దాసరి అమరేంద్ర కథ – పయనాలు

చేతిలో చెయ్యి వెచ్చగా అనిపించినా, మనసులు గడ్డకొట్టొచ్చేమో!
నాలుగడుగులు కలిసి పడినా, బాటలు విడిపోనూ వచ్చేమో!
చేరికలోనూ దూరముండొచ్చేమో!
మనుషుల లోతులను కొలిచే సాధనాలేమిటో!
దాసరి అమరేంద్ర కథ – పయనాలు – వింటే తెలుస్తుందేమో!

పయనాలు

దాసరి అమరేంద్ర

“ప్రైమ్మినిష్టరిల్లంటే నేనింకెంతో ఊహించుకొన్నాను. ఇలా ఉందేమిటీ?” ఆశ్చర్యంగా అన్నది వందన.

“లక్షాధికారులయినా లవణమన్నమేగాని వెండి, బంగారాలు మింగబోరు అన్నాడో తెలుగు కవి. అట్టహాసంగా ఉంటేనే గొప్ప ఇల్లు అయిపోదు గదా…” కొంచెం అల్లరిగా అన్నాను.

“ఆ కవిగారినోసారి మన ఊరి తాజ్ హోటల్‌ వాళ్ల ‘ఓరియెంట్ ఎక్స్‌ప్రెస్’ రెస్టారెంట్లో భోజనం చేయిస్తే సరి, ఆయనకూ అర్థమవుతుంది… పిలిపించరాదూ…” అంతే అల్లరిగా నవ్వుతూ చెణుకు విసిరింది వందన.

“అంత వెనక్కి వెళ్లి పిలిపించడం సాధ్యంగాదులే,” అనంటూ ముందుకి దారి తీశాను. అయినా ఆ కవి ఒక్క భోజనానికి వెయ్యి రూపాయలు ఖర్చయ్యే ఆ రెస్టారెంట్లో కూర్చొని ఉంటే ఎలా ఉంటుందోనన్న భావన మనసులో మెదలి సన్నని చిరునవ్వుకు దారితీసింది.

ఇద్దరం ‘ఇందిరా మెమోరియల్’  ఆవరణలోకి అడుగుపెట్టాం.

అప్పుడే ఆరేళ్లు దాటేసింది నేను ఢిల్లీ వచ్చి. మొదట్లో ఢిల్లీ నగరపు దూకుడు ధోరణి అంటే కాస్తంత చిరాగ్గా ఉండేదిగానీ మెల్లగా ఆ నగరపు అందానికి లోబడిపోయి అక్కడి మనుషుల్ని కూడా సహించడమూ ప్రేమించడమూ మొదలెట్టాను.

ముందు మండీహౌస్‌లోని రవీంద్రభవన్లో కనిపించేది వందనా శ్రీవాత్సవ. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారి నాటకాల్లో ముఖపరిచయమయింది. ఏపీ భవన్లో బాలమురళి కచేరీలో కనిపించేసరికి ఆసక్తి పెరిగింది. నేషనల్ మ్యూజియమ్‌వాళ్ల ఆర్ట్ క్లాసులో తనూ కనిపించేసరికి ఆత్మీయంగా అనిపించింది. స్నేహం ఆరంభమయింది. మాటలు పెరిగాయి. ‘ఇలా అనుకోకుండా కలుసుకోవడం గాకుండా ఈసారి అనుకొని కలుసుకొందాం’ అనుకొన్నాం. అందుకు ‘ఇందిరా మెమోరియల్’ను వేదికగా ఎంచుకొన్నాం.

న్యూఢిల్లీ  ఓ పథకం ప్రకారం కట్టిన అందమైన నగరం. తూర్పు పడమరలుగా సాగే రాజ్‌పథ్‌కు తూర్పుకొసన ఇండియా గేట్ ఉంటే పడమటికొసన రాష్ట్రపతి భవనం. ఆ రాజపథ్‌కు కుడిచేతివేపుగా సాగితే బిజినెస్ సెంటర్లయిన కనాట్‌ప్లేస్‌లాంటి ప్రదేశాలు. ఎడమవేపున వెళితే బడాబడా గవర్నమెంటు బంగళాలు. అన్నీ తీర్చిదిద్దిన విశాలమైన రోడ్లు. ఆ రోడ్లకు అటూఇటూ అరవై డెబ్భై ఏళ్లనాడు నాటిన పెద్ద పెద్ద చెట్లు. రోడ్లు కలిసేచోట్ల అందమైన ట్రాఫిక్ ఐలెండ్లు – అదిగో అలాంటి పరిసరాల మధ్యన ఉంది అ నెంబర్ 1… సఫ్దర్‌జంగ్ రోడ్… ఇందిరా మెమోరియల్.

ఓ మనిషి గొప్పదనానికి అతనుండే ఇంటి పరిమాణమే కొలమానమైపోతున్న ఈరోజుల్లో ప్రైమ్మినిష్టర్లూ ప్రెసిడెంట్లూ ఎలాంటి ఇళ్ళల్లో ఉంటారో చూడాలనిపించింది. రాష్ట్రపతి భవనం గురించి ఎంతో కొంత తెలుసు గాబట్టి ఇరవై ఏళ్లపాటు ఇందిరాగాంధీ నివసించిన ఆ నెంబర్ 1, సఫ్దర్‌జంగ్ రోడ్ బంగళాకు వెళితే నా కోరిక తీరుతుందనిపించింది. పైగా ఇప్పుడదో మ్యూజియంగా మారిందిగాబట్టి సెక్యూరిటీ చెక్‌ల బెడద లేకుండా తాపీగా ఆ యింటిని మూలమూలలా పరీక్షగా చూడవచ్చుగదా!

వచ్చిందేగానీ వందన ధోరణి చూస్తోంటే తనకీ విషయం మీద అంత ఆసక్తి ఉన్నట్టు కనిపించలేదు. అనవసరంగా తన టైం వృధా చేస్తున్నానా? అయినా తనను రమ్మన్నది  ఇందిరాగాంధీ ఇంటిని చూడడానికేనా? మా స్నేహాన్ని అభివృద్ధి చేసుకోవడానికి గాదూ!!

విశాలమైన ఆవరణలో చక్కని పచ్చికబయళ్లూ పొడవాటి చెట్ల మధ్యన నిరాడంబరంగా కనిపించింది ఆ ఆరేడు గదుల నివాస గృహం. లోపలికి నడిచాం.

మొదటి రెండు గదులు ప్రదర్శన కోసమే కేటాయించారు. ఆవిడ జీవిత విశేషాలను వివరించే ఫోటోలు. డాక్యుమెంట్లు, వార్తాపత్రికలు, వస్తువులు, ఆవిడ అందుకొన్న అవార్డులు, భారతరత్నలు, మెడల్సు, చిన్నప్పటి ఫోటోలు, శాంతినికేతన్ విశేషాలు, యవ్వనంనాటి అందమైన ఛాయాచిత్రాలు, అమ్మ కమలతో స్విట్జర్లాండు నివాసం, ఫిరోజ్‌గాంధీ పరిచయం, తీన్‌మూర్తి భవనంలో నాన్న నెహ్రూతో ఉన్నప్పటి జ్ఞాపకాలు. సంజయ్, రాజీవ్‌ల చిన్నతనం, రాజకీయాలు, రణరంగాలు, పిల్లల పెళ్లిళ్లు, సిండికేట్లు, మొరార్జీలు, నిజలింగప్పలు, బాంగ్లా యుద్ధాలు, ఎన్నికలు, ఎమర్జెన్సీలు, విజయాలు, పరాజయాలు, జైళ్లు, పునరుత్థానాలు, బ్లూస్టార్లు, బుల్లెట్లు – ఓ అధ్యాయం అర్థాంతరంగా ముగియడం…

అది గతం. అది చరిత్ర. మనసు బరువెక్కింది.

వందనకోసం చూశాను. 1980లో ఇందిరాగాంధీ తిరిగి ఘనవిజయం సాధించిన నాటి వివరాలున్న వార్తాపత్రికలను చదువుతూ కనిపించింది. మెల్లగా ఆవిడ పక్కకు నడిచాను. ఇద్దరం కలిసి ఆ గదులలోంచి బయటపడ్డాం.

“రాజూ… నీకెన్నేళ్లూ?” అనుకోని ప్రశ్న.

“ముప్ఫై ఒకటి.”

“పెళ్లెందుకు చేసుకోలేదూ?”

“కారణమంటూ లేదు. పెళ్లనే దానినో తిరుగులేని రిచ్యువల్‌గా నేను భావించలేదు. అందరూ చేసుకొంటున్నారుగాబట్టీ, ప్రపంచం నిర్దేశించిన పెళ్లి వయసు వచ్చిందిగాబట్టీ – పట్టుపట్టమని పట్టుపట్టి పెళ్లి చేసేసుకోవడం నాకు అసహజం అనిపించింది. అలా అని నేను పెళ్లికి వ్యతిరేకినిగాను. కాకపోతే పెళ్లి చేసుకోమని వేధించే పెద్దాళ్లు ఇంట్లో లేకపోవడం నా అదృష్టం,” చెప్పాను. వందన మొహంలో కనిపించీ కనిపించని విస్మయం. అసలెందుకడిగింది ఈ ప్రశ్న?

బొమ్మలూ ఫోటోలూ ఉన్న ఆ రెండు గదులూ దాటి ఇందిరాగాంధీ స్టడీ రూమ్ పరిసరాలలోకి వెళ్ళాం. ఎంత చక్కనిదో ఆ స్టడీరూమ్!

అన్నివేపులా గోడలకు నిలువెత్తు పుస్తకాల బీరువాలు. ఆ బీరువాల్లో అందంగా బైండ్ చేసి పెట్టిన అనేకానేక అపురూప గ్రంథాలు. ఎడమవేపున గోడకు దగ్గరగా ఓ రైటింగ్ టేబుల్… ఓ మూల సౌకర్యవంతమైన వాలు కుర్చీ.. మరోపక్కని చిన్న సోఫాసెట్టు… నిరాడంబరమైన అలంకరణ సామగ్రి. గోడలకు అభిరుచి ఉట్టిపడే వర్ణచిత్రాలు… ఆ స్టడీరూం ముందుభాగమంతా అడ్డుగోడలేని ఆవరణ. కళ్లనిండుగా కనిపించే లాన్లూ చెట్లూ… ఆ గదిలో… ఆ వాలు కుర్చీలో కూర్చొని చదువుకోగలిగిన ఇందిరాగాంధీ ఎంత అదృష్టవంతురాలో అనిపించింది.

“వందనా… నీకు సాహిత్యమంటే ఆసక్తి ఉందా? పుస్తకాలు చదువుతావా?”

“ఉండేది. చదివేదాన్ని. కానీ ఇపుడు నా ఉద్యోగానికి సంబంధించిన కంప్యూటర్ పుస్తకాలకే టైము చాలడంలేదు.  ఇహ సాహిత్యానికి కూడానా…” యథాలాపంగా చెప్పింది వందన. ఆమె మాటల్లో నిరాశ ధ్వనించింది.

“మరి డ్రామాలూ, ఆర్ట్ క్లాసులూ, సంగీత కచేరీలు…”

“ఇంట్రస్టే. నాకా వాతావరణం అంటే ఇష్టం. అక్కడికొచ్చే మనుషులన్నా ఇష్టమే. కాంటాక్ట్స్ పెరుగుతాయి. ఆ కళల తోటల్లో తిరిగితే ఎంతోకొంత పరిమళం నాకూ అంటకపోతుందా అన్న ఆశ,” వివరించింది. తాను చెప్పినది సమంజసంగానే ఉన్నా ఎక్కడో ఏదో అపశృతి ధ్వనించింది.

వదల్లేక వదల్లేక ఆ స్టడీ రూమ్ దాటి నడిచాను. నడవలోంచి నడవగా పక్కన విశాలమైన పెరడు. సిమెంటుతో చేసిన నీటికొలను. ఆ కొలనులో ఎర్రతామరలు… చెట్లూ పొదలూ లతలూ సరేసరి.

“అంత పెద్ద ప్రధానమంత్రికి ఒక్క స్విమ్మింగ్‌పూలైనా లేకపోవడమేమిటి? ఈ రోజుల్లో నాలుగు డబ్బులు కూడబెట్టిన ప్రతివాళ్లూ పెద్ద పెద్ద ఇళ్లూ, ఇటాలియన్ టైల్స్‌తో స్విమ్మింగ్ పూళ్లూ కట్టిస్తోంటే ఇందిరాగాంధీ ఏమిటో ఇంత పిచ్చిదాన్లా ఉండిపోయింది!” వందన వ్యాఖ్యలో కొంటెతనం ఉందేమోనని తన మొహంలో వెతికాను. అదేం కనిపించలేదు.

“నువ్వు నీ ఇల్లు కట్టించుకొన్నప్పుడు ఇటలీ ఏమిటీ పారిస్ నుంచే మార్బుల్ టైల్స్ తెప్పించుకొందువుగానిలే,” వేళాకోళమాడాను.

“టైల్స్ సంగతెలా ఉన్నా నేను లైఫ్‌లో స్థిరపడ్డ తర్వాత కనీసం ఈ ఇంటికి రెట్టింపు ఇల్లు కట్టుకుంటాను. ఇలా చెట్లకూ పుట్లకూ స్థలం వేస్టు చెయ్యను,” చాలా సీరియస్‌గా సమాధానమిచ్చింది.

ముందుకు నడిచాం. ఈసారి డ్రాయింగ్ రూమ్.

దేశదేశాల అధినేతలనూ మనదేశపు ప్రముఖులనూ ఇందిరాగాంధీ కలుసుకున్న గది అది. చిన్నగా, పొందికగా, నిరాడంబరంగా, అందంగా ఉంది. అదంతా ఓ అప్పర్ మిడిల్‌క్లాస్ ఇల్లనిపించిందే తప్ప ఎనభై కోట్ల జీవితాల అధినేత ఆవాసం అనిపించలేదు.

మరికొంచెం ముందుకు నడిచాం. ఈసారి డైనింగ్ రూమ్. అదే ధోరణి. అదే బాణీ. పదీ పన్నెండుమంది పట్టే విశాలమైన డైనింగ్ టేబులు… అంతా కళాత్మకం.

“ప్రశాంతంగా, సుందరంగా జీవించడానికి బంగారు భవనాలు అవసరం లేదనీ అభిరుచి ఉంటే చాలనీ అనిపించడం లేదూ? కాస్తంత కష్టపడితే మామూలువాళ్లు కూడా ఇలాంటి వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు గదా…” బయటకు నడుస్తూ వందనతో అనకుండా ఉండలేకపోయాను.

ఓ క్షణం ఆగింది వందన. అరక్షణంసేపు మాటలకోసం వెతుక్కొంది. తర్వాత స్పష్టంగా చెప్పింది. “మనం బతుకుతున్నది స్పీడు యుగంలో. ఈ యుగానికి నిరాడంబరతలూ, సాధు జీవితాలూ కుదరవు. అలాంటి ఆలోచనలుంటే జీవితంలో వెనకబడిపోతాం. నాకు రేపటి ప్రపంచం కావాలి. నిన్నటి నోస్టాల్జియాతో పనిలేదు.”

అవును. వందన చురుకైనదే. పదునైనదే. చాలా యాంబిషన్లు కూడా ఉన్న మనిషి అన్నమాట. వాటిని సాధించుకొనే చేవా, పట్టుదలా ఉన్నాయనీ అనిపిస్తోంది. ఒక మనిషిలో అంతటి స్పష్టతా, విశ్వాసం, సంతోషమనే అనిపించింది. అయినా మనసులో ఏదో అనీజీ భావన. అనకుండా ఉండలేకపోయాను.

“జీవితపు ర్యాట్‌రేస్‌లో పరుగులు పెట్టడమే ధ్యేయంగా పెట్టుకొంటే ఎలా? పరుగులు పెట్టి కష్టాలుపడి చిట్టచివరికి మనం అందర్నీ ఓడీంచి గెలిచినా మిగిలేదేమిటీ? ఎలుకల్లోకెల్లా మహా పెద్ద ఎలుకనయ్యానన్న సంతృప్తేగదా!”

దెబ్బతగిలిన చిరుతపిల్లలా చూసింది. ఆవేశంగా ఏదో అనబోయింది. మళ్లా తమాయించుకొని నవ్వేస్తూ అంది. “ఓకే రాజూ! నీకు సాధువుల్లో కలవాలని ఉంటే నాకేం అభ్యంతరం లేదు. ఈ లోకంలో అందరిదీ ఒకటే దారి కాదుగదా!”

మాటలు దాటిన భావం ధ్వనించింది తన కంఠంలో.

బంగళాలోని గదులన్నీ దాటేసి మళ్ళా ఆ ఆవరణలోని కాలిబాటల వెంట సాగాం. అటూ ఇటూ నందివర్ధనాలూ, రాధాకృష్ణ పూలతీగలూ, లతలూ… వేడెక్కున్న మనసు కొంచెం చల్లబడింది. చెట్లపైన ఎక్కడినుంచో కోయల కూత! చుట్టూ ఆవరించి ఉన్న పూల పరిమళం! పక్కనే మాటలు లేకుండా నడుస్తోన్న వందనలోంచి వినవస్తోన్న ఆందోళనారాగం!

ఎక్కడ్నించో ఎవరిదో సన్నగా మాట – ఎవరిదీ? ఎవరదీ?

ఇందిరాగాంధీ!

పక్కన గుబుర్ల మధ్యన ఉన్న స్పీకర్లలోంచి ఆవిడ హిందీ ప్రసంగం. ‘నాకు మరణమంటే భయంలేదు. నేను మరణించినా నా శరీరంలోని ప్రతి రక్తబిందువూ భారతదేశాన్ని శక్తివంతంగానూ చైతన్యవంతంగానూ ఉంచడానికి పోరాడతాయి.’ భువనేశ్వర్లోని ఆవిడ చిట్టచివరి ప్రసంగం. మనసులోని ఆహ్లాదం తొలగింది. మనసు కీడును శంకించింది.

ఆవిడ నేలకూలిన ప్రదేశం మా కళ్ల ఎదుట నిలిచింది.

ఆ నెంబర్ 1… సఫ్దర్‌జంగ్ రోడ్ బంగళా ఆవిడ నివాస గృహమయితే పక్కనే ఉన్న నెంబర్ 1 అక్బర్ రోడ్ బంగళా ఆవిడ కార్యాలయం. రెండింటికీ మధ్య ఓ పిట్టగోడే అడ్డం. ఆ అక్టోబరు ముప్ఫై ఒకటో తారీఖు ఉదయాన ఆవిడ ఆ పిట్టగోడకున్న చెక్కగేటును దాటుకొని కార్యాలయానికి వెళుతోండగా ఆవిడ సెక్యూరిటీ దళపు సభ్యులే కాల్పులు జరిపి చరిత్రలో ఓ అధ్యాయానికి చరమగీతం పాడారు.

ఆవిడ నడచిన ఆ చిట్టచివరి ఇరవై ముప్ఫై గజాల కాలిబాటనూ దిగుమతి చేసుకొన్న క్రిస్టల్స్‌తో కప్పి, దాన్నో గొప్ప క్రిస్టల్ రివర్‌గా రూపొందించారు.

మొదటి రెండు గదులలో చూసిన ఆ కాల్పులనాటి ఆవిడ చీరా, హ్యాండ్‌బ్యాగూ గుర్తొచ్చాయి. పెళ్ళినాడు ధరించిన చీరా, శాలువా కూడా అదే ప్రదర్శనలో ఉండటమూ గుర్తొచ్చింది. మనస్సు కలుక్కుమంది.

“వాటే వే టు గో! తమ సిద్ధాంతాలూ విశ్వాసాలకన్నా జీవితం ఇంకా విలువైనదన్న చిన్న విషయం వీళ్లకెందుకు స్ఫురించదో! ప్రాణాలను పణంగా పెట్టేది ఏ లాభం ఆశించో! అయినా ఉండనే ఉందిగదా సామెత – కత్తి బలంతో బతికే వాళ్లు ఆ కత్తికే బలయిపోతారు – అని…” అంది వందన.

‘జీవితమంటే లాభనష్టాల చిట్టాయేనా?’ అందామనిపించింది. అనకుండా ఊరుకోగలిగాను.

అన్నీ దాటుకొని బయటపడ్డాం. సావెనీర్ల షాపు కనిపించింది. ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ కొని వందనకు బహూకరించాను. ఏదో అనబోయి అనకుండానే అందుకొంది. చదువుతుందా? తెలియదు.

జ్ఞాపకలను వెంట వేసుకొని బయటకు నడిచాను.

స్పందన కుడివేపుకు మళ్ళింది.

నేను ఎడమకు.

వీడ్కోళ్ళు చెప్పుకొన్నామా?

తెలియదు!

*

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు