నిరంతరం నవ్వుతూనే…వెళ్ళిపోయిన ఇంద్రగంటి

గత నెల ఏదో చిన్న అనారోగ్యంతో నేను నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉండి, ఇంటికి వెళ్ళాక ఆన్ -లైన్ లో తెలుగు పత్రికలు చూస్తూ ఉంటే “ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇక లేరు” అనే వార్త చూసి నిర్ఘాంత పోయాను. అనుకోకుండానే కళ్ళు చెమర్చాయి. ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాను. ఆయనతో నా అనుబంధం అంత సుదీర్ఘమైనదే కాక ప్రగాఢమైనది కూడా. ఆయనే కాదు ఆయన సతీమణి, ప్రముఖ రచయిత జానకీ బాల గారి తోటీ అంతే ఆత్మీయానుబంధం అప్పటి నుంచీ కొనసాగుతూనే ఉంది. ఇక వారి అమ్మాయి కిరణ్మయీ, కుమారుడు, ప్రముఖ దర్శకుడు మోహన కృష్ణలని ఎప్పుడు ఇండియా వెళ్ళినా కలిసి ఆ సహజంగానే ఉన్నత సంస్కారవంతులు అయిన ఇంద్రగంటి వారి కుటుంబంతో విలువైన సమయం, ఎంతో ఆహ్లాదంగా గడపడం నా ఆనవాయితీ. అలాంటిది ఇప్పుడు శర్మ గారు లేరంటే చాలా బాధగా ఉంది. ఈ సందర్భంగా ఆయనతో నాకున్న స్నేహానుబంధాన్ని నెమరు వేసుకోవడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. శ్రీకాంత శర్మ గారి అసమాన పాండిత్యాన్ని విశ్లేషించే అర్హత నాకు లేదు.

1998 లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యం లో మొట్టమొదటి సారిగా అమెరికాలో జాతీయ స్థాయిలో సినీ తారలు, రాజకీయ నాయకులు మొదలైన వారి ప్రమేయం లేకుండా కేవలం అమెరికా తెలుగు రచయితలనీ, సాహితీవేత్తలనీ ఒకే వేదిక మీదకి రప్పించి ఒక సాహితీ సదస్సు నిర్వహిస్తే బావుంటుంది అనే ఆలోచన వచ్చింది. ఆ సదస్సుకి లాంఛనప్రాయంగా   ప్రధాన అతిధులు ఉండాలి అనుకుని అందుకు బాపు-రమణ లని పిలిస్తే సమంజసంగా ఉంటుంది అనుకుని బాపు గారిని పిలిచాను. ఆయన మొత్తం అంతా విని “నీ ఆలోచన బావుంది. ఆటువంటి సాహితీ సదస్సుకి ప్రధాన అతిధిగా మా ఇద్దరి గొట్టాం గాళ్ళ కంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సరి అయిన వాడు. నేను కూడా ఇప్పుడే ఆయనతో ఒక మాట చెప్తాను. నువ్వు ఆయన్ని రేపో, ఎల్లుండో పిలిచి ఆహ్వానించు” అని బాపు గారు శర్మ గారి ఫోన్ నెంబరు ఇచ్చారు. అంత వరకూ నేను శ్రీకాంత శర్మ గారు అనుభూతి కవి అని వినడమే కానీ ఆయన గురించి ఎక్కువ తెలియదు.

చెప్పినట్టుగానే బాపు గారు ఆయన్ని పిలిచి ఏం చెప్పారో తెలియదు కానీ రెండు రోజుల తర్వాత నేను ఫోన్ చెయ్యగానే శ్రీకాంత శర్మ గారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడి తప్పకుండా వస్తాను అన్నారు. అప్పుడు ఆయన ఆంధ్ర ప్రభ వార పత్రిక ప్రధాన సంపాదకులుగా చాలా చాలా బిజీగా ఉండే వారు. అందుకే “వారం కంటే అమెరికాలో ఉండలేను” అని చెప్పారు. వెను వెంటనే అన్ని ఏర్పాట్లు చెయ్యడం, ఆయనకీ వీసా వచ్చి 1998 మే నెలాఖరులో సదస్సు తేదీలకి రెండు రోజులు ముందు సదస్సు జరిగిన అట్లాంటాకి రావడం జరిగిపోయాయి. అదే ఆయన మొదటి అమెరికా పర్యటన. ఆ చారిత్రాత్మక సభకి ప్రధాన అతిధిగా “తెలుగు సాహిత్యంలో సమకాలీన పోకడలు” అనే అంశం మీద గత వంద సంవత్సరాలలో కవిత్వం, వచన కవిత్వం, భావ కవిత్వం, రకరకాల కవిత్వ వాదాలు, కథా సాహిత్యం, నాటికలు ఇలా అన్ని సాహిత్య ప్రక్రియల పురోగతి గురించీ అనర్గళంగా, కాగితం చూడకుండా ప్రసంగించి మమ్మల్ని ఆచార్యం చకితుల్ని చేసి ఎన్నెన్నో తెలియని విశేషాలు చెప్పారు శ్రీకాంత శర్మ గారు.

అటు ప్రాచీన , ఇటు ఆధునిక సాహిత్యాలలో అన్ని ప్రక్రియలలోనూ శ్రీకాంత శర్మ గారికి ఉన్న విస్తృత పరిజ్ఞానాన్ని నేను ఆ తరువాత అనేక పర్యాయాలు ఆస్వాదించి తరించాను. ఆ సదస్సు కోసం బాపు గారి కోరిక మీద ఆయన బొమ్మలతో శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారి “తిరుప్పావై “ పుస్తకాన్ని శ్రీకాంత శర్మ గారు ఆవిష్కరించి, స్వయంగా తన కూడా వంద కాపీలు బాపు గారికీ, మరో వంద కాపీలు లక్షణ యతీంద్రుల వారి ఆశ్రమానికీ ఇవ్వడానికి అమెరికా నించి ఇండియా ‘మోసుకళ్ళారు” పాపం. ఆ రోజుల్లో అసలు రంగుల పుస్తక ముద్రణ మీద అవగాహన లేక మేము అస్తవ్యస్తంగా ప్రచురించిన ఆ పుస్తకం బాపు గారికి మనస్తాపం కలిగించినా శ్రీకాంత శర్మ గారు సద్ది చెప్పారు. నేనూ, పెమ్మరాజు వేణుగోపాల రావు గారూ ఆ సదస్సులో చోటు చేసుకున్న అన్ని ప్రసంగ వ్యాసాలూ, సభ విశేషాలూ, ఫోటోలూ సేకరించి పంపించగా శర్మ గారే అన్నింటినీ కలిపి “మొట్ట మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక” కి రూపకల్పన చేసి సహాయ పడ్డారు. ఆ సంచికలో శ్రీకాంత శర్మ గారు వ్రాసి ఇచ్చిన ఆయన ప్రధానోపన్యాసం ప్రచురించాం. అది చదువుదాం అని ఎవరైనా అనుకుంటే నన్ను సంప్రదిస్తే పంపిస్తాను.

ఆ తరువాత 2002 లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అనుబంధ విభాగం ఇండియాలో ట్రస్ట్ గా పెడితే బావుంటుంది అనే ఆలోచన వచ్చీ రాగానే వెంటనే నేనూ, వంశీ రామరాజు గారూ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి ఇంటికి వెళ్ళిపోయి ఆయనతోటీ, జానకీ బాల గారితోటీ మా ఆలోచన పంచుకున్నాం. ఆయన ఎంతో సహృదయంతో స్పందించి “శాలువాలూ, సత్కారాలు, పుస్తకావిష్కరణలు మాత్రమే సాహితీ సభలుగా చెలామణీ అయిపోతున్న స్థానిక పరిస్థితి కి భిన్నంగా నిజమైన సాహిత్య సభలు, కార్యక్రమాలు చెయ్యాలి “అని తన ఆలోచనలని, సూచనలని మాకు వివరంగా చెప్పారు శర్మ గారు. వెంటనే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారే చైర్మన్ గానూ, రచన సాయి గారు వైస్ చైర్మన్, జానకీ బాల గారు, తెన్నేటి సుధ గారూ ట్రస్టీ లు గానూ, వంశీ రామరాజు గారు మేనేజింగ్ ట్రస్టీ గానూ హైదరాబాద్ లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అనే పేరిటే లాభాపేక్ష లేని సంస్థ రిజిష్టర్ చేశాం. నిజానికి మా ఇద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు నిరంతరం సాగడానికి శ్రీకాంత శర్మ గారు ఆ రోజుల్లోనే ఒక కంప్యూటర్ కొనుక్కుని ఇ-మెయిల్ లో సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం మొదలు పెట్టారు అని జ్ఞాపకం.

ఆ సంస్థ మొదటి పనిగా “అమెరికా కథలు రచనలో విరివిగానూ, ఇతర పత్రికలలో అప్పుడప్పుడూ చూడడం తప్ప ఇండియాలో అమెరికా కథకుల సృజనాత్మక మీదా, కొత్త దనం మీదా ఇండియాలో ఎక్కువ అవగాహన లేదు, రాజు గారూ. అంచేత మీరు ఇక్కడ కూడా అమెరికా తెలుగు కథా సంకలనం ఒకటి ప్రచురిస్తే బావుంటుంది” అని సూచించారు శర్మ గారు. అప్పటికే నాలుగైదు అమెరికా తెలుగు కథానిక సంకలనాలు ప్రచురించిన అనుభవం ఉంది కాబట్టి నేను వెనువంటనే ఆయన సూచనకి ఒప్పేసుకున్నాను. ఇండియాలో మా మొట్టమొదటి ప్రచురణ అయిన ఆ అమెరికా కథ సంకలనానికి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారే ప్రధాన సంపాదకులు కాగా జానకీ బాల గారు సహ సంపాదకురాలు. ఆర్టిస్ట్ చంద్ర ముఖ చిత్రం, ఖదీర్ బాబు రూప కల్పన లో సహాయం చేయగా ఇంద్రగంటి దంపతులు అన్ని కథలూ ఎంపిక చేసి ఆ చారిత్రక కథా సంకలనాన్ని మా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఇండియా సంస్థ తరఫున ముద్రించి అమెరికా కథకులకి గుర్తింపు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టారు. అంతే కాదు, ఆ పుస్తకావిష్కరణ కర్తగా చేకూరి రామారావు గారి ఇంటికి తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశారు. అలాంటి సభలకి ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడని చేకూరి గారు శర్మ గారి మాట కాదు అనలేక ఒప్పుకున్నారు. అలాగే పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారిని విజయవాడ నించి ప్రత్యేకంగా రప్పించారు. కె. శ్రీనివాస్ ఆ గ్రంధాన్ని పరిచయం చేసిన ఆ పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ లో శర్మ గారి సమర్ధవంతమైన, ఆత్మీయమైన పద్ధతిలో చాలా దిగ్విజయంగా జరిగింది. అంతే కాదు. కేవలం నా మీద అభిమానంతో ఆ సభ అనంతరం నేను వ్రాసిన “యమ సభ” హాస్య నాటికని స్థానిక ప్రొఫెషనల్ నటీ నటుల చేత ప్రదర్శింప చేశారు శ్రీకాంత శర్మ గారు.

ఇక శ్రీకాంత శర్మ గారి సాహిత్య విశ్వరూపం మరో కోణంలో చూసే అవకాశం మేము డిశంబర్ 31, 2006 & జనవరి 1, 2007 తేదీలలో హైదరాబాద్ లో నిర్వహించిన చారిత్రాత్మక మొట్ట మొదటి ప్రపంచ సాహితీ సదస్సు సందర్భంలో కలిగింది. అసలు ఆ ఆలోచన రాగానే “శభాష్. ఈ రోజుల్లో ఇది చాలా అవసరం” అని ఆయన ప్రోత్సహించడమే కాకుండా ఆ సదస్సు మొత్తం ప్రణాళికని మూడు పేజీలలో అప్పటికప్పుడు వ్రాసి ఇచ్చేశారు. అందులో తెలుగు నాట ఉన్న ఏయే రచయిత/సాహితీ వేత్త ఏయే అంశాల మీద ప్రసంగించాలో నిర్దేశించే మహత్తరమైన ప్రణాళిక అది. స్వయంగా అనుభూతి కవి, కథకులు, విశ్లేషకులు, నాటక రచయిత, ఎంతో క్లిష్టమైన కూచిపూడి నృత్య దృశ్య నాటక రచయిత, సినీ గేయ రచయిత, రేడియో ప్రయోక్త, ఉన్నత స్థాయి పత్రికా సంపాదకులు, ప్రాచీన, ఆధునిక సాహిత్యాలలో అన్ని ప్రక్రియ లలోనూ వ్యక్తిగత ప్రతిభ, పాండిత్యాలు ఉన్న ఏకైక సాహితీ వేత్తగా రాణించడమే కాకుండా, అసంఖ్యాకమైన ఇతర ఆదునిక తెలుగు రచయితలలో కూడా ఎవరు, ఏ అంశం మీద పట్టు ఉండి ఈ ప్రపంచ సదస్సుకి తగిన స్థాయిలో బాగా మాట్లాడగలరో శ్రీకాంత శర్మ గారికి కరతలామలకం అని తెలిసి ఆ రోజే ఆయనకి పాదాభివందనం చేశాను. ఆ సదస్సులో అనిర్వచనీయమైన మరొక ఆనందం బాపు గారు తన సతీమణి భాగ్యమతి గారి తోనూ, రమణ గారు సతీమణి శ్రీదేవి గారి తోనూ మొట్ట మొదటి సారిగా ఒక బహిరంగ వేదిక ని అలంకరించడం ఒక ఎత్తు అయితే బాపు గారికి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారూ, ముళ్ళపూడి వారికి నేనూ సన్మాన పత్రాలు సమర్పించి వారిద్దరి మైత్రీ షష్టి పూర్తి సందర్భంగా జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించుకోవడం మరొక ఎత్తు. ఆనాటి అపురూపమైన ఆ ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను.

ఏ సంవత్సరమో జ్ఞాపకం లేదు కానీ ఆ తరవాత ఒక సారి శ్రీకాంత శర్మ గారూ, జానకీ బాల గారూ హ్యూస్టన్ లో వారం రోజులు మాతో ఉండి మా కుటీరాన్ని పావనం చేశారు. వారికి నాసా చూపించినప్పటి ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. శ్రీకాంత శర్మ గారి మీద గౌరవ భావంతో ఆయన రచించిన “పరి పరి పరిచయాలు” అనే అపురూపమైన పుస్తకాన్ని 2009 లో మా సంస్థ తరఫున ప్రచురించి ఆయనకి కానుక గా సమర్పించాం. ఇక ఆయనా, జానకీ బాల గార్ల సూచన మీద పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు నాకు హాస్య రచయితగా వారి ధర్మనిధి పురస్కారం ఇచ్చి నన్ను సత్కరించారు. అది వారికి నా మీద ఉన్న వాత్సల్యానికి మరొక ఉదాహరణ.

సందర్భమూ, తారీకులూ ఇప్పుడు గుర్తు లేవు కానీ ఒక సారి నేనూ, ఇంద్రగంటి వారూ ఏదో సాహిత్య కార్యక్రమానికి అతిధులుగా విజయవాడ కలిసి వెళ్లినప్పుడు అక్కడ శర్మ గారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఇంకా తెలిసి వచ్చాయి. అక్కడ ఉన్న రెండు, మూడు రోజులూ నవోదయా రామ్మోహన్, పన్నాల భట్టు మొదలైన వారు ఆయన్ని వదిలి పెట్టనే లేదు. ఇక శర్మ గారు నన్ను నండూరి రామ్మోహన రావు గారి ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఆ మహానుభావులు ఇద్దరితో అపురూపం అయిన నాలుగైదు గంటల సమయం గడపడం నా జీవితంలో మరపు రాని సంఘటన.

ఇటీవలి కాలంలో ఆయన కాస్త ఆరోగ్యం సహకరించకా, హైదరాబాద్ లో వారి నివాసం మేము తరచూ కార్యక్రమాలు నిర్వహించే శ్రీ త్యాగరాజ గాన సభ, చిక్కడ్ పల్లి కి చాలా దూరం అవడం చేత ప్రయాణాలు ఇబ్బందికరంగా మారిన కారణంగానూ నాకు పరిస్తితి వివరించి మా సంస్థ చైర్మన్ పదవి నుంచి విరమించినా మాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉన్నారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారూ, జానకీ బాల గారూ.

ఎంతో స్నేహశీలి, నిరంతరం నవ్వుతూనే జీవితం గడిపిన హాస్య ప్రియులు, అజాత శత్రువు అద్వితీయ సాహితీ వేత్త అయిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు గత జులై 25, 2019 నాడు పరమపదించడం ఎంతో బాధాకరం. కానీ అయన జ్ఞాపకాలు కలకాలం మాతోనే ఉంటాయి. ఆయన ఆత్మ శాంతి కి ప్రార్ధిస్తూ, జానకీ బాల గారికీ, మోహన కృష్ణ, కిరణ్మయి ల కీ, ఇతర కుటుంబ సభ్యులకీ ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను.

*

 

వంగూరి చిట్టెన్ రాజు

వంగూరి చిట్టెన్ రాజు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు