ద‌ట్ సింగిల్ క్వెశ్చ‌న్‌

“నువ్వు న‌న్నిలా ఇంప్రెస్ చేస్తూ పోతే మ‌న మ‌ధ్య ఏ గీత‌లూ మిగ‌ల‌వేమోన‌ని నాకు భ‌యంగా ఉంది”.  నిజంగా భ‌య‌ప‌డుతున్న ఛాయ‌లేమీ ఆమె గొంతులో క‌నిపించలేదు. అలాగ‌ని ఆ అమ్మాయి కొంటెగా సిగ్గుపడుతూ కూడా చెప్ప‌లేదా మాట‌లు.

మూడు నెల‌ల స్నేహంలో బోలెడు క‌బుర్లు చెప్పుకున్నారు వాళ్లు. చ‌ర్చ‌కి రాని విష‌య‌మంటూ ఏమీ మిగ‌ల‌న‌న్ని క‌బుర్లు. కొన్ని వంద‌ల గంట‌ల‌పాటు. కానీ, ఇద్ద‌రి మ‌ధ్యా ఉన్న రిలేష‌న్ ఎలాంటి మ‌లుపు తిరిగే అవ‌కాశం ఉందీ అన్న‌దానికి సంబంధించి ఆమె  ఓపెన్ అవ్వ‌డం ఇదే మొద‌లు. ఆమాత్రం క్యూరియ‌స్ స్టేట్మెంట్ ఆమె నుండీ రావ‌డం అత‌నికి చాలా న‌చ్చింది. గీత‌లు చెరిగిపోవ‌డ‌మంటే ఏంటి అని అడ‌గ‌లేదు అత‌ను. ఒక చిన్న చిరునవ్వుతో స‌రిపెట్టాడు. ఆ న‌వ్వులో క‌న్‌స‌ర్న్ త‌ప్ప వేరే ఏ భావ‌మూ ప‌ల‌కకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. తొంద‌ర‌పడ్డానేమో అని కంగారు ప‌డ‌బోయిన ఆమె అత‌ని రెస్పాన్స్ చూశాక ఊపిరి పీల్చుకుంది. అత‌ను టాపిక్ మార్చి, ఆఫీసు విష‌యాలు మాట్లాడ్డం మొద‌లెట్టాడు.

*****

“మీ ఆవిడ చాలా  ల‌క్కీ ఫెలో సందీప్‌గారూ..”

ఎవ‌రా అని త‌లెత్తి చూశాడు సందీప్‌. వారం క్రితం కొత్త‌గా జాయినైన బెంగుళూరు పిల్ల‌.  ఇంగ్లిష్‌లో గ‌డ‌గ‌డా మాట్లాడ్డం చూసి నాన్ లోక‌ల్ అనుకున్నాడు. తెలుగమ్మాయే అన్న‌మాట‌.

“మీరు రాసిన క‌ప్పూసాస‌ర్ క‌థ చ‌దివాను. కాఫీని అనాల‌జీగా తీస్కోని మేరీడ్ లైఫ్ మీద అంత బ్యూటిఫుల్ స్టోరీ రాయ‌డం.. రియ‌ల్లీ ఫెంటాస్టిక్‌. ఇలాంటిదే ఒక బెంగాలీ క‌థ చ‌దివాను. బ‌ట్‌, యువ‌ర్స్ ఈజ్ మోర్ ట‌చింగ్‌”.

ఉత్తినే పొగ‌డ్డానికి వ‌చ్చిన బేరం కాద‌న్న‌మాట‌. నిజంగానే చ‌దివింది. క‌థ న‌చ్చితే అదే మాట సూటిగా చెప్ప‌కుండా, మీ ఆవిడ ల‌క్కీ అంటుందంటే మ‌రీ రిజ‌ర్వ్డ్ గా ఉండే టైపు కాద‌న్న‌మాట‌.

“సారీ ఇఫ్ అయాం వేస్టింగ్ యువ‌ర్ టైమ్…”

“నో నో.. మీ నుండీ కాంప్లిమెంట్ ఊహించ‌లేదు. ఇన్‌ఫాక్ట్ అస‌లు మీకు తెలుగొచ్చ‌ని కూడా ఐడియా లేదు నాకు. సారీ దేనికి, అయాం రియ‌ల్లీ ఫ్లాట‌ర్డ్”.

“నేనూ నిజంగా సారీ ఫీలవ్వ‌లేదు లేండీ. ఏదో అలా అంటే ప‌డుంటుంద‌నీ..”, ఆ అమ్మాయి నిజంగానే క‌న్నుకొట్టిందా లేక త‌నే అలా ఊహించుకున్నాడా? క‌థ‌లో రాసిందంతా త‌న ఓన్ ఎక్స్పీరియెన్స్ నుండీ వ‌చ్చిందే అనుకుంటుందా ఆ అమ్మాయి? ఆ ఊహ కూడా అత‌ను భ‌రించ‌లేక‌పోయాడు. హ్యాపీ గో ల‌క్కీ ఫిలాస‌ఫీ ఫాలో అయ్యే అమ్మాయిలకి భార్య‌ల్ని మంచిగా చూసుకునే మ‌గాళ్లు న‌చ్చ‌ర‌ని ఎక్క‌డో చ‌దివాడు. త‌న ఫ్యామిలీ లైఫ్ మ‌రీ ఏమంత గొప్ప‌గా లేద‌ని మొద‌ట్లోనే ఒక‌ హింటిచ్చేస్తే పోలా.

“ల‌క్కీ అని చూసేవాళ్ల‌కి అనిపిస్తే స‌రిపోదుగా. కొన్ని జీవితాలకి ఆ విష‌యం ఎప్ప‌టికీ అర్థం కాదు..”, బాధ ప‌డుతున్న‌ట్లు మొహం పెట్టాడు. త‌ల దించుకొని ఉన్న అత‌ని వైపే ఒక ప‌దిసెక‌న్ల‌పాటు చూసి, వెళ్లి త‌న సీట్లో కూచోని ఏవో పేప‌ర్లు తిర‌గేయ‌డం మొద‌లెట్టింది.

త‌నమీద ఆమెకి ఏర్ప‌డిన పాజిటివ్ ఫీలింగ్ ఏదైనా వుంటే అది త‌న ఒక్క మాటతో మ‌ట్టికొట్టుకుపోయింద‌ని అత‌నికి అర్థ‌మైంది. ఇంకోసారెప్పుడూ అలాంటి పొర‌పాటు చేయ‌లేద‌త‌ను. ఆమె అంద‌రిలాంటిది కాదు. త‌నకి కావాల్సిన సుఖం భార్య ద‌గ్గ‌ర‌ దొర‌కడం లేద‌ని చెప్పుకొని ఏడిస్తే, క‌రిగిపోయి కౌగ‌లించుకేనేవాళ్లు వేరే ఉంటారు.

****

ఆ అమ్మాయిని అర్థం చేసుకోడానికి సందీప్ చాలా క‌ష్టప‌డాల్సొచ్చింది. ప్రైవేటుగా మాట్లాడే మాట‌లు, అంద‌రిముందు మాట్లాడే మాట‌లు అంటూ వేరువేరుగా ఉండ‌వు ఆమె ద‌గ్గ‌ర‌. ఆర్ట్ గ్యాల‌రీలో, మ్యూజియంలో, షాపింగ్ మాల్‌లో క‌లుసుకున్న‌ప్పుడు మాట్లాడుకున్న సంగ‌తులు కూడా వేరే వాళ్లు ఉన్న‌ప్పుడు ప్ర‌స్తావిస్తూ ఉండేది. దాయాల్సిందంటూ ఏదీ లేద‌న్న‌ట్టు ఉండేది త‌న ప్ర‌వ‌ర్త‌న‌. పైకే అలా చెప్పేస్తోందంటే.. ఎవ‌రికీ తెలీకుండా ఇంకెంత జ‌రిగిందో అని ఆఫీసులో అంద‌రూ చెవులు కొరుక్కోవ‌డం మొద‌లెట్టారు. కానీ ఆమెకి అదేం ప‌ట్టేది కాదు. ఏదైనా మంచి సినిమా చూసినా, బుక్ చ‌దివినా అర్థ‌రాత్రి అని కూడా చూడ‌కుండా కాల్ చేసి, దాని గురించి చెప్ప‌డం మొద‌లెట్టేది. ‘మీ ఆవిడ ప‌క్క‌న ఉందా, ఇలాంటి టైమ్‌లో ముచ్చ‌ట్లు పెట్టుకోవ‌డం నీకు ఇబ్బందిగా ఉంటుందా’ అనే ప్ర‌శ్న‌లు అడ‌గొచ్చ‌నే స్పృహ కూడా ఆమెకి ఉన్న‌ట్టు తోచేది కాదు.

త‌నంత స‌న్నిహితంగా ఉండేవాళ్లెవ‌ర‌కూ ఆమె జీవితంలో లేర‌నీ, ఎంత చిన్న విష‌య‌మైనా త‌న‌కి చెప్ప‌కుండా ఉండ‌లేద‌నీ అత‌నికి క్లారిటీ వ‌చ్చింది. రోజురోజుకీ తమ మ‌ధ్య చ‌నువు పెరుగుతోంద‌నీ, ఆమె ఇంకెన్నాళ్లో రెసిస్ట్ చేయ‌లేద‌నీ కూడా అత‌నికి తెలిసిపోతోంది. కానీ, త‌న వైపు నుండీ ఎలాంటి తొంద‌ర‌పాటు సంకేతాలూ వెళ్ల‌కూడ‌ద‌ని వంద ఒట్లు పెట్టుకున్నాడు. ఆ టైమంటూ వ‌స్తే, తానే ప్ర‌పోజ్ చేయ‌డానికి ఆమె సందేహించ‌దు. ఆఖ‌రి ప‌రీక్ష రాయ‌బోయే స్టూడెంట్‌లా డెస్ప‌రేట్ గా నిరీక్షిస్తున్నాడు అత‌ను. నిజానికి ఇదంతా అత‌నికీ కాస్త ఇష్టంగానే ఉంది. అలాంటి ప్ర‌త్యేక‌మైన అమ్మాయి పెళ్ల‌యిన ఒక మగాడితో త‌న కోరిక‌ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది? ఎలాంటి ఇన్‌హిబిష‌న్సూ లేకుండా బోల్డుగా ఉండే ఆమెతో సెక్స్ ఎలా ఉంటుంది? అత‌ని జీవితంలో ఇంత ఎగ్జయిట్‌మెంట్ ఫీలైన ఫేజ్ ఇంకొక‌టి లేనే లేదు.

ఇన్నాళ్ల త‌ర్వాత నోరు విప్పి చెప్పింది.. “నువ్వు న‌న్నిలా ఇంప్రెస్ చేస్తూ పోతే మ‌న మ‌ధ్య ఏ గీత‌లూ మిగ‌ల‌వేమోన‌ని నాకు భ‌యంగా ఉంది..”. ఇందులో అర్థం కాక‌పోడానికేముంది?  చివ‌రి అడిష‌న‌ల్ షీటు తీసుకుంటున్నాడు త‌ను. ది” ఎండ్” అని రాసి, ఆమె చేతిలో పెట్టేయ‌డానికి ఇంకా కొద్ది రోజులే. లేదా కొద్ది గంట‌లు మాత్ర‌మే కూడా కావొచ్చు.

*****

తలుపు తీయ‌గానే సందీప్ కాకుండా ఎవ‌రో ఆడ‌మ‌నిషి ఉండ‌డం చూసి కాస్త ఆశ్చ‌ర్య‌పోయింది అమ్మాయి. ఎక్క‌డా చూశాను ఈవిడ‌ని? మైండ్ స్కానింగ్ మిష‌న్‌లా ప‌రుగులు పెడుతోంది. ఎస్‌, గుర్తొచ్చింది. సందీప్ వాళ్లావిడ‌.

“లోప‌లికి రండి”, న‌వ్వుతూ పిలిచింది. ఆవిడ మొహంలో కోపం లేదు. ఆ మాట‌కొస్తే ఏ కొద్దిపాటి నెగ‌టివ్ ఫీలింగ్ కూడా క‌న‌బ‌డ్డం లేదు. ఏదో ఇల్లు అద్దెకి తీసుకోడానికి వ‌చ్చిన‌ట్లు చుట్టూతా ప‌రికించి చూసింది.

“కాఫీ తీసుకుంటారా?”, ఈ సిట్యుయేష‌న్ ఎలా హ్యాండిల్ చేయాలో డిసైడ్ చేసుకోడానికి త‌న‌కి కాస్త స్పేస్ అవ‌స‌ర‌మ‌ని అమ్మాయికి అనిపించింది, ఎంబీయేలో క్రైసిస్ మేనేజ్‌మెంట్ త‌న స్పెషాలిటీ. కానీ, అందులో నేర్పే ఇష్యూస్ వేరే.

“నో థేంక్స్. ఐ హ్యాడ్ నో ఐడియా యు ఉడ్ బి సో బ్యూటిఫుల్”, సూటిగా క‌ళ్ల‌లోకి చూస్తూ అందావిడ‌. ఆ చూపులో అసూయ లేదు. చిన్న వాక్య‌మే. కానీ, ఎలాంటి ఎఫ‌ర్ట్ లేకుండా మంచి ఇంగ్లిష్ మాట్లాడేయ‌గ‌ల‌ద‌ని తెలిసిపోతోంది.

“థేంక్యూ”.., దేవుడా, ఎలా రెస్పాండ్ అవ్వాలిప్పుడు?

“ఎవ‌రు అని అడ‌క్కుండా లోప‌లికి పిలిచి కాఫీ ఆఫ‌ర్ చేశావంటే నేనెవ‌రో నీకు తెలుస‌న్న‌మాట‌”.

అవున‌న్న‌ట్టు త‌లాడించింది.

“నేను పంచాయితీ పెట్ట‌డానికో, ఎంక్వ‌యిరీలు చేయ‌డానికో రాలేదు. మా ఆయ‌న‌కి కాబోయే పార్ట్న‌ర్ ఎవ‌రో చూద్దామ‌నే క్యూరియాసిటీ, అంతే”. అగైన్‌, నో ట్రేస్ ఆఫ్ స‌ర్కాజ‌మ్‌.

“నువ్వేమీ గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవ‌స‌రం లేదు. నేనెలాగూ డివోర్స్ కి అప్లై చేయ‌బోతున్నాను. నువ్వు సందీప్ లైఫ్‌లోకి రాక‌ముందే తీసుకున్న డెసిష‌న్ అది”. ఏంటీ మ‌నిషి?  ఎంత ఎంబరాసింగ్ గా ఉండాల్సిన సంద‌ర్భాన్ని సింపుల్‌గా తేల్చేస్తోంది.

“ఏంటి ఇంత తేలిగ్గా మాట్లాడేస్తుంది అనుకుంటున్నావా?”, న‌వ్విందావిడ‌.

“నో నో. ఐ జ‌స్ట్ డోంట్ నో వాట్ టు సే”, ఉలికిపాటుని క‌ప్పి పుచ్చుకోడానికి క‌ష్ట‌ప‌డింది అమ్మాయి.

“నేను మంచి వైఫ్ అయ్యుండ‌క‌పోవ‌చ్చు. నా వ‌ల్ల సందీప్ కి పెద్ద‌గా సుఖం లేక‌పోయుండొచ్చు. కానీ, ప‌దేళ్ల‌పాటు చాలా క్లోజ్‌గా చూశాను అత‌న్ని నేను. ఆ ఎక్స్పీరియెన్స్ తో ఒక స‌ల‌హా ఇస్తాను. నువ్వు ఒద్ద‌న్నా స‌రే”. ఏం స‌ల‌హా ఇస్తుంది? మా ఆయ‌న్ని వ‌దిలెయ్ అంటుందా?  కాదు, ఇంకేదో ఉంది.

“సందీప్ ని ఒక ప్ర‌శ్న అడుగు. దానికి అత‌నిచ్చే ఆన్స‌ర్ ఏంటో తెలిశాక నువ్వేం చేస్తావో నాకు అన‌వ‌స‌రం. టెక్నిక‌ల్ గా డివోర్స్ రాడానికి టైమ్ ప‌ట్టినా స‌రే, నేను మీకు అడ్డం రాను. చెప్ప‌నా అందేంటో?”

ఏం అడ‌గ‌మంటుంది?  “నీ భార్య‌ని ఎందుకు వ‌దిలేశావ్‌?  రేపు న‌న్నూ వ‌దిలేయ‌వ‌ని గ్యారంటీ ఏంటి?” అనేనా?  పిచ్చిపిచ్చి ఊహాగానాలు చేయ‌డం క‌న్నా, నోరు మూసుకోని చెప్పింది విన‌డం క‌రెక్ట్ అని అమ్మాయికి తెలిసినా.. మెద‌డు కంట్రోల్లో లేకుండా ఏవేవో ఆలోచ‌న‌లు చేస్తోంది.

“చెప్పండి”, అమ్మాయి గొంతు త‌డారిపోతోంది.  దొంగ‌వెధవ‌లు. ఎంబీయేలో ఏమీ నేర్పి చావ‌లేద‌న్న‌మాట‌.

ఆవిడ చెప్పింది. అమ్మాయి బుర్ర‌లో ఆ ప్ర‌శ్న సింక్ అయ్యేలోగా వెళ్లిపోయింది కూడా.

*****

రెండు రోజుల్నించీ అమ్మాయి కాస్త ఉదాశీనంగా ఉండ‌డం అత‌న్నిఇబ్బంది పెడుతోంది. ఎగ్జామ్ హాల్ నుండీ ఇంటికి పోతూ క్వెశ్చ‌న్ పేప‌ర్‌ని చించి ముక్క‌లు చేసి పారేసే పిల్లాడిలా ఉరుకులు పెట్టిన అత‌ని మ‌న‌సు ఏదో కీడుని శంకిస్తోంది. త‌నంత‌ట తానుగా ఆమె బ‌య‌ట ప‌డేవ‌ర‌కూ ఏదీ గుచ్చిగుచ్చి అడ‌గొద్ద‌ని ఎప్పుడో ఫిక్స్ అయ్యాడ‌త‌ను. ఆ స్ట్రాట‌జీ ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అయ్యింది కూడా.

“నిన్నొకటి అడ‌గ‌నా?”, రెండో రోజు సాయంత్రం అడిగింది అమ్మాయి.

“ఏంటి కొత్త‌గా. అడ‌గ‌డానికి ప‌ర్మిష‌న్లు తీస్కోవ‌డం. అమ్మాయిగారికి సూట‌య్యే ఫీచ‌ర్ కాదు”, జోక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు.

“మీ ఆవిడ‌కి డేట్ వ‌చ్చేదెప్పుడు?”

“వ్వాట్‌?”, ఏమాత్రం ఊహించ‌ని ప్ర‌శ్న‌.

“మీ ఆవిడ‌కి పీరియ‌డ్స్ వ‌చ్చే డేట్ ఎప్పుడూ అని అడుగుతున్నా”. అమ్మాయి గొంతులో ఇందాక‌టి హెజిటేష‌న్ లేదు.

“ఏంటీ పిచ్చిప్ర‌శ్న?  అయినా ఇప్పుడు అదెందుకు కావాల్సొచ్చింది?” అందామ‌నుకున్నాడు. కానీ, ఐస్ బ్రేకింగ్ కి వ‌చ్చిన అవ‌కాశం ఎందుకు పోగొట్టుకోవాలి?

“మా ఇద్ద‌రి మ‌ధ్య సెక్స్ జ‌రిగి చాలా కాలం అయ్యింది”, ముభావంగా బ‌దులిచ్చాడు.

“నేన‌డిగిన ప్ర‌శ్న‌కి అది స‌మాధానం కాదు”, అమ్మాయి గొంతులో కాస్త కాఠిన్యం.

“దానితో ప‌డుకోన‌ప్పుడు నాకెలా తెలుస్తుంది?”, త‌న గొంతు ఎలా ధ్వ‌నించిందో అత‌నికి అర్థం కాలేదు.

“అంటే?  పెళ్లాంతో ప‌డుకోక‌పోతే  దానికి డేటెప్పుడొస్తుందో తెలిసే అవ‌కాశం లేదా?”..  ‘దానితో’ అన్న ప‌దం ప‌లికేట‌ప్పుడు కాస్త వ్యంగ్యం మేళ‌వించ‌డం అమ్మాయి మ‌ర్చిపోలేదు.

“ఎందుకు తెలుస్తుంది?”,  రెట్టించాడ‌త‌ను.

“భూగోళం మీద ప్ర‌తిదీ తెలిసిన‌ట్టు పోజు కొడుతుంటావ్‌. పెళ్లానికి పీరియ‌డ్స్ ఎప్పుడో తెలుసుకోవ‌డం సెక్స్ కోస‌మే అని చెప్ప‌డానికి సిగ్గు లేదూ?”

అంతా అయిపోయింద‌ని అత‌నికి అర్థ‌మైంది. ఇప్పుడేం చేయాలి?  అస‌లీ ప్ర‌శ్న‌కీ, త‌మ రిలేష‌న్‌కీ సంబంధం ఏంటో చెప్ప‌మ‌ని అడ‌గాలా? అడిగితే?

“హోట‌ల్ ఫుడ్ ప‌డ‌ద‌ని మూడుపూట‌లా ఇంట్లోనో ప‌డి తింటావుగా. క‌నీసం మీ ఆవిడ‌కి డేట్ ఎప్పుడొస్తుందో కూడా తెలియ‌దా?  పైగా సెక్సు సుఖం లేద‌ని నీలుగుడొక‌టి”. స‌డెన్‌గా అత‌ని క‌ళ్ల‌కి ఆమె సైకోలా క‌నిపించ‌డం మొద‌లెట్టింది. అక్క‌ణ్నించీ పారిపోదాం అనుకున్నాడు. కానీ ఇన్నాళ్ల క‌ష్టం వృథాగా పోనివ్వ‌డానికి అత‌ని మ‌న‌సొప్ప‌లేదు.

“నాకు హోట‌ల్ ఫుడ్ ప‌డ‌క‌పోడానికీ, మా ఆవిడ డేట్ కీ లింకేంటి?  నువ్వెంత అబ్స‌ర్డ్ గా మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా?”,  త‌ను ఏదో మిస్స‌వుతున్నాడు. అదేంటో ఎంత ప్ర‌య‌త్నించినా త‌ట్ట‌డం లేదు.

“మీ ఆవిడ వండిపెడుతుంటే తింటావ్‌. గాళ్ ఫ్రెండుతో బిజీగా వుంటావ్. మీ ఆవిడ‌కి డేట్ ఎప్పుడొస్తుందో నీకు తెలీదు.  అది సెక్సుకి సంబంధించిన ఇష్యూ అనుకుంటావ్‌. కాబ‌ట్టీ, నెల మొత్తం ఇంట్లో నీ స్కెడ్యూల్ ఒకేలా వుంటుంది.  అంతేగా? అన్‌బిలీవ‌బుల్..!”.

“మ‌ళ్లీ అదే మాట‌. నీకు డేట్ ఎప్పుడొచ్చేదీ నాకు తెలుసు. నా పెళ్లాం సంగ‌తి నాకు తెలియ‌దు.  నీ కోస‌మే నేను వంట చేయ‌డం కూడా నేర్చుకున్నాను తెలుసా?”, నార్మ‌ల్‌గానే మాట్లాడుతున్నా అనుకుంటున్నాడు..

“అస‌లు నేనెందుకు బాధ ప‌డుతున్నానో నీకు అర్థం కావ‌డం లేదు కదూ?”, వ‌ణుకుతున్న గొంతుతో అడిగింది.

అస‌లు ఆ ప్ర‌శ్న ఎందుకు అడిగిందో, ఎందుకు కోపం తెచ్చుకుందో, స‌డెన్‌గా మూడ్ మారిపోయి ఎందుకు ఏడుస్తుందో అత‌నికి అంతా అయోమ‌యంగా ఉంది. కాలం వెన‌క్కి న‌డ‌వ‌ద‌నీ, మ‌ళ్లీ ఈ సాయంత్రం ఫ్రెష్‌గా మొద‌ల‌వ‌ద‌నీ మాత్రం అత‌నికి బోధప‌డింది. చేతిలో ఉన్న మొబైల్ గోడ‌కేసి కొట్టి, అత‌ను బ‌య‌ట‌కి న‌డ‌వ‌డం మొద‌లెట్టాడు. అత‌ను వెళ్లిపోతున్న సంగ‌తి ఆమె ఇంద్రియాల‌కి ప‌ట్ట‌డం లేదు. త‌న పాటికి తాను మ‌ళ్లీ మ‌ళ్లీ అదే మాట అంటూనే  ఉంది.

“అస‌లు నేనెందుకు బాధ ప‌డుతున్నానో నీకు అర్థం కావ‌డం లేదు క‌దూ…”

*

శ్రీధర్ బొల్లేపల్లి

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ప్రైవేట్ గా మాట్లాడే విషయాలు, అందరి ముందూ మాట్లాడే విషయాలూ అంటూ వేరు వేరుగా వుండవు అనే వాక్యం బాగుంది. కథ మొత్తం అందులోనే వుంది! శుభాకాంక్షలు

 • That single question shall bring many more stories untold,never referred to and never considered.Revealing story.thanks .

 • కధ బాగుంది సర్ వాస్తవానికి దగ్గరగా…నాకు తెలిసి 70 శాతం తెలుగు కుటుంబాల్లో మగవాళ్ళు భార్య పీరియడ్స్ ని ఒక విషయంగానే పరిగణించరు, తమ తిండి, సౌకర్యాలకి ఇబ్బందులొస్తే తప్ప. ఆ సమయంలో ఆమెకి శారీరకంగా విశ్రాంతి, మానసికంగా ఆలంబన అవసరమనే ఆలోచన కూడా ఉండదు. ఇలాంటి కధలు, వ్యాసాల ద్వారా ఈ విషయంపైన మరింత చర్చ జరగాలి.

 • బావుంది అనడం కన్న నామనసు బాగా అయింది అని అరుస్తోంది 😂😂

 • బాగుంది అన్న చిన్న మాటతో సరిపెట్టడం కష్టం. ఆ ప్రశ్న ఒక ఆలోచనను రేకెత్తించక మానదు చదివినవారి మనసుల్లో…
  మార్పు క్షణికం కావచ్చు, కొన్నిసార్లు సంభవించకనూ పోవచ్చు. కానీ, సుత్తి దెబ్బ మేకుకు మొదటిసారి తగిలినా సరైన కోణంలోనే తగలడం మాత్రం అది సరైన లోతుకు దిగడానికి తోడ్పడుతుంది. మీ కథ కథనం శైలి అన్నీ అద్భుతంగా నూ ఆలోచింపజేసేవి గానూ ఉన్నాయి శ్రీధర్ గారు. అభినందనలు 💐

  • అసలు ఆమె ఈ ప్రశ్న ఎందుకు అడిగింది ఎందుకు ఏడ్చింది. సందీప్ బార్య ఎందుకు అడగమంది… ఈమె ఎందుకు ఏడుస్తోంది నాకు కాస్త క్లారిటీ ఇవ్వరా… స్టోరీ కొత్తగా బాగుంది.

   • Sandeep is irresponsible at his wife.. if he gets marry again,he can give same pain to next one too..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు