నలుపు తెలుపులకి మధ్య వున్న ఊదారంగు

అన్వీక్షకి ప్రచురణ “నువ్వెళ్లిపోయాక..” కి ఎడిటర్లు అరిపిరాల సత్యప్రసాద్, స్వాతి కుమారి రాసిన నాలుగు మాటలివి!

మై డియర్ ప్రేమ…

(డియర్ అని పిలవడానిక్కూడా మనసు రావట్లేదు. ఎంత వేధించావే నన్ను?)

ఇంక చాలు. నీకూ నాకు పొసగదు. నీ గొప్పదనం నీడలో నేను నలిగిపోయింది చాలు. అందరూ నిన్ను పొగిడేవాళ్ళే. నీ మీద కథలు, కవితలు, పాటలు, పద్యాలు రాసేవాళ్ళే. ఇన్నాళ్ళూ నా గురించి పట్టించుకునేవాళ్లే లేరనుకున్నాను. చరిత్ర అంటే గెలిచినవాళ్లు రాసుకునే కథే అనుకున్నాను. మరి ఓడిపోయిన వాళ్లు కథలు చెప్పేదెప్పుడు? అందుకే నా గురించి మాట్లాడేందుకు పదమూడు మంది వచ్చారు. వాళ్లలో చాలామంది నీతోనే మొదలుపెట్టుండచ్చు. కానీ చివరికి నా దగ్గరకే వచ్చారు.

అసలు ప్రేమనేది లేకపోతే వియోగం ఎక్కడుంటుంది అని నువ్వు వాదిస్తావు. అయితే కావచ్చు. కానీ, నీ నుంచే నేను పుట్టానన్న ఒక్క కారణం చూపించి నా మీద అజమాయిషీ చేస్తావా? ఎప్పుడో మొదలైన ప్రేమని కారణంగా చూపించి ఇష్టంలేని బంధాన్ని ఎంతకాలం సాగతీయగలరు ఎవరైనా? మతాన్ని, కులాన్ని, జండర్‍ని అడ్డం పెట్టుకొని నడిపే బ్లాక్ మెయిలింగ్ ప్రేమలు, వాటి నుంచి పుట్టే టాక్సిక్ సంబంధాలను ఎంతకాలం భరిస్తారు? అందుకే, నువ్వు చూపించిన పచ్చని వనము వనమే కాదని, అది ఎండమావి అని గుర్తుపట్టి నీకు దూరమై, నన్ను దగ్గర చేసుకున్న తబితని వెతికి పట్టుకున్నాను.

కేవలం ప్రేమని నిలబెట్టుకోడానికి ఎదుటివ్యక్తి ఏమన్నా భరించాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఒక విషయం గుర్తుపెట్టుకో. ఎవరైనా ప్రేమని వద్దనుకుంటున్నారు అంటే వాళ్లు తమని తాము ప్రేమించుకోవటం మొదలుపెట్టారని అర్థం. నదులన్నీ చివరికి సముద్రంలోకే కలవానీ, అలా కలిసేందుకు నదులు తహతహలాడాలని నమ్మిన సముద్రుడి ముందు ఒక నది కూడా సునామీ కాగలదని చెప్పిన చిత్ర కావేరి కథ చదవలేదా నువ్వు?

కవులు చెప్పినట్లు ప్రేమ గుడ్డిది కదా. కళ్లు మూసుకుపోయి వున్నంత కాలం అంతా ప్రేమమయమే. ఆ కళ్లు తెరుచుకున్న తరువాతే కదా నేను, నువ్వు, నా కెరీర్, నీ కెరీర్ అంటూ మాటలు మొదలయ్యేది. ఇదేంటో తెలియాలంటే మేఘమాలని కలవాలి నువ్వు. కెరీర్ అనే సోపాన పటంలో మొదటి గడిలో వున్నప్పుడు ప్రేమలో పడటం, నువ్వు నా కెరీర్‍కి ఉపయోగపడు, నేను నీ కెరీర్‍కి ఉపయోగపడతాను అని లవర్స్ విత్ ఏంటిసిపేటెడ్ బెనిఫిట్స్‍గా మారడం చాలా సులభం. కానీ ఆ తరువాత ఒకరికి నిచ్చెన అంది ఇంకొకరు పాము నోట్లో చిక్కినప్పుడు, ప్రేమ ఒక అడ్డంకి అనిపిస్తుంది. కెరీర్‍కీ ప్రేమకీ మధ్య పెరిగే అగాధమే ఆ కళ్లు తెరిపిస్తుంది. కళ్లు మూసుకోనుండే గుడ్డి ప్రేమకి, కళ్లు తెరుచుకున్న తరువాత జరిగే బ్రేకప్‍కి తేడా అర్థమౌతోందా?

ప్రేమా! రెండు హృదయాలని పెనవేయటం, ముడి వేయటం నీకు మామాలే కదా! ఆ ముడి విప్పినప్పుడు, బలవంతంగా తెగతెంపులు చేసుకున్నప్పుడు రేగే గాయాల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆ గాయాలను ఎవరికీ కనపడకుండా గుండెలోనే దాచుకోవడం ఎంత కష్టం? ప్రేమించినంత సులువు కాదు తెలుసా విడిపోవడం. You should see the destruction that happens in that process. ప్రేమించిన జంట విడిపోయాక, నీ ఉక్కిరిబిక్కిరి మాయనుంచి బయటపడాలంటే తమని తాము గెలిచే యుద్ధమే చెయ్యాల్సివస్తుంది. అదిగో అమీర్‍పేట్ చౌరాస్తాలో ఇరానీ చాయ్ తాగుతున్న అర్జున్‍ని చూడు. అతని మనసులో జరిగిన Destructionని గుర్తించు.

ఇన్ని కథలు చెప్పినా ప్రేమే గొప్పదని వాదిస్తావు నువ్వు. అసలేంటి నీ గొప్పదనం? ప్రేమ పుట్టేది మనసులో అంటావు కదా? ఆ మనసే చంచలమైనది కదా? అలాంటి మనసులో పుట్టే ప్రేమ ఒకరి మీద మాత్రమే స్థిరంగా నిలుస్తుందని నమ్మకమేంటి? స్థిరమైన నిర్ణయం నుంచి పుట్టే బ్రేకప్ కన్నా చంచలమైన మనసులో పుట్టే నువ్వు ఏ రకంగా గొప్ప? నమ్మవా? అయితే Anatomy of a love story చెప్పగలిగిన అర్జున్‍ని కలువు. ఒక్క చోటైనా నిలిచాడా అతను? ప్రేమను ఒక ఆటవస్తువు అనుకుంటే ఆ బొమ్మ విరిగిపోయే రోజొకటి వస్తుందిగా? అప్పుడు ప్రేమ గొప్పదా? ఎడబాటు గొప్పదా? ఏది గొప్ప పాఠం నేర్పిస్తుంది? నువ్వే చెప్పు.
ప్రేమలో గొప్పదనం ఎదిరించి నిలబడటంలోనే వుందని కథలుగా, సినిమాలుగా, కవితలుగా చెప్పుకుంటారే. ఎవరిని ఎదిరించాలి? తల్లిదండ్రుల్ని, సమాజాన్ని. అంతేగా? అలా ఎదిరించిన ప్రేమ బ్రేకప్ దాకా వస్తే? తమ మాట విననందుకు తగిన శాస్తే జరిగిందని అనుకునే తల్లిదండ్రులు వుంటారు. బ్రేకప్‍కి కారణం ఎవరు అంటూ సానుభూతి పేరుతో జడ్జ్‍మెంట్లు పాస్ చేసే సమాజం వుండనే వుంది. సలహాలు ఇచ్చే స్నేహితులు, వంకరచూపులు చూసే కొలీగ్స్…. ఓహ్ నీకేం తెలుసు. ప్రేమకి వున్నంత అప్రూవల్ బ్రేకప్‍కి లేదు. బ్రేకప్ అయిపోగానే చిరునవ్వు నవ్వినా జడ్జిమెంట్ పాస్ చేస్తారు. ఫేస్‍బుక్‍లో ఏక్టివ్‍గా కనపడితే అనుమానిస్తారు. నమ్మకపోతే నాతో రా ప్రవీని పరిచయం చేస్తా.

సమాజం ఏమంటుందో అన్న ప్రశ్న ప్రేమకి అన్నింటికన్నా పెద్ద సమస్య అని నీ ఫీలింగ్ కదా? సమాజం నిర్మించుకున్న చట్రాలలోనే ప్రేమించుకోవాలని అలా కాకపోతే ఈ సమాజం అంగీకరించదని డైలాగులు చెప్తావు. ఆ చట్రాలలో ఇమడలేని ప్రేమలు ఆ చట్రాల కారణంగా విడిపోతే అది ఎంత బాధాకరమో తెలుసా? గౌతమ్‍ని కలిస్తే చెప్తాడు అతని ‘ప్రే…మ’ కథ.

ప్రేమని స్వార్థానికి, వ్యక్తిగత అవసరానికి వాడుకున్న మనుషుల కథలు చెప్పి అదో అపరాధం అన్నట్లు చూపిస్తావు కదా నువ్వు. అసలు ప్రేమంటేనే స్వార్థం. మళ్లీ దాన్ని స్వార్థానికి వాడుకున్నారన్న అపవాదులెందుకు? అలా చూస్తే బ్రేకప్‍ని కూడా తమకి అనుకూలంగా మలుచుకొని, నిజాన్ని విషాదం ముసుగులో కప్పిపెట్టిన స్వార్థపరులు కూడా వున్నారు. అలాంటి ఇద్దర్ని కూడా నీకు పరిచయం చేస్తాను ఈ రోజు.

ప్రేమ అంటే త్యాగం అని లెక్చెర్లు ఇస్తావు నువ్వు. నిజమే. ప్రతి రిలేషన్‍షిప్‍లో ఒక సర్దుబాటు వుంటుంది. దానికే నువ్వు త్యాగం అనే పేరు పెట్టి, అదేదో పెద్ద ఘనకార్యమైనట్లు, మరొకరికోసం కొవ్వొత్తిలా కరిగిపొమ్మని సలహాలు ఇస్తావు. అసలు ప్రతి త్యాగానికి ఒక ఖరీదు వుంటుందని తెలుసా నీకు? కొన్నిసార్లు స్వేచ్ఛ, ఒక్కోసారి సంతోషం, ఇంకొన్నిసార్లు స్వాతంత్ర్యం ఇన్ని వదులుకుంటే తప్ప నిలబడని అతి ఖరీదైన వస్తువువి కదా నువ్వు? ఇంత వెల కట్టి నిన్ను కొనుక్కోలేక చిన్నచిన్న వస్తువుల్ని ప్రేమించడం నేర్చుకున్న రజతాక్షి కథ తెలుసా నీకు?

క్యాజువల్ లవ్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వుంటాయేమో కానీ క్యాజువల్ బ్రేకప్ వుండదు. బ్రేకప్ ఒక కెథార్సిస్. ఇది నిలిచే బంధం కాదేమో అన్న ఆలోచనతో మొదలై, మేము విడిపోయాము అన్న ప్రకటన దాకా పూర్తి స్పృహతో తీసుకోవాల్సిన నిర్ణయాలు వుంటాయి. వాటికి నిందలు, కొట్లాటలు, బాధలు, ఏడుపులు, జ్ఞాపకాలు ఇవన్నీ అడ్డం పడతాయి. ఒకరు తోడుగా వుంటారన్న నమ్మకం నుంచి నాకు నేనే తోడు అన్న ధైర్యం దాకా సాగే ప్రయాణం ఇది. ఇదంతా ఒక మనిషిని ప్రక్షాళన చేస్తుంది. ఫీనిక్స్ పక్షిలా మళ్లీ బతికిస్తుంది. ఇదేంటో తెలియాలంటే ఆశ కోల్పోకుండా జీవితాంతం మళ్ళీ మళ్ళీ వియోగాన్నే ప్రేమించిన స్మితని చూపిస్తాను నాతోరా!

ప్రేమా! నిన్ను ఇన్ని మాటలంటున్నానని నీకు కోపంగా వుందేమో. కానీ నిష్టూరం లేకుండా విడిపోయిన జంటని చూశావా ఎప్పుడైనా? సరే. మన రిలేషన్ నిలుపుకోడానికి ఆఖరుగా ఒకే ఒక్క ప్రయత్నం చేస్తాను. నీలో నాకు నచ్చిన ఒకే ఒక్క విషయం గురించి మాట్లాడతాను. దాని పేరు జ్ఞాపకం. ఎంత గొడవపడి విడిపోయినా నీ వల్ల మిగిలేవి జ్ఞాపకాలే. ఆ జ్ఞాపకాల వాసనే చాలా మంది మాజీ ప్రేమికులకు శ్వాసనిస్తోంది. అంజాద్ ఒంటరి బాటసారిగా మారటానికి కారణం నీ మధుర జ్ఞాపకమే కదా! వదిలేసి వెళ్లిన జ్ఞాపకమే ఆసరాగా జీవితాన్ని సాగించిన జై కూడా అలాంటివాడే.

సరే! నేను ఇంతకన్నా ఎక్కువగా గొడవ పెట్టుకోడానికీ, నేను ఏమన్నా నువ్వు భరించడానికీ, మనమేమీ ప్రేమలో లేము కదా? ఇంతమంది ఇన్నిరకాలుగా బాధలు పడ్దారని తెలిసినా నిన్నేమీ తక్కువ చేయటం లేదులే. ఎంత కాదన్నా, నా మూలాలు నీ దగ్గరే వున్నాయిగా. నిజం చెప్పేస్తున్నా – అసలు నువ్వంటే నాకు ఇంత ప్రేమ కాబట్టే నిన్నెవరైనా అవమానిస్తే చూడలేక, నేను ఆ చోటుని తీసుకుని నిన్ను దూరం పంపేస్తున్నాను. మరోచోట ఎక్కడైనా నువ్వు స్వేచ్ఛగా, సంతోషంగా వికసిస్తావని ఆశతో…
చివరగా నిన్ను ఓదార్చడానికి ఒకమాట చెప్పనా?

“A bitter ending is better than an endless bitterness”

ఉంటాను మరి…

ప్రేమగా,
నీ బ్రేకప్…

 

The Argument

అప్పట్లో, ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే –

న్యూ వేవ్ బుక్స్ ప్రచురణలో ‘ఇన్ ద మూడ్ ఫర్ లవ్’ అనే పుస్తకం వచ్చింది. ఆ ప్రేమ కథల సంకలనం తర్వాతే ఆన్వీక్షికి అనే ప్రచురణ సంస్థ ఆవిర్భవించింది. పన్నెండు మంది రచయితల కథలతో ఆ పుస్తకం పాఠకుల్ని ఆకట్టుకుంది, విమర్శలను తట్టుకుంది. పదిరోజుల్లోనే రెండవ ముద్రణకి, పద్దెనిమిది నెలలకే మరో ముద్రణకి వెళ్లిన ఆ పుస్తకం అమ్మకాలపరంగా సూపర్ హిట్ కొట్టింది. ప్రేమకథలైతే పాఠకులని పుస్తకానికి దగ్గర చెయ్యొచ్చు అన్న ఆలోచన తప్పు కాదని నిరూపించింది.

ఆ ప్రేమ కథలకి కొనసాగింపుగా మరో సంకలనం తీసుకురావాలంటే థీమ్ ఏముండాలి?

సుఖాంతపు పెళ్ళి, అనంతమైన ఆనందం ఇవన్నీ ఖచ్చితంగా ప్రేమకి మనం ఆశించే కొనసాగింపులే కదా. ఐతే వాస్తవం అన్నిసార్లూ అంత అందంగా ఉంటుందా? ప్రేమించిన అందర్నీ దాన్ని నిలబెట్టుకునే అదృష్టం వరిస్తుందా? విజేతల కథలకి దొరికే చప్పట్లు పశ్చాత్తప్తుల నిర్ణయాలకు దొరుకుతాయా? ప్రేమకి లొంగిపోయి, ప్రేమలో నలిగిపోయి, ప్రేమని కోల్పోయిన మనుషుల కథలు ఎవరు చెప్తారు? జీవితం ముందుకెళ్లాలంటే ప్రేమని వెనక్కి నెట్టక తప్పని పరిస్థితుల గురించి ఎవరు మాట్లాడతారు?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా వచ్చింది ఈ ఆలోచన. వియోగాన్ని, విడిపోవటాన్ని, ప్రేమకీ విడిపోవడానికి మధ్య ఉండే సుదీర్ఘ ప్రయాణంలోని ఎత్తుపల్లాల్ని చూపించాలన్న ఆలోచన. అదే ఈ బ్రేకప్ కథల సంకలనంగా రూపుదిద్దుకుంది.

మొదటి సంకలనంలో భాగమైన కథకులందరూ రాయాలనుకున్నా ఈ కథలు అదే రచయితలని ఎంపిక చేసుకోలేదు. దాంతో కొత్త రచయితలు వచ్చి చేరారు. పన్నెండు ప్రేమ కథల నుంచి పదమూడు బ్రేకప్ కథల వరకు సాగిందీ ప్రయాణం.

ప్రేమంటే తొలిచూపులోనే కలగచ్చు కానీ విడిపోవడం అంటే అంత తేలిక్కాదు కదా! ఎన్నో చర్చలు, వెనుకముందులాటలు, వద్దనుకోవడాలు, కరోనా అడ్డంకులు అవన్నీ దాటి వచ్చేసరికి సరిగ్గా ఈ పుస్తకం అన్వీక్షికి ప్రచురించే యాభయ్యవ పుస్తకం అయ్యింది. అదీ ఒక సంతోషమే.

ఎంచుకున్న ఈ పదముగ్గురు రచయితలకు కథాంశం బ్రేకప్ అయ్యివుండాలని తప్ప వేరే నియమం ఏదీ పెట్టలేదు. స్వేచ్ఛలేని కథ బలవంతపు రిలేషన్ లాంటిది కదా. ఈ పుస్తకంలో పది పేజీల లోపు కథలు వున్నాయి, పాతిక పేజీలను మించిన కథలూ వున్నాయి. ఎవరి కథ వాళ్లు చెప్పుకోడానికి సరిపడినంత స్థలం కుదిరింది.

ఒకరకంగా ఇవి కూడా ప్రేమ కథలే. విడిపోక తప్పని ప్రేమ కథలు. ఆ విడిపోవటం వెనుక వున్న కారణాలు, విడిపోయే క్రమంలో మనసులో, గుండెలో, మెదడులో జరిగే రసాయన చర్యలు, విడిపోయిన తరువాత ఎదుర్కోవాల్సిన సవాళ్లు, అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. బంధాన్ని తెంచుకోవడం అనివార్యమైన సందర్భాలు, తెంచుకున్న బంధాన్ని జ్ఞాపకాల పొరల్లో నిక్షిప్తం చేసే ప్రయత్నాలు, వాటిని కాలాగ్నిలో కరగనిచ్చి ముందుకు సాగిపోయే కొత్త అడుగులు ఇవన్నీ మీకు పరిచయం అవుతాయి.

బ్రేకప్‌కి సంబంధించిన సామాజిక, సాంస్కృతిక, మానసిక కోణాలను చూపించే ప్రయత్నం ఈ కథలలో కనిపిస్తుంది. ఆధునిక అర్బన్ నేపథ్యంలో చాలా వరకు కథలు వుండటం యాధృచ్చికం కాదు. ఎంతో విస్తారమైన ఈ అనుభవాన్ని అన్నిచోట్ల నుంచీ తీసుకురావడం దాదాపు అసాధ్యం. కాబట్టి అర్బన్ జీవితాల మీద మాత్రమే దృష్టి పెడితే ఒక చిన్న పరిధిలోనే విస్తృతమైన కవరేజ్ వీలౌతుందన్నది దానికి కారణం.

అయితే ఈ కథల ఉద్దేశ్యం బ్రేకప్‍కి మేకప్ వేసి, గ్లామరైజ్ చేసి, విడిపోవటమే మంచిదని చెప్పడం కాదు. విడిపోవటం అంటే ఇద్దర్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా తప్పు చేసి ఉండాలనే మూస ఆలోచనని సమర్థించడం కానే కాదు. తప్పు ఎప్పుడూ మగవాడిదే అనో, బాధ ఎప్పుడూ ఆడవాళ్లదే అనో జెండర్ కోణంలో బ్రేకప్‌ని బేరీజు వేసే ఉద్దేశ్యం కూడా లేదు. ఇలా జండర్, మంచి – చెడు, కరెక్ట్ – రాంగ్ లాంటి బైనరీ దృష్టికోణానికి రెండు వైపులా ఉన్న కథల్ని చెప్పే ప్రయత్నమే ఈ సంకలనం.

ఇలా రెండు వైపులా చూపించడమే కాకుండా, నలుపు తెలుపులకి మధ్య వున్న ఊదారంగుని కూడా చూపిస్తాయి ఈ కథలు. బ్రేకప్ అనే నిర్ణయాన్ని, అనివార్యమైన ఒక మెచ్యూర్డ్ డెసిషన్‌గా, సగౌరవంగా అంగీకరించడానికి ఈ కథలు సాయపడతాయని ఒక చిన్న ఆశ. తెలుగులో సాహిత్యంలో ఇదే మొదటి బ్రేకప్ సంకలనం ఐతే కావచ్చు. దాన్ని మించి, ఇది ఏ ఒక్కరికైనా తమ రిలేషన్ విషయంలో స్పష్టతను ఇచ్చినా, తమ వియోగపు జ్ఞాపకాల్లో స్నేహంగా కన్నీళ్ళు తుడిచినా మేము కోరుకున్న ప్రయోజనం సాధించినట్టే. ఒక ఒంటరి గుండెకు ఓదార్పు ఇచ్చినట్టే.

*

అరిపిరాల సత్యప్రసాద్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ విశ్లేషణ, ఆకాంక్ష బాగున్నాయి కథలు చదివితే అవి నెరవేరాయా లేదా తెలుస్తుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు