దేశం బోయిండ్రు

     ఉత్తర తెలంగాణలో ఓ ఊరు. జిల్లా కేంద్రానికి కొన్ని కిలోమీటర్లే. కొలిస్తే ఎనిమిది! మనుషుల అస్థిపంజరాలు ఒక్క తీరుగా ఉన్నట్టే, ఆ ఊరి రూపురేఖలు అన్ని ఊర్లతీర్గనే! గుడి-బడి, మసీదు-బస్టాండు, చర్చీ-సర్పంచి కుర్చీ, పొలాలు-కుల బలాలు, రోజూ తాజాగా పారే మోరీలు, ఏడాదికోసారి లేచి ఎగిరే పీరీలు, పీకేసిన పాత మామిడి చెట్లు-విదేశంనుండి వచ్చిన ఆయిల్ పామ్ మరుగుజ్జు వృక్షాలు, ఆడా-మగా, పిల్లా-జెల్లా, తాటి కల్లు-రంగుల కిక్కులు, టీవీలు-టూ వీలర్లు, పండగలు-పబ్బాలు, విరమించిన సైనికులు-ఎన్నికైన అగ్నివీర్లు, గల్ఫ్ దేశాలనుంచి తిరిగొచ్చిన మొనగాళ్ళు-పోయ్యేందుకు తయారైతున్న అస్త్రరహిత యోదులు…

ఊరు… పల్లెటూరు… ఉత్తర తెలంగాణలోంచి కొత్తగా పుట్టుకొచ్చిన జిల్లాలోని ఓ ఊరు.

పాఠశాలలో టీచర్ పిల్లల వివరాలని రాసుకొంటుంది. ప్రశ్నల్లో ఒక ప్రశ్న. “మీ నాన దేశం బోయిండా?”

“ఔవ్, పోయిండు.” “పొయిండు.” “దేశంలనే ఉన్నడు.” “గక్కన్నే ఉన్నడు.” “మొన్ననే వొయిండు.” “పొయ్యి రెండేండ్లాయే.” … ప్రశ్నది ఏకరూపమే. జవాబులు మాత్రం వైవిధ్యరూపాల్లో. పిల్లల చిత్రమైన చేష్ఠలు. విచిత్రమైన స్వరాల్లో జవాబులు.

“ఔ… ఖతార్ పొయిండు.” ఒకమ్మాయి జవాబు.

టీచర్ తలపైకెత్తి పాపవైపు విస్మయంగా చూసింది. చూపులు మెల్లగా మెచ్చుకోలువైపు రూపాంతరం చెందాయి.

టీచర్ అభ్యాసాన్ని పూర్తిచేసింది. వంద నలభై విద్యార్థుల్లో ఎనభై పిల్లల తండ్రులు బయటున్నరు. డెబ్భై తొమ్మిది తండ్రులు “దేశం”లో ఉంటే, ఒక తండ్రి ఖతార్లో పనిచేస్తున్నడు.

టీచర్ ఇంకా ఆశ్చర్యంలోనే ఉంది. ఒక్క పాప… ఒకే ఒక్క అమ్మాయి తండ్రి పనిచేస్తున్న “దేశం” అని చెప్పక పేరుని నిక్కచ్చిగా చెప్పింది. బేష్ అని మనసులో మెచ్చుకొంది.

టీచర్ నందిత కొన్నినెళ్ళ క్రితం తెలంగాణా రాజధాని నుండి సర్పంచేలే ఊరికి వచ్చింది. బాగ్యనగరంలో పేరున్న ప్రైవేటు పాఠశాలలో పనిచేసి ప్రభుత్వోద్యోగం రాగానే ఊరి పాఠశాలకి చేరుకొంది. చిన్నప్పటినుండి విద్యారంగంపై మక్కువ ఎక్కువామెకు.

కష్టాల్ని ఇష్టాలుగా మలుచుకొనే నందితకి ఊరి పాఠశాల, జీవనశైలులు, చదువులు, సమాజం, నిరుద్యోగ పరిస్థితులు, ప్రజల జీవన శైలిలో గల్ఫ్ దేశాల ప్రభావం, ఒత్తిళ్ళు, ఆడమగల మధ్య కనబడే అంతరాలు, దూరాలు… అన్నిటిని బాగా గమనిస్తూ, ఆశ్చర్యపడుతూ, లోతైన సానుభూతితో, సంవేదనతో ఒక ఉపాధ్యాయురాలిగా తనేమైనా కొంచెం భిన్నంగా చేయాలి అని ధీర్గాలోచనల్లో పడిపోతుంటుంది.

అదొక ఆరని జ్వాల! ఆకలి తీరని మంట!!

*                                   *                                   *

పాఠశాల ప్రాంగణం. ప్రార్థన మొదలైంది. పిల్లలంతా దిల్లీలో జరిగే గణతంత్రదినపు పరేడ్ లో కనబడే క్రమశిక్షణ లేకున్నా, ఆమోదయోగ్యమైన వరసల్లో నిలుచున్నారు. సర్కారిచ్చిన ఏకరూప దుస్తులున్నా, అవి కనబడే రీతిలో నలుపుతెలుపులు. వైవిధ్యం! శుబ్రంగా, మడతలు లేకుండా కనబడే దుస్తులు ఒకరకమైతే, వీటికి పూర్తిగా వ్యతిరేకంగా కనబడే దుస్తులు మెజారిటీ పిల్లలపై.

పేదరికపు నిర్లక్ష్యత కాదది. మామూలు మనుషులకి ఠక్కున అర్థమయ్యేది తల్లితండ్రుల పెంపకంలో కొరతని. నందితకి మాత్రం ఇంటి పెంపకలో, వారి యజమాన్యాల్లో లోపమని తెలుస్తుంది.

విధ్యార్థుల తండ్రులు దేశం బోయిండ్రు. పితృసామ్య వ్యవస్థలో “పితలు” ఇంటిపట్టున ఉండకుండా దేశం బోయిండ్రు. ఇంటిని పట్టుకొనే ఉన్న తల్లికి, తండ్రిలేకుండా పెరుగుతున్న పిల్లలకి, చేతికొచ్చిన కొడుకులు లేకుండానే ఉంటున్న తల్లితండ్రులకి పెద్ద సొరంగం. చిక్కని చీకటి ప్రయాణం. వెలుతురికి తేలిగ్గా దొరకని చీకటది. సుధీర్ఘమైన యాత్రది!

నందితకి సవాళ్లని విసిరే మజిలీ.

ప్రార్థనలో పిల్లల్ని చూస్తున్నంతసేపు నందితలో అలజడి. తానిపుడు తండ్రులు దేశంబోయిన పిల్లల్ని గురుతుబట్టగలదు. తనకుతానుగా ఏర్పర్చుకొన్న విధ్యార్థుల సమూహమది. ప్రేయర్ ఎపుడైపోతుందా, వెంటనే వెళ్ళి హెడ్ మాస్టర్తో మాట్లాడాలి అనుకొంటూ నిమిషాల్ని అసహనంగా గడిపేసింది.

తండ్రులు బ్రతికే ఉన్నా, లేని పిల్లల్లా బ్రతికే అనుభవాలు అనుభవిస్తేనే తెలిసేది. రూపాలు పోసుకొంటూ, వ్యక్తిత్వాలని చెక్కుకొంటూ సమగ్రాభివృద్ధి జరిగే వయసులో తండ్రులతోడు లేకపోవడం పిల్లలకొక శాపం. సవాళ్ళ దీపం. తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్ళిన పదిహేను లక్షల కుటుంభాల గోస అది.

భారత దేశంనుండి తొంబై లక్షల మంది (మహిళలతో కలిపి) దేశాలకు బోయిండ్రు.

ఖచ్చితంగా తిరిగొచ్చే ఎన్నారైలు మనోళ్ళు. సంపాదించిన ప్రతి నాణేన్ని, కాగితం నోటుని మాతృదేశానికే పంపే పసిడి కూనలు. ప్రభుత్వాలు మారినా వీరిని సమగ్రంగా ఖాతరు చెయ్యని సంవేదనాశీలతలేని ఎన్నారై – నాన్ రెస్పాన్సివ్ ఇండియా!

నందిత వేగంగా అడుగులేస్తూ హెడ్ మాస్టర్ వెంకటరెడ్డి గదికి చేరింది. ఈరోజు ఆయనతో చర్చించి తప్పక ఓ ప్రణాళికతోనే గది నుండి తిరిగిరావాలి అనే దృఢనిశ్చయంతో ఉంది.

వెంకటరెడ్డికి రెండేళ్లలో పదవీ విరమణ. ప్రమోషన్ ఏమి రాదాయనకి. ఇరవై నాలుగు, ఇరవై మూడు మాసాలంటూ పనిచేసే నెలల్ని తగ్గించుకొంటూ కాలాయాపన చేస్తున్నాడు. ఇంచార్జ్ మండల విధ్యాదికారిగా (ఏం.ఈ.ఓ) అవకాశం వస్తే పనిపెరిగిపోతుందని సున్నితంగా తిరస్కరించి పదవీవిరమణ తరువాత ఆరంభించే వ్యాపారం గురించి నెట్వర్కింగ్ చేస్తుంటాడు.

ఒక కొడుకు అమెరికా బోతే, ఇంకొకడు ఆస్ట్రేలియా. బిడ్డ-అల్లుడు ధుబాయిలో.

అందరూ దేశాలు బోయినొల్లే. కుటుంభాలతో ఉంటున్నరు. సుఖంగా, పరేషాన్లు లేకుంటా. సెంచురీ కొట్టేందుకు సెటిల్ అయిన బ్యాటర్లగా ఉన్నందుకు వెంకటరెడ్డి సంకటాలను దూరంచేసే సకల దేవతల పూజల్ని చేస్తూనే ఉంటాడు. మంగళవారం వినాయకుడి పూజ మిస్ కానీయడు. మిసెస్ వెంకటరెడ్డి గోల్డ్ చిట్టీలంటూ పేదగా బ్రతుకుతూ బంగారాన్ని కొంటూ మనవరాళ్ళకోసం బరువైన నగల్నీచేయిస్తూ దేశం వచ్చినపుడల్లా ప్రేమతో అలంకరించి అప్పచెప్పుతుంది.

ధనికులు మరింత ధనికులైతూనే ఉన్నారు.

“రా అమ్మా… రా…”

“ప్రేయర్లో పిల్లల్ని చూస్తే భాదేస్తుంది సర్? ఆలస్యం వద్దు. ఈరోజు యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం… మీరు డి.ఈ.ఓ (జిల్లా విధ్యాదికారి) తో మాట్లాడతామన్నారు. ఏమైంది?”

“డి.ఈ.ఓ లేడమ్మా. వచ్చేవారం ఆఫీసులో ఉంటాడట. అపుడువెల్లి మనం కలుద్దాం. నీ ఐడియాని ఆయనకి చెబుతువుగాని… ఇలాటి ప్రయోగం ఎక్కడా జరుగలేదు. వినలేదు కూడా…”

“మనం కృషి చేస్తే కొంత మార్పుని తప్పక తేవచ్చు. మీరు సపోర్ట్ ఇవ్వండి. ఈ ఎనభై పిల్లల్లో, వారి కుటుంభాల్లో ఏ చిన్న మార్పు వచ్చినా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది సర్…” ఎప్పటిలానే ఉత్సాహంతో అన్నది నందిత.

“నీ ఐడియాని డి.ఈ.ఓ ఒప్పుకొంటే మనం ఈ పనిని చేయగలమా? మనకున్న స్టాఫ్ సంగతి నీకు తెలుసుకదా…”

“మీరు దాని గురించి ఆలోచించకండి. నేను ఈ ప్రయోగం కోసం ఎంతటైమైనా ఇవ్వగలను. మన వేణుతో మాట్లాడాను. ఆయన ఈ ప్రయోగంలో పాల్గొనడానికి రెడీగా ఉన్నాడు. అవసరమైతే ఒక విద్యా వాలెంటీర్ని తీసుకొందాం. ఇదొక ప్రయోగం కావున హైదరాబాదులో ఉన్న ఒక దాత సంవత్సరం వాలెంటర్కి పారితోషికం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాడు. గ్రామీణాభివృద్ధి సంఘం వారు కూడా ఆసక్తి చూపుతున్నారు.”

“హోంవర్క్ బాగానే చేసినట్టున్నావ్. గుడ్. రెడీగా ఉండు. డి.ఈ.ఓ నుండి అపాయింట్మెంట్ దొరగ్గానే వెలదాం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తావుకదూ?”

“మన స్కూల్ కి వచ్చాక ఈ విషయంపై మంచి పట్టు వచ్చింది సర్. రోజూ పిల్లల్తో మాట్లాడుతుంటే ఎన్నో లోతైన విషయాలు తెలుస్తున్నాయి. గతవారం ఒకతను కలిసాడు. ఆయన గల్ఫ్ భాదితుల హక్కుల గురించి మాట్లాడుతుంటాడు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడం మొదలు పెట్టాను… థాంక్యూ సర్…” కాస్త ఊరటతో

కుర్చీలోంచి లేచింది.

“తమ్ముడికి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారమ్మా?

“మన పక్క జిల్లాకే అదనపు కలెక్టర్ గా వస్తున్నాడు సర్.”

వెంకటరెడ్డి ఒక్కసారే ఉలిక్కి పడ్డాడు. సవరించుకొని మామూలు మనిషయ్యేందుకు సమయం పట్టింది. ఇప్పటినుండి నందిత మేడం పనిని తేలిగ్గా తీసుకోవద్దని డి.ఈ.ఓ ప్రైవేట్ నంబర్ కి ఫోన్ చేసాడు.

*                                 *                                   *

నందిత గ్రామీణ పాఠశాలలో చేరినప్పటినుండి ఒక కొత్తలోకంలోకి వచ్చినట్టుగా ఉంది. పట్టణంలోని పేరున్న స్కూళ్ళకి గ్రామాల్లోని సీదాసాదా కిరీటాల్లేని పాఠశాలలకి భారీ తేడాలు స్పష్ఠంగా కనబడ్డాయి. పెద్దపెద్ద స్కూళ్ళల్లోనే పేరెంట్స్ సమావేశాలకి సక్రమంగా రారు. పిల్లల హైఫై, షోకుల పేరెంట్స్, ఆధునిక ధనికులు పలుకారణాలవల్ల హాజరుకారు. వచ్చినవారిలో తల్లులే ఎక్కువుంటారు. ప్రాథమిక బాధ్యత తల్లులపైనే! గ్రామాల్లో ఇద్దరూ రారు. నందిత తల్లితండ్రుల మీటింగులని దగ్గరినుండి జాగ్రత్తగా అభ్యాసం చేస్తుంది. మొదటి మీటింగికి ఉత్సాహంతో ఎదిరిచూస్తున్న నందితకి ఏడుపువచ్చేసింది. నిరుత్సాహమే రాత్రంతా నిద్రపోనివ్వలేదు.

తోటి ఉపాధ్యాయులతో మాట్లాడింది. ఇంత ముఖ్యమైనది పేలవంగా, దాదాపుగా ఏమి జరగకుండానే దినం గడచిపోవడం అంతుపట్టలేదు. లంచ్ చేయడానికి నందిత మనసొప్పలేదు.

తెలంగాణ నుండి గల్ఫ్ దేశాలకి తాత్కాలిక వలసలు దశాబ్దాలుగా జరుగుతున్నపని. చదువులు అంతగాలేనివారికి శ్రామికశక్తే పెట్టుబడి. దేహధారుడ్యమే సర్టిఫికేట్. భాషరాని దేశంలో బాహుబలులు కావాల్సిందే! కష్టాలకి కష్టాలచ్చి పారిపోవాల్సిందే కానీ పనిలో తగ్గింపు ఉండదు. నీటి చమట కనబడదు. శ్రమజీవుల స్వేదగ్రంథులు ప్రత్యేక నిర్మితాలు. ఎరుపు వర్ణపు చమటే కారుతుంది. ఆ రక్తపు ధారలు గల్ఫ్ దేశాల ప్రగతిరథపు చక్రాలకు కందెనలై సాఫీగా పెరుగుదలకు తోడ్పడుతున్నాయి.

మంచి చదువులతో దేశాలకుబోతే జీవనం మరోరకం. కెరళా రాష్ట్రంనుండి చదువుల్ని చంకన పెట్టుకొని వెళ్ళినవారి జీవనశైలి ఆనందలోకం. అక్కడ పని చేసే వారికి. ఇక్కడ తమ రాష్ట్రంలోని తమ తమ కుటుంభాలకి.

వెలిముద్ర నుండి పెన్నుతో సంతకం చేసేందుకు ఒకే చేతిని వాడినా దూరం చెప్పలేనంత. నిరక్షరాస్యుడినుండి అక్షరాస్యుడివరకు! మండేటెండలో గొర్రెల్ని, ఒంటెల్ని కాసే పనినుండి ఏ‌సిగాలుల్లో హాయిగా కూచోని పని చేసే వరకు!!

“ఇలా కాకూడదు. కనీసం ఈ తరమైనా బాగా చదివి తమతమ కుటుంభ చిత్రాల్ని మార్చుకోవాలి. భాగ్యరేఖలు ఎక్కడో లేవు, మనచేతుల్లోనే ఉన్నాయన్న నగ్నసత్యాన్ని అందరికీ తెలియజేయాలి. కొత్త ఆలోచనలే కావాలి. ఆచరణయోగ్యంగాఉండే సులువుమార్గలే కావాలి…” నందిత తలనిండా ఇవే ఆలోచనలు… తపనది.

                              *                                   *                                   *

            “మనం పెద్ద పొరపాటు చేస్తున్నాం. పితృసామ్య సంస్కృతి గట్టిగా పాతుకుపోయి చలామణిలో ఉన్నా, ఎందుకో భర్తలు మాత్రం పేరెంట్స్ మీటింగులకి రారు. మనం ఎంత శ్రమించినా యాభైశాతం తల్లితండ్రులు (తండ్రులని చదవండి.) కూడా రావడంలేదు. దేశంబోయిన ఇళ్లనుండి తల్లులెలా పాఠశాల మీటింగులకి వస్తారు? కమ్యూనికేషన్ గ్యాప్ ఇక్కడుంది. పిల్లల్లో క్రమశిక్షణ కనబడకుండా పోతుంది. సర్వాధికారాలు చలాయించే ఇంటి మగమనిషి దేశం పోతే, ఇంటి వాతావరణం మారిపోతుంది. పిల్లలు తల్లులమాటల్ని ఖాతరు చెయ్యడంలేదు. తండ్రులుచేసే వాట్సప్ వీడియో కాల్స్ సంభాషణలు, హుకుంలు, బెదిరింపులు, బుజ్జగింపులు… ఏవీ పనిచేయడంలేదు. పిల్లలు విధ్యలో మధ్యలోనే ఉంటున్నారు. తరగతుల ప్రమాణాలకతీతంగా…”

చక్కని, చిక్కని లాజిక్కులతో, అంకెలతో నందిత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుంది. డి.ఈ.ఓ, ఎం.ఈ.ఓ… ఇంకా కొంత సిబ్బంది ఆసక్తిగా వింటున్నారు. వెంకటరెడ్డి తానే ప్రసంగిస్తున్నట్టుగా గర్వంగా ఉన్నాడు.

“నీ ప్రపోజల్ ఏంటి నందిత మేడమ్?” డి.ఈ.ఓ ప్రశ్న. వెంకటరెడ్డి ఆపాటికే డి.ఈ.ఓ చెవిలో వేసాడు, నందిత తమ్ముడు పక్కజిల్లాకి అధనపు కలెక్టర్ గా వచ్చేసాడని!

“తల్లుల్ని మన పాఠశాలకి తెచ్చే భగీరథ యత్నాలకు బదులు, మనమే వాళ్ళ గ్రామాలకి వెళ్ళి వారితో మీటింగ్ పెడదాం. రెండుమూడు ఊర్లని ఒకటిగా చేసి, దేశంబోయిన ఇళ్లనుండి తల్లుల్ని ఒక చోటికి రప్పించి కలుద్దాం. అప్పుడే మనం ఊహించే, ఆశించే ఫలితాలు వస్తాయి. ఇదే మన నమోనా.”

ప్రశ్నలు… జవాబులు…

ఆచరణలో వచ్చే సవాళ్ళు… అవలీలగా అదిగమించవచ్చు అన్న ఆశ కిరణాలు…

నందిత అందరికీ సంతృప్తికరమైన జవాబులని ఇచ్చింది.

డి.ఈ.ఓ నందిత ప్రయోగానికి అంగీకరించాడు.

“కలెక్టర్కి ఇదే ప్రజెంటేషన్ ఇద్దాం మేడం.” డి.ఈ.ఓ అన్నాడు.

అందరూ మెచ్చుకోలుగా చప్పట్లు. చప్పట్లశబ్దాలే తప్పెట్లస్థాయికి చేరాయి.

*                                   *                                   *

పిల్లలునాటిన చెట్లు పాఠశాల ఆవరణలో పెరుగుతున్నాయి. ఉపాధ్యాయులు ఇస్తున్న జ్ఞానగుళికలు విధ్యార్థుల్లో పలురూపాల్లో ప్రదర్శితమౌతున్నాయి. కాలసూచికల్లో కమ్మలు పక్కకి తప్పుకొంటున్నాయి. డైరీల్లో పేజీలు వెనక్కి. మూడు విధ్యాసంవత్సరాలు గడిచాయి. ప్రయోగం విజయవంతమయ్యింది.

గల్ఫ్ కార్మికుల కుటుంభాల పిల్లల్లో మార్పు గోచరమవుతుంది.

నందిత టీముకి మంచి గుర్తింపు వచ్చింది.

డి.ఈ.ఓ, వెంకటరెడ్డి రిటైర్ అయ్యారు. పదినెల్లో రిటైర్మెంట్ మోసుకొని శ్రీనివాస చారి కొత్త డి.ఈ.ఓ గా చేరారు. ఎం.ఈ.ఓ బాధ్యతల్ని ఇంకో హెడ్మాస్టర్కి అదనంగా చేయమని అప్పచెప్పారు.

విధ్యా విభాగం, హైద్రాబాద్ నుండి అడపాదడపా ఈ ప్రొజెక్ట్ చూడ్డానికి వస్తూనే ఉన్నారు.

మీడియా కవరేజ్ పుష్కలం!

యూనిసెఫ్, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ) కార్యలయాలకి చిన్న ఊర్లో జరుగుతున్న ప్రయోగం, ఫలితాల గురించి తెలిసిపోయింది. ఈ అంతర్జాతీయ కార్యాలయాలనుండి టీములు వచ్చి లోతుగా అధ్యాయనం చేశాయి. నందిత స్టార్ అయ్యింది.

కష్టపడ్డవారికి అవార్డులు. రివార్డులు. ప్రశంసా పత్రాలు. పేరు-ప్రఖ్యాతులు.

నందిత తమ్ముడు కలెక్టరుగా ఇదే జిల్లాకి వచ్చాడు.

దేశం బోయినోళ్ళు ఎక్కువున్న మరికొన్ని గ్రామాలకి, దగ్గర్లో ఉన్న పాఠశాలలకి ఈ నమోనాని ఆచరణ కోసం దశలుదశాలుగా పెంచుతున్నారు.

శబ్దసందేశాల ప్రకారంగా పిల్లల తల్లులు క్రమం తప్పకుండా ఆదివారాల్లో మీటింగులు హాజరౌతున్నారు. చదువులగురించి చురుగ్గా, విస్తృతంగా మాట్లాడుతున్నారు. పిల్లలు కూడా పక్కనే కూచోని వింటున్నారు.

మీటింగైన రోజు, తండ్రులు దేశాలనుంచి భార్యలతో పిల్లల చదువులగురించి, మీటింగ్ సంగతులు అడిగి తెలుసుకొంటున్నారు. పిల్లలు బాగా చదుకొని, తమలాగే తట్టల్నిమోసే మోటుపనులు కాకుండా, గల్ఫ్ దేశాల్లోనే మంచి ఉద్యోగాల్లో పనిచేస్తున్నట్టుగా కలలు కంటున్నారు.

కొందరు తండ్రులు నందితకి, హెడ్మాస్టర్కి ఫోన్లు చేసి మెచ్చుకొంటున్నరు. సెలవుల్లో వచ్చినోళ్ళు ప్రత్యేకంగా పాఠశాలకి పోయి కలిసిపోతున్నారు.

అందరి మోహల్లో సంతృప్తి. ఎంతో ఆనందం.

బాసర సరస్వతిదేవి మొహంలో ప్రసన్నత కనబడింది.

*                                   *                                   *

              సంవత్సరం 2022 వచ్చేసింది.

నందిత ఉద్యోగానికి రాజీనామా చేసింది. కఠ్మండు (నేపాళ్) లో ఉన్న యూనిసెఫ్ ప్రాంతీయ కార్యాలయంలో     పని చేస్తుంది. ఊరి పాఠశాల అనుభవాలు ఐక్య రాజ్య సమితి అనుబంధసంస్థకి చేరడంలో కీలకపాత్ర వహించాయి. వేణు పెద్ద పోటీ పరీక్షలో నెగ్గి హైదరాబాద్ ఆఫీసులో పని చేస్తున్నాడు.  కొత్త మాస్కులతో డి.ఈ.ఓ, ఎం.ఈ.ఓలు. ఇద్దరూ రిటైర్మెంటుకి దగ్గర్లో.

కాలచక్రం పలు రూపాల్లో బహిర్గతమౌతుంది. చెట్లాకులన్నీ ఎండి రాలడానికి సిద్దమౌతున్నాయి. గాలి వీచినపుడల్లా అడవిలో ఏపుగా పెరిగిన టేకు చెట్లనుండి పెద్దసైజు అప్పడాలు, కాచిన నూనెలోంచి తీసినవాటిలా,   చెట్లనుండి ఆకులు పడ్డపుడల్లా పళపళ శబ్దాన్ని చేస్తున్నాయి. ఆకులపై ఏ జీవి పాదం పడ్డా విరుగుడు చప్పుల్లే! అదొక వింత సంగీతం.

పాఠశాల ప్రయోగం పలచనైంది. పక్కదార్లు పట్టేసింది.

క్లాసురూంలో కొత్తటీచర్ పిల్లల వివరాలని చెక్ చేస్తుంది. పలు ప్రశ్నల్లో ఒక ప్రశ్న. “మీ నాన దేశం బోయిండా?”

“పొయిండు.” ఔవ్, పోయిండు.” “గల్ఫులనే ఉన్నడు.” “మొన్నమొన్ననే వొయిండు.” “పొయ్యి నాలుగేండ్లాయే.” … ఏదో లోపించింది! వైవిధ్యపూరిత జవాబులు.

టీచర్ అభ్యాసాన్ని పూర్తిచేసింది. రెండు వందల ముప్పై విద్యార్థుల్లో నూటాయిరవై పిల్లల తండ్రులందరూ దేశం పోయినొల్లే!

వందఇరవై పిల్లల తండ్రులు దేశం బోయిండ్రు.

పిల్లల్లో మార్పు క్రమేణా తగ్గుతుందని ఊరినుండి ప్రతినిధులు పాఠశాల హెడ్మాస్టర్ని కలిసేందుకు వచ్చారు.

హెచ్.ఏం లేడు.

గంటకొట్టే మనిషి అక్కడే తీరిగ్గా కూచోని కనబడ్డాడు.

“పెద్దాయన లేడా?” ఊరి ప్రతినిధుల్లోని పెద్దాయన.

“మీటింగుకు బోయిండు.”

“నందితమ్మ లేదా? గామె ఎక్కడ కూసుంటది? మా ఊరికచ్ఛుడు బందు జేసింది.” ఒక ఆడగొంతు.

“గామె దేశం బోయింది.” గంట కొట్టడానికి గడియారం చూస్తూ అన్నాడు.

“బగ్గ సదుకున్నదేమో గదా? గామె సుగ దేశమే బోయిందా?”

*                     

టి. సంపత్ కుమార్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు