిగతా వారి వాటాలేమిటీ, ఆ వర్జ్యాలన్నీ దాటుకొని వచ్చాక,  వంతకత్తెలమైన మన వంతెప్పుడు?”

నేనేమీ మాట్లాడలేదు. గోవర్ధనాన్ని గోటితో ఎత్తి గోకులాన్ని కాచిన పురానవ గాథ విన్నది- కనులారా కన్నంతగా కదలాడింది మదిలో. ఆ బాలకృష్ణుడి భుజాలు రాసుకున్న వారేనా అతడికి చేరువ? యోజనాల పర్యంతం పరివ్యాప్తించిన ఆ గొడుగు నీడలో ఉన్న గొడ్డూగోదా… మనిషీమాను… రాయీరప్పా సహితంగా గోవిందుడు అందరివాడే. రంగు రుచి వాసన తేల్చి చూపలేని మధుమురళీరవం నన్ను అలుముకొని, అదుముకొని, పొదువుకున్నట్టు అతడు నాతోనే ఉన్నడని, నాలోనే ఉంటాడనీ నేను విద్యుత్పర్ణకి చెప్పలేదు. ఎందుకంటే చెప్పడానికి అది సమాధానం కాదు, స్వానుభవం.

అందుకే తన మాటలకి బదులేమీ ఇవ్వకుండా, నేనొక ప్రశ్న వేశాను: “నువ్వు ఎవర్నైనా ఇష్టపడ్డావా?”

విద్యుత్పర్ణ నన్ను కావలించిన తమకంలోనే కెరలించిన కాంక్షల తలపోత ఏదో స్ఫురించింది నాకు.  క్షణం తటపటాయించకుండా తలాడించింది, ఔనన్నట్టు. నేను మళ్ళీ రెట్టించకుండానే చెప్పుకొచ్చింది అతగాడి గురించి. అంధక అనాగరిక తెగవాడు, పేరు ఫేరవుడు. పచ్చబొట్టు పొడిచే వృత్తి అట. వాడు నాకు కూడా తెలుసునని విద్యుత్పర్ణ అంటే తెల్లబోయాను. మగపురుగుకి కూడా ప్రవేశం లేని అప్పటి మా కారాగృహానికి కాలయముళ్ల వంటి నపుంసకులే కావలి.  ఆ కాపలాలు మీరి రసాయనాలు అద్దిన సోకుల సౌచిక సాకుగా వచ్చిన ఒకేఒక మగాడు వాడు. నరకుడికి పచ్చబొట్టు మీద వ్యామోహం వల్ల నియోగింపబడ్డాడు. విద్యుత్పర్ణ బిడారే ఆ జంటకి సంకేతస్థలం అయ్యిందని అర్థమయ్యింది, ఆమె ఎడమరొమ్ముమొన చుట్టూ పరివేషం వంటి పచ్చబొట్టుని ఆమె నిస్సిగ్గుగా చూపించినప్పుడు.

ఎలుగులాంటి ఒళ్ళు, కలుగులో కంపెలుకల్లా కదలాడే కళ్ళు, గారపట్టిన పారపళ్ళు… ఆ ఆటవికుడ్ని తలుచుకుంటేనే కడుపు దేవేసినట్టయ్యింది నాకు. ఆ మొరటుబెరడుని ఈ మాధవీలత ఇంకా చుట్టుకునే ఉందని కూడా తెలిసింది నాకు తర్వాత. ఉపేంద్రుడు జితేంద్రుడై, పారిజాత వృక్షాన్ని పెకలించితెచ్చి, సత్యభామ పెరట్లో నాటించిన శుభసందర్భాన్ని సత్యాదేవి వేడుక చేసింది. శ్రీకృష్ణుని సకుటుంబ సపరివారం యావత్తూ సత్యభామ సన్నిధానంలో ఉంది. అంతటి సంబరం… అటువంటి వినోదం… అలాంటి ఆతిథ్యం మరిక నభూతో నభవిష్యతీ అన్నట్టు సాగింది. మిన్నంటిన ఆ కోలాహలంలో గుప్పుమన్న వదంతి- విద్యుత్పర్ణ గోమతీ తీరాన నెరుపుతున్న రంకు. జంకు బొంకు లేకుండా ఒప్పుకుంది విద్యుత్పర్ణ. తేనె రుచి మరిగిన ఉడుములా వచ్చాడట ఆమె వెన్నంటే ఫేరవుడు.

అందుకే నడిఝాముకి ఒక్కత్తే నడిచి వెళ్తుంది, గోమతితీరాన సరవీవనానికి. తోడు అక్కర్లేదని తాను వారించినా తన బాధ్యతగా అనుసరిస్తుంది మన్మధోద్దపిని. ఓ ఝాము జారాక, వెనుదిరిగిన విద్యుత్పర్ణని గుర్రం మీద తిరిగొచ్చేస్తుంది తన సౌధానికి. ఈ వ్యవహారంలో తలదూర్చకపోయినా, విద్యుత్పర్ణని విరోధించకపోయినా, తలచకుండా ఉండలేకపోయాను.

ఓ రోజైతే తల్లడిల్లిపోయాను. ఆ రోజు నాకు పర్వదినం. ఏ కబురూ లేకుండా ఎకాఎకీన నా మందిరానికి వచ్చేశాడు ఎల్లరికాడు, నా అల్లరివాడు. జగన్మోహనుడి తొలి సమాగమంలో జగత్తు రద్దయ్యింది నాకు. తుంపులుగా తునకలుగా చెల్లాచెదురైన స్వప్నశకలాల్ని ఆ నేరేడు మిసమిసల బాహువులు కావలింతల మిషతో కలిపి గుదిగుచ్చడాన్ని మించి మహత్యం మరొకటుంటుందని అనిపించలేదప్పుడు.

ఇసుకతీరం మీద అలలా అతడి వక్షస్థలం మీద సోలి నేను సొమ్మసిల్లినప్పుడు, ఆ ప్రశాంత నిశీథి నీరవాన్ని చీల్చినట్టు వినబడింది దేవదారూ ద్వారబంధనాల రొదాళం. విద్యుత్పర్ణ బయిల్దేరింది. నా గుండెలు అకారణంగా అవిసిపోయాయి. లోకమంతా గుప్పుమన్న సంగతి ఆ సర్వాంతర్యామికి తెలియదా? తెలిస్తే ఆ తగవులో అతడు తత్పరుడా? తటస్థుడా? తీర్పరా?

ఈ పరధ్యానంలో అంతవరకూ దాపరికం తోచని నా నగ్నదేహం వల్లెవాటుని లాక్కుంది, అతడికి పెడమరలి. నింపాదిగా లేచి పీతాంబరం మొలకి చుట్టాడు పీతవాసుడు. వెన్నల జిడ్డు చన్నుకి అలమినంత మెత్తగా, వీణెతీగలు మీటినంత సుతారంగా గోరొత్తులతోనే వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు గోస్వామి. చెప్పరాని సిగ్గుతో చప్పున తిరగలేదు గానీ, తర్వాత తెర తీసి చూస్తే సరవీవనం వైపు వెళ్తూ కనిపించాడు. వెంట వెళ్ళాలన్న వెంపర్లాటని బలవంతాన అణిచి నిద్రలేని రాత్రినలా దొర్లించాను.

వ్యాళింది మోసుకొచ్చిన కబురు ప్రకారం సరవీవనంలో విద్యుత్పర్ణని కలిశాడు కృష్ణమూర్తి. కానీ, ఏం జరిగిందో తెలియదని తాను చెబుతుండగానే వచ్చింది విద్యుత్పర్ణ. అప్పుడు కూడా తన కళ్ళు రక్తవర్ణంలో ఉన్నాయి గానీ, కోడెనాగు కళ్లలా రగలిపోవడం లేదు, జ్వాలా సౌందర్యపు తొలి దర్శనానందంలో తరించి, ఆ కాంతిలోనే ఆసాంత కాలిపోవాలని ఉద్వేగిస్తున్న ఉసిళ్ల కెంపు కంటిలా తహతహమంటున్నాయి. సెమ్మ నీడలో రాలిపడ్డ దీపప్పురుగు రెక్కలు కొట్టుకుంటున్న చప్పుడు వినిపించింది విద్యుత్పర్ణ పలుకులో. మన్మధోద్దపిని మధ్యవర్తిత్వం లేకుండానే అర్థమౌతోంది ఆమె మాట.

**          **

రత్యానంతర వివశంలో సగం తెరిచిన రెప్పలతో చూస్తున్నాను ఫేరవుడ్ని. చెకుముకి రాళ్లతో నిప్పురాజేస్తున్నాడు, మెడ విరిచిన కౌజుపిట్టని కాల్చాలని.

అప్పుడు వినిపించింది వేణునాదం. గుబురుల గుట్టు పరిమళమై తెలిసినట్టు, పొంచిన పొదలు దాగుడుమూతలాడినట్టు నీటిఊటలు చివ్వున చిమ్మినట్టు, కెంపుకంటి రొదలు ఏకతాళానికి కుదిరినట్టు – ఆ సంరావం తాకుతోంది నన్ను. ఎక్కడి నుంచో తేలివస్తున్నట్టనిపించిన ఆ వేణుగానం నా లోపలి నుంచే కొత్తరాగాలతో వినిపించడం నేను నమ్మలేకపోతున్నాను.  అదేదో కీచుశబ్దమని, కిర్రుచప్పుడనీ ఫేరవుడితో నమ్మబలికాను. భరించలేనట్టు ముఖం పెట్టాను, చెవులు మూసుకున్నట్టు అభినయించాను. ఓ అనంగరాగమై నాలోంచి ఉబుకుతుందని నా ప్రియుడికి తెలియకుండా ఉత్తుత్తి వెదుకులాటకి బయిల్దేరాను.

ఆ దేవులాట అనుకోకుండానే ఓ అన్వేషణై, అంతకుమునుపు ఏనాడూ ఎదురవ్వనివేవో తెలుస్తున్నాయి. లవంగ లావణ్య లతల పెనవేతలో కైపెక్కిన పిల్లతెమ్మెరలు. మంద్రంగా మార్మోగే  ఎలకోయిలలు- గండుతుమ్మెల యుగళగాత్రాల పొదరిళ్లు. కస్తూరి మద పరిమళాల చిగురాకులు కమ్ముకున్న కానుగు చెట్లు, మదనుడి గోళ్లైన మోదుగు పూల వసంతం. వివశంతో, వియోగతాపాన్ని మోస్తున్న నిస్సిగ్గు నీలవేణుల్ని చూసి తెల్లని దయతో నవ్వుతున్న కారుణ్య వృక్షాల వసంతం. ముక్కుమూసుకొని మూల నక్కే ముముక్షువుల్ని కూడా ప్రలోభపెడుతున్న మాధవి, మాలతి పుష్ప సుగందాల వసంత వేళ, గురువెంద తీగల ఆలింగనం వల్ల పులకించే మామిడితోపున  మురళీగానంలో లోనమైన మురారి దర్శనమయ్యింది. మొలకి పట్టు కౌపీనం తప్ప అంతా అనాచ్ఛాదితంగా ఉన్నాడు ఆజానుబాహుడు, అరవిందదళాయతాక్షుడు. ఆ నీలాంజనవర్ణ దేహాన్ని తాకి, పట్టి, కుదిపి కళ్లు తెరిపించాలంటే, కేవలం అక్కడ ఒక్కచోటనే కాకుండా అంతటా పరివ్యాప్తమైనట్టే అనిపించాడు.

మనసు మాట విన్నట్టే కళ్ళు తెరిచాడు. లాలనగా నవ్వాడు… లాలించి పిలిచాడు… లాలసతో నిమిరాడు. అనుమానంతో నా వెంట వచ్చి, చెట్టు చాటున నిఘా వేసిన ఫేరవుడితో మాట కలిపాడు. ఇప్పకట్టెల మీద కాల్చితే కౌజు రుచి హెచ్చుతుందని చెప్పాడు. గుర్రపు మేడ్రం వంటి వేర్లున్న అశ్వగంధ గొప్ప వాజీకరమని హాస్యమాడాడు. దురదపుడుతున్న వీపు అందక ఫేరవుడు అవస్థపడుతుంటే గోక్కోమని తన మోహనవంశీని ఇచ్చాడు.

సహస్రరూపుడంటారు కదా ఆ అనంతుడ్ని, నిజమే అప్పుడైతే నాకు అలాగే కనిపించాడు; నా కాపరి… నేస్తుడు… వేలుపు… మగడు… బంటు… గురుడు… అన్నీ తానే అనిపించాడు. మరిక ఉగ్గబట్టి ఉండలేక అడిగేశాను, నేను చేసిన ‘ద్రోహం’ గురించి, దాని వల్ల అతడు పడ్డ ఆరడి, అతడు మోసిన అప్రదిష్ట గురించీ.

ఉచ్చులేసే వెన్నముచ్చు నవ్వులతో ఉడికించాడు, ఇందులో తనకి జరిగిన ద్రోహమేంటని ఎదురొడ్డు ప్రశ్నలతో. “బృహతి! చెలిమి, ప్రేమ, ద్వేషం, ద్రోహం గురించి, నీతి నిబద్ధతల గురించీ ఆ గోపరికాడు నాకేమీ గొల్లసుద్దులు చెప్పలేదు. ఏవో అర్థం చేయించాడు, మరి కొన్నింటినేవో చెరిపించాడు. అప్పుడు ఆలోచించానే అక్కా, ఫేరవుడ్ని నేను నిండారా ప్రేమించానా? పోనీ మనసారా కామించానా? తూర్పార పట్టినట్టు చూసుకున్నాను నా మనసు. వాడి మీద నా మోహంలో ఎవరి మీదో దించుకోలేని ఉక్రోషముంది. ఓపలేని వలపో, లేక నిలువనీయని మోహమో లేని కలయికే ద్రోహం, కనుక నాకు జరిగిన ద్రోహమేంటి అన్నాడే కన్నయ్య. అంతే కాదు, ద్రోహంలో క్షణమైనా నివసించొద్దన్నాడు. అందుకే, ఫేరవుడి నుంచి శారీరకంగానూ విముక్తయ్యాను. ఇక ‘విధేయత’ అంటే ఒకరికి కట్టుబడటం కాదు, ఎవరితో ఉన్నామో – ఆ క్షణం, లేదా ఆ యుగం, లేదా యుగమై దీర్ఘమైన క్షణం, లేదా క్షణమై జారిపోయే యుగం – ఆ మూర్తిని తప్ప వేరెవ్వర్నీ తలచకపోవడం.

కలయిక అంటే… కూడిక… అంటే… మైథునం… అంటే –

రెండు ఒకటై, ఒకటి శూన్యమై అంతరించి…

రెండు ఏకమై,  బ్రహ్మాండమంత అనేకమై ఆవరించి…

… జరామరణాల సృష్టిమూలమై… సృజనశీలమై స్వేచ్ఛ పొందటం.

విధేయత అంటే విడుదల కావడమని ఎరిగించాడే.

**          **          **

రైవతక పర్వతమంతా ఉత్సవసౌరభంతో ఊగిపోతోంది. యాగశాలల్లో వేదఘోష మిన్నంటుతోంది. వాద్యకారులు… పాటగాళ్లు… ఆటకత్తెలు… అటుచూసినా సందడి. విడిది ప్రాంగణంలో సప్తఋషులు వేంచేసి ఉన్నారు. అభిమన్యుడి విలువిద్యాపాటవం చూసి ఋషిలోకం  ప్రశంసిస్తుంటే సుభధ్ర మురిసిపోతోంది. ముందటి యుగాంతరాల్ని అవలోకించిన అతిశయాల రేవతి, తన బిడ్డ శశిరేఖ నృత్యగానకౌశలాన్ని ప్రదర్శనకి నిలిపింది సగర్వంగా. సంతానాన్ని ఒక్కక్కరినే బ్రహ్మర్షులకి పరిచయం చేస్తున్నాడు పరంధాముడు, సతులతో కూడి.

రుక్మిణి సంతానం- సుదేష్ణ… చారుదేష్ణ… చారుదేహ… చారుగుప్తాదుల్ని, సత్యవతీ పుత్రులు- భాను… సుభాను… స్వర్భాను… ప్రభాను… ప్రభృతుల తర్వాత, అదే వరుసలో జాంబవతి కొమరులు- పురజిత్తు… శతజిత్తు… సహస్రజిత్తుల పేర్లు పలుకుతూ రవ్వంత ఇష్టం చూపకనే చూపుతున్నాడు శ్రీకృష్ణుడు.

“ఈ పరిచయ ప్రహసనంలోనే ఎంత పక్షపాతం ఉందో చూశావటే అక్కా,” అంటూ మరిక ఆగలేకపోయింది విద్యుత్పర్ణ.  ‘పదారువేల నూరున్నెనిమిదిలో నీ స్థానంమేది, నాదెక్కడ? మనకీ పుట్టారు పది మంది కొడుకులు. ఎందులో తక్కువ మనం’- ఇంకాస్త నోరు పెంచింది. ఆ వంకర వరసలు పాటించడంలోనే ఎక్కువ తక్కువ వివక్షలున్నాయని రుసరుసలాడుతూ పిల్లల కోడిలా దూకింది ముందుకు.  సప్తఋషులకి ప్రణమిల్లి తానే పరిచయం చేసుకుంటోంది తన బిడ్డల్ని- ఎదగందు… జమునయ్య… ఆశిరుడు… తెఱగంటి… కాట్రేడు…

‘పైశాచీభాష… పైశాచీభాష…’ అని చెవులు కొరుక్కుంటున్నారు మా సవతులు. విద్యుత్పర్ణని విలోకిస్తున్న విశ్వంభరుడి విలాసాన్ని చూస్తుండిపోయానలా.

**       **       **

శ్రీకృష్ణ ప్రేమి నా పింకితల్లి – నైమిష పుట్టినరోజు (అక్టోబర్ 29) కానుకగా-

Avatar

నరేష్ నున్నా

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • What a cinematic techni- multi- colour dream sequence! Hat’s off, Sir in all obedience to your linguistic fervour.

 • మీ శైలీ విన్యాసం తరంగమై వెల్లువెత్తింది. తురగమై పరుగిడింది. తరగయై ఊరించింది. భాష దాస్యం చేసింది. మనసు పరవశించింది. ఎరుక సాక్షాత్కరించింది.

 • ” సామరస్యం, అన్యోన్యం అదే కృష్ణతత్వం. విధేయత అంటే విడుదల కావడమని ఎరిగించాడే… లీలామానుష కేళీనటన కన్నయ్య. అతడు నా ఆత్మదీపం. ఇహపరాల ఇచ్చకం పోని ఓ స్వప్నసీమ… ”

  పరవళ్లు తొక్కిన మీ ఉత్సవసౌరభ రసచందనం మల్లాది రామకృష్ణశాస్త్రి గారు లాంటి పెద్దలకు చూపించారా నరేష్ నున్నా గారూ.

  • రామయ్య గారూ…
   మీ ప్రేమని ప్రపంచానికి పంచాలని, మీ ఇష్టాన్ని లోకపరం చేయాలని, మీ విశ్వాసాన్ని పారమార్థిక సత్యంగా జగమంతా చాటాలని తపించే మీ సదాబాలక సహృదయానికి ముందు నా జేజేలు.
   నా యీ కథ మల్లాది రామకృష్ణశాస్త్రి గారి వంటి పెద్దలు చూస్తే బాగుండునని ఉబలాట పడిన మాట నిజమేనండి. నేను పర్సనల్ గా పంపిన సందేశాల ద్వారా కంటే, మీరు ఈమెయిల్ లో చేసిన షేరింగ్ వల్ల దీన్ని చూసినవారే ఎక్కువ. అందుకు మీకు ధన్యవాదాలు.
   ఆంధ్రాంగ్లసంస్కృత కావ్యాలు ఆత్మగతం చేసుకున్న కవి, పండితులు, సూరపరాజు రాధాకృష్ణమూర్తి గారు- “It is an extraordinary piece of writing with a vision, one which is necessary now, as ever.” అని నా కథని ప్రశంసిస్తూ, కథ చదివాక-
   ‘కదాచిదద్యా లలితా పుంరూపా కృష్ణవిగ్రహా
   సర్వనారీ సమారంభాదకరోద్వివశమ్ జగత్…’ అని స్ఫురించిందని నాకు పంపిన మెసేజ్ లో అన్నారు సూరపరాజు వారు.
   ఆ లలితాంబే శ్రీకృష్ణునిగా అవతరించి జగత్తుని వివశం చేసినది – అని కదా ఈ తంత్రరాజ తంత్ర శ్లోక తాత్పర్యం. మన లీలాశుకుడు- కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం… అని దర్శించడానికి ప్రేరణ అంటారు కదా పై శ్లోకం. ఉబ్బితబ్బిబ్బయ్యాను నాలో ఇముడ్చుకోలేనంత అంత పెద్ద ప్రశంసకి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు