దుఃఖమే మన వారసత్వమా?!

మానవోద్వేగాలు సార్వజనీనమైనవి. సుందరస్వప్నాలను నిలుపుకొనే లగ్జరీ సమాజంలో అందరికీ ఉండదు.

Freedom at Midnight పుస్తకంలో The Greatest Migration in History పేరుతో ఒక చాప్టరు ఉంటుంది.  అది ఆనాటి మానవోద్వేగాల పుర్రెలదండ.   ఇన్నేళ్లతరువాత మరో Migration ను కళ్లెదుటే  అందరం చూస్తున్నాం. ఈ ప్రపంచానికి  కరోనా కొత్తకావొచ్చు గాక- కానీ పై అంతస్తులను తమ భుజాలపై మోసే సెల్లార్ మనుషులను Parasites  అనుకోవటం సమకాలీన ప్రజాస్వామ్యపు విషాదం.    రాజ్యం Human Face  చూపని ప్రతి సందర్భంలోను సామాన్య ప్రజలు అసామాన్య మానవీయతను  ప్రదర్శిస్తారన్న  విషయం చరిత్రలో  పదేపదే రుజువౌతూనే ఉంటుంది.  ఎందుకంటే  after all ప్రజలందరూ మనుషులే.

ఇలాంటప్పుడు కవులేంచేస్తారు.  చరిత్రను రికార్డు చేస్తారు.  ఉద్వేగాలను అక్షరీకరిస్తారు. దుఃఖానికి రూపుకట్టి కాలానికి అంకితమిస్తారు.   ఈ మొత్తం విషాదదృశ్యంపై తనదైన వ్యాఖ్య చేస్తారు.

సి.వి. సురేష్  వ్రాసిన “దుఃఖ పారంపర్యం” అనే కవితలో నేడు నెలకొన్న పరిస్థితులను నాలుగు స్టాంజాలలో ఒక “నిశ్చల దృశ్యం” గా నిలిపిన వైనం తెలుస్తుంది.
*

దుఃఖ పారంపర్యం 

..1

సరిగ్గా రెండు చేతి సంచుల్లో సర్దేసే బతుకు
ఒక భుజం పై ప్రేమతో…
మైళ్ళ కొద్దీ సాగిన వాడి వలస,
ఇప్పుడీ దేశ ఇతిహాసానికో పుక్కిటికథ.

ఏమీ లేనితనం నుండి
ఇంకో శూన్యం లోకి పారే కవిత్వం
వాడివలసని రికార్డు చేస్తోంది….

2
ఆ రాజూ ఈ రాజూ కాదు
ఎవడు కాలరాసినా ఇక్కడ శాసనమే!
జీవితేచ్చ ఉక్కు పాదాల నుండి ఇగురించి
వ్రణమై సలుపుతోంది దారి వెంబడి.

ఎప్పుడు సగానికి తెగిందో కానీ,
కన్నీరుతో ‘సాక’ పోస్తోంది వాడి వలస బాటలో!

3
ఏమీ మిగల్చని ఆశ…
అతుకులేసిన చెప్పులతో సాగే నడక లో
తీవ్రంగా విరగబూస్తోంది!
లోలోపలే పుట్టి..
లోలోపలే పతనమయ్యే ఆకలి..
డొక్కల మీదుగా ఆగి ఆగి చేస్తున్న ఆర్తనాదం
వాడి వలస మార్గాన వినిపిస్తున్న నిశ్శబ్ద హోరు!

వాడి దుఖం..
ఎక్కడో జారిపోలేదు.. ఎప్పుడూ ముగిసిపోదు.
రేపటి కలకూ, కలవరింతకూ
అది హెరిడిటీ !

4
రాజ్యం చెరిపేసిన
ఒక సుందర స్వప్నం వీడు!

*

” రెండు చేతి సంచుల్లో సర్దేసే బతుకు” అన్న ఎత్తుగడలోనే మొత్తం కవిత ఆత్మ ఇమిడిపోయింది.

నేడు మనముందు జరుగుతున్న ఈ విషాదోదంతాన్ని గూర్చి రేపు ఏ చరిత్రా చెప్పకపోవచ్చు.   ఇతిహాసం అంటే అలా చెప్పబడినది అని అర్ధం.  అలా చెప్పబడినవాటిలో ఏనాడూ సెల్లార్ మనుషులు ఉండరు. సామాన్యుల దీన లేదా వీరోచిత గాధలను పుట్టికిపురాణాలుగా కొట్టేపారేస్తుంది చరిత్ర.  కానీ వాటిని సాహిత్యం సమస్త ఉద్వేగాలతో నిక్షిప్తం చేస్తుంది.

ఏ రాజు కాలరాసినా మనుషుల జీవితేచ్ఛ వారి ఉక్కుపాదాలనుండి చిగురిస్తుందనటం ఆశావహ దృక్పథం.  ఆ చిగురించటం అనే కాంక్షలో వ్రణమై సలిపే పాదాలను,  వలసబాట వెంబడి ధారగా కారే కన్నీటిని చూడటం వాస్తవిక చిత్రణ.
ఇప్పటికీ చాలా చోట్ల “అసలు వాళ్లెందుకు అలా నడుస్తున్నారో అర్ధంకావటం లేదు”  లాంటి రక్తప్రీతి వాదనలు వినబడటం దుర్మార్గం. వాళ్లు అలా ప్రాణాలకు తెగించి నడవటానికి కారణం-  వాడి బాటపొడవునా  విరగబూసే ఆశ అంటాడు కవి.   ఆశ…. ఆశ…..ఆశ ఒక్కటే….. సర్వం కోల్పోయినా ఏదోమూలనుంచి చిగురించే ఆశ.  ‘What men live by’  కథలో టాల్ స్టాయ్ చెప్పిన ఆశ.  అలా భరోసా ఇవ్వటం ఆశావహ దృక్పథం.  తిరిగి వాస్తవం లోకి వచ్చేస్తాడు కవి.  వాడి ఆకలి చేసే ఆర్తనాదం నిశ్శబ్దహోరట. వాడి దుఃఖం ఒక హెరిడిటీ అంటాడు.

దుఃఖవారసత్వం అన్న మాట ఎంత శక్తివంతమైనది!.  The Greatest Migration in History కాలంనుంచి మనం ఇంతవరకూ చేసిన ప్రయాణంలో దుఃఖాన్ని హెరిడిటీగా పొందటమా మనం సాధించిన ప్రగతి? ఇది కాదా మన  The Greatest Failure in History.

మానవోద్వేగాలు సార్వజనీనమైనవి.  సుందరస్వప్నాలను నిలుపుకొనే లగ్జరీ సమాజంలో అందరికీ ఉండదు.   ఇలాంటి సందర్భాలలోనే రాజ్యస్వభావం బయటపడుతుంది.   కాకుల్ని కొట్టి గద్దలకు వేయటమే తన ప్రాధాన్యత అని రాజ్యం బాహాటంగానే చెప్పుకొంటున్నప్పుడు- వీడి సుందరస్వప్నాన్ని చెరిపేసింది రాజ్యమే అని తీర్మానించక తప్పదు. అదే చేస్తాడు కవి చివరి వాక్యంలో.

ఈ కవితలో  ఆశావహధోరణి, జీవన వాస్తవికతలను పక్కపక్కనే నిలబెట్టటం ద్వారా భావోద్వేగ ఘర్షణను సాధించగలిగాడు కవి.  ఇది మనలను కలవరపెడుతుంది, ఆలోచింపచేస్తుంది.

*

Avatar

బొల్లోజు బాబా

33 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • బొల్లోజు బాబా గారికి నా మనః పూర్వక నమస్సులు..అలాగే సారంగ లో ఈ ప్రత్యేక విశ్లేషణ ప్రచురించడం చాలా సంతోషం..అఫ్సర్ సర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు!!

  • రాజ్యం చెరిపేసిన సుందర సత్యం వీడు

 • రాజ్యం చేరిపేసిన సుందర స్వప్నం వీడు..దుఃఖపారంపర్యం… సమకాలీన సమస్యను ఆర్ధత తో అక్షర బద్ధం చేశారు.. బాబాగారు లోతైన విశ్లేషణ చేశారు.ఇరువురికీ శుభాభినందనలు💐💐💐💐💐💐

  • బసవరాజన్న కు ప్రత్యేక ధన్యవాదాలు

 • వాడి దుఖం..
  ఎక్కడో జారిపోలేదు.. ఎప్పుడూ ముగిసిపోదు.
  రేపటి కలకూ, కలవరింతకూ
  అది హెరిడిటీ !చాలా అద్భుతమైన కవిత …మనసుని మెలిపెట్టేసింది సురేష్ గారూ !

  • మీ స్పందన అమూల్యం…ధన్యవాదాలు అండి

 • రేపటికి చరిత్ర పాఠంగా నిలిచే కవిత ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా విలువైన విశ్లేషణ చేసిన బాబాగారికి ధన్యవాదాలు. సురేష్ అన్నకు అభినందనలు.

  • అన్న మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు..

 • కలవరపాటు కలిగించే సందర్భాన్ని ఆవిష్కరించిన కవిత. బాబా విశ్లేషణ బాగుంది.

 • వాడి దుఖం ఎప్పుడూ జారిపోలేదు. ఎప్పుడూ ముగిసిపోలేదు. అది వంశపారంపర్యం అన్నచోట
  ఒక వణుకు.. నిజంగా ఎదురుతిరగటం నేర్చుకుంటె తన కోసం లేని సమాజంపై పగ బడితే ఎంత అతలాకుతలమౌతుందో…’. వాడే రాజ్యం చిదిమిన సుందర స్వప్నం. “ఈ మాట నిజం. కడుపుకు రెండు రొట్టెముక్కలు. తన కుటుంబంతోకాసింత తీరుబాటు. ఇదేకదా ఆ మనిషి కనీసావసరం. అవికూడా ఇవ్వలేని రాజ్యం. వున్న ట్టా.. లేనట్టా.. దారి అంతా వారి సమాధులే… పుట్టుక కు చావుకు సజీవ సాక్ష్యాధారాలే… మిగిలిపోయే అతుకులు చెప్పులు గుర్తులు ఎప్పటికీ చెదరవేమో….భుజాన మోసేప్రేమ.
  … ఆ ప్రేమకైనా మంచి భవిష్యత్తు వుంటుందా..
  ఈ వారసత్వ దరిద్రం వదిలి… హ.. వుండాలి… వుంటుంది… ఈ రెండు సంచుల్లో సర్దెయ్యగల జీవితాలు… మారాలంటే ఏంచెయ్యాలో.. అంతులేని దుఖ పారంపర్యానికి అడ్డుకట్ట కట్టగల ఆపన్న హస్తాలు మొలకలెత్తుతూనే వుండాలి.. మొలకలెత్తుతూనే వుండాలి…..

 • రాజ్యం చెరిపేసిన సుందరస్వప్నం వీడు….అద్భుతమైన కవితకు సవివరమైన చక్కని విశ్లేషణ ….సర్

 • అద్భుతమైన కవిత….దానికి సరిసాటి విశ్లేషణ👌👌👌

 • మంచి పరిశీలన మీది, బొల్లోజు బాబా గారు, కవి హృదయాన్ని ఆవిష్కరించారు. ధన్యవాదాలు.

 • C.v. Suresh gari దుఃఖమే మన వారసత్వ మా
  అనే కవిత కోట్ల కన్నీటి జీవితా ల నిశబ్ద రోదన కు
  అక్షరరూపం దాల్చిన చరిత్ర.
  ఇన్ని కోట్ల కూలీల కన్నీరు సునామీ గా మారి తిరగబడితే ఆ కన్నీటితో పుట్టిన తిరుగుబాటు
  కొత్త పరిష్కారాన్ని చూపేదేమో.

 • మంచి అన్నంలోకి మంచి కూర వడ్డించి నట్టుంది.
  ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు.

 • శ్రీ సి.వి. సురేష్ గారు ఎంతో బాధపడీ, మథనపడీ, ఆవేశపడీ, గుండెపగిలీ ఇక తట్టుకోలేనంత ఆవేదన తో రాసినట్లున్నారు కాబోలు కవిత మొత్తం రక్తాశ్రువుల్ని స్రవిస్తోంది.
  శ్రీ బొల్లోజు బాబా గారయితే ఆ రక్తాశ్రువుల్ని దోసిట నిండా పట్టి రచయిత కన్నా ఎక్కువ ఆక్రోశంతో పాఠకుల పైకి విసిరి చల్లారు.

 • అద్భుతమైన కవిత
  దానిని విశద పరుస్తూ మరింత అద్భుతమైన విశ్లేషణ
  నిజమే ఇది ఎవరూ రాయని ఇతిహాసం
  ఎందుకంటే ఇంత బాధా పడ్డ వాళ్లే రేపు మళ్లీ మామూలు అవుతారు… అదే ప్రజాస్వామ్యానికి మళ్లీ అలాగే తనఖా కాబడతారు…. తప్పదు
  తిరిగేది కాల చక్రం అయినా
  తిరుగుతూ సాగేది మనిషి బతుకు కదా….
  అది అలా సాగాల్సిందే…..

 • బాధాకరం. మంచి కవిత. విశ్లేషణ బావుంది సర్

 • సురేష్ గారు! కవితను దృశ్యం చేసి కళ్ళముందు నిలిపారు ! మనసుకు చూపించారు. చాలా విషయాలు చూస్తె వాటి లోతులు అనుభవైక్యంకావు. సినీమాలు నిజ జీవితంపై చిత్రింతినవి చూశానంటె,తృప్తి కలుగదు. ఆ పుస్తకం చదివాలి. రచయిత అనుభవైక్యం చేస్తారు. మీ కవిత మరియు , బాబాగారి విశ్లేషణ చురుక్కుమనిపించిది. ఇద్దరికి అభినందనలు.

  • గొప్ప ప్రశంస సర్..మీ ఆత్మీయ అభిమానానికి చాలా సంతోషం..

   వాళ్ళ పెనుబాధను చూసి, చలించి పోయి రాసాను సర్

 • ‘మానవోద్వేగాలు సార్వజనీనమైనవి?’ అన్నారు. వర్గ సమాజంలో ఈ ‘సార్వజనీనత’ సూత్రం అన్ని వర్గాలకూ సమానంగా వర్తిస్తుందా? లేదని భావిస్తాను.

  రాజ్యం ఒక సుందర స్వప్నాన్ని చెరిపేసిన తరవాత ఇక ఆశ ఎక్కడుంది?

  ‘రాజ్యం చెరిపేసిన ఒక సుందర స్వప్నం వీడు!’
  నాకు గందరగోళం అనిపిస్తుంది.

  • సర్..నమస్తే!

   ఆశ ఎక్కడుంది!? అన్న ప్రశ్నతో మీ వ్యాఖ్యానం ముగిస్తూ..”నాకు గందరగోళంగా ఉంది” అన్నారు..

   ఆశ ను నేను ఎక్కడా ప్రస్తావించలేదు సర్.. ఈ దేశ సుందరస్వప్నం ఆ వలస కూలీ..Money producers..ఆర్థిక నిర్మాతలు వీళ్ళు..సహజంగా వాళ్ళు ఈ దేశానికి సుందర స్వప్నాలే..అలాంటి దేశ సుందర స్వప్నాన్ని ఈ రాజ్యం చేరిపేసింది……
   అన్న అర్థం లో వాడాను…!!

   పోయెమ్ లో కూడా…ఆశ..వెను వెంటనే వస్తున్న పెనుబాధ ను పక్కపక్కనే పెట్టాను..

   బ్రతుకు పైన ఎంతో ఆశ ఉండబట్టే అన్ని వేల కిలోమీటర్లు నడిచి సొంతూళ్లూ చేరుకొంటారు సర్…

   అయితే , ఆశ వెంటనే అది వ్రణo లా మారడం..
   అనే అర్థం లో పోయెమ్ మొత్తం సాగుతుంది..

   మీ పరిశీలన కు నా ధన్యవాదాలు సర్

  • thank you Ramanaidu gaaru

   మానవోద్వేగాలు సార్వజనీనవి అన్నది ఎందుకంటే ఉద్వేగాలు జీవ లక్షణాలు. వాటికి రాజుపేదా తేడా ఉండదు.

   ఆ తరువాతి వాక్యమైన సుందరస్వప్నాలను నిలుపుకొనే లగ్జరీ సమాజంలో అందరికీ ఉండదు… అన్నది వర్గసమాజాన్ని దృష్టిలో ఉంచుకొని అన్న మాట.

   థాంక్యూ మీ అభిప్రాయాలు పంచుకొన్నందుకు

 • స్పందించిన అందరకూ ధన్యవాదములు.

  కొన్ని వారాలుగా చూస్తోన్న వలసకార్మికుల వెతలు నన్ను కలవరపరచాయి. రకరకాల ఆలోచనలు.
  సురేష్ గారి ఈ కవిత చదివాకా ఒక దృక్కోణం కనిపించింది. అది నాకు నచ్చింది. కవిత్వీకరణ చేస్తూనే ఒక దృక్పథాన్ని చెప్పటం కష్టం. ఆ పని సురేష్ గారి కవితలో పరిపూర్ణంగా ఆవిష్కరించబడిందని భావించాను.

  ఈ వ్యాఖ్యానం వ్రాయటానికి సురేష్ గారి కవితలో ఉన్న ఔన్నత్యమే కారణం.

  ఇక్కడ కామెంటు చేసినవారందరకూ ధన్యవాదములు.

  బొల్లోజు బాబా

 • కలాన్ని ఎంపథీలో అద్ది గీసిన అక్షరచిత్రం.
  రవి గాంచని ‘లోపలే పుట్టి లోపలే చచ్చిపోయే ఆకలి’ని కవి గాంచాడు.

  kisi ko ghar se nikalte hi mil gayi manzil
  koi hamari tarah umar bhar safar mein raha
  – Ahmad Faraz

  • గొప్ప ప్రశంస రమాకాంత్ సర్…ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు