నాలుగు కరువు కథల ప్రయాణం!

పతంజలి శాస్త్రి కథాప్రపంచం

తెలుగు సాహిత్యంలో ఎన్న తగ్గ కథలు రాసిన ఓ పాతికమందిని ఎంపిక చేస్తే కథకుడిగా  తల్లావజ్హుల పతంజలి శాస్త్రి పేరు మొదటి పది లోపే ఉండాలి. ఆయన రాసిన కథలన్నీ పర్యావరణ ఉద్యమకారుడిగా ఆయన చేసిన విస్తృత ప్రయాణంలో చూసినవి, విన్నవి, అనుభవించినవి. అందుకే ఆయన కథల్లో వున్న వస్తు వైవిధ్యం చాలా తక్కువ మంది కథకుల్లో చూస్తాం. రాతకి, వ్యక్తిగత నడత కి తేడాలేని అతి కొద్దిమంది కథకుల్లో శాస్త్రిగారు ఒకరు. ఒక వాస్తవం, మరొక వాస్తవంలాంటి ఊహల మధ్య ఆయన కథల ప్రయాణం నడుస్తుంటుంది. దాన్నే ఆయన సమాంతర వాస్తవికత అని కూడా పిలుచుకున్నారు. ఐతే ఆయన మొత్తం కథల్లో సమాంతర వాస్తవికత ఒక భాగం మాత్రమే.  ఇప్పటిదాకా ఆయన కథల్ని తరచి చూసి  అందులో పొరలు పొరలుగా వున్న వాస్తవాల్ని అనుభవాల్ని విప్పి చెప్పే కార్యక్రమం ఏమి జరగలేదు. అడపా దడపా అదో మంచి కథ, ఇదో మంచి కథ అనే ప్రశంస తప్పితే, పెద్దగా వాటిని గురించి సాహితీ లోకం చర్చించినట్లు లేదు. ఇప్పుడు శాస్త్రి గారికి 75 ఏళ్ళు. ఆ సందర్భంగా, ఇప్పటిదాకా ఆయన కథలు మూడు సంపుటాలుగా వచ్చాయి. సంపుటానికి సంపుటానికి మధ్య ఆయన రాస్తున్న దాంట్లో క్రమేపి  ఒక తాత్విక అంశం పెరుగుతూ వచ్చింది.  ఇప్పుడు మనం ఆ కథల్ని స్థూలంగా పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. 

కరువు కాటేసిన వేళ

యన పర్యావరణ వేత్తగా పరిశీలించడానికి అనంతపురం ఆ పరిసరాల్లో తిరిగినప్పుడు అక్కడ చూసిన, విన్న పరిస్థితులమీద రాసిన కథలు ‘ఆమెదనంతపురం’,  ‘పిచ్చి లచ్చమ్మ’,  ‘కదిరమ్మ పేరంటాలు’, ‘ కతలవ్వ’.

ఈ కథల్లో శాస్త్రి గారు రాయలసీమ కరువుని, ముఖ్యంగా నీళ్లకోసం మొహం వాచిపోయిన ప్రజల దుఃఖాన్ని, బూడిదలు అవుతున్న వాళ్ళ జీవితాల్ని ఓ చిత్రకారుడిలా మాటలతో ఓ దుఃఖ   భరిత చిత్రాన్ని గీశాడు. నిజానికి కరువు ప్రపంచంలో ఎక్కడైనా ఒక్కలాగే ఉంటుంది. ఇక్కడ అనంతపురం అనేది ఒక సింబల్ మాత్రమే. మనుషుల విజ్ఞత మీద, వ్యవస్థలమీద నాకు నమ్మకం పోడానికి అనంతపురమే కారణం అంటాడు.  ఎక్కడ చూసినా ఎండిపోయిన ఊరి చెరువులు, తెగిన చేతుల్లాంటి బోరు పంపులు కనిపిస్తాయి. ఎండలో బయట పొలాలు, పసిపిల్లలు దహనం ఐనట్టుంటాయి. కథకుడు బస్సులో కనబడ్డ వర్షం లో తడిసిన తంగేడు పూల  చెట్టులాంటి ఆడ మనిషి కోసం అన్ని గుమ్మాలు వెతుకుతుంటాడు. కానీ చివరికి అతనికి కనిపించింది శాశ్వతంగా, దాహం తో నోరు తెరిచి ఉండిపోయినట్టు, ఎండిపోయిన బావి దగ్గర పడి ఉన్న లచ్చమ్మ. కదులుతున్న మేఘంలా కనబడ్డ మొహం అదే.  అయితే, బక్క పలచగా మట్టి కొట్టుకుపోయి, చీలిపోయిన పాదాలతో, వెలిసి వాలికలైపోయిన చీరతో కనిపించిన దేహం మాత్రమే నిజం

* **

ఎవరీ లచ్చమ్మ? సిద్దప్పనాయుడుని చేసుకుని పాత పరిచయమైన దారిద్య్రం లోంచి కొత్త దారిద్య్రం లోకి వచ్చిన ఆడమనిషే లచ్చమ్మ. అప్పులు చేసి నకిలీ విత్తనాలు  తేవడం, నకిలీ మందులు కొట్టడం, పశువుల్లా పొలంలోపడి వళ్ళు గుల్ల చేసుకోడం మాత్రమే తెలిసిన మనుషులు.  మోసం చేసిన మనుషులతో పాటు చేతులు కలిపిన ప్రకృతి, కొండంత అప్పులు మిగిలిస్తే,  చచ్చిన బిడ్డకి పాలిచినట్లయింది. ఇంకా బ్రతికి ఏమి ప్రయోజనం. “నీ యమ్మ నీకు నాకంటే బికారి నాకొడుకు దొరకలేదేంటే మీ  వూళ్ళో ” అంటూ శాశ్వతంగా సెలవు తీసేసుకున్నాడు. లచ్చమ్మని పలకరించడానికి, తీసుకెళ్లి ఓదార్చడానికి, కనీసం చూడ్డానికి వచ్చే బంధు గణం ఎవరు లేరు. కరువులా నిశ్శబ్దంగా ఉండిపోయింది. బతుకు బరువు మోయలేని లచ్చమ్మ పిచ్చి లచ్చమ్మ అయిపోయింది. అర్థరాత్రి వీధుల్లో కేకలు పెడుతూ ‘కాలువ పొంగి ఊరిమీద పడుతోంది’, ‘ఆకాశం పగిలిన తుఫాను వర్షం లో కొట్టుకుపోతారు’ అంటూ వీధుల్లో పరిగెడుతూ, వర్షపు అలజడి సృష్టించేది.

అప్పటినుంచి రాత్రో పగలో లచ్చమ్మ వర్షాన్ని మోసుకొస్తుండేది.  ఆమె తడిసి ముద్దయిపోతూ అందరిని తడవకుండా కాపాడుతుండేది. వణికిపోతూ, ఊగిపోతూ, శుష్కించిన మాంసంతో, మిగిలివున్న జీవంతో ఎండిపోయిన ఆ చేతులతో ఆకాశాన్ని ముద్దగా పిండి వర్షం కురిపించే దీక్షలో ఉండేది లచ్చమ్మ. ఊరివాళ్ళకి జ్ఞాపకంగా మిగిలిపోయిన పెద్ద వర్షాలు, నిండిన చెరువులు, తెగిన కట్ట, పిల్ల పెద్ద అందరికి ఒక వర్ష స్పృహ కలిగిస్తుండేది. అందరి కోసం వర్షాన్ని భావించడం, కలగనడం చేస్తూ, ఆమె శక్తులు ఉడిగిపోయిన గ్రామ దేవతలా అనిపిస్తుండేది. ఇదంతా కలే అని తెలిసినప్పుడు మనుషులు అప్పుడప్పుడు ఆ పిచ్చిదాన్ని పట్టుకుని కొట్టేవారు కూడా. ఇంక కలలుగనే ఓపిక లేక శుష్కించిపోయిన లచ్చమ్మ నెర్రబారిన నేలలా నోరుతెరుచుకుని గుడ్లు తేలేసింది. చెరువుగట్టుమీద  కాలి మసి అవుతున్న పొలాల్లో లచ్చమ్మ ఎప్పటికి వర్ష ఋతువులా తిరుగుతుండేది.

***

వేల నాలుకలతో గాలి దెయ్యం నాకేసిన  అనంతపురం  జిల్లాలో   పిచ్చి లచ్చమ్మలేకాదు దిక్కులేక ప్రాణాలు తీసుకున్న కదిరమ్మలూ ఉన్నారు. కుండపోతగా కురిసే వెన్నెల కరవుకు   తెల్ల కండువలా ఉండేది. పొలాలకు కప్పిన ‘ఖఫన్’ లా ఉండేది.  ఆత్మహత్య చేసుకున్న రైతుల సమాధి మీద పరచిన తెల్లని పాలరాయిలా ఉండేది. అప్పటికే ముగ్గురు పోయారు. MRO  రైతులని పురుగుల మందు తాగొద్దని, తాగి చనిపోయినవారికి ప్రభుత్వం సహాయం చేస్తుందని  చెప్పారు. బతికి ఉద్దరించినదేముంది పొలాల్ని చూసి ఏడవడం తప్ప, పొతే పదో పరకో  పెళ్ళాం చేతుల్లో పడతాయి అనే ఆశ. అందుకే  కదిరమ్మ మొగుడు రెడ్డి ప్రాణం లేని గింజలు కొని ఎండిపోయిన పొలం సాక్షిగా ప్రాణాలు తీసుకున్నాడు. రెడ్డి పోయిన కొన్నాళ్ళకి తోడేలు లాంటి దళారీ పక్కమీదకొస్తే  అప్పు మాఫీ చేయిస్తానన్నాడు. తానూ మొగుడితో పోదామంటే పిల్లలు మరీ చిన్నవాళ్లు. కదిరమ్మ మానం పోగొట్టుకున్నా బ్యాంకు నోటీసులు ఆగలేదు. చేసేది లేక బలవంతంగా తానూ ప్రాణం తీసుకుంది. పొలంలో వెలసిన కరువు దేవతలా మారింది కదిరమ్మ. ఆ తరువాత పెళ్లికాని ఆడవాళ్ళ వంటిమీదకి వచ్చేది. వర్షం కోసం, వివాహితుల  మాంగల్యం కోసం కదిరమ్మ దేవతగా మారిపోయింది. ఆవిడ పేర సంబరాలు చేస్తున్నారు. ఎలాగోలాగ వర్షం కురవక పోతుందా, ఏ దేవతైన కరుణించక పోతుందా? వ్యవస్థకి బలైపోయినవాళ్ళని దేవతలు చేయడం తప్ప మిగిలిందేముంది?.

***

నీళ్లు లేక కాకులు కూడా చచ్చిపోతున్నాయి. ఊళ్ళో సీతా సమేత శ్రీరామచంద్ర మూర్తిగారు గానీ, ఊరిబయట ఇటుకల గుళ్లో వేంచేసిన గ్రామ దేవత గానీ కలిగించుకోడం మానేశారు.

పిల్లలు ఆడి ఆడి  అలసిపోయి, పెద్దలు చాలామంది నీరసించి కరువు తాకని నిద్ర లోకంలోకి వెళ్లిపోయారు. సాయంత్రం సూర్యుడుతోపాటు రాయుడు కాలిపోయాడు. ఆ రాత్రి రాయుడుని కాల్చిన చోట కూడా వెన్నల పడుతోంది. వెన్నల పొలంలో తిరుగుతున్న తాచు పాములా తళ తళా మెరుస్తోంది. బయట మంచాలేసుకుని అందరూ వెన్నెల్లో తడుస్తున్నారు. అదుగో అప్పుడొచ్చింది ‘కతలవ్వ’. పడుకున్న పిల్లలందర్నీ రావి చెట్టుకిందకి రప్పించింది. ఎంత వెన్నెలగా ఉన్నా, రోజంతా తగలబడిన పొలాల వేడి నెర్రల్లోంచి బయట పడుతోంది. పిల్లలందర్నీ చూసి అవ్వ నవ్వింది. రెండు చేతులతో బుట్ట సద్ది మెల్లిగా లోపల్నించి దొంతరలు దొంతరలుగా మబ్బును బయటకి తీసింది. మబ్బుని వళ్లోకి లాక్కొని రెండు చివరలు దుప్పటి పట్టుకున్నట్లు లాక్కొని పిల్లల మీదకి మెత్తగా వదిలింది.  పిల్లలు నవ్వారు, మెరుస్తున్న కళ్ళతో అవ్వను చూసారు.

అలా రోజూ రాత్రి నుంచి పిల్లలకి  మేఘాల రెక్కలు అతికించడం మొదలు పెట్టింది. మెరిసే కళ్ళ ఆకాశంలోకి  కథల కలల పావురాల్ని విడిచే పెట్టేది. నదుల్ని, చెరువుల్ని, కుంభ వృష్టిగా కురుస్తున్న వర్షాన్ని తాగేసిన బొడ్డు రాక్షసుడి బొడ్డు కోసేసి, మబ్బుల్లోంచి వచ్చిన ఒక వీరుడు ఎలా జలధారకి విముక్తి కలిగించాడో చెప్పేది. మరో రోజు అమ్మవారి అరచేతిలో విత్తనం కథ చెప్పేది. దాన్ని రాక్షసుడు ఎలా అడ్డుకున్నాడో చెప్పేది. ఆ కథల నీళ్ల వరదలో పిల్లలు తడిసి ముద్దయిపోయేవారు. పిల్లలు ఎగిసిపడే వాగుల వైపు, వంకలవైపు చూసేవారు, ఎక్కడ చూసినా నీళ్ళే, పొలాలన్నీ నీళ్లతో కళకళ లాడుతుండేవి. ఆ కథలన్నీ విన్నాక పిల్లలు బుద్ధిగా నిద్ర పోయేవారు. ఆలా కథలు చెప్తూ చెప్తూ అవ్వ ఓ రోజు పిల్లల మీద పరచిన మబ్బు దుప్పట్లని మడత పెట్టి బుట్టలో పెట్టేసుకుంది.  రేపటినుంచి  రాను అని   పిల్లలకి చెప్పింది, కలల దుప్పట్లు వేరేవాళ్లకి కూడా పాంచాలిగా, అందుకే రానని ఉంటుంది. పిల్లలందరికీ ఏడుపు వచ్చింది. అవ్వ ఒక్కొక్కరిని  కేకేసి చెవులో ఎదో చెప్పింది. వాళ్ళ ముఖాలు వెలిగిపోయాయి, గుంపులుగా మెత్తగా ఉడతల్లా ఇళ్లలోకి వెళ్లిపోయారు. బతుకు మీద విశ్వాసాన్ని కోల్పోవద్దని ఎప్పుడోప్పుడు కలలు నిజమవుతాయిని చెప్పుంటుంది.

*

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఒక రచయితను, ఆయన కథ ను తానే రచయిత అయినంత విశదంగా పెద్ద దృశ్యాన్ని చిన్న నీడలా మనలోకి ప్రవేశ పెట్టినట్టు రాశారు కృష్ణ మోహన్ గారు,,,పతంజలి శాస్త్రి గారి చేత ఆ దృశ్యం ఎంతలా విస్తరించి కుంటుందో చూడాలనిపించే. క్లుప్త మయిన విసేశనలా వుంది,,,సంతోషం చయ కృష్మమోహన్ గారూ

 • అక్కడి పరిస్థితి ఏమో కాని చదుతుంటే కళ్ళు మసకబారాయి, వర్షమే కంటిని నింపేసింది, వారి జీవన విధానం లో సమాజ నిర్లక్ష్యం, సమాజ బాధ్యత సున్నితంగానే స్పృశించారు…

  మనం ఎంత ముందుకు పోతున్నామో అనేది ఎంత బ్రమో పతంజలి శాస్త్రి గారు చెప్పకనే చెప్పారు… ఆయన కథల్ని గుర్తు చేసి మరో రచయితని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు మోహన్ సర్

 • ఇప్పుడీ అనంతపురంకధలు చదవాలి అనిపిస్తోంది…కానీ చదవి భరించగలనా అన్న సందేహం పట్టుకుని పీడిస్తోంది!

 • రాయలసీమ కరువుని, నీళ్లకోసం మొహం వాచిపోయిన ప్రజల దుఃఖాన్ని, బూడిదలు అవుతున్న వాళ్ళ జీవితాల్ని మాటలతో ఓ దుఃఖ భరిత చిత్రాన్ని గీసిన… మనుషుల విజ్ఞత మీద, వ్యవస్థల మీద నాకు నమ్మకం పోవడానికి అనంతపురమే కారణం అన్న తల్లావజ్హుల పతంజలి శాస్త్రి గారి ( త్రిపుర గారి ప్రియమిత్రుడు పతంజలి శాస్త్రి గారి ) కాలికి మొక్కుతున్నా ( అనంతపురం ఉప్పుతిని పెరిగినవాడిగా ).

  ” ఎక్కడ చూసినా ఎండిపోయిన ఊరి చెరువులు, తెగిన చేతుల్లాంటి బోరు పంపులు కనిపిస్తాయి. ఎండలో బయట పొలాలు, పసిపిల్లలు దహనం ఐనట్టుంటాయి. ”

  Anantapur, a known drought prone area, is one of the two districts in the country receiving lowest rainfall. Droughts and famines are not something strange to the people of Anantapur. Yet, the government has not taken effective measures to tackle the drought conditions in the district. Since 1997, farmers’ suicides have been reported in Anantapur district and till date it continues.

 • చాన్నాళ్ళయింది ఇంత మంచి పరిచయం చదివి. కథకుడు పతంజలి శాస్త్రి గారికి, పరిచయం చేసిన మోహన్ బాబుకి, నెనర్లు

 • అనంతపురం యింకా చెప్పాలంటే రాయలసీమ రైతుల దైన్య జీవితాలను బయట ప్రపంచానికి తెలియజేసిన సాహిత్యం చాలా వచ్చంది. చాలా కాలం పాటు ఈ ప్రాంత రచయిత(త్రు)లు యిక్కడి రైతుల దైన్య జీవితాలకు ప్రకృతి కన్నెర్ర చెయ్యటం కారణంగా చూపిస్తూ రచనలు చేసారు. ప్రపంచానికంతా కళ్ళ ఎదురుగా కనిపిస్తున్న కాదనలేని సత్యం యిది. అయితే ప్రకృతి శాపం కంటే కూడా బయట ప్రపంచానికి తెలియని చారిత్రిక రాజకీయ ఆర్థిక దురాశ కోణాలను విప్పి చెప్పే ప్రయత్నాలను గత దశాబ్దము నుండి మొదలయ్యింది. ఈ నెల 19 నుండి రాయలసీమ సాహిత్య సభ అధ్వర్యంలో గత వర్తమాన రాయలసీమ కథ సాహిత్యంపై ఫేస్ బుక్ ఆన్ లైన్ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి.

 • సున్నితమనస్కుడు, మానవీయ దృక్పథం కలిగిన మనిషి, రచయిత, కళాకారుడు – తన స్థానికత విధించే పరిమితుల్ని అధిగమించి, ఇతర ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం కూడా అంతే లోతుగా, నిజాయితీగా తపిస్తాడు, స్పందిస్తాడు కదా! అనిపించింది – మోహన్ పరిచయం చదవుతూంటే. అది సహృదయులకే సాధ్యం. మోహన్, పతంజలి శాస్త్రి ఇరువురికీ అభినందనలు!

 • ‘ఛాయ’ మోహన్ బాబు గారు రాయలసీమ కరువు అక్కడ బాధల గురించి పతంజలి శాస్త్రి గారి కధలు చాలా గొప్పగా కదిలించేలా పరిచయం చేశారు. వెంటనే కధలన్నీ చదవాలని పతంజలి శాస్త్రి గారితో మాట్లాడను .

  ఇలా జీవితం చెప్పే కధలని ఇంకా మా ఎరిక లోకి తేవాలని మోహన్ బాబు గారిని ఆర్ధిస్తున్నాను

 • మోహన్ గారూ,

  పతంజలి శాస్త్రి గారి కథల్ని మీరు పరిచయం చేసిన తీరు బాగుంది.

  నాలుగు కథలూ కళ్ళు చెమరించేంత బాగున్నాయి. చివరి కథలో ముగింపు బాగా ఆకట్టుకుంది.

  ధన్యవాదాలతో కూడిన అభినందనలు.

 • పతంజలి శాస్త్రి గారి ” వడ్ల చిలకలు ” ” ఎం దా క ?” కథలు ఇష్టం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు