నా జ్ఞాపకాలలో బతుకమ్మ…

1976 ప్రాంతంలో..నేను ఏడవతరగతి కరీంనగర లో ధన్గర్ వాడి అప్పర్ ప్రైమరీపాఠశాలలో చదువుకునే రోజుల్లో సంగతి..నా ఊహలలో నాకు తెలిసిన బతుకమ్మని ఆవిష్కరించే ప్రయత్నం.. మా నాన్న ఉద్యోగరిత్యా 3 సంవత్సరాలకో ఊరు..అద్దె ఇంటి వేటలో మంకమ్మతోట దాటి  ఊరి చివరలో మా ఇల్లు.. దూరం కావడంతో నాన్న సైకిల్ మీద రోజూ దింపేవారు..నేను సైకిల్ నేర్చుకుని వెళ్ళడం అలవాటు చేసుకున్నాను ..సైకిల్ నేర్చుకోవడం గుర్రమెక్కినంత ఆనందం..ఎప్పుడు స్కూల్ అవుతుందా ఎప్పుడు సైకిల్ ఎక్కుతానా అని ఉండేది..ఇక మా ఇంటి తర్వాత చివర మరి కాస్త దూరంలో డెయిరీఫామ్ ఉండేది..దానిముందంతా ఓపెన్ ప్లేస్..చెట్లు ఓ సర్కిల్ లా ఉండేది ..ఆ సర్కిల్ చుట్టూ చక్కర్లు కొడుతూ సైకిల్ మీద తిరగడం ఎంతో ఆనందంగా అనిపించేది..కొన్నాళ్లకి బతుకమ్మ పండుగ వస్తుందని చెప్పింది నా స్నేహితురాలు ప్రమీల..అయితే ఏంటి ..అన్నా..ఏందో సూద్దువు తీ నీకే ఎరకైతది ..అంది ప్రమీల..ఏంటబ్బా ఇట్లన్నది  అనుకున్నా..నాకు ఊహ తెలిసి బతుకమ్మ పండుగ ఎలా చేస్తారని తెలియదు..చూసిన జ్ఞాపకం లేదు .

సెలవులు రానే వచ్చాయ్.. మా వీధంతా హడావిడి..ఎక్కడ విన్నా ఒకటే మాట ..బతుకమ్మ పండుగ ..బతుకమ్మ పండుగ.. మొదటి రోజుకు ముందు చేసిన సందడి ..లీలగా గుర్తొస్తుంది ..సాయంత్రం నుంచి పూల వేట ..మరునాటి పొద్దున్నే 10 గంటల వరకు ..నాకు ఆ ఆంటీనడిగి పూలు తీసుకుర ఈ ఇంట్లో ఏం పూలున్నాయో చూడు..ఇదే ఆత్రం ..సేకరించడం ఒక ఎత్తు వాటిని తిరిగి వాడిపోకుండా కాపాడటం మరో ఎత్తు..ఉదయం పదయ్యాక వాటిని పేర్చడం కోసం ఆ వీధిలో పిల్లలమంతా ఒకరింట్లో చేరిపోయాం..ఆ ఇంట్లో సుజాత అక్క మాకు బతుకమ్మ పేర్చడంలో సహాయం చేస్తానంది..  ఎలా పేరుస్తారో ఎపుడు చూస్తానో అనే ఆరాటం నన్ను నిలవనివ్వలేదు. సుజాత అక్క చుట్టూ చేరాం ..ముందు ఒక్కో రంగు పూలు ఒక్కొక్క కుప్పగా పెట్టమందక్క ..గబగబా మూగిపోయాం..ఒక్కొక్క రంగు పూలు తీసి ఒక్కొక్క పక్క పెట్టాము ..పూలొక్కటే కాదు ఆకులు కూడా తెంపుకు రమ్మంది అక్క..ఆకులెందుకు అడిగాను అమాయకంగా ..విజ్జీ చెప్పింది చేయ్ బతుకమ్మ ఆడుతావా లేదా ..అన్న అక్క హెచ్చరికతో పిల్లిలా వెళ్లి ఆకులు గబగబా తెంపుకొచ్చాం ..పువ్వులు పేర్చడానికి ఒక పెద్ద ప్లేట్ తెచ్చింది ప్రమీల ..ఆ పళ్లెం మీద పెద్ద ఆకులు రెండు ప్లేట్ మీద పరిచింది..పూలన్ని పెద్దవి తీసుకుని ఒక వరుస పెట్టింది ..అక్కా నేను పెడత నేనక్క ..అందరూ అడగడం మొదలుపెట్టారు ..చూడండి ..అలా అందరూ పెట్టకండి ..అందివ్వండి చాలు..ఎందుకంటే ఒక్కచేతి మీద పెడితే బొత్తి మంచిగొస్తది.. అక్క చెప్పిన మాటకి అందరం గమ్మున అయిపోయినం..నాలుగు నాలుగు పూలు ఒక కట్టలా దారం కట్టి ఇవ్వండి. అక్క పురమాయించింది…గబగబా అందించాం..రెండు వరుసలు పేర్చగానే మధ్యలో గొయ్యిలా ఖాళీ ఏర్పడింది ..పూలు పెడుతుంటే ఆ గొయ్యిలో పడిపోతున్నాయ్..ఎలా బిక్కమొహాలతో అక్కని చూసాం.. మా బుగ్గలు గిల్లి నేను పేరుస్తానని చెప్పాను కదా ముందు బతుకమ్మకి దండం పెట్టండి..అంది.. అందరం దణ్ణం పెట్టాము ..అక్క నవ్వుతూ ఆ ఆకులు ఇటు ఇవ్వండి..అంది ..ఆకులు అందించాము ..మధ్యలో ఆకులు వత్తి వత్తి పెట్టి పూల వరుసకు సమానంగా చేసేసింది..తర్వాత పూల వరుస కొంచం లోపలికి పేర్చసాగింది ఒకొక్క వరుస రంగు మార్చుతూ మధ్య మధ్య ఆకులు పూలరెక్కలు వేస్తూ చకచకా చాకచక్యంగా చేతులు తిప్పుతూ పెడుతుంటే ఒక అందమైన భవనాన్ని ఇటుకలు సిమెంటుతో పేరుస్తున్న మేస్త్రీ కన్నా మెరుగైన పనితనం కనిపించింది..క్రమంగా మరి కాస్త దగ్గరగా అలా పేరుస్తుండగా పై వరకు వచ్చే సరికి దగ్గరిగా ఒక్క పువ్వు పెట్టేంతగా వచ్చేసింది..హే..బతుకమ్మ తయారైంది.. చప్పట్లు కొట్టామంతా ..”ఆగండాగండి ..అప్పుడే అయిపోలేదు ..ముందు అందరూ ఇంటికి వెళ్ళి అన్నం తిని 5 గంటలకల్లా మంచి బట్టలు వేసుకురండి “ అని చెప్పిందక్క. అన్ని రంగుల పూలతో అందంగా తయారైన

బతుకమ్మని వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు ..బలవంతంగా ఇల్లు చేరి బతుకమ్మ తయారీని ఇంట్లో కథలుకథలుగా గుక్క తిప్పుకోకుండా చెప్పాక గబగబా అన్నం తిని ..ఏ ఫ్రాక్ వేసుకోవాలో చూసుకుని తయారయి అమ్మతో చెప్పి పరుగుపెట్టా ..బతుకమ్మ ని అలా ఎంత సేపయినా చూడాలనిపిస్తుంది ..

అక్కా  ఇంకా ఏం చేయాలి ? ..అడిగానక్కని..దొడ్లో పూసిన ఓ చిక్కుడాకు, పసుపు రంగులో పూసిన బీరపూవు ని కోసి తెచ్చి మధ్యలో పెట్టింది..దేవుడి దగ్గర పసుపు , కుంకుమ దాని మీద జల్లింది ..అగర్ బత్తీ వెలిగించి బతుకమ్మకి చూపించి అందరినీ వరుసగా నిలబడి దణ్ణం పెట్టుకోమంది..మొక్కండి బతుకమ్మకి మిమ్మల్ని చల్లగా చూస్తది..అన్న అక్క మాటలు మాకు ఎంతగానో నచ్చేసాయి..అందరం బుద్దిగా దండం పెట్టాం….ఊ పిల్లలు ఇప్పుడు వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టి రాండి జెల్ది..ప్రమీలకి అందరం తలో చేయి వేసాం ..ముగ్గు ప్రమీల వాళ్ళ అమ్మ వేసింది . లోపలికి వెళ్ళి నెమ్మదిగా జాగ్రత్తగా బతుకమ్మని  ముగ్గు మధ్యలో పెట్టింది అక్క …బతుకమ్మ ఆడ్తున్నరా అని చుట్టుపక్కల వాళ్ళు , పిల్లలు వచ్చేసారు.అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని స్కూల్ లో వన్ ఆర్మ్ డిస్టెన్స్ తో నిలబడ్డట్టుగా సర్కిల్ లో నిలబడ్డారు ..నువు పాడు అంటే నువు పాడు అని మొదట అందరూ మెలికలు తిరిగారు. ప్రమీల వాళ్ళ అమ్మ నేను అందుకుంట బిడ్డా మీరు అందుకోండి.. అని మొదలుపెట్టింది..బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో..అందరు అనున్రి..బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో..అందరం గొంతు కలిపాం .చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ..మధ్య మధ్య వంగుతూ తిరగడం నాకు రాకపోయినా..ప్రమీల ఎలా తిరిగితే నేనూ అలాగే తిరగ సాగాను..అలా చేతులు ఆడిస్తూ పాట అందుకుంటూ లయబద్దంగా ఆడటం ఏదో కొత్త అడ్వెంచర్ చేసిన ఫీలింగ్ ..ఒక్కొక్క పాట పాడుతూ ఒక దాని తర్వాత మరో పాట ఎవరో ఒకరు పాడేస్తున్నారు..ఎంత సమయం అయ్యిందో తెలీనే లేదు..చీకటి పడుతుంది..ఇక ఈ రోజుకు చాలని ఆపారు ..మీరు బతుకమ్మని తీసుకొని ఆ గుంటలో వదలండి మీకు నేను ప్రసాదం తెస్తానని ప్రమీల వాళ్ళ అమ్మ లోపలికి వెళ్లి అటుకులు బెల్లం తెచ్చి అందరికీ పంచింది.మా వీధి చివర చిన్న గుంటలో నీరు చేరితే అందులో వదిలారు . వస్తా అక్కా ..వెళ్ళొస్తా అంటూ మా ఇంటికి పరుగు తీసా..

ఇల్లు చేరగానే అమ్మకి నాన్నకు అన్నయ్యకి ఎంత పెద్ద పని చేసానో గుక్కతిప్పుకోకుండా చెప్పేసా..బతుకమ్మ కంటినిండా చేరి నిద్రలో పలవరింతైంది..ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు పూల సేకరణ చేద్దామా అని మనసంతా ఆరాటం ..పొద్దున్నే మహోత్సాహంతో సైకిలేసుకుమరీ చక్కర్లు కొట్టి పూలు కోసుకొచ్చా..ఏమీ తెలీదంటూనే హుషారుగా సహకరిస్తున్న నన్ను వాటేసుకుంది ప్రమీల .ఆ సాయంత్రం తిరిగి ఉత్సాహంగా బతుకమ్మ సుజాతతో కలిసి ఆడాం ..ప్రసాదం మారింది.. పుట్నాలపప్పు పొడి , లడ్డు ..పువ్వులు, ఆడుకోవడం , పాడుకోవడం, తినడం ..నాకెంత నచ్చేసిందో బతుకమ్మ పండుగ.. అలా కొన్నాళ్ళకు పెద్ద బతుకమ్మ పండుగ వచ్చేసింది..

    ఇప్పుడు చూడు అసలు పండుగేందో..ఊరించింది ప్రమీల..వారం రోజుల నుంచే బతుకమ్మ పండుగని బట్టలు కనుక్కోవడం అప్పాలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాను. రోజూ పూలు కోసేయడం ఏ రోజుకారోజు పూలవేట యధావిధిగా కొనసాగుతున్నాయి. కాని ప్రత్యేకత ఏమిటంటే పూలు పిల్లల బదులు పెద్దలు..బతుకమ్మ ఆడేందుకూ పిల్లల తో పాటూ పెద్దలు తరలి రావడం..పూలు కూడా ఇళ్లలో పూలు కాదు ..ఊరి చివర గునుక పూలు కట్టలు కట్టలు తెచ్చి వాటిని కట్టలు కట్టి ..కొసలు కత్తిరించి ..సిద్ధం చేసుకున్న రంగులలో ముంచి ఆరబెడతారు…అతి పెద్ద బతుకమ్మ గా పెద్ద తాంబూలం తీసుకుని దాని మీద ఆకులు పరిచి బతుకమ్మని రంగుల వరుసలుగా పేర్చటం మధ్య మధ్య ఆకులు, అదుముతూ పేరుస్తారు ..ఒకే వరుసలో క్రమపద్ధతిలో రకరకాల రంగుల వరుసలతో పేర్చడంతో ప్రతి రంగు స్పష్టంగా  కనిపించడంతో బతుకమ్మని చూడటం కన్నులపండుగే..ఎవరికి వారు వీధులలో వినాయకచవితికి పెద్ద , రకరకాల వినాయకులను పెట్టినట్లుగా..బతుకమ్మని కూడా ఎవరికి వారు పెద్దగా రంగు రంగుల పూలు గునుక , తంగేడు, బంతి, గన్నేరు, మందార ..వంటి పలురకాల పూలు సేకరించి పేరుస్తారు..ఇన్ని రోజులు మేమంతా ఇంటి ముందు, వీధిలో ఆడితే పెద్దవారంతా చేరి చెరువు దగ్గర చేరి ఆడుతారు..

మా అమ్మని మేము కొత్తగా వచ్చినందుకు మొహమాటంగా కూర్చుంటే “రా వదినె “ అంటూ చేత్తో లాగి మరీ బతుకమ్మ ఆడించారు.

 ఇక పాటలైతే ఎన్ని పాటలో..కొన్ని బతుకమ్మని కీర్తిస్తూ..కొన్ని బతుకమ్మకి తమ బాధలు చెప్పుకుంటూ..కొన్ని బతుకమ్మ కోసం ..కథాగేయాలు..రకరకాల పాటలు ..వేటికవే ప్రత్యేకమైన భావాలతో నిండి ఉంటాయి. గొప్పతనం ఏమిటంటే తడుముకోకుండా గుక్క తిప్పుకోకుండా పాడడం ..ఏనాడు బయటకు రాని స్త్రీలుసైతం హుషారుగా బతుకమ్మలు ఆడేవారు. మంచి ప్రసాదాలు తెచ్చి అందరికీ పంచడం ..బతుకమ్మని అందరూ కలిసి నీటిలో వదలడం..వదులుతూ దణ్ణం పెట్టుకోవడం..బతుకమ్మని పోయిరావమ్మ అంటూ సాగనంపడం..జరిగేది ..చీకటి పడేవరకు ఆడాక మాత్రమే నీటిలో బతుకమ్మని వదిలేసే వారు. ఆ తర్వాత అక్కడే అందరూ చేరి ప్రసాదాలు పంచుకోవడం, ఇచ్చి పుచ్చుకోవడం జరిగేవి. ఇళ్లకు చేరడం కలివిడిగా ఒకరికొకరు కలిసి చేసుకునే ముచ్చటైన పండుగ బతుకమ్మ..

తలుచుకుంటున్న కొద్దీ ఆనందం తో మనసు ఉరకలేస్తుంది. బస్సులో రైళ్ళలో  వస్తూ పోతూ బతుకమ్మలు ఆడేవారిని బతుకమ్మలని పదే పదే చూడటం ఒక ఆనందం.. త్రికోణంగా, గుండ్రంగా , ఎత్తుగా కనిపిస్తాయి.ఆ తర్వాత మూడు సంవత్సరాలకు నేను ఊరు మారినా ప్రతి యేటా బతుకమ్మ ఎప్పుడువస్తుందా అనే ఆరాటం బతుకమ్మని చూస్తే కలిగే సంతోషం గుండె లో గూడు కట్టుకుంది.

*

సమ్మెట విజయ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు