నిజమే…బడికీ ఓ వాసనుంటుంది!

అసలు ‘సంచరిత పరిశీలన’ అంటే ఏమిటి?

‘బడివాసన’ కవిత పరిమళం నా అంతరాంతరాల్లోకి ప్రవహించి గుప్పుమంది. ఎంత బాగా నచ్చిందో చెప్పడానికి మాటలు సరిపోతాయో..లేదో! ఎందుకు నచ్చివుంటుంది? అనే ప్రశ్న వేసుకున్నాను. కవి పక్కి రవీంద్రనాథ్ లాగే నేనూ ఉపాధ్యాయుడిని కదా..అందుకేనేమో అనుకున్న. ఉపాధ్యాయుడిని కాకపోయుంటే నచ్చేదికాదా? ఇంకో ప్రశ్న వేసుకున్నాను. బడిపిల్లాడినై సంచరించి, అప్పటి జ్ఞాపకాల్లోంచి బడివాసనను తోడుకున్నాను. కవి చెప్పిన ప్రతీ నిర్ధిష్ట సందర్భంలోనూ నన్ను నేను చూసుకున్నాను. ‘బడివాసన’ మూర్తమో, అమూర్తమో గానీ.. అనుభూతిని మాత్రం మిగుల్చుకోగలిగాను. ఎక్కడెక్కడ బడివాసన తలిగిందో కలెతిరిగాను.
బడి వాసన
~
నిజమే…బడికీ ఓ వాసనుంటుంది.
ఆటయి వెంబడించిన మట్టి వాసనో..
బడితోటలో విరిసిన చెమట పూల వాసనో…
పాటల‌తీరాన వాలిన పక్షి రెక్కల వాసనో…
చెట్టెక్కాలని ప్రయత్నించి జారిపడ్డ
పిల్లాడి మోచేతికయిన పచ్చిగాయపు వాసనో…
లేదూ..సప్త స్వర సమ్మిశ్రితమైన సంగీతంలా
ఇన్ని వాసనలొక్కటై కలగలిసి వీచిన
వింత వాసనో…
మనమెప్పుడూ గమనించలేదు గానీ
బడికీ ఓ వాసనుంటుంది.
కలలను మోసుకుంటూ
రాకెట్లా రివ్వున ఎగిరే కాగితపు వాసనో…
విద్యార్ధి మస్తిష్కంలో మొగ్గ తొడిగిన ప్రశ్న
కొత్త సమాధానమై విచ్చుకున్న వాసనో…
అప్పుడే తల్లి ఒడిని వీడి బళ్ళోకొచ్చిన
పసి దేహం నుంచొచ్చే అమ్మతనపు వాసనో
రేపటి లోకం కోసం నొప్పులు పడుతున్న
తరగతి గది పురిటి వాసనో…
నానాజాతి వృక్ష పరిమళాలొక్కటై
గుప్పుమన్న అడవిలాంటి
ఒక అద్భుతయిన వాసనో…
మనమసలు గుర్తించనేలేదు గానీ
బడికీ ఓ వాసనుంటుంది
పీకల్లోతు దాకా నూనెలో ములిగి
నిప్పును కావలించుకుంటేగానీ
వత్తి దీపం కాలేనట్టు
శిష్యులలో ఒకడై మెలిగి
వారి అంతరాత్మలను స్పృశిస్తేనే గానీ
తెలియనిదీ బడివాసన
ఆభరణాన్ని తయారుచేస్తున్న
అద్భుత స్వర్ణకారుడొకడు
తనను తాను నగలో పొదుగుకుంటున్నట్టు
పిల్లల బేల కళ్ళలోకి తదేకంగా చూస్తూ
అంతులేని వాత్సల్యాన్ని
పంచివ్వగలిగే వారికి మాత్రమే
అనుభవమయ్యే వాసన…
అమ్మతనాన్ని, నాన్నతనాన్ని
ఏకకాలంలో దర్శింపజేస్తూ
అర్ధనారీశ్వర రూపం దాల్చగలిగే
అక్షర విధాత మాత్రమే
ఆస్వాదించగలిగే వాసన..
ఊరి ఎద మీద
ప్రపంచమొక పుష్పమై పులకించిన వాసన.
నిన్నటి నాగరికత మనిషి శిరస్సున
ప్రేమగా తురిమిన నక్షత్రాల వాసన.
చదువూ నేడొక పచారీ సరుకయిపోయిన
ఈ‌ కాసుల లోకపు కాలుష్యంలో
నెమ్మదిగా మన మధ్య నుంచి ఆవిరయిపోతున్న
అరుదయిన వాసన
**
చిన్నప్పుడు దుబ్బలో పండి బొర్రి బొర్రి మట్టిగంధాన్ని పెయ్యంతా పూసుకొని, లయకారుడినై నాట్యం చేసిన రోజులు కండ్లముంగట తాండవమాడినట్టు అనిపించింది. అన్నన్ని నల్లతుమ్మచెట్ల నడ్మ మా బడి వాకిలిని కరుసుకుని పరుసుకున్న పసిడి ముత్యాల్లో మునిగితేలాను. తుమ్మచెట్టు కొమ్మల్లోంచి పిట్టల పాటలు వింటూ అ,ఆ..లు నెమరేయడం యాదికొచ్చింది. ఒకసారి చెట్టెక్కి మోకాలిచిప్పల్ని పగులగొట్టుకున్నంక ఇప్పటికీ నా వంతు వచ్చినా ‘కోతి కొమ్మచ్చి’ ఆడకుండా తప్పించుకు తిరుగుతున్న పిరికితనపు గాయం నన్ను వెంటాడుతోంది.
కాగితంతో విమానం చేయొచ్చినప్పటి ఆనందాన్ని నిన్న మొన్న విమానం ఎక్కినపుడు కూడా కొలువలేకపోయానని తెలుసుకున్నాను. వానొస్తే బడిని వొరుసుకుంటూ పారే పిల్లకాలువల్లో చిట్టిపడవనై మళ్లీ బడి ఒళ్లోకి వచ్చి వాలినట్టు ఎంత సంబురమనిపించిందో! పంతులుకు సమాధానం తెలియని ప్రశ్నలడిగి విసిగించినపుడు, అడిగిన ప్రశ్నకి ఠక్కున జవాబు చెప్పి మెప్పు పొందినపుడు మా తరగతిగది ఎదురుగా వున్న తాటిచెట్టు మీది వడ్రంగిపిట్ట గూట్లోకి తనరెక్కల్ని అరువు తెచ్చుకుని మరీ ఎగిరిపోయిన కాలం గిర్రున తిరిగింది. టక్ టక్ మని దాని పొడవాటి ముక్కు చేసే శబ్ధం ఇప్పటికీ నన్ను తొలుస్తూనే వుంది. సచ్చి యాడబోయిందో మా నాయినమ్మ.. ఇప్పటికీ మధ్యాహ్న భోజనం వేళ వచ్చి నాకు తినిపించి మరీ వెళ్తున్నట్టే అనిపిస్తుంది. బడి మీది అవ్యాజమైన ప్రేమకు నాయినమ్మ చేతిముద్దలే కారణమని తెలుసుకున్నాను. ఇంతలా తదాత్మ్యం చెంది పాకురుపట్టిన జ్ఞాపకాలపై కాలు వేసి జర్రుమని బడి బాల్యంలోకి జారిపోయేలా చేసింది. నాకు లాగే ఇంకెంతమంది జారిపోయారో.. నడుం విరిగిందో, కాలు బెనికిందో.. చూసి రావాలనిపించింది.
**
మొదటి రెండు స్టాంజాల్లో బడివాసన ఎలా వుంటుందో చెప్పడానికి, చెప్పి ఒప్పించడానికి మట్టివాసనో, చెమటపూలవాసనో, పక్షిరెక్కల వాసనో, పచ్చిగాయపు వాసనో, కాగితపు వాసనో, కొత్త సమాధానమై విచ్చుకున్న వాసనో, అమ్మతనపు వాసనో, తరగతిగది పురిటివాసనో, అడవి లాంటీ అద్భుతమైన వాసనో ఇలా ఇన్నేసి ఉపమానాల్ని వాడుకున్నాడు కవి. వస్తువును బలంగా చెప్పడానికి శివారెడ్డి వాడి వాడి అరగదీసిన శైలి ఇక్కడ బాగా వర్కవుట్ అయింది.
“నిజమే.. బడికీ ఓ వాసనుంటుంది” అని అప్పటిదన్క జరిగిన సంభాషణకు ముగింపువాక్యం పలికినట్టుగా అనిపించే ‘సాధారణీకరణ’ (Generalisation) కు అనేక నిర్ధిష్ట (Specific) సందర్భాల్ని పేర్చుకుంటూ పోవడం కనిపిస్తుంది.
**
తర్వాతి స్టాంజాల్లో బడివాసన ఎలా అనుభవంలోకి వస్తుందో చెప్పడానికి దీపాన్ని, నగ పొదగడాన్ని తీసుకుని పోలిక చెప్తాడు. ప్రపంచజ్ఞానాన్ని, నాగరికతను నేర్పే ఉపాధ్యాయుడు అర్ధనారీశ్వరుడిగా కనిపిస్తాడు.
 మనస్తత్వశాస్త్రపరంగా గమనిస్తే విద్యామనోవిజ్ఞానశాస్త్ర అధ్యయన పద్ధతుల్లో పరిశీలనా పద్ధతి ఒకటి (మిగిలినవి అంత:పరీక్షణ, ప్రయోగాత్మక, వ్యక్తి అధ్యయన పద్ధతులు). అసాధారణ ప్రవర్తన కలిగిన విద్యార్థులను అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. పరిశీలనా పద్ధతి 4 రకాలు (సహజ, నియంత్రిత, సంచరిత, అసంచరిత) గా వుంటుంది.
కవి ‘సంచరిత పరిశీలన’  (participant observation) అన్వయం కవితలో గోచరిస్తుంది. సంచరిత పరిశీలన ద్వారానే ఉపాధ్యాయుడికి ‘బడివాసన’ అనుభవంలోకి వస్తుందని రూఢీపరచడం కూడా చూడొచ్చు.
అసలు ‘సంచరిత పరిశీలన’ అంటే ఏమిటి?
“పరిశీలకుడు సన్నివేశంలో తాను కూడా పాల్గొని ముందుగా నిర్ణయించుకున్న పరిశీలన అంశాలను సన్నద్ధతతో నిశితంగా చూడడం”.
అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి ఆటలాడుతున్నప్పుడు అతని ప్రవర్తన ఎలా వుంటుందో తెలుసుకోవాలనుకుంటే విద్యార్థితో కలిసి ఆటలాడుతూ (సంచరిస్తూ) తనకు దగ్గరగా మెదులుతూ పరిశీలించడంలాంటిదన్నమాట. సంచరిత పరిశీలనను బలపరిచే కవితా పాదాల్ని చూద్ధాం.
“పీకల్లోతు దాకా నూనెలో ములిగి
నిప్పును కావలించుకుంటేగానీ
వత్తి దీపం కాలేనట్టు
శిష్యులలో ఒకడై మెలిగి
వారి అంతరాత్మలను స్పృశిస్తేనే గానీ
తెలియనిదీ బడివాసన”
**
‘బడివాసన’ కవిత ద్వారా కవి మనకు ఏం చెప్పదల్చుకున్నడు? అనేది ముగింపు ద్వారా వ్యక్తపరుస్తాడు.
“చదువూ నేడొక పచారీ సరుకయిపోయిన
ఈ‌ కాసుల లోకపు కాలుష్యంలో
నెమ్మదిగా మన మధ్య నుంచి ఆవిరయిపోతున్న
అరుదయిన వాసన”
‘అరుదైన వాసన’ అన్నప్పుడు అంతరించిపోయే జాతుల జాబితాలో “సర్కారు బడి” ని కూడా చేర్చితే బాగుండుననిపించింది. అప్పుడన్నా ‘కొడిజీవునం’ తో కొట్టుకుంటున్న బడిని కాపాడుకోవచ్చుననే చిన్ని ఆశ.
(కవిత్వం నుండి డీవియేట్ అవుతుందనే కారణంతోనే ఇక్కడ ‘బడివాసన’ కనుమరుగైపోవడానికి గల ఇతరత్రా కారణాల్ని, స్వయం కృతాపరాధనల్ని గూర్చి ఉద్ధేశ్యపూర్వకంగానే చర్చించలేదని గమనించగలరు)
*
Avatar

బండారి రాజ్ కుమార్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవి రవీంద్ర గారు వ్రాసిన కవిత ఒక ఎత్తైతే మీ సమీక్ష బహు సుందరంగా ఉంది. మీ స్థానిక పరిసరాలతో జతచేర్చి వ్రాసిన విధానం బాగుంది. అందరి అంతశ్చేతనలో ఆ పరిమళం నిండి ఉంటుంది కానీ దానిని బయలు పరిచే సామర్థ్యం నైపుణ్యం కొందరికే ఉంటుంది. కవే ఉపాధ్యాయుడైతే ఉపాధ్యాయుడే కవి అయితే అన్న భావనకు ఇద్దరూ న్యాయం చేశారు. కవితను మనోవిశ్లేషణా కోణంలో కూడా చక్కగా సమీక్షించారు. ధన్యవాదాలు రాజ్ కుమార్ గారూ

  • ‘ బడి వాసన’ కవిత బండారి రాజ్ కుమార్ గారిని బడి జ్ఞాపకాలలోకి తీసుకుపోవడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఈ కవితపై పరిశీలనాత్మకంగా ఈ వ్యాసాన్ని అందించిన రాజ్ కుమార్ గారికి దీనిని ప్రచురించిన సంపాదకులకు ధన్యవాదములు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు