దేవిప్రియ ఆఖరి కవితలోని అంతరంగం

“యుగ సంగీతం, యుగ చైతన్యం” కవిత్వ సంకలనాలతో తెలుగు సాహిత్యంలో పైగంబర కవులు(దేవిప్రియ, సుగమ్ బాబు, కిరణ్ బాబు, ఓల్గా, కమలాకాంత్) గా పేరొందిన వారిలో ‘షేక్ ఖాజా హుస్సేన్’ అలియాస్ దేవిప్రియ ఒకరు. పైగంబర కవుల ప్రభావం ఎలా వున్నప్పటికీ కవిగా, పాత్రికేయునిగా సమాంతరంగా కొనసాగినవారు దేవిప్రియ. అమ్మచెట్టు(1979), నీటిపుట్ట(1990), తుఫాను తుమ్మెద(1999), గరీబు గీతాలు(1992), అరణ్యపురాణం, పిట్ట కూడా ఎగిరిపోవాల్సిందే(2001), చేప చిలుక(2005), గంధకుటి(2009), గాలిరంగు(2011), ఇన్షా అల్లాహ్(పద్యకావ్యాలు), సమాజానాందస్వామి(1977), రన్నింగ్ కామెంటరీ(3 సంపుటాలు), అధ్యక్షా మన్నించండి(2010-సంపాదకీయాలు), Poornamma the golden doll(అనువాదం), The cobra dancer (K.J రావు జీవితకథ) మొ.నవి తన సాహిత్య ప్రస్థానంలోని మైలురాళ్ళు. నవంబర్ 23, 2020 న ఆంధ్రజ్యోతి (వివిధ) లో అముద్రిత ఆఖరు కవితగా అచ్చయిన “చివరికి చిక్కింది జింక” కవిత గురించి మాట్లాడుకుందాం.
*
చివరికి చిక్కింది జింక!
~
వాన కురిస్తే
నాలో కూడా కురిసేది
ఉరుము ఉరిమితే
నాలోపల కూడా ఉరిమేది
మెరుపు మెరిస్తే
నా లోపల కూడా మెరిసేది
వాగులూ వంకలూ
ఉన్మాదంగా ఊగుతున్న చెట్లూ
చీకటి మూసిన ఆకాశాలూ
తళతళ మిరుమిట్లూ
ఫెళ ఫెళ భగ్నతరు విస్ఫోటనలూ
అన్నీ నా లోపల కూడా 
ప్రజ్వలించేవి ప్రతిధ్వనించేవి
అపుడు నేను వేరు
తాను వేరూ కానట్టుండేది
ఇపుడేమిటి ఇలా?
ఏరు ఎవరోలా అనిపిస్తోంది
ఎవరో ఏరులా కనిపిస్తుంది
ఎడమ పాదం మీద 
ఎంతో అమాయకంగా
ఉదయించిన కొనగోరంతటి
చిట్టి చంద్రవంక అటుసాగి,
ఇటు సాగి, అటు ఎగిరి ఇటు ఎగిరి,
ఇటు పొరిలి అటు పొరిలి,
ఇటు లేచి అటు లేచి
పాదపదపదపత్రతతినొక
భయదకానన హేల చేసి
దష్ట దహనపుకీల చేసి
కాలినిండా కణకణానా
ఢమరుకాలై త్రిశూలాలై
జివ్వు జివ్వున రివ్వు రివ్వున
నొప్పికణికలు చిందుతుంటే
ఏకమై ఆ ఇనుడు భానుడు
కారు చిక్కని ఏ నిశీధిలో
చిక్కుకున్నారో
అంకుశ పీడిత పీడ
మృత్యు సన్నిభ ‘అడుగడుగు జాడ’
బాధవయసు యేమో కానీ
డెబ్బయ్యేళ్ళ అనుభవాల
ఈ ముళ్ళకంప కొట్టుకొచ్చి
‘నా తల్లి’ ఇంటికి, అరవై రోజులు
మిగిలిందేమున్నది ఇంక,
పులి నోటికి పూర్తిగా 
చిక్కినట్టే ఉంది ఈ జింక!  
(దేవిప్రియ ఆఖరి కవిత)
*
వృద్ధాప్యంలో శారీరకంగా, మానసికంగా తలెత్తే ఇబ్బందుల్ని అధిగమించడం శక్తికి మించిన పని. వృద్ధుల సమస్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రం జెరంటాలజీ. ఇందులో సోషల్ జెరంటాలజీ, బయో జెరంటాలజీ అనే రెండు శాఖలుంటాయి. సోషల్ జెరంటాలజీ వయసు పెరగడం వల్ల తలెత్తే సామాజిక సమస్యల గురించిన పరిజ్ఞానం అందిస్తే, బయో జెరంటాలజీ జీవసంబంధ పరిణామాలు, వయసు పెరుగుతున్నకొద్దీ వివిధ అంగాల సామర్థ్యం దెబ్బతినడం వల్ల తలెత్తే సమస్యల గురించి చెబుతుంది.
“అపుడు నేను వేరు/
తాను వేరూ కానట్టుండేది/
ఇపుడేమిటి ఇలా?/
ఏరు ఎవరోలా అనిపిస్తోంది/
ఎవరో ఏరులా కనిపిస్తుంది” అనడంలో జీవన సహచరి ‘రాజ్యలక్ష్మి’ వియోగ భారం తనను ఎంతలా కుదుపుతుందో అర్థమవుతుంది. దానికి తోడు శారీరకంగా సలుపుతున్న “మధుమేహం” వల్ల మానని గాయం.
అందుకే దానిని “ఎడమ పాదం మీద/
ఎంతో అమాయకంగా/
ఉదయించిన కొనగోరంతటి/
చిట్టి చంద్రవంక ” అని చెప్పుకున్నాడు.
తనకు మాత్రమే తెలిసిన ఆ బాధను ఓపలేక, ఎంతటి నరకయాతన అనుభవిస్తున్నాడో “నొప్పికణికలు చిందుతుంటే/
ఏకమై ఆ ఇనుడు భానుడు/
కారు చిక్కని ఏ నిశీధిలో/
చిక్కుకున్నారో” అని వ్యక్తం చేయడంలో దాగుంది. మృత్యువుకు దగ్గరవుతున్న క్షణాల్ని తడుముకుంటూ డెబ్బయ్యేళ్ళ జీవనసారాన్ని తర్కించుకుంటూ “మిగిలిందేమున్నది ఇంక,/
పులి నోటికి పూర్తిగా /
చిక్కినట్టే ఉంది ఈ జింక!” అని జీవిత చరమాంకపు స్వీయ మదింపు(self assessment) చేసుకోవడం కనిపిస్తుంది.
*
కవులు సాధారణంగా అంతవర్తనులు(introverts)గా చెబుతాం. ఈ స్థితి(introversy)ఎక్కువగా ఒంటరితనంలో బైటపడుతుంది. దేవిప్రియ గారి కవిత ఈ మానసికస్థితి నుండి పుట్టింది. Carl jung అనే శాస్త్రవేత్త పరిశోధనల వల్ల introversy and extroversy కి బహుళ ప్రాచుర్యం లభించింది. ఇక సామాజిక జీవితంలో బహిర్వర్తనులుగా, వ్యక్తిగత జీవితంలో అంతర్వర్తనులుగా వుండే వారిని ఉభయవర్తనులు(ambiverts)గా చెబుతారు. వీరు తాము చేసే పనుల్లో సమతుల్యత(balance)ను పాటిస్తారు. “వాన కురిస్తే నాలో కూడా కురిసేది”  అనే నెమరువేత ఏ జింకనూ పులినోటికి చిక్కకుండా ఆపలేదు.
*
Avatar

బండారి రాజ్ కుమార్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మరోసారి… ఇంకాస్త చదివితే బావుడు అనదగ్గ పోస్ట్… చాలా నచ్చిందన్నా

  • చక్కని సమీక్ష. వృద్ధాప్య మనస్సునును విశ్లేషించిన వైనం అద్భుతం. ఎంత గొప్ప వారైనా వృద్ధాప్యంలో, అందునా అనారొగ్యపు చీకట్లో జ్ఞాపకాల వెలుతురు కోసం వెంపర్లాడక తప్పదు.ఆ జ్ఞాపకాలు కూడా చీకట్లో మసక బారుతుంటే, జీవిత తుది ఘడియలు ఎలా తొంగి చుస్తున్నాయో ఆ కవిత ద్వారా చెప్పారు దేవిప్రియ. మీ మనో వైజ్ఞానిక విశ్లేషణ ఆ కవితకు గండ పేరుండం తొడిగింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు