నాలుగో అడుగు: క్షమాపణ

(గత సంచిక తరువాయి)

ది చాలా మంచి ఆలోచన. ఈ సమాజం అంగీకరించే అడుగు. నందు ఇగోని చల్లార్చే అడుగు.

నువ్వు క్షమించమని అడుగుతావు. కొంచెం కష్టమైనా, కోపాలు తాపాలు తీరిన తరువాతైనా, నీ జీవితాన్ని మళ్ళీ మామూలుస్థితిలోకి తీసుకురాగలిగిన అడుగు. కానీ ఈ అడుగు వెయ్యాలంటే నువ్వు ఆచి తూచి నిర్ణయించుకోవాలి. అందులో వుండే బాధ లోతుని కొలిచి మరీ దిగాలి. ఇది అన్నింటి కంటే కష్టమైనది కూడా. ఆలోచించుకోని నిర్ణయం తీసుకో. ఏది సరైన నిర్ణయమో ఏది కాదో నీ కన్నా ఇంకెవరికి బాగా తెలుస్తుంది?

వెళ్తావు. క్షమించమని అడుగుతావు. నందు కాదనకపోవచ్చు. అంతేనా? అది అంత సులభంగా జరగకపోవచ్చు కూడా. చివరికెప్పుడో సరే అంటాడు. అంటాడా?

అంటాడు. ఎందుకంటే అతనికి నువ్వు కావాలి. తనది అనుకోడానికి ఒక కుటుంబం, సంసారం కావాలి. అతను నీకే ట్యూన్ అయ్యి వున్నాడు. ఖచ్చితంగా క్షమించానని అంటాడు. ఒకసారి ఆ మాట అన్నాడంటే నీ భార్య హోదా నీకు దక్కుతుంది.

అయితే ఈ ఆలోచన వెంటనే అమలుచెయ్యాలి. ఈ సంగతి ఇంకొకరికి తెలిసే లోపల క్షమాపణ అడిగేయాలి. ముఖ్యంగా నందుకి ఇంకెవరి ద్వారానో ఈ విషయం తెలిసేలోగా. అలాగైతేనే జరిగే డ్యామేజ్ తక్కువ. ఎవరికీ తెలియక ముందే నీ అంతట నువ్వే నీ తప్పుని చెప్పుకోని క్షమించమని అడగటం. అలా చెయ్యటం వల్ల నీ మీద ఒక లాంటి విశ్వాసం కలుగుతుంది. తప్పిపోయి ఇల్లు చేరిన పిల్లని చూసినట్లు చూస్తారు. ముఖ్యంగా నువ్వు క్షమాపణ అడిగిన తరువాత ఎవరైనా కనిపెట్టినా ఆ ప్రమాద తీవ్రత చాలా తక్కువగా వుంటుంది.

కన్ఫెషన్ మంచి ఆలోచన. నందు కూడా ఒప్పుకునే ఆలోచన. ఎంత కాదనుకున్నా అతను నీకు భర్త. నీ భర్త అంటే నీకు ప్రేమ లేకపోలేదు. అతను బాధపడితే నువ్వు చూడగలవా? చూడగలను అంటున్నావు కానీ చూడాలి అని కోరుకునేంత చెడ్డవాడు కాదేమో అతను.

నందుని అర్థం చేసుకోవాలి నువ్వు. ఈ నిర్ణయం తీసుకున్న తరువాత ఇక నందుతోనే కదా నీ జీవితం. మీ ఇద్దరి వివాహ బంధం జీవితాంతం కొనసాగేలా నువ్వు ప్రయత్నించాలి ఇప్పుడు. ఇది ఇలానే కొనసాగాలి. అది ఆపేయాలి.

వి.. వా… హ… బం… ధం..!

ఎలా? కొంచెం ప్రేమని కలుపు, కాస్త రంగులు నింపు, అవసరమైతే కొంచెం ప్రిజర్వేటివ్స్ వేసి, వారానికో పార్టీ, నెలకి రెండు సినిమాలు, ఆర్నెలలకి ఒక ఫారిన్ ట్రిప్… ఇవన్నీ కలిపి రంగరించి ప్రిజ్ లో పెట్టి చెడిపోకుండా కాపాడాలి. రుచి తగ్గిపోవచ్చు కానీ పాడైపోకూడదు. రుచి లేకపోయినా సరే, వుండాలి అంతే! అదే కదా? అలా వుండటానికి సిద్ధమేనా?

నువ్వు క్షమాపణ అడగాలని నిర్ణయించుకోవాలంటే, నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకోవాలి. శశాంక్ తో నీకు వున్న ఎఫైర్ తప్పు అని ఒప్పుకోవాలి. తప్పు చేస్తేనే కదా క్షమాపణ కోరతారు. కాదనడానికి లేదు నియతీ. ఆ తరువాత శశాంక్ ని కలవడం మానేయాలి. రోజులు, వారాలు, నెలలు అవసరమైతే సంవత్సరాల పాటు శ్రమించి నువ్వు కోల్పోయిన నీ సంసారబంధాన్ని నిలబెట్టుకోవాలి. కష్టమే. ముఖ్యంగా నందులాంటి వ్యక్తితో. కానీ తప్పదు. నువ్వు చేసిన తప్పుకి ఇది శిక్ష అనుకో. దాని వల్ల నీకు మంచే జరుగుతుంది. నీ చుట్టూవుండేవాళ్ళు, సమాజం, నీ బంధువులు, అతని బంధువులు అందరూ ముందు గుసగుసలాడుకుంటారు. ఆ తరువాత నీ కష్టం చూస్తారు. అభినందిస్తారు. ఆ తరువాత ఆరాధిస్తారు. ఆడదాని మానసిక కష్టం చూడాలంటే ఎంతిష్టమో వాళ్ళకి. అది కూడా కథ, నవల, సినిమాల్లో కాకుండా కళ్ళ ముందే జరిగితే అంత కన్నా ఆనందం ఇంకేముంటుంది వాళ్లకి?

తప్పు చేశానని ఒప్పుకో. అది నీకు వెనక్కి తిరిగి నడిచేందుకు తలుపులు తెరుస్తుంది. మళ్ళీ పాత నియతిగా నిన్ను నువ్వు మార్చుకునేందుకు అవకాశం ఇస్తుంది.  మళ్ళీ నీ ఇంట్లో నువ్వు. అతని భవిష్యత్తులోకి దారులు వేసే సహధర్మచారిణిగా గుర్తింపు. అతని విజయాల వెనుక వుండే స్త్రీ స్థానంలోకి నేరుగా ఎంట్రీ! గో! గో!

సరైన ఆలోచన. సరిగ్గా వుండు. సరైన పనే చెయ్యి. నువ్వు నువ్వుగా వుండకపోవచ్చు. కానీ నందు భార్యగా వుంటావు. అతని నీకు నీడనిస్తాడు. ఆ నీడ కల్పించే చీకటిలో నీకు నువ్వే కనపడకుండాపోతావేమో! అయితే మాత్రం ఏమైంది. అతను నీకు అన్నీ ఇస్తాడు. నీకేం కావాలంటే అది ఇస్తాడు.

చాలదా? ఇంకా ఏం కావాలి? చెప్పు ఇంక నీకేం కావాలి?

శశాంక్?

మర్చిపో శశాంక్ ని. కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు నియతీ. ఇద్దరిలో ఒకరిని వదిలెయ్యక తప్పదు నీకు. నందుని వదిలెయ్యడం అసాధ్యం. ఎందుకు అని అడుగుతున్నావా? పోనీ వదిలేస్తావా నందుని? శశాంక్ దగ్గరకి వెళ్ళగలవా? అతని భార్య డెలివరీ అయిపోయిన తరువాత అతను నీతో ఇలాగే గడుపుతాడని అనుకుంటున్నావా? ప్రేమ గురించి కాదు నేను చెప్పేది. అది అతనికి కూడా వుందేమో! కానీ అతనికి కూడా ఒక కుటుంబం వుంది. నీలాగే. ఎవరి కుటుంబంలో వాళ్ళు వుండటమే మంచిది కదా!

నీ సంసారంలో నువ్వు ఉండిపో. పెళ్ళి అనే ప్రక్రియ నీ జీవితంలోకి తీసుకొచ్చిన విశేషాలని అనుభవించు. ఆనందం తక్కువైతే వెతుక్కో. ఇంట్లోనే! బయట కాదు. దొరుకుతుంది. బహుశా నీకు పిల్లలు పుట్టిన తరువాత. బహుశా నీకు భక్తి పెరిగిన తరువాత. బహుశా నీకు పెయింటింగ్ వెయ్యడంలో వున్న మానసిక ఆనందం అనుభవంలోకి వచ్చిన తరువాత. ఇలాంటి అభ్యంతరంలేని పనులు ఎన్నో వున్నాయి. ఎఫైర్ అందులో లేదు.

ప్రేమ కావాలా? అందరి జీవితాల్లో ప్రేమ వుందా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? పెళ్లికి ముందు నీ జివితంలో ప్రేమ వుందా? చాలాసార్లు ప్రేమించినదానివి. ఎన్నిసార్లు ప్రేమించావో అంతకన్నా ఎక్కువసార్లు వైఫల్యాలను చూసినా దానివి. నందు జీవితంలో ప్రేమ వుందా? శశాంక్ జీవితంలో? వుందా? వుంటే నీతో ఇలా…. ఎందుకో అతని జీవితంలో ఆ సమస్య లేదనిపిస్తోంది. రేఖ గురించి మాట్లాడేటప్పుడు అతని కళ్ళలో వెలుగు వుంటుంది. బహుశా అతనికి నువ్వొక టెంపరరీ రీప్లేస్మెంటేమో!

ఇలా అనడం నీకు నచ్చదేమో? కానీ ఇలాగే ఆలోచించడం మంచిది. ఒకసారి నందు దగ్గర కన్ఫెస్ చేసిన తరువాత, శశాంక్ జీవితంతో సంబంధం వుండకూడదు. అందుకే అతను నిన్ను ప్రేమిస్తున్నాడనీ, అతనికి నువ్వు కావాలనీ, నీకు అతను కావాలనీ అనుకోవడం మానేసెయ్. చాలామంది మొగవాళ్ళలానే శశాంక్ కూడా కోరుకున్నది పడక సుఖమే అని అనుకో! అది నిజమైనా కాకపోయినా. నువ్వు చెయ్యాలనుకున్నది సులభమౌతుంది

ఒప్పుకోవు కదా నువ్వు? ఎందుకు అంత ప్రేమిస్తున్నావు శశాంక్ ని? నందు విషయం కాస్సేపు పక్కనపెట్టు. శశాంక్ గురింఛి ఆలోచించు? ఎందుకు ప్రేమిస్తున్నావు? ప్రేమ కూడా పక్కన పెట్టు. ఎందుకు అతనితో శారీరికంగా కలవడానికి అంగీకరించావు. గుర్తుచేసుకో!

అది అనుకోకుండా జరిగిన ఏక్సిడేంటా లేక ఒక ప్రణాలిక ప్రకారం జరిగిందా? ఈ ప్రశ్నకు సమాధానం ముఖ్యం నియతీ. నందు క్షమించాలా లేదా అన్న ప్రశ్నకు సమాధానం కూడా ఈ ప్రశ్నలోనే దాగి వుంది.

అనుకోకుండా కనపడ్డప్పుడు ఆ పలకరింపు పాత జ్ఞాపకాలను తాజా పరుస్తుందనుకున్నావు కానీ ఇలా సందిగ్ధాల చిట్టడివిలోకి దారి తీస్తుందనుకోలేదు. తెలిసుంటే ఇది ఆదిలోనే అంతమయ్యేదేమో!

కాఫీ? అన్న ప్రశ్న కన్నా అతని చిరునవ్వు, ఆ చిరునవ్వు చివర్లో బుగ్గ పై పడ్డ సన్నటి సొట్ట నువ్వు కాదనలేని కష్టంలోకి నెట్టేశాయి. అప్పటికే అతని చెయ్యి వణుకుతున్న నీ చేతి పట్టుకోని వుంది.

ఎక్కడ? అనడిగావు. అదే మా ఇల్లు. చూపించి అన్నాడు. నిరాశ ఎందుకు కలిగింది? ఇంటికి తీసుకెళ్ళి భార్యని పరిచయం చేస్తాడనుకున్నావు. ఇంటికి వెళ్ళిన తరువాత ఆమెలేదని చెప్పాడు.

మరి కాఫీ?

ఏం నేను కలపకూడదా?

అతను కిచెన్ లోకి వెళ్ళిన తరువాత మొదలైంది నీలో సందిగ్ధం. భయం. అనుమానం. ఆలోచన.

కాఫీ తాగినంత సేపు కప్పు వైపే చూశావు. అప్పటి దాకా అతను నిన్నే చూశాడు. అతను చూస్తున్నాడని నీకూ తెలుసు. కప్పు దించి రెప్పలు పైకెత్తి అతన్ని చూడగానే తడబాటుగా మరోవైపు చూసే శశాంక్ ని చూడాలని చూస్తే –

అతను అలాగే చూస్తున్నాడు. అలాగే. కళ్ళలో పలికిన పదాలు, వాక్యాలు, కావ్యాలు. ఎప్పుడు దగ్గరకు వచ్చాడో తెలుసుకోలేకపోయావు. ఎందుకు దగ్గరయ్యావో తెలుసుకోదల్చుకోలేదు నువ్వు. పర్యవసానం ఏమిటో నీ ఊహలోనే లేదు.

దగ్గరగా అతని శ్వాస మరింత దగ్గరై ముద్దుగా పరిణమించి నీ చేతులు అతని భుజాలపై, అతని చేతులు నీ భుజాల మీదుగా జారి నీ వీపు మీద…

విస్ఫోటనంలా కళ్ళు తెరిచావు.

నేను వెళ్ళాలి. అన్నావు. అతను తలాడించాడు తప్ప ఉండమనలేదు. అంటే ఏం చేసేదానివో మరి!

ఫోన్ నెంబర్ ఇస్తావా? అన్నప్పుడు ఎందుకు చెప్పావు? తలదించుకోని వెళ్ళాలన్న తొందరలేకపోయినా వెళ్ళిపోవాలన్న పట్టుదల తెలిసేలా అస్థిరంగా కదులుతూ, చేతిలో వున్న హేండ్ బ్యాగ్ కొసల్ని లాగుతూ… ఎందుకు చెప్పావు?

అక్కడితో ముగిసిపోవాల్సిన కథకి ఇంకా వుంది అన్న పదాలని జోడించి వచ్చావు కదా? ఎందుకు?

ఎందుకు అతను నీకు ఇచ్చిన మిస్డ్ కాల్ సేవ్ చేసుకోకూడదు అనుకుంటూ యస్ అన్న ఒక్క అక్షరంతో సేవ్ చేసుకున్నావు. పేరు పూర్తిగా ఎందుకు టైప్ చెయ్యలేదు?

అవన్నీ కాదు. ఎందుకు మళ్ళీ ఫోన్ చేశావు? అవును మూడు రోజుల తరువాతే? ఎందుకు చేశావు?

అది అనుకోకుండా జరిగిన ఏక్సిడెంట్ కాదు. ఆ రోజే జరిగిపోయి వుంటే అలా అనుకోవచ్చు. మూడురోజుల తరువాత నువ్వే ఫోన్ చేసి కోరుకున్న సంఘటన. ఎందుకు కోరుకున్నావు?

కారణం వుండాలి కదా? ఏమిటా కారణం? సరదా కోసమా? థ్రిల్ కోసమా? ఏదో కోల్పోతున్నానన్న స్పృహ లోంచి కోల్పోతున్నదాన్ని అందుకునేందుకు చాచిన చేయి. అవునా? నువ్వు కోల్పోతున్నదంతా నీ భర్త వల్లే అన్న ఆలోచనతో నీ భర్తపట్ల నీ అవిధేయతను ప్రకటించే మార్గమా?

ఏమన్నావు?

స్వతంత్ర్య ప్రకటన. ఎంత బాగా సమర్థించుకుంటావు నిన్ను నువ్వు. సరే అయితే అదే కానీ.

నీకు సమాధానం దొరికింది కదా? ఇది నందుకి ఎలా చెప్తావు? చెప్పగలవా? నిన్ను నువ్వే ఒప్పించుకోవడానికి ఇంత కష్టపడ్డావే మరి నందుకి చెప్పి ఎలా ఒప్పిస్తావు? పిచ్చిదానా.

నందు దగ్గర నీకు స్వతంత్ర్యం లేదు. అందుకని ఒక స్వతంత్ర ప్రకటన చేస్తున్నావు. నందు ఒప్పుకుంటాడా?

నీకు ఏం కావాలంటే అదంతా ఇచ్చాను అంటాడు

కాదు నాకు ఏం కావాలని నీకు అనిపిస్తుందో అదే ఇచ్చావు అని చెప్పాలి నువ్వు. చెప్తావా?

నువ్వు ఎలా వున్నా నేనెప్పుడైనా అడ్డు చెప్పానా అంటాడు

నేను ఇలా వుండాలనుకుంటున్నాను అని చెప్పే అవకాశం ఎప్పుడైనా ఇచ్చావా అనాలి నువ్వు

నువ్వు నా కోసం ఇది చెయ్యి అది చెయ్యి అని ఎప్పుడైనా అన్నానా అంటాడు

అన్నావు అని గట్టిగా అరిచి చెప్పాలి. చెప్పగలవా?

ఇదంతా వ్యర్థమైన చర్చ. అనవసరపు ఆలోచనలు. ఆపేయ్ ఇక్కడితో. నందుకి క్షమాపణ చెప్పి నందుతోనే వుండిపోవాలి. నందు నిన్ను క్షమించి అతనితో వుండనివ్వాలి. ఇదిసాధ్యమా. ఇంత వరకే ఆలోచించు.

నందు సంగతి సరే మరి శశాంక్?

అతన్ని వదులుకోవాలి.

కుదరదు.

ఆల్రైట్. నువ్వు శశాంక్ ని వదులుకోడానికి సిద్ధంగా లేవు. అతని ప్రేమలో వున్నావు. అతనితో ఎఫైర్ మానెయ్యాలని నీకు లేదు. ఏం చేస్తావ్? మొదట అనుకున్నట్లు కొనసాగించడమే నీ నిర్ణయమా? కనీసం నందుకి తెలిసిపోయేదాకా. ఇది ఎప్పటికైనా తెలిసిపోయేదే. దాచిపెట్టగలిగిన రహస్యం కాదు. ఇక్కడితో ఆపేస్తే బహుశా తెలిసే అవకాశాలు తగ్గుతాయేమో. అందుకు మాత్రం నువ్వు ఒప్పుకోవటం లేదు.

నందుకి తెలిసిపోతుంది. తెలిసిపోవాలి. అసలు అది రహస్యంగా వుంటేనే సమస్య. రహస్యం నిన్ను ప్రతిక్షణం ప్రమాదంలో వుంచుతుంది. అదే రహస్యం బట్టబయలైతే ప్రమాదం తప్పిపోతుంది. కనీసం అది ప్రమాదకరమో కాదో తెలిసిపోతుంది.

తెలిసిపోయిన రోజు ఏం చేస్తావు?

కాదు. ఇదంతా అబద్దం అంటావు.

అవును చేశాను అయితే ఏంటి? అంటావు.

కాకపోతే తప్పు చేశాను క్షమించండి అంటావు.

ఎందుకు తప్పు చేశావు అంటే? ఏం చెప్తావు? నేరం నాది కాదు అన్న వాదన మరొకటి వుంది. తప్పు వేరే ఎవరి మీదకైనా తోసెయ్యడం.

అయ్యో పాపం అనిపించుకోవాలి. తన తప్పేమీ లేదు అనిపించుకోవాలి. అలాంటి సమాధానం వుందా నీ దగ్గర. నీకు మచ్చ అంటకుండా బయట పడాలంటే ఇంకెవరినో నిందించక తప్పదేమో. నీ భవిష్యత్తు సుస్థిరం చేసుకోవాలంటే ఇప్పుడు నువ్వు అగ్నిపరీక్ష నుంచి బయటకు వచ్చిన సీతాదేవిలా ఈ పరీక్షను దాటాలి. ఇంకెవరో చేసిన తప్పుకు నువ్వు బలైపోయావని… ఎవరు చేశారు తప్పు? శశాంక్?

సింపతీ పని చేస్తుంది. అది సంపాదించాలి నువ్వు.

విషసర్పాల మధ్య చిక్కుకున్న అభాగిని ఏదో పరిస్థితుల ప్రభావంవల్ల అలా చేసింది కానీ… నీ గురించి ఇలా అనుకోవాలి. ఎలా సాధించగలవు? ఎవరిని దోషిని చేసి నువ్వు నిర్దోషిగా బయటపడగలవు?

నీ జీవితంలో జరిగిన ఏ సంఘటనని తెచ్చి ఇక్కడ ఒక సమాధానంగా, ఎక్స్ ప్లెనేషన్ గా వాడగలవు? ఆలోచించు.

ఇదంతా నీ తల్లిదండ్రులు చేసిన తప్పు. నిన్ను పెంచడంలో చేసిన తప్పు. ఏనాడూ నీ మీద ప్రేమ చూపించని ఫలితం. వాళ్ళ సోషల్ మొబిలిటీ మీద వున్న ధ్యాస నీ మీద వుండి వుంటే నువ్వు ఇలా తయారయ్యేదానివి కాదు. ఎనిమిదేళ్ళకే నిన్ను హాస్టల్ పాలు చేసారు కదా? అక్కడ నువ్వు గడిపిన రోజులు, చలి రాత్రులు ఇవి కదా నిన్ను ఇలా తయారు చేశాయి? ప్రేమ రాహిత్యం లోంచి పుట్టుకొచ్చిన కోరికలివి. కాదంటావా?

నిజమే కానీ అది నిలబడే వాదన కాదు.

ఇంకెవరిని నేరస్థులుగా చూపించచ్చు?

నిన్ను నందు క్షమించాలంటే నీ తప్పు లేదని నమ్మాలి. అప్పుడు తప్పు ఇంకెవరిదౌతుంది? శశాంక్ దే కదా?

శశాంక్ తప్పు చేశాడు. నిన్ను ఇందులోకి బలవంతంగా లాగాడు. నీకు అలాంటి ఉద్దేశ్యం లేకపోయినా, అది తప్పని నువ్వు చెప్పినా వినకుండా…

చూడు… చూడు… ఒప్పుకోవడం లేదు నువ్వు. నందు నమ్మే విషయం. కానీ చెప్పడానికి నువ్వు సిద్ధంగా లేవు.

వేరే మార్గం లేదు. నందు, నువ్వు ఈ కథలో హీరో హీరోయిన్లుగా మిగలాలంటే శశాంక్ ని విలన్ చెయ్యక తప్పదు. మాట వరసకి అనుకోడానికి అనుకుందాం. శశాంక్ నిజంగానే నిన్ను మోసం చేస్తున్నాడేమో? ప్లాన్ చేసి నిన్ను ఇందులోకి దింపాడేమో?

ఎలా ఒప్పుకుంటావు లే. అతనికి ఫోన్ చేసింది నువ్వే కదా.

కలుద్దామా?

ఎక్కడ?

మీ ఆవిడ ఇంకా రాలేదుగా?

ఎందుకు? ఎందుకు సిద్ధపడ్డావు. సరే. ఎందుకు అన్న ప్రశ్న పక్కన పెట్టు. ఇప్పుడు తప్పంతా అతనిదే అని ఎలా చెప్పగలవు?

శశాంక్ నిన్ను మోసం చేశాడా? నిన్ను వాడుకున్నాడా? నిన్ను నీకు తెలియకుండానే ఈ రొంపిలోకి లాగాడా? ఇందులో ఏదీ నిజం కాదని నువ్వు వాదించవచ్చు. కానీ నువ్వు చెప్పాలి కదా నందుకి. నేరం నాది కాదు. శశాంక్ ది. అని చెప్పాలి కదా? కానీ అందుకు నీ మనసు ఒప్పుకోవట్లేదే. ఇంక ఎలా చెప్పగలవు? నందు నిన్ను క్షమించేలా నేరాన్ని ఎవరి మీద నెట్టగలవు?

నేరం నాది కాదు. నీదే అని కూడా చెప్పచ్చు. అసలిదంతా ఇలా జరగడానికి కారణం నువ్వే అని నందుతో వాదించవచ్చు.

నువ్వు నా బాధ్యత మాత్రమే తీసుకున్నావు. భర్తగా ఏం చెయ్యాలని నిర్థారించబడిందో అది మాత్రమే చేసావు. అంతా ఒక డ్యూటీలా. నన్ను ఎప్పుడైనా ప్రేమించావా?

నందు ఒప్పుకోడు ఈ వాదనని.

నేను ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే వున్నాను. ఇప్పుడు కూడా. అంటాడు.

నిజమే నిన్ను ప్రేమిస్తుండచ్చు. ఏ పార్టీకి వెళ్ళినా, ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఎప్పుడూ నీ దగ్గరే వుంటాడు. సమస్యేమిటంటే నీతో వుండడు.

అనుకోడానికి వంద వుంటాయి ఇలాంటివి. ఇవి చెప్పి అందుకే నిన్ను కాదని శశాంక్ దగ్గరకు వెళ్ళాను అని ఎలా అనగలవు? అబ్సర్డ్ గా వుంటుంది.

ఇంకొకటుంది. సినిమాటిగ్గా వుంటుంది. కానీ నువ్వేమనాలో తెలుసా? తప్పంతా ఈ సమాజానిదే లాంటి మాట అనాలి. అనచ్చు.

నిజం చెప్పాలంటే అది కూడా నిజమే. భార్య, భర్త, కట్టుబాటు, ఏకభర్తృవ్రతమూ వగైరాలన్నీ ఈ సమాజం పెట్టినవే కదా. నీకు నచ్చినవ్యక్తితో వుండటం తప్పెందుకు అయ్యిందంటే, అది తప్పు అని ఈ సమాజం సూత్రీకరించింది కాబట్టి. రబ్బిష్.

అవన్నీ కాదు. నందు దృష్టిలో అసలు నేరస్థురాలివి నువ్వు. అది మర్చిపోవద్దు.

నందు క్షమించడం జరగదు. నిన్ను వెళ్ళిపోమనడు. బహుశా శిక్షించడు కూడా. అదే పెద్ద శిక్ష.

అతనికి నువ్వు కావాలి. భార్యగా అతని పక్కన నువ్వు వుండాలి. అతని బిడ్డలకు తల్లిగా… పిల్లల్ని కంటే క్షమించే అవకాశం వుంది. పిల్లలు కావాలని చాలా బలంగా కోరుకుంటున్నాడతను. కానీ ఐదునెలల క్రితం సంగతి కదా అది. ఇప్పుడు అలాంటి… వెయిట్

ఆగాగు… ఎన్ని రోజులైంది? లాస్ట్ ఎప్పుడు? ఓ మైగాడ్!!

గుర్తు కూడా లేదా నీకు? రెండు నెలలైందా? డిడ్యూ మిస్ ఎ మంత్?

గాడ్! కొంపదీసి ప్రగ్నెంట్ కావు కదా?

(ఇంకా వుంది)

 

అరిపిరాల సత్యప్రసాద్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • విస్ఫోటనంలా కళ్ళు తెరిచావు what an expression…. ఇంతకు ముందువి నిర్లక్ష్యం చేసాను. ప్రోస్ ని ఇట్లా కవిత్వంలా రాయటం ‘మస్త్’ ఉంది. మిగతావి కూడా ఇప్పుడు మళ్లీ చదవాలి ఇక.