నమ్మకంగా నిలబడే నీడ యాకూబ్!

యాకూబ్ రాయకుండా ఉండలేడు. నిత్యం రాస్తూనే ఉంటాడు. అతడి ఆలోచనలకు అక్షరాలు సరిపోవు. పదాలు,వాక్యాలు అతడి అక్షరాల్లో కొత్త అర్థాన్ని వెతుక్కుంటుంటాయి.

చెట్లు చీలిపోతున్నాయి

ఆకులు వేర్వేరుగా రాలిపోతూ నేలను తాకుతున్నాయి

మనుషులు చీలిపోతున్నచప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది.

కరచాలనాలు అదృశ్యమయ్యాయి.

నీడలు త్రిశూలాల్లా, కమండలాల్లా, ముల్లాల్లా, టోపీల్లా కనపడుతున్నాయి.

ఏ నీడలోనూ మనిషి కనపడడం లేదు.

 

ఆలోచనల చుట్టూ ఒక వికృత పిశాచి నాట్యం చేస్తోంది

చెవులు గంటలు,మంత్రాలు,నమాజ్ లే వింటున్నాయి.

ఎవరి మాటలు విన్నా శబ్దాలు పురాతన కోటల పగుళ్లను స్ఫురిస్తున్నాయి

నన్నొకడు ఎందుకు ప్రేమగా, ఆప్యాయంగా చూస్తున్నాడో తెలియదు

మరొకడు అనుమానంగా,ద్వేషంగా,ఈర్ష్యగా ఎందుకు పరికిస్తున్నాడో అర్థంకాదు.

నా నగ్న దేహం చుట్టూ అల్లుకున్నకంచెలను దాటబోయి రక్తసిక్తమవుతున్నాను

 

నా ఉనికిని వాడి ఉపన్యాసం నిర్ణయిస్తోంది

నా పుట్టుకను వాడి భావాలు నిర్ణయిస్తున్నాయి

నేనెవరో వాడే చెబుతున్నాడు

నాలోంచి నేను మాయమైన రోజు

వాడు గడ్డం నిమురుకుని విజయహాసం చేస్తున్నాడు

నేను ఇలా ఆలోచిస్తున్న ఒక రాత్రి ఇంకొకడు భుజమ్మీద ప్రేమగా తడితే కరిగిపోయే మనుషులను గుర్తు చేశాడు. ‘నన్నుఈ నగరంలో వెతకండి.. వాగులా మీ మధ్యే ప్రవహిస్తున్నా’నని చెబుతాడు. ‘ఇప్పుడు కావాల్సింది పొద్దు పొడుపు లాంటి చిరునవ్వులాంటి నమ్మకం’ అని ఆశ్వాసించాడు.

నన్ను నేను భూమిలో పాతిపెట్టుకోవాలని అనిపించిన రాత్రి అతడి పుస్తకాల్లోని పేజీలు వంద చేతులతో నన్ను పైకిలేపాయి. ఆ పేజీల్లోంచి రాలిపడిన అక్షరాలు తాడులా పెనవేసుకుని అగాధపు బావుల్లో  కూరుకుపోతున్ననాకు ఆసరా ఇచ్చి పైకి లేపాయి. అతడెవరో కాదు యాకూబ్.

ఊపిరి ఆగిపోయినప్పుడల్లా చెట్ల  గాలి సేద దీర్చినట్లు, మంటల్లో ధగ్ధమవుతున్న ఇంట్లో చిక్కుబడినప్పుడల్లా ప్రవాహమై చల్లార్చినట్లు యాకూబ్ ప్రతిరోజూ కవిత్వమై ప్రాణానికి  విలువ కల్పిస్తుంటాడు.

ఇవాళ భారత దేశానికి అవసరమైన ఒక ఆలోచన మనిషిని బతికించడం. మనుషుల చుట్టూ తెరల్ని ధగ్గం చేయడం. బూజుపట్టిన,నెత్తురోడుతున్న, దుర్మార్గాగ్రహంతో ఎగిరిపడుతున్న మనుషుల్ని చూసి ఆనందించే వారినుంచి మనుషుల్ని రక్షించడం. బతికి ఉన్న జనాలను చితిమంటల్లో సహగమనం చేయమని త్రోసే వారి నుంచి ఆ జనాలను కాపాడడం.  వీరు ‘మనుషుల్రా మనుషులు!’ అని చెప్పడం.

యాకూబ్ ఈ చారిత్రక అవసరాన్నిగుర్తించాడు.ఇప్పుడు మన చుట్టూ అల్లుకున్న కీకారణ్యపు ఊడలనుంచి మనమే కాపాడుకోకపోతే ఏమీ మిగలదని గ్రహించినవాడతడు. మతం దేహమైనందుకు, మనిషి టిష్యూ పేపర్ అయినందుకు బాధపడే వాడతడు. రాత్రి కనురెప్పల వెనుక తగల బడుతున్న నల్లటి నుసిని చెరిపేయాలనుకునేవాడతడు. భుజమ్మీద చెరిగిపోయిన చేతిస్పర్శను మళ్లీ పుట్టించాలనుకునేవాడతడు.

‘నేనో నదిలా శవాల్నిమోయలేను’ అని యాకూబ్ స్పష్టం చేశాడు.  ‘నీవు మనిషివి.నీ లోపలి దయను విస్తరించు’ అని ప్రాధేయపడుతున్నాడు. ‘ఇది నీడ కాదు,నిన్నలుముకున్నసామాజిక మాధ్యమం, నిన్ను స్వరపరిచే ఎక్కడిదో,ఎవరిదో గొంతు’  అని హెచ్చరిస్తున్నాడు.

యాకూబ్ ఎవరు?

విశాలమైన వాకిట్లో

రంజాన్ మాసపు నెలవంకకోసం

ఎదురు చూస్తున్న దీపస్తంభం..

ఆ నెలవంక

రక్తమోడుతున్న జన్మభూమి

ఆ దీప స్తంభం

వెలుగును కోల్పోయిన ఉరికంబం

యాకూబ్ చుట్టూ ఉన్న వాతావరణానికి దూరంగా పారిపోకుండా ఆ వాతావరణంలో ప్రవేశించి దాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఆ వాతావరణంలో చిక్కుకున్న వారిని కాపాడతాడు. బతికిన ఘడియ గడియ తీయడం, మూయడమే కవిత్వం అని చెబుతాడు.  చుట్టూ చైతన్యం కాంతిలా ఆవరించే వారే ఆ పనులు చేయగలరు.

యాకూబ్ రాయకుండా ఉండలేడు. నిత్యం రాస్తూనే ఉంటాడు. అతడి ఆలోచనలకు అక్షరాలు సరిపోవు. పదాలు,వాక్యాలు అతడి అక్షరాల్లో కొత్త అర్థాన్ని వెతుక్కుంటుంటాయి. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచీ రాత్రి వరకు అతడు ప్రవహిస్తూనే ఉంటాడు. బహుశా రాత్రి నిద్రలో రేపటి కవిత్వమై పలవరిస్తుంటాడేమో. బహుశా అందుకే అతడి అక్షరాలు కాలంతో సమానంగా, ఒకోసారి కాలానికంటే వేగంగా ప్రయాణిస్తుంటాయి.

ఎవరున్నా, లేకపోయినా నమ్మకంగా నిలబడే నీడ యాకూబ్ !

(యాకూబ్ తాజా కవితల సంకలనం ‘మనుషుల్రా మనుషులు’ చదివాక)

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ‘‘రాత్రి కనురెప్పల వెనుక తగల బడుతున్న నల్లటి నుసిని చెరిపేయాలనుకునేవాడతడు’’… కవి యాకూబ్ గారికి కృష్ణుడు గారిచ్చిన అద్భుత నిర్వచనం.

    యాకూబ్ కొత్త కవితాసంపుటిపై రేఖామాత్రపు విశ్లేషణ ఆ పుస్తకం ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పింది.
    ఇద్దరికీ నమస్సులు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు