నాటక సమాజాలు పోటీ పడి ప్రదర్శించిన నాటకం “ఇన్స్పెక్టర్ జనరల్”

  రెంటాల గోపాలకృష్ణ బహుముఖ ప్రఙ్ఞాశాలి. కవిగా బహుగ్రంధకర్తగా, అనువాదకుడిగా, పాత్రికేయుడిగా, జీవితచరిత్రల రచయితగా, బాల సాహితీవేత్తగా, సాంస్కృతిక సినీ విమర్శకుడిగా వారు సుప్రసిద్ధులు.

అభ్యుదయ కవిగా, నయాగరా కవుల గుంపు లో ఒకరిగా  గుర్తింపు పొందిన రెంటాల వారేమిటో కవిగా “సర్పయాగం, సంఘర్షణ, శివధనువు” సంపుటాలు తెలియజేస్తాయి. “రాజ్యశ్రీ” అనే చారిత్రక నవలతోపాటు ఎన్నో కథలను కూడా రాశారు. ఆయన చేసిన అనువాదాలు అసంఖ్యాకం. రామాయణ, భారత, భాగవతాదులను కలిపి, విడివిడిగానూ వచన రూపంలో సరళంగా పాఠకులకు అందించారు. పురాణాలను- ప్రబంధాలను, సంస్కృత కావ్యాలను తేట తెలుగులో అనువదించారు. “వాత్స్యాయన కామసూత్రాలు, అనంగరంగం” లాంటి కామశాస్త్ర గ్రంధాలు కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ సాహిత్యాన్ని తెలుగులో అందజేయడానికి రెంటాల చేసిన కృషి ఎన్నదగినది.

“టాల్ స్టాయ్ విరచిత  అనా కెరినీనా. యుద్ధం – శాంతి నవలలు, అలెగ్జాండర్ కుప్రిన్ రాసిన ‘యమకూపం’ మంచి అనువాద నవలలుగా  తెలుగులో ఎప్పటికీ నిలిచిపోతాయి. వాటితోపాటు “సుభాషిత రత్నావళి” (సంస్కృతంలోని సూక్తులకు తెలుగు అనువాదం), జాతీయాలు – పుట్టుపూర్వోత్తరాలు మరియు ‘సంస్కృత వ్యాసాలు” రెఫరెన్స్ పుస్తకాలుగా మంచిగుర్తింపునొందాయి.

బాల సాహిత్యానికి రెంటాల చేసిన కృషి అపారం. భారత, రామాయణ, భాగవతాల నుండి మొదలుకొని భట్టి విక్రమార్కుల దాకా దేశీయ సాహిత్యాన్ని ఈసఫ్ కథలు, గ్రీక్ కథలు లాంటి విదేశీ సాహిత్యాన్ని సులభ శైలిలో పిల్లలకు అందించారు. రామకృష్ణ పరమహంస, రామానుజాచార్యులు, రామతీర్ధ స్వామి, వివేకానందుడు, మధ్వాచార్యులు , ఇతర  ఋషుల కథలను, గాంధీ, నెహ్రూ లాంటి జాతీయనాయకుల జీవితాలను జీవితచరిత్రలుగా మలిచారు. ఆంధ్రప్రభలో సినిమా విశేషాల అనుబంధం “చిత్రభూమి” లో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. కొత్త సినిమాలపై వారం వారం ఆయన రాసిన  సమీక్షలు ఎందరో అభిమానులను తయారు చేసి పెట్టాయి. చలనచిత్ర నిర్మాణ ప్రక్రియలు మెలకువలు తెలుపుతూ “ఫిల్మ్టెక్నిక్” పేరిట ఎన్నో వ్యాసాలు రాశారు. “పంచకళ్యాణి – దొంగల రాణి”, “కథానాయకురాలు” లాంటి సినిమాలకు కథ, మాటలు, పాటలు సమకూర్చారు.

నాటక రచయితగా రెంటాల గోపాలకృష్ణ :

నటుడిగా, నాటక కర్తగా రెంటాల గోపాలకృష్ణ  బహుముఖ ప్రజ్ఞకు ఆయన నాటక ప్రదర్శనలు, నాటక రచనలు అద్దం పడతాయి. చిన్ననాటనే ఏర్పడిన నాటకాభిరుచి ఫలితంగా పౌరాణిక నాటకం “కిరాతార్జునీయం” (1943) తో మొదలుపెట్టి వరుసగా నాటకాలు రాయడం మొదలుపెట్టారు.

వారు రాసిన నాటకాలను

  1. అనువాద నాటకాలు
  2. స్వతంత్ర
  3. మూకాభినయ
  4. శ్రవ్య నాటకాలు

గా విభజించుకోవచ్చు.

  1. అనువాద నాటకాలు :

నాటక కర్తగా, అనువాదకుడిగా రెంటాల పేరు వినగానే “ఇన్స్పెక్టర్ జనరల్” గుర్తుకొస్తుంది. ఈ నాటకం అప్పటి తెలుగు నాటక రంగంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఈ నాటకంలో ఢిల్లీ లో పనిచేసే గుమాస్తా వసంతకుమార్ జల్సాలు చేస్తూ డబ్బులు అయిపోయి ఒక హోటల్ లో చిక్కుకుపోతాడు. ఆ జిల్లాను తనిఖీ చేయడానికి ఢిల్లీ నుంచి ఎవరో పెద్ద ఆఫీసర్ వస్తున్నదని తెలుస్తుంది. లంచంగొండి, అవినీతిపరుడైన తాలూకా ప్రధానోద్యోగి చైనులు వసంతకుమార్ ను ఆ ఆఫీసరుగా భావించి అతన్ని రాచమర్యాదలతో తన ఇంటికి తీసుకువెళ్తాడు. వాళ్ళ అమాయకత్వాన్ని కనిపెట్టిన వసంతకుమార్ ఆ ఊరి మేజిస్ట్రేట్, డాక్టర్, హెడ్ మాస్టర్ షావుకార్లు వర్తక  ప్రముఖుల దగ్గర అందినకాడికి దండుకుని, చైనులు కూతుర్ని పెళ్ళాడుతానని చెప్పి, అందుకు తనవాళ్లను తీసుకువస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పనంగా పెద్ద ఆఫీసర్ అల్లుడిగా దొరికాడని సంతోషిస్తున్న చైనులుకు వాడొట్టి మోసగాడని తెలిసి దిగాలు పడగా, అసలు ఆఫీసర్ వచ్చి పిలుస్తున్నాడని కబురు రావడంతో కుప్పకూలిపోతాడు. సమాజంలో అవినీతి ఎంతగా పాతుకుపోయిందో, అధికారులను కూడా ఎలా లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారో ఈ నాటకం బాగా వివరిస్తుంది. ఈ నాటకంను తెలుగు వారికి  దగ్గరగా తీర్చిదిద్దడం వల్ల ఇది అందరినీ ఆకట్టుకోగలిగింది. ఇందులో ప్రధాన పాత్రధారి పేరు చైనులుగా, హెడ్మాస్టర్ ను హయగ్రీవ అయ్యవార్లుగా, ఊర్లో పుకార్లను లేవదీస్తూ తిరిగే షావుకార్లను మిరియాలు – ధనియాలుగా పేర్కొనడం, సంభాషణలు కూడా తెలుగుదనంతో నిండి వుండి ఎక్కడా అనువాదంలా తోచదు. ఆ నాటకం విపరీతంగా నచ్చడంతో నాటక సమాజాల వారు పోటీలుపడి దీన్ని విజయవంతంగా ప్రదర్శించారు. బహుమతులు అందుకున్నారు.

అప్పటికాలంలో సినీ ప్రముఖులుగా పేరుపొందినవారు ఒకప్పుడు ఆ నాటకంలో నటించినవారే. 1956 లో కాకినాడలో ప్రదర్శించిన నాటకంలో చైనులుగా ” శంకరాభరణం” నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, హీరో వసంతకుమార్ గా హరనాధ్, ధనియాలుగా వడ్డాది, మిరియాలుగా ప్రముఖ సినీ హాస్యనటుడు మాడా వేంకటేశ్వరరావు, ఢిల్లీ ఆకాశవాణిలో న్యూస్ రీడర్ గా పనిచేసే ఏడిద గోపాలరావు డాక్టర్ గా నటించారు. ఇతరులు ప్రదర్శించిన ఇదే నాటకంలో సీనియర్ సినీ నటి నిర్మల చైనులు భార్య పాత్రను పోషించారు. వీరితో పాటు కాకరాల, కె. కె. శర్మ కూడా నటించారు. ఈ నాటకాన్ని మెచ్చిన ఇతర రచయితలు కూడా తమ వంతు పనిగా ఆ నాటకాన్ని అనువాదం చేశారు. అలా వచ్చిన వాటిలో బెల్లంకొండ రామదాసు “ఆకాశ రామన్న”, సోమంచి యజ్ణన్న శాస్త్రి “మహానుభావులు”, గిడుతూరి సూర్యం ” అధికారి” ముఖ్యమైనవి. వీరు కాకుండా ఎంతోమంది యధాతధ అనువాదం కూడా చేసి పుస్తకాలుగా తీసుకువచ్చారు. అందులో లేటెస్ట్ గా సుబ్బు అనువదించిన “ఇన్స్పెక్టర్ జనరల్” ను పీకాక్ క్లాసిక్స్ వారు 2008 లో వెలువరించారు. జె.బి. ప్రీస్ట్లే రాసిన “ఆన్ ఇన్స్పెక్టర్ కాల్స్”, గొగోల్ రాసిన “ఇన్స్పెక్టర్ జనరల్” కు దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ నాటకాన్ని కూడా కొంతమంది అనువదించి ” ఇన్స్పెక్టర్ జనరల్” కు పోటీగా తీసుకువచ్చినా – అది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఆ నాటకం నాటకరంగం పైనే కాకుండా సినిమా రంగం మీద కూడా విపరీతమైన ప్రభావం చూపింది. ఊరి పెత్తందార్లుగా, విలన్లుగా దుష్ట చతుష్టయం ఏర్పడడం సినిమాల్లో మామూలైపోయింది. ఈ నాటకాన్ని అందులోని దృశ్యాలను అనుకరిస్తూ బోలెడన్ని నాటకాలు వచ్చాయి. నాటకం క్లైమాక్స్ లో వసంతకుమార్ దుష్టచతుష్టయాన్ని ఉద్దేశించి ఉత్తరం యధాతధంగా “ఆకాశరామన్న” అనే జానపద చిత్రంలో వాడుకున్నారు. ఈ నాటకాన్ని ఆధారంగా చేసుకుని ఏకంగా “గ్తామ దేవతలు” సినిమాగా వచ్చింది.

ఒక హంగేరియన్  కథ ఆధారంగా రెంతలా  రూపొందించిన నాటకం “మాయని మబ్బులు”. మబ్బు పడుతుంది. పెద్దగా ఉరుముతుంది కూడా. కానీ చివరకు చినుకు పడకుండానే తేలిపోతుంది. మాయ మబ్బు . మూర్తి గారి సమస్య కూడా అలాగే పరిష్కారం అవుతుంది. అందుకే ఆ నాటకం పేరు “మాయని మబ్బులు” . అనుమానం పెనుభూతం. అనుమానం అనేది పుట్టకుండానే ఉండాలి. పుట్టిన తర్వాత ఒక పట్టాన వదలదు. నానాటికీ పెరిగి పెద్దదవుతుంది. చివరికది అంతులేని ఆగ్రహావేశాలకు దారితీస్తుంది. ఆవేశంలో ఆలోచన నశిస్తుంది. వివేకం లేకుండా ప్రవర్తిస్తాడు మనిషి. అలా తొందరపాటుతో తన భార్య శీలాన్ని శంకించి, చేజేతులా ఆమెని దూరం చేసేసుకుని భర్త అనుభవించిన వ్యధే “మాయ మబ్బులు” నాటకం. అసలు విషయం తెలుసుకోకుండా విధ్యాధికులనబడే వారు కూడా ఎంత సంకుచితంగా, మూర్ఖంగా ప్రవర్తిస్తారో ఆ నాటకం తెలియజేస్తుంది. నాటకం చివర్లో సుభద్ర, ” కొన్ని కష్టాలు మన పొరపాట్ల వల్ల కొనితెచ్చుకుంటాం. తెలివిగా ప్రవర్తిస్తే వాటిని తేలిగ్గా దాటేయవచ్చు. అనుమానం అనర్ధాలకు హేతువు. మగాళ్ళందరూ తెల్సుకోవాల్సిన విషయం ఇది” అని తెలియజేస్తుంది.

టాల్ స్టాయ్ రాసిన “పవర్ ఆఫ్ డార్క్నెస్” ప్రేరణతో రెంటాల రాసిన మరో నాటకం “రజని”. శ్రీమంతుడు, రోగగ్రస్తుడైన శ్రీనివాసరావును, సాంబయ్య సలహా మేర రెండో భార్య రాజ్యలక్ష్మీ దేవి విషం ఇచ్చి చంపుతుంది. దుర్భల మనస్కుడైన రజని మీద వ్యామోహాన్ని పెంచుకుని రాజ్యలక్ష్మీ దేవి ఈ దుష్కార్యానికి ఒడిగడుతుంది. రజనిలోని పాపభీతిని, దుర్భల మనస్తత్వాన్ని, ద్వంద్వ ప్రవృత్తిని శక్తిమంతంగా ఇందులో చిత్రీకరించారు. ఇవే కాకుండా అగ్ర రచయిత టాల్ స్టాయ్ రచించిన ప్రసిద్ధ నాటకాలను రెంటాలవారు ఎంతో నైపుణ్యంగా ——- గా మలచి ” టాల్ స్టాయ్ నాటక కథలు” పేరిట తెలుగువారికి అందించారు. అలాగే రవీంద్రనాథ్ టాగోర్ నాటక సాహిత్యాన్ని పాటలు, పద్యాలతో సహా అనువదించారు.

స్వతంత్ర నాటకాలు

“ఇన్స్పెక్టర్ జనరల్”  రచనాపంగా, ప్రదర్శనాపరంగా గొప్ప విజయాన్ని సాధించింది. అయినా ప్రముఖ జర్నలిస్టులు, పత్రికా సంపాదకులు,  ఎ.బి.కె. ప్రసాద్ సూచనతో “ఇన్స్పెక్టర్ జనరల్” నాటకానికి కొద్ది సవరణలు చేసి రెంటాలవారు “అంతా పెద్దలే” నాటకాన్ని రాశారు. ఎ.బి.కె. ప్రసాద్  అధ్యక్షతన ఆంధ్ర ప్రజానాట్యమండలి సారధ్యంలో కర్నాటి లక్ష్మీ నర్సయ్య ఈ నాటకానికి దర్శకత్వం వహించడమే కాకుండా కీలకమైన చైనులు పాత్రకు ప్రాణం పోశారు. కధానాయకుడి పాత్రను వల్లం నరసింహారావు అద్భుతంగా పోషించారు. అప్పట్లోనే ఈ నాటకం అశేష ప్రజాదరణ మధ్య దాదాపు వందసార్లు వాణిజ్యపరంగా, టిక్కెట్ల పధ్ధతిలో  ప్రసారం కావడం విశేషం. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కవి, రచయిత ఏం. కరుణానిధి మద్రాసులో, కర్నాటి – వాళ్ళం బృందం ప్రదర్శించిన “అంతా పెద్దలే ” నాటకాన్ని చూసి అభినందనలతో ముంచెత్తారు. రచయిత రెంటాలను సత్కరించారు.

 

“కర్ణ భారం” నాలుగంకాల పౌరాణిక నాటకం. ఇందులో కర్ణుడిని పాండవుల వైపు మళ్లించడానికి వచ్చిన శ్రీకృష్ణుడితో   మొదలై కర్ణుడి మరణంతో ముగుస్తుంది. చివర్లో కర్ణుడిని చంపి నా ప్రతిజ్ఞ నెరవేర్చాను అన్న అర్జునిడితో శ్రీకృష్ణుడు ” అర్జునా కర్ణుడు మహా రధుడు. అసమాన పరాక్రమశాలి. మహావీరుడగు కర్ణుని సంహరించింది నీవు ఒక్కడువు కావు. ఆరుగురు. కర్ణుని జన్మ రహస్యం తెలిపి, ధైర్యం చలింప చేసి అతని పంచప్రాణాలలో ఒకటి ముందే నేను హరించాను. అతని వల్ల వరం కోరి కుంతి, కవచ కుండలాలు కాజేసి ఇంద్రుడు, శాపం పెట్టి బ్రాహ్మడు, పాండవ పక్షపాతంతో సారధ్యం నెరిపి శల్యుడు – అతని తక్కిన నాలుగు ప్రాణాలు హరించారు. ఇక మిగిలిన భౌతిక దేహాన్ని మాత్రమే నీవు ఇప్పుడు నేలకూల్చావు” అని విచారంతో చెప్తాడు. ఈ కథ మనందరికీ తెలిసిందే అయినా పాత్ర చిత్రణలో, సంభాషణాలలో రెంటాల చూపిన ప్రతిభ అద్వితీయం.

“మూడో యుధ్ధం” నాటిక రెంటాల నాటక రచనా శిల్పం లో ఎంత సిధ్ధహస్తుడో  తెలియజేస్తుంది. మానవులంతా నాశనం ఐనా కాపిటలిస్టుల తీరు వ్యాపారాభివృద్ధి కోసం యుద్ధం వచ్చి తీరాలని కోరుకుంటారు. ఇందులో కాపిటలిస్టు, జర్నలిస్టు, సోల్జరు, జ్యోతిష్కుడు, మతప్రవక్త , మేనేజరు వంటి విలక్షణ పాత్రలతో మానవునిలోని రాక్షస కాంక్షల్ని వెల్లడించే నాటకం ఇది. అలాగే రెండో ప్రపంచ యుధ్ధం తర్వాత జర్మనీ, జపాన్, ఇటలీ, ఇంగ్లాండ్ మొదలయిన దేశాల్లో ఏదో ఒక పల్లె ప్రాంతం నేపధ్యంగా చేసుకుని రెంటాల రాసిన మరో అపురూప నాటిక “ఆకలి”. సామ్రాజ్యవాదుల యుద్ధోన్మాదం ఎంతటి అనార్ధాలకు హేతువవుతుందో, ఆకలి మనిషిని ఏ స్థితికి దిగజారుస్తుందో రెంటాల నాటకాలు తెలియజేసిన తీరు అద్భుతం.

 మూకాభినయ నాటకాలు

చిన్న చిన్న సంఘటనలను పాటలు సంభాషణలు లేకుండా అభినయం ద్వారా వ్యక్తం చేసేది మైమ్. తెలుగు నాటక రంగం లో ప్రవేశించి “మరో మొహెంజొదారో” తో పరిపూర్ణతను సాధించింది. ఎన్నో నాటకాలు – నాటికల్లో మైమ్ ను రచయితలు దర్శకులు వినియోగించుకున్నారు. ఈ మైమ్ నాటకాల్లో ఇతివృత్తం, సన్నివేశాలు ఉంటాయి. నటించే నటులు మూకాభినయం చేస్తారు. తెలుగులో మూకాభినయ నాటకాలను వేళ్ళపై  లెఖబెట్టవచ్చు. కొంతమంది నాటక విమర్శకులు అనిశెట్టి సుబ్బారావు రచించిన “శాంతి ” తొలి తెలుగు మైమ్ నాటకంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇవే మాటలు యధాతధంగా సిధ్ధాంత గ్రంధాల్లో చోటు చేసుకుంటున్నాయి. కానీ అది నిజం కాదు. అనిశెట్టిగారు ఆ నాటకాన్ని 1955 లో రాశారు. అంతకంటే ముందుగానే గిడుతూరి సూర్యం “మానవుడు చిరంజీవి” (14-1-1952) లో , రెంటాల గోపాలకృష్ణ కూడా 1952 లోనే రాయడం గమనించదగిన విషయం. “ఆడం” మూకాభినయ నాటిక రెంటాల రంగస్థల ప్రతిభకు ప్రతీకగా నిలుస్తుంది. మానవుడు, కార్మికుడు, కర్షకుడు, సైంటిస్టు , ఆడం (మృత్యు రూపం) , ప్రకృతి, ఇరువురి యుధ్ధ భూతాలు ఆ నాటికలోని ప్రధాన పాత్రలు. మానవజాతి నాశనానికి భూతాలు “ఆడం” ను పేలిస్తే , అజేయులైన మానవులు ఆ మృత్యువును పారద్రోలుతారు. మారణహోమానికి దారితీసే బాంబుల్ని సైంటిస్టులు సృష్టించడం వల్ల రెంటాల పొందిన ప్రతిస్పందనే ఈ నాటిక. సామ్రాజ్యవాద శక్తులు సృష్టించే విధ్వంసాన్ని నిర్మూలించాలన్న సందేశంతో పాటు అట్లా జరిగినప్పుడే మనశ్శాంతి లభిస్తుందన్న సమాధానాన్ని కూడా ఈ నాటిక ద్వారా అందజేస్తారు.

శ్రవ్య నాటకాలు

గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామంలో పుట్టిన రెంటాల గోపాలకృష్ణ తన జన్మభూమి మీద అభిమానంతో పల్నాటి భారత గాథను “పల్నాటి వీర చరిత్ర” గా గ్రంధస్థం చేశారు. ఆకాశవాణి అధికారుల కోరిక మేరకు అందులోని చిరస్మరణీయమైన మంచాల, బాలచంద్రుల ఘట్టాన్ని “మగువ మాంచాల” శ్రవ్య నాటికగా మలిచారు. ఇందులో ఇరుపక్షాల సైన్యాలు కారంపూడి లో  యుధ్ధం కోసం తరలి వెళతాయి. బాల చంద్రుడు యుధ్ధం లోకి రాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అన్నమ బొంగరం తాకిన బాధతో పెట్టిన చీవాట్లతో బాలచంద్రుడు యుధ్ధం గురించి తెలుసుకుంటాడు. యుధ్ధం కోసం తయారై తల్లి దీవెన తీసుకుంటాడు. వీడ్కోలు తీసుకోవడానికి భార్య దగ్గరకు వెళ్ళి మనసు చెదిరి ఆమె మొహంలో పడిపోతాడు. బాలచంద్రుడి వేశ్యా ప్రియత్వం భార్య అందాన్ని చూడగానే కరిగిపోతుంది. అంతఃపురంలో తిష్ట వేసిన బాలచంద్రుడికి కర్తవ్యాన్ని బోధించి, యుధ్ధానికి పంపి వీరపత్నిగా మిగులుతుంది మంచాల. దీనితోబాటు ప్రసిధ్ధ నవలా రచయిత నోరి నరసింహశాస్త్రి గారి “రుద్రమదేవి” నవలను శ్రవ్య నాటకంగా మలచడంలో మంచి నేర్పూను కనబరిచారు. ఇందులో దేశరక్షణ కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన వీరురాలు, బయటి స్త్రీలు, అంతఃపుర స్త్రీలను అధిగమించిన వీరనారి “రుద్రమదేవి” కథ ఇందులో ఉంది. ఈ వీరగాధలను నాటికలుగా మల్చడంలో చూపిన నేర్పు, ఉద్వేగభరితమైన సంభాషణలతో శ్రోతలకు ఉత్తేజం కలిగించిన తీరు ప్రశంసనీయం.

 నాటక కర్తగా రెంటాల ప్రత్యేకత

” కళ ప్రజల సొత్తు, కళ ప్రజల ఆయుధం, నాటక రచయిత రచనా శిల్పాన్ని సమృద్ధిగా కలిగివుండి, దానికితోడు రంగస్థలం మీద కూడా అనుభవాన్ని పొంది ఉంటే నాటకాన్ని అత్యుత్తమంగా రాయగలడనడంలో సందేహం లేదు. నాకు గల ఆ అనుభవంతోటే ప్రయత్నించి, శ్రమించి ఈ నాటకాలను వ్రాశాను” అని రెంటాల తన ముందు మాటలో తెలియజేశారు. ప్రతి నాటకానికి ముందు సూచనలివ్వడం, రంగస్థల వివరాలను తెలియజేయడం పలువురు ఆంగ్ల నాటక రచయితలకు పరిపాటే. ప్రధానంగా ప్రతీక పాత్రలతో నాటకానికి రూపకల్పన జరిగినప్పుడు ఆ వివరణ ఆవశ్యకత ఎంతో ఉంటుంది. “ఆడం” నాటక ప్రదర్శనకు అవసరమైన సూక్ష్మ అసూక్ష్మ అంశాలను కూడా రెంటాల తెలియజేయడం వల్ల ఆయనకు రంగస్థల శిల్పం మీద ఉన్న పట్టు మనకు తెలుస్తుంది. దీనివల్ల నాటక ఆంతర్యం అవగాహన అవ్వడమే కాకుండా, ప్రదర్శన మెళకువల్ని కూడా తెలుసుకునే వీలు కలుగుతుంది. “ఆడం” మూకాభినయ నాటిక విషయంలోనూ రెంటాల అనుసరించిన పద్ధతి ఇదే.

రెంటాల మంచి  నాటక కర్తే కాక మంచి నటుడు కూడా. అనిశెట్టి సుబ్బారావుగారి “గాలిమేడలు”, ఆత్రేయగారి “విశ్వ శాంతి”, పులుగుండ రామకృష్ణయ్యగారి “తుఫాను” లాంటి రంగస్థల నాటకాలతోపాటు ఆకాశవాణి నాటకాలలో కూడా విభిన్న పాత్రలను పోషించి, రెంటాల ప్రేక్షకుల మెప్పు పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలితోనూ. ప్రజానాట్యమండలిపై నిషేధం ఫలితంగా విజయవాడలోని శ్రీ వెలిదెండ్ల గ్రంధాలయం సాంస్కృతిక శాఖగా ఆవిర్భవించిన ఆంధ్ర ఆర్ట్ ధియేటర్ తోనూ రెంటాలకు వున్న అవినాభావ సంబంధం విస్మరించరానిది. ఆంధ్ర ఆర్ట్ ధియేటర్ సభ్యుడిగా ఆయన పెక్కు నాటకాలలో నటించారు.

ప్రస్తుతం రెంటాల నాటకాలు ఏవీ అందుబాటులో లేవు. కొన్ని నాటకాలతో కలిపి మొదటి సంపుటం 1997 లో వెలువడింది. మిగతావి కూడా వెలుగుచూసినప్పుడే నాటక కర్తగా రెంటాల గొప్పతనం తెలుస్తుంది.

*

కె.పి.అశోక్ కుమార్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు