నిప్పయినా, జోకయినా రాజేయాల్సిందే 

హాస్యావధాని శంకరనారాయణతో ముఖాముఖి

శంకరనారాయణ మాటే కాదు, రూపు కూడా నవ్వులను రువ్వుతుంది. హాస్య, వ్యంగ్య చంద్రికలను శిరసున దాల్చిన త్రినేత్రుడు. చమత్కారాలను చేమంతి దండలుగా అల్లి మనోఫలకంపైకి బాణాలు సంధించగల మాటల మాంత్రికుడు. జర్నలిజం వృత్తి. హాస్యం వ్యావృత్తి. తెలుగులో హాస్యావధాన ప్రక్రియకు రూపునిచ్చారు. హాస్యావధానిగా, అప్రస్తుత ప్రసంగిగా, స్టాండప్ కమేడియన్ గా దేశవిదేశాల్లో 1000 ప్రదర్శనలిచ్చారు. కాలమిస్టుగానూ హాస్యంతో  అక్షర దండలు అల్లారు.ఫన్ దేహాలు, పన్ పరాగ్, ఫన్ గన్, అప్రస్తుత ప్రసంగాలు శంకరనారాయణ రాసిన పుస్తకాల్లో కొన్ని.

గుండెల్లోని కొండంత విషాదానికి హాస్యాన్నే ఉపశమన మంత్రంగా చేసుకున్న శంకరనారాయణ, జోకురువ్వడమూ, నిప్పు రాజేయడమూ ఒకటే నంటారు. ఈ హాస్యపు హాలికుడు తెలుగులో హాస్యం తీరుతెన్నుల గురించి విభిన్నకోణాల్లో సీరియస్ గా చెప్పిన సంగతులు…..

ప్ర; మీలో సెన్సాఫ్ హ్యూమర్ ఎప్పుడు మొగ్గ తొడిగింది?

జ: నేను మహాలయ అమావాస్య నాడు పుట్టాను. కనుక పుట్టుకతోనే చిత్రమైన కన్నింగ్ నేచర్ ఒంటపట్టి ఫన్నింగ్ రూటు పట్టాను. మా అమ్మ వెంకటనరసమ్మ. నేను పుట్టాక ఎలా ఉంటానో చూద్దామని చుట్టు పక్కల అమ్మలక్కలు వచ్చేవారట. నేనప్పుడు గట్టిగా కళ్లుమూసుకుని ఉండేవాణ్ణట. అయ్యో! పాపం! నరసమ్మకు గుడ్డిపిల్లాడు పుట్టాడని వారంతా నాపై జాలి కురిపించి వెళ్లేవారట! ఆ తర్వాత కళ్లు తెరచి చూసి నవ్వేవాణ్నట. నువ్వు చిన్నప్పటి నుంచే కంత్రీవి అని అమ్మ సరదాగా అనేది. అయిదారేళ్ల వయసులో ఒకాయన వచ్చి నన్ను ఆట పట్టించటానికి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. నేను రెడీ అన్నాను. పెళ్లి చేసుకున్నాక ఏంచేస్తావని ఆ పెద్ద మనిషి అడిగితే, పెళ్లి చేసుకుని నువ్వేంచేస్తున్నావో నేనూ అదే చేస్తానంటూ రిపార్టీ ఇచ్చాను. మా నాన్న లక్ష్మీనారాయణలో కూడా హాస్యధోరణి ఉండేది. ఆ నాటి బాల్య వివాహాలను నిరసిస్తూ బాల వితంతువులనుద్దేశించి భుజం మీద కొంగు నెత్తి మీద కొచ్చెనంటూ వ్యాఖ్యానించేవాడు. బహుశా నాకు నాన్న వారసత్వంగానే హ్యూమర్ అబ్బిఉంటుంది.

ప్ర; హాస్యాన్ని సృష్టించటానికి ఎటువంటి సాధన చేయాలి?

జ: చిత్త ఏకాగ్రత ముఖ్యం. దీన్నే నేను ఫన్ సెంట్రేషన్ అంటాను. మనసును హాస్యానికి జోడించి చూడగలిగితే ప్రతి దాంట్లోనూ హాస్యం పుట్టించవచ్చు. కవిత్వానికి ఏదీ అనర్హం కాదన్నాడు శ్రీశ్రీ. అలాగే హాస్యమూనూ. చిన్నతనంలో రైల్వే స్టేషన్ కు వెళితే అక్కడ ఒక గది ముందు బోర్డు కనిపించింది. మూడవ తరగతి ప్రయాణికులు వేచి ఉండు గది అని రాసి ఉంది. మూడవ తరగతి చదివే వాళ్లు గొప్పవాళ్లన్నమాట. అందుకే వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. ఈ అర్హత ఇతర తరగతులు చదివేవారికి లేదన్నమాట అనేశాను పైకే. ఇలా ప్రతి దాన్నీ రెటమతంగా చూడాలి. కామెంట్ చేయాలి. హాస్య దృష్టి ఒక్కటే సరిపోదు. దాన్ని వ్యక్తీకరించే భాషాసంపద కూడా కావాలి. యతిప్రాసలు, లయ, పూర్వాపరాలు, లోకజ్ఞానం, ఊహాశక్తి, ఇలా ఒక కవికి ఉండే లక్షణాలన్నీ హ్యూమరిస్టుకూ కావాలి.

ప్ర; ఈలెక్కన హాస్యం పండించటం అనుకున్నంత సులభం కాదు, మీ కామెంట్ ?

జ: నవ్వు పుట్టించడమూ, నిప్పురాజేయడమూ రెండూ ఒక్కటే. ఒక్కోసారి ఎండుకట్టెలు శ్రమలేకుండానే ఇట్టే మండుతాయి. కొన్ని జోకులు చటుక్కున పేలతాయి. తడిసిన కట్టెలు ఎంత తిప్పలు పడ్డా అంటుకోవు. మీరెంత నవ్వు తెప్పించాలనుకున్నా కొన్ని జోకులు ప్రేక్షకావరణాన్ని తాకలేవు. ఎలర్ట్ గా లేకుంటే ఒక్కోసారి మనం రాజేసే నిప్పు కణికల నుంచే రవ్వలు లేచి కంట్లో పడనూవచ్చు. కొన్ని జోకులు పేలకపోగా రివర్స్ గేర్లో మనకే తగిలి బొప్పి కట్టిస్తాయి. అప్పుడు కూడా మనం ప్రేక్షకుల బాణాలను ఒడుపుగా తప్పించుకోవాలి. లేకుంటే అభాసుపాలవుతాం.

నిలిచి కాలే కట్టెలు కొన్ని, క్షణాల్లో మండి బూడిదైపోయే పుల్లలు కొన్ని. జోకుల్లోనూ ఎన్నో సభల్లో పదే పదే చెప్పినా నిలిచి నవ్విస్తున్నవీ, ఒక సభకే తుస్సుమనేవీ ఉంటాయి.

ప్ర; మీకెప్పుడైనా తలబొప్పి కట్టిందా?

జ: ఒకసారి సభలో చొక్కాజేబుకు భార్యకు ముడిపెట్టి మాట్లాడాను. ఈ రెంటికీ సామ్యం ఉంది. జేబుమాదిరే భార్య కూడా గుండెకు దగ్గరగా ఉంటుంది అన్నాను. ఒకాయన వెంటనే లేచి మీ సఫారి షర్టుకు రెండు జేబులున్నాయి కదా! అని కొంటెగా అడిగాడు. ఈ రియాక్షన్ నేనూహించలేదు. ఇలాంటి చిక్కుముడులను స్పాంటేనిటీతో తిప్పికొట్టగలగాలి. జేబులు వేరయినా చేసే జాబ్ ఒక్కటే, పైగా నా పేరులోనే ఇద్దరు దేవుళ్లున్నారు అంటూ తేలిపోకుండా, సంతృప్తి పరిచాను.

ఈ స్పాంటేనిటికి రిపార్టీకి అనువైన మానసికస్థితిని ఏర్పరచుకోవాలి. హాస్యం చిలికించే వారి మనసు కడిగిన ముత్యంలా కల్మషం లేకుండా ఉండాలి. నీరక్షీర న్యాయం తెలియాలి. ఏవైపు మొగ్గని తటస్థత కావాలి. చమత్కారం కొసన మంచి సందేశాన్ని విరబూయించాలి.

ప్ర; మారే కాలంతో  పాటు ఎలా అప్ డేట్ అవుతారు?

జ: ఈ కాలంలో ఉన్నామంటే దాంతో ముడిపడి ఉన్న విషయాలన్నిటితో కనెక్ట్ అయివున్నట్లే లెక్క. సోషల్ మీడియా పోస్టులను చూస్తుంటే, యూత్  ట్రెండ్స్ అర్థమవుతాయి. ఒకే బోటులో ప్రయాణిస్తుంటే ఆటోమేటిక్ గా అప్ డేషన్ ఉంటుంది. అయితే నేను కామెడీషోలకు వెళ్లే ముందు, టార్గెట్ గ్రూప్ ఎవరు, ఏ వయసు వారు, ఏ ప్రాంతం, ఏ నేపథ్యం వంటివన్నీ బేరీజు వేసుకున్నాకే బరిలోకి దిగుతాను.

ప్ర. హాస్యం పేరుతో బూతు జోకులూ పుష్కలంగానే వేస్తుంటారు గదా?

జ. జోకు పేల్చడానికి బూతును ఆశ్రయిస్తాను. బూతు ధ్వని కచ్చితంగా ఉంటుంది. ఇందులో దాపరికం ఏమీలేదు. నేనలా మాట్లాడలేదని మీరలా అర్థం చేసుకుంటే అది నా తప్పుకాదు అని సమర్ధించుకోను. బూతాడక దొరకు నవ్వు పుట్టదు అన్నారు. మన కావ్యాలలో కూడా శృంగార రసం పేరిట బూతును కుమ్మరించారు. శృతి మించని బూతును స్త్రీ పురుషులిద్దరూ సమానస్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు పైకి తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం ప్రదర్శిస్తారంతే. నేనొకసారి 25 గంటల నిర్విరామ హాస్యావధానం చేశాను. అడల్ట్ ఓన్లీ జోకులు ఎప్పుడు వేస్తారని ఒకాయన అడిగాడు. రాత్రి పన్నెండు తర్వాత చెప్పుకుందాం అన్నాను. ఆ టైముకు సభ ఆడా మగతో కిక్కిరిసింది.  వీరిలో ఎక్కువ మంది అరవై దాటిన వారే.

ప్ర. యూత్ లో సెన్సాఫ్ హ్యూమర్ తగ్గినట్లుంది?

. యూత్ అన్నింటా వీక్ గా ఉన్నారు. మేథో శ్రమ తప్ప శారీరక శ్రమ లేదు. కంప్యూటరు, స్మార్ట్ ఫోనే లోకం. కుటుంబ బంధాలు, అనుబంధాలు తగ్గిపోయాయి. ఎవరి గురించి ఆలోచించని ధోరణి పెరిగి పోతోంది. ఎవరికి వారు ఒక మానసిక గూడు కట్టుకుని అందులోనే జీవిస్తున్నారు. ఏమీ పట్టని వారికి హాస్యం మాత్రం ఎక్కడ పడుతుంది? దీనికి తోడు తెలుగురానితనం ఉండనే ఉంది. తెలుగుభాషలో పట్టు, ప్రవేశం ఉంటే ఏదైనా చమత్కారమో, పన్ నో వేస్తే ఆనందిస్తారు. భాషేరాని అర్భకుడు ఆ జోకులోని షేడ్ మతలబు ఎలా పట్టుకోగలడు?

ప్ర. విదేశీ తెలుగులకూ, స్వదేశీ తెలుగులకూ తేడా?

జ. పంచెకట్టు, చీర, బొట్టులో కనిపిస్తూ తెలుగులో మాట్లాడుతుంటే వారు కచ్చితంగా ప్రవాసాంధ్రులుగా పరిగణించవచ్చు. భాషను కాపాడుకోవాలన్న ఆరాటం, శ్రద్థ ప్రవాసాంధ్రులలో బాగా కనిపిస్తున్నాయి. అమెరికాలోనే పుట్టి పెరుగుతున్న పిల్లలకు అనవసరం అనుకోకుండా పట్టుబట్టి తెలుగు భాషనూ, సంస్కృతీ సంప్రదాయాలను నేర్పిస్తున్నారు. శాస్త్రీయ నృత్య, సంగీతాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ శ్రద్ధ తక్కువ. అయితే అక్కడైనా, ఇక్కడైనా ఇంగ్లీషు చదువుల ప్రభావం వల్ల మున్ముందు తెలుగుకు దూరమవుతారు. అప్పుడు తెలుగు హాస్యం తెరమరుగై, ఇంగ్లీషు జోకులు బాకుల్లా దిగుతాయి.

ప్ర. జర్నలిస్టు, కాలమిస్టు, అప్రస్తుత ప్రాసంగికుడు, హాస్యావధాని, వాస్తునిపుణుడు ఏ పాత్రను బాగా ఇష్టపడతారు?

జ. మిగతా వాటిలో లేని సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్నందున అప్రస్తుత ప్రాసంగికుడి పాత్ర నాకెంతో ఇష్టం. మిగిలిన పాత్రల్లో ఏదో ఒక పరిమితికి, ఒత్తిడికి లోనయి మెలగాల్సి ఉంటుంది. అప్రస్తుత ప్రసంగ పాత్రలో పరిపూర్ణ స్వేచ్ఛను అనుభవించాను.

ప్ర. ఈ నవ్వు వెనక దాగిన విషాదాలేమైనా ఉన్నాయా?

జ. నా జీవితంలో ఉద్యోగం మారడం అంటే ఒక దుఃఖంలో నుంచి ఇంకో దుఃఖంలోకి మారడమే. నేను మొత్తం 50 ఉద్యోగాలు చేసి ఉంటాను. ఉద్యోగం నిలబెట్టుకోవడమే పెద్ద సమస్య. నా పనితీరు, ప్రమేయం లేకుండా ఏదో ఒక కారణంతో ఉద్యోగం పోయేది. మళ్లీ మరో ఉద్యోగం దొరికే వరకు నరకం చవిచూసేవాణ్ణి. బతుకు భయపెట్టేది. ఈ విషాదం నుంచి తట్టుకునిలబడేందుకే హాస్యాన్ని ఆశ్రయించాను. అది నాకో మానసిక రక్షణ కవచంలా నిలిచి, అన్ని రకాలుగా నిలబెట్టింది.

*

గోవిందరాజు చక్రధర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు