తొలి కవితలు

మూలం:అంబై

అంబై(1944) అసలు పేరు సి.ఎస్.లక్ష్మి. ప్రముఖ తమిళ స్త్రీ వాద రచయిత. తమిళనాడులో పుట్టి, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో జీవించింది. ప్రస్తుతం ముంబైలో వుంటుంది. JNU నుంచి ‘American policy towards refugees fleeing Hungary due to the failed revolution of 1956’ గురించి Phd చేసింది. తనని తాను ‘feminist who has lived without compromise’ అని చెప్పుకుంటుంది. ఆమె తన కలం పేరు ‘అంబై’ గురించి చెప్తూ ‘Ambai is the one who is reborn as Sikandi—a man and takes revenge on Bhishma. I like the androgynous quality of the name’ అంది.

కథలు, నవలలు రాసింది. బహుశా తమిళం నుండి ఇంగ్లీషులోకి ఈమె రచనలు అనువాదమయినంతగా యింకే తమిళ రచయితవీ అవలేదు. ఆమె పరిశోధకురాలు. చరిత్రకారిణి. ఆమె రచనలు యేడు సంపుటాలు ప్రచురణ అయ్యాయి.

యెక్కువగా మానవ సంబంధాలు ఆమె రచనల్లో వస్తువు. వివిధ రకాల ప్రేమలు, మనుషుల మధ్య వుండే ఖాళీతనం, పరస్పరం కమ్యూనికేట్ చేసుకోలేకపోవడం, స్త్రీల నిశ్శబ్ద యాతన, లైంగిక విభిన్నతల ఆమోదం, దేహాల గురించిన యెరుక వంటి యితివృత్తాలు ఆమె రచనల్లో తరచుగా కనిపిస్తాయి. స్త్రీల జీవన వాస్తవాలని సున్నితంగా, వ్యంగపు హాస్యంతో తన రచనల్లో చిత్రిస్తుంది.

‘స్త్రీలు తమ దేహాల్నీ, మెదళ్ళనీ, యిళ్ళనీ, male egoల నుంచి యెలా కాపాడుకోవాలో అంబై కథలు చెప్తాయి’ అంటుంది రేణుకా నారాయణన్.

‘The Face Behind the Mask:Women in Tamil Literature’ ఆమె చేసిన అతి ముఖ్యమైన non-fiction రచన. ప్రస్తుతం SPARROW(Sound and Picture Archives for Research on Women)అనే సంస్థను స్థాపించి నడుపుతుంది. స్త్రీ రచయితల, కళాకారుల worksను భద్రపరచడం దీని ముఖ్య వుద్దేశం.

చాలా అవార్డులొచ్చాయి.

(మూల కథ ‘ఆరంబ కాల కవితైగళ్’, 1997)

***

జ్ఞానాన్ని పొందేందుకు అన్ని ప్రయత్నాల్నీ చేసిందామె. మూడు రోజులు విడవకుండా యేడిస్తే దేవుడ్ని చూడచ్చని రామకృష్ణ పరమహంస చెప్పాడని మూడు రాతృలు విడవకుండా యేడవడం కుదరకపోయినా(ప్రతి వొక్కరికీ విడిగా గది లేని యింట్లో, తెల్లార్తో లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయే వరకు అమ్మ కట్టుబాట్లో, నాన్న గొంతో తరుముతుండే యింట్లో, విడవకుండా యే పని మాత్రం చెయ్యడం కుదురుతుంది?) విడచి విడచి ఆరు రోజులు యేడ్చినా యే దేవుడూ దర్శనం యివ్వలేదు. అందులో నిరాశే మిగిలింది. జ్ఞానాన్ని వెతుకుతూ పోయే వొక పదహారేళ్ళ అమ్మాయి యింకేం చెయ్యాలో తెలియడం లేదు. యేది కూడా స్పష్టంగా అర్థం కాలేదు.

తను యే పాపమూ చెయ్యలేదనే ఆమె నమ్మింది. అయితే, కొన్ని విషయాలు పాపంలో చేరుతాయా లేదా అని తెలియడం లేదు. చిన్న వయసులో వొక సారి అక్క పద్మకి, యీమెకి తలా వొక పుచ్చకాయ ముక్క యిచ్చినప్పుడు యీమె తన ముక్కను వెంటనే తినలేదు. పద్మ తినేదాకా కాచుకొని వుండి, తర్వాత తన ముక్కను నాకడం మొదలుపెట్టింది. “యేయ్. నాకూ కొంచెం యివ్వవే” అని పద్మ అడుక్కొంటే, పండు రసం నోట్లో నుంచి కారుతుంటే, “యివ్వను” అని నిరాకరించింది. వొక సారి అమ్మను మనసులో ‘శనిదానా’ అని తిట్టుకొంది. యెప్పుడు చూసినా వెంట్రుకల్ని దువ్వుకొమ్మని, పాడమని, పాలు తాగమని, తినమని, నిద్రపొమ్మని, నూనె రాసుకొమ్మని మందలిస్తుండే అమ్మ ‘ఫట్’మని చనిపోయి, అమ్మ లేని అనాథగా తనని వూహించుకునేది. వొక ‘చెడ్డ’ పుస్తకాన్ని కూడా మూడు సార్లు చదివాక స్నానాల గదిలో వేడి నీళ్ళు కాచుకొనే పొయ్యిలో వేసి కాల్చేసింది. యిదంతా యే లెక్కలో చేరుస్తారో తెలియడం లేదు. చేర్చేవారు యెవరో కూడా తెలియదు. రాజుల కాలం నాటి బట్టలు ధరించిన చిత్రగుప్తుడు యీ లెక్కలన్నీ పెట్టుకొని వుంటే, మారుతున్న కాలం గురించి అతనికి తెలియచేయడానికి, ముఖ్యంగా స్త్రీలు యెక్కువగా మారిన విషయాన్ని వివరించడానికి యెవరైనా నమ్మకమైన మనిషి దొరుకుతారా? వంటి ప్రశ్నలు పదే పదే మనసులో తలెత్తుతాయి.

యీ విధంగా జ్ఞానాన్ని వెతుకుతూ, తాను, తన మూలంగా ప్రపంచమూ యెదగడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నప్పుడే ఆ పెద్ద సైజు నీలి డైరీ యింటికొచ్చింది. వీళ్ళ ఫ్యామిలీ డాక్టరుకు యెవరో యిస్తే, ఆమె వీళ్ళ యింటికి పంపింది. పసి బిడ్దల కోసం పాల పొడి తయారు చేసే నెస్లే కంపెనీ డైరీ. తల్లీ బిడ్డల ఫోటోలతో పాటు, ప్రసూతి వైద్యులకు సూచనలతో కూడిన డైరీ అది. దేహపు అస్థిరత గురించిన ఆలోచన్లలో ఆమె మునిగిపోయిన సమయంలో, దేహం యేర్పడేందుకు సంబంధించిన డైరీ తన యింటిని వెతుక్కుంటూ రావడం దేవుడు తన మనోబలాన్ని శోధించడానికి చేసే ప్రయత్నం అని ఆమె దృఢంగా నమ్మింది. ‘జైన ధర్మసేనుడిగా వున్న భక్తుడు తిరునావుక్కరసుకు వుదర శూల నొప్పి, నాకు ప్రసూతి వైద్యుని డైరీనా? హుం!’ అంటూ దేవుని పరీక్షల్ని చూసి ఆశ్చర్య పోయింది.

పూజ గదికెళ్ళి, రవి వర్మ వేసిన దేవుని చిత్రపటాల్ని కళ్ళార్పని చూపుతో చూసి, వొక జ్ఞానపు చిరునవ్వు నవ్వింది. నటి మధుబాల వంకర చిరునవ్వు నుంచి యీమె తన జ్ఞాన చిరునవ్వుని అప్పుతీసుకొంది. యీ చిరునవ్వు ఆమె ముఖంలో పూసినపుడు, ముఖంలో వెలుగు పరచుకుంటుందని ఆమెకనిపిస్తుంది. అయితే, కొన్ని కారణాల వల్ల దాన్ని యితరుల ముందు చూపించదు. “యేంటి, పంటి నొప్పా?” అని అమ్మ వొక సారి అడగడం వొక కారణం కావచ్చు. జ్ఞాన దాహం లేని వారికి యీ చిరునవ్వును చూసే పరిపక్వత వుంటుందా?

ఆ డైరీ నీలి రంగు ఆమెను చాలా ఆకర్షించింది. నీలం ఆమెకు యిష్టం. కారణం, ఆకాశం నీలం, సముద్రం నీలం. పన్‌రుట్టి పట్టణం నుంచి వచ్చిన రెండడుగుల యెత్తున్న పిల్లనగ్రోవి వూదే కృష్ణుడి బొమ్మ కూడా నీలం. ఆమె దగ్గర వొక నీలపు పట్టు పావడా కూడా వుండేది. అయితే, లోకపు జీవితంలో అది వొక భాగమై వున్నందువల్ల, నీలం నచ్చడానికి గల కారణాలలో దాన్ని చేర్చలేదు. నీలి డైరీ యెవరూ వుపయోగించుకోకుండా పడున్నందువల్ల, దాన్ని ఆమె తను వుపయోగించుకొందామనుకొంది.

దాన్ని యెదురుగా పెట్టుకొని, మెత్తటి ఖాళీ పేజీల్ని తిప్పుతున్నప్పుడు, ఆమెకు ముందు అనేక భక్తులు చేసిందే తానూ చెయ్యాలనే కోరిక తలెత్తింది. భక్తి కవితల్ని రాయాలనే కోరిక.

రెండు రోజుల తర్వాత, కొంచెం ప్రయత్నించి ‘దేవుడు యెక్కడ?’ అనే శీర్షికతో వొక కవిత రాసింది.

యెక్కడ దేవుడు అని అడగకు వో మూర్ఖుడా,
నీ హృదయంలో చూడు గూడు కట్టాడు దేవుడు!

అంటూ ఆశ్చర్యార్థకంతో ముగిసింది కవిత. తన చేయి వదిలేయద్దనీ, తనను పాలించమని వేడుకొంటున్నట్టు కొన్ని కవితలు రాసింది. తేవారం, తిరువాచకం, తిరుపుగళ్ వంటి కవుల కవితల లాగా లేవని అనిపించింది. దాని గురించి కొంచెం బాధగా కూడా వుండింది. కొంచెం కోపంగా కూడా వుండింది. జ్ఞానాన్వేషణలో యీ కవులు యెక్కడెక్కడో తిరిగారు-కొండలు, గుట్టలు, మైదానాలు. రాత్రి, పగలు అని చూడకుండా. దొంగతనాలు, ప్రమాదాలు వంటివన్నీ వున్న నగరంలో నివసించే పదహారేళ్ళ అమ్మాయి యెలా అలా తిరగగలదు? యింటి వెనుక తోటను కావాలంటే ఆమె చుట్టి రాగలదు. అదీ కాక, యెక్కువ దూరం పోవడానికి అనుమతి కూడా లేదు. స్నేహితురాళ్ళతో ‘పాశమలర్’(రక్తసంబంధం) సినిమా చూసేందుకు వెళ్ళినందుకే కాలం చెడిపోయిందనీ, యిలా ఆమె పోవడం తనకు యిష్టం లేదని తిట్టింది అమ్మ.

అదీ కాక, ఆ భక్తులకు అన్ని వేళలా దేవుడు అండగా నిలుస్తాడు. నక్కను గుర్రంగా, గుర్రాన్ని నక్కగా మార్చి, భక్తురాలి పేల పిండి కోసం యిసుక తీసుకెళ్ళి తెగిన చెరువు కట్టను నిలబెట్టి, అనేక దారుల్ల్లో వారికి సహకరించాడు. యీమె విషయం వచ్చేసరికి దేవుడు అన్యాయంగా నడచుకుంటున్నాడనిపిస్తుంది. వొకే వొక అద్భుతాన్ని కూడా యీమె కోసం చెయ్యలేదు. వొక్కటి కూడా లేదు. వొక రైలు యింత వేగంతో యీ పక్క నుంచి వస్తూ వుంది. యింకొక రైలు వేరు వేగంతో యెదుటివైపు నుంచి వస్తూ వుంది. రెండు రైళ్ళు యే బిందువు వద్ద కలుస్తాయి? లేదా వొక తొట్టిలో చిల్లు పడింది. అందులో పడే నీటి వేగం యింత, తొట్టి నిండడానికి యెంత సమయం పడుతుంది? యిటువంటి లెక్కలకి సమాధానం యిచ్చే చిన్న అద్భుతాలనయినా చెయ్యచ్చు కదా?

అంతే కాదు. పాల కోసం యేడుస్తున్న బిడ్దకు జ్ఞాన పాలు పోసి, ఆ బిడ్ద అద్భుతమైన కవితలు రాసేట్టు చేసిననప్పుడు, స్వతంత్రమ్ పొందిన వొక దేశంలో, కోయంబుత్తూరు అనే వూరిలో, దోమలు ముసురుకుంటున్న వొక ఆసుపత్రిలో పుట్టినందుకు యీమెకు జ్ఞాన పాలు యివ్వకూడదా యేంటి?

వొకే వొక సారి మాత్రం ఆమె జీవితంలో అద్భుతం జరిగిందని ఆమె గుర్తు చేసుకొంది. వాళ్ళ నాన్న ఆడపిల్లలకు లెక్కలు, సైన్సూ రెండూ రావని దృఢంగా నమ్మాడు. దాన్నెలా ఆమె మనస్సులో నాటాడో తెలియదు. ఆమెకు లెక్కలు రాలేదు. వొక సారి మధ్యంతర పరీక్షలో భిన్నాలలో లెక్క వచ్చింది. క్లాసులో నూటికి నూరు తెచ్చుకొనే స్టెల్లా కూడా ఆ లెక్క చేయలేక పోయింది. అందరికీ సున్నా వేసిన లెక్కల టీచరు బోర్డులో ఆ లెక్క వేయడానికి పూనుకొన్నపుడు, యథాలాపంగా ఆమె తన జవాబు పత్రాన్ని విప్పి చూసింది. ఆ భిన్నాల లెక్కను యీమె సరిగా వేసి వుంది! వొకటికి రెండు సార్లు సరి చూసిన లెక్కల టీచరు ఆశ్చర్యపోయింది. దాన్ని శివుడి చిరు అద్భుతంగానే యీమె చూసింది. “భిన్నాల లెక్క వేసేసినావు, రేపటికి సైన్సు కొశ్చన్ పేపర్ వస్తుంది. యెట్లా చేస్తావో చూద్దాం” అని శివుడ్ని తిట్టింది ముద్దుగా. కానీ, ఆ సారి శివుడు సైన్సులో పాసు కాలేదు.

‘వారణమాయిరం శూళ వలం వందు…’ (వేనవేల గజాలతో వూరేగగ యేతెంచి..)పాటని ఆ సమయంలో సంగీతం టీచరు ఆమెకూ, పద్మా అక్కకు నేర్పిస్తున్నాడు. వొకామె దేవుడ్ని పెళ్ళి చేసుకోవడం యీమెకు ఆకర్షణీయంగా వుండేది. అక్క మహాదేవి కథ కూడా అప్పుడు కన్నడ తరగతిలో చెప్తుండే వారు. మహదేవి అక్క కూడా శివుడికోసం అన్నిటినీ విడచి పెట్టింది. యిలా భగవంతుడినే భర్తగా వరించడంలో కొన్ని వ్యవహారిక చిక్కులున్నాయని ఆమెకనిపించింది. మొదటిది, శిలల్లో, రవి వర్మ చిత్రపటాల్లో దేవుళ్ళు అందంగా కనిపించేవారు. నిజంగా కనిపించినపుడు యెలా వుంటారో అనే భయం వుండేది. రెండవది, అప్పుడు రాముడిగా, కృష్ణుడిగా దేవుని వేషాల్లో నటిస్తూ వున్నది యెన్.టి. రామారావే. శివుడ్ని వరిస్తే, రేపు ఆయన యెన్.టి. రామారావు రూపంలో తలుపు తడితే యేం చేయాలి అనే గందరగోళం వుండిందామెకు.

సరే, అవ్వైయార్ భక్తురాలిగా మారి, ‘పాలుం తెలితేనుం…’ (పాలూ, తేటతేనియయూ…) అంటూ కె.పి. సుందరంబాళ్ గొంతుతో పాడుదాం అంటే, వొకేసారి ముసలితనాన్ని కోరుకోవడాన్ని గురించి కొంచెం తొట్రుపాటు కలిగింది. మనసు మూలలో పట్టుపావడ విచ్చుకొని వూరిస్తుందామెను. వచ్చే దీపావళికి చిలకపచ్చ రంగులో వొక పట్టుపావడ తీసివ్వాలని అమ్మతో వొప్పొందమొకటి వుంది.

అయితే, వీటికోసమంతా ఆమె జ్ఞాన మార్గాన్ని పూర్తిగా విడచిపెట్టడానికి సిద్ధంగా లేదు. కల్కి రాసిన ‘శివకామి శపథం’ యింట్లో బైండు చేసి వుంది. దాని ముగింపు ఆమెను యెక్కువగా బాధించింది. చిదంబరంకు పోయి, శివుడి ముందు నాట్యం చేసి, శివుడ్ని పెళ్ళాడినట్లు వొక కవిత రాసింది. ‘సత్యం’ దాని శీర్షిక.

అందెల సవ్వడుల మంత్రోఛ్ఛారణలు
అలుపెరగక వాటిలో మునిగిపోగా
అసురుడ్ని చంపిన నువ్వు
శరణంటూ నేను వస్తాను

అని రాసి ముగిస్తుంటే, కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

కవితల్నీ, దేవుని పట్ల తన అనుభూతుల్నీ ఆమె యిద్దరితో మాత్రమే పంచుకొంది. వొకరు మిక్కీ, వాళ్ళింటి నల్ల కుక్క. రెండవది కెంపమ్మ. కెంపమ్మ పక్కింట్లో వున్న చేతివృత్తుల కుటీరపరిశ్రమలో పనిచేస్తుంది. వుండేందుకు స్థలం లేక వాళ్ల యింటి వెనకాల తోటలో ఖాళీగా పడున్న మోటారు షెడ్దులో ఆమె తన సత్తు పెట్టెతో సహా వుండేందుకు వచ్చింది. అమ్మకు చేదోడు వాదోడుగా పని చేస్తూ సహాయపడుతుంటుంది.

మిక్కీ ఆమె స్నేహితుడు. యీమె కవితల్ని చదివి వినిపిస్తున్నప్పుడు ముందరి కాళ్ళ మధ్యలో ముఖాన్ని దాచుకొని పడుకొని, రెండు చెవుల్ని రిక్కించి వింటుంది. కొన్ని సార్లు యీమె తొడ మీద ముఖాన్ని పెట్టుకొని నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకొని వింటుంది. యీమె గొంతు గద్గదమయినప్పుడు తలెత్తి చూస్తుంది. యీమె మంచం కిందే దాని పడక.

కెంపమ్మకు యీమె తన కవితల్ని కన్నడంలో వివరిస్తుంది. వోపిగ్గా విని, “చెన్నాగిదె” అని తన సర్టిఫికేట్ యిస్తుంది. తర్వాత, పురందర దాసుని దేవర్ నామా పాటల్ని సరళమైన శైలిలో పాడుతుంది.

ఆ తర్వాతే జరిగిందది, ఆ రాత్రి సంఘటన. వొక రోజు రాత్రి పదకొండు గంటలకు “యేయ్ సూళే ముండే…” అని వొక భయంకరమైన అరుపు వినిపించింది. తర్వాతి ఐదో నిమిషం యింకా తాళం వేయని వెనుక తలుపును దబేలుమని నెట్టి, తుఫానులాగ పరిగెత్తుకొని వచ్చి యీమె మంచం కిందికి దూరింది కెంపమ్మ.

అమ్మా నాన్న వెనుకవైపు తలుపు దగ్గరికి వెళ్ళినప్పుడు, తాగిన మత్తులో వొకడు నిలబడి వున్నాడు. “లే. కెంపమ్మా హొరగె బారే” (యేయ్ కెంపమ్మా, బయటికి రాయే) అని రంకెలేశాడు. “నేను నీ మొగుడ్ని. రా బయటికి” అని కన్నడంలో అరిచాడు.

అతన్ని బయటికి పంపించడానికి ప్రయత్నించిన నాన్నను కోపంగా చూసి, “వొక పెళ్ళాం చాల్దా నీకు? నా పెళ్ళాం కూడా కావాల్నా?” అని కస్సుమన్నాడు.

మంచం కింద కెంపమ్మ కోడిపిల్ల లాగా ముడుచుకుపోయి వుంది. ఆమె శరీరం వణికిపోతూ వుంది. ఆమె భర్త నాన్నను అసహ్యంగా మాట్లాడగానే, మంచం కింద నుంచి బయటికొచ్చి, అతని వైపు కాళ్ళీడ్చుకుంటూ వెళ్తూ, వణుకుతున్న గొంతుతో “తాగేసొచ్చి చెత్తంతా వాగద్దు” అంది కన్నడంలో.

దానికి సమాధానంగా ఆమె పొత్తికడుపులో వొక తన్ను. “అమ్మా” అని అరుస్తూ ఆమె కుప్పకూలుతుంటే, ముఖంలో వొక గుద్దు.

“దేవా, కాపాడూ…” అని దేవుడ్ని వేడుకొంది కెంపమ్మ. తర్వాత, దేవున్ని యేకవచనంలో పిలవడం తప్పనుకుందో, యేమో, “దేవరే కాపాడీ…” అని గొంతెత్తింది.

వెనుక మెట్ల మీదికి ఆమెని తోసి, ఆమె జుత్తు పట్టుకుని లాగి, మెట్లపై తోశాడు. అలా కిందికి నెట్టి, బయట పచ్చిక బయలులోకి లాక్కొచ్చి, గబుక్కున ఆమె కాళ్ళను విడదీసి, కాళ్ళ మధ్యలో బలంగా వొక తన్ను తన్నాడు.

“హా..” అని అరిచి కెంపమ్మ కుప్పకూలిపోయింది. ఆ రోజు ఫౌర్ణమి. వెనుక వైపు తోటలో గన్నేరు, తులసి, చిక్కుడు, పొట్లకాయ, పనస అన్నీ విరగ కాసి వున్నాయి. అన్నిటి మీదా పున్నమి వెలుగు పరుచుకొని వుంది. పచ్చికబయలులో కుప్పకూలి వున్న కెంపమ్మ ఆ వెలుతురులో వేటాడ బడ్డ జంతువులా పడి వుంది. మాటి మాటికీ “దేవరే..దేవరే..” అని మూలుగుతూ వుంది. ఆమె పక్కటెముకల మీద కాలేసి అతడు వొక నొక్కు నొక్క గానే, మొదటిసారిగా, “మిక్కీ…” అని కేక పెట్టింది.

లోపలి నుంచి మిక్కీ మెరుపు వేగంతో లంఘించి వచ్చి, యెగురుతూ యెగురుతూ, దుముకుతూ దుముకుతూ, వెనుక మెట్లను వొక్క గెంతులో దాటి, పిడుగు లాగా కెంపమ్మ మొగుడ్ని గొంతు పట్టుకోవడానికి వురికింది. భయంతో అటూ యిటూ పరిగెత్తిన అతడు, వెనుక కంచె దాటి పరిగెత్తిపొయాడు. కెంపమ్మ పచ్చిక బయలు మీద నిస్సత్తువుగా అలాగే బోర్లా పడుకొని వెక్కిళ్ళు పెడుతున్నది. మిక్కీ ఆమె దగ్గరికొచ్చి, ఆమె తలను నాకుతూ నిలుచుంది. అమ్మా నాన్న మాటలు రానట్టు కొయ్యబారిపోయి నిలబడ్డారు. అంతా పది నిమిషాల్లో జరిగిపోయింది.

పద్మ అక్క, యీమె కొంచెం వెనుక, దూరంగా నిలబడ్డారు. అమ్మ ఆమె వైపు తిరిగి చూసినపుడు, యీమెకు తను పరాయి వ్యక్తిలా అనిపించింది.

యీమెని చూసి, “నువ్వెందుకొచ్చావు యిక్కడికి? యిదంతా చూసి భయపడతావు” అంది వినీ వినిపించనట్టుగా.

ఆమె బదులివ్వకుండా వెనుక వైపు తోటను చూస్తున్నట్టు నిలబడింది.

**************

కొంత కాలం వొంటరితనం, కాంక్ష, కల, నిశ్శబ్దం వంటి శీర్షికలతో,
‘చావు దాకా వొంటరితనం
దేహం పోవు దాకా వొంటరితనం’
వంటి కొన్ని కవితల్ని రాసింది. దాని తర్వాత, నీలి డైరీలో యే కవితనూ రాయలేదు.

***

 

దామూ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు