తెరిచిన కిటికీ

అప్పటి వరకూ అల్లకల్లోలంగా ఉన్న మనసు కాస్తా ఇంటికి చేరుకునే లోపల రెట్టింపయ్యింది. అదో రకమైన స్తబ్దత ఆవరించింది.

గేటు తీసి ఇంట్లోకడుగు పెట్టేసరికి నా కొడుకు సిద్ధాంత్ ఎదురు వచ్చాడు.

‘గుడ్ మార్నింగ్ నాన్నా!’

‘మార్నింగ్ రా… బ్రేక్ ఫాస్ట్ అయ్యిందా?’

‘పాలు తాగాను నాన్నా..’ నసుగుతూ దిక్కులు చూసుకుంటూ బదులిచ్చాడు.

నా ముఖ కవళికలు మారేసరికి చెప్పాడు, ‘కాలేజ్ వ్యాన్ టైమయ్యింది నాన్నా… కాలేజ్లో తినేస్తాలే.’

‘అమ్మకి ఫోన్ చేసావా?’

‘చేసాను.’

ఇంటర్ సెకండియర్ చదూతున్నాడు…సెమీ రెసిడెన్షియల్ కాలేజ్. రోజూ ఇంతే…నేను వాకింగ్ ముగించుకుని వచ్చేటప్పటికి వాడి కాలేజ్ వ్యాన్ వచ్చే టైమవుతుంది.

వాడు గేటు వేసి బయటికి కదులుతుండగా అడిగాను, ‘రేపే కదా ఎంసెట్ ఎగ్జామ్…ఎస్.పి. కాలేజ్లో సెంటర్ అన్నావ్ కదూ?’

తలూపాడు.

‘రేపు నేను డ్రాప్ చేస్తాను సెంటర్ దగ్గర,’ చెప్పాను.

‘వద్దులే నాన్నా…నేనాటోలో వెళ్తాను.’

‘అదేంట్రా …చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వదిలి పెట్టడానికి వస్తారు కదా?’

‘ఏం పర్లేదు నాన్నా! ఐ కెన్ మానేజ్…ఐ యాం యువర్ సన్ అండ్ యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ ఫాదర్.’

వాడెప్పుడూ అంతే ముందరి కాళ్ళకి బంధమేసేస్తాడు. అందరూ ఇంజనీరింగ్ దృష్టిలో పెట్టుకుని ఎం.పి.సి. లో చేరుతూ ఉంటే…వీడేమో పట్టుబట్టి బై.పి.సి. లో చేరాడు. నేను వ్యతిరేకించలేదు.

ఎప్పుడూ సీరియస్ గా చదివింది లేదు గానీ ఫస్ట్ ఇంటర్లో స్కోర్ బానే వచ్చింది.

‘నీ ప్రిపరేషన్ ఎలా వుంది?’

‘గుడ్ నాన్నా! బైపిసి లో చేరడానికి పర్పస్ ఫుల్ ఫిల్ అవుతుందన్న నమ్మకం ఉంది…వ్యాన్ వచ్చేసింది…వస్తాను నాన్నా…బై!’

‘సిద్ధూ…ఒక్క నిమిషం.’

వాడు ఆగాడు. వెనక్కి తిరిగి గేటు తీసి నా దగ్గరకు వచ్చాడు. వాడ్ని దగ్గరికి తీసుకుని గట్టిగా గుండెలకి హత్తుకుని వదిలేసాను.

ఎందుకో నాకీ చర్య అత్యంత ఇష్టమైనది. అది వాడికి కూడా తెలుసు.

గేటు మూస్తూ ‘థాంక్స్ నాన్నా…బై.’ వ్యానెక్కి వెళ్ళిపోయాడు.

ఇంట్లోకి అడుగుపెట్టి సోఫాలో కూలబడ్డాను పేపర్లు ముందేసుకుని.

లక్ష్మమ్మ టీ తీసుకొచ్చి ఇచ్చింది.

నా భార్య మహబూబ్ నగర్ వెళ్ళింది. తనకిది మామూలే. సోషల్ సర్వీసెస్ లో పిజి చేసింది. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బాల్య వివాహాలు ఎక్కువగా ఉన్న జిల్లాలో అవేర్ నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తుంది.

‘ఎందుకిలా మారుమూల పల్లెటూళ్ళలో పనిచేయడం…వేరే ఇంకే పనేమైనా చూసుకోవచ్చుగా,’ అని చెబితే నవ్వేసి,

‘ఇది నాకిష్టమైన పనండీ…ఇందులోనే నాకు తృప్తి,’ అంది.

తనకిబ్బంది లేకపోతే…నాకూ ఇబ్బంది లేదు.

పేపర్లన్నీ నమిలేసి స్నానం చేసి రెడీ అయ్యి కిందికొచ్చాను.

లక్ష్మమ్మ పెట్టిన ఉప్మా తినేసి బయటికి వచ్చేసరికి, రాంబాబు కారు డోరు తీసి రెడీగా పట్టుకుని విష్ చేసాడు.

బదులిస్తూ వెనక కూర్చున్నాను.

పీక్ అవర్స్ ట్రాఫిక్ లో మెల్లిగా కదుల్తూంది కారు.

కంస్ట్రక్షన్ బిజినెస్ నాది. మొదట చిన్నగా మొదలుపెట్టాను పదిహేనేళ్ళ క్రితం. నగరంతో పాటు వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం వంద కోట్ల టర్నోవర్ వరకు పెరిగింది వ్యాపారం.

బిజినెస్ బావుంది. ఆదాయం బావుంది…అన్నీ బావున్నాయి.  కానీ…ఏదో వెలితి…ఏదో పోగొట్టుకున్న భావన…దేన్నో మరచిపోయిన లోటు. అదేంటో అన్వేషిస్తూనే ఉన్నాను.  ఇంకా దొరకలేదు. దొరుకుతుందన్న నమ్మకం మాత్రం బలంగా వుంది.  నా మూలాల్లోకి వెళ్ళి దాన్ని  శోధించి సాధించి తీరుతాను.  అంత తొందరగా ఓటమిని ఒప్పుకునే మనస్తత్వం కాదు నాది.

టైము తొమ్మిదిన్నర.  ముప్పావుగంట పట్టింది హిమాయత్ నగర్ నుంచి పంజాగుట్ట ఆఫీస్ కి చేరుకునేసరికి.

రోజూ వారి కార్యక్రమాలలో నిమగ్నమయ్యాను.  ఎంత హడావుడి పనులైనా కూల్ గా చేసే అలవాటు.  టెన్షన్ తీసుకోవద్దు … ఇవ్వాలి.

ఒక వెంచర్ కి సంబంధించిన  ఫైల్ చూస్తూ ఉండగా వచ్చింది ఫోన్. చూస్తే…సీనుగాడు. బీకే శ్రీనివాస్. నా స్కూల్ క్లాస్ మేట్.  సంతోషం మనసంతా ఆక్రమించింది.  లిఫ్ట్ చేసాను.

‘చెప్పరా…బీకే…ఎలా వున్నావ్?’ కొంటె తనం ప్రవేశించింది నా గొంతులో.

‘రామా…’

‘వింటున్నాను చెప్పరా…’

‘ఆఫీసులో ఉన్నావా?’ అడిగాడు.

‘అవును…ఎందుకురా?’ ఈ సారి వేళాకోళం ధ్వనించింది.

‘మన వినోద్ గాడు చనిపోయాడురా.’

‘……………’

‘రామా…ఉన్నావా లైన్లో?’

‘ఎలా?’

‘డయాబెటిక్ పేషంట్…షుగర్ ఎక్కువయ్యిందట’.

‘ఎప్పుడు?’ వణుకుతున్న గొంతుని అతి ప్రయత్నం మీద అదుపు చేసుకుని అడిగాను.

‘రాత్రి చనిపోయాడట…నాకిప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది.’

‘నేను బయల్దేరుతున్నాను.’

‘మన వాళ్ళందరూ వస్తున్నారు, మన స్పాట్ కి వచ్చేయి.’ ఫోన్ పెట్టేసాడు వాడు.

మనసంతా దిగులు కమ్ముకుంది. అప్రయత్నంగా కళ్ళల్లోంచి నీళ్ళు ఉబికి వచ్చాయి. తుడుచుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదనుకుంటాను. ఆఫీస్ బయటికి ఎలా వచ్చానో కూడా తెలీదు.కార్లో వెళ్ళాలన్న ఆలోచన కూడా మెదలలేదు. ఆటో ఎక్కి అఫ్జల్ గంజ్ పోనివ్వమన్నాను.

వినోద్. నా బాల్య స్నేహితుల్లో ఒకడు. నేడు జ్ఞాపకంగా మిగిలాడు.

మూర్తి, మధు, మురళి, వినోద్, నవీన్, బీకె, ధీరు, నాగరాజు, నవీన్, రామారావు, బషీర్, చేతన్ అంతా ఒక బ్యాచ్.  చదువుల్లో పోటీ, ఆటల్లో పేచీ, అల్లరిలో కలిసీ పెరిగిన వాళ్ళం.

ఎవరికైనా స్నేహితులంటే ముందుగా గుర్తుకొచ్చేవారు స్కూల్ క్లాస్ మేట్స్ మాత్రమే.  మధ్యలో చదివే ఇంటర్లూ డిగ్రీల్లోని స్నేహితులు మధ్యలోనే వెళ్ళిపోతారు.  బాల్యానికున్న మహత్తు అలాంటిదనుకుంటాను.

మా కాళ్ళ మీద మేము నిలదొక్కుకున్నాక, పెళ్ళిళ్ళయాక  కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కలిసేవాళ్ళం.  శివార్లలోని రిసార్ట్స్ గానీ ఏదైనా హాలిడే స్పాట్ గానీ ఎన్నుకుని రెండు రోజులూ, రెండు రాత్రులూ గడిపేవాళ్ళం.  రాత్రంతా మందులూ, విందులూ, చిందులూ నవ్వులూ…అందులో వినోద్ గాడు ఒక్కడూ ఒక ఎత్తు.

ఎంత అద్భుతంగా  వాయించే వాడు తబలా.  వాడి చుట్టూ మూగి అలా వింటూ ఉండి పోయేవాళ్ళం.  మమ్మల్ని మేము మరచిపోయేట్టు, మనసుల్లోని కల్మషాలనన్నిటినీ కడిగి పారేసేట్టు, ఒక అలౌకిక స్థితికి చేరేట్టుగా తబలా వాయించేవాడు. సంగీత జ్ఞానం లేదు గానీ తబలా మీద వాడి పొడవాటి వేళ్ళు చేసే విన్యాసాలు అలా చూస్తూ వింటూ ఉండిపోవాలనిపించేది.  కేవలం అందుకోసమే మేము కలిసేవాల్లమేమో.  ఇష్టపడి చేసే పని ఏదైనా మనసుని కష్టపెట్టదు. ఆ పనే మనసుని సేదతీరుస్తుంది కాబోలు.

అలా ఒక సంవత్సరానికి కావలసినంత శక్తి నంతా కూడ గట్టుకుని మరలేవాళ్ళం.

ఎంత ప్రేమ వాడికి తబలా అంటే.  జీవితాన్నంతా దానికే ధారపోసేసాడు.  కొందరు మంచి శిష్యుల్ని సంపాదించుకున్నాడు గానీ.  డబ్బుని వెనకేసుకోలేక పోయాడు.  ఆర్ధికంగా ఆదుకుందామంటే ఎప్పుడూ నిరాకరించేవాడు. ‘మీ దగ్గర డబ్బు తీసుకుంటే మళ్ళీ మిమ్మల్ని ఒరేయ్ అని పిలవలేనేమోనన్న భయం రా,’ అని నవ్వుతూ అందరినీ తిరస్కరించేవాడు.

ఆటో అఫ్జల్ గంజ్ లోని పాత శంకర్ షేర్ హోటల్ ఎదురుగా ఉన్న ఇరానీ కేఫ్ ముందు ఆగింది.  దిగాను. అప్పటికే అందరూ వచ్చేసారు.  బీకె గాడు నన్ను కావలించుకుని ఏడ్చేసాడు. మా మూర్తి గాడే కాస్త గట్టివాడు, ‘చాయ్ పీతా క్యారే’ అని నా జవాబు కూసం చూడకుండా,’ చోటే… చార్ చాయ్ లేకే ఆ బేటా’  ఆర్డర్ ఇచ్చేసి కాస్త మా మనసు మరల్చే ప్రయత్నంలో ఉన్నాడు.  టీ తాగేసి గౌలిగూడ ‘గురుద్వార’ ఎదురుగా ఉన్న సందులోని వినోద్ ఇంటికి వెళ్లాం.  అవే పాత చిన్న గదులు. ముందు గదిలో పడుకోబెట్టారు.  వాడి పక్కనే పెట్టిన తబలా.  వాటిని చూడగానే నాకు దుఃఖం ఆగలేదు. మా వాళ్ళని పట్టుకుని ఏడ్చేసాను.  తీసుకెళ్ళిన పూల దండ వాడి మెడలో వేసి నన్ను బయటికి తీసుకొచ్చారు.

దాదాపు అయిదు గంటలప్పుడు వినోద్ ని అంబర్ పేట స్మశానంలోదహనం చేసాక నన్ను హిమాయత్ నగర్ లోని మా ఇంటి దగ్గరలోని సందు మొదట్లో దింపేసి వెళ్ళిపోయాడు మధు.  ఇంటివైపు అడుగులు వేస్తూ యాదాలాపంగా పక్కకు చూసాను… నా కొడుకు సిద్ధాంత్ తన స్నేహితులతో నవ్వుతూ తుళ్ళుతూ కే.ఎఫ్.సి. లోంచి బయటికి వస్తూ కనిపించాడు. వడివడిగా అడుగులు వేస్తూ ఇంటి వైపు దారితీశాను.  రేపే వాడికి ఎంసెట్ పరీక్ష. చదువుని నిర్లక్ష్యం చేస్తున్నాడా అన్న సందేహం కలిగింది వాడి మీద.  నా మనసు ఇంకా కొంచం వికలం అయిపోయింది.

ఇంట్లోకి అడుగుపెట్టి లక్ష్మమ్మని ఏమైనా తినడానికి పైన పెంట్ హౌస్ లోని బార్ రూమ్ లో పెట్టమని చెప్పి, పైన మా గదిలోకి వెళ్లి అలాగే బాత్ రూమ్ లోకి దూరి బట్టలు మార్చుకోకుండానే షవర్ ఆన్ చేసి అలా నిల్చుండి పోయాను.  అలా ఎంత సేపు ఆ చల్లటి నీటి ధారలలో నిల్చుండిపోయానో తెలీదు.  ఎదలోపలి గదులలో నిక్షిప్త మై ఉన్న తడి ఆరని జ్ఞాపకాలని చల్లని నీటి ధారలతో శాంత పరిచినట్టనిపించాక మనసు కాస్త తేలిక పడింది.  బట్టలు మార్చుకుని రెండో అంతస్తులోని బార్ రూంలోకి దారి తీశాను.

విశాలమైన గది. చాలా తక్కువగా వస్తూంటాను ఇందులోకి.  నేను రెగ్యులర్ డ్రింకర్ ని కాదు, సోషల్ డ్రింకర్ని.  బకార్డి వైట్ రమ్ ఒక పెగ్ ఆన్ ద రాక్స్ చేసుకుని సోఫాలో కూర్చుని సిప్ చేశాను.  లక్ష్మమ్మ అప్పటికే హాట్ ప్యాక్లో ఫింగర్ చిప్స్ పెట్టి వెళ్ళింది.  ఒక్కో గుక్కా గొంతు లోపలికి జారుతూ ఉంటే మనసు మరికాస్త, ఇంకాస్త సేద తీరినట్టనిపించింది.  ఎందుకో అనుకోకుండా నా దృష్టి ఆ కిటికీ మీద పడింది.  గ్లాసు పక్కన పెట్టి వెళ్లి ఆ కిటికీ తలుపు తీశాను. మృదువుగా నా ముఖాన్ని స్పృశించింది చల్లటి గాలి. కి టికీ అవతలకి చూపు సారించాను.

ఎదురుగా ఆకు పచ్చటి చిత్తరువు ఆవిష్కరించబడి ఉంది.  విశాలమైన పంట పొలాలు, దాదాపు పదిహేను ఇరవై ఎకరాలు ఉంటుంది కాబోలు…

     చుట్టూ కంచె వేసి ఉంది. అందులోని ప్రతి అంగుళం పచ్చదనం రంగరించి పూసినట్టు  ఉంది. కంచె లోపల చుట్టూరా కొబ్బరి చెట్లూ, టేకు చెట్లూ ఆ పొలానికి కాపలా కాస్తున్నట్లు నిటారుగా నిల్చుని పహారా కాస్తున్నాయి. నైరుతి మూలకి పెద్ద వేపచెట్టు ఎల్లప్పుడూ ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడి అభయ హస్తంలా నిలబడి ఉంది. తూర్పు వైపున మూలకి ఒక చిన్న గేటు. అందులోంచి లోపలికి అడుగులేస్తే చిన్న పిల్ల బాట.  

      బాటకిరువైపులా మందారాలూ, రంగు రంగుల రోజా పూలూ, సీతమ్మ జడలూ, గోరింక పూలూ. ఇక బంతుల కైతే లెక్కే లేదు. పోక బంతులూ, చిట్టి బంతులూ, ముద్ద బంతులూ, తురక బంతులూ, రెక్క బంతులూ విరగ బూసి ఉన్నాయి. బాట చివరలో, పొలానికి మధ్యలో తీర్చి దిద్దినట్లు చిన్న పెంకుటిల్లు. ఇంటి ముందు కళ్ళాపి చల్లి, బియ్యం పిండితో ముగ్గులు వేసారు. ఇంటికి కుడివైపు నుంచి ఇంటి పైకి పాకిన సొర తీగ, ఎడమ వైపు ముందు చిన్న పందిరి పైకి  చిక్కుడు తీగ పాకి గుత్తులు గుత్తులుగా చిక్కుళ్ళు కాసి ఉన్నాయి. ఇంటి ముందు తులసి కోట, దాని కివతలగా బొండు మల్లే, సన్న జాజీ, విరజాజీ అవతల చమేళీ మేళవించి ఉన్నాయి. ఇంటి కిటికీ పక్కనే పారిజాతం. ఇంటికి ఎడమ పక్క చావిడి. అందులో పచ్చ గడ్డి పోచలు నములుతూ రెండు ఎడ్లూ, రెండు ఆవులూ…దూడలూ. ఇంటి ముందు వసారాలో వంట మొదలు పెట్టిన ఇల్లాలూ…ఇంటి చుట్టూరా పొలాలు.

     జాజు అలికినట్టుగా ఎర్రని నేల. పొలమంతా మళ్ళుగా చేసి ఉంది. ఒక్కో మడి ఇంచుమించు ఎకరం అంత విశాలంగా తీర్చిదిద్ది ఉంది. ప్రతి మడిలో ఒకో రకం పంట వేసారు. పసుపచ్చని పూలతో తలలూపుతున్న ఆవ చేను, పక్కగా అప్పుడప్పుడే మీసాలు మొలుస్తున్న మొక్క జొన్న కంకులూ, అటుపక్కగా వెడల్పాటి ఆకులతో పొలానికి గొడుగు పట్టినట్లుగా బొప్పాయి చెట్లూ, ఇటు వైపు క్రమశిక్షనకి మారు పేరుగా ఒక వరసలో నిల్చుని ఇప్పుడిప్పుడే కంకులేస్తున్న పచ్చ జొన్న చేనూ, అటువైపు వరి చేనులోని కప్పపిల్లల కోసం ఒంటి కాలి పై తపస్సు చేస్తున్న తెల్లటి కొంగలూ…ప్రకృతి తన కోసం తాను గీసుకున్న వర్ణ చిత్రం.

     అప్పుడే బొప్పాయి మడిలోకి పార తో మట్టిని సరిచేసి నీళ్ళు మళ్ళించి ప్రతి చెట్టునూ మొక్కనూ పలకరిస్తూ… స్పృశిస్తూ… సేదతీరుస్తూ…సేద తీరుతూ… అతను. ఆ చిన్న నీటి కాలవలోని నీటితో పారను కడిగి పక్కన పెట్టి…ఆ నీటితోనే కాళ్ళూ చేతులూ…మొహం కడుక్కుని తుండు గుడ్డతో మొహం తుడుచుకుంటూ ఇంటి వైపు అడుగులేస్తున్నాడు. అంతలో ఆ ఇంటి ఇల్లాలు కేకేసినట్టుంది, అది విని పక్కనే ఉన్న అతి చిన్న మడిలో ఉన్న కొత్తిమీర మొక్కలను గుప్పెడు పీకి వేళ్ళను కాలవలోని నీటిలో కడిగి ఇంటి వైపు అడుగేసాడు.

     ఇంటికి ఎడమవైపు ఏపుగా పెరిగున్న కరివేపాకు కొమ్మని వంచి నాలుగు రెమ్మలు దూసి తన చీర చెరుగుతో తుడుస్తూ  వసారాలో పొయ్యి మీదున్న తాలింపులో వేసింది. చిటపట మంటూ చప్పుడు చేస్తూ కరివేపాకు విరజిమ్మిన కమ్మని వాసన చుట్టూ అలుముకుంది. 

                                               

చాలా రోజుల తరువాత మళ్ళీ ఈ రోజెందుకో గుబులుగా ఉంది మనసంతా. ఆఫీస్ నుండి ఇంటికి బయల్దేరాను. ట్రాఫిక్ చాలా ఉంది…రోజూలాగే.  చికాకుగా ఉంది…ఎందుకో ఏదో పోగొట్టుకున్న భావన చుట్టుముట్టింది. స్తిమితంగా లేదు మనసు. అలజడిగా ఉంది. అది దేని గురించో తెలిస్తే బావుండు.  పరిష్కారం వెతకవచ్చు.  వెనక సీట్లో జారగిల బడి కూర్చున్నాను. రాంబాబు నిదానంగా కారు నడుపుతున్నాడు.  కారు ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదికి చేరగానే గుర్తొచ్చింది.  రాంబాబుకు చెప్పాను.  నా గురించి నాకే అంతుపట్టదు.  కారు తిన్నగా సెక్రటేరియట్ వెనక కరెంట్ ఆఫీస్ ముందు ఆగింది.  దాని కెదురుగా చిన్న టీ బంకు.  ఎప్పట్లానే కిటకిట లాడుతుంది.  దిగి వెళ్లాను.  వేడి వేడి లెమన్ టీ ఇచ్చాడు బంకతను పుదీనా రెమ్మలు  అందులో వేసి.  అదే రుచి.కమ్మటి సువాసన ముక్కులో నుండి…గొంతులో నుండి శరీరమంతా ప్రవహించి కొత్త శక్తి అలుముకున్నట్టనిపించింది.  కాస్త నెమ్మదించిన మనసు  హాయితో నిండిపోయింది.  ఏ విధమైన ఆలోచనలు మనసులోకి ప్రవేశించకుండా ఇలా ఎప్పుడూ ఉంటే ఎంత బావుంటుంది.  రాంబాబు కూడా టీ తాగాడు. వచ్చి కారులో కూర్చున్నాను.  మెల్లిగా ముందుకు కదిలింది కారు.

ఫోన్ మోగింది. ఇయర్ ఫోన్ చెవులకి తగిలించుకుని చూసాను. చారి. లాండ్స్ డీల్ చేసి డేవలప్ మెంట్ కి  ఇప్పించడంలో దిట్ట. నాకు బాగా కావలసిన వాడు. ఎన్నో ఏళ్ళు గా పరిచయం.

“చెప్పు చారీ…బాగున్నావా?’

‘బాగున్న సార్…మీరెట్లున్నరు?’

‘అంతా బాగానే ఉన్నాం…ఏంటి విశేషాలు?’

‘ఒక ల్యాండ్ మన చేతికొచ్చింది సార్…అది సూడంగనే మీరే యాదికొచ్చిండ్రు… గందుకే మీకే చేస్తున్న.’

‘ఎక్కడ…ఎంతుంది?’

‘అదంత తర్వాత చెప్త సార్… బయాన గూడ ఇచ్చేస్న…మీ పేరు మీద రశీదు గూడ దీస్కున్న.’

‘అదేంటి…అలా ఎలా చేస్తావ్…అదేంటో…ఎలా వుందో చూడ వద్దా?’

‘జర నేను చెప్పేది ఇనుండ్రి సార్…గిప్పుడే మా సుట్టాలింట్ల దావత్ అంటే గీడికొచ్చిన…అదే మన సాగర్ రోడ్ల చింతపల్లి అనే ఊరుంది చూసిండ్రా … గదే సాయి బాబా గుడి ఉంది గదే ఊరి దగ్గర ఒక చిన్న పల్లెటూరుంది గాడికొచ్చిన. గీడ మనకు తెలిసినాయన మంచి భూమి అమ్ముతున్నడంటే చూసిన సార్…చాన బాగుంది. ఇరవై ఎకరాలు. ధర కూడ మనకు అందుబాటులనే ఉంది. గది సూడంగనే మీరే యాదికొచ్చిండ్రు.’

‘అదేంటి చారీ…అలా ఎలా బయాన ఇచ్చావు…నేను చూడ వద్దా?’

‘సార్…నేనెప్పుడైన మీకు గలత్ జాగా ఇప్పిచ్చిన్నా చెప్పుండ్రి.’

‘………’

‘మంచి పొలం సార్…ఎర్ర నేల…నీటి వసతుంది…అమ్మేటాయన పిల్ల పెండ్లి పెట్టుకున్నడు…అదంటే ఆయనకీ పానం సార్…అమ్మేటాయన ఒక మాటన్నడు సార్… ఆ భూమి కొన్నోళ్ళ దగ్గర్నేపని చేస్తాడంట గని భూమి ఇడిసి పోడంట….అది ఇనంగానే శాన బాదయింది సార్…సరే గని ఒక మాట సార్ ఏమనుకోవద్దు…మీరు భూమి చూసినంకనే తీసుకోండి…నచ్చితేనే తీసుకోండి…పిల్ల పెండ్లి సార్…గీ సారి నా మాట ఇనాల్సిందే సార్…ఉంట…’

నాకాశ్చర్యమేసింది…చారి ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు. చారి కొనిపించిన  సైటులన్నిటి మీద నేను చాలా లాభాలు గడించాను. అయినా అలా ఎలా అడ్వాన్స్ ఇస్తాడు. మంచి భూమి అంటున్నాడు…ఆ ధర పెద్ద లెక్కలోది కాదు. చాలా చిన్న అమౌంట్. అది కాదు అసలు విషయం. చారి గొంతులో నిజాయితీ ఉంది. బాధ ఉంది. ఇంకా బాధ పెట్టే విషయమేంటంటే భూమి అమ్మేవాడు భూమి విడిచి వెళ్ళననడం. నా ఎదలో చేయి పెట్టి గుండెను ఎవరో కెలికి నట్టనిపించింది. చారి చెప్పిన విషయం నా కెందుకో … దేనికో మార్గం చూపిస్తున్నట్టుగా తోచింది.

‘అసలే సున్నితమైన మనస్తత్వం…దానికి తోడు ఇమోషనల్…ఇదేం బాధరా బాబూ నీతో…’ ఎప్పుడూ అనే మూర్తి గాడి మాటలు గుర్తొచ్చాయి.

నిజమే…నేను కాస్త ఇమోషనల్ అనేది నిజమే. చాలా చిన్న ఆనందానికి…సంతోషానికి కూడా కళ్ళు తడి చేసుకునే ఆంకర్ ఉదయభాను ఏడవడం చూసి కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకునే మనస్తత్వం నాది. కళ్ళ నీళ్ళ తో మనసుని ఎప్పటికప్పుడు కడిగేసుకొని స్వచ్చంగా తయారుకావడమే మనిషికీ… మనసుకీ అవసరమేమో?

అప్పటి వరకూ అల్లకల్లోలంగా ఉన్న మనసు కాస్తా ఇంటికి చేరుకునే లోపల రెట్టింపయ్యింది. అదో రకమైన స్తబ్దత ఆవరించింది. ఆ స్తబ్దత కాస్తా కారు దిగే సరికి నిస్సత్తువకి లోనయ్యింది. భారంగా అడుగులేస్తూ ఇంట్లోకి నడిచాను. నా భార్య ఎదురొచ్చింది. నా వాలకం వెంటనే పసిగట్టేసింది.

‘అంతా ఓకేనా?’ అడిగింది.

‘ఓకే…’ అంటూ పైకి దారి తీస్తూ…’పెంట్ హౌస్ లోకి ఎమైనా పంపించు,’ అంటూ మా రూంలోకి దూరాను. ఇలాంటి సమయాల్లో తను నన్ను డిస్టర్బ్ చెయ్యదు.

చల్లటి నీళ్ళతో స్నానం చేసి పెంట్ హౌస్ లోకి చేరాను.

హాట్ ప్యాక్ లో ఏదో పెట్టినట్టుంది తను. ఒక పెగ్ ఫిక్స్ చేసుకుని సోఫాలో జారగిలబడి కూర్చుని కళ్ళు మూసుకున్నాను. మరీ ఇంత చిన్న చిన్న విషయాలకి కూడా ఇంతలా స్పందించడం ఎందుకు…అదీ అతను ఎవరో కూడా తెలీని…చూడని మనిషి గురించి. నిజంగా మనుషులకి ఈ ఆస్తులమీద ఇంత మమకారమెందుకు? అది మమకారమా అనుబంధమా? అదీ ప్రాణం లేని భూమి మీద. మరి ఇలా ఆలోచించేవాడిని నేనెందుకు అలజడికి లోనవుతున్నాను. అతని ఆలోచనే సరైనదా?

తల విదిలించుకుని…గ్లాసులోని ద్రవాన్నంతా గొంతులోకి దింపుకున్నాను. అసంకల్పితంగా నా చూపు ఆ గోడకున్న కిటికీ పై పడింది. ఎక్కడలేని హుషారుతో లేచి ఆ కిటికీ తలుపు తెరిచాను.

అదే చల్లటి గాలి… రివ్వున నా ముఖాన్ని తడిమేసింది.

వర్షాకాలం మొదలయ్యినట్టుంది…కొత్తగా చిగురించిన చిగుర్లతో ఇంకాస్త పచ్చగా ఉన్నాయి చెట్లన్నీ. దూరంగా ఫెన్సింగ్ కి ఆనుకుని ఉన్న టేకు చెట్లకీ…కొబ్బరి చెట్లకీ పారతో పాదులు సరిచేస్తున్నాడు అతను. దిగులు చికాకు లాంటి వేవీ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉన్నాడతను.  

        సన్నటి వాన జల్లు మొదలయ్యింది. గాలి అలలకి తుంపర్లు తుంపర్లుగా జల్లు కురుస్తోంది.

       తడిసిన మట్టి వాసన…కమ్మగా ముక్కుపుటాలను చుట్టు ముట్టింది. వేప చెట్టుకింద…దాని మొదలునానుకుని నిలబడి ఆకులపై కురిసే వాన జల్లు సవ్వడి…గుండెని మెల్లిగా తట్టి మేల్కొలిపింది. ఆ సవ్వడిని దేనితో పోల్చగలం. ఏ పోలికైన కృత్రిమమే…ప్రకృతి చేసే సవ్వడే ప్రాకృతం కాబోలు…మిగతావన్నీ అనుకరణలే….అనుసరణలే… ఎందుకో…ఒక్కసారి ఒళ్ళు ఝల్లుమంది. అది వాన జల్లు పలకరింపా…తుళ్ళింతా లేక పులకరింతా…ముఖం పై చేరిన వాన తుంపరలు ఒక అలౌకిక ఆనందాన్ని కలిగించసాగాయి. గుండెల్లో నిక్షిప్తమై ఉన్న ఆనందం…పైకి…పైపైకి ఎగబాకి కళ్ళల్లోకి ప్రవహించి వాటిని నిశ్చల ప్రశాంత ఆనంద జ్యోతుల్లా ప్రకాశింపచేసింది. ఆ వెలుగు ముఖంపై ప్రతిబింబించి కొత్త కాంతులు విరజిమ్మే వేకువ సూరీడులా తలుకులీనుతోంది. అతన్ని చూస్తే ముచ్చటేసింది.

     అప్పుడే గొడుగు పట్టుకుని ఇంట్లోంచి బయటికి వచ్చిన ఆ ఇల్లాలు, అతనెక్కడున్నాడా అని కళ్ళ తోనే వెతికి, వేప చెట్టుకింద ఉన్న అతన్ని చూసి పిలిచింది. అతను ఇటువైపు  చూడగానే గొడుగుని చూపించి ఏదో అంది.  ముందు తల అడ్డంగా ఊపిన అతను మెల్లిగా సరే నన్నట్టుగా నిలువుగా ఊపాడు. ఆమె గొడుగు పట్టుకుని నెమ్మదిగా అడుగులేస్తూ అతన్ని చేరుకుంది. అతన్ని గొడుగులోకి చేర్చుకుని తన చీర చేరుగుతో అతని తల తుడిచే ప్రయత్నం చేసింది. అతని చేయి ఆమె నడుము చుట్టూ చుట్టి… ఇంకాస్త దగ్గరకి లాక్కున్నాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ…ఆ కళ్ళల్లో తనని తాన చూసుకుంటూ…చుట్టూ ఉన్న ప్రకృతి అనుకూలంగా సహకరించగా అమృతాన్ని తాగే ప్రయత్నంలో ఉన్నాడు.

     ఆమె అతని గుండెల పైన తలాన్చి కళ్ళు మూసుకుంది. వారు ఒకరినొకరు పొదివి పట్టుకుని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి అలా ఎంత సేపు ఉండిపోయారో వారికే తెలియదు.

     అంతలో తూర్పు వైపున్న గేటు దగ్గర చప్పుడికి ఇద్దరూ ఒక్కసారే అటు చూసారు.

     అప్పుడే గేటు తీసుకుని, వర్షానికి తడవకుండా తన పుస్తకాల సంచిని తలపైన పెట్టుకుని పరుగు పరుగున వస్తున్న కుర్రాడిని చూసి వెంటనే అతని  దగ్గరికి చేరుకున్నారు.  ఆమె పుస్తకాల సంచి అందుకుంది. అతను ఆ కుర్రాడిని ఎత్తుకుని కబుర్లు చెపుతూ ఇంటి వైపు నడవసాగారు. వారి మాటలని ఆనందంగా వింటూ…వర్షానికి వారిద్దరూ తడవకుండా గొడుగు పడుతూ…తను తడుస్తూ…ఆమెని గొడుగులోకి లాగుతూ అతను… 

పిరి సలపనంతగా  పని ఉంది ఈ రోజు. ఆఫీస్ కి వచ్చినప్పటి నుంచీ ..మీటింగ్ అనీ… విజిటర్స్ అనీ…తరువాత ఫోన్ కాల్స్ అనీ…బిజీ…బిజీ… దాదాపు గంట గడిచిందో లేదో నా భార్య ఫోన్ చేసింది…వెంటనే ఇంటికి రమ్మని.

‘ఎందుకు?’

‘మీరు బయల్దేరండి’, కొంచం ఖంగారు ధ్వనించింది తన గొంతులో.

అదేంటో కనుక్కునే లోపల ఫోన్ పెట్టేసింది. అత్యవసర పరిస్థితి అయితే తప్ప తను ఇలా ఎప్పుడూ ఫోన్ చెయ్యలేదు ఇప్పటివరకు…ఒకటి రెండు సందర్బాలు తప్ప.

ఎక్కడి పని అక్కడ వదిలేసి వెంటనే బయల్దేరాను.

ఇంటికి మధ్య దారిలో ఉండగా చారి ఫోన్ చేసాడు. తను చెప్పిన భూమి గురించి ఏమాలోచించారని. తరవాత మాట్లాడతానని ఫోన్ పెట్టేసాను.

పరిపరి విధాల పరుగెట్టసాగింది మనసు. దానిని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండగానే ఇంటికి చేరుకుంది కారు.

ఇంటి కాంపౌండు బయట మూడ్నాలుగు టీవి చానల్స్ కి చెందినా వాహనాలు…పత్రికా విలేఖరులు…పరిచయస్తులు కనిపించారు.

నేను కారు దిగుతుండగా…అందరి చూపు నా వైపే…ఒక్క క్షణం గుండె ఆగి తిరిగి కొట్టుకుంది. ఏదో తెలియని అలజడి ఎద లోపలి ప్రవేశించింది…వెనువెంటనే నిమ్మలించుకున్నాను.

కారు దిగగానే అందరూ చుట్టుముట్టారు…పరిచయస్తులు…విలేఖరులు మైకులు పట్టుకుని ముట్టడించి ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టారు.

‘కంగ్రాచ్యులేషన్స్…సార్.’

‘………..?’

‘ ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్ లో మీ అబ్బాయి సిద్ధాంత్ కి స్టేట్ లెవెల్ లో మూడవ ర్యాంకు వచ్చినందుకు మీరెలా ఫీలవుతున్నారు?’

ఒక విలేఖరి అడిగిన ప్రశ్న నన్ను విస్తుపోయేలా చేసింది. ఏమని జవాబివ్వాలో…ఎలా జవాబివ్వాలో అర్ధం కాలేదు.

‘ఎక్సక్యూజ్ మీ’, అంటూ ఇంట్లోకి నడిచాను. కొద్దిమంది కావాల్సిన వాళ్ళు అప్పటికే అక్కడున్నారు.

నా భార్య ఎదురొచ్చింది.  తన మొహంలో ఆనందాన్ని అణిచేసిన ఆందోళన ప్రస్ఫుటంగా కనిపించింది.

‘ఏమయ్యింది?’ అడిగాను.

‘మీరాఫీసుకి వెళ్ళిన కాసేపటికే…కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసారు…ప్రెస్ వాళ్ళ తాకిడి అప్పట్నుంచే మొదలయ్యింది. సిద్దుకి 3 వ ర్యాంకు వచ్చింది…కానీ వాడు…’

‘కానీ….?’

‘ముందు మీరు వాడితో మాట్లాడండి. కాలేజ్ వాళ్ళు కాసేపట్లో వాలిపోతారు. ప్రెస్ మీట్ అరేంజ్ చేసారట…కాలేజ్ లో…అవన్నీ తరువాత మందు మీరు వాడితో మాట్లాడండి…వాడి రూమ్ లో ఉన్నాడు’.

ఇంట్లోని వాతావరణం అంతా కాస్త ఆందోళనతో నిండినట్లుగా అనిపించింది. అది మా ఆవిడ గొంతులో ఇంకాస్త ఎక్కువగా కనిపించింది.

తలుపు తట్టి వాడి గదిలోకి అడుగుపెట్టాను.

లోపల వాడు నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ చూస్తున్నాడు. నా అలికిడికి లేచి నిల్చున్నాడు. నేను ప్రశ్నార్ధకంగా వాడ్ని చూసాను…ఈ టైం లో ఎందుకిలా ఒక్కడివే ఉన్నావ్ అన్నట్టు.

నన్ను మంచం పైన కూచోబెట్టి…నా పక్కనే…ఎదురుగా బాసింపట్టు వేసుకుని కూచుని నా చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు.

‘ఐ యాం సారీ…నాన్నా!’

‘ఎందుకు?’

‘నాకు మెడిసిన్ చెయ్యడం ఇష్టం లేదు నాన్నా.’

‘మరి?…బైపిసి ఎంచుకున్నది నువ్వే కదా?’

‘అవును…కానీ మెడిసిన్ కోసం కాదు’, నసిగాడు.

‘మరి?’

తన చేతులతో నా చేతులని బిగ్గరగా వాట్టి పట్టుకుని మెల్లిగా చెప్పాడు.

‘నాకు అగ్రికల్చర్ బియస్సీ చెయ్యాలని ఉంది…తరువాత రీసర్చ్ వైపు వెళ్లాలని ఉంది నాన్నా…అందుకే బైపిసి తీసుకున్నాను’.

చల్లటి నీళ్ళతో చళ్ళున నా ముఖం పై కొట్టినట్టు తుళ్ళిపడ్డాను…ఎక్కడో గుండె లోపల …మారుమూల…సూది మొనంతగా మొదలైన ఆనందం…చిన్నగా రాజుకుని…రగిలి శరీరమంతా అలుముకున్నది.

‘నువ్వు సంతోషంగా ఉన్నావా?’

‘ఔను నాన్నా!’

‘సరే!…నీకేది ఇష్టమైతే అదే చదువు. జీవితంలో ఇష్టం లేని పని ఏదీ చెయ్యొద్దు…ఓకే’, అని వాడి భుజం తట్టి…గది బయటికి దారి తీస్తుండగా…

‘నాన్నా…’

వెనక్కి తిరిగాను.

సిద్ధాంత్ నా దగ్గరగా వచ్చి ఒక్కసారి నన్ను గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు…హత్తుకుని వదిలేసి,

‘థాంక్స్…నాన్నా!’

‘దేనికి?’.

‘అన్నింటికీ…’ కళ్ళు చికిలించి నవ్వాడు.

న్ని రకాల హడావిడులూ ముగిసే సరికి దాదాపుగా సాయంత్రం అయిదయింది.

స్నానం చేసి మెల్లిగా పెంట్ హౌస్ కి చేరుకున్నాను. ప్రశాంతంగా సోఫాలో చేరగిలబడి కూచున్నాను. మనసంతా…హాయిగా ఉంది. కల్మషమంతా  కడిగి పారేసినట్లు తేలికగా ఉంది. ఇన్నాళ్ళుగా ఉన్న ఏదో తెలియని అలజడి ఆవిరైపోయినట్లుగా తోచింది.

ఇంతలో లక్ష్మమ్మ వేడి వేడి మిరపకాయ బజ్జీల ప్లేటు తీసుకు వచ్చి టీ పాయి మీద పెట్టి వెళ్ళింది. ఎందుకో ఇవ్వాళ మందు మీదికి మనసు మళ్ళింది కాదు.

అకస్మాత్తుగా చారి మదిలో మెదిలాడు. ఫోన్ చేసి చెప్పేసాను…అతను చెప్పిన భూమి తను తీసుకుంటున్నానని.

ఒక బజ్జీని తీసుకుని కోరకబోతూ ఉన్నంతలో నా చూపు…మళ్ళీ…అదే కిటికే పై బడింది. చేతిలోని బజ్జీని ప్లేటులో విడిచి…ఆతృతగా వెళ్లి ఆ కిటికీ తలుపు తెరిచాను.

ఎదురుగా…

ముందర  అపార్ట్ మెంట్ మూడో అంతస్తు బాల్కనీలో ఉన్న కుమార్ గారు …నేను కిటికీ తలుపులు తెరవడం చూసి,

‘నమస్కారం సార్…ఎలా ఉన్నారు. చాన్నాళ్ళయింది మిమ్మల్నిక్కడ చూసి…ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ సార్…’

అతను మాట్లాడుతూనే ఉన్నాడు.

అతనికి బదులిస్తూ…వెనక్కి తిరిగాను…మూలాల్లోకి.

 

పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్ 

కొట్టం రామకృష్ణా రెడ్డి

కొట్టం రామకృష్ణా రెడ్డి

ఇప్పటివరకు దాదాపు పద్దెనిమిది కథలు రాశాను. హైదరాబాద్ నివాసం. ప్రైవేటు ఉద్యోగం. నాలుగు పుష్కరాల వయసు దాటింది. మొదటి కథ తీర్పు రచన మాసపత్రిక 1994లో ప్రచురింపబడింది. మానవ సంబంధాలు, వారి భావోద్వేగాలు ఇష్టమైన ఇతివృత్తాలు. పూర్వీకులు సేద్యం చేసేవారు. సారంగ లో ఇది మూడవ కథ

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • A person who Dates His own self can Deliver this Narration. God bless you with your own Romance Named writing. Keep Writing and Rocking.

  • అబ్బాయి agriculture pursue చేయాలనుకోవడం బాగుంది. వందకోట్ల టర్నోవర్ కలిగి ‘లాభాలు’ గడించే వ్యాపారస్తున్ని ఇంత sensitive గా ఇంత emotional person గా నిజజీవితంలో నేనైయితే అస్సలు ఊహించుకోలేను. ఈ sensitivity చన్నీళ్లతో స్నానం చేసి మందు తాగడంతో ఆగిపోకుండా దేనికైనా ఉపయోగపడి ఉంటే బాగుండేమో! మీరు (కథలో protagonist) పొలం కొనుక్కున్న తర్వాత, పాత యజమాని ఏ కథగా రూపాంతరం చెందుతాడో తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతోంది. అట్లాగే, తన కొడుకు ఎంసెట్ తర్వాత మెడిసిన్ కాకుండా అగ్రికల్చర్ చేస్తానన్నందుకు కంగారు పడి ఆందోళనకు గురైన అమ్మ ఎలా సమాధానపడిందో తెలుసుకోవాలన్న కుతూహలమూ కలుగుతోంది.
    ధన్యవాదాలు.

  • మనిషి తనకు నచ్చినట్టు వుంటే విజయం వరిస్తుంది….అనుకరిస్తే మర్రి ఏమో? సూపర్బ్ RK …. కథ, శైలి …బాగుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు