నిడదవోలు మాలతికి కోడూరి పార్వతి అవార్డ్ 

ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు నిడదవోలు మాలతి కి సెప్టెంబర్ 10 వ తేదీ జరిగిన జూమ్ కార్యక్రమం లో కోడూరి పార్వతి అవార్డు తో సత్కరించారు. సిరికోన ఆన్ లైన్ గ్రూప్, కోడూరి పార్వతి స్మారక కమిటీ వారి సంయుక్త ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం సాహితీ అభిమానులందరి ఆన్ లైన్ సమక్షం లో జరిగింది. నిడదవోలు మాలతి పేరు తెలుగు సాహిత్య లోకంలో సుపరిచితమే.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాహితీ వేత్త, అనువాదకులు గంగిశెట్టి లక్ష్మీ నారాయణ అవార్డు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, తిరుపతి లో స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచీ మాలతి గారి సాహిత్యాన్ని అభిమానిస్తూ వచ్చినట్లు చెప్పారు. “ ఆమె జీవంతమైన సాహితీ సేవ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. Autopush అంటారు. She commands respect. తిరుపతి సాహిత్య వాతావరణం అటువంటిది. బయటికి కనిపించకుండా నిశ్శబ్దమైన ప్రయాణిస్తూనే ఉన్నారు. చాలామందికి ప్రేరణ ఇచ్చిన అరుదైన సాహిత్యమూర్తి.చాలామంది ఒక దశ దాటినతరవాత ఆ దశమీదే జీవిద్దాం అనుకునేవాళ్లు అలానే సాగిస్తారు. జీవంతమైన అని ఒక పదం ఉంది. అలా జీవంతప్రయాణం సాగించేవాళ్లు ఈ అక్షరప్రపంచంలో చాలా అరుదు. మాలతిగారు అటువంటివారు” అన్నారు.

కార్యక్రమానికి ప్రధాన  అతిథి గా విచ్చేసిన రచయిత వేలూరి వేంకటేశ్వర రావు మాలతి సాహిత్యాన్ని గురించి “మాలతిగారు మంచి తెలుగువాక్యం రాస్తారు. అలాగే అందంగా చదివించే ఇంగ్లీషువాక్యం కూడా రాస్తారు. మాలతిగారు ఇంగ్లీషులో వ్రాసిన Telugu Women Writers, 1950-1975 మంచి విమర్శనాత్మక రచన” అన్నారు.

నిడదవోలు మాలతి సమగ్ర సాహిత్యం మీద లోతైన విశ్లేషణ చేసి మరో రచయిత్రి, కవయిత్రి శీలా సుభద్రా దేవి  రాసిన పుస్తకం “ నిడదవోలు మాలతి రచనా సౌరభాలు “ పుస్తకాన్ని మరో ప్రముఖ రచయిత్రి పి. సత్యవతి ఆవిష్కరిస్తూ, “ మాలతిగారు ఎంత కృషి చేసేరో సాహిత్యంలో, ఈ పుస్తకం తేవడంలో సుభద్రాదేవిగారు అంత బాగాను అంత శ్రద్ధగాను చక్కగాను చేసేరు. పైగా పుస్తకం కూడా చాలా అందంగా తీసుకొచ్చేరు. చాలా పని చేసేరు ఒక రిసెర్చి స్టూడెంటులాగ” అని ప్రశంసించారు.

సుప్రసిద్ధకవి, అప్పాజోస్యుల పురస్కార గ్రహీత డా. కోడూరి ప్రభాకరరెడ్డి తమ ధర్మపత్ని కీ.శే. పార్వతిపేరున ఈ పురస్కారం అందిస్తూ పద్యమాలతో మాలతిని అభినందించారు. ప్రముఖ కవయిత్రి శీలా సుభద్రాదేవి మాట్లాడుతూ, “ 2010లో కథానికకి వందేళ్లు అయింది అని చాలా సభలూ వ్యాసాలు వచ్చేయి. అయితే వాటిలో 50లనించి 80లవరకూ రాసిన రచయిత్రులగురించి ఏమీ రాలేదు. అది నాకు అసంతృప్తి కలిగింది. 50నించి 70లవరకూ రచయిత్రులయుగం అంటారు. పుంఖానుపుంఖాలుగా చాలామంది రచయిత్రులు రాస్తూ వచ్చేరు. వాళ్లెందుకు గుర్తింపబడలేదు? వాళ్లు మంచికథలు రాయలేదా? వంటింటి సాహిత్యమేనా వాళ్లది? అనే దీంతో నేను కొంత రిసెర్చి చేసేను. ముఖ్యంగా వందేళ్లకథకు వందనాలు అని గొల్లపూడి మారుతీరావుగారు టీవీలో 118మందిని ఇంటర్వ్యూ చేసేరు. అందులో 12మంది మాత్రమే రచయిత్రులు. దాంతో నాకు బాధ కలిగి, 22మంది పాతతరం రచయిత్రులని తీసుకుని వ్యాసాలు రాసేను” అంటూ నిడదవోలు మాలతి మీద పుస్తకం రాయటానికి ప్రేరణ ఎలా కలిగిందో విశదంగా చెప్పారు.

ప్రముఖ సాహితీ వేత్తలు  కళ్యాణి నీలాంబరం, నారాయణ స్వామి, శారదా మురళి, కొలిచాల సురేష్,  కల్పనారెంటాల, ఘంటసాల నిర్మల,దివాకర్ల రాజేశ్వరి, సరోజ కొమరవోలు  చికాగో సాహితీ మిత్రుల తరఫున మెట్టుపల్లి జయదేవ్, తదితరులు  మాలతి సాహిత్యాన్ని విశ్లేషిస్తూ ఆమె ను అభినందించారు.

కోడూరి పార్వతి స్మారక కమిటీ తరఫున అవార్డు ను మాలతి పుత్రిక, హాలీవుడ్ నటి సరయూ బ్లూ , ఆమె భర్త జోనథన్ అందచేశారు. సరయూ తన తల్లి ని పట్టుచీర, జ్ఞాపిక లతో సత్కరించి, చక్కటి ప్రసంగం చేశారు. మాలతి సాహిత్య అభిమానులు అనేకమంది జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు.

*

కల్పనా రెంటాల

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిడదవోలు మాలతి గారి పురస్కారం సమావేశం గురించి సమగ్ర నివేదికను అందజేసారు కల్పనా.ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు