నాలోనూ అదే వెలితి: గోరటి వెంకన్న

తెలుగు సాహిత్య సిగలో కొలువుదీరిన ‘అల సెంద్రవంక’….ప్రజా పాటల పూదోటలో విరిసిన ‘రేల పూల’ గుభాళింపు….పోరుభూమిలో ప్రతిధ్వనించే ‘ఏకునాదం మోత’ కలగలసిన కవితాక్షరం, వర్తమాన తెలంగాణ మహాకవి గోరటి వెంకన్న. ఆయన ప్రజా కవిత్వ భూమిక నుంచి ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా చట్టసభల్లో అడుగిడుతున్న ఆయన సాహిత్య ప్రస్థానంలోని కొన్ని విశేషాలు, భవిష్యత్తు ఆలోచనలతో పాటు వెంకన్న మనసులోని మాటను మనతో పంచుకుంటున్నారు. ఆ వివరాలు ఇంటర్వ్యూలో..!

శాసనమండలి సభ్యుడిగా కొలువుదీరిన సందర్భంగా మీ అనుభూతి ఏమిటి ?

తెలంగాణ ఉద్యమంలో నేను రాసి, పాడిన పాటల వల్లే నాకు ఈ గౌరవం దక్కింది. స్వపరిపాలనలో సంతోషం ఉంటది కదా. మనలో ఒకడిగా ముందుండి, మనందరినీ నడిపించి…అరవై ఏళ్ల కలను సాకారం చేసిన నేత కేసీఆర్‌. ఆయన స్వతహాగా సాహిత్య నేపథ్యం కలిగిన నాయకుడు. కనుకనే నాకు ఈ గౌరవం దక్కిందని భావిస్తున్నా. ఈ సందర్భంగా చాలామంది కవులు, రచయితలు, ఎన్నడూ వేదికలవైపు కూడా తొంగిచూడటానికి ఇష్టపడని లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తడం సంతోషంగా ఉంది.

కవిత్వం, రాజకీయం ఒకే ఒరలో ఇమడవంటారు కదా.! మీరెలా భావిస్తున్నారు ?

అవును, కవిత్వం, రాజకీయాల మధ్య పరస్పర వైరుధ్యం ఉంటదంటరు. నాకు కిరీటాలు మోసే అలవాటు లేదు. మనకేమైనా కావాలంటేనే భయం. తామరాకు మీద నీటి బొట్టులా ఉంటే సమస్యే ఉండదాయె. నేనెవ్వరినీ ఏమీ అనను. నా పని నేను సేసుకొనిపోయే బాపతి. కేసీఆర్‌ అయితే, నామీద ప్రేమతో పదవి ఇచ్చాడు. అలాగే, నాకు చేతనైన పనే చెబుతరు కానీ, రాని పని అయితే చెప్పరుగ. గుర్రం జాషువా, విశ్వనాథ, కాళోజీ, బోయి భీమన్న తదితర ప్రముఖులు ఎమ్మెల్సీ అయ్యాక కూడా, ఎంత అద్భుతమైన కవిత్వం రాసినరు. కవికి రాయాలనుంటే, పదవి ప్రతిబంధకం కాదు. పెద్దాయనే (కేసీఆర్‌) సాహిత్య మూర్తి. ఆయన అప్పగించే పనులు కూగా అట్లనే ఉంటయి. కనుక నాకు పెద్ద ఇబ్బంది ఉండదనుకుంటున్నా. ఇక సాహిత్య రంగంలో పాలిటిక్స్‌ రాజీకాయాల కన్నా ఎక్కువుంటయి. వాటన్నింటితోని ఇన్నాళ్లు ఏగలేదా. తిట్టినోడిని అయ్యా అంటను. తిట్టనోడినీ అయ్య అంటను. తోచింది చేసుకుంటూ పోతుంట. నా పాటల్లో రాజకీయాలుంటాయి. కానీ నాకు రాజకీయాలను విశ్లేషించే పరిజ్ఞానం తక్కువే. కనుక చట్ట సభలోనూ కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాల మీదే మాట్లాడతా. వాటి కోసమే పనిచేస్తా.

 మిమ్మల్ని ఎమ్మెల్సీగా ప్రకటిస్తున్నారనగానే, మీ మనసులో మెదిలిన ఉద్యమనాటి జ్ఞాపకాలు…?

ఉద్యమం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సభలో పాల్గొన్నా. అప్పుడు పాట పాడి..ఉవ్వెత్తున ఎగిరిన. ఆ రోజు రాత్రి నాకు గుర్తుతెలియనోళ్లు ఫోన్‌చెసి బెదిరించినరు. భయంకరమైన మాటలన్నరు. ‘ఎగరినీకి కాళ్లుండవు. పాడనీకి గొంతుండదు’ అని బెదిరించిండ్రు కూడా. అయితే, వాటికి నేను భయపడలేదు. జయశంకర్‌ సారు, మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రకాశ్‌, పాశం యాదగిరి, కోదండరాం….ఇలా అందరూ నన్ను ఉద్యమంలో తిప్పిండ్రు. ‘రేలా దూల తాలెల్లాడే నేల…ఈ తెలంగాణ…’’ అంటూ 1995లోనే పాట రాసిన. అప్పుడు ఇంకా ఉద్యమ సోయి అంతగా లేకుండె. ఆ పాటను ధూంధాంలో బాలకిషన్‌, నాగరాజు, అరుణోదయ కృష్ణ పాడుతుంటే…నాకు మామోలు ఆనందం అనిపియలె. సిధారెడ్డి మంజీరా రచయితల సంఘం పెట్టి, సభలో మొదట నాచేత ‘తల్లి తెలంగాణమా’ పాడించిండు. ఆ పాటలకు సభ ఊగిపోయింది. ఽఽమొదటి ధూంధాంలో బాలకిషన్‌ నాచేతనే టెంకాయ కొట్టిచ్చిండు. నా ప్రతిపాటను కేసీఆర్‌ విని, నన్ను పిలిపించి పాడించుకునేది. అప్పుడు ఆయన ఇంట్లోనే గూడ అంజన్న, అందెశ్రీ అన్న, కృష్ణవర్మ, నేను…అందరం కలిసేటిది. అవన్నీ జ్ఞప్తికొచ్చినయి.

సాహిత్య రంగం నుంచి ప్రజా క్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు? మీ ముందు ఎలాంటి బాధ్యత ఉందనుకుంటున్నారు ?

తెలంగాణ భాష, మాండలికాలు, సంస్కృతి, నాటకరంగం, పద్యనాటకాల పరిరక్షణ కోసం నా వంతు కృషి చేస్త. మన వద్ద యక్షగానాలు 1600 ముద్రితాలున్నాయి. ఇక అముద్రితాలు కొన్ని వందల్లో ఉండచ్చు. అలాంటి ప్రాచీన ప్రజా సాహిత్యాన్ని కాపాడుకునేందుకు, దీన్నొక అవకాశంగా మలుచుకుంట. భాష ఛిద్రమైతే, అస్తిత్వమే కనుమరుగవుతుంది. కనుక ప్రపంచీకరణ నేపథ్యంలో మన భాష, సంస్కృతిని నిలబెట్టుకొనేందుకు నా వంతు ప్రయత్నం చేస్త. భాషా వికాసం కోసం ఉపయోగపడత. అందుకోసం నా పాటను భూమికగా చేసుకొని, చట్టసభలోనూ మాట్లాడత.

కొత్త బాధ్యతలు మీ సాహిత్య జీవితంపై ఎలాంటి ప్రభావం చూపనుందనుకుంటున్నారు..?

నాలోని కవిని కాపాడుకుంటేనే ఎమ్మెల్సీ పదవికీ న్యాయం చేయగలను. కవిత్వం మరిస్తే, నేనేపనీ చేయలేను. నాది హోదా సెలబ్రేషన్‌లో మునిగిపోయే స్వభావం కాదు. ప్రజలతో మెలిగే అవకాశం వస్తే, ప్రజా సమస్యలు తెలుసుకొని, మనదైన పద్ధతిలో ప్రభుత్వానికి తెలిపేలా, మరింత బాగా రాస్త. ప్రజలమీద నిజమైన ప్రేమ ఉండాల్నే గానీ, వాళ్ల బాధలు ఒపికగ్గా వింటే మస్త్‌ కవితలు, పాటలు రాయచ్చు. న్యాయవాది ప్రాక్టీసులోనే రావిశాస్త్రి బాధితుల గాథలను కథలుగా మలిచిండు. అదే కోవలో డాక్టర్‌ కేశవరెడ్డి కూడా నిలిచిండు. రోజుకి పదిగంటలు పనిచేసినప్పుడూ, నేను కవిత్వం మానలె. సాధారణత్వం నుంచి కవిత్వం వస్తది. కనుక ప్రజల బాధలనుంచి కూడా కవిత్వం సృష్టించుకోవచ్చు. ఎమ్మెల్సీ అయ్యాను కనుక, సాహిత్యానికి దూరమైతాననుకోడం లేదు. నాకా భయాలేమీ లేవు.

మీరు కవి, గేయరచయిత, నటుడు కూడా కదా.! అందులో మీరు ఏ హోదాను అమితంగా ఇష్టపడతారు..?

కవిగా ఉండటమే ఇష్టం. దాంతో పాటు సమాంతరంగా పౌరాణిక నటననూ ప్రేమిస్తా. రెండూ ఉంటేనే, మంచిగ బతుకుతా. కవిత్వం ఆగినప్పుడు పద్యం ఎత్తుతా. పద్యంలో మునిగినప్పుడు కవిత్వం వస్తది. యోగా భాషలో చెప్పాలంటే, అవి నాకు రేచకం, పూరకం లాంటివి. ఇక నేను పులకించిపోయింది కబీర్‌ సమ్మాన్‌ పురస్కారం వచ్చినప్పుడే. పద్యమంటే నాకు ప్రాణం. నా పాటలకు శక్తికూడా పద్యమే. పోతన, అన్నమయ్య, వేమన, దువ్వూరి రామిరెడ్డి, జాషువా పద్యాలంటే చానా ఇష్టం. సంప్రదాయ పద్యమన్నా మమకారమే. మనసు బాగలేనప్పుడు, పద్యం పాడుకుంట. అతిశయోక్తిగా ఉంటది చెప్పడంలేదు కానీ, వెయ్యి పద్యాల వరకూ పాడటా. నేను చిన్నతనంలోనే బాలనాగమ్మ నాటకంలో నటించా. తర్వాత మేము ఒక ట్రూప్‌ పెట్టి పద్యనాటాకాలు ప్రదర్శించాం. ఆటవెలది, తేటగీతిలోనూ పద్యాలు రాస్తున్న. మనసు బాలేకపోతే, రంగస్థల కళాకారులను పిలిచి, హార్మోనియంతో పద్యాలు పాడుతూ బాధను మరిసిపోత.

తాత్వికత, భావుకత, విప్లవం, వాస్తవికత…ఇలా వైరుధ్య స్వభావాలను సమ్మిళితం చేసుకున్న మీ పాటకు ప్రధాన ప్రేరణ ఏమిటి ?

మా నాన్న నర్సింహ్మ అద్భుతమైన యక్షగాన కళాకారుడు. సంస్కృత శబ్దంతో కూడిన పది, పదిహేను యక్షగానాలు ఆయన నాలుకమీద ఆడేటివి. మా నాన్న, మా మామ వీరయ్య ‘చెన్నదాసు’ ప్రభావంతో తత్వాలు పాడేది. మా వెంకటరెడ్డి మాష్టారు వల్ల మార్క్సిజం పరిచయమైంది. నాలో సంప్రదాయ కవిత్వ ధోరణి, విప్లవ కవిత్వ ధోరణి కలగలిసుంది. అణచివేత కట్టడి కిందనుంచి వచ్చిన వాళ్లకు ప్రకృతి చాలా ఇష్టంగా ఉంటది. నేనిష్టంగా చదివే ‘ఆముక్తమాల్యద’లో ప్రకృతి వర్ణనలు అపురూపంగుంటయి. ప్రకృతిమీద నాకున్న మమకారంతో పాటు కృష్ణశాస్త్రి గేయాలు వినడం వల్ల ప్రకృతి కవిత్వం రాయాలనిపించింది. శివసాగర్‌, నాజర్‌, గద్దర్‌, సుద్దాల హన్మంతు పాటలు విని విప్లవ పాటలు రాయాలనిపించింది. కైవారం నారాయణ దాసు, వీరబ్రహ్మం, చెన్నదాసు, మలిక్‌దాసు, కాశీదాసు, దున్న ఈద్దాసు తత్వసాహిత్యం నుంచీ ప్రేరణ పొందిన. రాయలసీమ ప్రాంతమంటే నాకు ఇష్టం అనడంకన్నా మమకారం అని చెప్పచ్చు. ఆ వెనకబాటుతనంలో ఏదో బ్యూటీ ఉంటది. ఆ మెట్టప్రాంతంలో ఏదో సొగసుంటది. అక్కడి కొండలు, రాళ్లు…ఉండీలేనట్టుండే ఆహారపద్ధతులు, అందులోనూ రాగిముద్దలో వేరుసెనగపప్పుకారం వేసుకొని తినడం….అక్కడి జానపదం….ఇవన్నీ నాకిష్టం. ఆ మాటకొస్తే, పరిమితత్వం అయినవన్నీ నాకు ఇష్టమే.

 మీ కవితా దృష్టిని విశాలం చేసి, మీ పాటను పదునెక్కించడంలో తోడ్పడిన అంశాలు..?

బౌద్ధం, మార్క్సిజం నన్ను ప్రభావితం చేశాయి. అంతేనా, అంబేద్కర్‌, గాంధీ, లోహియాలూ ఇష్టమే. ప్రిమిటీవ్‌ సమాజంలో గొప్ప తాత్వికత ఉంటది. కబీరుతో పాటు ఉపనిషత్తులనూ ఇష్టపడతా. అలాగే వేదభూమిగా చెప్పే భారతదేశంలో సతీసహగమనం వంటి దురాచారాలూ ఉన్నాయి. యూరోపియన్‌ సమాజంలో పురుడుపోసుకొన్న ఆధునిక భావాలతోనే మూఢత్వాన్ని జయిస్తున్నాం. కనుక మనం ప్రతి సమాజం నుంచి నేర్చుకోవాల్సి ఉంటది. తెలంగాణ కవులెంత గొప్పోళ్లో, ఆంధ్రాకి చెందిన కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ అంత గొప్పోళ్లు అని పులకించిన సందర్భం. విశ్వనాథ భావాలు ఎంత కఠినంగా అనిపించినా, ఆయన సాహిత్యంలోని రసదృష్టిని అంగీకరించకుండా ఉండలేం. జిడ్డు కృష్ణమూర్తి మొదలుకొని రామకృష్ణపరమహంస, రామచంద్రప్రభు వంటి వారూ నాకు ఇష్టమే. నా పాటల్లో ప్రస్ఫుటించే తత్వం నాకు తెలిసి రాలేదు. మెట్టప్రాంతాల్లోని తాత్వికత, కబీర్‌, వేమన, అన్నమయ ల ప్రభావం కొంచెం అబ్బిందేమో అనిపిస్తది. దిగంబర కవిత్వంపట్ల గౌరవం ఉన్నా, దాన్నుంచి ప్రేరణ పొందలేకపోయ. అందుకు కారణం అంత అలజడిని నేను భరించలేకపోవడమే.

విద్యార్థి రాజకీయాలు మీపై ఎలాంటి ప్రభావం చూపాయి ?

నేను పదోతరగతి చదువుతున్నప్పుడే, భారత విద్యార్ధి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) సభ్యుడిని. తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లా నాయకుడిగా పనిచేసిన. ప్రజానాట్యమండలిలో జిల్లా స్థాయి గాయకుడిగా పాటలు పాడేది. సమాంతరంగా పద్యనాటక సమాజాలతోనూ సంబంధాలుండేది. జక్కా వెంకయ్య, నండూరి ప్రసాదరావు, మోటూరి హనుమంతరావు, విఠల్‌ లాంటి వాళ్ల ఉపన్యాసాలు విన్నా. డిగ్రీలో అర్థశాస్త్రం చదివి, పరీక్షలు రాసినా అర్థంకాని ఉత్పత్తిశక్తులు, ఉత్పత్తి సంబంధాలు గురించి కమ్యూనిస్టు నాయకుల ఉపన్యాసాలతో అర్థమయ్యేది. సుందరయ్య అంటే దైవంలా భావించా. మా గురువు వెంకటరెడ్డి తుది వరకూ అపర సుందరయ్యలా బతికారు. మేము అనే ఉనికే మాకు లేని రోజుల్లో మమ్మల్ని మనుషులుగా నిలబెట్టాయి ఆనాటి వామపక్ష విద్యార్థి ఉద్యమాలు.

 ఆ తర్వాత మీరెందుకు ఏ ఇతర ప్రజా సంఘాల నిర్మాణంలోనూ పాల్గొనలేకపోయారు..?

పాలమూరు కవి రాఘవాచారి లాంటి రచయితలు ఆహ్వానం మేరకు కొన్నిసార్లు విరసం సభల్లో పాల్గొన్నా. శివసాగర్‌ కోసం ఎన్నో సార్లు విరసం సదస్సులకెళ్లిన. అయితే, అభ్యుదయ రచయితల సంఘం పాత చరిత్ర నాకు కొంత తెలుసు. సంఘాల్లో ఉంటే నిబద్ధత పేరుతో రచయితలు, కవులు స్వేచ్ఛ కోల్పోతారనే భయం నాలో ఉండేది. సంఘాల పట్ల గౌరవం ఉన్నా, వాటిల్లో నేను ఇమడలేను అనుకున్నా. తొలినాళ్లలో అరుణోదయ రాష్ట్ర కమిటీలో ఏడాది పనిచేసిన. కానీ అందులోనూ నిర్మాణాత్మకంగా లేను. తెలంగాణ ఽధూంధాంలో కూడా పాటలు పాడిన గానీ, ఎన్నడూ ఒక్క కమిటీలోగాని లేను. నేను ఒక పట్టాన ఉండే బాపతు కాదు. ఇంటిపట్టునే సక్కగుండని నేను, సంస్థల్లో ఏముంట (నవ్వుతూ…). సంఘాల పెద్దల కూడా నన్ను భరించలేరులే అనుకున్న ..(నవ్వుతూ..)

 దళిత ఉద్యమాలతో మీకున్న అనుబంధం వివరిస్తారా..?

నా ‘ఏకునాదం మోత’ సంపుటంతా దళిత ఉద్యమాలమీందే. మండలకమిషన్‌కి వ్యతిరేకంగా మారోజు వీరన్న పాడిన ‘అందుకోర..’ పాట నేను రాసిందే. కారంచేడు, చుండూరు బాధితులకు బాసటగా కత్తిపద్మారావుతో పాటు ఘటనాస్థలికెళ్లి, ఐదు నిమిషాల్లో పాటరాసిన సందర్భాలున్నయి. నేను దళిత ఉద్యమంలో సీరియస్‌గా పనిచేసిన రోజులున్నయి. కలేకూరి, పైడితెరేశ్‌, లేల్లే సురేశ్‌తో కలిసి ఉద్యమంలో యాక్టీవ్‌గా పాల్గొన్నా. దళిత సాహిత్యాన్ని ఇష్టపడతా. ఉద్యమకారులతో స్నేహసంబంధాలున్నయి. అయితే, మార్క్సిజంతో కలిసి దళిత ఉద్యమాలు పనిచేయాలనేది నా అభిప్రాయం. మన సమాజంలో దళితులు అత్యంత పీడితులు. ఆ పీడితుల విముక్తి కోరుకునేవాళ్లు, మిగతా పీడితులు…అంటే బహుజనులు, అగ్రకులాల్లోని పేదలను శత్రువులుగా చేసుకోకూడదు. అలా సాగే ఉద్యమంతో విముక్తి లభించదు. పైగా అన్యాయం జరుగతది. దళిత ఉద్యమాలలో ఇప్పుడు అదే జరుగుతుంది. కనుక వాటికి నేను కొంచెం దూరంగా ఉన్న.

 మీ కవిత్వం, గేయాల్లో పల్లె సొగసుతో నిండిన భాషా ప్రయోగం ప్రత్యేకం. అదెలా సాధ్యం..?

ముందుగ, భాషను ప్రయోగించడం తెలవాల. అందుకు మనలో భాష బాగా నానాల. భాష తెలవాలంటే, పూర్వపు సంప్రదాయం కూడా తెలిసుండాల. భాషను శక్తివంతంగా ప్రయోగించగలిగితే, ఆలోచనలను అద్భుతంగా చెప్పగలం. ‘పల్లెకన్నీరు..’ పాటలో వస్తువును అనుసరించి భాష ఉంటది. పల్లె వస్తువు. అందులోని వృత్తులు వస్తువులు. దాని చుట్టూ ఉన్న జీవితం, వృత్తుల నుంచి ఉత్పత్తి నుంచి పలికే పదాలుంటాయి. వాటిని ఒలికించడం వల్ల ఆ పాటలో సరళత పొదుగుతుంది. ‘జైబోలో తెలంగాణ’ సినిమాలో ‘‘ఈ గాయమేగా..’’ పాట, అలాగే ‘దొరసాని’ సినిమా పాటల్లో మొత్తం కవిత్వమే ఉంటది. అందులో ‘కంచు చెంబులో సల్ల…దొరసాని ఆ పిల్ల..’ పాటలో వస్తువును బట్టి భాష వాడిన.

ఆ నిగూఢత నా జీవితానుభవం నుంచి వచ్చింది. మరికొంత సంచారం వల్ల కలిగింది. ఏదైనా పాటరాసేప్పుడు ఒక మైకంలోకెళ్లిపోత. మనలోని భావాన్ని పాట రూపంలో చెప్పాలనుకున్నప్పుడు అలవోకగా పదాలు కూడ దుంకుతాయి. ఆవేదన, అలజడి నుంచే పదాలు కూడ వస్తయి. మారుమూల ప్రాంతాల్లో నిజమైన ప్రతిభ, జ్ఞానం, సజీవ ఉత్తేజాన్ని ఒలికించే భాష దాగుంది. ఏమీ లేదనుకొన్న చోటును వెతుకులాడితే గొప్ప జ్ఞానం పరిచయం అవుతది. కవిత్వానికి ఆధారం దొరుకతది. భాషకు జీవశక్తి వస్తది.

మన జ్ఞాన మునివాటికలు గిరిజన, ఆదివాసీలు. వాళ్లున్న చోటుకెళితే భాష భిక్షపెడతరు. అయితే, వాటిని గుర్తించగలిగిన ఓర్పు, నేర్పు మనకు ఉండాలె.

 మీరు పలు సినిమాల్లోనూ నటించారు. మరి, అవకాశాలొస్తే ఇప్పుడూ నటించనున్నారా..?

సినిమాల్లో కన్నా పద్యనాటకాల్లో నడించడం నాకు ఇష్టం. ఇప్పటికీ ఏడాదిలో కనీసం పదిసార్లయినా పద్యనాటకాల్లో నటిస్తుంటా. లేకపోతే, నాకు దప్పిక తీరదు. ఏడాదిలో కనీసం యాభై సార్లు అయినా, నాటకాలు చూడనీకి వివిధ ప్రాంతాలు పోతా. ఇక ఇప్పుడు మఫ్లర్‌ గిఫ్లర్‌కట్టుకొని చప్పుడు సేయకుండా జనంలో కూర్చొని చూడాలేమో (నవ్వుతూ..). నిద్రగాసి, మగత కళ్లతోని…చలికి గజగజ వణుకుతూ… మామోలు ప్రజల మఽధ్య కూర్చొని ‘‘సత్యహరిశ్చంద్ర’’ నాటకం చూస్తుంటే.. అందులోని కాటి పద్యం వింటూ, ఆ శోకాన్ని సమూహంగా అనుభవిస్తే, అంతకన్న అద్భుతమైన ఉపశమనం మరొకటుందనుకోను. శోకాన్ని ఆహ్లాదంగా అనుభవించే స్థితి మనకు కళలు, సాహిత్యం ద్వారానే లభిస్తది.

 తెలుగు భాషపై ఇంత సాధికారత కలిగిన మీరు బోధనావృత్తివైపు వెళ్లాలనుకున్న సందర్భం ఉందా..?

అదృష్టవశాత్తు, నేను ఏమీ గావాలనుకొని ఏమీ గాలె. నాకు ఏంతోస్తే, అదే పని చేసుకుంట పోయిన. నాలుగో తరగతి చదివిన లక్ష్మీకాంత మోహన్‌ షేక్‌స్పియర్‌ను తెలుగులోకి అనువదించాడు. చదువు లేకున్నా చానామంది కవులు అద్భుతమైన కవిత్వం రాస్తున్నరు. కనుక చదువుతో పెద్ద సంబంధం లేదు. అయితే, నా ఎమ్మే అయ్యాక, కనీసం అధ్యాపకుడిని కావాలనుకున్నా. కానీ ఒకటనుకుంటే.,..మరొకటి అయితది. అలాగే పీహెచ్‌డీ కోరిక ఉండె. తెలంగాణ యక్షగాన సాహిత్యంమీద ఎన్నటికైనా పీహెచ్‌డీ చేస్త. ఒక యక్షగానంలో బుడ్డరఖాన్‌ పాత్ర ఉంది. నిజాం ఆగడాలను ప్రశ్నించనీకి ఆ పాత్ర పెట్టినరు. అసలు ఒక కళారూపం ఎందుకు ఉనికిలోకి వస్తది. ఒక సమాజంలోని ఘర్షణలకు అనుగుణంగా ఎలా మారతది. అసలు తప్పెటగుళ్లు, కోలాటం వంటి రూపకాలు ఎలా వచ్చాయి వంటి అంశాలపై లోతుగా అధ్యయనం చేయాలనుంది. ఆ చరిత్రలో మన మూలాలుంటయి. కాటమరాజు కథలో .480రకాల గడ్డిపేర్లు ఉన్నయి. మరి ఇప్పుడు అవన్నీ ఎమయ్యాయి. జానపద సాహిత్యం ద్వారా మన భాష, సంస్కృతి మరింత పరిఢవిల్లుతుంది. కనుక జానపద సాహిత్యం మీద పరిశోధన చేయలేకున్నా, కనీసం వ్యాసాలైనా రాస్తా.

ఫ మీరు ఎమ్మెల్సీ అయ్యాక, మీపై వస్తున్న విమర్శలకు సమాధానం…?

చాట మూస్తం, కుండ మూస్తం….నోరు మూయలేం. నోరు వల్లనే ప్రపంచంలో చానా జరిగినయి. కనుక నోరు మూయడం కష్టం. వాళ్ల ఆనందాన్ని నేనెందుకు భగ్నం చేయాలె. అందరూ బాగుండాలనుకునే నేను, నన్ను విమర్శించినోళ్ల చెడును మాత్రం ఎందుకు కోరతా. అనుకొని అనుకొని వాళ్లే అలసిపోతరు. నా శక్తి, సామర్థ్యాలకు మించిన గౌరవాన్ని పెద్దలు ఇచ్చుగాక…నేను చేసేది మంచో, చెడో నాకు తెలుసు. నాకు నేను సంజాయిషీ చెప్పుకుంట. అంతేకానీ, ఇతరులకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు. అలా అన్నోళ్లందరికీ చెప్పుకుంటూ పోతే అంతేముంది. గోరటి ఎమ్మెల్సీ అయ్యిండంటే, మంచిగ అనేటోళ్లున్నరు. చెడుగనేటోళ్లున్నరు. ఇద్దరికీ దండమే.

మీ వ్యాపకాలు…

రోజూ రాత్రిపూట కనీసం నాలుగంటలైనా చదువుతా. ఏదీకాకుంటే, పద్యనాటకాలైనా చదువుతా. లేకుంటే, పద్యాలు పాడుకుంట. పుస్తకం లేకుంటే నేను ఉండలేను. చిన్నప్పటి నుంచి ఆవులు ఇష్టం. పొలం పనికూడ చేస్తా. అసలు నేను తెల్లగుండే మనిషిని. ఎండకు పనిచేసి ఇట్లగయినా. ఇప్పటికీ నాలుగు ఆవుల్ని మేపుతున్నా. ఏదో పని చేస్తుంట. అంతేగానీ, ఖాళీగా మాత్రం ఉండను.

  కథా రచనకు దూరం…

కథలు రాయాలంటే బాగా ఓపిక గావాలె. నా కాళ్లకు చక్రాలున్నయి అంటరు మా దోస్తులు. ఒక తాన కూర్చొనేటోడిని కాదు. ఇంట్లో కూచొని పాటరాసేది చానాతక్కువ. కథ, నవల కూర్చొని రాయాల. అంత కుందనమైన బతుకు కాదు నాది. చిన్నప్పటి నుంచి పాట రాయడం ఇష్టం. కనుక రాస్తున్న. కొత్త బాధ్యలొచ్చినంక, తిరగడం ఎట్లుంటదో సూసుకోవాలె (నవ్వుతూ…)

సినిమా పాటలు….

మొదట ఎన్‌ శంకరన్న సినిమాల్లో నాకు అవకాశాలు కల్పించాడు. నారాయణ మూర్తి అన్న సినిమాలకు ఎక్కువ పాటలు రాసిన. తర్వాత చాలా సినిమాలకు రాసినా, రాస్తున్నా. నాకు నచ్చక కొన్ని, వాళ్లు చెప్పినట్టు నేను రాయలేక మరికొన్ని అవకాశాలు వదులుకున్నా. క్లాసులిస్తే, మాత్రం సచ్చినా పాట రాయలేను. ఎవరైనా చెబితే, రాయాలనిపించదు. సాహిత్యం అనంతమైంది. ఎంత రాసినా, ఇంకా ఏదో వెలితి వెంటాడతది. నేను రాసిన పాటలు ముద్రితంలో కన్నా, పుస్తకంగా రానివెన్నో ఉన్నయి. ఎమ్మెల్సీ వచ్చింది కనుక, జీవితంలో ఇక చాలు అనుకుంట. అదొక పదవి కనుక. అదే పాట రాసి, కవిత్వం రాసి ఇక చాలు అనుకోలేం. నదీ ప్రవాహంలో వెలితి ఎల్లకాలం ఉంటది. అలాగే నాలోనూ అదే వెలితి. ఇంకా ఏదో రాయాలని…

*

బొమ్మ: శంకర్ 

Avatar

వెంకటేశ్ కరుశాల

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గోరటి వెంకన్న అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది సారంగ. సమగ్రంగా ఉంది. ఇరవై ఏళ్ల పైగా వెంకన్న తో పరిచయం ఉన్నా నాకు తెలియని ఎన్నో కోణాలు వెలికి తీశారు. Great job. శక్తి

  • ఎమ్మెల్సీ పదవి పై విమర్శలకు సమాధానం భేష్ ..

  • గోరేటి వెంకన్న గారి గురించి చాలా మంచి వివరాలు తెలిసాయి ఈ గోష్టి వల్ల. అంత చక్కగా గోష్టి నడిపించిన వెంకటేష్ కరుశాల గారికి అభినందనలు

  • మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా రాసిన పాటా అని పేర్కొన్నారు.. నిజమేనా?

  • గోరేటి  వెంకన్న తో మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం అయినా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి.   ” సాహిత్య రంగంలో పాలిటిక్స్‌ రాజకీయాల కన్నా ఎక్కువుంటయి. అణచివేత కట్టడి కిందనుంచి వచ్చిన వాళ్లకు ప్రకృతి చాలా ఇష్టంగా ఉంటది” లాంటి మంచి మాటలు చెప్పాడు వెంకన్న.  వెంకన్నకి MLC ఇవ్వడం  చాలా మంచి పరిణామం. తెలంగాణేతరులకి పదవులు ఇచ్చినప్పుడు విమర్శించని వారు, ఇప్పుడు విమర్శించడం సిగ్గుచేటు.  మంచి ఇంటర్వ్యూ  అందచేసిన వెంకటేష్ కరుషాల   గారికి ధన్యవాదములు.

  • మంచి ఇంటర్వ్యూ. భిన్నమైన ప్రశ్నలతో వెంకన్న అంతరంగాన్ని ఆవిష్కరించారు. శుభాకాంక్షలు.
    -పసునూరి రవీందర్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు