తాత్విక స్వప్నమే కచ్ఛపసీత

ప్రాచీన సాహిత్యకారులు తాత్వికతకి మనిషి అస్తిత్వానికి లంకె వేసి మనకందించారు. పురాణేతిహాసాల్లో ప్రతీకలని అర్ధం చేసుకోగలిగే అధ్యయనం ఒక్కో తరానికీ దూరమైపోతున్న కొద్దీ ఇలాంటి కథల అవసరం మరింత పెరుగుతోంది.

“వాల్మీకి లోకానికి ఓ మహోపకారమూ, ఓ మహాపకారమూ చేశాడు.” అన్నారట ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు, ఎస్వీ భుజంగరాయశర్మ గారితో..

“రామాయణాన్ని వ్రాసి ఈ జాతి అభిరుచుల్నీ, అభిప్రాయాల్నీ యుగయుగాలుగా తీర్చిదిద్దాడు. అది మహోపకారం కాదా!”

“సరే, అపకారం ఏమి?” టన్నారు భుజంగరాయశర్మ.

“మరి కొత్తది రాయడానికి ఎవరికీ ఏమీ మిగిల్చిపోలేదు.” అన్నారట హనుమచ్ఛాస్త్రి గారు.

****

వాల్మీకి రామాయణంలోంచి శాఖోపశాఖలైన అభివ్యక్తులన్నీ దేశాల ఎల్లలు దాటి విస్తరించాయి. రామాయణపాత్రల్నీ, వర్ణనల్నీ మించి కొత్త ఊహ ఏదైనా ఉందా అంటే అనుమానమే. పూర్వకవుల దగ్గర్నుంచీ ఏదో ఒక పాత్రని ఆరాధించడమో, సన్నివేశాన్ని విశ్లేషించడమో, వాల్మీకంలోని వాచ్యార్ధానికి వెనుక ఇంకా ఏదైనా ఉందా అని ఆలోచించడమో జరుగుతూనే ఉంది.

ఆ చింతనల్లోంచి చిలవలు పలవలుగా పుట్టిన పిట్టకథలు వాల్మీకి రామాయణపు సొగసునూ, గాఢతనూ పెంచేవే. ఊర్మిళ నిద్ర అలాంటి జనకథ.

జనకుడికి నాగేటిచాలులో దొరికిన బిడ్డ సీత, ఆపై ఇంకొక కన్న కూతురు ఊర్మిళ. జనకుని తమ్ముడు కుశధ్వజుడు సాంకస్య పట్టణపు రాజు. ఆయనకీ ఇద్దరు కూతుళ్లున్నారు. నలుగురు రాజకుమార్తెల్నీ అయోధ్యా రాకుమారులకి ఇచ్చి ఒకే ముహూర్తానికి పెళ్లి చేసాడట జనకుడు. వాల్మీకి రామాయణంలో ఉన్నది ఇంతే.

ఊర్మిళ నిద్ర, లక్ష్మణదేవర నవ్వూ ఇవన్నీ జనకథలే.

రామలక్ష్మణులు, సీతారాములు – విడదీయరాని వారిగా కీర్తింపబడతారు కదా.. మరి అన్నగారివెంట అడవులకి వెళ్లిన తన భర్త విరహాన్ని భరిస్తూ, ఒంటరిగా ఉండిపోయిన ఊర్మిళ ఏమై ఉంటుందనే ఊహ మనసుని మెలిపెడుతుంది.

పతంజలి శాస్త్రిగారి “కచ్ఛపసీత” కథ ఆ ఊహని వేరే స్థాయికి తీసుకెళ్తుంది.

****

“భూమి వలె నిట్టూర్చింది సీత.” అంటూ మొదలవుతుంది కథ.

అక్కగా ఊర్మిళని సముదాయించాల్సిన బాధ్యతని సీత తీసుకుంటుంది. “ఊరుకో.. నీ కన్నీళ్ళు సౌమిత్రి కళ్ళలో తిరుగుతున్నాయి.” అని చెల్లెల్ని ఓదారుస్తుంది.

ఎంత గొప్ప వాక్యమిది! ఒకరి కన్నీళ్ళు రెండోవారి కళ్ళలో చిప్పిల్లడమే దాంపత్యంలో అనురాగానికి పరాకాష్ఠ అనుకుంటే, దానిని గమనించి కష్టకాలంలో అక్కున చేర్చుకుని ఓదార్చే అక్కగారుండడంతో ఊర్మిళ రెండింతల అదృష్టవంతురాలని చెప్పకనే చెప్తారు శాస్త్రిగారు. లక్ష్మణుడి అనురాగమెలాంటిదో తెలిస్తేనే కదా పాఠకుడికి ఆమె విరహం అవగతమయ్యేది! ఈ ఒక్క వాక్యంతో జరగబోయే కథకి ఒక బలమైన పునాది పడుతుంది.

విరహమంత సుఖమైనదేమీ కాదు. పద్నాలుగేళ్ళు తక్కువ సమయమూ కాదు. తమ్ముడిగా ధర్మనిర్వహణ కోసం లక్ష్మణుడు అడవికి బయలుదేరుతూనే “వేర్లు సడలి ఒరిగిపోయిన చెట్టులా” జారిపోతుంది ఊర్మిళ.

****

భారతీయ తాత్విక దృక్పథానికి, రచయితకి ఉండాల్సిన అనుసంధానం గురించి శాస్త్రి గారి మాటల్లో అక్షరయాత్రలో విన్నవి మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకున్నాను. ప్రాచీన సాహిత్యకారులు తాత్వికతకి మనిషి అస్తిత్వానికి లంకె వేసి మనకందించారు. పురాణేతిహాసాల్లో ప్రతీకలని అర్ధం చేసుకోగలిగే అధ్యయనం ఒక్కో తరానికీ దూరమైపోతున్న కొద్దీ ఇలాంటి కథల అవసరం మరింత పెరుగుతోంది.

ఒక జంట మధ్య తప్పని దూరమో, అక్కచెల్లెళ్ళ మధ్యనున్న అవగాహనో బాహాటంగా కథలో కనిపిస్తున్నా అంతర్లీనంగా ప్రవహించే తాత్వికతే ఈ కథని ప్రత్యేకంగా పాఠకుడి మనసులోకి చేరుస్తుంది. మరలనిదేల రామాయణంబన్నచో…  తత్వబోధ అంత సులువైనదేమీ కాదు. కాలానుగుణంగా మారే రీతుల్లో కథలు సమాజానికి అందాల్సిందే.

****

అనుకోని ఆపదొచ్చి జీవితం తలక్రిందులైనప్పుడు అగమ్యగోచరంగా నిలబడిపోవడమనేది సహజం. అలాంటప్పుడు ‘నువ్విలా చెయ్యమ’ని సమయానికి ఒక సలహా చెప్పేవారే ఆత్మీయులు. సీత ఊర్మిళకి బహిఃప్రాణం. కర్తవ్యబోధ చేసే ఓర్పు, నేర్పు ఉన్నదే భూమిలాంటి సీత. ధర్మగ్లాని కలగకూడదని రాముని వెంట సీత, వారి వెంట లక్ష్మణుడూ అడవులకి బయల్దేరారు. మరి ఊర్మిళ నిర్వర్తించాల్సిన ధర్మమేమిటి? లక్ష్మణునిపై తన చూపుల వల వెయ్యవద్దని, ధర్మనిర్వహణ జరగనిమ్మని చెప్తుంది సీత. మనిషి మనిషికీ విద్యుక్తధర్మం మారిపోతుంది. అది ఎరుకలోకి తెచ్చుకోవడమే జీవనగమనాన్ని నిర్దేశిస్తుంది.

“పచ్చని చెట్లనీడల్లో పడుకుని బాల్యంలోకి వెళ్ళు. మన సుఖసంతోషాలని అక్కడ వదిలి వచ్చాం.” అంటుంది సీత.

“బాల్యంలో తప్ప క్షత్రియస్త్రీకి సుఖముండదు” అని చెప్తుంది తన చెల్లెలితో. పుట్టింటికి వెళ్లిపొమ్మని, బాల్యాన్ని పునర్జీవించమని ప్రోత్సహిస్తుంది. ఎంత గాఢమైన ఆలోచన! ఎంత అపురూపమైన ఊహ!

ఒడిదుడుకులన్నీ మానవప్రయత్నానికి లొంగి దారివ్వవు. ఒక్కోసారి తలవంచక తప్పదు. అలాంటప్పుడు బాల్యంలోకి ఎలాగైనా పారిపోగలిగితే చాలని క్షణకాలమైనా అనుకోని వారుంటారా?

నిరంతరం లక్ష్మణుడి సామీప్యాన్నే గుర్తు చేస్తున్న అయోధ్యని వదిలి, పుట్టింటికి వెళ్తుంది ఊర్మిళ. “సౌమిత్రి లేనిదెక్కడ. అతను నా నీడ.” అని చెప్తూనే వెళ్తుంది. అక్కడా అతనితో కలిసి గడిపిన జాడలు గుర్తొస్తాయి. చెలికత్తెలు జంట వెతుక్కున్నా తనకే గుచ్చుకున్నట్టనిపిస్తోంది. ఆమె జీవితం దుర్భరమైపోయింది. అన్నపానాదులు విడిచిపెట్టేసింది.

ఇక్కడొక గమ్మత్తైన సన్నివేశాన్ని కల్పించారు. “లక్ష్మణుడు ఒంటరి జింకల్ని వేటాడినందుకే తమకు ఈ వియోగమా!” అని ఊర్మిళ వణికిపోతుంది. కథలో ఔచిత్యమెక్కడా చెడని విధంగా కొత్త ఊహలు చేయడమే పాఠకుడి రసాస్వాదనని రెట్టింపు చేస్తుంది. చదివేవారికి క్రౌంచ మిథునం ఠక్కున గుర్తొస్తుంది.

లక్ష్మణుడి సాన్నిహిత్యాన్ని, ప్రేమని తల్చుకు తల్చుకు శల్యమైపోతున్న కూతురితో ఆమె తండ్రి చెప్పే మాటలు ఏ బాధకైనా వర్తించేవే.

“దుఃఖాన్ని లేదనుకోవడం అజ్ఞానం, దాన్ని విస్మరించమని చెప్పడం అమాయకత్వం. నువ్వు ముందు దుఃఖాన్ని అర్ధం చేసుకో. నువ్వు ఏ ఉపశమనం కోరుకుంటున్నావో అది వెలుపల ఉండదు. నీలోనే, నీ ఆధీనంలోనే ఉంటుంది.”

అయినా ఊర్మిళకి దారి దొరకదు. “దుఃఖంలోంచి, ఆగ్రహంలోంచి విజ్ఞతలోకి ప్రయాణించడమేమీ సులువు కాదు” అంటాడు ఆమెతో తండ్రి. ఈ వాక్యమొక సందర్భానికో, కథకో సంబంధించినది మాత్రమే అయితే హృదయాన్ని పట్టుకు వ్రేలాడదు. తాత్వికత అంటే బ్రహ్మపదార్ధమేమీ కాదు. సందర్భాన్ని మించి మనసుకి హత్తుకుని “నిజమే కదా!” అనిపించడమే దాని లక్షణం.

“జీవితంలో మళ్ళీ సౌమిత్రిని చూడలేనేమోననే భయం హృదయం మీద శిలవలె ఉండేది. తన జీవితం భయం ఉండచుట్టిన వియోగం.” అనుకుంటుంది ఊర్మిళ. ఊర్మిళ అంటే ‘కోరిక కలిగినది’ అని చెప్తారు. ప్రతీ స్త్రీ ఊర్మిళ కాదూ? సంతోషంగా జీవితం గడపాలని చూసే మనిషి కాదూ?

కథకి మలుపు అవసరం కాబట్టి కచ్ఛపసీత ఊర్మిళ కథలోకి వస్తుంది. ఆమెకి పట్టుకొమ్మ దొరికినట్లయింది.

తనలోకి తాను అంతర్లోకనం చేసుకోమని తండ్రి చెప్పాడు. బాల్యానికి వెళ్లిపొమ్మని అక్కచెల్లెలు చెప్పింది. దానికి మార్గమే తాబేలు రూపంలో కనిపించిందేమో. లక్ష్మణుడి వియోగంలో కర్మశూన్యంగా మిగిలిపోయిన ఊర్మిళకి దిశానిర్దేశం చేస్తుంది కచ్ఛపసీత. శ్రేయోభిలాషుల సూచనలు విని పాటించినా తత్వం పూర్తిగా బోధపడేందుకు కళ్ళముందు కనిపించే ఉదాహరణ ఆ తాబేలు.

****

ప్రతీకాత్మకంగా సాగే కథలో మణిపూసల్లాంటి మాటలెన్నో. “ఇలాంటి ఊహలు ఎక్కడ నుంచి వస్తాయీయనకి!” అని ముచ్చటపడి మళ్ళీ చదువుకోవడమే.

ప్రాచీనసాహిత్యం అందకుండా ఒక తరాన్ని సాహిత్య పరంగా నిర్వీర్యం చేసిన మార్పుల గురించి కూడా పతంజలిశాస్త్రిగారికి కచ్చితమైన అభిప్రాయాలే ఉన్నాయి. పంచతంత్రం, పురాణేతిహాసాల్లో ఉన్న కాల్పనికత, మార్మికత మనిషి మెదడుకు పదును పెట్టే అంశాలు అంటారాయన. సమకాలీనతకు అద్దం పట్టేలా రాయడమొక్కటే సాహిత్యపు పరమావధి కాదు, ఆ పని చేసేందుకు వేరే మార్గాలున్నాయంటారు.

చీమ చిటుక్కుమంటే ఉన్నపళాన సోషల్ మీడియా లో కవిత్వమో కథో వెలార్చడాన్ని సృజనాత్మకత అనుకొమ్మని బలవంతం చేసే పరిస్థితుల్లో ఉన్నాం.

కొత్త విశేషణాలెందుకు పుట్టట్లేదు? కొత్త పోలికలు ఎందుకు అందట్లేదు? నింగికీ, మన్నుకీ, పచ్చని చెట్టుకీ, పారే నీరుకీ దూరమైన మనిషికి కల్పనా, కవిత్వమూ ఎక్కణ్ణుంచి వస్తాయి?

ప్రకృతితో మమేకమవగలిగే విద్య తెలిసినందుకే శాస్త్రిగారి కలం అలవోకగా ఇలాంటి కవితాత్మక తాత్విక వాక్యం రాయగలుగుతోందేమో!

****

ఊర్మిళని పూలతీగతో పోలుస్తారు. ఆ తీగ వేర్లు సడలుతాయి, ఆకులు దూసినట్టు వడలిపోతుంది, నీళ్ళు లేక వాడిపోతుంది, చివరకు ప్రకృతిలో, కచ్ఛపసీతలో గురువుని చూస్తుంది.

“మన అంతరాంతరాలు ప్రకృతికి స్పందిస్తాయి. వాటిని గమనించడం మన చిత్తసంస్కారాన్ని బట్టి ఉంటుంది.” ఎంత శక్తివంతమైన వాక్యమిది!

కష్టాల కడలిలో ఎలా అంతర్ముఖమవ్వాలో కచ్ఛపసీత చూపిస్తుంది. ఊర్మిళ నిద్రపోతుంది.

నిజంగా నిద్రపోయిందా? అందులో స్త్రీ సాధికారత ఏముంది? అసలీ కట్టుకథ వలన ప్రపంచానికి ఏం ఒరుగుతుంది? అని ప్రశ్నించే వారికి ప్రతీకాత్మకత అంటే చెప్పగలిగిన శక్తి రామాయణ భారతాలకి కూడా లేదు.

శాస్త్రిగారి మాటల్లో – “ప్రాచీన సాహిత్యమొక్కటే సాహిత్యమని వాళ్లెప్పుడూ చెప్పలేదు. కానీ ఆధునికులు అభ్యుదయ సాహిత్యమొక్కటే సాహిత్యమని ఒక తరాన్ని గొప్ప అనుభవం నుంచి దూరం చేసేసారు అని..” ఎంత కఠోరనిజమది! రుచి చూడకుండానే ‘తేనె చేదు’ అనే సగటు పాఠకుడికి ఏం చెప్పగలం!

రచయిత్రి డా. సి. ఆనందారామం తన అక్షరయాత్ర ఇంటర్వ్యూలో అంటారు.. “కాపీరైట్ హక్కులు లేవనే కదా రామాయణ భారతాల్ని ఇష్టానికి తిరగరాస్తున్నారు?” అని. నచ్చనిదాన్ని విశ్లేషించడమో, విమర్శించడమో కాక తమ భావజాలాన్ని ఆ పాత్రల మీద రుద్దడంలో నైతికత ఎప్పుడూ ప్రశ్నార్ధకమే.

పురాణకథపై మక్కువతో జనపదులు సృష్టించిన కొసరు కథని తీసుకుని దాని సౌందర్యాన్ని వెయ్యింతలు చేసేలా రాసిన “కచ్ఛప సీత” లాంటి కథ చదివి ఆ తిరగరాతల్ని చదివిన బాధని కడిగేసుకున్నాననిపించింది.

పురాణేతిహాసాల్లో, జానపదాల్లో దాగిన సొగసుల్ని, నేర్పుగా అల్లిన తాత్వికతనీ అందిపుచ్చుకుని కథలుగా అందించే పతంజలిశాస్త్రిగారుండడం తెలుగువారి సుకృతం. వారి వాక్యం కనిపించినంత సులువుగా పాఠకుడికి పట్టుబడదు. చదివే నేర్పు, చదివి ఆలోచించగల ఓర్పూ అవసరం.

“ఎందుకింత శ్రమపడి చెరకు చీల్చి రసం తాగడం. డిస్పోజబుల్ గ్లాస్లో ఐస్ కలిపి గొంతులోకి దిగిపోయే రెడీమేడ్ సరుకు వుండగా అనే చదువరులకు ఓ దణ్ణం.” అని అంటారు రామచంద్రారెడ్డిగారు పతంజలి శాస్త్రిగారి కథల గురించి – “ఎంగిలి కాని వాక్యాలతో అసలు కథ” అనే వ్యాసంలో.

చెరుకుముక్క నవులుతూ… శాస్త్రిగారికి ఓ దణ్ణం పెట్టుకుంటున్నా..

(https://kothavakaya.blogspot.com)

( తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారికి అజో-విభో- కందాళం ఫౌండేషన్ వారు జనవరి 9 న ప్రతిభామూర్తి జీవిత కాల సాధనా పురస్కారం కాకినాడ లో ప్రదానం చేస్తున్న సందర్భంగా )

సుస్మిత

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎన్నో ప్రశ్నలకు జవాబులు ఇచ్చి, మరెన్నో భావాలకు పునాది వేసే శ్రీ శాస్త్రి గారు కదా పునర్మూల్యంకన వ్యాసమిది. అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు