నాకు గుర్తింపు సంఖ్యలు లేవు

అనేక రేణువు
 మానవ దేహాన్ని
ఒకే ముద్దగా ఎలా గుర్తించను?
నీ దగ్గర నిలబడి
శిథిల భూమిని కాదని
అనేక వర్ణాల పూదోటనని
ఎలా వివరించను-
నరకబడిన కంఠం
కాలుతున్న శవం
రెండు ముక్కలయిన స్వరం
పాము పడగ నీడ
ఎవరి చేతుల్లో నుండి కదులుతుంది
నాకైతే
కదులు తున్న మానవ నీడలో
జ్వలిస్తున నేత్రాలు కనబడుతున్నాయి-
నక్షత్రాలు వెదజల్లిన కాంతిలో
రంగుల దివిటీల వెలుగులో
ఒకే దేశాన్ని కలగన్నారు
చెమటతో-
నేలను నిర్మించు కున్నారు
జంబూ ద్వీపే
భరతఖండే
ఒకే మంత్రం
తరతరాలుగా
ఈనేల శ్రామికుల-
ధామం కాదని
మెదడుపై కాపలా కాసింది
   1
యమునా నది తీరంలో
ఒడ్డుకు చేరినా చేపకనులలో
కదలాడుతున్న శవాలగుంపు
రహదారిపై విరిసిన గరికపూల రెమ్మలపై
మానవ కళేబరాల నాదం-
నేను మూలవాసిని
ఎగురుతున్న గాలిపటంపై
వాలిన తూనీగ ప్రాణవాయువును
మనిషి కనబడితే
రెండు కన్నీటి చుక్కలను
జారవిడిచిన వాన్ని
బహుళత్వపు పునాదిపై
పేదరికపు జాడల్ని
జల్లెడ పడుతున్న వాణ్ణి
హారతులు పట్టలేను
నిదుర లేచి
జన గణ మన జయహే
వందేమాతర గీతాలు ఆలపించ లేను
నడుస్తున్న మానవ దేహాన్ని
నాకాలి కింద  నల్గిన జీవి
అంతరంగం  విన్నవాణ్ణి
జాతీయగీతంకు తలవంచలేను
భారతీయతను నిరూపించుకోలేను
కంఠానికి
కాషాయ జెండాతో ఉరి వేసిన
జై శ్రీ రామ్ అనలేను
చీమల గుంపులో
దారి తప్పిన చీమను కాను
గొర్రెల మందలో
తప్పి పోయిన గొర్రె పిల్లను కాను
మనషుల పాద చలనాలలో
ఎండిన జీవనది  మూలుగు విన్న వాణ్ణి
నాకు గుర్తింపు సంఖ్యలు లేవు
భారతీయతను నిరూపించే
ఏ ఆధారం నా దగ్గర లేదు
అమ్మ దగ్గర తాగిన
చనుబాలలో
ప్రపంచం దాగున్నదని నమ్మిన వాణ్ణి
ఎవరు నవ్వినా
         -ఏడ్చిన
నా ఆకలి
ప్రతిబింబం చెరుపుకోని వాణ్ణి
మీరెవరో నాకు తెలియదు
సింహాసనం చిరునామా తెలియదు
మీది గుజరాతో
        – నాగపూరో తెలియదు
కాషాయ రంగు తెలియదు
జాతీయ పతాకాన్ని
ఆనవాళ్లు పట్టలేను
మీ భాష నాకు అర్థం కాదు
మీ అభినయం –
నాకు భయం కలిగిస్తుంది
అసలు మీరెవరు?
*
చిత్రం: సత్యా బిరుదరాజు
Avatar

అరసవిల్లి కృష్ణ

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

    • ‘మనిషి కనబడితే రెండు కన్నీటి చుక్కలను జారవిడిచిన వాన్ని’
      ఇదే అపురూపం… అత్యాశగా మారిపోయింది మనిషికి.
      హృదయమున్న కవిత

  • అమ్మ దగ్గర తాగిన చనుబాలలో ప్రపంచం దాగివుందని నమ్మిన వాణ్ణి.. గొప్ప వ్యక్తీకరణ సర్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు