నీలి తోకచుక్క

“అతను కాగితాలపై బొమ్మలు వేసి ఇచ్చేవాడు. ఆకాశంలో చుక్కల గురించి కథలు చెప్పేవాడు. రాత్రుళ్ళు నన్ను జోకొడుతూ పాటలు పాడి నిద్రపుచ్చేవాడు.  యిద్దరం కలిసి పెదవాగు వెంట రంగురాళ్ళని ఏరే వాళ్ళం. అతడెప్పుడూ  ఊరు దాటివెళ్లడం నేను చూడలేదు. అలాంటి పరం ఇప్పుడు ఊరు వదలి ఎందుకు వెళ్ళిపోయాడంటావ్.”

“దానికి కారణం అతను ప్రేమించిన అమ్మాయంటారు అతని ఇంట్లో వాళ్లు. ఆమెని కలిసాక అతనిలో మార్పు వచ్చిందట.”

“హ్మ్, మొదటి నుంచీ దిగులుకీ బాధకీ మధ్య నలుగుతూ ఉండేవాడు. అదే అతన్ని ఊరు నుంచి దూరం చేసిందేమో!”

“అది కాదేమో సావి. అతను జీవితం గురించి అతిగా ఊహించుకునేవాడు. ఓ సారి నీలి తోక చుక్క గురించి చెప్పాడు. అది కనిపించిన వారికి విశ్వరహస్యాలు తెలిసిపోతాయని అనేవాడు. ఆ విషయాన్ని బలంగా నమ్మేవాడు.”

“అంటే.. పరంకి నీలి తోక చుక్క కనిపించిందంటావా? అందుకే కనపడకుండా పోయాడా? అసలీ విశ్వరహస్యాలు అంటే ఏంటి.. అవి తెలిస్తే కనిపించకుండాపోతారా!”

“ఏమో సావీ, తెలియదు.”

**

“రెండో పెగ్గులో ఉన్నావురా సుబ్బు. చెప్పిన కథ చాలు, బండి తిప్పు ఇక ఇంటికి వెళ్దాం.”

“హే, అది కథ కాదు, నిజం. ఇంకొంచెం దూరం వెళ్దాం. ఇదేందోరా  తాగింది కూడా ఎక్కట్లేదు.”

“ఆమెని ప్రేమించావా?”

“ప్రేమో కాదో!  కానీ, ఆమె లాంటి మనిషిని ఎక్కడా చూడలేదు.  ఆమె పక్షులతో, చెట్లతో, జంతువులతో మాట్లాడేది. అవి చెప్పే కబుర్లు వింటునట్లుగా ఉండేది. ఇక మనుషులంటావా, వాళ్ల పట్ల చాలా దయ చూపిస్తున్నట్లుగా కనిపించేది. ఊళ్ళో ఎవరు చనిపోయినా వాళ్ళింటికి వెళ్లి వాళ్ళతో  కలిసి ఏడిచేది. వాళ్ళ పక్కన చిల్లర పోసివచ్చేది. నా వల్ల తనకు ఎలాంటి హాని లేదని ఆమె నమ్మిందనుకుంటా. ఎప్పుడైనా అర్ధరాత్రి పూట వచ్చి నన్ను నిద్రలేపి, ఏటి దగ్గరికి వెళ్దాం వస్తావా అని పిలిచేది. నేను ఆమెతో పాటు వెళ్లి ఆ ఏటి గట్టుపైన కూర్చునేవాడ్ని. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే ఆమె, అప్పుడు మాత్రం ఏమీ మాట్లాడేది కాదు. ఆ చీకట్లో ఆకాశం వైపుకి చూస్తూ ఉండిపోయేది. ఒక్కోసారి అలసిపోయేదాకా ఈతకొట్టి  నా పక్కన కూర్చునేది. నగ్నంగా నా పక్కనే కూర్చున్నా ఆమెని తాకాలని కానీ, ఏదైనా మాట్లాడాలని కానీ అనిపించేది కాదు. ఆమె ఆ ప్రకృతిలో భాగంగా తోచేది. ఆ సమయం ఎంతో బావుండేది, లోపలంతా నెమ్మదిగా శాంతి పరుచుకున్నట్టు మనసంతా ఎంతో తేలికైనట్లు.”

“మరి ఆమెతో నువ్వెప్పుడూ……..?”

“హే, ఆపు”

“సరేలే, ఇంతకూ ఆమె ఎక్కడికి వెళ్ళిందంటావ్.”

“ఆమె ఎవరితోనో వెళ్ళిపోయిందని, సినిమాల్లో వేషాలకోసం పోయిందని, పైచదువుల కోసం వేరే దేశం వెళ్లిందని ఊర్లో రకరకాలుగా చెప్పుకునేవాళ్ళు.”

“ఆమె కోసం వెతికావా ఎప్పుడన్నా?”

“ఆమె వెతికితే దొరకదు. ఆమె రావాలనుకుంటేనే తిరిగి వస్తుంది.”

“ఆమె ఎందుకు వెళ్ళిందంటావ్?”

“తెలీదు కానీ నేను ఆమెకి నీలి తోకచుక్కను గురించి చెప్పిన తరువాత కనిపించలేదు.”

“ఆమెకి నీలి తోక చుక్క కనిపించిందంటావా?”

“ఏమో తెలియదు.”

*

బస్సు ఓ చిన్న గుట్ట దాటి మలుపు తిరిగి ఓ లోయ పక్కన ఆగింది. బస్సు దిగాను. ఆ పల్లెకి వెళ్లే మట్టి బాట నేరుగా లోయలోకి వెళ్తుంది. లోపలికి ఐదుకిలోమీటర్లు నడవాలి.

రేకుల ఇల్లు. తలుపు అడ్డం వేసి ఉంది. తలుపు తట్టాను. లోపలనుంచి వచ్చిన మనిషి నా వైపు చూసాడు.

“మీరేనా సైదులు?”

“అవునమ్మా” అంటూ చిన్న నులకమంచం తీసి బయట వేసాడు.

చుట్టూ పెద్ద చెట్ల నీడ పడుతోంది. వాతావరణం చల్లగా ఉంది.

చుట్ట తెచ్చుకొని ఎదురుగా కూర్చున్నాడు.

ఆయన కోసం ఇంతవరకు ఎవరూ రాలేదు. ఎవరైనా వస్తారేమోనని చాలా రోజులుగా చూస్తున్నాం.

“ఆయన ఎక్కడ ఉంటాడు?”
“ఇక్కడ ఉండడమ్మా. అడవిలో తిరుగుతా ఉంటాడు. ఎప్పుడైనా ఇటు వస్తే కొద్దిగా అన్నం పెడతా. ఇష్టం అయితే తింటాడు. లేకపోతే విసిరికొడతాడు. ఏమీ మాట్లాడడు. లోలోపలే ఏదో మాట్లాడుకుంటా ఉంటాడు. కానీ, పిచ్చివాడిలా అనిపించడు. చిన్నపిల్లలతో ఆడతాడు కాసేపు. గబ్బిలాల దిబ్బల్లో కనపడతాడని గొర్రెలు కాసేవాళ్ళు చెప్తుంటారు. అక్కడ గుహలు ఉన్నాయి. వాటిలో ఉంటాడని అంటారు.”

“అక్కడికెలా వెళ్ళాలి?”

“నువ్వెల్తావా? ఆయన నిన్ను దగ్గరికి రానిస్తాడో లేదో!”
“ఏం?”

“ఆడోళ్ళని దగ్గరికి రానివ్వడు. దగ్గరికొస్తే వాళ్ళని రాళ్లతో కొడతాడు. లోలోపల గొణుక్కుంటూ.. చేతులు ఆకాశంలో తిప్పుతాడు.”

“ఎందుకు!?” గొంతుకేదో అడ్డుపడిందేమో, అది మింగడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సన్నగా ధ్వనించింది ఈ ప్రశ్న.

“తెలియదమ్మా. ఇంతకీ ఆయన నీకేమవుతాడు?”

ఏం చెప్పాలో అర్థం కాలేదు.

“నేను అతన్ని కలవాలి” అని మాత్రమే చెప్పాను.

“ఇప్పుడు సూర్యుడెల్లినాడు కదమ్మా! రేపొద్దుగాలే వెళ్దువుగాని.. రాత్రికి ఇక్కడే ఉండు” అన్నాడు సైదులు లోలోపల ఏదో గొణుక్కుంటూ.

“ఆరుబయట పడుకుంటా” అని చెప్పా.

రాత్రులు జంతువులు వస్తాయంటూ బయట పడుకోనివ్వలేదు సైదులు. కంచంలో అన్నం పెట్టి వేడి చారు పోసి ఇచ్చాడు. ఎన్నో రోజుల తరువాత ఆకలితో తిన్నట్లు అనిపించింది. ఆ చారు కొద్దిగా వగరుగా కొద్దిగా చేదుగా అనిపించింది. అయినా ఆ రుచి ఎప్పుడూ తిననంత బాగుంది.

సైదులు నా గురించి ఏమీ అడగలేదు. ఆ రోజు ఆకాశంలో చుక్కలు చూస్తూ పడుకోవాలని ఆశపడ్డా. అర్ధరాత్రి మెలుకువ వచ్చింది. ఏదో జంతువు అరుస్తున్నట్లుంది. చెట్లల్లో ఎవరో నడుస్తున్నట్లు చప్పుళ్ళు..   సైదుల్ని పిలువాలనుకున్నా. అయినా కళ్ళు తెరవకుండా ధైర్యం నటించా.

ఎప్పుడు నిద్రపోయానో తెలీదు. పూర్తిగా తెల్లారక మెలుకువ వచ్చింది. సైదులు అప్పటికే ఏదో వండుతున్నాడు.

రాత్రి ఏమైనా కల వచ్చిందా అని ఆలోచించా. ఏమీ  గుర్తుకు రాలేదు. ఏదో కల వచ్చినట్లు ఉంది. అది నిజంగానే జరిగి వెళ్లినట్లు అనిపించింది.

“ఎప్పుడో ఎక్కడో ఎవరినో కలిసిఉంటాం. అలా దగ్గరగా వచ్చిన వాళ్లు గుర్తు కూడా రాలేనంత దూరంగా వెళ్లిపోతారు. వాళ్ల ఉనికి.. గుర్తుకు రాకుండా వచ్చిపోయే  కలలరూపంలో తెలుస్తుంది” అనేది నానమ్మ. ఆ మాట గుర్తొచ్చి ఉషారుగా అనిపించింది.

“ఈ రోజు నేను గబ్బిలాల దిబ్బకు వెళ్తా” అని సైదులుతో చెప్పాను.

“నేను కూడ వస్తానమ్మా. కాస్త అంబలి తాగి వెళ్దాం” అన్నాడు.

“నాకు ఎక్కువ సమయం లేదు. ఊరెళ్లాలి. ఈ రోజే అతన్ని కలవాలి” అని చెప్పాను.
“ఆ మనిషి అతనికి కావాలనుకుంటేనే కనపడతాడు. లేకపోతే కనపడడమ్మా” అంటూ

అంబలి చేతికి ఇచ్చాడు. మాట్లాడకుండా మొత్తం తాగేశా.

బారుగా ఉన్న కొడవలి లాంటిది వెంట పట్టుకొచ్చాడు సైదులు. కొంచెం దూరం కాలిబాటలో నడిచాము. ఆ తర్వాత బాట అంటూ ఏమీ లేదు. చుట్టూ ఏపుగా పెరిగిన పొదలు, చెట్లు. నడవడం కష్టంగా అనిపించింది. సైదులు మాత్రం వేగంగా నడుస్తున్నాడు. పెద్ద గుట్టలాంటిది వచ్చింది. అక్కడ కాసేపు ఆగాము.

“ఇక్కడ జాగ్రత్తగా ఉండాలమ్మా. అడవిజంతువులు ఉంటాయి” అంటూ చేతికి కర్రని ఇచ్చాడు సైదులు.

సైదులు కాళ్ళకి చెప్పులు లేవు. అయినా ఒడుపుగా నడుస్తూ వెళుతున్నాడు. ఆ పొదలతో నిండిన రాళ్ల గుట్టపై నడవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. అలా రెండుగంటలు నడిచాం. కొద్దిసేపు ఆగుదామని సైదులుతో చెప్పాను. కిందనుంచి చూసినప్పుడు చిన్నగానే కనిపించిన గుట్ట నడుస్తూ పోతుంటే ఎంతకూ తెగడం లేదు.

“అతనిక్కడికి ఎలా వచ్చాడు?”

“వెంకుస తీసుకొచ్చాడు. ఇక్కడి మా అందరికీ వెంకుస గురువులాంటోడు. ఓ రోజు ఈ మనిషిని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడు. కాశీలో దొరికాడట. ఇతన్ని ఎవరూ ఏమీ అనొద్దని, ఎప్పుడైనా వస్తే అన్నం పెట్టమని చెప్పి వెళ్లిపోయాడు.”

కొద్దిగా చదునుగా ఉన్న ప్రదేశం దగ్గరికి వచ్చాము. పెద్ద చెట్టు నీడ పరుచుకొని ఉంది. కాస్త చల్లగా ఉంది. ఇక్కడ కొద్ది సేపు ఆగుదామని అన్నాను కాస్త రొప్పుతూ.

“నేనో మాట చెప్పనా అమ్మా. ఇక్కడ మనం ఎంత వెతికినా ఆ మనిషి కనబడడు. ఇక ఆ గబ్బిలాల దిబ్బల్లో ఉండే గుహల గురించే చాలా మంది కథలుకథలుగా చెప్తుంటారు. అవి ఎన్ని ఉన్నాయో ఎవరూ కనుక్కోలేరని, వాటిలోకి వెళ్ళినవారు తిరిగిరాలేరని, కొంతమందికి ఎంత తిరిగినా ఆ గుహలను చేరుకోవడం కష్టమని.”

అతని మాటలు చిత్రంగా తోచాయి. అబద్ధం చెప్తున్నట్లు అనిపించలేదు.

చెట్టుకింద బండని ఆనుకొని కూర్చున్నాను. సైదులు కొద్దిగా దూరంలో కూర్చున్నాడు. చుట్ట వెలిగించాడు. సన్నగా పొగ గాలిలోకి పరుచుకుంటుంది.

‘గాలిలోకి వ్యాపిస్తున్న ఆ పొగపైన మంచు కురుస్తూ పేరుకుపోతుంది. అదంతా మంచునేలగా మారిపోతుంది. ఓ చిన్న పాప దానిపై నడుస్తోంది. నడుస్తూ, నా వైపే  వెనక్కి తిరిగి చూస్తోంది. అలా చూస్తూనే మంచుపైన పరుగుతీస్తుంది.  తన వెనుక ఐస్ కరుగుతూ వెళ్తోంది. గుండె వేగంగా కొట్టుకుంది. తన కాళ్ల కింద మంచు నీరవుతోంది. భయంగా ఆకాశంలోకి చూసాను. పొగలో మంచులో కలిసిపోయి కనిపిస్తున్న ఆకాశంలో నీలి తోకచుక్క మెరిసిపోతూ కనిపిస్తుంది. హఠాత్తుగా గురకలాంటి శబ్దం వినిపించింది. ఆ వైపు చూసా. నా ఎదురుగా ఉన్న గుట్టపైనుంచి తోడేలు కళ్ళ మనిషి తీక్షణంగా నా వైపే చూస్తూ పైకి దూసుకొస్తున్నాడు. సైదులు ఎక్కడికి పోయాడో తెలీడం లేదు. నోరు పెగలట్లేదు. ఎవరో తరిమినట్లు గట్టిగా గాలి వీచింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నా చేతిలోని సంచి దొర్లి కిందపడింది. అందులోంచి పేపర్లు, దాచుకున్న రంగురాళ్లు చెల్లా  చెదురవుతున్నాయి.’

పెద్దగా అరుస్తూ కళ్లుతెరిచా.

సైదులు వేగంగా నా వైపు నడుస్తూ వస్తున్నాడు.

అదంతా కలో! నిజమో! భయమో! భ్రమో!

వర్షం పడేట్లు ఉందమ్మా. ఇక వెనక్కి వెళ్దామన్నాడు. మారు మాట్లాడకుండా వెనుతిరిగా. ఇక, ఆ రోజే వెళ్ళిపోతానని చెప్పా.

“ఎక్కడినుంచి వచ్చావమ్మా?” అని అడిగాడు.

దూరపు మంచు దేశం నుంచి వచ్చానని చెప్పాను.

“ఆయన పేరు తెలుసా?”

“పరం”

“నీ పేరు?”

“సావి”

“కలవకుండానే వెళ్తున్నావు.”

“ఇక కలవాల్సిన అవసరం లేదు.”

“ఇంతకూ ఏమవుతాడమ్మా అతను నీకు?”

“ఏమో తెలీదు!!!”

*

శ్రీ సుధా మోదుగు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నీ కథ లు .భలే ఉంటాయి సుధా.
    మొన్ననే అనుకున్న సారంగా లో కూడా వేసి ఉంటారు చదవాలి అని ఈ మాటలో వి చదివాను.
    అసలు వేరే శైలి
    అభినందనలు

  • ఒక నిగూఢమైన కథ, తెలియని విషాదపు జీర చివరికంటా సాగిన కథ, మానవీయ సంబంధంలో ఇంత ఆర్ధ్రత ఇంత చిక్కదనం, ఇంతలోతు , ఇంత సాంధ్రత మరే కథలోనూ నాకు తారసపడలేదు.

    శ్రీసుధ గారికి అభినందనలు 🙏

  • మంచి కథ. మనుషులు భౌతికంగా కలవాల్సిన అవసరం లేదు. ఎవరేమిటో అర్థం అయినప్పుడు వాళ్ళు ఉండే చోటు గురించి దిగులు అక్కర లేదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు