తెలంగాణ విరహపు నేల మీద ‘వాన కురిసింది’

1980-90లలో ఎన్నో కథలు రాసి వాటికి ఎన్నో బహుమతులు పొందిన అవార్డుల రచయిత గంగుల నర్సింహారెడ్డి. వీరు ఇప్పటికీ సుమారు 70-80 కథలు రాసినా అవన్నీ ఒక కథల సంపుటిగా రాకపోవడం తీరని లోటు. వీరి కథల్లో మానవ సంబంధాలతో పాటు తెలంగాణ మట్టి మీద ఒక మమకారం కనిపిస్తుంది. కథా వస్తువుతో పాటు శిల్పం పైన, వాక్యం పైన కూడా ప్రత్యేక దృష్టి ఉన్న రచయిత. ‘వాన కురిసింది’ కథ మొదట 1993లో ఆంధ్రప్రభ వీక్లీలో ప్రచురింపబడింది.

వాన కురిసింది కథ వాన కురిసింది చదవండి.

మహబూబ్ నగర్ జిల్లాలో అదొక మారు మూల గ్రామం. ఆ ఊరులో అనంతరెడ్డి ఒక సన్నకారు రైతు. తనకున్న పది ఎకరాల్లో పత్తి చేను వేశాడు. పత్తి ఒక మోస్తరుగా ఉందని సంబరపడేటప్పటికి వర్షాలు పడటం తగ్గి పోయింది. అనంత రెడ్డి పరిస్థితి ఆగమ్య ఘోచరంగా మారింది. ఏ ప్రాజెక్టులు లేని మహబూబ్ నగర్ జిల్లాలో “వర్షాలు   బాగా పడి చెరువులు నిండితే కానీ నాట్లు పడవు. రేగడి, మిట్ట పొలాల్లో ఒకప్పుడు మిర్చి, ఆముదం, జొన్నలు, వేసుకొని ఏదో కాలాన్ని నెట్టుకొచ్చేవారు. నాలుగైదు సంవత్సరాల నుండి పత్తిని ప్రారంభించి వేలకు వేల రూపాయలు కళ్ళజూసేసరికి ఈ సంవత్సరం పిచ్చిగా ప్రతి ఒక్కరూ పత్తి రైతులయ్యారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల వారిని భయ కంపితులను చేసిన తెల్ల దోమ ఇప్పుడు ఈ వైపుకు తన దారిని మరల్చుకుంది. దానికి తోడు వర్షాభావ పరిస్థితి. ఒక్కో రోజు గడుస్తున్నా కొద్ది అనంతరెడ్డి ఒక్కో సంవత్సరం మీద పడ్డట్టుగా కుంగి పోతున్నాడు. పత్తి చేను దగ్గరికి వెళ్తే ఏడుపు వస్తోంది. తమలపాకుల్లా నవనవలాడిన ఆకులు వాడి మడతలు పడి ఉన్నాయి. రోజు రోజుకూ చెట్టు కింద రాలి పడిపోతున్న గూడల (మొగ్గలు) సంఖ్య పెరిగి పోయి చెట్టు బోసి పోతూ ఉంది.”  అందుకే ‘వానొస్తే బాగుండు. గొంగడి తడుపు వాన వచ్చినా చాన బాగుండు’, ‘వానల్లు కురవాలి వాన దేవుడా.. పత్తి చేలు పండాలి వాన దేవుడా’ అని అతని మనసు శత కోటి గొంతులతో వర్షానికై ప్రార్థిస్తోంది. వైశాఖ మాసంలోనే కూతురి పెళ్లి చేశాడు అనంతరెడ్డి. కట్న కానుకలు, పెళ్లి ఖర్చులకు లక్షకు పైనే అయింది ఖర్చు. అందులో యాభై వేలు అప్పుగా తెచ్చాడు. అప్పు తీరాలంటే పత్తి చేనైతేనే లాభం అనుకోని ఏకంగా పదెకరాలు వేశాడు. పెట్టుబడికై మళ్ళీ అప్పే. ఇప్పటికే మందులకు, ఎరువు సంచులకు ఇరవై వేల దాకా అయింది. ఇంకా పది వేలైనా ఖర్చు పెట్టాలి. ఏకరాకు అయిదారు క్వింటాళ్ల పత్తి వచ్చినా పెట్టుబడి పోను పెళ్ళికి చేసిన అప్పులు సగం తీరిపోతాయి.” అని వానొస్తే బాగుండు.. వానొస్తే బాగుండు అనుకున్నాడు.

కూతురు భార్గవికి పెళ్లైతే జరిపించాడు కానీ ముహూర్తం కుదరక శుభ’కార్యం’ జరగలేదు. అందుకని  ఆమె పుట్టింట్లోనే  ఉండిపోయింది. మంచి రోజూ చూసి ఆ కార్యమేదో జరిపించి ఆమెను అత్తవారింటికి పంపించాలని అనంతరెడ్డి అతని భార్య అనుకుంటుంటే విన్న భార్గవికి మనసంతా గాల్లో తేలినట్టు అవుతుంది. మరో వైపు తండ్రి తన పెళ్ళికి చేసిన అప్పులు గుర్తుకు వస్తుంటాయి. ఆమె కూడా ‘వాన రావాలి దేవుడా.. వాన రావాలి’ అనుకుంటుంది. కానీ వర్షపు జాడే లేదు. ఒక్కొక్క రోజే గడుస్తున్నా కొద్దీ భార్గవి ఉత్సాహం రెట్టింపు అవుతుంది. తీరా శోభనం జరగాల్సిన రోజు రానే వచ్చింది. అనంతరెడ్డి భార్య భార్గవిని అలంకరించడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అల్లుడు రాజశేఖర్ ఒక రోజు ముందే వచ్చాడు. వాకిట్లో మామా అల్లుళ్లు మంచం మీద కూర్చొని కరువు గురించి, పంటల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఆకాశం నుండి ఒక చుక్క రాలి అనంత రెడ్డి చేయి మీద పడింది. మెల్లమెల్లగా వాన ఎక్కువవుతుంది. ఇల్లంతా అక్కడక్కడ ఉరుస్తుంది. గిన్నెలు పెడుతున్నారు. ‘కార్యం’ జరగాల్సిన గదిలో కూడా అక్కడక్కడ ఉరుస్తుంది. అయ్యో! ఎట్లా ఈ రోజు ముహూర్తం దాటి పోతే మళ్లీ రెండు నెలల దాకా మంచి ముహూర్తం లేదు. “ఛీ! పాడు వాన ఇన్ని రోజులాగీ ఈ రోజే రావాలా?” అనుకున్నాడు అనంతరెడ్డి లోలోపల. అనంతరెడ్డి మనసును గ్రహించిందేమో వాన ఒక్క సారి ఆగిపోయింది. “ఈ వర్షం సరిపోతుందా నాన్నా మన పత్తి చేనుకు?” అంది భార్గవి.

“ఎంత భూమి తడిసిందమ్మా. రెండు ఇంచులు కూడా తడిసి ఉండదు. కాని పోతే పోనీ ఈ పాడు వాన విసుక్కున్నాడు” అనంత రెడ్డి.

“అట్లా అంటారేంటి మామయ్యా? కార్యం ఆగిపోతున్నదని బాధ పడుతున్నారా? ఇంత సంతోషం ముందు అది ఎంత మాత్రం బాధ కానే కాదు.”  అన్నాడు రాజశేఖర్.

“అవున్నాన్నా! మా కొరకు బాధ పడకండి. ఈ వర్షం ఇంకా బాగా పడనీ, మన పత్తి చేను విరగ కాయనీ” అంది భార్గవి.

మూడు నెలల విరహం తరువాత కార్యం మళ్ళీ రెండు నెలలకు వాయిదా పడుతున్నా వర్షానికై నిండు గుండెతో స్వాగతం పలుకుతున్న ఆ పడుచు జంట ఆహ్వానానికి స్పందించినట్లుగా కాబోలు మళ్ళీ వర్షం కురవసాగింది. ఈ సారి మరీ ఉధృతంగా.” అలా కరువు తీరా వర్షం తెల్లవారేదాకా కురుస్తూనే ఉంది.

చిన్న చినుకుతో మొదలై పెద్ద జడి వాన లాగా మన గుండెల్ని చుట్టుకుంటుంది ఈ కథ. కథ నిండా వర్షానికి ముఖం వాచి పోయి ఉన్న తెలంగాణ నేల కరువు గోస పర్చుకొని ఉంది. ఎలాంటి సాగు నీటి వసతులు లేక కేవలం మేఘాల దయా వర్షం  మీదనే ఆధార పడ్డ రైతుల ఆవేదన కనిపిస్తుంది. ఒకప్పుడు ఆహార పంటలు మాత్రమే వేసి కుటుంబాన్ని సాదుకునే రైతులు ఏ వ్యామోహంలోనో పడిపోయి మెల్లగా వ్యాపార పంటలు వేయడం మొదలు పెట్టడంతో వాళ్ళ బతుకులు ఎలా ఛిన్నాభిన్నమైనాయో ఈ కథ కళ్ళకు కడుతుంది. ఎంత పంట పండించినా మళ్లీ పంట వేసే సమయానికి రైతు చేతిలో పైసా లేక పోవడం ఎంత దయనీయం? ఈ పరిస్థితి రావడానికి ఎవరు కారణమో ఆలోచించమంటుందీ కథ.

శాస్త్రీయత లేని ఎరువుల వాడకం, గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వాల వైఖరి, వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తూ కనీసం ఒక్క ప్రాజెక్ట్ కూడా నిర్మించలేని ఏలికల స్వార్థపూరిత మనస్తత్వాన్ని ఎండగడుతుందీ కథ. (ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రంలో పలు ప్రాజెక్టులు రావడం గమనార్హం) అనంతరెడ్డి, భార్య సుశీల, తల్లి పార్వతమ్మ, కూతురు భార్గవి, అల్లుడు రాజశేఖర్, గొల్ల రాములు, కొడుకులు భాస్కర్, మరో పిల్లాడు.. ఇలా ఈ కథలో కేవలం ఎనిమిది పాత్రలే కానీ కథను ఏ మాత్రం బిగువు తగ్గకుండా పాఠకుడి మనసుకు చేరవేయడంలో ఆయా పాత్రలు సఫలీకృతం అయ్యాయి. రాజశేఖర్ పాత్ర చాలా చిన్న పాత్ర కానీ వ్యవసాయం మీద ప్రేమ ఉన్న పాత్ర.  తెలంగాణ పిల్లలు ఏ పేదరికాన్ని వారసత్వంగా అందుకొని పెరుగుతారో కథకుడు చెప్పకనే చెప్తాడు. శిల్పపరంగా కూడా ఈ కథ చాలా మంచి కథ. సగటు పాఠకుడిని ఆకట్టు కోవడానికి కథకుడు రైతు కూతురు పెళ్లిని కూడా జత చేసి ఒక ఉత్కంఠను, ఆసక్తిని రగిలించాడు. అనంత రెడ్డి కుటుంబమంతా తెలంగాణ రైతు కుటుంబానికి ప్రతినిధిలా కనిపిస్తుంది. అనంతరెడ్డి పాత్రను తీర్చి దిద్దడంలోనే కథకుడి విజయం దాగుంది. కూతురు ఎప్పటికీ తండ్రి కూతురే అనడానికి భార్గవి పాత్ర ఒక ప్రతీక. కథ నిండా ఒక వైపు భార్గవి తన దాంపత్య జీవనంపై పడుతున్న ఉద్వేగం, మరో వైపు ఆమె తండ్రి దైన్య స్థితి ఇవి రెండూ జమిలీగా సాగిపోతూ మనల్ని కదిలిస్తాయి. మొత్తం మీద అనంత రెడ్డి ఎండిన దేహం మీద, బీటలు వారిన పంట చేల పైనా, భార్గవి భవిష్యత్ పైనా, తెలంగాణ రైతు జీవితాల మీదా ఒక అమృతం లాంటి ‘వాన కురిసింది’.

*

 

 

శ్రీధర్ వెల్దండి

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • శ్రీ శ్రీధర్ గారికి,
  నా కథ “వాన కురిసింది” పై మీ విశ్లేషణ చాలా చాలా బాగుంది. నేనేనా ఈ కథను రాసింది అని అబ్బుర పడేలా రాశారు. మీ విశ్లేషణకు పెట్టిన title ఎంతో హృద్యంగా ఉంది. దాదాపు 26 సంవత్సరాల క్రితం “ఆంధ్రప్రభ” కథల పోటీలో ప్రథమ బహుమతి పొందినదీ కథ. ఆనాడు నేను పొందిన ఆనందం కన్నా ఈరోజు పొందిన ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువ. అందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
  ఇక్కడ మరో గొప్ప వ్యక్తికి కూడా నేను తప్పక కృతజ్ఞతలు తెలిపాలి. వారెవరో కాదు, గొప్ప రచయిత, సాహిత్య పిపాసి శ్రీ గొరుసు జగదీశ్వర రెడ్డి గారు. ఈ కథ కానీ నా దగ్గర లేదంటే, వారే శ్రమ తీసుకుని సంపాదించి నాకు పంపించారు. ఈ కథ శ్రీ ఖదీర్ బాబు గారు సంకలనం చేసిన “ఉత్తమ తెలుగు వాన కథలు” పుస్తకంలో స్థానం సంపాదించుకుంది. అందుకు శ్రీ గొరుసు గారికి సదా కృతజ్ఞుడిని. అలాగే శ్రీ ఖదీర్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
  ఇప్పుడే ఒక మిత్రుని నుండి ఫోన్. ” నీ కథ కన్నా శ్రీ శ్రీధర్ గారి విశ్లేషణే చాలా గొప్పగా ఉంది” అని.
  ఇంకా నేనేం మాట్లాడగలను?!!!!!!!!!
  గంగుల నరసింహారెడ్డి.

 • ధన్యవాదాలు నరసింహారెడ్డి గారు
  ఇందులో నేను చేసింది ఏమీ లేదండి. విత్తులో సత్తా ఉన్నప్పుడు గాలీ, మట్టి, నీరు తోడయితే సహజ సిద్ధంగానే అంకురమై, ఆనక మహావృక్షమవుతుంది. ‘వాన కురిసింది’ కథలోని ఇతివృత్తం కూడా నాణ్యమైన విత్తులాంటిదే. ఆ సంగతి తెలిసే ఈ కథకి ప్రథమ బహుమతినిచ్చి మిమ్మల్ని సత్కరించారు వాకాటి పాండురంగరావుగారు. ఇక మీ కథని విశ్లేషించిన శ్రీధర్‌గారి గురించి ఏం చెప్పను – కథా బంగారాన్ని పుటం పెట్టి మరింత వన్నె తేవడంలో చేయితిరిగిన కంసాలి ఆయన.
  అన్నట్టు ఈ కథ చదివే నాటికి (1993) నేను ఒక్క కథ కూడా రాయలేదు. నన్ను ‘గొప్ప రచయిత’గా మీరు సంబోధించడం సముచితం కాదు. ఆ మాట అనడం లో మీ గొప్ప మనసు తెలిసినా, వినడంలో మరుగుజ్జుతనం ఆవహిస్తోంది నన్ను. మీవంటివారి కథలు చదివి నేను కొంత కొంత నేర్చుకున్నాను. అంతే!
  మరోసారి మీకూ, శ్రీధర్‌గార్కి కృతజ్ఞతలు చెబుతూ …

 • నిజమైన గొప్పవారెప్పుడూ వినమృలే. అది మీ విషయంలో నూటికి నూరు పాళ్ళు నిజం ‌. మీ ప్రతిస్పందన లోని సాహిత్య భావానికీ, సహృదయానికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

 • అద్భుతమైన భావన మరొక సారి చుట్టుముట్టింది.
  మంచి కథనందించిన అందరికీ అభినందనలు.

  • శ్రీ KRKR గారూ,
   చిన్నదైనా , మీ వ్యాఖ్య నన్ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
   ధన్యవాదాలండీ – నేను మీ అభిమానిని.
   —- గంగుల

 • శ్రీ KRKR గారూ,
  చిన్నదైనా మీ అభినందన వ్యాఖ్య నన్ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
  నేను మీ అభిమానిని.
  ధన్యవాదాలండీ.
  — గంగుల

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు