దేశరాజు కవితలు రెండు

1

దగ్గర

నీవు వచ్చిన సవ్వడీ లేదు
విడిచి వెళ్లిన శబ్దమూ లేదు
కొన్నిసార్లు బాల్కనీలో బంతిమొక్క
ఊగితే, గాలికే అనుకున్నా.
గోడల మీద వెలుతురు చిలకరించిన నీడల్ని
ఇటుకలు పీల్చేసుకున్నాయి.
సాయంత్రపు నీరెండ
సిరామిక్ టైల్స్ పై బద్ధకంగా దొల్లుతోంది.
ఊపిరాడని గదిలో
ఆమె వెలిగించిన సంధ్యా దీపం
నిక్కపొడుచుకుని దిక్కులు చూస్తోంది
నా కంటిపాపలో ఆమె రూపం
గుటకలు వేస్తోంది
ఆలోచనల్లోని దూరం ఈసారైనా కరిగిపోతుందా?

 

2

డివైన్

నిన్న నేను చెట్టును తన్నా
బద్ధలైన హృదయంలాంటి కాయొకటి
సమాధిపై రాలి పడింది
-పూడ్చబడిన హృదయాలేవీ
గాయపడిన దాఖలాలు అగుపించలేదుఇది జూన్ నెల
వేసవిలో వర్షాతిరేక కాలం

అయినా, అప్పుడప్పుడు
దూరంగా ఎక్కడో మంటలు చెలరేగుతున్నాయ్
నిర్విరామంగా నువ్వు
బూడిదను శుభ్రం చేస్తూనే వున్నావ్

నీ మోచేతులతో
కన్నీళ్లు తుడుచుకుంటున్నట్టే
హృదయాన్నీనూ.

పద్యాలు రాసే పాత స్నేహితులు
పార్క్‌ లో పలకరించిన జ్ఞాపకం.

నీ కవితా పాదాలను మాత్రం
భార్య కావడానికి ముందటి
అమ్మాయికి వినింపించావ్-

బాల్కనీ కుండీలోని మందార పూలపై నుంచీ
పుప్పొడి గాలి వీస్తున్న సంధ్య వేళ
పెళ్లాం అయిపోయిన ఆ అమ్మాయి
చప్పట్లు చరిచింది

ఉత్తరపు గాలి ఉసురుపోసుకుంటున్న వేళ
తీరని సమయాల్లో ఆమె
ఓ సరస్సును దాహంగా స్వీకరించింది

గుర్తుందా?
‘మీ ఆవిడ కవిత్వం వింటుందా?’ అని
దశాబ్దాలుగా మధువు సేవించే మిత్రుల
చేదు సంభాషణ?

ఇక ఈ పాన పాత్రిక మళ్లీమళ్లీ ఖాళీగాక ఏమవుతుంది?

*

దేశరాజు

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఊహ బాగుంది,కవిత్వం చేయడమూ బాగుంది.ఔను.కవిత్వం వ్రాసే స్త్రీ కి కూడా ఇదే జరుగుతూ ఉంటుంది.ప్రేమికుడు కలలో తప్ప ప్రపంచంలో దొరకడు. మొగుడు వినడు.! ఆ GAP inevitable.
    భలే బైటపెట్టిన కవిత.అభినందనలు.

  • దేశరాజు గారూ,కవితలు రెండూ బాగున్నాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు