తొలి ఆధునిక కవయిత్రి సావిత్రి బాయి ఫూలే

ఆత్మగౌరవ చేతన సావిత్రిబాయి జీవిత చోదక శక్తి. కుల అస్తిత్వ చేతన స్త్రీ అస్తిత్వ చేతన రెండూ ఆమెలో సంపూర్ణ వికాసనం పొందాయి.

                          భారత దేశ సంఘ సంస్కరణ ఉద్యమ చరిత్రలో  రాజరామమోహన్ రాయ్ ,ఈశ్వర చంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వాళ్ళ పేర్లతో  తో పాటు జ్యోతిరావ్ ఫూలే వినబడటానికి, కనబడటానికి చాలా కాలమే పట్టింది. దానికి కారణం ఆయన కులం ఒక్కటే కాదు. కుల వ్యవస్థనే ప్రశ్నిస్తూ ఆయన చేపట్టిన సంస్కరణోద్యమ స్వభావం మౌలికంగా భిన్నమైనది కావటం మరొక ముఖ్య  కారణం. ఇక మహా పురుషుల భార్యలుగా స్త్రీలు ఎప్పుడూ చరిత్ర నీడలలో మిగిలిపోయే వాళ్ళే. జ్యోతిరావ్ ఫూలే భార్య సావిత్రి బాయి గురించి చాలాకాలం తెలియక పోవటానికి అది అదనపు కారణం .

స్త్రీల దళిత బహుజనుల అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకొన్న 1980 ల నుండి  సమాజపు చివరి అంచులకు నెట్టివేయబడిన వర్గాల ఆలోచనా విధానాలతో, ఆచరణ కార్యకలాపాలతో దేశీయ సామాజిక రాజకీయార్థిక చరిత్రను ,సంస్కృతిని సమగ్రం చేయటం, సరిచేయటం అన్న లక్ష్యాలతో సాగుతున్న కృషిలో భాగంగానే గానే జ్యోతిరావ్ ఫూలే గురించి, ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే గురించి  మనకు తెలిసి వచ్చింది. సావిత్రి బాయి ఫూలే ది జ్యోతి రావ్ ఫూలే భార్యగా అతని సంస్కరణోద్యమ కార్యకలాపాలకు సహాయకారి పాత్ర మాత్రమే కాదు. అన్నింటిలో ఆమె సహ భాగస్వామి. భారత దేశంలో మహిళాఉద్యమ చరిత్రకు తాత్విక భూమికను ఏర్పరచిన క్రియాశీల శక్తి .ఆలోచన ,ఆచరణ మనిషి మౌలిక లక్షణాలు అని ఆమె నమ్మింది. ఆమె ఆలోచనలు కవిత్వ రూపంలో ఆవిష్కృతమయ్యాయి. ఆచరణ ఆమె జీవితం.  సావిత్రిబాయి జీవితం, కవిత్వం రెండూ వర్తమానాన్ని అర్ధం చేసుకొనటానికి ,భవిష్యత్తును నిర్మించుకొనటానికి ఉత్ప్రేరకాలు.

                                                               1

                2018 జనవరి 3  సావిత్రి బాయి ఫూలే  187 వ జయంతి. తల్లి లక్ష్మి . తండ్రి ఖండోజి నెవేష్ పాటిల్ .1831 లో పుట్టిన సావిత్రికి 9 ఏళ్ల వయసులో అంటే  1940 లో జ్యోతిరావ్ ఫూలే తో పెళ్లి అయింది.స్త్రీలకు పెళ్లే విద్య ,భర్తే గురువు,ఇంటిపనులే అభ్యసన విషయాలు అని మనుస్మృతి చెప్పింది.పెళ్లి తో భర్త ఆమెకు గురువు అయిన మాట నిజమే కానీ ఆయన చెప్పిన విద్య  పతివ్రతా ధర్మాలను, గృహిణీ ధర్మాలను బోధించి స్త్రీలను ఇంటికి కట్టి పడ వేయటానికి మనుస్మృతి ఉద్దేశించిన విద్య మాత్రం కాదు.స్త్రీకి ఏ జ్ఞాన విద్యనైతే మనుస్మృతి నిరాకరించిందో దానిని ఆమె పొందటానికి తొలి విద్యా  గురువు అయినాడు ఆయన.తరువాత మిత్రులు సఖరం యాశ్వంత్ పరాంజపే ,కేశవ్ శివరాం భావేల్కర్ ల సహాయ సహకారాల తో అహమ్మద్ నగర్ లో ఫరార్స్ సంస్థ లోను ,పూనాలో ఎం.ఎస్ మిచెల్ నిర్మల్ స్కూల్ లోనూ సావిత్రి బాయి చదువుకొనటానికి, టీచర్స్ ట్రైనింగ్ పూర్తి చేయటానికి అవకాశాలను కల్పించాడు జ్యోతిరావ్ ఫూలే .ఆ రకంగా 1848 లో ఆయన   పూనాలో భీడే వాడా లో ఆడపిల్లల బడి ప్రారంభించే నాటికి అతని సంస్కరణ భావాలకు తగిన చైతన్యం తో సామాజిక కార్యాచరణలో చేదోడు వాదోడుగా నిలబడగల వ్యక్తిగా ఆమె ఎదిగింది.

      1870 లలో ఏ స్త్రీవిద్య కోసం అయితే ఆంధ్ర దేశంలో  వీరేశలింగం పంతులు ఒక మహోద్యమాన్ని నడిపాడో, కాలక్రమంలో బాలికా పాఠశాలలో బోధకులుగా స్త్రీలు ఉండాలని గుర్తించాడో ,ఆ మేరకు వితంతు మహిళలు విద్యావంతులై ,ఉద్యోగాలలోకి రావాలని ఆశించాడో   దానికి మూడు దశాబ్దాలకు ముందే అంతకంటే ఉన్నత రూపంలో జ్యోతిరావ్ ఫూలే ఇంట ప్రారంభమైన ‘నిశ్శబ్ద విప్లవం’ సావిత్రీ బాయి అనే శక్తి గా ఆవిష్కృతమైంది. మహారాష్ట్ర సంస్కరణోద్యమంలో ఆమెది కీలక పాత్ర.

    కుల లింగ వివక్షలకు వ్యతిరేకంగా పని చేసే పురుషులనే సహించని సంప్రదాయ సమాజం కుటుంబ పరిధిని దాటి సమాజాన్ని మరమ్మత్తు చేయటానికి బయటకు వచ్చే స్త్రీలను అసలే సహించలేదు.అనేక రంగాలలో స్త్రీల కృషిని  నిరోధించటానికి ,నియంత్రించటానికి వ్యతిరేక ప్రచారాలకు ,భౌతిక దాడులకు ,అత్యాచారాలకు పాల్పడుతున్న పితృస్వామిక అధికార వికృతి మనకు తెలిసిన వర్తమానమే.కొదురుపాక రాజవ్వ నుండి ,భన్వారీ బాయి ,సోనె సోరీ వరకు ఎందరో అందుకు ఉదాహరణలు. అలాంటప్పుడు నూటా యాభై సంవత్సరాల క్రితం ఆడపిల్లలకు చదువు చెప్పటానికి ,అందులోనూ శూద్ర, అతి శూద్ర బాలికలకు చదువు చెప్పటానికి బయటకు వచ్చిన సావిత్రీ బాయిని  రాళ్లు రువ్వి , కుళ్ళిన కూరగాయలు ,పేడ విసిరి వేధించారంటే ఆశ్ఛర్య పడవలసినది ఏమీ లేదు.వాటిని తన పనికి అభినందనగా విసరబడే పూలగా భావిస్తూ, వాళ్ళ చర్యలవల్ల పాడై పోయిన చీరను మార్చుకొనటానికి మరొక చీర కూడా వెంట తీసుకువెడుతూ ఆమె కనబరచిన ,నిబద్ధత,సంసిద్ధత గొప్ప విలువలు.

    సంప్రదాయ సమాజ నియమాలను తిరగరాయాలని జ్యోతిరావ్ ఫూలే ప్రారంభించిన ఉద్యమం  తండ్రికే భరించరానిదై ఇంట్లో స్థానంలేదని బెదిరిస్తే సావిత్రి బాయి ఫూలే భర్త మార్గమే తన మార్గమని అతని తో కలిసి అడుగు బయట పెట్టింది. అప్పటికి ఆమె వయసు పద్దెనిమిది.అప్పటి నుండి  1897 లో 66 ఏళ్ల వయసులో మరణించేవరకు సావిత్రీ బాయిది సమాజ జీవితమే.

ఆడ పిల్లలకు  ,మహర్ ,మాంగ్ వంటి అతిశూద్ర పిల్లలకు మాత్రమే కాదు,వయోజనులకు పాఠశాలలు ఏర్పరచటం నుండి  ,వ్యవసాయ కార్మికులకు (1855) రాత్రి బడి నడపటం వరకు మహారాష్ట్రలో ఆధునిక విద్యా వ్యాప్తికి  ఆమె చేసిన కృషి గణనీయమైంది.

      బాలికల చదువుకు బడులు పెడితే సరిపోదని , ఆడపిల్లలను బడికి పంపటానికి ఇంటి నుండి బడికి ఉండే దూరం ఒక అవరోధం అని గుర్తించి ,దానిని అధిగమించటానికి ఇంట్లోనే ఒక వసతి ఏర్పాటు చేసి స్వయంగా వాళ్ళ ఆలనా పాలనా చూసుకొన్న వ్యక్తి సావిత్రి బాయి. దయ ,ప్రేమ గల తల్లిగా ఆమె ఆ పిల్లల హృదయాలలో చోటు సంపాదించుకొన్నది.  అంటరానివారిగా బహిష్కృతులు అయిన వారి కోసం తన ఇంటి ఆవరణలో బావి తవ్వించినా (1868) కరువు పీడితులకు ఉచిత భోజన శాలలు ఏర్పరచి (1877)ఆకలి తీర్చినా,ప్రాణాలనే బలిపెట్టి ప్లేగు వ్యాధిగ్రస్తుల స్వస్థతకు పాటు పడినా అన్నీ ఆ దయ, ప్రేమ గల తల్లి లక్షణం వల్లనే .ఆ స్వభావానికి అద్భుతమైన వ్యక్తీకరణ 2017 జనవరి నెలలో సావిత్రీ బాయి ఫూలే 186 వ జయంతి కి  గూగుల్ హోం పేజీ కి తల మీదనుండి కప్పుకున్న చీర ఉయ్యాల గా చేసి విశాలంగా విస్తరించిన రెండు చేతుల మధ్య ప్రపంచాన్నంతా పొదువు కొని లాలిస్తున్నట్లుగా రూపొందించిన స్త్రీ మూర్తి .

     సావిత్రి బాయి ఫూలే  శూద్ర అతిశూద్ర బాలబాలికల విద్యకు ఎంత పాటుపడిందో ,అంతగానూ స్త్రీల సమస్యల పై పనిచేసింది. సర్వ మానవ హక్కులు అనుభవిస్తూ స్త్రీలు ఆత్మ గౌరవంతో జీవించటాన్ని గురించి కలకంటూ 1852 లో మహిళా సేవా మండల్ స్థాపించింది. ఆనాడు సమాజంలో ఉన్న అతి తీవ్ర సమస్య వితంతు స్త్రీల దుర్భర జీవితం.అదీ బ్రాహ్మణులలోనే ఎక్కువ.  సావిత్రీ బాయి చేపట్టిన సంస్కరణోద్యమం లో తొలుత సంబోధించ బడింది అదే. వింతతువులకు తల గొరిగించటం అమానుష ఆచారంగా ఆమె భావించింది.బాధిత స్త్రీలను దానికి వ్యతిరేకంగా సమీకరించటం తక్షణం జరిగే పని కాదు అని ఆమెకు తెలుసు. కానీ తమ శరీరం మీద స్త్రీల హక్కులను ఖబ్జా చేసిన సంప్రదాయం పట్ల అవసరమైన అసహనం ఆమెను నిలువ నీయలేదు. మంగలి వారిని ఏకం చేసి ‘వితంతు స్త్రీల తలలు గొరగము’ అనే నినాదంతో సమ్మె కట్టించి తన నిరసనను ఆ రకంగా ప్రకటించింది.

      ‘తలలు బోడులైన తలపులు బోడులౌనా’ అని వేమన అన్నట్లుగా వితంతు స్త్రీల తల వెంట్రుకలు తీసేసినంత మాత్రాన వాళ్లలో వయో సహజ వాంఛలను అరికట్టడం ఎవరివల్లా  సాధ్యం కాదు.అది వాళ్ళను చాటుమాటు లైంగిక సంబంధాలకు ప్రేరేపిస్తుంది.యవ్వనానికి వచ్చి పుట్టింటనో అత్తింటనో ఆశ్రయం పొందిన వితంతువులు ఇంట్లోని పురుషులో ,తరచు  ఇంటికి వచ్చిపోయే బంధుమిత్ర పురుషులో పెట్టె ప్రలోభాలకు లోనై గర్భవతులు కూడా అవుతుంటారు. బిడ్డలను కనాలని ఉన్నా పరువు ప్రతిష్ఠలకు లోబడి, లోక నిందకు వెరచి గర్భస్రావాలకు పాల్పడతారు. నాటు మందులతో అధిక రక్త స్రావంతో మంచాన పడి యాతన అనుభవిస్తుంటారు. గర్భస్రావ ప్రయత్నాలు ఫలించకపోతే  నవమాసాలు మోసి కన్న బిడ్డలను అక్రమ సంతానంగా అవమానించే సామాజిక పరిస్థితులలో పెంచి పోషించుకొనే స్థోమత లేక వదిలించుకొనటమో వధించటమో వాళ్లకు అనివార్యమవుతుంది.శిశుహత్య నేరం నిరూపితమై శిక్షించబడే స్త్రీలు కూడా ఉంటారు.

       1881లో సూరత్ లో ఉరిశిక్ష విధించబడిన  విజయలక్ష్మి అనే బ్రాహ్మణ స్త్రీ అలాంటి స్త్రీలలో  ఒకరు.ఆ కోర్టు తీర్పును తప్పు పడుతూ స్త్రీకి ఒకరకంగా ,పురుషుడికి ఒక రకంగా అమలవుతున్న నీతిని ,న్యాయాన్ని తీవ్రంగా విమర్శిస్తూ 1882 లో తారాబాయి షిండే ‘స్త్రీ పురుష తులన’ అనే వ్యాసం రాసింది.అది ఆనాడు గొప్ప సంచలనం కలిగించిన  విప్లవాత్మక చారిత్రక పత్రం. అయితే అప్పటికి 19 ఏళ్లకు పూర్వమే ఈ సమస్య తీవ్రతను గుర్తించి సావిత్రి  బాయి కార్యరంగంలోకి దిగటం గమనించదగినది. కాశీబాయి అనే బ్రాహ్మణ వితంతువు బిడ్డను కని లోకానికి భయపడి చంపి బావిలో వేసిన  నేరానికి జీవిత ఖైదు శిక్ష విధించబడగా అందుకు కలవర పడిన జ్యోతిరావ్ ఫూలే దంపతులు అలాంటి ఒంటరి స్త్రీలకు ఆశ్రయం కల్పించి పురుళ్ళు పోసి   నైతిక మద్దతు ఇయ్యటానికి 1863 లోనే ‘బాలహత్యా ప్రబంధక్ గృహ్’ ఏర్పాటు చేయటం విశేషం. .

‘అండమానులో జీవితఖైదు తప్పించుకొనటానికి మార్గం’ అంటూ ఆ సంస్థ ను గురించి  ప్రచారం చేసిన తీరులో స్త్రీల పట్ల వాళ్ళ ఆర్తి కనబడుతుంది.

    ఈ ప్రసవాలయంలో   వదిలి వేయబడిన శిశువుల కోసమా అన్నట్లుగా ఆ సంవత్సరమే అనాధ శరణాలయం కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు.జ్యోతిబా ఫూలే సాహచర్యం లోనూ  ,ఆయన మరణానం తరం కూడా అలుపెరుగని ,ఆడంబరం లేని కార్యనిర్వహణా దక్షురాలుగా సావిత్రి బాయి సార్ధక జీవితం గడిపింది.నిజమైన అర్ధంలో ఆమె  ‘జాతిమాత’.

                                                            2

                 సావిత్రి బాయి ఆధునిక ఇంగ్లీష్ విద్యను అందుకున్న తొలి మహిళ, తొలి ఉపాధ్యాయురాలు, తొలి మహిళా సంఘ సంస్కర్త మాత్రమే  కాదు తొలి ఆధునిక కవయిత్రి కూడా. 1854 లో ఆమె కవితా సంపుటి ‘కావ్యఫూలే’ ప్రచురించబడింది.అంటే అధ్యాపకురాలిగా, సంస్కరణో ద్యమ కార్యకర్తగా జీవితం ప్రారంభించిన తొలినాళ్ళ నుండే ఆమె కవితా వ్యవసాయమూ ప్రారంభం అయిందని అనుకోవచ్చు.కావ్య ఫూలే లో  ఫూలే అన్న మాటకు పూలు అన్న అర్ధం ఉన్నా ఫూలే కుటుంబానికి సంబంధించిన కావ్యం గా కూడా దీనిని గుర్తించవచ్చు.ఫూలే కుటుంబం అంటే జ్యోతిరావ్ ఫూలే ,సావిత్రి బాయి ఫూలే .ఇద్దరి  జీవితాలు ఒకటిగా పెనవేసుకున్న చరిత్ర. సావిత్రీ బాయి ‘ఆత్మకథనం’ గా ప్రారంభమై ‘సావిత్రి జ్యోతిబా ఫూలే సంభాషణ’ గా ముగిసిన కావ్యం ఇది ఇరవై ఇరవై రెండేళ్ల వయసుకే కుల లింగ వివక్షతల గురించి,మత తాత్విక త గురించి, చరిత్ర గురించి, విద్య గురించి  సావిత్రీ బాయి ఆలోచనలలో వచ్చిన పరిణతకి అవగాహనలోని స్పష్టతకు సంస్కరణ ఉద్యమ నిబద్ధతకు నిదర్శనం ఈ కావ్య సంపుటి.

   కావ్య ఫూలే లో 38 కవితలు ఉన్నాయి. మొదటి కవిత ఆత్మకథనం . సావిత్రిబాయి బొంబాయి ప్రెసిడెన్సీ లో సతారా జిల్లాలోని నయా అనే గ్రామంలో పుట్టింది. ఆ గ్రామ  గౌరవ గీతం ఈ కవిత. ఆ గ్రామ వ్యవస్థను గొప్పగా తీర్చి దిద్దిన పాటిల్ కుటుంబంలో పుట్టానని గర్వపడుతుంది. పాడిపంటల, తోట బావుల ,తీరొక్క ఫలపుష్ప వృక్షాల సౌందర్య గానం గా సాగుతుంది ఈ కవిత. ‘జ్యోతిబాకు వందనాలు’ వంటి మరికొన్ని కవితలు  ఈ ‘ఆత్మకథనం’ కవితకు అనుబంధం అనుకోవచ్చు.

ఇవన్నీ కలిస్తే అది జ్యోతిబా తోటి ఆమె సాగించిన సహ జీవన యానం. జ్యోతిబా సావిత్రిబాయికి ఆరాధ్యుడే కానీ అది సంప్రదాయార్ధంలో కాదు.  జ్యోతిబాకు ఆమె నమస్కరిస్తుంది. ‘పతిదేవుడు’ అయినందువల్ల మాత్రం కాదు.ఆయన సామాజిక జ్ఞాన చైతన్యాల ఔన్నత్యం కారణంగా నమస్కరిస్తుంది.  “దీనులు శూద్రులు అతి శూద్రులు/ నీ వైపే చూస్తున్నారు /జ్ఞానం తో /మా మనస్సులను నింపండి” అని వేడుకొనటంలో ఆయనతోటి సహజీవన స్వీయ సంబంధంవల్ల ఆత్మాశ్రయం కావటానికి అవకాశం ఉన్నవస్తువును పరాశ్రయంగా పరివర్తింప చేసిన  పరిణత వాణి వినబడుతుంది. ‘సుబోధ రత్నాకరం’ కవితలోనూ జ్యోతిబాకు నిండు మనస్సుతో నమస్కరిస్తాను అంటుంది సావిత్రి బాయి. భర్త అయినందుకు కాదు,తన కవితకు ప్రేరణ అయినందుకు, పరమానందమైన స్నేహం పంచినందుకు ,సద్బుద్ధిని ప్రసాదించినందుకు ,చదవటం రాయటం నేర్పినందుకు … ఆ నమస్కారం.

       ‘జ్యోతిబా’  కవిత ఒకరకంగా ఆయన జీవిత చరిత్ర ,ఆయనతోటి సహజీవన సంబంధంలో సాగించిన ఉద్యమ యానం.దాని  పరమోన్నత స్థాయి ‘సావిత్రి -జ్యోతిబా సంభాషణ’ అనే కవిత. రాత్రి గడిచి సూర్యోదయం అవుతున్న వేళ కలిగిన ఆనందాన్ని సావిత్రి జ్యోతిబా తో పంచుకొనటం ఈ కవితా వస్తువు. రాత్రి ,చీకటి మార్పును సహించని  మూర్ఖపు లోకానికి గుర్తు. సూర్యోదయం బాధితుల ఎదమెదడులలో మేల్కొన్న జ్ఞాన చైతన్యాల ప్రతీక. ఆ చీకటి కరిగిపోతూ ఈ వెలుతురు వ్యాపిస్తున్న వేళ అచ్చమైన మనిషి పొందే వెచ్చటి అనుభూతికి వ్యక్తీకరణ సావిత్రి పొందిన ఆనందం. “ఎల్ల కాలం చీకటిగానే ఉండాలని /రాత్రి కోరుకుంటుంది/సూర్యుడి మీద శాపాల వర్షం కురవాలని /మూర్ఖులు కోరుకుంటారు / విషపూరిత కాళరాత్రి గడచిపోయింది. /సూర్య తేజస్సుతో సృష్టి సమస్తం /ప్రకాశవంతమైంది” అంటూ సావిత్రి వైతాళిక గీతం ఆలపిస్తుంది. జ్యోతిబా ముఖంగా దీనమాంగులు మహర్లు అజ్ఞానంతో దుఃఖాన్ని సహించాలి /పశువుల మాదిరి జీవించాలి అని మూర్ఖ సమాజం ఎంత ఒత్తిడి పెట్టినా కొత్త ఆశలతో మేల్కొంటున్న శూద్రుల స్థితిని “గంప క్రింద కమ్మినప్పటికీ /కోడి కూస్తుంది /తెల్లారుతుందనే సంకేతం /జనులకు ఇస్తుంది” అంటూ ఒక గ్రామీణ సందర్భం నుండి వ్యాఖ్యానిస్తుంది. కవిత ముగింపు దగ్గరకు వచ్చేసరికి “శూద్రజనుల  ఆకాశం లో జ్యోతిబా ఓ సూర్యుడు” అని ప్రకటిస్తుంది. మనుషులమనే సర్వోన్నత స్థానం పొందటానికి మునుముందుకు సాగాలంటూ ఆ వెలుగులో ఒక ఊరేగింపుకు నాయకత్వం వహిస్తూ రెపరెపలాడే జెండా వలె సావిత్రిబాయి కనిపిస్తుంది.

                                                                 3

                               సావిత్రిబాయి కవిత్వంలో పౌరాణిక పాత్ర బలిచక్రవర్తి ప్రస్తావన తరచు వస్తుంది. ఆత్మకథనం కవితలో బలిచక్రవర్తిని మహనీయుడిగా పేర్కొని ‘ఆ మహాదాత యోద్ధాకు నిజమైన వారసులం’ అని సగర్వంగా చెప్పుకొన్నది.  ‘యోధులు – మహాచక్రవర్తి గౌరవగాధ’ అనే కవిత లో బలిరాజ్య సిరిసంపదలు , బలిచక్రవర్తి దానధర్మ గుణమూ ప్రశంసిస్తూ బలిని దానవీరుడుగా పేర్కొన్నది. సాధారణంగా రామరాజ్యం కీర్తనీయ విషయం కాగా సావిత్రి దానికి ప్రత్యామ్నాయంగా బలి రాజ్యాన్ని  నిలబెట్టింది. ఎందువల్ల ? పౌరాణిక చరిత్ర దేవతల ప్రయోజనాల కోసం దానవులను దుర్మార్గులుగా చిత్రించి అణచివేసింది. అణచివేయబడినవాళ్ల పక్షం ఆమె తీసుకున్నది. దేవదానవులు ఒకే తండ్రి బిడ్డలు. కశ్యప ప్రజాపతి వాళ్ళ తండ్రి. తల్లులు మాత్రమే వేరువేరు.అదితి సంతానం దేవతలు . దితి సంతానం దానవులు. ఇంద్ర సింహాసనం మాత్రం ఎప్పుడూ దేవతలదే. దానికోసం సంఘర్షించిన ప్రతి సందర్భంలో దేవతల పక్షాన విష్ణువు ఎదో ఒక పద్దతిలో దానవులను అణచివేస్తూ వచ్చాడు. గెలిచినవాళ్లు రాసిన చరిత్రలో దానవులు ప్రతినాయకులు అయినారు. ఈ పౌరాణిక చరిత్రను తిరగరాయటం భారతీయ సమాజంలో సమాన న్యాయం నిరాకరించి బడిన వర్గాల సహజ ఆకాంక్ష అయింది. ఆ క్రమంలోనే సావిత్రి బాయి బలి ని దానవీరుడిగా నిలబెట్టి ఉంటుంది. దానధర్మ గుణాలు ఉండి ,రాజ్యాన్ని సుసంపన్నం  చేసి పాలిస్తున్న బలి తన పదవికి పోటీ అవుతాడని భయపడిన ఇంద్రుడి ప్రయోజనాలకోసం విష్ణువు వామనావతారం ఎత్తాడు. మూడడుగుల నేల దానమడిగి పాతాళానికి అణచివేశాడు.ఆ విష్ణువే రావణాసురుడిని అణచటానికి రామావతారం ఎత్తాడు. రామరాజ్యం దేవతల ప్రయోజనాలకు ఏర్పడినది కనుక శూద్ర అతిశూద్ర ప్రయోజనాల కోసం ఆలోచించే సావిత్రి దానికి ప్రత్యామ్నాయంగా బలిచక్రవర్తి రాజ్యాన్ని నిలబెట్టినట్లయింది.

                                                               4

                       సావిత్రి బాయి కవిత్వంలో చరిత్ర గురించిన పదునైన రాజకీయ దృక్పధం కనిపిస్తుంది.

ఛత్రపతి శివాజీ నుండి పీష్వాల మీదుగా బ్రిటిష్ వలస పాలకుల వరకు ఎవరిని గౌరవించినా, ఎవరిని నిరాకరించినా శూద్ర అతిశూద్ర ప్రయోజనాల కోణమే ప్రధానం. ‘ఛత్రపతి శివాజీ’ అనే కవితను రాసిందామె. ‘సుబోధ రత్నాకరం’ అనే దీర్ఘ కవితలోనూ అతనిని ప్రస్తావించింది.  తాను పుట్టిన సతారా జిల్లా లోనే తనకన్నా రెండు వందల సంవత్సరాల ముందు ఆయనా పుట్టాడన్న అభిమానం ,స్వతంత్ర మహారాష్ట్ర రాజ్య నిర్మాత అన్న గౌరవం అందుకు కొంతవరకు కారణ కావచ్చు కానీ అంతకన్నా అతని పాలనా కాలంలో శూద్రులకు ,అతిశూద్రులకు దక్కిన గుర్తిపు గురించిన స్పృహ అందుకు ప్రధాన కారణం అనాలి.1630-1680 మధ్యకాలంలో జీవించి మొఘలులను ఎదిరించి నిలిచిన శివాజీ   అతిశూద్ర కులాలుగా సమాజంలో చిన్న చూపుకు గురి అయిన మహర్ మాంగ్ ల సైనిక శక్తి సామర్ధ్యాలను గుర్తించి విస్తృతంగా సైన్యంలో చేర్చుకొన్నాడు.కోటల పైకి యుద్ధానికి వెళ్లే సైన్య నాయకులుగా వాళ్ళు ఎన్నో విజయాలు సాధించారు. అది వాళ్ళు ఒక ఐక్య శక్తిగా బలపడటానికి కూడా కారణం అయింది. ఈ చరిత్ర తెలిసి రాసిన కవితలు సావిత్రి బాయి ఫూలేవి. “పొద్దు పొద్దునే /ఛత్రపతి శివాజీని స్మరించాలి/ శూద్రులు,అతిశూద్రుల ఉద్ధారకుడు” అంటుంది. శివాజీ పాలనలో వాళ్ళు పొందిన గౌరవాదరాలు ఆయన  తరువాత మరాఠా రాజ్య పతనంతో అంతరించి పోయాయని కలత పడింది.

     తదనంతరం అధికారానికి వచ్చిన పేష్వాల రాజ్యాన్ని ఆమె ఏవగించుకొన్నది శూద్ర అతిశూద్రుల జీవితాలను చీకటి యుగంలోకి నెట్టిన కారణంగానే.  ‘పేష్వాల రాజ్యం’ కవిత ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. శూద్రులను భయభీతులను చేసిన రాజ్యం అది. “ఉమ్మి కోసం /మేడలో ముంత / దారులలో నడవడం నిషిద్ధం /దుమ్ముతో నిండిన కాలిబాటలలో నడక /అడుగులను తుడిచి వేయటానికి / నడుముకు చీపురు కట్ట”–ఈ దుర్భర వివక్షపై ఆందోళన ఈ కవితలో ప్రధానం.స్త్రీలను భోగ వస్తువులుగా యథేచ్చగా వాడుకొనే పీష్వాల పద్దతిని చీదరించుకొంది.ఈ విధమైన పేష్వాల  అత్యాచార మూర్ఖ పాలన అంతమైనందుకు ఆనందమే కానీ విషాదం ,విలాపం ఎక్కడా లేదని అంటుంది సావిత్రి.

    ‘పేష్వాల రాజ్యం’ కవిత ముగింపులో  “స్త్రీలను ,శూద్రులను /పేష్వాల నుంచి విముక్త మొనర్చ” ఆంగ్లేయుల రాజ్యం ఏర్పడిందని ఒక ఊరట పొందింది సావిత్రి. దానికి కోన సాగింపుగా ఆంగ్లేయుల రాజ్యం ఏర్పడే క్రమంలో శూద్రులు నిర్వహించిన పాత్ర గురించి ఆమె ఈ కవితలో  ప్రస్తావించిన విషయం ఆసక్తి కరమైనది. “శూద్ర జాతులు సమస్తం / ఆంగ్లేయుల పాలనను సమర్ధిస్తాయి /ఆగ్లేయుల పక్షాన పోరాడటానికి /అన్న దమ్ముల వలే అన్నీ జాతుల వారు /సంతోషంగా ముందుకు వచ్చారు/ శూద్రులు అత్యాచారి పేష్వాల రాజ్యాన్ని /అంతమొందించి దాని స్థానంలో /తెలివైన ఆంగ్లేయుల అధికారాన్ని స్థాపించారు” – అని ఆ కవితను ముగించింది.

     సావిత్రి రాసిన ఈ మాటలు 1818 జనవరి 1 వ తేదీనాడు భీమా నది ఒడ్డున కోరే గావ్ అనే వూళ్ళో జరిగిన యుద్ధంలో రెండవ పేష్వా బాజీ రావు మీద తూర్పు ఇండియా కంపెనీ సాధించిన విజయానికి సంబంధించినవే కావాలి. ఆంగ్లేయుల పక్షాన పోరాడిన సైనిక బెటాలియన్ లో మహార్లు మరాఠాలు,రాజపుత్రులు వున్నారు. ఆంగ్లేయుల పక్షాన స్వదేశీ రాజు పై యుద్ధానికి వాళ్ళు సంతోషంగా సంసిద్ధులు కావటానికి కారణం పేష్వాల కులవివక్షాపూరిత అణచివేత అత్యాచారాల పాలనలో నిత్యం  అనుభవిస్తున్న అంతులేని కష్టాలే. ఆ యుద్ధం పేష్వాల రాజ్యాన్ని కూలదోసి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు, స్థిరీకరణకు దారితీసింది కనుక అది జాతీయవాదులకు బాధాకరం కావచ్చు కానీ ఆ భారత జాతిలోనే కులవివక్షకు గురి అవుతూ హీనంగా బతకాల్సిన స్థితిలో ఉన్నవారికి అందుకు బలమైన మద్దతుగా ఉన్న రాజ్యం కూలి పోవటం సంతోషాన్ని కలిగించటం సహజమే.అందువల్లనే అది ఆంగ్లేయుల పక్షాన ఆ యుద్ధంలో పాల్గొన్న శూద్రులకు ,అతి శూద్రులకు తాము స్వయంగా పేష్వాల మీద సాధించిన విజయంగా అనిపించి ఉంటుంది. ఆ ఘటన సావిత్రిబాయికి అంత్యంత సమీప గతం. ఆ నాడే  ఆమె దానిని అట్లా సంభవించగలిగింది. అత్యాచారి పేష్వాల రాజ్యాన్ని అంతమొందించి ఆంగ్లేయల అధికారాన్ని స్థాపించిన వాళ్లుగా శూద్రుల ఆధిక్యాన్ని నిలబెట్టింది తన కవితలో . ఆ తరువాత అరవై ఐదేళ్లకు 1927 లో అంబేద్కర్ కోరేగావ్ యుద్ధ స్మారక స్థూపాన్ని సందర్శించి వచ్చినప్పటి నుండి అది దళితుల ఆత్మగౌరవ ప్రకటనకు ఒక సంకేతం,సందర్శన స్థలము అయింది. ఇప్పుడు 200 ఏళ్లకు అక్కడకు చేరుకొనే దళితుల మీద దాడులు జరిగాయంటే ,మహారాష్ట్ర అంతటా హింసాకాండ పెచ్చరిల్లింది అంటే చరిత్ర నుంచి మనం ఏమి నేర్చుకొన్నట్లు ? అణచబడిన వర్గాల ఆంకాంక్షలను ఎంత గౌరవించినట్లు?  ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి పట్ల ఎంత సహనం తో ఉన్నట్లు? రాజ్యంగ బద్ధమైన హక్కులుగా స్వేఛ్ఛా స్వాతంత్య్రాలకు ఏమి విలువ ఇస్తున్నట్లు?

       ఆగ్లేయ పాలనను కీర్తిస్తూ  కవితలు రాయటానికి సావిత్రిని ఆకర్షించినది  అందులోని ఉదారవాద విలువలు. ‘మానవులందరు/చదువుకొనుటకు ,రాయుటకు అర్హులు’ అన్న ఆంగ్లేయుల ప్రకటన విప్లవాత్మకమైనది అంటుంది ‘ఆంగ్లేయ పాలన’ అన్న  కవితలో . లింగ కుల మినహాయింపు లేవీ లేకుండా అందరికీ విద్య అందుబాటులోకి తెచ్చిన పాలన కనుక దానిని ఆమె ఆహ్వానించింది. “జ్యోతిబా చరిత్ర మాదిరి /ఆంగ్లేయుల పాలన ఉత్సాహ వంతం ,ప్రేరణాదాయకం” అంటూ తనకు  అత్యంత ప్రీతి పాత్రమైన వ్యక్తితో పోలిక చెప్పేంతగా ఆంగ్ల పాలన ను ఆమె అభిమానించటం గమనిచ దగినది.ఇంగ్లీషు తల్లి ,ఇంగ్లీషు నేర్చుకో – అనే రెండు కవితలలోనూ శూద్రుల పట్ల కనబరచిన స్నేహ భావం కారణంగానే ఇంగ్లీష్ పాలనను ఆమె అభిమానించటం కనిపిస్తుంది.శూద్రుల ,అతిశూద్రుల దుఃఖాన్ని దూరం చేసే విద్య ఇంగ్లీషు విద్య అంటుంది.  “ఇంగ్లీషు చదివి కుల భేదాల /గోడలను కూల గొట్టు /భట్ బ్రాహ్మణులు రచించిన కుతంత్రాల /శాస్త్ర పురాణాలను పడ గొట్టు” అంటూ గురిచూసిన లక్ష్యంతో ఇంగ్లీషు నేర్చుకొనటానికి పిలుపును ఇచ్చింది.

                                                     5

              ఇంగ్లీషు చదవటమంటే ఇంగ్లీషు భాష నేర్చుకొనటం కాదు. ఇంగ్లీషు విద్య నేర్చుకొనటం ఇంగ్లీషు విద్య అంటే లౌకిక విద్య. లౌకిక ప్రపంచంలో జ్ఞానచైతన్యాలతో జీవించటానికి కావలసిన ఎరుక కలిగిచే విద్య. భౌతిక జీవితంలో సంప్రదాయ సంకెళ్లను తెంపుకొని ఆధునికత వైపు పయనించ డానికి అవసరమైన వివేకాన్ని ఇచ్చే విద్య. ఆర్ధిక స్వావలంబనకు ఆసరా అయ్యే విద్య. అటువంటి విద్య ను నేర్చుకొనటానికి పిలుపునిస్తూ కవిత్వం రాసింది సావిత్రిబాయి.విద్య విలువ తెలిసిన వ్యక్తిగా మనుషులలో విద్యాసక్తి ని అభివృద్ధి చేయటానికి ఒక ఉద్యమంగా పని చేసింది. ‘చదువు కోసం చైతన్యులు కండి’  అనే కవితలో అతిశూద్ర సోదరులను, ‘గొప్ప ఆస్తి’ అనే కవితలో పిల్లలను సంబోధించి విద్యా సముపార్జనకు ప్రోత్సహించింది. ‘అన్ని ఆస్తి పాస్తులకన్న / విద్యయే నిజమైన ఆస్తి ,సర్వోన్నత శక్తి అని ప్రతిపాదించి చెప్పింది. ‘బృంద కవిత్వం’ లో ఆడపిల్లల చదువుగురించిన ఆరాటం కనబడుతుంది. సంగీత నృత్య రూపకంగా ప్రదర్శింప చెయ్యాలన్న ఆలోచన తో రాసిన గీతం ఏమో ఇది అనిపిస్తుంది.కవిత ప్రారంభంలో వున్న ‘ ప్రతి బృందంలో అయిదుగురు చెలికత్తెలు’ అన్న సూచనను బట్టి అలా అనుకోవలసి వస్తుంది. నాలుగు బృందాల మధ్య సంవాదంగా నడుస్తుంది. మొదటి బృందం జ్ఞాన దర్బారు తెరుచుకుంది ..పదండి బడిలో చదువుకొని జ్ఞానాన్ని పొందుదాం అని తోటి వాళ్ళను పిలుస్తుంది. రెండవ బృందం చదువేమిటి !? ఆడుకుందాం పడమంటుంది. మూడవ బృందం ఇంటి పనిలో అమ్మకు సహాయం చేద్దాం పదమంటుంది. నాలుగవ బృందం చదువా ,ఆటపాటలా ,అమ్మకు పనిలో సాయమా అమ్మనడిగే తేల్చుకుందాం పదమంటుంది. తల్లి ఏమి చెప్పింది పిల్లలకు? “ఆత్మాభిమానంతో జీవించడం కోసం /బడిలో చదువుకోవాలి” అంటుందామె. మొదట చదువు ,తరువాత ఆటపాటలు ,ఖాళీ వేళలలో ఇంటిపని -ఇదీ ఆ తల్లి ప్రాధాన్య క్రమం. ఆ తల్లి సావిత్రి బాయి కాక మరెవరు? ఆ తల్లి ఇచ్చిన ప్రేరణ ఆ పిల్లలందరినీ ‘అజ్ఞానాన్ని ,పేదరికపు బానిసత్వాన్ని తుదముట్టించగా ,శతాబ్దాల ఆశయ జీవితానికి అంతం పలుకగ’ చదువు కోసం సంకల్పించేట్లు చేశాయి. బానిస సంకెళ్లను త్రెంచి స్వతంత్రులు కావటం గమ్యంగా బడిబాట పట్టేట్లు చేశాయి.

 

                                                         6

                    ఆత్మగౌరవ చేతన సావిత్రిబాయి జీవిత చోదక శక్తి. కుల అస్తిత్వ చేతన స్త్రీ అస్తిత్వ చేతన రెండూ ఆమెలో సంపూర్ణ వికాసనం పొందాయి.శూద్రుల పరావలంబనం ఆమెకు ఖేద హేతువు. ‘శూద్రులు ,అతి శూద్రులు అజ్ఞానంచేత వెనుక బడ్డారు’ పుట్టుకకు కారణం తల రాత అనుకొనటం ఫలాన్ని ఆశించ కుండ చాకిరీచేస్తే స్వర్గంలో పుణ్యం లభిస్తుందన్న బోధనలను నమ్మటం ఆ అజ్ఞానానికి కారణం అని ఆమెకు తెలుసు.అజ్ఞానం లో మగ్గి పోతున్న వాళ్ళ పట్ల ఆర్తి ‘శూద్రుల పరావలంబనం’ కవితలో కనిపిస్తుంది. ‘శూద్రులంటే’  అన్న కవిత శూద్రుల ఆత్మభిమాన ప్రకటన. శూద్రులంటే నేటివ్ లు అని నిర్వచించింది. నేటివ్ లు అంటే స్థానికులు . మూల వాసులు. అధికారులు. దండెత్తివచ్చిన వారి చేత రచించబడిన చరిత్రలో పరాజితులు శూద్రులుగా ముద్రవేయబడి బానిసలుగా చేయ బడి సమాజపు చివరి అంచులకు నెట్టివేయ బడ్డారు.ఈ దశకు ఈడవబడిన వారి పూర్వ శౌర్య ఘన చరిత్రను గుర్తు చేయటం శూద్రులలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసేందుకే.

    సావిత్రిబాయి కవిత్వంలో   స్త్రీల పరావలంబనం గురించిన  ఆందోళన పెద్దగా కనబడదు కానీ లింగ వివక్ష గురించిన స్పృహ స్పష్టంగా కనబడుతుంది. అంత కన్నా స్త్రీల శక్తి మీద అపారమైన నమ్మకం ,గౌరవం కనబడతాయి. మనుషులను మనుషులు అనటానికి కొన్ని లక్షణాలు వుండాలని ప్రతిపాదిస్తూ ఆ లక్షణాలు లేని వాళ్ళను మనుషులని ఎలా అనను అన్న ప్రశ్నతో వాళ్ళు మనుషులుకాదని అత్యంత తిరస్కృత  వాచ్యంగా చెప్పే శిల్పంతో ‘వారిని మనుషులని ఎలా అనను’ అనే కవిత రాసింది సావిత్రిబాయి. ఆలోచన,ఆచరణ లేని వాళ్ళను ,మూఢనమ్మకాలలో కూరుకుపోయిన వాళ్ళను ,బానిసత్వం గురించి బాధపడని వాళ్ళను ,అభివృద్ధి సంకల్పం లేని వాళ్ళను ఇలాంటి మరికొందరిని మనుషులని అనలేనని నిక్కచ్ఛిగానే చెప్పింది. ఆ కవితలో ఒక భాగం ఇలా ఉంటుంది.  “పాపం భార్య పనిచేస్తూనే ఉంటుంది

                                      ఏ కష్టం లేకుండా భర్త నిస్సిగ్గుతో ఆరగిస్తూనే  ఉంటాడు

                                      పశువులలో కూడా లేదు ఇలాంటి వింత

                                      వారిని మనుషులని ఎలా అనను ?” — నిరంతరం విసుగుకలిగించే ఇంటి పనిలో స్త్రీలు మగ్గిపోతుంటే ,ఆ కష్టంలో భాగం పంచుకోకుండా తిని కూర్చొనటం పురుషుల హక్కుగా చేసిన పితృస్వామిక సమాజం ఇది.ఆ సామాజిక నీతిని నిర్ద్వంద్వంగా  తిరస్కరించింది సావిత్రి. ఇంట్లో పని చెయ్యకుండా తినటం సిగ్గులేని తనమని పురుషుల ప్రవర్తనను తప్పు పెట్టటమే కాదు ,ఆ విషయంలో పశువులకన్నా హీనమైన మనుషుల ప్రవృత్తుల గురించి ఆందోళన పడింది. మగవాళ్ళు .మనుషులుగా మారటం గురించిన హెచ్చరిక ఇందులో అంతర్లీనంగా వుంది.

      ‘మా అమ్మ’, మహారాణి ఛత్రపతి తారాబాయి అనే రెండు కవితలు స్త్రీ శక్తి ఆవిష్కరణలు. మా అమ్మ కవితలో అమ్మకు నెమలితో పోలిక.నెమలి ఈకల రంగులు ,మెరుపులు,విప్పుకున్న సౌందర్యం అన్నీ అమ్మలో ఉన్నాయి. “ఆమె ముందు సముద్రం కూడా /చిన్న బుచ్చుకుంటుంది/  ఆమె ముందు ఆకాశం కూడా తలదించుకుంటుంది” అని అమ్మ ఔన్నత్యాన్ని స్థాపించింది. విద్యాశక్తిగా తల్లిని సంభావిచగలగటం సావిత్రిబాయి కే సాధ్యం. ఛత్రపతి తారాబాయి సావిత్రి ఎంతగానో అభిమానించే ఛత్రపతి శివాజీ కోడలు .రెండవ శివాజీ తల్లి. భర్త మరణానంతరం మైనర్ బాలుడి సంరక్షకురాలిగా 1700-1708 మధ్య కాలంలో మొఘలులను నిలవరించటంలో   ప్రధాన పాత్ర వహించింది. ఆమె రాజకీయ క్రియా సౌందర్య సంస్తుతి ‘మహా రాణి ఛత్రపతి తారాబాయి’ కవిత.

                                                    7

             శూద్ర అతిశూద్ర మానవుల దైన్యానికి ,స్త్రీల దౌర్భాగ్యానికి మూలమైన కుల వ్యవస్థను, పితృస్వామ్యాన్ని స్థిరీకరించిన మనుస్మృతి పై సావిత్రి కవిత్వంలో తీవ్రమైన విమర్శ కనబడుతుంది. ‘కుటిల మనువు చెప్పెను’ అనే కవిత ఇందుకు తగిన ఉదాహరణ.

 

“నాగలి పట్టేవారు, వ్యవసాయం చేసేవారు

 మూర్ఖులని కుటిల మనువు చెప్పెను

 

  వ్యవసాయం చేయవద్దని బ్రాహ్మణులను

  ఆజ్ఞాపిస్తుంది మనుధర్మ శాస్త్రం

  

  శూద్రుల పుట్టుక

  పూర్వజన్మ పాపాల ఫలం

  అనుభవిస్తారు ఈ జన్మలో శూద్రులు సమస్తం

  సమాజంలో వైషమ్యాల

  కుటిల ఆచారవ్యవహారాలు రచిస్తారు

  ధూర్తులకే చెల్లు ఈ అమానవీయ సిద్దాంతం” —  ఈ చిన్న కవిత ఉత్పత్తి వర్గాలను ,శ్రమజీవులు శూద్రులుగాను, శ్రమకు దూరమైన బ్రాహ్మణ వర్గాన్నిఅధికులుగానూ చెప్పిన మనువుకు  కుటిలత్వాన్ని ఇంటిపేరుగా చేసింది సావిత్రిబాయి. శూద్రుల దైన్య హైన్య జీవనానికి ,జీవితానికి పూర్వజన్మల పాప కర్మఫలమే కారణమని చెప్తూ  ఈ జన్మలో అనుభవిస్తున్న సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోకుండా వారి బుద్ధిని నియంత్రిస్తూ చేతులను కట్టేసిన మనుస్మృతి ఒక అమానవీయ సిద్ధాంతమని ,సామాజిక వైషమ్యాల కొనసాగింపు కు ఉపయోగపడదని నిర్ద్వంద్వం గా చెప్పింది ఈ కవితలో.

             “బైరాగీ భట బ్రాహ్మణులు /  శ్రమను త్యజించి బిచ్చమెత్తుకుంటూ తిరుగుతారు/ ఫలాన్ని ఆశించకుండ చాకిరి చేస్తే /స్వర్గంలో పుణ్యం లభిస్తుందని చెప్పే తత్వ శాస్త్రం /పెద్ద బూటకం” (శూద్రుల పరావలంబనం ) అన్న కవితా భాగం కూడా మనుస్మృతి న్యాయం లోని అన్యాయాన్ని తిరస్కరించేదే.ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి – శ్రమ చేయకుండానే   సామాజిక స్థాయివల్ల సర్వం పొందుతున్న వర్గాల ఆధిక్యతను హేళన చేస్తూ వాళ్లను బిచ్చమెత్తుకుంటున వాళ్లుగా తక్కువ చేసి చెప్పటం. రెండవది శ్రమ చేసేవాళ్లకు భౌతిక ఫలితం ఆశించక పోవటమే గొప్పవిలువగా చెప్పటంలోని బోలుతనాన్ని పారలౌకిక స్వర్గ సుఖాన్ని ఆశపెట్టటంలోని కుటిల నీతిని బయటపెట్టటం. శ్రమ దోపిడీ ,శ్రమ ఫలితాలకు పరాయీకరణ ఈ రెండూ పరస్పర సంబంధం ఉన్నవేనన్నఅవగాహన ,వీటిని వర్ణాశ్రమ ధర్మంగా స్థిరీకరించిన మనుస్మృతి పట్ల నిరసన ఆ రకంగా వ్యక్తమయ్యాయి ఈ పంక్తులలో. బ్రాహ్మణీయ మత తాత్వికత లోని బూటకాన్ని బయటపెట్టటం ,చాతుర్వర్ణ వ్యవస్థలోని విషపూరిత సంస్కృతిని ఎండగట్టడం  ‘సన్నద్ధం’ కవితలోనూ కనబడుతుంది .

        నిష్ఠుర సామాజిక వాస్తవికతలనే కాదు ,నిసర్గ సౌదర్య భరిత ప్రకృతి లోని మట్టిని ,చెట్టును పిట్టను పువ్వులను చూచి స్పందించే సున్నితత్వం కూడా సావిత్రిబాయి లో పుష్కలంగా ఉంది. ప్రకృతి-భూమి పాట ,సంపెంగ,మల్లెపువ్వులు,సీతాకోకచిలుకలు -పూ మొగ్గలు వంటి కవితలు అందువల్లనే రాయగలిగింది. దేశమంటే మనుషులు ,పీడిత దుఃఖిత మానవులు అని నమ్మి వాళ్ళ కోసం ఎంత తపించిందో ,ఉత్పత్తి వనరు అయిన భూమిని కూడా అంతగా ప్రేమించింది. ‘పొలము కళ్లము లాంటిది /మట్టితో మన అనుబంధం’ అని అనగలిగిన స్థాయి ఆమెది. భూమి -మనిషి శ్రమ – పంట ఈ మూడింటి మధ్య సంబంధాన్ని అలవోకగా చెప్పగలిగిన మట్టిమనిషి ,ప్రజల మనిషి సావిత్రిబాయి ఫూలే. ‘ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుంది’ అని గురజాడ   ప్రకటించ గలగటానికి నమ్మకం ఇచ్చినది సమీప గతం లోని చైతన్య స్ఫూర్తి దాతలైన సావిత్రిబాయి ఫూలే వంటి స్త్రీల జీవితం సాహిత్యమే అయివుంటాయని భావించవచ్చు.

*

       

             

   

  

        

       

 

        

        

 

    

       

     

         

        

         

కాత్యాయనీ విద్మహే

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఇది కేవలం ఒక ధర్మ శాస్త్రమే తప్ప శాసనాల సంహిత కాదు . శాసించే నియమావళీ కాదు. ఇది ఏ ఒక భౌగోళిక ప్రాంతంలో నివసిస్తున్న ఏ వర్గాన్నీ , సమూహాన్నీ శాసించేందుకు ఉద్దేశించిన న్యాయ సంహిత కాదు.

  ప్రధానంగా ఈ ధర్మ శాస్త్రం లో అన్నికాలాల్లో, అన్ని దేశాల్లో మానవుడి సాంఘిక జీవితానికి వర్తించే సూత్రాలు ఉన్నాయి. మనిషి యొక్క, సమాజం యొక్క జీవనం లో నిత్యము, శాశ్వతము అనదగ్గ అంశాలను నొక్కిచెప్పే బోధలు ఉన్నందువల్ల దీని ప్రాముఖ్యం విశ్వ వ్యాప్తమైనది.”

  మనువు స్త్రీల గురించి, శూద్రుల గురించి, కులవ్యవస్థ గురించి చెప్పాడనే మాటలన్నీ అసత్యాలు, అర్థసత్యాలు. హిందూ సమాజం మీద తీవ్రాక్షేపణ అనగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది మనుస్మృతి . ఈ మధ్య దీని మీద హిందూ వ్యతిరేక మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద దుమారం లేస్తున్నది. మనువాదం అనేది భయంకరమైన తిట్టుపదమైంది. మనుధర్మ శాస్త్రం పేరు చేబుతేనే హిందువుల్లో చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అన్ని వైపులనుంచి దాని మీద వస్తున్న అక్షేపణలకు , అభ్యంతరాలకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు. కాబట్టి మొదట దాని మీదే దృష్టి పెడదాం. మనుధర్మాన్ని ద్వేషించే, అసహ్యించుకునే వారితో వాదులాడటం నా ఉద్దేశం కాదు. ఇప్పటికే తిరుగులేని నిశ్చిత అభిప్రాయాన్నిఏర్పరుచుకున్న వారితో ఇక్కడ వాదించి , గెలవాలని నేను కోరుకోవటం లేదు.

  స్రీల గురించి మనుస్మృతి ఏమి చెప్పింది?

  యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
  యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః ( మనుస్మృతి 3 -56 )

  ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు దయ కలిగి ఉంటారు. స్త్రీలకు గౌరవం లేని చోట జరిగే దేవతా పూజాది క్రియలన్నీ వ్యర్థం – అంటే స్త్రీలను నెత్తిన పెట్టుకున్నట్టా ? కాళ్ళ కింద వేసి తొక్కినట్టా ?

  శోచంతి జామయో యత్ర వినశ్యత్యాసు తత్కులం
  న శోచంతి తు యత్రైతా వర్దతే తద్ది సర్వదా ( 3 – 57 )

  స్త్రీలు దుఃఖిస్తే వారి దుఃఖానికి కారణమైన వారి వంశమంతా నశించి పోతుంది . స్త్రీలు సంతోషంతో ఉంటే ఆ ఇల్లు , వారి వంశం సదా కళకళలాడుతూ వర్ధిల్లుతుంది – అన్నవాడు మహిళల మేలు కోరినట్టా ? కీడు కోరినట్టా?

  సంతుష్తో భార్యయా భర్తా భర్త్రా భార్యా తథైవ చ
  యస్మిన్నేవ కులే నిత్యం కల్యాణం తత్ర వై ధృవం ( 3 -60 )

  భర్త భార్యను, భార్య భర్తను సంతోష పెడుతూ ఉంటే ఆ ఇంట నిత్యకల్యాణము గా సంపద నిలుస్తుంది అని హితవు చెప్పటం అతివ ను ఆదరించడమా ? అణచి వేయడమా ?

  ప్రజనార్థం మహాభాగాః పూజార్హా గృహ దీప్తయః
  స్త్రియః శ్రియశ్చ గేహేషు న విశేషోస్తి కశ్చన ( 9-26 )

  సంతతి పొందటానికి కారణమైన స్త్రీలు మిక్కిలి గౌరవించదగినవారు . వారు ఇంటికి కాంతుల వంటి వారు. శ్రీ (సంపద) లేని ఇల్లు ఎలా శోభాయమానం గా ఉండదో స్త్రీ లేని ఇల్లు కూడా కాంతి హీనమే – అన్నవాడు నారీలోకం ఔన్నత్యాన్ని పెంచినట్టా? తుంచినట్టా ?

  స్త్రీ విశిష్టతను గుర్తించి , ఆమె డిగ్నిటీని పెంచి సమాజంలో సముచిత గౌరవ స్థానం కల్పించిన మొట్టమొదటి ధర్మవేత్త మనువు. ఆస్తి హక్కుల విషయంలో ” పుత్రేణ దుహితా సమా ” కొడుకు , కూతురు ఇద్దరూ సమానులే అని ప్రాచీన కాలం లోనే ఘంటా పథం గా చాటిన మహనీయుడు మనువు. అదీ ఎంత చక్కగా ?!

  యథైవాత్మా తథా పుత్రః పుత్రేణ దుహితా సమా
  తస్యామాత్మని తిష్థన్త్యాం కథ మన్యో ధనం హరేత్ ( 9- 130 )

  తానెంతో కొడుకంత . కొడుకెంతో కూతురంత . కొడుకులు లేకపోతె
  తండ్రి ధనం కూతురికి కాకపొతే ఇంకెవరికి వెళుతుంది ?అలాగే –

  మాతుస్తు యౌతకం యత్స్యాత్ కుమారీ భాగ ఏవ సః
  దౌహిత్ర ఏవచ హరేదపుత్ర స్యాఖిలం ధనం ( 9- 132 )

  జనన్యాం సంస్థితాయాం తు సమం సర్వే సహోదరాః
  భజేరన్మాతృకం రిక్థం భగిన్యస్చ సనాభయః ( 9- 192 )

  తల్లి చనిపోతే ఆమె స్త్రీ దానం ఆమె కూతుళ్ళకే వెళ్ళాలి . కొడుకులకు చెందకూడదు. తల్లి చనిపోయాక ఆమె పుత్రులు, పెళ్లి కాని కుమార్తెలు తల్లి ధనాన్ని సమానంగా పంచుకోవాలి . పెళ్లి అయిన కూతుళ్ళకు తండ్రి ధనం లాగే తల్లి ధనం లోనూ నాలుగవ పాలు పంచి ఇవ్వాలి .. అని చెప్పిన మనువు స్త్రీలకు శత్రువా ?

  అవిశేషేణ పుత్రాణామ్ దాయో భవతి ధర్మతః
  మిధునానాం విసర్గాదౌ మను స్వయంభువోబ్రవీత్ ( iii-1-4 )

  (పారంపర్యం గా వస్తున్న ఆస్తిలో కుమారులకు, కుమార్తెలకు సమాన హక్కు ఉండాలని సృష్టి ఆరంభంలో స్వాయంభువ మనువు చెప్పాడు. )

  మనువు గురించి పై వ్యాసంలో చెప్పిన సమాచారం తప్పని
  తెలుసుకోవాలని ఆసక్తి వున్నవారికి ఈ లంకెలో పిడియఫ్ ఫైలులో కొంత సమాచారం యిస్తున్నాను.

  http://www.mediafire.com/file/cwnhi8m4kv8aq98/%25E0%25B0%25AE%25E0%25B0%25A8%25E0%25B1%2581%25E0%25B0%25A7%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25AE%25E0%25B0%25B6%25E0%25B0%25BE%25E0%25B0%25B8%25E0%25B1%258D%25E0%25B0%25A4%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%2582.pdf/file

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు