తేడా

అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన కధల పోటీలో రెండో బహుమతి కథ

హాయ్ ..స్వాతీ…hearty congratulations …ఒలంపిక్స్ కి సెలెక్ట్ అయ్యావట  కదా….’

‘ఆ…థాంక్ యు సాయి……   ఎంతో కష్ట పడ్డా …. ఫలితం వచ్చింది…కాని ఇంకా ముందు ఉంది అసలైన కాలమంతా…. దానికే ఈ కసరత్తు …..అన్నట్లు బిజీ లో ఉన్నాను. తీరిగ్గా మళ్ళీ చేస్తా…. ..శివను కూడా అడిగినట్లు చెప్పు..బై ’

‘ఓ కే….బెస్ట్ అఫ్ లక్ …శివ తరఫున కూడా…ఒకే ఉంటాను..మళ్ళీ పతకం సాధించాక మాట్లాడతాను …బై’ సాయి పెట్టేసాడు.

స్వాతి,సాయి,శివ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. చదువులయిపోయి సాయి బాంక్ లో జాబ్ చేస్తూ, శివ సైనికునిగా చేస్తూ, స్వాతి క్రీడల్లో రాణిస్తు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నా స్నేహ బంధం మాత్రం కొనసాగుతూనే ఉంది.

శివ కు చేయక చాలా రోజులయ్యేసరికి శివకు కూడా ఫోన్ చేసాడు సాయి.

‘హాయ్ రా శివా… ఎక్కడున్నావ్ …ఎలా ఉన్నావ్…’

‘హాయ్ రా.. బార్డర్ లో డ్యూటీ వేసారు. అక్రమంగా బార్డర్ దగ్గర జొరబడి,  నిద్రపోయే జవాన్లను వెన్నుపోటు పొడిచిన దగ్గరనుండి ఇక్కడ చాలా మార్పులు జరిగాయి. ఇటీవల మళ్ళీ చొరబాట్లకు తెగబడిన వారికి చాలా ధీటైన జవాబిచ్చాం. ఇవన్నీ ఎప్పటికీ ఉండేవే గాని నువ్వు, మా చెల్లి ,మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ?’

‘ఆమెకేం బానే ఉంది. అన్నట్లు నీకు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ …. బుల్లి శివ రాబోతున్నాడట గా…’

‘థాంక్యు   రా…. అయినా నీకెలా తెలిసింది…ఇంటి కెళ్ళావా….’

‘ఆ….స్వాతి ఫోన్ లో చెబితే ,  మొన్న మీ ఇంటి కెళ్లాము…. ఈ సారి నువ్వు సెలవులకోచ్చినపుడు,  మిమ్మల్నిద్దరినీ కలిసి రమ్మని మా చెల్లి శిరీష తో చెప్పి వచ్చాం. శిరీష ప్రెగ్నెంట్ కదాని స్వీట్ తీసుకుని వెళ్లాం. మాస్టర్ శివ వచ్చాక గ్రాండ్ పార్టీ అన్నమాట. శిరీష ఎంత మంచిదో తెల్సా…. …‘ పెళ్ళయ్యాక  ఆరు నెలలైనా కలిసి లేకపోతిరి. అందుకే శివ ని సైన్యం లో చేరొద్దు అన్నా వినలేదమ్మా…’అని నేనంటే  శిరీష ఏమందో తెలుసా…..’అన్నయ్యా అలా దేశానికి సేవ చేసే భాగ్యం ఎంత మందికి వస్తుంది.   ఆ అవకాశం వచ్చినందుకు ఆయన ధన్యుడు. ఆయనను ప్రోత్సహిస్తే మనం కూడా దేశానికి సేవ చేసిన వాళ్ళమవుతాం.’ అందిరా. పైగా కొత్తగా పెళ్ళయ్యాక ఎవరైనా పండగకి తల్లిగారింటికి వెళతారు. శిరీషను వాళ్ళ అమ్మా వాళ్ళు తీసుకేలతామని వచ్చినా,’నేను వెళితే ఇక్కడ వయసు పైబడిన అత్తా మామలు ఒంటరివాల్లయితారు’ అని వెళ్ళలేదురా… నిజంగా అంత మంచి భార్యను పొందిన నువ్వు అదృష్టవంతుడివిరా… నాకెంత సంతోషంగా అనిపించిందంటే నీ స్వభావానికి సరిగా సరిపోయే అమ్మాయి అనిపించింది…’

‘నిజమేరా…నేను అదృష్టవంతుడినే… అమ్మా వాళ్ళ గురించి ఇంతకు ముందు బెంగ గా అనిపించేది. ఇప్పుడు తను నా లాగే చాలా ప్రేమగా చూస్తుంది… నాకు ఇక వాళ్ళ గురించి బెంగ లేదు…. తన డెలివరీ వరకు లీవు తీసుకుని వస్తారా…. సరే గాని ఇంకా విశేషాలేంటో  చెప్పు…’

‘ఆ…మన స్వాతి ఒలంపిక్స్ కి ఎన్నికయింది.ఆ విషయం నీతో పంచుకుందామని చేసాను. తను కూడా నిన్ను గుర్తు చేసినట్లు చెప్పమంది…బిజీగా ఉంది…తర్వాత మళ్ళీ చేస్తానంది…. నిజంగా మీరు దేశం గర్వ పడే ముద్దు బిడ్డ లురా….ఏమిటీ..సిగ్నల్స్ మధ్యలో కట్ అవుతున్నాయి…’

‘అవునురా…ఇక్కడ ఒక్కోసారి సిగ్నల్స్ ఉండవు. విపరీతమైన చలి…సరేలే …మళ్ళీ చేస్తాలేరా…. స్వాతికి విషెస్ మెస్సేజ్ చేస్తాను…. ఇక ఉంటాను  రా ’

******************

‘హాయ్ రా శిరీ…హాయ్ బంగారం….ఎలా ఉన్నావ్…’భా ర్యకు ఫోన్  చేసాడు శివ.

‘బానే ఉన్నానండీ…మీరెలా ఉన్నారు… పేపర్ లో ‘బార్డర్ లో ఇంకా కొనసాగుతున్న అల్లర్లు’అని చదువుతుంటే గుండె భయంగా కొట్టుకుంటుంది. మీరు బాగా ఉన్నారు కదా…’

‘నాకేం …భేషుగ్గా ఉన్నాను. ఇక్కడ ముష్కరులు తెగబడి, కావాలని కవ్విస్తున్నారు. అయినా మనమేం తక్కువ తినలేదు… ఒక్కొక్కరు ఒక్కో ఆటంబాంబు…. సరే గాని సాయి ఫోన్ చేసాడు. పండక్కి కూడా వెళ్ళకుండా అత్తామామల కోసం ఉండి  పోయావని మెచ్చుకుంటుంటే,  ఎంత గర్వంగా అనిపించిందో తెలుసా… నేనెంత అదృష్టవంతుడినో….’

‘same to you…ditto…’ చిలిపిగా అంది.

‘ఇంతకీ మన మాస్టర్ శివ ఏమంటున్నాడు…’

‘చిన్న కాళ్ళతో తంతూ ఎప్పుడెప్పుడు బయట పడాలని ఆత్రపడుతున్నాడు…నాన్న ఉంటేనే గాని బయటకు రాను అని మారాం చేస్తున్నాడు. అయినా బుల్లి శివనే రావాలా.. చిన్నారి శిరీష రాకూడదా…’

‘అని నేనన్నానా… ఎవరైనా ఇష్టమే…కాని ‘మాస్టర్ శివ’ అయితే నా  వారసునిగా మళ్ళీ సైన్యం లో చేర్పించోచ్చు… నేనయితే ఎదో సైనికుడిలా ఉన్నా కాని వాడు మమ్మలనందరినీ శాసించే కమాండర్ కావాలి… అమ్మా నాన్న వాళ్ళు బావున్నారా…’ అంటూ కాస్సేపు వాళ్ళతో కూడా మాట్లాడి పెట్టేసాడు.

*****************

‘సరిహద్దుల్లో తెగబడిన ముష్కరులు…ఆరుగురు ముష్కరుల హతం… వీర మరణం పొందిన ముగ్గురు జవాన్లు…’ టీ వీ న్యూస్ లో వచ్చే వార్తలు వింటున్నారు హాల్లో కూర్చున్న శివ అమ్మా, నాన్నలు.

లోపల ఉన్న శిరీష సెల్ మోగటంతో …తీసుకోవడానికి వస్తూ వార్త విని ఒక్క ఉదుటున హాల్లో కొచ్చింది, మనస్సులోనే శివ క్షేమంగా ఉండాలని ముక్కోటి దేవతలకు, శత సహస్ర కోటి దండాలు పెట్టుకుంటూ. కాని ఆమె వినతి చేరేలోపలే అనర్ధం జరిగిపోయిందని నిరూపిస్తూ ‘రామా పురం గ్రామానికి చెందినా శ్రీరంగం శివ కూడా ఏంతో  వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు ..’ ఇంకా టీవీ లో వార్తలు వస్తున్నాయి… చెవి దగ్గర ఆనించుకున్న సెల్ లో నుండి కూడా అదే విషయం దృవీకరించారు… శివ అమ్మానాన్నలు వార్త వింటూనే గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు. శిరీష ఆమాట వింటూనే స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయింది.

*****************

‘ఒలంపిక్స్ లో విజయకేతనం ఎగరేసిన స్వాతికి ప్రధానితో పాటు, రాష్ట్ర ప్రభుత్వాల శుభాకాం క్షలు భారీ నజరానాలు..అంతే  కాక దేశ కీర్తిని ఇనుమడించిన స్వాతికి  క్రీడాకారుల సంఘం, క్రీడాకారులు, పెద్ద పెద్ద కంపెనీలు భారీగా ప్రకటిస్తున్న బహుమతులు….’

‘వీరమరణం పొందిన సైనికుడు శివ’ వార్తలు చదువుతున్న సాయి కన్నీరుమున్నీరయ్యాడు.

ఆ రోజు శివ చనిపోయిన పదకొండవ రోజు. కర్మ కాండకు హాజరయ్యాడు సాయి. శిరీష జీవచ్చవంలా ఉంది. ఆమెకు ఆరోజు స్పృహ తప్పాక హాస్పిటల్ లో డెలివరీ ఐ బాబు పుట్టాడు. అందరూ ఆమె భర్తే మళ్ళీ ఆమె కడుపులో పుట్టాడన్నారు. బాలింతయినా ఆమె శోకానికి అంతం లేదు. చనిపోయిన రోజు చూడడానికి రాలేక పోయిన మంత్రి ఈ రోజు వచ్చాడు. ఆమె భర్తకు సంబంధించిన పత్రాలు అన్నీ  తీసుకుని వచ్చి ఇక్కడ అందరి సమక్షం లో మీటింగ్ లా పెట్టి అందజేయడానికి ప్రభుత్వం తరఫున వచ్చాడు. అంతా  ఆ వీర సైనికుని పటం  ముందు సమావేశమయ్యారు.

‘దేశం కోసం ప్రాణాలర్పించే అవకాశం అందరికీ రాదు. అలా ప్రాణ త్యాగం చేసిన ధన్య జీవి ‘శివ’ . ఆలోటు పూడ్చలేనిది. మళ్ళీ ఆయన కోరిక మేరకు పుట్టిన బాబుని కూడా సైనికునే చేస్తాననడం ఆ వీర సైనికుని భార్య శిరీష దేశ భక్తికి నిదర్శనం. ఆయన్ను కన్న తల్లితండ్రులకు, ఆమెకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంకా రావాల్సిన మరి కొన్ని బెనిఫిట్లు త్వరలో అందజేస్తాము…ధన్యవాదాలు.’ అమరజీవి శివ గురించి కొంచెం సేపు చెప్పి, వారిని బాధ పడవద్దంటూ ఓదార్చి , చివరగా ఈ మాటలతో ఉపన్యాసం ముగించాడు  మంత్రి .

‘..అమ్మా…మీరేమయినా మాట్లాడతారా…’ మంత్రి స్పీచ్ ముగించగానే శిరీషను అడిగారు అక్కడున్న వారు .

శిరీష మౌనంగా చేతులు జోడించింది మాట్లాడ లేనన్నట్లు.

‘ఇంకెవరైనా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకోగోరుతున్నాము ‘ అనగానే  సాయి లేచాడు.

‘మంత్రివర్యా… నేను రెండు నిమిషాలు మాట్లాడతాను. నేను శివ ఫ్రెండ్ ని. మంత్రిగారికి , ఇక్కడున్న అందరికీ నమస్కారాలు.. ఈ సందర్భంగా ప్రభుత్వానికి నాదొక వినతి. ఒలంపిక్స్ లో పతకాలు సాధించి దేశభక్తిని నిరూపించిన వారికి, ప్రభుత్వంతో పోటీపడి నజరానాలు ప్రకటించిన అందరికీ ప్రణామాలు. ఇక్కడ మనమంతా ఇంత  నిర్భయంగా, సంతోషంగా , ప్రశాంతంగా ఉన్నామంటే అందుకు కారణం దేశ రక్షణకై శారీరక, మానసిక శ్రమలను లెక్క చేయక కుటుంబాలకు దూరంగా ఉండి  కర్తవ్య నిర్వహణ  చేస్తున్న సైనికులే… ఎంత చెప్పినా వారి గురించి తక్కువే…  మరణం కి మించిన విషాదం లేదు. కీలక ఆధారమైన సైనికుడు మరణిస్తే ఆ కుటుంబం ఆర్ధికంగా, మానసికంగా నరకం అనుభవిస్తుంది. పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉన్న గుర్తింపు,  ప్రాణ త్యాగం చేసిన సైనికుని లేకపోవడం బాధాకరం. ఇద్దరూ దేశం కోసం శ్ర మించినవారే. కానీ విజేతలకు ఎన్నో బహుమతులు ప్రకటించిన ప్రభుత్వం వీర మరణం పొందిన సైనికునికి ఎందుకు ప్రకటించడం లేదు. మిగతా పెద్ద పెద్ద కంపనీలు దేశ భక్తీ ఉంటె, వీల్లకేందుకు ప్రకటించడం లేదు… పేపర్లో కూడా వాళ్ళ కిచ్చిన ప్రాముఖ్యత వీర సైనికునికి ఎందుకు ఇ వ్వడం లేదు. దయచేసి మనస్సున్న మహానీయులంతా పునరాలోచించ మని వినతి…’ అక్కడున్న వారందరి మనస్సులు కలిచివేసినట్లు కళ్ళ నుండి నీళ్ళు కారుతుంటే అంతా  చప్పట్లతో హర్షాన్ని వెలిబుచ్చారు.

అవాక్కైన మంత్రి …సాలోచనగా తల పంకించాడు.

  ***

నామని సుజనాదేవి

నామని సుజనాదేవి

నామని సుజనాదేవి భారతీయ జీవితబీమా సంస్థ లో పరిపాలనాధికారి. 185 కధలు,175 కవితలు,20 ఆర్టికల్స్ ప్రచురించబడ్డాయి.

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచికథ వీర జవాన్లను పట్టించుకోని ప్రభుత్వానికి కంపెనీలకు .మరణించిన వీర జవాన్ల ఫేమిలీకి పిల్లల చదువులు/ ఉదోయాగాలు కల్పించిన కంపెనీలకు ప్రభుత్వం tax benefit ఇవ్వడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకోవచ్చనే ఆలోచన నాకు వస్తుంది.క్రీడా కారులను ఆకాశానికెత్తేసే కంపనీలు ప్రభుత్వాలు వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలను ఆవిందంగా ఆదుకోవచ్చుకదా అని .అభినందనలు సుజన.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు