దేహభాష:  లైంగికచర్యల పురుషాధికార ప్రకటన

విత్వమే కాదు కథా ఓ ఉద్వేగ ప్రకటనే. ఒక్కోసారి మౌనం దాచలేని వేదన కథగా మారొచ్చు. అలాంటి కథ సరైన కథనంతో వెలువడితే పాఠకుల హృదయాలను సురకత్తితో మెత్తగా కోస్తుంది. క్షణకాలం సైతం నిలవనీయక ఆలోచనల ఉరవడిలో ముంచెత్తుతుంది. అప్పటివరకు ఉన్న దృష్టిని, దృక్పథాన్ని, దృక్కోణాన్ని మార్చేస్తుంది. నిజానికి మంచి వస్తువుకు, మంచి కథనం ఎప్పుడో, ఎక్కడోకానీ తోడుకాదు. అందుకు కథకులకు వస్తువుతో గాఢమైన అనుభవం ఉండాలి. దానితో అనుభూతి చెందాలి. ఎప్పుడు, ఏది, ఎవరిచేతే, ఏ నేపథ్యం నుంచి, ఏ వస్తువు కథగా అంకురిస్తుందో కచ్చితంగా గిరిగీసి చెప్పలేం. అలాంటి కథ ఎంత పవర్ ఫుల్ గా తయారవుతుందో కూడా అంచనా వేయలేం. అదో సందిగ్థావస్థల సంధ్యాసమయం. కథకుడు మెచ్చిన కథను విమర్శకులు ఒక్కోసారి పట్టించుకోకపోవచ్చు. కానీ ఆ కథ పాఠకుల గుండెలపై చిత్రించే చిత్రమే ప్రధానం.

మనకు తెలిసిన నేపథ్యం నుంచి మనం ఆలోచించని కోణాన్ని పట్టుకొని కథగా మలిచి ఆశ్చర్యచకితుల్ని చేసి, ఆలోచనాలోచనాల్ని తెరిపిస్తున్న కథకులు ఎందరో ఉన్నారు. విమల కవయిత్రిగా అందరికీ సుపరిచితం. ఆమె కథకురాలు కూడా. “కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ల” పేరుతో కథా సంపుటినీ ప్రకటించారు. ఆవిడ రాసిన “దేహభాష” కథ కొన్ని మాటల దృక్పథాన్నే కాదు, వాటి మూలాలనూ ప్రశ్నిస్తుంది. ఉత్తమ పురుష దృష్టికోణంలో నడుస్తూ సంఘర్షణతో మొదలై సంఘర్షణతో ముగిసే ఈ కథ నిండా భాష వెనుక దాగిన అధికారం కనిపిస్తుంది. మాధవి పాత్రచుట్టూ అల్లిని భౌతిక మానసిక సంచలనాల్లోంచి కవిత్వధార వర్షిస్తుంది. అందుకే ఈ కథలో ప్రతి స్త్రీ అంతర్లీనంగా నిప్పుల నదిలా ప్రవహిస్తుంది.

యాభై నాలుగేళ్ల మాధవి తన శరీరం గురించి తనే చెప్పుకోవడంతో కథ మొదలవుతుంది. “దేహభాష” గురించి చర్చించే కథ దేహ వాస్తవిక వర్ణనతో మొదలుపెట్టడంలోనే కథకురాలు సగం విజయం సాధించారని చెప్పొచ్చు. కానీ అలా ఎందుకు ప్రారంభించారో తెలియాలంటే ఎత్తుగడలోని చివరి వాక్యాలైన “ఆడదాని శరీరమంటే మంసపు ముద్దలు కలబోసిన ముద్ద. వట్టి శరీరం మాత్రమే గల ఆడది మాధవి. లోలోన సుళ్ళు తిరుగుతున్న దుఃఖం”లోని మర్మాన్ని గ్రహించాలి. స్త్రీ అస్తిత్వాన్ని ఆమె శరీరంలోనే చూస్తున్న సమాజం గురించి ఎందుకు చెప్పారో అర్థ చేసుకోవాలంటే కథతో పాటు మనమూ ముందుకు సాగాలి.

శరీరానికి భాష ఉంటుందా? అది స్త్రీ నడవడికను నిర్దేశిస్తుందా? ఒక మనిషిని స్త్రీగా తయారుచేస్తుందా? స్త్రీ ఎదుగుదలకు అడ్డుగా మారుతుందా? స్త్రీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుందా? మానసికంగా కుంగదీస్తుందా?… “దేహభాష” శీర్షిక చూశాక ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో పాఠకులను కథలోకి లాక్కెల్తారు రచయిత్రి. ఈ భాష గురించి కథలో మాధవి పాత్ర ద్వారా చాలా చోట్ల ప్రస్తావించారు. అందుకు మాధవి స్పందననూ వర్ణించారు. వాటితోనే “దేహభాష” అర్థాన్ని, పరమార్థాన్ని, శీర్షిక అంతర్గత స్వభావాన్ని పట్టుకోమన్నారు.

 1. అర్థరాత్రి ఫోన్ తీస్తే- మురికినీ, నీచత్వాన్నీ, జుగప్సనీ, అసహ్యాన్ని కలగలిపిన దేహభాష.

అందుకు మాధవి మంచం మీద ముడుచుకు కూర్చుని, మోకాలిపై గడ్డం ఆన్చి, రెప్ప వేయకుండా ఫోన్ వైపే చూస్తోంది. నాగుపాములాంటి ఫోన్ ప్రకంపనాల్ని చూస్తూ ఏ రాత్రో కలతకలతగా, దిగులు దిగులుగా నిద్రపోతుంది.

 1. క్లాసులో పాఠం చెప్తున్నప్పుడు ఫోన్ తీస్తే- ఎవరో నెత్తిన మురుగును కుమ్మరించినట్లు బూతులు.

అందుకు మాధవి శరీరం కోపంతో వణికి, మొఖంలో నెత్తురు చిమ్మి, కడుపులో మెలిపెట్టినట్లు అవుతుంది.

 1. స్టాఫ్ రూమ్ లో- బీరువాల కవతల మగ లెక్చరర్లు ఏవో ద్వంద్వార్థపు మాటలు, హాస్యాలు ఆడవాళ్ళ గురించిన దేహభాష. మెరుగులద్దిన భాష.

అందుకు మాధవి నిర్వికారంగా కూర్చుని గంట మోగగానే వడివడిగా బయటపడుతుంది.

వీటి ద్వారా “దేహభాష” అంటే అసభ్యకరమైన మాటలు, తిట్లు, బూతులు… అన్నీ స్త్రీకి సంబంధించినవేనని తెలిసిపోతుంది పాఠకులకు. వాటికి మాధవి భయపడుతుంది, బాధపడతుంది. హృదయం పిడచకట్టుకుపోయే మౌనాన్ని, ఆలోచనల యుద్ధాన్ని భరించలేక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది.

దేహభాష గురించి సమాజంలో ఇంకా ఎక్కడెక్కడ, ఎవరెవరు, ఎలా మట్లాడుకుంటున్నారో, దాని మూలాలేమిటో వర్ణిస్తారు రచయిత్రి. అది స్త్రీలను ఏ విధంగా బాధిస్తుందో గుండెతడితో వివరించి పాఠకుల మనసులని చలింపజేస్తారు.

 1. ఆఫీసుల్లో, బస్సుల్లో, మూసిన ఇంటి తలుపుల వెనుక, వాడవాడల్లో, వీధికొట్లాటల మధ్య- బూతు నదుల ప్రవాహాల్లో మునిగితేలుతూ… ఎవరు వాళ్లు? ఎవరి తల్లులు, భార్యలు, అక్కచెల్లెళ్లు, బిడ్డలు…? వావి వరుసలు లేని ఎవరెవరు మగాళ్ళకూ, చివరికి జంతువులకు కూడా తమ శరీరాల్ని పరుస్తూ.. పశుభాష, మగవాడి దేహభాష. తాగిన మొగుడు కొడుతూ తిట్టే తిట్లని తలుచుకుంటూ “… గా తిట్లకి గుండె జల్లెడ తీరుగ చిల్లులు బడ్తదమ్మ, బిడ్డల ముందు, బజాట్ల, ఎవరి ముందున్నా తిడ్తడు. గా లం.. కొడుకు నోట్ల మన్నువడ” అంది పని మనిషి ఓ సారి.
 2. సినిమాల్లో, పత్రికల్లో, సెల్ ఫోన్ లలో, ఇంటర్ నెట్ లలో ప్రవహిస్తున్న స్త్రీల నగ్న శరీరాలు- నర్తిస్తున్న స్త్రీల అంగాల గురించి… రాయండి… మాట్లాడండి రామకోటిలా కాలేజీగోడలపైన, రైళ్ళలో, టాయిలెట్లలో, ఆఫీసుల్లో, ఇళ్ళలో బూతు నదుల ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆడవాళ్ళ ఆర్తనాదాలు…
 3. రద్దీగా ఉన్న రోడ్డుపై నడుస్తుంటే మళ్ళీ అవే మాటలు. ఇద్దరు ఆటోవాళ్ళు తిట్టుకుంటున్నారు. వాళ్ల ఆమ్మలనీ అక్కలనీ. “తనను కాదు… తననికాదు… కానీ తనలాంటి ఆడవాళ్ళనే” మాధవి చెవులు మూసుకుంది.

“దేహభాష” ఎవరి చుట్టూ అల్లబడిందో చెప్తూ, సమాజంలో ప్రతి చోటా ఆ విషపుభాష విచ్చలవిడిగా చలామణి అవుతూ, స్త్రీలను ఎలా అగౌరవపరుస్తోందో, ఆత్మాభిమానాన్ని ఎలా దెబ్బతీస్తుందో, మానసికంగా ఎలా నరకంచూపెడుతుందో తేటతెల్లం చేసి కథా శీర్షికకు న్యాయం చేశారు రచయిత్రి. కొందరు ఈ భాషకు మెరుగులద్దినా, అది వాళ్ళ లోపలున్న అధికారాన్ని, లైంగిక ఆధిపత్య స్వభావాన్ని తెలిపేదేనని ముసుగులు తొలిగించి బహిర్గతం చేశారు విమల.

కథలో ఎక్కడా “దేహభాష”కు సంబంధించిన పదజాలం వాడరు. కానీ ఆ భాష ఎంత తీవ్రంగా ఉంటుందో, దాని ప్రభావం ఎంత వేదనాభరితమో కథ చదివిన ప్రతిఒక్కరి గుండె బరువెక్కేలా చూపారు కథకురాలు. చెప్పదలుచుకున్న అంశాన్ని అక్షరరూపంలో లిప్తం చేసి సన్నివేశాలు, పాత్రల మానసిక సంఘర్షణలు, స్పందనలు, ప్రతిస్పందనల ద్వారా చూపించారు. అసభ్యాన్ని సభ్యసమాజం తలదించుకునేలా సభ్యతగా చిత్రించడం రచయిత్రిలోని శిల్పచాతుర్యానికి, వస్తువుపై ఉన్న గాఢమైన అభినివేశానికి నిదర్శనం. “దేహభాష” అంటే స్త్రీ శరీరాన్ని జుగుప్సగా, నీచంగా, అసహ్యంగా బూతులతో చూపే పదజాలమని మొదటే చెప్పారు. ఆ తర్వాత వాటి పూర్వాపరాలను కూలంకషంగా వివరించారు.

కథలో మరో మూడు విషయాలనూ చర్చించారు రచయిత్రి. ఒకటి మాధవి ట్యాంక్ బండ్ కు ప్రశాంతతకోసం వెళ్లి, అశాంతిని పొందేది. మరొకటి వివాహంలోని వ్యాపార దృక్కోణం. ఇంకొకటి దళిత, స్త్రీ భావజాలాలకు సంబంధించినది. వీటిని మాధవి జీవితంలో భాగంచేసి కథలో అతర్లీనం చేశారు కథకురాలు. కథా శీర్షిక “దేహభాష”కు  చాలా జాగ్రత్తగా ఇంటర్ లింక్ చేశారు.

ఒకటి- “ట్యాంక్ బండ్ సాయంత్రపు అందాలను ఆశ్వాదిస్తూ, వెలుగు నీడల మధ్య బుద్ధుడు చెబుతున్న జీవన సత్యాలను వింటూ, అశాంతి – శాంతి భావనలో చెమ్మగిల్లిన కళ్లను మూసుకుని కూర్చొన్న మాధవిని అపరిచితుడు మెడపై నొక్కడం”. అంతేకాదు “వస్తావా?, ఎక్కడికైనా?” అంటూ బూతులతో వాడి ఉద్దేశాన్ని చెప్పడం”. ఆ అడగడం వెనక ఉన్న స్త్రీ శరీర అమ్మకాన్ని నేరుగా విమర్శకు పెడతారు రచయిత్రి. ఇదీ “దేహభాష”కు సంబంధించినదే.

మరొకటి- మాధవి తన పెళ్లిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ “భార్యాభర్తల మధ్య కూడా వ్యక్తం చేయలేని శరీర వ్యాపారం. ‌డబ్బు ప్రసక్తి లేని వ్యాపారం జరుగుతుందా?” అని అడుగుతుంది. “మనసుకు, శరీరానికి వుండాల్సిన సంబంధం తెగిపోయిన మొదటిరాత్రి” అంటూ భర్యాభర్తల బంధం వెనక ప్రేమ, అభిమానం, అవసరం కాదు… కట్నమనే వ్యాపారమేనని నిక్కర్షగా, నిజాయితీగా మాధవి ద్వారా చెప్పిస్తారు విమల. వాళ్ల అమ్మ గురించి మొదట్లో చెప్పడం ఈ ఆలోచనకు ఇచ్చిన ‘క్లూ’ లా కనిపిస్తుంది. “నాన్న చనిపోయాక దొరికిన స్వేచ్ఛా ప్రపంచాన్ని, ఏకాంతాన్ని అమ్మ ఇష్టంగానే అనుభవిస్తుందంటాడు మాధవి తమ్ముడు”. ఈ అభిప్రాయాన్ని పురుష పాత్రతో చెప్పించడాన్ని రచయిత్రి దృష్టితో, లేదా ఆ పాత్ర స్వభావంతో  మాత్రమే చూడాలి.

ఇంకొకటి- మాధవిని ప్రేమించిన దళితక్రిస్టియన్ దయాసాగర్ ఇంటికొచ్చి మాధవిని పెళ్లిచేసుకుంటానని ధైర్యంగా చెప్పినప్పుడు అతడ్ని, అతడి కులాన్ని ఆమె తండ్రి బూతులు తిడతాడు. మాధవిని కొడతాడు. అందుకు దయాసాగర్ “మీ కులాల వాళ్ళు మాట్లాడే బూతుల్ని, అవమానాల్ని, వంచనలనీ తొక్కుకుంటూ మేం ముందుకుపోతున్నాం” అని దళిత అణివేత గురించి ప్రస్తావిస్తాడు. అందుకు ప్రతిస్పందనగా మాధవి “తన తండ్రి లాంటి వాళ్ళు నీతో ఎలా ప్రవర్తిస్తారో కొంచెం హెచ్చు తగ్గులతో నాతోనూ అలాగే ప్రవర్తిస్తార”ని అనలేకపోతుంది. ఇక్కడ “దేహభాష” కేవలం స్త్రీలకే కాదు, దళితులను తిట్టేందుకూ వాడుతున్నారన్న వాస్తవాన్ని చెప్పారు కథకురాలు. అందుకు ఫ్లాష్ బ్యాక్ కథనాన్ని వాడుకుని, మాధవి పాత్రలోని అంతర్మథనం ద్వారా వ్యక్తం చేశారు. కథలో “దేహభాష”కు ఇచ్చిన నిర్వచనాన్ని దళితుల పరంగా వివరించి  శీర్షిక పరిదిని మరింత విస్తృతం చేశారు.

అక్కడక్కడా చిక్కనైన పదబంధాలు, ఆ బంధాలను వాక్యాలతో స్రవంతిలా అల్లి కథను మరింత ఆకర్షణీయంగా రాశారు రచయిత్రి. కథనానికి, వస్తువుకు సరిపోయేటంత మోతాదులో వాక్యాలను సందర్భోచితంగా కవిత్వమయం చేశారు. “ట్యంక్ బండ్ మీద అస్తమిస్తున్న సూర్యుడి లేత పసుపు ఎరుపుల వెలుగు నీడలు చూస్తూ, బెంచీమీద కూర్చుంది. దూరంగా నీళ్ళలో నిర్వికారంగా నిలబడ్డ బుద్ధుడి విగ్రహం పై నుండి జారిన వెలుతురు నీళ్ళపై మెరుస్తుంది.” ఇవి మాధవి అంతరంగానికి ప్రతీకలు.

మరోచోట సమాజంపై లెక్చరర్ మాధవి ఆలోచనల తీవ్రతలోంచి ప్రశ్నలు సందిస్తూ, పురుషాధిక్య ప్రపంచానికి పట్టిన బూజు దులిపేస్తూ, మార్పును ఆహ్వానిస్తూ “ఆడదాని పట్ల ఇట్లాంటి సంస్కారాన్ని, భాషని వాళ్ళకి ఇచ్చినవాళ్ళెవరు? … … తల్లిపాలు తాగి, రొమ్ములతో ఆడుకున్న ఒకప్పటి పిల్లలు వాళ్ళు. ఈ పాఠాల్ని తగలబెట్టి, మొదట స్త్రీలని సాటి మనుషులుగా గౌరవించాలని చెప్పే పాఠాల్ని తరగతి గదుల్లోకి ఎవరు తీసుకొస్తారు?” అంటుంది రచయిత్రి.

కథలో పాత్రలు ఏం చేశాయి? ఎలా చేశాయి? కథా గమనాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాయి? లేక అడ్డుపడ్డాయా అనే దృష్టితో చూస్తే మాధవికి వచ్చే ఫోన్ కాల్స్ ఇబ్బంది పెట్టడం, వాటికి పరిష్కారం దొరకడంతో కథ పూర్తవుతుంది. కానీ మాధవి ఫోన్ చేసిన వాళ్లకు శిక్షవేయించకుండా సమాజం గురించి, అలాంటి వాళ్ల గురించి… ఆలోచనల్లో మునిగిపోతుంది. ఒకవేళ శిక్ష వేయించినా సమస్య అంతటితో ముగిసేది కాదు. ఆ సమస్య మాధవి ఒక్కరిదే కాదు. స్త్రీలందరిదీ. అందుకే దాని వెనకున్న మగవాడి లైంగిక అధికార ప్రకటనగా చెలామణి అయ్యే సాంస్కృతిక, ఆర్థిక వారసత్వాన్ని బద్ధలుకొట్టాలని చెప్తుంది. ఇలా రచయిత్రి కథకు వాస్తవీకరణ దృష్టితో చైతన్యవంతమైన ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు.

“ఆడవాళ్లు కూర్చోగలిగిన బహిరంగ స్థలం ఎక్కడైనా ఉందా?” అని మధ్యలో విమల వేసిన ప్రశ్న కథకు గుండెకాయలాంటిది. ఇది కేవలం సమాజపరంగా భౌతికమైనదే కాదు, మనిషి హృదయంపై ఎక్కుపెట్టిన బాణం కూడా…

దేహభాష

 • -విమల

దువ్వెనకి చిక్కుకున్న నలుపు తెలుపుల జుట్టు. కళ్ల కింద నల్లటి చారలు. అలసి సొలసి కన్నీరింకిన కళ్లు. ముడతలు కమ్ముకుంటున్న మొఖం. చేతివేళ్లు, సడలిన రొమ్ములు, నడుం చుట్టూ వేలాడుతున్న కండలు. కొద్దిగా జారిన పొట్ట. అద్దం ముందు నిలబడ్డ మాధవి పెదవుల పై వాడిన నవ్వు. ముసల్దాన్నయిపోయాను అనుకుంది. చీరను నడుం చుట్టూ తిప్పి, కొంగు తీసి సరిచూసుకుని, గబగబా కుచ్చిళ్లు పోసు కుని చెక్కుకుంటూ వుంటే కనపడింది బొడ్డు. భూగోళం తిరిగేలా చేసే నాభి. ఆడదాని నాభి… వయసుతో నిమిత్తం లేని నాభి…టీవీ తెరపై నడుం ఊపుతున్న హీరోయిన్ శరీరభాగాల్ని ఊపుతూ, తూలుతూ పిలుస్తోంది అఖిలాండ కోటి మగవాళ్లని. ఆడదాని శరీరమంటే మాంసపు ముద్దలు కలబోసిన ముద్ద. వట్టి శరీరం మాత్రమే గల ఆడది మాధవి. లోలోన సుళ్లు తిరుగుతున్న దుఃఖం.

“నా వయస్సు యాభయి నాలుగేళ్లు. నీకు తల్లిలాంటిదాన్ని,” అంది మాధవి.

“అయితే నేం నీకు…” అంటూ తన శరీరభాగాల్ని వర్ణించి… వుంటే చాలన్నాడు. ఎవడు వాడు? అర్ధరాత్రి ఫోన్ వస్తే గబుక్కున ఉలిక్కిపడి తీసింది.

ఊర్లో వున్న అమ్మకి ఒంట్లో బాగాలేదు. అమ్మ ఫోన్ చేసిందేమో నని ఎత్తితే… ఎవడో, వాడెవడో తెలీనివాడు, ఒక తల్లికి పుట్టినవాడే, మాట్లాడుతున్నాడు. మురికినీ, నీచత్వాన్నీ, జుగుప్సనీ, అసహ్యాన్నీ కల గలిపిన దేహభాషని. పెట్టేసింది. ఆ ఫోన్ రాత్రి పన్నెండుసార్లు మోగి, మోగి చివరికి ఎప్పుడు ఆగిందో గుర్తులేదు. మంచం మీద ముడుచుకుని కూర్చుని, మోకాలి పై గడ్డం ఆన్చి, రెప్పవేయకుండా ఫోన్ వైపే చూస్తోంది మాధవి. పడగవిప్పిన నాగుపాములా, నిశ్శబ్దంగా వెలుగుతూ, కదులుతూ ఉందది. ఆ నాగుపాము ప్రకంపనాల్ని చూస్తూ ఏ రాత్రో కలత కలతగా, దిగులు దిగులుగా నిద్రపోయింది మాధవి.

మర్నాడు సెల్ ఫోన్ గొంతు నొక్కి, నిద్రిస్తున్న నాగుపాము వంటి ఫోన్ ను టేబుల్ పై పడుకోబెట్టి, పాఠం చెబుతోంది మాధవి. అబ్బాయిలు, అమ్మాయిల మొహాల మీద అమాయకత్వం, అరాచకత్వం, వెకిలితనం, తెంపరితనపు నిర్లక్ష్యం, భయం, నిరాసక్తత… పిల్లల ముఖాలపై పాకే భావాల్ని చదవటం అలవాటైపోయింది మాధవికి. గవర్నమెంటు డిగ్రీ కాలేజిలో ఫైనలియర్ పిల్లలకి అర్థశాస్త్రం బోధిస్తోంది. ఎవరి ప్రపంచంలో వాళ్లున్నారు. వినేవాళ్లు, వింటున్నట్లు నటించేవారు, ఎలాంటి నటనా అక్కరలేదనుకునేవాళ్లు. ఇట్లా ఎందర్ని చూసిందో మాధవి ఇన్నేళ్లలో టేబుల్ పైన ఫోన్ మోగుతోంది నిశ్శబ్దంగా కదులుతూ. పట్టించుకోకుండా పాఠం చెబుతూ వుంటే. “మేడం! ఫోన్ మోగుతోంది,” అన్నాడో పిల్లవాడు. అమ్మ ఆరోగ్యం గుర్తొచ్చింది మళ్లీ. ఊర్లో ఉన్న పాత ఇంట్లో, పొలం కౌలుకిచ్చి, నాన్న పెన్షన్ డబ్బులతో గడుపుతోంది.

ఇంట్లో మనుషుల్లా కలిసిపోయిన అద్దెకుండేవాళ్లు, ఊర్లో ఉన్న బంధువులు అమ్మకి సాయపడుతున్నా మాధవికి ఎప్పుడూ, ‘అమ్మనలా వదిలేశానే’ అని మనసులో గుచ్చుకుంటూనే వుంటుంది. అమ్మ ఇక్కడికి రాదు. నాన్న చనిపోయాక దొరికిన స్వేచ్ఛాప్రపంచాన్ని, ఏకాంతాన్ని అమ్మ ఇష్టంగానే అనుభవిస్తుందంటాడు మాధవి తమ్ముడు. క్లాస్ రూం నుంచి ఫోన్ పట్టుకుని గబగబా బయటకెళ్లింది మాధవి. ఏదో తెలియని నెంబర్. నాలుగు మిస్డ్ కాల్స్. చేయాలా వద్దా. మళ్లీ ఎవడో… ఎలాంటి మాటలు మాట్లాడతాడో! క్షణంపాటు తటపటాయించి మిస్డ్ కాల్ ను నొక్కింది.

“మధూ !”

ఎవరు పిలుస్తారట్లా? నాన్నా, తమ్ముడా, చనిపోయిన భర్త శ్రీధరా, ఎవరు, ఎవరిదా ఆత్మీయత నిండిన గొంతు… మళ్లీ అంతే ఆర్ద్రంగా పిలిచిందా గొంతు మాధవిని.

“ఎవరు, ఎవరు మాట్లాడుతున్నారు.”

“నువ్వు మాధవివే కదా! నేనా, నేనెవరంటే…” ఎవరో నెత్తిన మురుగును కుమ్మరించినట్లు బూతులు. టక్కున ఫోన్ కట్ చేసింది. శరీరం కోపంతో వణికి, మొఖంలో నెత్తురు చిమ్మి, కడుపులో మెలి పెట్టి నట్లయింది. రాబోతున్న ఏడుపును అణచుకుని, వెనక్కి తిరిగి చూస్తే, పిల్లలు తనకేసి ఆసక్తిగా చూస్తూ కనిపించారు. తనను తాను కంట్రోల్ చేసుకుని, నెమ్మదిగా క్లాస్ రూంలోకొచ్చి కుర్చీలో కూలబడింది. పిల్లలేవో అడుగుతున్నారు. యాంత్రికంగా జవాబులు చెప్పి, బెల్ మోగగానే లేచి, స్టాఫ్ రూంలోకి అడుగు పెట్టింది.

ఆ గదిలో రెండు బీరువాలు గోడలా అడ్డు పెట్టిన ఓ మూల లేడీ లెక్చరర్లు కూర్చుంటారు. తెలుగు మేడం చీర పై అద్దాలు, చమ్కీలు కుట్టుకుంటూ చిన్నగా నవ్వింది.

మీసాలకీ, తలకీ రంగేసుకున్న హిస్టరీ లెక్చరర్ “ఏందో, సీరియస్ గున్నరీ రోజు? చాయ్ తాగుతారా?” అడుగుతున్నాడు. ఇంకో ఏడాదిలో రిటైర్ అవుతాడాయన.

మొఖంలో అసహ్యం కనపడకుండా మామూలుగా పెట్టి “వద్దు” అంది. మనుష్యులకీ, మాటలకీ చిక్కకుండా తప్పించుకుని బతుకు తున్నపుడు. శ్రీధర్ చనిపోయిన ఏడాది కనుకుంటాను ఒకటి రెండుసార్లు ఇంటికొచ్చి చనువుగా, ఓదార్పుగా, సహాయం చేసేవాడిలా మాట్లాడబోతే, ఇట్లా ఇంటికి రావడం తనకి ఇష్టం వుండదంది మాధవి.

“ఒక్కరే ఎట్ల వుంటారు మేడం! రాత్రిపూట భయం వేయదా?” అడిగాడొకసారి.

“రాత్రి నేను రానా, భయం వేయకుండా?” అనే అతడి అంత రంగం అర్థమయి. జాగ్రత్త…. జాగ్రత్త…. అని తనకి తాను చెప్పుకుంది మాధవి. బీరువాల కవతల మగ లెక్చరర్లు. ఏవో ద్వంద్వార్థపు మాటలు, హాస్యాలు. ఆడవాళ్ల గురించిన దేహభాష… మెరుగులద్దిన భాష. ఆ గదిలో ఆడవాళ్లు కూడా ఉన్నారన్న స్పృహ ఎవరికీ లేదు. అలాంటి గదిలో నిర్వి కారంగా కూర్చుని గంట మోగగానే వడివడిగా బయటపడింది మాధవి. ఇంటికెళ్లాలనిపించటం లేదు. ఎక్కడికెళ్లగలదు? ఒక్కతే, కాస్సేపు ప్రశాంతంగా కూర్చోగలిగిన చోటు. ఆడవాళ్లు కూర్చోగలిగిన బహిరంగ స్థలం ఎక్కడైనా ఉందా?

అప్పుడెప్పుడో ఒకసారి. ఇట్లాగే మనసంతా దిగులు, దిగులుగా బాధగా వున్న రోజు రాణీగంజ్ వద్ద బస్సుదిగి, ఒక్కతే నడుచుకుంటూ వచ్చి, ట్యాంక్ బండ్ మీద అస్తమిస్తున్న సూర్యుడి లేత పసుపు ఎరుపుల వెలుగునీడల్ని చూస్తూ, బెంచీ మీద కూర్చుంది. దూరంగా నీళ్లలో నిర్వి కారంగా నిలబడ్డ బుద్ధుడి విగ్రహం పై నుండి జారిన వెలుతురు నీళ్ల పై మెరుస్తోంది. పాదచారుల్ని, పల్లీలమ్మేవాళ్లని, వాహనాల రొదని పట్టించు కోకుండా తన ఆలోచనల్లో తాను మునిగితేలుతూ అలా కూర్చుండి పోయింది మాధవి. వీధిలైట్ల వెలుతురు చుట్టూ పరుచుకుంది. ఆకాశంలో మసక వెన్నెల. ఆ వెలుగు నీడల మధ్య నిలబడ్డ బుద్ధుడు జీవనతత్వా న్నేదో చెబుతున్నట్లనిపించి, అశాంతి-శాంతి భావనలతో కళ్లు చెమ్మగిల్లి నట్లయి ఒక్కక్షణం కళ్లు మూసుకుంది. ఎవరిదో చేయి మెల్లగా పాకి, మెడపై నొక్కుతూ… ఒక్కసారి ఉలిక్కిపడి, ఒళ్లు జలదరించి, వెనక్కి తిరిగితే, ఎవడో అపరిచితుడు. మొఖానికో నవ్వు పులుముకుని అడుగుతున్నాడు.

“వస్తావా?”

“ఎక్కడికి?” అర్థంకాక, అప్రయత్నంగా అడిగింది మాధవి. “ఎక్కడికైనా సరే” అంటూ వాడో బూతు మాట మాట్లాడాక వాడి మాటల అంతరార్థం అర్థమై,

“నేనట్లాంటిదాన్ని కాను,” అంది గభాల్న లేచి నిలబడి. ఈ చీకటిలో, వాడ్ని తిట్టేందుకు కూడా భయపడి, వడివడిగా ముందుకు నడిచి, ఖాళీగా వస్తున్న ఆటోనాపి, కూలబడింది.

ఎల్లాంటి చోటిది? పగలు మర్యాదగా ఉండి రాత్రుళ్లు శరీర బేరాలు, అమ్మకాలు జరిగే విపణి వీధులా ఇవి? మరి తన ఇల్లు… తన ఇల్లూ అట్లాంటిదేనా?

అట్లాంటి దాన్ని కాను అంటే ఏమిటి? డబ్బులకి శరీరాన్ని అమ్ము కునే వ్యభిచారిని కాననే కదా ? ఎవరికి ఇచ్చింది తన శరీరాన్ని? డబ్బులు పుచ్చుకోకుండా ఒక్కడికే ఇచ్చేసిందా? భార్యాభర్తల మధ్య కూడా వ్యక్తం చేయని శరీర వ్యాపారం, డబ్బు ప్రసక్తి లేని వ్యాపారం జరుగుతుందా? చనిపోయిన తన భర్త, అతడు తిరిగి తనకేమిచ్చాడీ బేరంలో? తన దేహం నుండి మనసులాంటిదేదో వేరై, అతడు తనని ఆక్రమిస్తుంటే, వద్దనలేక, పారిపోలేక, గడ్డకట్టిన కన్నీళ్లని లోలోన దాచుకుని. తనకి సిగ్గు, భయం అనుకున్న ఆ తొట్టతొలి అనుభవం… మనసుకీ, శరీరానికీ మధ్య వుండా ల్సిన సంబంధం తెగిపోయిన మొదటిరాత్రి. ఆ తరువాత, భర్తతో అలాంటి రాత్రులెన్నో గడిపాక ఒక కొడుకు పుట్టాడు. తాను ప్రేమించి పెళ్లాడాలను కున్న దయాసాగర్ మనసు అడుగుపొరల్లోకి చేరి మసకేసి మామూలు జ్ఞాపకమైపోయాడు.

యూనివర్సిటీలో ఎం.ఎ. చదువుకునే రోజుల్లో అతడు మాధవి క్లాస్ మేట్. అందమైన తెలివైన దళిత క్రిస్టియన్. తాము విశాఖ సముద్రం ఒడ్డున కట్టుకున్న పిచుక గూళ్లు, సముద్రపు అలల్ని చూస్తూ చెప్పుకున్న కబుర్లు, అందమైన సాయంత్రాలు, పెళ్లి చేసుకోవాలనుకున్న బాసలు ఒక కొలిక్కి రాకముందే ఎవరు రాశారో తెలీదు. మాధవీ, దయాసాగర్ల పేర్లు కాలేజీ గోడల పై కెక్కాయి. ‘కూతురి రాసలీలలు’ అంటూ మాధవి గురించి అసభ్యంగా రాసిన ఆకాశరామన్న ఉత్తరం. ఆ ఉత్తరం చదివిన మాధవి తండ్రి కోపంతో ఊగిపోయాడు. దయాసాగర్ ధైర్యంగా ఇంటి కొచ్చి మాధవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. అతడ్ని, అతడి కులాన్ని బూతులు తిట్టేందుకు ఒక్కక్షణం కూడా వెనుకాడలేదు మాధవి తండ్రి. మాధవి అడ్డుపడబోయింది. మాధవి చెంపలు పగుల గొట్టి, బూతులు తిడుతూ, జుట్టు పట్టుకుని ఇంట్లోకి ఈడ్చుకెళ్లాడు తండ్రి.

ఆ తరువాత కొన్నాళ్లకి దయాసాగర్ ని కలిసి, తనను మర్చి పొమ్మని, తల్లిదండ్రుల్ని ఎదిరించలేనని కన్నీళ్లతో చెప్పుకుంది మాధవి. తన తండ్రి తిట్టినందుకు క్షమార్పణ చెపితే చిత్రంగా నవ్వాడతను. “మీ కులాలవాళ్లు మాట్లాడే బూతుల్ని, అవమానాల్ని, వంచనలనీ తొక్కు కుంటూ మేం ముందుకు పోతున్నాం. ఆ గుంపు నుండి విడివడ్డదాని వనుకుని పొరపాటుపడ్డాను నేనే,” అన్నాడు. ఆ గుంపులో తనను కలిపి నందుకు బాధపడుతూ, ‘మా నాన్న, అతనిలాంటి వాళ్లు నీతో ఎలా ప్రవర్తి స్తారో కొంచెం హెచ్చుతగ్గులతో నాతోనూ అలాగే ప్రవర్తిస్తార, ని అనలేక పోయింది మాధవి. ఆ తరువాత అతనెప్పుడూ ఆమెకు జీవితంలో తారసపడలేదు.

హైదరాబాద్ వచ్చి, ఉస్మానియాలో చదువు పూర్తి చేసి, ఉద్యోగం సంపాదించి, తమ కులం వాడితోనే తలవంచుకుని తాళి కట్టించుకుంది. అట్లా గడిచిపోయింది జీవితం. భర్త చనిపోయాక మరీ ముఖ్యంగా కొడుకు చదువు, ఉద్యోగం అంటూ అమెరికాకి వెళ్లిపోయాక, మరీ ఒంటరిదైపోయింది మాధవి.

వేడినీళ్లతో తలంటుస్నానం చేసి, బాల్కనీలో మొక్కల మధ్య పడక్కుర్చీలో కూర్చుంది మాధవి. వెనక్కి వాలి పుస్తకం తెరిచినా ఎందుకో చదవాలనిపించలేదు. గాలికి తలలూపుతున్న కొబ్బరాకుల్ని చూస్తూ వుంటే ఏవేవో ఆలోచనలు కమ్ముకున్నాయి. ఆఫీసుల్లో, బస్సుల్లో, మూసిన ఇంటి తలుపుల వెనుక, వాడవాడల్లో, వీధికొట్లాటల మధ్య- బూతు నదుల ప్రవాహాల్లో మునిగితేలుతూ… ఎవరు వాళ్లు ? ఎవరి తల్లులు, భార్యలు, అక్కచెల్లెళ్లు, బిడ్డలు? వావి వరుసలు లేని ఎవరెవరో మగాళ్లకూ, చివరకి జంతువులకు కూడా తమ శరీరాల్ని పరుస్తూ… పశు భాష, మగవాడి దేహభాష. తాగిన మొగుడు కొడుతూ తిట్టే తిట్లని తలుచు కుంటూ… “గా తిట్లకి గుండె జల్లెడ తీరుగ చిల్లులు బడ్జదమ్మ, బిడ్డల ముందు, బజాట్ల, ఎవరి ముందన్నా తిడడు. గా లం… కొడుకు నోట్ల మన్నువడ,” అంది పనిమనిషి ఓసారి. మళ్లీ ఆడదాన్నే… మళ్లీ… మళ్లీ…

ఎవరికిచ్చాను నా ఫోన్ నంబర్ కొత్తగా,’ మాధవికి అంతుచిక్కటం లేదు. రెండు, మూడు నెలలుగా మూడు నాలుగు నెంబర్ నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయ్ మాధవికి. వారం పదిరోజులు ఎలాంటి కాల్సూ ఉండవు. హఠాత్తుగా వేళకాని వేళల్లో మోగుతుంది ఫోన్. ఆ మధ్య స్టాఫ్ మీటింగ్ జరుగుతుండగా, ఫోన్ మోగితే హడావిడిగా తీసింది. ఎవడో మాట్లాడుతున్నాడు అవతలివైపు నుండి అసభ్యంగా. ఏం చేయాలి తానిప్పుడు? పదేళ్లుగా వాడుతున్న తన ఫోన్ నెంబరు మార్చేయాలా? లేక ఫోన్ చేసిన వాడితో సరసంగా మాట్లాడి, వాడినో చోటుకి రప్పించి, ఎవరితోనన్నా తన్నించాలా? తన తమ్ముడినీ, తెలిసినవాళ్లనీ అందరినీ సాయం అర్థించాలా? ఏం చేయాలిప్పుడు? తనకు ఫోన్ చేస్తున్నవాళ్లు ఏం మాట్లాడుతున్నారో అందరికీ చెప్పుకుని, మళ్లీ అసహ్యపడి…

తనకొచ్చిన ఫోన్ కాల్స్ వివరాలు పోలీసులకిచ్చి స్టేషన్లో ఫిర్యాదు చేసింది చివరికి మాధవి. ఓ రోజు కాలేజీలో ఉండగా స్టేషన్ కు రమ్మని ఫోన్ వస్తే వెళ్లింది. ఎలా ట్రేస్ చేసి పట్టుకున్నారో చెబుతున్నాడు ఇన్ స్పెక్టర్. “ఇట్లాంటి లం..కొడుకుల్ని చెప్పుదీసుకు కొట్టాలి.” మాధవికి ఫోన్ చేసిన వాళ్ల తల్లుల్ని తిడుతున్నాడు ఇన్ స్పెక్టర్.

“చూస్తారా! పక్కగదిలో వున్నారు,” ఇన్ స్పెక్టర్ పక్కగది కర్టెన్ కొద్దిగా తొలగిస్తే తొంగిచూసింది. ముగ్గురు నేలపై కూర్చుని ఉన్నారు. వాళ్లలో ఒకడు నడివయసు దాటినవాడు. ఇద్దరు ఇరవయ్యేళ్లయినా లేని పిల్లలు. తలవంచుకుని ఇద్దరూ చిన్నగా ఒకరితో ఒకరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. ఆ పిల్లల్ని చూశాక… లోపలికెళ్ల కుండానే గభాల్న వెనక్కి తిరిగింది మాధవి.

“టాయిలెట్ లో రాసుందట మీ పేరు, నెంబరు. బహుశా కాల్ గళ్ అనుకుని, సరదాగా…”

మాటలతో ఆత్యాచారం చేయడం సరదానా… “నా వివరాలు వాళ్లకి చెప్పారా మీరు,” అడిగింది మాధవి. “లేదు. గుర్తుపడతారా వాళ్లని,” అడిగాడు ఇన్ స్పెక్టర్.

“ఆ పిల్లలు… ఆ పిల్లలిద్దరూ నా స్టూడెంట్స్,” అంది మాధవి.

ఆమె గొంతు దుఃఖంతో వణికింది. ఆడదాని పట్ల ఇట్లాంటి సంస్కారాన్ని. భాషని వాళ్లకి ఇచ్చినవాళ్లెవరు? తన కొడుకు… తన కొడుక్కన్నా చిన్నవాళ్లీ పిల్లలు. ‘నీ వయసెంతైతేనేం. నువ్వెవరైతేనేం, ‘అంటూ తన అవయవాల గురించి మాట్లాడిన పిల్లలు. ఏమవుతారీ పిల్లలు రేపు. తల్లులతో, భార్యలతో, అక్కచెల్లెళ్లతో, బిడ్డలతో ఎంతటి హీనమైన భాషనైనా మాట్లాడగల మగపిల్లలు. ఇల్లాంటి వాళ్లకి, ఇట్లానే ఎదిగి ఎదిగి నడివయసువాడైన ఆ గదిలో తలవంచుకు కూర్చున్న మగాడిలాంటి వాళ్లకి తాను అర్థశాస్త్రం పాఠాలు బోధిస్తుంది. తల్లిపాలు తాగి, రొమ్ములతో ఆడుకున్న ఒకప్పటి పిల్లలు వాళ్లు. ఈ పాఠాల్ని తగలబెట్టి, మొదట స్త్రీలని సాటి మనుషులుగా గౌరవించాలని చెప్పే పాఠాల్ని తరగతి గదుల్లోకి ఎవరు తీసుకొస్తారు? సినిమాల్లో, పత్రికల్లో, సెల్ ఫోన్లలో, ఇంటర్నెట్ లలో ప్రవహిస్తున్న స్త్రీల నగ్న శరీరాలు. నర్తిస్తున్న స్త్రీల అంగాంగాల గురించి… రాయండి… మాట్లాడండి రామకోటిలా. కాలేజీ గోడల పైన, రైళ్లలో, టాయిలెట్లలో, ఆఫీసుల్లో, ఇళ్లల్లో బూతు నదుల ప్రవాహంలో కొట్టుకు పోతున్న ఆడవాళ్ల ఆర్తనాదాలు… ఏంచేయాలి తాను?

ఆ పిల్లల ముందుకొచ్చి నిలబడి తానెవరో వాళ్లకి చెప్పాలా? హెచ్చరించి వదిలేయమనాలా? కేసు నడిపి వాళ్లని శిక్షించాలా? తనతో వాళ్లేం మాట్లాడారో కోర్టులో బోనెక్కి చెప్పి, మళ్లీ కాలేజిలో తన పేరు గోడల మీదకి ఎక్కేలా చేసుకోవాలా? ఏంచేయాలి తానిప్పుడు? మాధవి షాక్ తిన్నదానిలా బయటకు నడిచింది. వెనకనుండి ఇన్ స్పెక్టర్ పిలుస్తు న్నాడు. రద్దీగా ఉన్న రోడ్డు పై నడుస్తుంటే మళ్లీ అవే మాటలు. ఇద్దరు ఆటోవాళ్లు తిట్టుకుంటున్నారు… వాళ్ల అమ్మలనీ అక్కలనీ. ‘తనను కాదు.. తనని కాదు… కానీ తనలాంటి ఆడవాళ్లనే.’ మాధవి చెవులు మూసుకుంది.

ఆ తిట్ల మధ్య దీనంగా హీనంగా నిలబడి- ఇంకా తన తరగతిలో అట్లాంటి పిల్లలు ఎంతమంది వున్నారో తెలీదు. ఆఫీసులు, కాలేజీలు వదిలాక ఆ సాయంత్రం వేళ రోడ్లపై గుంపులు గుంపులుగా, ఒంటరిగా, వాహనాల పైనా వెళుతున్న మగవాళ్లకేసి చూస్తోంది మాధవి. వీళ్లలో ఎవరెవరు ఈ రాత్రి దేహభాషని మాట్లాడబోతున్నారో… వీధుల్లో వేలాడ దీసిన స్త్రీల అంగాంగాలు గాలికి వూగుతూ… లైంగిక చర్య మగవాడి అధికార ప్రకటనయిన చోటు ఇది అని చెపుతున్నట్టుగా ఉంది. ఈ శరీరం ఆ శరీరం లోపల వున్న తాను- తానేనా? మాధవేనా? మోగుతోంది… మళ్లీ మోగుతోంది ఫోను. ఏదో తెలియని నంబరు నుండి పిలుపు. నడి రోడ్డుపై నిలబడిపోయింది… మోగుతున్న ఫోన్ కేసి చూస్తూ.

*

 

 

Avatar

ఎ.రవీంద్రబాబు

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • దేహభాష కథ పై నీ విశ్లేషణ చదివాను రవీంద్రా . కథ
  చదివినప్పుడు ఎంత కలతకు గురయ్యానో అదే బాధ కలిగింది ఇప్పుడూనూ. గొప్ప వాస్తవమైన కథని ఎన్నుకున్న్ నిన్ను ఎంత పొగిడినా తక్కువే. కథ చదివినప్పుడు ఒక రకమైన దడ నరనరానా వ్యాప్తి చెంది ఈ మనుషుల మధ్య నేనూ ఒక మనిషిగా జీవిస్తున్నందుకు సిగ్గేసింది. కథకు ప్రయోజనం ఏంటని కొందరు అడుగుతుంటారు కదా .. ఇది చాలదా ? దేహ భాష గురించి నీచంగా మాట్లాడే వెధవలకు “ఒరేయ్ .. నీ అసలు రూపం చూపిన అద్దం ఈ కథ ” అని వాడి మొఖం మీద పెట్టి ఈ కథ చదవమని చెప్పాలనిపిస్తుంది. విమల గారు కవిత్వంతో కలం మూసి ఉంటె ఒక గొప్ప కథకురాలిని తెలుగు పాటకులు మిస్ అయ్యేవారు. బాతురూముల్లో ఆడవాళ్ళ నెంబర్లు రాయడం కాదు దేహ భాష కథ జిరాక్స్ కాపీలు అంటిస్తే ఆ దరిద్రులకి కిందకి వచ్చేది రాకపోవడమో లేక ఏకధాటి విరేచనమో అయ్యేది – ఆ జిరాక్స్ అక్షరాల అద్దంలో తన మొహమే కనిపిస్తుంది గనక.
  మరోసారి ప్రకంపనలు కలిగించిన నిన్నూ , విమల గారినీ మనసుపూర్తిగా అభినందిస్తున్నాను .

 • ఆధునిక సాంకేతికత, మానవ సంబంధాల మధ్య గాఢతను శిధిలావస్థలోకి నెట్టేస్తున్న వేళ ఇది. ఆడవారి నగ్నత్వాన్ని అరచేతిలో తెరల మీద నిర్లజ్జగా, నిర్భయంగా చూస్తేనే మగాళ్ళు అనే భ్రమతో, స్వప స్ఖలనాలతోనే శారీరక సంతృప్తి ఆపేక్షిస్తూ, శారీరక మానసిక బలహీనతలను, వ్యసనాలను నాగరికతగా ఆత్మవంచన చేసుకొంటూ, మానసిక దౌర్బల్యంలో కూరుకుపోయిన మగాళ్ళ మధ్య, స్త్రీగా, వివాహితగా, ఒంటరిగా జీవించాల్సిరావట ఎంత దౌర్భాగ్యం!
  ఇలాంటి కథలు చదివినప్పుడు వెన్ను లో వణుకు పుడుతుంది. నరాల్లో రక్తం ఇగిరి పోతుంది. మస్తిష్కం మైనపు ముద్దలాగ మరిగి, కారిపోతుంది. కళ్ళలో గాజుముక్కల పొడి కరకరలాడుతూ ఉన్నట్లు, కాళ్ళకు కరెంటు చుట్టుకున్నట్టు,. భరించలేని దుర్భరమైన బాధ కురుస్తున్న భావన…
  ఈ విషమ సమాజం లోనే మనం జీవిస్తున్నామని ఊహించుకొంటే దుఃఖం కాక మరేమిటి కలుగుతుంది.
  మనం బళ్ళో ఈతరం పిల్లలకు ఏం నేర్పుతున్నాం? ఇళ్ళలో ఏం నేర్పి, పిల్లల్ని సమాజం మీదికి వదులుతున్నాం? చదువు చెప్పే, విద్యా బుద్ధులు నేర్పే గురువుల్ని చూసే పద్ధతి ఈనాడు ఇలా మారటానికి కారణం గా ఎవరిని నిందచేయగలం? అన్నీ ప్రశ్నలే…
  ఈ దుర్మార్గాన్ని, చెడునూ సంస్కరించే బరువును తమ భుజాలపై బాధ్యత గా మోయగలిగిన వారు ఎవరున్నారు?
  కథను స్వానుభవం లోకి తెచ్చుకోవడానికి, చదివిన దాన్ని అనుభూతించుకోవటానికి రవీంద్ర గారి ఈ విమర్శ చక్కని వెలుగు దారి చూపటంలో ఎంతగానో దోహదకారి అయింది.
  ఈకథ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనకు నగ్నంగా చూపించి, నవీన నాగరిక సమాజం అని మనం కప్పుకుని ఉన్న ముసుగు తెరల్ని నిర్దాక్షిణ్యంగా చింపివేస్తుంది. రక్తాన్ని మరిగించి, నరాల్ని తెంపి విద్యుత్తును ప్రవహింప జేస్తుంది. మగవాడిగా పుట్టినందుకు క్షణమైనా సిగ్గు తో కుమిలిపోయి, దిగులుతో ఊరట చెందమని శాసిస్తుంది. ఆడవారి పట్ల చూపాల్సింది జాలి, దయ కాదు. కాసింత గుర్తింపు, సమానత్వం అని గుర్తుచేస్తుంది.
  ప్రాణమున్న కథ అందించిన విమల గారికి, సమీక్ష సమీక్షకులు రవీంద్ర బాబు గారికి శుభాభినందనలు

 • Anaadi nundi.. Anthariksha yugam varaku athiva astitva poratam…..
  Nirantara samaram..
  Chala bavundi maa….. 🙏🙏🙏
  Ravindra Garu…… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 • అనాది నుండి … అంతరిక్ష యుగం వరకు
  అతివ అస్తిత్వ పోరాటం … నిరంతర సమరం.

  చాలా బావుంది మా…. రవీంద్ర గారూ.

  ~ స్వాతి బొలిశెట్టి

 • ‘ఆకాశంలో సగం నీవు
  అనంత కోటి నక్షత్రాల్లో సగం నీవు. సగంనేను’
  అని విప్లవ స్వాప్నికుడు, నల్లసూర్యుడు శివసాగర్ అన్నాడు. ‌

  ఇంత జాగ్రత్త పడ్డా, అక్కల్ని తక్కువ చేశారు. లేకుంటే తర్వాత కాలంలో
  స్త్రీవాద కవిత్వంలో విమలక్క రాసిన “వంటిల్లు” కవిత వచ్చేది కాదు అన్నారొకరు.

  ” ఒక్కోసారి అమ్మొక మండుతున్న పొయ్యి లాగా కూడా వుంటుంది…
  మన రక్తం పీల్చేసి, మన ఆశల్నీ, కలల్నీ కాజేసి
  కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కుతింటున్న రాకాశి గద్ద ఈ వంటిల్లు. ”

  మరైతే గొరుసన్నా… ఏ వాదం, ఏ ఉద్యమం, ఏ పోరు బాట సమాజానికి దిక్దర్శనం, దిశానిర్దేశనం చేస్తుంది ?

  తల్లి తర్వాతే తండ్రైనా, గురువైనా, దైవమైనా అన్న …. ” మాతృ దేవో భవా ” అని తల్లికి మొక్కి అక్కకి, చెల్లికి, చెలియకి, ఆడబిడ్డలకి గౌరవమైన స్థానం ఇచ్చిన మన సింధూ, గంగా నదీపరివాహక ప్రాంత పురాతన సంస్కృతి యీ ఆధునిక కాలంలో మనోవికారాల వికృతరూపాలకి లొంగిపోతూ.. చెడు మార్గం పడుతున్న నేరానికి ఎవరు బాధ్యత వహిస్తారు ?

  తల్లిదండ్రులు ? మమ్మిడాడీ కల్చర్ ? విధ్యంటే జ్నానార్జన కాకుండా ధనార్జన ఉద్యోగాల వేటలా చెయ్యడం ? మతమంటే మానవత్వ ఆధ్యాత్మిక మార్గ ప్రయాణంలా కాకుండా పూజా, పునస్కారాల విగ్రహారాధన మౌడ్యంలా చేస్తున్న వారు ? నాలుగు దిక్కుల నడుమ వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినో భవంతు అన్న ప్రాజ్నుల ఆజ్న నేడు అతిక్రమిస్తూ పుడమితల్లిని చిన్నాభిన్నం చేస్తున్న, మానవ మేధస్సును కలుషితం చేస్తున్న నాయకులు ?

  అన్నీ సందేహాలేరోరన్నా ! గజ్జెల మల్లన్నా !!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు