నాన్న పరిమళంతో నిండిన ‘గంధపు దండ’

“చెట్టుకేమో విత్తుకు ఋణమున్నది..తెలియలేదు
నాకేమో నాన్న విలువ ఎంతన్నది.. తెలియలేదు

ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గానీ..
తనకన్నా ఎత్తున నిలపెడుతున్నది తెలియలేదు

ఏమి తండ్రి రెంటాలా! కన్నీళ్లను కూడ దాచి..
నాకై చెమటగా ఖర్చుపెడుతున్నది తెలియలేదు…

నా జీవం నా సారం చీల్చి చూసుకొంటెగాని..
నాన్న ఇలా నేనై జీవిస్తున్నది తెలియలేదు..

– రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు

నాన్న ఒక ధైర్య వచనం. నాన్న ఒక జీవిత పాఠం. నాన్న ఒక అనుభవాల సంపుటి. నాన్న ఒక సమున్నత శిఖరం. నాన్న ఒక మార్గదర్శి. కుటుంబమనే పోదరిల్లుకు నాన్న ఎనగర్ర్రలాంటి వాడు. గంధపు చెట్టులా నిలబడే దీరువు. తన పక్కన కూచోబెట్టుకొని ఆయన మనకు ఏమీ చెప్పకున్నా పరవాలేదు. ఆయన జీవితమే ఆయన మనకిచ్చే సందేశం. ఈ ప్రపంచపు వాకిట్లోకి రావాలంటే నాన్న లేనిదే సాధ్యం కాదు. నాన్న చుట్టూ ఎన్నో జ్ఞాపకాలు. ఎన్నో ఆప్యాయతలు, అనురాగాలు. ఎన్నో కోపతాపాలు. గుండె లోపలి గదుల్లో సముద్రమంత ప్రేమ, ఆప్యాయత ఉన్నా చిన్న బిందువంత కూడా చిలకరించలేని అశక్తుడు.

లోకంలో అందరూ మంచి నాన్నలేనా? అనే ప్రశ్న రావచ్చు. నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు మంచి నాన్నలే ఉంటారు. తన పిల్ల అభివృద్ధిలోనే తన అభివృద్ధిని చూసుకునేవాడు. పిల్లల కోసం సర్వం త్యాగం చేసేవాడు. నాన్న తోడు లేకుంటే ఉంటే బావుండు అనిపిస్తుంది. ఉంటె ఇంకొంచెం స్వేచ్ఛ ఇస్తే బావుండుననిపిస్తుంది. భౌతికంగా నాన్న మనతో ఉన్నా లేకున్నా దేహంలో ప్రాణంలాగా మన జీవితాంతం అంతటా పరచుకొని ఉండేవాడే నాన్న. ఈ జీవితం మనది కాదు. నాన్న ప్రసాదించిన గొప్ప అవకాశం.

నిజంగా నాన్నను నాన్నలా చూస్తున్నామా? నాన్నకిచ్చే విలువ నాన్నకిస్తున్నామా? మనం మన నాన్నకు ఏపాటి విలువ, గౌరవం ఇస్తున్నామో రేపు మన పిల్లలు కూడా మన పట్ల అదే విలువను, గౌరవాన్ని చూపెడుతారనే స్ప్రుహతోనే బతుకుతున్నామా? ఇవాళ మనం మన నాన్నపట్ల ఎలా ప్రవర్తిస్తే రేపు మన పిల్లలు కూడా మన పట్ల అలానే ప్రవర్తిస్తారనే సోయితోనే నడుచుకుంటున్నామా? నాన్న బతికున్నప్పుడు పోనీ కనీసం ఆయన చనిపోయాకనైనా ఆయన ఫోటోను లివింగ్ రూమ్ లో పెట్టుకుంటున్నామా? అశుభమని భావించి స్టోర్ రూమ్ లోకి గిరాటేస్తున్నామా? (బతికి ఉండగానే స్టోర్ రూమ్ లోకి పాత సామానులాగా గిరాటేసే తరం వచ్చింది. పాపం శమించుగాక.) ఈ సంఘర్షణనంతా ఎంతో అందమైన, ఎంతో సున్నితమైన కథగా మలిస్తే ‘గంధపు దండ’ కథగా రూపుదిద్దుకుంటుంది.

గంధపు దండ కథ గంధపు దండచదవండి.

కథకుడికి పదేళ్ళ కొడుకు. ఎంతో అందంగా, బొద్దుగా, కళ్ళల్లో కొత్త మెరుపుతో ఉంటాడు. ఓ రోజు ఇద్దరూ సరదాగా వాదించుకుంటారు.

నేనంటే నీకు చాలా ఇష్టమా? అని అడుగుతాడు కథకుడు తన కొడుకును.

అవును. చాలా చాలా.. ఇష్టం అంటాడు కొడుకు.

నిజంగానా? నేను లేక పొతే, నేను మరణించిన తరువాత నన్ను మిస్సవుతావా? రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటావా? ప్రశ్నిస్తాడు కథకుడు.

అఫ్కోర్స్ నీ నిలువెత్తు ఫోటో ఒకటి నా ఫ్యామిలీ రూమ్ లో పెట్టుకొని రోజు పూలతో పూజిస్తాను అంటాడు.

ఎన్ని రోజులు పూజిస్తావు?

ఎన్ని రోజులైనా.

చిన్నా నీకిప్పుడు అర్థం కాదు కాని ప్రేమ అనేది ఐస్ క్రీంలా కాలంతో పాటు కరిగిపోతుంది. నేను పోయాక ఏం జరుగుతుందో సరదాగా చెప్పనా?

సరే చెప్పు

“నేను చనిపోయాక ఒక నెల రోజులు నిజంగానే చాలా మిస్ అవుతావు. వెక్కి వెక్కి ఏడుస్తావు. బాధ పడుతావు… రోజు పొద్దున్నే మనిద్దరం నాటిన గులాబీ తోట్లోకెళ్ళి ఏడుస్తూ నువ్వు తేగలిగినన్ని గులాబీలు నీ చిట్టి చేతులతో కోసుకొచ్చి ఫ్యామిలీ రూమ్ లో నా ఫోటో కిందున్న టేబిల్ మీద పెట్టి దిగులుగా అక్కడే కూచుంటావు. ఇలా కొన్ని రోజులు గడిచి పోతాయి.” తరువాత నీ చదువులో బీజీ అయిపోయి, ఉద్యోగంలో బీజీ అయిపోయి రోజు ఎదో మొక్కుబడిగా ఒక పూవు పెడుతావు.

కొన్ని రోజులకు నీవు, నీ భార్య ఏదో షాపింగ్ మాల్ లో ఒక అందమైన పెయింటింగ్ కొనుక్కొని ఇంటికి తీసుకువస్తారు. దాన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాదు.

ఆ పరిస్థితుల్లో కథకుడి కొడుకు, కోడలు ఏం చేశారు. కథకుడి ఫోటోను అతడి కొడుకు అతడి ఫ్యామిలి రూమ్ లో ఉంచాడా? లేక ఎక్కడైనా గిరాటేశాడా? చూడాలంటే మనం కూడా ‘గంధపు దండ’ పరిమళాన్ని ఆఘ్రానించాల్సిందే.

నిజానికి ఈ కథ కథకుడి కొడుకుది కాదు కథకుడిదే. కథకుడు తన నాన్న పట్ల ఎలా ప్రవర్తించాడో చెప్పకనే చెప్తాడు కథకుడు. ముగింపులోనే కథా సౌందర్యమంతా దాగి ఉంది. కథా వస్తువు చాలా ఆర్ద్రమైంది. ఒక తరం తరువాత మరో తరం నాన్నల పట్ల ఎంత మర్యాదగా ఉంటుందో, ఎలా ఉండాలో కథకుడు వాచ్యంగా చెప్పకుండా కథాంతంలో మనలో ఒక విధమైన పరివర్తనను కలిగిస్తాడు. ఎత్తుగడ నుంచి కథ చివరిదాకా ప్రతి వాక్యం చాలా బిగువుతో రచించడం వల్ల కథ ఒక కళారూపంలా తీర్చిదిద్దబడింది. కథ ఆఖరు వాక్యం చదివేటప్పటికి మన కళ్ళలో ఒక సన్నని నీటి పొర వచ్చి మాయమవుతుంది.

కథలో రెండే పాత్రలు. ఒకటి కథకుడు. రెండు కథకుడి కొడుకు. కాని కథలో నిజమైన కథానాయకుడు కథకుడి నాన్ననే. అతడు ఎక్కడా తెర మీద కనిపించడు. కాని కథంతా ఆయన చుట్టే తిరుగుతుంది.  పైకి ఒక సరళ శిల్పంలో సాగిన కథలా కనిపించినా గొప్ప శిల్ప మర్యాద పాటించిన కథ. అయితే ఆ శిల్పం ఇక్కడే ఉందని చెప్పలేం. ‘దుర్బిని’ పెట్టి వెతికినా దాని స్వరూపం కనిపించదు. కథాకథనం, శైలీ మనల్ని కొన్ని రోజులు వెంటాడుతాయి.

కథా సాధకులు ఎంతో నేర్చుకోదగిన కథ. కథకు సంక్షిప్తత, ఆసక్తికర కొనసాగింపు, ఊహించని ముగింపు ఉండాలని కథా ఆలంకారికులు తరచుగా చెప్తుంటారు. ఈ కథ ఆ లక్షణాలను నూటికి నూరు పాళ్ళూ పాటించిన కథ. కవిత్వంలోనే కాదు కథల్లో కూడా ధ్వని ఉంటుందని నిరూపించి ఆ ధ్వనిని మన మనసుకు వినిపించిన కథ.

నాన్న ముఖ చిత్రాన్ని మరోసారి మన మనసు గోడకు తగిలించిన కథకులు రవి వీరెల్లి చాలా తక్కువ కథలే రాసినా చిక్కని కథలు రాశారు. ప్రస్తుతం అమెరికా, వర్జీనియాలో IT మేనేజర్ గా పని చేస్తున్నారు. 2012లో ‘దూప’ కవితా సంపుటిని, 2017లో ‘కుందాపన’ (దిగులు) కవితా సంపుటిని వెలువరించారు. కొన్నేళ్ళు ‘వాకిలి’ అంతర్జాల మాస పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. అమెరికా తెలుగు సంఘం (ATA)వారు ప్రచురించే ‘అమెరికా భారతి’కి, 2013 నాట్స్ సావనీర్ కి, 2014 ఆటా సావనీర్ కి సంపాదకత్వం వహించారు. ఈ కథ మొదట ‘కినిగె’ అంతర్జాల పత్రికలో 13 మార్చి 2015లో ప్రచురింపబడింది. ‘అలుగు’ తెలంగాణ కథ – 2015లో కూడా చోటు చేసుకుంది.

(జూన్ 20న ఫాథర్స్ డే)

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
 • కుందాపన చదివినప్పుడే అనుకున్నా .. ఈయన మెదడుతో కాదు మనసుతో రాస్తాడని. దూప కోసం దప్పికతో వెతుకుతున్న. గంధపు దండ చదివిన తర్వాత నా అభిప్రాయం మరింత బలపడింది. కథంటే పేజీలు పేజీలు కెలకక్కర్లేదు . కొండను అద్దంలో చూపి గుండె పెంకులు పెకిలించవచ్చు అనిపించారు – అభినందనలు రవి గారూ.
  మీ విశ్లేషణ గురించి చెప్పేదేముంది – కథ సారం సాంతం చెప్పెస్తారన్న అభియోగం తప్ప, అందుకే నేను ముందు కథ చదివి ఆ తర్వాత మీ విశ్లేషణ చదువుతాను. రెంటాల వెంకటేశ్వర రావు గారి కవితతో ప్రారంభం బాగుంది. ఈ మధ్యనే వారితో గంటసేపు ఫోనులో సంభాషించాను. అయాన్రాండ్ ” ఫౌంటన్ హెడ్ ” గురించి .

 • hai…
  నాన్న ఏమి చెప్పకపోయినా పరవాలేదు.ఆయన జీవితమే ఆయన మనకిచ్చే సందేశం..బాగా చెప్పారు కథను విశ్లేషిస్తూ శ్రీధర్. విశ్లేషణ చదివితే కథను చదవాలన్న ఆకాంక్ష కలుగుతుంది..కథ ఉంటే పోస్ట్ చేయగలవు

 • గంధపు దండ కథ బాగుంది. కథ సమీక్ష విశ్లేషణ చాలా బాగుంది. కథలో ఉన్న కుటుంబ విలువలు, అనుభవసారం కథకుడు అంతర్లీనంగా చెప్పాలనుకున్న విషయాన్ని సమీక్షకులు చక్కగా వివరించారు.

  మనసులో ఉన్న ప్రతిమలే కరిగి పోతున్నప్పుడు…. ఇరుకైన ఇల్లు సమస్య కాదు…. నాన్న పై మమకారం ప్రేమ కాలమనే ఐస్ క్రీమ్లా జరగడానికి కారణం ఇరుకైన మనసు… మనుషులే అనే భావాన్ని కథకుడు చక్కగా చెప్పారు.

  రచయితకు సమీక్షకులు డాక్టర్ వెల్దండి శ్రీధర్ గారికి సారంగ నిర్వాహకులకు ధన్యవాదాలు.

 • ఆర్ద్రత తో కూడిన గంధపు దండ కథను సమార్ద్ర భావనతో శ్రీధర్ సమీక్షించారు కథన రీతిని, ముగింపు లోని సౌందర్యాన్ని విశ్లేషించడం తోపాటు కథా సాధకులకు సూచనలు అందించారు.సరళ శైలి అంటూనే కథ ముగింపు లోని విశిష్టత ను తెలిపిన శ్రీధర్ కు అభినందనలు.

 • గంధపు దండ సువాసన చుట్టూ పరిభ్రమించినట్లు…ఈ కథ మనల్ని మళ్లీ మళ్లీ మనని మన లోతుల్లోకి తీసుకెళ్తుంది.
  ఆ జ్ఞాపకాన్ని మళ్లీ పరిమళించినట్లు చేసిన శ్రీధర్ కి ధన్యవాదాలు.

 • రవి వీరెల్లి గారి కవిత్వంలో కనిపించని లోతులుంటాయి. ‘కుందాపన’ సంపుటి నిండా అలాంటి కవితలే. ఆయన కథల్లోనూ ఇదే పంథా.
  ‘గంధపు దండ’ కథాశిల్పమే వైవిధ్యం. గతాన్ని కథలో నిక్షిప్తం చేసి, వర్తమానంలో కొడుక్కి చెప్పే ముచ్చటగా తీర్చిదిద్దటం రచయిత పరిణతికి నిదర్శనం. మరో ముఖ్యాంశం ఏమిటంటే, ఇది ‘కొసమెరుపు ముగింపు కథ’ కాదు. బహుశా ‘కొసవెలుగు ముగింపు’ అనవచ్చేమో.
  కథలోని రూపశిల్పాల ప్రాధాన్యం గురించి శ్రీధర్ వెల్దండి గారు సవివరంగా ప్రస్తావించారు. శ్రీధర్ గారికి, రవి గారికి అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు