నగరం ఆత్మ ‘ఇసుక అద్దం’

గరం- కరిగి కారిపోయిన సాల్వెడార్‌ డాలీ గడియారం. నగరం- బొటనవేలితో ఎగరేసిన నాణెం. నగరం- దూళి మబ్బుతెరల మాటున సాగే ప్రణయం. నగరం- పసిబిడ్డ కలలో వెంటాడే భీకరాకారం.

నగరాన్ని ఒడిసి పట్టుకోవడం, పల్లెను పెనవేసుకున్నంత హాయి కాదు.

శ్రీఊహ రాసిన ఇసుక అద్దం చదివినపుడు 35 ఏళ్ల కిందట నేను హైదరాబాదు నగరంలో అడుగుపెట్టిన తొలిరోజులు గుర్తుకు వచ్చాయి. ఉదయం దినపత్రికలో సమ్మె చేసినందుకు శిక్షగా తిరుపతి నుంచి హైదరాబాదుకి బదిలీ చేశారు. ఒంగి కోరలు చాచి భయపెడుతున్నట్టుండే ఆకాశమెత్తు భవనాల కిందనుంచి నడచిపోతుంటే వెన్నీపులో భయం జరజరా పాకేది. డిగ్రీ పాసవగానే ఉద్యోగంలోకి వచ్చిపడిన పసిరోజులు అవి. ఒక మధ్యాహ్నం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో వాహనాల చిక్కుముడిలోంచి బయటపడగానే ఎందుకో ఏడుపు తన్నుకొచ్చింది. నడిరోడ్డు మీద  బొరోమని ఏడుస్తూ ఉంటే.. ‘అయ్యో ఏమైంది బిడ్డా’ అని పలకరించే మనిషి కూడా లేనిచోట ఉండలేక, పారిపోయి మళ్లీ తిరుపతిలో పడి ఊపిరి తీసుకున్నాను. ఇంకో ఏడెనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఇష్టమైన పని కదా అని హైదరాబాద్‌కు చేరుకున్నా ఐదేళ్లకు మించి నిలవలేకపోయాను. తప్పనిసరై మళ్లీ 2008లో ఏడాది కాలాన్ని దుఃఖంగా హైదరాబాదుని మోశాను. నగరమే నన్ను ఇముడ్చుకోలేదో, నేనే నగరంలో ఇమడలేకపోయానో గానీ నగరం నాదే అనే భావన నాకెప్పుడూ కలగలేదు. కార్లలో, బస్సుల్లో, బైకులమీద తిరుగుతూ, రోడ్డు పక్కన బండ్లమీద ఏవేవో అమ్ముకుంటూ, భవన నిర్మాణాల్లో మట్టీ సిమెంటూ మోస్తూ.. ఇంత మంది ఇలా ఎలా ఉంటున్నారా అని ఆశ్చర్యంగానే ఉంటుంది నాకు.  బస్సులోనో, రైల్లోనో తిరుపతికి తిరిగి వస్తున్న ప్రతిసారీ కొండల్ని చూడగానే మనసుకి ఒక ఊరట కలుగుతుంది ఇప్పటికీ. అదే హైదరాబాద్‌కి దగ్గరవుతూవుంటే తెలియని అలజడి మొదలవుతుంది. ఎందుకీ తేడా? నగరం కూడా కొన్ని ఊళ్ల సముదాయమే కదా..ఊరు నాదనిపించినపుడు, నగరం నాది కాకుండా ఎందుకు పోయింది..?

మా కుటుంబంలో ఒకరి నిశ్చితార్ధం హైదరాబాద్‌ గోల్కొండ హోటల్‌లో ఇటీవల జరిగింది. ఇంటి సంబరమే అయినా తెలియని ఉక్కపోతలో గడిపాం ఆ ఖరీదైన హోటల్లో పగలంతా. మరుసటి రోజు ఉదయం వాళ్ల కులదైవం  వీరభద్రస్వామికి తొలిపూజ చేయాలని గండిపేటలో ఒక గుట్టమీద గుడికి వెళ్లాం. పెద్ద చెట్టుకింద రచ్చబండమీద జంగమదేవరలు పాడుతూ, ఆడుతూ శంకు ఊదుతూ చేసిన పూజా.. చుట్టూ రాళ్లూ రప్పలూ తుప్పల్లో మేత కోసం తిరుగులాడే మేకలూ.. ఎందుకో నట్టనడి సముద్రంలోంచి గట్టునపడ్డట్టు అనిపించింది. గుట్టమీద అరచేతిలో ఆకుల్లో పెట్టుకుని తిన్న బెల్లం పొంగలి మాధుర్యాన్ని గోల్కొండ హోటల్‌లో వడ్డించిన ఏ పదార్ధం నుంచీ పొందలేకపోయాం. అది రుచికి సంబంధించినది మాత్రమే బహుశా కాదు. గోల్కొండ హోటలూ నగరమే, గండిపేట గుట్టమీది గుడీ నగరంలో భాగమే. అయినా అర్ధంకాని అంతరం ఏదో ఉంది.  అవతార్‌ సినిమాలో వేలాడే తీగలకు తోకను కలిపి ప్రకృతితో కనెక్ట్‌ అయినట్లుగా నగరంతో కనెక్ట్‌ చేసే దేన్నో నేను పట్టుకోలేకపోయాను అని అర్ధం అయింది శ్రీఊహ కథ చదివాక.  నగరం భౌతిక రూపాన్ని మాత్రమే నేను చూశాను. దాని ఆత్మిక సౌందర్యాన్ని నేను దర్శించలేకపోయాను. కె.శ్రీనివాస్‌ వంటి మిత్రులు నగరాన్ని అంతలా ఎలా ప్రేమించేవారో అని విస్తుపోయే నాకు ఎంతో కొంత సమాధానం దొరికినట్టే అనిపించింది ఈ కథ చదివాక. సకల సబ్బండ సంస్కృతుల కలబోతలో మనల్ని పట్టి కలుపుకునేదేదో గుర్తించకపోవడం వల్ల, నగరం మొత్తానికీ ఒకే లక్షణాన్ని ఆపాదించి, ద్వేషించి దూరంగా పారిపోయానేమో! నగరంలో స్థిరపడిన నా

మిత్రులు కొందరు రాసిన నగర కథల్లో లోపించిన తడి ఏమిటో కూడా నాకు శ్రీఊహ కథ అర్ధం చేయించింది. పబ్బుకో, ఖరీదైన కాఫీక్లబ్బుకో ఒకసారో రెండుసార్లో నాలుగైదు సార్లో వెళ్లినంత మాత్రాన దాని ఆత్మను పట్టుకోలేం. ఇరానీ టీకేఫ్‌లోని చోటూ గాడితో సంభాషించినంత హాయిగా తాజ్‌లో గడపలేం.   మన సామాజిక, ఆర్ధిక మూలాలు మనల్ని నిర్దేశిస్తాయి. బహుశా మన పిల్లలకు ఇదొక సమస్యగా ఎదురుకాకపోవచ్చు.

శ్రీఊహ రాసిన ‘ఇసుక అద్దం’ కథ, దుబాయ్‌ సంపన్నుల ఆకాశహార్మ్యం బుర్జ్‌ ఖలీఫాలోనే మొదలైనా అది, అరబ్బు షేక్‌ల విలాసవంతమైన జీవితాలను గాక, హైదరాబాద్‌ పాతబస్తీ పిలగాడి ప్రేమ కథను చెబుతుంది. శివ, నగరం పేదబస్తీల్లో అందరిలాగే బలాదూరుగా పెరుగుతున్న పిలగాడే. గల్లీలో అంగన్వాడీ బడి టీచర్‌ కౌముది వెంటబడే పోరడు. ఆమె పొగరు అతన్ని ఆకర్షించింది. సాగని చదువు, తాగుడు, రౌడీయిజం, దొంగతనాలు.. ఇవి మాత్రమే బస్తీ పిలగాళ్లలో బయటి ప్రపంచానికి కనిపించే లక్షణాలు. బస్తీతో కనెక్ట్‌ అయితే తప్ప వాళ్లలో ఉన్న తడి అందదు. శ్రీఊహ నేపథ్యం నాకు తెలియదు కానీ, బస్తీ డయలెక్ట్‌ను ఆమె పట్టుకున్న తీరు బస్తీబిడ్డేమో అనిపిస్తుంది.

పేదరికపు కష్టాలను మోసుకుతిరిగే ఒంటరి తల్లి బిడ్డగా కౌముదికి నగరం దుర్మార్గ రూపం తెలుసు. అందుకే లవ్‌ అంటూ వెంటబడే శివను, ‘ఏందిరా నాటకాలా? మొన్న బడికాడ, ఇయ్యాల గుడికాడ. చల్‌’ అంటూ ఆమె విసుక్కుంది. కోప్పడింది. అయితే పదో తరగతి చదువుతున్న పిల్ల పెళ్లిని అతను ఆపిన తీరును చూసి, అందుకు కారణాన్ని విన్న ఆమె అతనికి కరగడం మొదలు పెట్టింది.

చిత్రం: లేపాక్షి
చిత్రం: లేపాక్షి

పాతబస్తీ నిమ్రాహ్‌ కేఫ్‌లో ఇద్దరూ కలిసి తాగిన ఆమెకి ఇష్టమైన పౌనాచాయ్‌, అతనికి ఇష్టమైన అల్లంచాయ్‌లతో పాటూ వాళ్ల ప్రేమ పెనవేసుకుంటూ పెరిగింది.

‘లగ్గం చేస్కుందామా?’ అని అతను అడిగితే, ఆమె ఎగిరి గంతేయలేదు.

‘నీతో సినిమాలు, పార్కులకి గట్ల తిరగలేను. మా అమ్మని మంచిగ చూస్కోవాలె, ఆమెకి కష్టం లేకుండా ఉండాలె. అన్నీ సెట్చేసినాక చేస్కుందం’ నువ్వంటే నాకూ ఇష్టమే అని చెబుతూనే తేల్చేసింది.

‘అంటే? ఏం కావాలె?’ అని అడిగిన శివకు ఆమె చెప్పిన సమాధానం ‘ఇజ్జత కావాలె. ఇజ్జతతో నన్ను తీస్కపో’ అని.

ఇజ్జత అంటే  పైసలుండడం అని  జీవితానుభవం ఆమెకు నేర్పింది. ‘మా అయ్య పొయినాక మస్తు చూసిన. మా ఇంటి సేటు ఒక నెల కిరాయి లేటైతే నన్ను, మా అమ్మని తాపతాపకి ఆకలిగా చూస్తడు బద్మాష్‌గాడు’ అని చెప్పింది.

పైసలంటే లక్షలు కోట్లు అతను సంపాదించాలని కూడా కాదు. ‘మనం బతకనీకి ఆడా ఈడా దేవులాడకుండా ఉండాలె. నాకు బనమస్కా నచ్చింది. నీకు బిర్యానీ అనుకో. ఇంటికి పోయేటప్పుడు ఒక ఎక్స్‌ట్రా పార్సెల్‌ అనుకో. అప్పుడు జేబులు దేవులాడద్దు. పాణం బాలేకుంటే అప్పుగిట్ల తెచ్చి మందులు కొనుడుకాదు. దేవులాడద్దు. ఎవరి ముందు చెయ్యి చాపద్దు. అట్ల ఓ తాప మా అమ్మ చేస్తే ఎదిగిన బిడ్డకి, అంటే నాకు రేటు కట్టిండ్రు కొడుకులు. అట్ల కావద్దు. ఇజ్జత ఇయ్యాలె. పైసల్‌ లేవని సంతలో మాల్లెక్క ఎవరూ చూడద్దు’.

ఆ ఇజ్జత కోసమే అతను 164 అంత’స్తుల  బుర్జ్‌ ఖలీఫా  అద్దాలు తుడిచే పనికోసం దుబాయ్‌కి చేరుకున్నాడు.  వంద అంతస్తుల ఎత్తుదాకా మోకులకు వేలాడుతూ అద్దాలను తుడిచే పని. పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి జాతరలో ఎత్తయిన స్తంభాల మీదకు బల్లిలా పాకి బ్యానర్లు కట్టిన అనుభవం అతడిది. అయినా తొంబయ్యో అంతస్థు నుంచి తాడుకి వేలాడడానికి ఈ అనుభవం ఇచ్చిన ధైర్యం సరిపోలేదు. నడుముకు తాడు కట్టుకుని ఎక్కే ప్రతిసారీ వెన్నీపులోంచి జరజరా భయం పాకేది. ‘ ఎడారి దిబ్బల్లో నిలబడి ఆకాశాన్ని చీల్చుతూ మూతి పైకెత్తిన రాకాసి డైనోసార్‌ లెక్కనే’ బుర్జ్‌ఖలీఫా అతని కంటికి కనిపించేది. ‘మస్త్‌ టెన్షన అయితాంది’ అని అతను ఎక్కేముందు కౌముదికి ఫోన చేసేవాడు. ఆమె తేలిగ్గా తీసుకునేది. ‘చల్‌ తియ్‌. మస్త్‌సార్లు ఎక్కినవ్‌ దిగినవ్‌. నువ్వు మస్త్‌ డేర్‌.’ అనేది. బుర్జ్‌ఖలీఫా అద్దాల మీద పాతబస్తీని చూసుకుంటూ అతను ఏడాది దాటేశాడు. ఇంటిమీదకీ, కౌముది మీదకీ మనసు పీకేది. ‘ఇజ్జత’ కోసం భరించేవాడు. భయాన్ని దాచుకునేవాడు. ఈలోగా కరోనా లాక్‌డౌన ప్రకటించారు.  పాతబస్తీలో బోనం కూడా వెలవెలపోయింది. దుఃఖాన్నీ, దూరాన్నీ దాటలేని విషాదకాలం.

ఈసారి దసరాకి శివకి సెలవు దొరికింది. ఎడారి డైనోసార్‌ మీదనుంచి ఆఖరిసారి కిందికి దిగి సంతోషంతో కౌముదికి ఫోన చేశాడు వస్తున్నానంటూ. అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న ఆమె ‘నీకు చెప్పలేకాని నాకు ఈడ పాణం పొయ్యేది నువ్వు క్లీనింగ్‌కి పైకెక్కుతుంటే’ అంటూ బద్దలైంది. తప్పదు మరి, ‘ఇజ్జత’ కోసం ప్రాణాలనే పణంగా పెట్టాల్సిన నగర బతుకులు వారివి.

ఈ సుఖాంత ప్రేమకథను శ్రీఊహ నడిపిన తీరు అద్భుతం. శివ బుర్జ్‌ఖలీఫా మీదకు ఎక్కే ప్రతిసారీ ఇక ప్రాణాలతో దిగడేమో అనే ఆందోళన పాఠకులకు కలుగుతుంది. అతను క్షేమంగా పాతబస్తీకి తిరిగిరావాలని కౌముదితో పాటూ పాఠకులు కూడా మహంకాళి అమ్మవారికి మొక్కుకుంటారు. కథాంతంలో  ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన శివకి బుర్జ్‌భవనం మీద కనిపించిన బతుకమ్మ లేజర్‌ షో పాఠకులకూ గొప్ప ఊరటనిస్తుంది.  ఆ రాత్రి.. ‘ఏడంతస్తుల మేడ ఉయ్యాలో.. ఎక్కరాదు దిగరాదు ఉయ్యాలో’ అంటూ కౌముది పాతబస్తీలో బతుకమ్మ ఆడిందంటూ పాఠకులను జోకొడుతుంది రచయిత.

హైదరాబాద్‌ నగరబస్తీల ఉర్దూ కలగలిసిన తెలుగు భాషా, యాసా కథకు భలే అందంగా అమరిపోయాయి. నగరజీవన సౌందర్యాన్ని అద్దంలో చూపిన కథ ఇది.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ విశ్లేషణ చదువుతుంటే మొత్తం కథ చాలా చదవాలని అనిపించింది. శుభాకాంక్షలు

  • కథ గురించి మీ లోతైన సమీక్ష చాలా బావుంది సర్. కథ వెంటనే చదవాలనే ఆసక్తి కలిగింది. కథ లింక్ జత చేయడం మరింత బావుంది. ఇక కథ కథనం అద్భుతంగా ఉన్నాయి. ఇది ఒక very matured ప్రేమ కథ. కౌముది శివల వ్యక్తిత్వాలు తీర్చి దిద్దిన తీరు చాలా నచ్చింది. ఇంకా పద్మావతి టీచర్ ప్రేమ కథ parallel గా టూకీగా అయినా లోతుగా అందంగా చెప్పడం, బుర్జ్ ఖలీఫా అద్దాలు శుభ్రం చేస్తున్నపుడు శివ మనసులో మెదిలే భావాలు వాక్యాలుగా అమర్చడం కథకు మరింత వన్నె చేకూర్చింది. మంచి కథను చదివించిన రచయిత్రికి, వ్యాసకర్తకు అభినందనలు.
    Story name too is very apt.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు