దత్తుగాడి బాల్యం

నా బాల్యం అంతా, అంటే సహజంగా ఊహ వచ్చినప్పడి నుంచి పదిపన్నెండేళ్ల వరకు ఏం జరిగిందో, నేను ఏమేం చేస్తుండేనో నాకో మిస్టరీ. ఒక పోలికతోని చెప్పాలంటే నల్లటి ఫిలిం మీద అక్కడా ఇక్కడా బంగారు పూత పూసుకున్న ఇమేజెస్ తప్పిస్తే మిగిలిందంతా చీకటి నాకు. ఇట్ల చీకటిలాంటి బాల్యాన్ని ఇంకా మార్మికంగా మార్చేసింది అన్నయ్య. నాకు వాడికి మూడేళ్లు తేడా. నేను పుట్టిన రోజు అమ్మ హాస్పిటల్‌లో ఉంటె, వాడు హాస్పిటల్‌కి రావడానికి వేసుకున్న కొత్త నిక్కరు-షర్టు, ఇంటికొచ్చాక అమ్మ కాళ్ళ దగ్గరే పండుడు సహా అన్నీ గుర్తున్నయ్ అంటడు. అనుడే కాదు, వాడు ఆ ముచ్చట్లని చెప్తుంటే నాకేమో కట్టు కథల లెక్కనే ఉంటయి. మొహమంతా ఒక వింత ఆనందంతో వింటది అమ్మ.

నా చుట్టే జరిగిన ఇలాంటి సంగతులన్నీ తెల్వనట్టుగా వింటుంటే కొత్త కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తయి నాకు. నేను రావడం వల్ల అమ్మ పక్కన ప్లేస్ ఖాళీ చేసి కాళ్ల దగ్గర సెటిల్ అవ్వుడు ఒంటరిగా అనిపించిందా అని, నేను పుట్టే క్షణానికి నాన్న వేరే టౌన్‌లో టూర్లో ఉండె కాబట్టి నేను ఈ భూమికి వచ్చిన క్షణం చూసింది నువ్వు ఒక్కడివే కదా? ఎట్లుండే నీకు ఆ ఫీలింగ్ అని.. ఇలానే ఏవేవో! మరీ మెలోడ్రమాటిక్‌గా అనిపించి నేనే ఊరుకుంట.

మేము పెరుగుతున్న రోజుల్లో నాన్నకి ఎరుపు రంగు సుజుకి బండి ఉండేదట. అది ఇంటి ముందు సెంటర్ స్టాండ్‌లో ఉంటె, దాని మీద  ఊగితే కానీ అన్నం తినేది కాదట నేను. ఎద్దులాంటి బండిని నాలుగైదేళ్ళ వయస్సున్న అన్నయ్య ఎట్ల ఊపుతడు? ఇక్కడే గమ్మతంతా  వచ్చి చేరుతది.

తొంభైల్లో కరీంనగర్ మొత్తం తెల్వని మనతనం ఉండేదట. ఇక్కడ నుంచి ఆ సందు చివరి వరకు మాత్రమే మనది అనేలాగ కాకుండా ఊరు దాటి ఎక్కడో విసిరేయబడ్డ ఈనాడు ఆఫీసు వరకు మనోళ్లే అనే ఫీలింగ్ ఉండేదట. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కి బస్సుల వాపస్ వచ్చే రూట్ల ఈనాడు బిల్డింగ్ కనపడంగనే ఇంట్లో నడుము వాల్చేసినట్టుగ హాయి ఉండేదని తాతయ్య చెబుతుండే. ఇట్లా రోడ్డు ఎక్కితే చాలు తెల్సినోళ్ళు ఉండె అప్పటి కరీంనగర్లో రోజుకి మూడు పూటలా బండిని ఊపడం అంటే అమ్మకి వల్లకాని సిగ్గని అన్నయ్య చాలా సార్లు చెబుతుండే. అలా వాడు చెప్పిన ప్రతిసారీ “దుష్ట పుట్టుక రా నీది” అని అమ్మ ఉడికిన మొహంతో గమ్మత్తుగా అంటది నన్ను. వీలైతే ఆ పాత ఇంటి గోడకి ఆనుకుని, ఉడికిపోయే అమ్మ మొహాన్ని చూసి నవ్వాలని తీర్చుకోలేని ఫాంటసీ నాకు.

కొత్త ఇంటికి మారిపోయే ముందు మేము ఉన్నది మూడు అరల చిన్న ఇల్లు. వరసగా ఒకదాని తరవాత ఒక రూము, ఆ వెనక కామన్ బాత్రూం, ఇలా నాలుగు పోర్షన్లు. బంధువులే కానీ, గుండె సంబంధాలట. ఇగ ఆ ఇంటికి సంబంధించినంత వరకు అన్నీ మసకమసకగా మిగిలిపోయిన జ్ఞాపకాలే నాకు. ఎలా అంటే ఏ దారిలో స్కూలుకి పోతుండెనో, ఆటోడ్రైవర్ మొహం ఎట్లుండెనో, నాకు దోస్తులు ఎవరో ఎవ్వరు గుర్తుండరు. కానీ స్కూల్  ముందు ఆటో నుంచి దిగంగనే ఒక్కటేసారి స్కూల్ నుంచి వచ్చే ఒక వాసన కడుపులో భయం రేపుతుండే. బస్సు స్టాండుల్లో, పబ్లిక్ బాత్రూముల్లో వాడే ఫినాయిల్ లాంటి వాసన అది. అయినా ఇపుడు ఆలోచిస్తే గమ్మత్తుగా అనిపిస్తది. ఎవరినన్నా పెట్రోల్ వాసన ఇష్టమా అని అడగండి. అవుననే చెబుతరు. దాని గురించి చెప్పమనండి. ఏమని చెప్తరు? అలా అనిపిస్తది నాకు నా బాల్యం తాలూకు జ్ఞాపకాలన్నీ. డైజిన్ సీసాలోని డైజెషన్ టానిక్ రంగు గుర్తొస్తుంది ఇదంతా రాస్తుంటే.

సరే, దాన్ని అట్లా వదిలేస్తే, అట్ల ఫోటోకాపీస్‌కి నెగటివ్ స్ట్రిప్‌గా ఉండే నా గతంలో ఇప్పటికీ రియల్ రంగులద్దుకొని తళుక్కున మెరిసేవి మూడే మూడు విజువల్స్. స్కూల్ టైం ఐతుంటే “పోను, పోను” అని యాష్టకి తెప్పించి, ఆటో రాంగనే సిగ్గుపడుతూ పోయి ఆటోలో కూర్చునేదట. అలా మంచానికి, ఫ్రిడ్జ్‌కి మధ్యలో స్కైబ్లూ రంగు షర్టు – డార్కు బ్లూ నిక్కరు వేసుకుని మొహం అంతా సిగ్గు దాచుకుని దిగిన ఫోటో. అట్ల ఆ ఫోటో దిగుతున్నపుడు నా వేలికి ఉన్న ముత్యపు ఉంగరంలోని ముత్యాన్ని చూడడం ఈ క్షణమంత వాస్తవం. ఇదంతా పాత ఇంటి సంగతి. అయితే తాతయ్య, మామ & కో అందరమూ వావిలాలపల్లికి మారిపోయినం. మా ఇంటి గుమ్మం నుంచి కుడిపక్కకి చూస్తే రెండు ఖాళీ ప్లాట్స్ తరవాత తాతయ్య వాళ్ల ఇల్లు. కొత్త ఇంట్లో గుర్తుండిపోయిన రెండు జ్ఞాపకాల్లో మొదటిది టీవీ. పాడుతా తీయగా లాంటి ప్రోగ్రాం ఏదో వచ్చి వెళ్లిపోయే ముందు, మనుషుల మీదగా టైటిల్స్ పోతూవుంటే వీళ్ళకి గుల్‌గుల్ ఎందుకు అవ్వట్లేదు అని నోరెళ్లబెట్టి  ఆశ్చర్యపడ్డ జ్ఞాపకం ఒకటి.

అట్లనే మేము వావిలాలపల్లికి మారిపోయిన కొన్ని రోజులకి మా ఇంటి పక్కనే ప్లాట్‌లో ఎవరో ఇల్లు కట్టుకునే కారిక్రమం పెట్టుకున్నరు. మస్తు మబ్బులమబ్బులనే లేశిన ఆ రోజు. చిన్నగ చినుకులు పడుతున్నయి. మంగళవాద్యాలు వినపడ్డయ్. చాలా సంతోషంగా అనిపించింది ఎందుకో. “ఇదంతా ఏంది పప్పా?” అని నాన్నని అడిగితే “కొన్ని రోజులకి ఇక్కడ కొత్త ఇల్లు, కొత్త అంకుల్ వస్తరు” అని చెప్పగానే భోరున ఏడవడం. నన్ను చూసి నాన్న నవ్వుతూ, వెనక నుంచి దగ్గరగా తీసుకుని అలానే చూస్తూ నిలబడడం. లోకం తెల్వని పిల్లగాడ్నే అయినా  అక్కడే నిలబడి కూడా ఆ విజువల్‌ని వెనక నుండి కూడా క్యాప్చర్ చేసుకున్నాను అని ఇప్పడికీ నమ్మకం నాకు.

ఆ రోజులు ఎలానో గుర్తులేవు. పెరిగిన ఇల్లు, నడిచిన రోడ్డు, మా ఇంటి నుంచి తాతయ్య వాళ్ళ ఇంటికి దూరం – ఇవన్నీ చిన్నవిగా అనిపిస్తయి కావొచ్చు ఇప్పుడు పోతే. పోయినా గుర్తుపడ్తనా? నేనంతా ఒక పరాయి భావం అయినట్టు ఉంది లోపలంతా.

రోజూ మాట్లాడే అమ్మ, నాన్న, అన్నయ్య వీళ్లంతా ఒక కంటిన్యుటీ. వీళ్ళని దాటి, అట్లనే వీళ్ళు కూడా ఉండే ‘కంఫర్ట్ జోన్’కి పోవాలి  అనిపించింది. మధ్యలో ఏ ఇల్లు అడ్డుపడని తాతయ్య వాళ్ళ ఇల్లు గుర్తొచ్చింది. ఫోనులోని కాంటాక్ట్స్‌ని కిందకి జరుపుతూ పోతే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్న పేరు లేని నెంబర్ మామది. కాల్ చేద్దాం అంటే అహమో, సిగ్గో, ఏదో ఏ రూపంలోనో తల దూర్చి అడ్డుపడుతుంది. మొండిగా ‘కాల్’ అనే బటన్‌ని ఒత్తిన.

“ఆ మామా.. ఎట్లున్నరే? మీ మిస్సుడ్ కాల్ ఉంటె చేసిన”

“ఆ.. ఏం రా వారి! అంత మంచిదేనా? ఇటు రాక నాలుగేళ్ళు అయిపాయె. ఆ ట్రంప్ గాడు రానిస్తలేడట కదరా”. ఒక్కటేసారి నవ్వొచ్చింది. సిటీ కేబుల్ అనే చిన్న కిటికీ నుంచే ప్రపంచాన్ని చూసిన అమాయకత్వం గుర్తొచ్చింది.

“ఏ.. అట్లేమీ లేదు. వాడెవడు రానీయకపోవడాన్కి? రావాలిగ. ఇప్పడికే నాలుగేళ్లు అయ్యింది”

“ఆ గంతే మరి! ఏం ఉన్నది ఆ దిక్కువాన దేశంల”

మామ కుక్కల బిజినెస్ సంగతి గుర్తొచ్చింది ఒక్కటేసారి. “కొడుకు  పుట్టినా కూడా ఈ కుక్కలేందో, నువ్వెందో నీకే తెల్వాలె” అని మామని తాతయ్య తిడుతుండే.

నవ్వాపుకుంటూ అడిగిన “మామా! నీ కుక్కల బిజినెస్ ఏమాయె” అని. ఆయనకి కుక్కల్ని పెంచుడంటే ఇష్టం. ఓన్లీ వన్ కుక్క ఎట్ ఎ టైం. అదంటే తాతయ్యకి యాష్ట. అంతకు మించి బిజినెస్ ఏం లేదు.

“ఏ.. అన్ని పాయే! ఇంకెక్కడ రా”

“అప్పుడు మన ఇంట్ల ఒక ఊరు కుక్క ఉండే కదా!”

”అవురా! దానికి నీ పేరే పెట్టి పిలుస్తుండే” అని ఆయన ఎక్సైట్ అయ్యిండు.

”అందుకే బాడకౌ మామ అని అంటుండే నిన్ను” అని నవ్వేసిన.

”ఈ పోరనికి గునవారెత్తు.. నీ ముడ్డి మీదకెళ్ళి తంతుండే నా ముందట ఉంటె ఇపుడు” అని అన్నడు.

నిజంగానే కళ్ళ ముందు ఉండాలనిపించింది.

మీకు చెప్పలే కదా! ఆ కుక్క పేరు దత్తుగాడు. ఈ కథ పేరు దత్తుగాడి బాల్యం.

*

లోలోపల   కదలికల్ని  బయటకు తెచ్చే కథలు రాయాలి

* హాయ్‌ ధీరజ్! మీ గురించి చెప్పండి?

హాయ్! మాది కరీంనగర్. నేను 1993లో పుట్టాను. అమ్మ, నాన్న, అన్నయ్య, నేను.. ఇది మా ఫ్యామిలీ. 2001 వరకూ అక్కడే పెరిగాను‌. ఆ తర్వాత కుటుంబమంతా హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాం. 2015లో మాస్టర్స్ చదివేందుకు అమెరికాకి వచ్చాను‌. ప్రస్తుతం ఇక్కడే మెడికల్ ఎఫైర్స్ ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్నాను.

* సాహిత్యం పట్ల ఇష్టం ఎలా మొదలైంది?

చిన్నప్పటి నుంచి నాకన్నా పెద్దవాళ్లతో గడపడం అలవాటు. అలా మా అన్నయ్య దీక్షిత్, వాళ్ల స్నేహితులు మాట్లాడుతూ ఉంటే వినేవాణ్ని. ఆ మాటల్లో సినిమాలు, సాహిత్యం, కళలు లాంటివి ప్రస్తావనకు వచ్చేవి. మా అన్న, ఆయన ఫ్రెండ్ శిరీష్ 2008 నుంచి బ్లాగ్స్‌లో రాసేవారు. వారు రాసింది చదవడం, అలాంటి సర్కిల్‌లో ఉండటం వల్ల సాహిత్యంపై ఆసక్తి కలిగింది. మొదట్లో My Experiments with Truth, Fountain Head లాంటి పుస్తకాలు చదివాను. ఆ తర్వాత విశ్వంభర, అమృతం కురిసిన రాత్రి, మిథునం, అమరావతి కథలు.. అలా ఒకటి తర్వాత చదవడం మొదలుపెట్టాను.

* రాయడం ఎప్పుడు మొదలు పెట్టారు?

2011లో సొంత బ్లాగ్ మొదలుపెట్టాను. నా చుట్టూ జరిగే అంశాల గురించి ఎటువంటి భేషజాలు లేకుండా అనిపించింది అనిపించినట్టు అక్కడ రాసేవాణ్ని. వాటిని మా అన్న, వాళ్ల స్నేహితులు చదివేవారు. నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒకరోజు మా ఇంటి కబోర్డ్‌లో ఒక పిల్లి పిల్లల్ని పెట్టి ఎక్కడికో వెళ్లింది. వాటి శబ్దం విని అందులో చూస్తే రెండు చిన్నపిల్లులు కనిపించాయి. వాటిని తీసి బయట వదిలేశాను. ఆ తర్వాత రెండు, మూడు రోజుల పాటు వాటి తల్లి మా ఇంటి కిటికీకి వేలాడుతూ కనిపించింది. అది నన్ను లోలోపల చాలా కదిలించింది‌. ఆ టైంలో నా బ్లాగ్‌లో ఓ కవిత రాశాను. చదివినవాళ్లు బాగుందన్నారు. అప్పటి నుంచి నా రాత మీద నమ్మకం కలిగింది.

* మొదటి కథ ఎప్పుడు రాశారు? దాని నేపథ్యం ఏమిటి?

కథలు రాసేందుకు కొన్ని నియమాలు పాటించాలని మొదట్లో అనుకునేవాణ్ని. అదేమీ అవసరం లేదని, మనలోపలి కదలిక కథగా మారుతుందని తర్వాత తెలుసుకున్నాను. నేను మొదట రాసిన కథ ‘నాలుగేళ్ల చదువు’. అది 2012లో రాశాను. ఆ తర్వాత ఐదేళ్లకు 2017 నవంబర్‌లో సాక్షిలో ప్రచురితమైంది.‌ అయితే దాని కన్నా ముందే ప్రచురితమైన కథ ‘త్రేన్పు’. 2016 మేలో సారంగ వెబ్ పత్రికలో వచ్చింది. మా ఇంటి పక్కన ఉండే ఒక కుటుంబంలో జరిగిన విషాదమే దానికి నేపథ్యం. 2014లో మొదలు పెట్టిన కథ 2016లో పూర్తి చేశాను. ఇప్పటికి పది కథలు రాశాను. నాలుగు ప్రచురితమయ్యాయి‌.

* ఈ మధ్య ఇంగ్లీషులో మీకు నచ్చిన కథలు? కథకులు?

ఈ మధ్య జె.డి.శాలింగర్ రాసిన ‘Nine Stories’ అనే కథా సంపుటిలో ‘For Esme – with Love and Squalor’ కథ చదివాను. చాలా నచ్చింది.

* అమెరికాలో ఉంటున్నారు కదా! అక్కడ సాహిత్య వాతావరణం ఎలా ఉంది?

నేను గమనించినంత వరకు ఇక్కడున్నవారు రచయితల్ని వేరు చేసి, విడిగా చూడరు. తోటివారిగా భావించి వారి రచనల్ని స్వాగతిస్తారు. ఆసక్తిగా చదువుతారు. ఇక్కడ లైబ్రరీల నిర్వహణ బాగుంటుంది. కేవలం పుస్తకాలు చదవడమే కాకుండా రకరకాల శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

* ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

నా లోలోపల ఆలోచనల్ని, కదలికల్ని మరింత బయటకు తెచ్చే కథలు రాయాలని ఉంది.

*

ధీరజ్ కాశ్యప్ వేముగంటి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు