దాసరి అమరేంద్ర ‘శేఫాలిక’ విందామా?

పూవులు పలకరించగలవా?
మొక్కలు మాట్లాడగలవా?
ఆకులు ముచ్చట్లాడగలవా?
చెట్లు కుశలమడగగలవా?
ఆ పలకరింపులూ చిరునవ్వులూ, చిట్టికోపాలూ అంతలోనే మర్చిపోవడాలూ ఇవన్నీ రోజూ మన కళ్లముందు జరుగుతూనే ఉంటాయండి. అయితే, అతి సూక్ష్మజీవులని చూడడానికి మైక్రోస్కోప్ అవసరమైనట్లే, అతి మూగభాషలని వినడానికి మనసు కావాలి. ఆ భాషలో మాట్లాడే వాటితో కలిసి కరిగిపోగల సున్నితత్వం కావాలి. మాటలు కొనసాగించడానికి తగిన తాదాత్మ్యం కావాలి. స్పందించడానికి అనువైన గుండె కావాలి.
ఇవన్నీ కలబోసుకున్న గాథ ఏమౌతుంది? దాసరి అమరేంద్రగారి కథ – “శేఫాలిక” అవుతుంది.
వినండి. శేఫాలిక.

స్కూటర్ నలందా హాస్టలు రోడ్డు మలుపు తిరిగింది.

“ఇల్లు తెలుసా? ఇంత నమ్మకంగా నడిపేస్తున్నావు – గుర్తుపట్టగలవా?” అడిగింది బుద్ధి.

“తెలియదు. ఇదే మొదటిసారిగదా అయినా గుర్తుపట్టగలను,” చెప్పింది మనసు.

“అదెలాగా?” రెట్టించింది బుద్ధి.

“నీకర్థగాదులే. అలా చూస్తూ ఉండు,” కవ్వించింది మనసు.

మాటల మధ్యనే రోడ్డుకు కుడివేపు చెట్ల మధ్యన దాగి ఉన్న చిన్న డాబా ఇల్లు కన్నిపించింది. అదే ‘శేఫాలిక’ అయి ఉండాలని మనసుకు తోచింది. అప్రయత్నంగా బండిని ఇంటి ముందు ఆపాను. వరండా కటకటాలకు వేలాడదీసి ఉన్న బోర్డు – అదే శేఫాలిక అని నిర్ధారించింది.

ఆ ఇంటిని ఇంతకుముందే ఎన్నోమార్లు చూసిన భావన..

ఆప్తమిత్రుడినీ.. చిరపరిచితుడ్నీ కలసిన అనుభూతి.

శేఫాలిక కూడా పలకరింపుగా నవ్వి ఆహ్వానించినట్లనిపించింది.

ఇళ్లూ చెట్లూ నవ్వగలవా? పలకరించగలవా?

గేటు తెరుచుకుని ప్రహరీ లోపలికి నడిచాను.

తలుపుకు తాళం.

ప్రాణం ఉసూరుమనిపించింది.

పోనీలే. మొన్ననే గదా తనను విజయవాడ సభలో కలుసుకొన్నది. ఎలానూ కాకినాడ వచ్చాగదా చూసి వెళితే బావుంటుందని రావడమేగానీ మాట్లాడుకోవలసినవన్నీ విజయవాడలోనే మాట్లాడేసుకోలేదూ…

అవునా? వొట్టి పలకరింపు కోసమేనా వచ్చిందీ? కాకినాడలో శేఫాలిక ఒక దర్శనీయ స్థలమనిగాదూ వచ్చిందీ?!

నిరాశపడబోతున్న మనసుకు ఎలాగో సర్దిచెపుతూ వెనక్కి తిరిగాను.

“వెళ్ళిపోతున్నావా?”

ఎవరా పిలిచిందీ?

చుట్టూ చూశాను.

అప్పుడు గమనించానా పచ్చని వనాన్ని.

ఇంటి ముందంతా తీగలు.. పొదలు.. మొక్కలు..

ఆసక్తి పెరిగి పెరటివేపుకు నడిచాను.

తులసికోట. దాని వెనక ఓ మందార మహావృక్షం!

“వచ్చావా.. ఎన్నాళ్లనుంచీ నీకోసం ఎదురుచూస్తున్నానో,” అన్నదా మందారం.

“నాకోసమా… నేను నీకు తెలుసా?”

ఆశ్చర్యంతో అడిగాను.

“భలేవాడివయ్యా.. శేఫాలికను కలుసుకొందామని వేలాది మైళ్లు ప్రయాణం చేసి వచ్చావు. శేఫాలిక అన్న పేరు చూసే మురిసిపోయావు. నువ్వు నాకు తెలియకపోవడం ఏమిటీ?! ఏమ్మాటదీ? స్నేహాలంటే ప్రాణమంటావు – ఇదేనా స్నేహితులను గుర్తించే పద్ధతి? తాళం వేసి ఉంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమేనా?” ఆ మందారం గొంతులో అల్లరి.. ఆర్తి.

ఎంత ఎత్తుగా ఉందీ ఆ మందారం! అంతగా పెరిగిన మందారాన్ని చూడటం అదే మొదటిసారి. బహుశా ప్రేమా ఆప్యాయతలనూ ఎంకి పాటలనూ పెట్టి పోషించి ఉంటారు. మామూలు పెంపకంలో అంత అందంగా అంత ఏపుగా ఓ మందారం ఉండగలదా?

“అవును పాటలు తినే పెరిగాను. ప్రేమను తాగే పుష్పించాను.” నా మనసులోని మాటను గ్రహించిన మందారం నిర్ధారించింది. దాని కళ్లలో ఎంత వెలుగో ఆ మాట చెపుతున్నప్పుడు.

ఎన్నో కబుర్లు. ఎన్నో యుగాలనుంచీ ఒకరినొకరు ఎరిగిన వాళ్లంలాగా ఎడతెగని ఊసులు. ఆ మందారపు నీడన వేసి ఉన్న వాలుకుర్చీలో కూర్చుని కొమ్మనూ పలకరించాను. రెమ్మరెమ్మనూ నిమిరాను.

“ఓ పువ్వు ఇవ్వనా?” ఆడిగింది మందారం.

“వద్దు. నేనేం చేసుకుంటాను? అయినా నిన్ను నువ్వు త్రుంచుకొని నాకు ఇస్తే నాకు బావుంటుందని ఎలా అనుకొన్నావూ?” నా గొంతులో నిష్ఠూరం.

నవ్వింది మందారం.

“మరి వెళ్లిరానా?” బయల్దేరడానికి సిద్ధపడ్డాను.

“వెళ్లిపోవడమేనా?”

ప్రశ్న అర్ధంగాలేదు.

“వెళ్లడమూ అంటే.. పోనే వెళ్లి మళ్లా వస్తాలే…” నసిగాను.

“అదిగాదోయ్ మొద్దబ్బాయ్. ఈ ఇంటి ఆవరణలో నేనొక్కదాన్నే ఉన్నాననుకొన్నావా? మాదో పెద్ద కుటుంబం… అవిగో అవన్నీ నువ్వొచ్చావనీ, నీతో మాట్లాడాలనీ ఎంత తహతహలాడుతున్నాయో చూడు. నీకోసం ఎదురుచూసేవాళ్లను కనీసం గుర్తించనైనా గుర్తించకుండా వెళ్లొస్తానూ అనడానికి నీది గుండా రాతిబండా?”

చుట్టూ చూశాను.

ఎన్ని రకాల మొక్కలవీ!!!

గున్నమామిడి, వేప, నేరేడు, జామ, నిమ్మ, మునగ, కొబ్బరి, అరటి, మోదుగ, కరివేప, రబ్బరు, సన్నజాజి, మల్లె, సంపెంగ, నందివర్ధనం, పారిజాతం ఎన్ని రకాల మొక్కలూ!!! ఏ ఒక్కటీ మరొకదాని ఎదుగుదలకు అడ్డురాకుండా దేని స్థానంలో అది. దేని స్వేఛ్చ దానిది.

ముచ్చటనిపించింది. ఎంత చక్కని కుటుంబం! అన్నీ పలకరింపుగా నవ్విన భావన. మొక్కలవేపుగా నడిచాను.

“ఏవబ్బాయ్.. ఏవిటా నల్ల కళ్లద్దాలూ? మా పచ్చదనం ఆ గంతల కళ్లతో చూస్తే నీకేం బోధపడుతుందీ?” కోప్పడింది వేపచెట్టు. వయసులో పెద్దదిగావును. మందలింపు పెద్ద వాళ్లందరి సహజ లక్షణం కదా?

నవ్వుతూ కళ్లజోడు తీశాను.

“అయ్యో.. ఋతువుగాని ఋతువైపోయింది. రాకరాక వచ్చావు. పెడదామంటే ఒక్క పండైనా లేకపోయే,” వాపోయింది జామ.

“మరేం పర్లేదు పెద్దమ్మా… నాకేమంత తినాలనిపించడం లేదు,” సముదాయించాను.

“చూడు బాబూ! అదిగో ఆ పక్కనున్న కొమ్మమీద పండు ఎర్రబారింది. కొంచెం నన్ను వంచి కోసుకొని తిను,” అన్నది గున్నమామిడి.

“వద్దు. పండుకోసి నీకు నొప్పి కలిగించడం నాకు ఇష్టం లేదు.”

“ఏమిటా చాదస్తం! ఆ పండును కింద రాల్చటం నాకు క్షణంలో పని. కానీ అది కింద పడటమెందుకూ, చితికి పోవడమెందుకూ, మట్టిగొట్టుకుపోవడమెందుకూ – ఒక్క పండు కోసినంత మాత్రాన నేనేం అరిగిపోనుగానీ కోసుకొని శుభ్రంగా తినవయ్యా!” చనువుగా మందలించింది మామిడి.

కోసుకొన్నాను. కడుపు నిండింది. అంత రుచికరమైన పండును అంతవరకూ తినలేదనిపించింది.

“ఏం బాబూ బావున్నావా! గుర్తుపట్టావా? ఎక్కడుంటున్నావూ?” ప్రహరీ గోడను ఆనుకొని వున్న నేరేడు పలకరించింది.

గుర్తుపట్టలేకపోయాను.

“..అవును మరి ఇప్పటిమాటా.. పాతికేళ్లు అవలేదూ.. హాస్టల్లో చదువు సాగడం లేదని రోజంతా ఇక్కడే చదువుకొనేవాడివి.. ఇక్కడంతా మామిడితోట ఉండేది.. అన్ని మామిడిచెట్ల మధ్య నేనొక్కదాన్నే నేరేడును..” గుర్తుచేసింది.

అయిదేళ్ల ఇంజనీరింగ్ చదువు.. హాస్టలు జీవితం…ఆటలు. పాటలు.. స్నేహాలు.. ఆశలు.. నిరాశలు.. ఆశయాలు.. అవకాశవాదాలు.. లేగప్రేమలు.. రాగద్వేషాలు.. కాలేజీ పాలిటిక్స్ – అన్నీ గుర్తొచ్చాయి.

అప్పటిదా ఈ నేరేడూ! పెద్దగా మారినట్టు లేదు. మనుషుల్లో అంటే పాతికేళ్లలో ఎన్నో మార్పులు వస్తాయిగానీ మొక్కలకు ఆ ప్రమాదం లేదు తక్కువగదా..

ఎక్కడ్నించో చిన్నపిల్ల ఏడుస్తోన్న ధ్వని.

ఎవరదీ?

ఓ పక్కన ఓ చిన్నారి సన్నజాజి వెక్కెక్కి పడుతోంది. అది చిన్నదే. ఏడాదీ ఏడాదిన్నర కన్నా వయసులేనిది.

“ఏమ్మా! ఎందుకా ఏడుపూ..”

“ఎందుకా.. అసలీ ఇంట్లో నా సంగతి పట్టించుకునే వాళ్లెవరైనా ఉన్నారా? నే పుట్టిన మొదట్లో ఆరునెలలూ ముద్దుగానే చూశారు. గత ఏడాదిపాటుగా ఇంటిపట్టున ఉంటేగదా.. ఏవో శతజయంతి సభలట.. ఇవాళ కాకినాడ.. రేపు విజయవాడ.. మర్నాడు తిరుపతి.. ఆపైన హైదరాబాదు.. ఇంకా కావాలంటే ఢిల్లీ. మరి నేను మామిడీ జామలలాగా పెద్దదాన్ని కాదుగదా.. వారాలకు వారాలు వదిలేసి వెళ్లిపోతే బెంగపుట్టదూ? ఏడుపు రాదూ? అసలు చూడు నేను అలా మట్టిగొట్టుకొని ఉన్నానో..” సన్నజాజి గొంతులోని ఏడుపు కట్టినా దిగులు మాత్రం పొంగిపొరలింది.

‘అయ్యో పాపం,’ అనిపించింది. చుట్టూ చూశాను. నీళ్లు కనిపించాయి.

నీళ్లు పోసి ప్రతి ఆకునూ కడిగి తుడిచాను.

ఎంత సంతోషమో – కిలకిలా నవ్వింది.

వెళ్లొస్తానన్నాను. బుల్లి మొక్క బుంగమూతి పెట్టింది.

నందివర్ధనం దగ్గరకు నడిచాను.

పరచిన తెల్ల తివాచీలా దానిచుట్టూ నేలమీద వలయాకారంలో పూలు. చెట్టు నిండా పచ్చని కలశంలో పొదిగిన వెండి బిళ్లల్లా పూలు. వాసనలేని నందివర్ధనానికి తోడుగా పక్కనే పరిమళాలు వెదజల్లుతోన్న పారిజాతం.. శేఫాలిక.. చక్కని ‘దోస్తీ’ అనిపించింది.

అటుపక్కన చిన్న గులాబీ మడి.

నడిచాను. గులాబీలు కలవరపడతాయేమోననిపించి..

“భయపడకండి,” అన్నాను.

“భయమా? ఎందుకూ?” కోరస్‌గా పలికాయవి.

“మిమ్మల్ని చూస్తోంటే ఎవరికైనా కోసి ముద్దుపెట్టుకోవాలనిపించదూ..అందుకని భయపడతారేమోనని,” వివరించాను.

“ఓ.. మాకా భయంలేదు. మా ఇంటికి వచ్చే వాళ్లలో పువ్వుల్ని కోసే తరహా మనుషులు అత్యంత అరుదు, ధీమాగా చెప్పాయా గులాబీబాలలు.

మెట్లెక్కి డాబా పైకి చేరాను.

అప్పటిదాకా ఒక్కొటొక్కటిగా పలకరించిన చెట్లన్నీ పైనుంచి ఒక్కసారిగా కనిపించి పులకరింపజేశాయి. మనస్సు కెమేరాతో చకచకా వాటన్నింటినీ ఫొటోలు తీసేశాను. జ్ఞాపకాల పొరల ఆల్బమ్‌లో జాగ్రత్తగా భద్రపరిచాను.

మొక్కలన్నిటికీ వీడ్కోలు పలికాను.

అవి కూడా గాలితెరల సాయంతో తలలు ఊపి సంతోషం ప్రకటించాయి.

“వచ్చి వెళ్లానని చెపుతారు గదూ.”

“ఆ అవసరం లేదు.”

“ఎందుకనీ?”

“చెప్పకుండానే తనకు తెలిసిపోతుంది. మాలోని కొత్త కళను గుర్తుపట్టడం, అందుకు కారణం ఊహించడం తనకు కష్టంగాదు.”

అద్భుతమనిపించింది. ఇంత స్నేహాన్నీ ఆప్యయతనూ పొందడం ఎంత అదృష్టం.

గేటు తెరిచాను. అన్యమనస్కంగా బయటకడుగుపెట్టాను.

“నాతో మాట్లాడకుండానే వెళ్లిపోతున్నావా?” గేటు బయట రోడ్డు వారన రెండు మోదుగల మధ్యన అందంగా నిలిచివున్న బూరుగచెట్టు పలకరించింది.

“శేఫాలికను చూడటంతోనే నీ పని అయిపోయిందనుకోకు. కాలేజీ ఆవరణలోని ప్రతి అణువుతోనూ నీకు పరిచయమే గదా.. వెళ్లు.. వెళ్లి ఆ చెట్లనూ, భవనాలనూ, కాలిబాటలనూ పలకరించు. నువ్వొచ్చావన్నమాటను అప్పుడే గాలీ పిట్టలూ మోసుకువెళ్లి కాలేజీలో చాటి చెప్పేశాయి,” హితవు చెప్పింది బూరుగ.

అవును.. అయిదేళ్లపాటు అన్నింటితోనూ అనుబంధం పెంచుకొని బ్రతికినవాడిని. అన్నింటినీ పలకరించాలి. అసలందులో ఎన్ని ఉన్నాయో – ఎన్ని కాలగర్భంలో కలిసిపోయాయో!

ఏదో తెలియని భావావేశం. శేఫాలిక మీద తెలియని అనురాగం. కాలేజీ ప్రాంగణం మీద తిరిగి విరిసిన మమతల వెల్లువ. ఏమిటో ఈ అనురాగాల ఆంతర్యం!

తెలిసీ తెలియనట్లనిపించింది.

శ్రీనివాస్ బందా

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు