నాయినొరే….!

ఈ మహమ్మారి పోయినా మన పేదరికం పోదులే…గానీ యేటి సేస్తాం? పేదరికం పోయీ రోజూ వొస్తాదని ఆశని ఊపిరి సేసుకొని బతకడమే! అంతే! హంతే…

నాయినొరే…సిమాలో! యెలగున్నావురా? పనీపాట్లు ఆపీసినారట? ఈధిలోకి రానీయలేదట? అక్కడ మీకు రేసను కార్డూ లేదు గావాల? …బత్తెం గింజలకి ఇరకాటంగ ఉందాట కదా? నాయ్నా…మన యెగువీది చింతా రాజులు తెల్దా … ఆడు నీలాగ వొలసెల్నాడురా…సెన్నయ్ కాసి. చింతా ముసిలోడు కాలం సేసాడులే. అందికని వొచ్చాడు…తలకొరివి యెట్నాడు…ఇక యెళిపోతానని బయిలెల్తే మీమే ఆపీసినాం. తండ్రికి పెద కార్యిం సెయ్యివా అనన్నాం. అదిగో దాంతోటి ఆగిపోనాడు. కార్యిం సేసినాడు…మర్నాడు బయలెల్తాడనీసరికి కరోనో…మరోనో యేటో మహమ్మారి వొయిరస్సట గదా? రెయిల్లూ, బస్సుల్లూ,బల్లూ ఆపీసినారటగదా?

ఇమానాలూ అపీసినారని ఇజ్జిరోతోలి బొట్టిడు తెల్దా…జెడ్పీటీసీ అయినాడుగదా ఆడు ఇసుక్కున్నాడురా.                                                                            అదిగా ఇమానాలే ఈ మహమ్మారిని తెచ్చినాయి…దేశిమ్మీదకి. ఇమానాలెక్కిన కొడుకులు సక్కగా ఇళ్ళంటకి సేరిపోనారు. పేదారోదా యెక్కడోళక్కడ సిక్కిపోనారు. నీనిక్కడ సిక్కిపోనాను. నా పెళ్ళం,బిడ్డలు అక్కడ అరవ మేళం ల యే బాదలు పడతండ్రో? నీను యెళ్ళ లేను, ఆళు రాలేరు…అని తల కొట్టుకొని చింతోడు యేడస్తండురా నాయినా!

నాయినొరే…

సిమాలో! యెలగున్నావురా? బత్తెం గింజలున్నాయా? పిల్లాజెల్లా యెలగున్నారు? కోడలెలగుంది? దానికేటి…బాగుంతాదినే.నువ్వున్నావు గదా…నీ కడుపు మాడ్సుకోని అయినా దాని కడుపు నింపుతావు. దానికి ఇంటి నించి అవతలకి అడుగెట్టనిస్తావేటి? పూచికపుల్ల నయినా ముట్ట నిస్తావేటి? కస్ట పెడతావేటి? దానికి ముక్కు మీద మసి అంటనిస్తావేటి? నంజ…. నీ కష్టిం మీద బతకతంది. నా కొడుకు కష్టిం మీద బతకతన్న దానివి నన్నేమే ఈనంగా సూస్తావని అన్నాన్రా నాయినా…అంతే…నీకు యేటి సెప్పిందో నువ్వు యేరుకాపరం యెట్టీసినావ్!                                                                        పోన్నే…యేటి పదిమందిమి ఉన్నామా బయిపడనానికి? వొంటిపిల్లి రాకాశినాగ మిగిల్నాను. మానబావుడు…నన్ను ఈ సాగరం ల వొదిలీసి వొడ్డెక్కిపోనాడు. తప్పతాదా? అతగాని సీటీ బగవొంతుడు సింపీడింతోటి అతగానెలిపోనాడు. నా సీటీ మరిసిపోనాడు గావాల ముండ్రాల బగవొంతుడు… ఉండిపోనాను. తప్పతాదేటి? బగమంతుడు ఉండమన్నన్నాళు ఉండాల. ఉండము బాబూ అనంతే బగవొంతుడు వొప్పుకుంతాడేటి? మన వోట్లు తోటి సిమ్మాసనమెక్కినోడే మనమడిగినిది ఇవ్వడు. బగవొంతుడు ఇస్తాడేటి? మొక్కులు మొక్కుతాం…అతగానికి అవొక లెక్కా? ఉల్లిపాయ తొక్కా? ఒకోడు బగవొంతుడికి బంగారం కిరీటాలు,రధాలు,పాదాలికి పావుకోళ్ళు సమర్పించుకుంతారు. బగవొంతుడి బార్యాలకి దండకడేలు,వొడ్డాణాలు,వొజ్రాల హారాలు…యేటేటో ఇచ్చుకుంతారు? మనమేటి ఇచ్చుకోగలం? కొబ్బిరిసిప్ప అయినా ఇవ్వలేము. ఇల మీద పట్టని బాదలు సెప్తాం…తీర్సీమని! యేల తీరస్తాడు? యెవుళెక్కువ? ఆళా? మనమా?

సూస్తన్నాము కాదేటి…యెంపీల్నీ,యెమ్మెల్యేల్నీ,కడాకి సర్పంచిల్నీ? ఆళందరూ యెవుళ్ని యెక్కువగ సూస్తన్నారు? వోట్లు కొనడానికి కోట్లు కోట్లిచ్చినోళ్ళు యెక్కువా? వోట్లుకి నోట్లు పుచ్చుకున్నోళ్ళు యెక్కువా? పుచ్చుకోడం కాదు ఇవ్వడమే తప్పు…నిజిమే. గాని పోలికకి సెప్తన్నానది! మరంచేత మనుసులే ఇలగుంతే… బగవొంతుడు ఇంకెలగుంతాడు?

ఇపుడా బగవొంతుడికీ నైవేద్యిం నైజాంతా అటరా!

ఇదాయకం గాబట్టి ఆ బగవొంతుడికి ఒక మొక్కు మొక్కీసి…కోడలు నంజకి ఒక మొక్కు మొక్కీసి..నా గెంజి నీను తాగనా? దాని మోసేతి నీళే నాక్కావాలా అని   వొల్లకున్నాను.

ఇల్లు మీకిచ్చీసి…ఇంటెదురు సాలల కాపరమెట్టినానా? కళ్ళెదురుగ కొడుకు, మనవళ్ళూ కనబడతన్నారని సరిపుచ్చుకున్నానా?

యేటి మూటలు యెనకేసిద్దుమని సెప్పిందో కోడల్నంజ బయిలెళ్ళిపోనావు పట్నం! పోన్నే… ఇంటెదురుగా ఉండి కయ్యాలాడుకొనీ బదులు యెక్కడో ఒక్కాడ సుకంగా ఉండనీ… అననుకున్నాను. రోజులు,వోరాలు,మాసాలు,సంవచ్చరాలు గడిసిపోనాయి. పండుగో, పున్నానికో ఇలగ రావడం అలగ పారిపోడం!

గాని ఒకమాట…తప్మాట…ఉన్న రొండు రోజులు కోడలు బాగే ఉండీది, కయ్యిమో, జట్టీలో ఆడీది కాదు. సోకుసోకుగ మాటాడీది…అత్తమ్మా…అని కొత్త పిలుపు పిలిసీది. యెలగున్నారమ్మా పట్నాన…అనడిగితే…అలగే అననీది.

అలగే…అనంతే…యేట్నాయినా? యేటి బోద పడతాది సెప్మీ? పట్నం మర్మం మాటలొద్దు…బోదపడినట్టగ సెప్పే సెమత్కారీ అనంతే సరి మరి మాటాడీది కాదు, మొకం మాడ్సీసి తిరిగీది. మళ్ళా యెలిపోయీరోజే మాటాడీది…అత్తమ్మా…వొస్తామనీసి బయిలెళ్ళీది.

యెలగున్నార్రా నాయినా? తునకాల దుడ్డునాగ నా గుండికాయ కొట్టుకుంతందిరా! వోలంటీరు గండడంతాడు…పోనీ నీ రేసను బియ్యిము నీ కొడుక్కి పంపీమంతావేటయితే? నీ రేసను కార్డు ట్రాన్స్ఫర్ సేసీమంతావేటయితే అని ఇగటాలాడతాడురా! అలగే పంపీరా నాయినా…అనన్నాను కూడా! మరి నీ కడుపు మాడ్సు కుంతావా? అనడిగేడు. నా కడుపుకేటి…నీ ఇల్లూ,నీ ఇల్లూ లేదా? ఇన్ని గెంజి సుక్కలు పోయరా? పంపీరా నా కార్డు నా కొడుక్కి అని బతిమాల్నాను. రూల్సొప్పుకోవట! ముండ్రాల రూల్సు! రూల్సు ప్రెకారమే ఈ గండల గవర్మెంటు నడస్తందా? రూల్సు ప్రెకారమే గద్దెలెక్కిన గండలిలాగ మేడలూమిద్దెలూ కట్టెస్తండ్రా? భూమీపుట్టలు సంపాయిస్తండ్రా? ఆస్తులు పోగేస్తండ్రా? రూల్సట…రూల్సు! అని కేకలేసినాన్రా…కేకలకి గొంతు కదిలి దగ్గొచ్చింది… ఓలమ్మ…కరోనో,మరోనో అని కేకలేసుకొని పారిపోబోనాడ్రా వోలంటీరు!

బాబొరే…వోలంటీరో ఆగురా అని ఆపి…ఈ కరోనో,మరోనో యెలాగ తగ్గతాదిరా? యేటి సెయ్యాలిరా అనడిగానురా.

రామాయిణం సీరియల్ యేస్తండ్రు సూడు అన్నాడ్రా!

రాముడికీ,దేముడికీ దిక్కులేక కోవిలలు మూసేసినారు గదా సీరియల్లోని రాముడేటి కాపాడుతాడ్రా దిప్పరగొట్టోడా అని కోప్పడితే – అదిగా ఇతండ వోదమే వొద్దు. యెళిపోగలవు…జెయిలుకి అని బెదిరించినాడురా!

నాయినొరే…యెలాగున్నావురా? యెక్కడున్నావురా? యెక్కడ సిక్కుకున్నావురా? వొలసలోళందర్నీ అదేటమ్మా కోరంటీనో…గోరం ఇంట్లోనో యెడతండ్రట! పద్దాలుగు రోజులు మనిసిని అంటకండా ఉంచుతారట. పిల్లపాపల్నీ యెక్కడెక్కడో యెడతారట. యేటీ సంకటం రా నాయినా? యెక్కడున్నావురా నాయినా? ఇంటిలున్నావా…కోరంటీనో, మారంటీనో కాడ ఉన్నావా? పిల్లాజెల్లెలగున్నారు? కోడలు యెలగుంది? పాపం…దానికి బాగ్యమంతురాల్ని అయిపోదుమని ఆశ లేదు గానీ బతుకుల ఇరకాటాలు, ఇక్కట్లు ఉండగూడదని, పిల్లలకేనా మంచి బతుకు ఉండాలని నిన్ను బయల్దేరదీసింది. వొలసదోవ పట్టించింది. అంతే… పాపం… పుట్టినింటిలా లేమే సూసింది, మెట్టినింటిలా లేమే సూసింది. అదిగా బాద తోటి, మెట్టినింటిల నీను అనువుగా దొరికీసరికి నాతోటి కయ్యాలాడీది గానీ మంచిదాయిరా. యెలాగుందిరా కోడలు. నాయినా…మీరంతా యెలాగున్నారు? యెక్కడున్నారు? యెప్పుడీ మహమ్మారి పోతాది? ఈ మహమ్మారి పోయినా మన పేదరికం పోదులే…గానీ యేటి సేస్తాం? పేదరికం పోయీ రోజూ వొస్తాదని ఆశని ఊపిరి సేసుకొని బతకడమే! అంతే! హంతే…

నాయినొరే…యెలగున్నా…..

*

అట్టాడ అప్పల్నాయుడు

అట్టాడ అప్పల్నాయుడు

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Prastuta samasyalanu kallaku kattinatlu akshara roopam lo samaajam mundu vunchsaru.
    Dhanyavaadaalu Appala Naidu garu.

  • Saru… amma manasu goppaga chepparu
    Kallanudi neellu karutune unnayi gatinchina gyapakalu gurtochi

  • బావ్ ఏతింత మంచి కథ సెప్పీసీనవ్. మూసిల్దానికి కొడాలంటే ఇస్టమే . ఏతో విదిగో వీ కరోనా వచ్చిసీనక మన బతుకీలా అయిపోనయి.ఆప్ల్నాయుడు బావ్ వీ మాతలు బలే సెప్పేసినవ్ బవ్ ” మన వోట్లు తోటి సిమ్మాసనమెక్కినోడే మనమడిగినిది ఇవ్వడు. బగవొంతుడు ఇస్తాడేటి? మొక్కులు మొక్కుతాం…అతగానికి అవొక లెక్కా? ఉల్లిపాయ తొక్కా? ఒకోడు బగవొంతుడికి బంగారం కిరీటాలు,రధాలు,పాదాలికి పావుకోళ్ళు సమర్పించుకుంతారు. బగవొంతుడి బార్యాలకి దండకడేలు,వొడ్డాణాలు,వొజ్రాల హారాలు…యేటేటో ఇచ్చుకుంతారు? మనమేటి ఇచ్చుకోగలం? కొబ్బిరిసిప్ప అయినా ఇవ్వలేము. ఇల మీద పట్టని బాదలు సెప్తాం…తీర్సీమని! యేల తీరస్తాడు? యెవుళెక్కువ? ఆళా? మనమా?”

  • బాగా చెప్పింది ముసిలమ్మ . చాలా బాధతో చెప్పింది. నాయకులు ఏ నిర్ణయాలు తీసుకున్నా , ప్రకృతి విపత్తు లొచ్చినా ముందు బలయ్యేది కూలీ నాలీ చేసుకొనే పేదలే .
    కరోనా వైరస్సే …. దాన్ని గాల్లో తిరిగి నోడు తేవడమేటి ? భూమ్మిద పనీపాటు చేసుకున్నోడికి కష్ట కాలం రావడమేటి?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు