“తలుగు” తెంపిన తెలుగు కథ!

ముస్లింలలో బోరేవాల తెగ పేద జీవితాల అభద్రతనీ ఆత్మగౌరవాన్నీ అత్యంత వాస్తవికంగా చిత్రించిన కధ ఇది. వస్తువు, రూపం ఎడం లేకుండా కలిసిపోయిన well made షార్ట్ స్టోరీ.

కొస మెరుపు కధలు , tricky ending  కథలూ ఎంత బాగా tackle చేసినా ఎక్కువ సార్లు తెలిపోతూ ఉంటాయి. ఇందుకు భిన్నంగా గొప్ప కధలు తరచూ చాకచక్యంతో కూడిన కళా వ్యూహం నుంచి నిర్మితమౌతూ ఉంటాయ్. కథను సరైన వ్యూహంతో నడపటమంటే చదివే వాళ్ళను ఎదో ఎదురుచూపుకు గురిచేయడం, ఒక anticipation తో ముంచెత్తటం. ఈ ఎదురు చూపును వీలున్నంత వరకు జరగబోయేదానినుంచి పక్కకు మళ్లించటం, అంటే ఒకరకంగా పాఠకుల్ని మిస్ డైరెక్ట్ చేయడం. ఈ మిస్ డైరెక్షన్ ను పకడ్బందీగా పట్టుకు రావడంలోనే అసలు కళ ఇమిడి ఉంది. ఈ రకం ప్లాట్ లో ప్రధాన పాత్ర  నిశ్చయం , గుప్తమైన పట్టుదలా కథ నడకకు ఆధారభూతమయ్యేట్లు చూసుకోవడం ఒక నిర్మాణ పద్ధతి. Somerset Maugham ఈ పద్ధతికి మెరుగు దిద్దాడు.

ఇలాంటి నిర్మాణంలో సాధారణంగా ఒక విశ్వసనీయమైన ప్రధాన పాత్ర అనుకోకుండా ఒక క్లిష్టమైన సమస్యలో ఇరుక్కుంటుంది. దాని నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నంలో  ఆ పాత్ర విఫలమవ్వడం , పరిస్థితి మరింత జటిలమై ఆ పాత్ర తెగించి ముందుకు పోవటం , తత్పర్యవసనానికి  గురికావడం. ఎదో ఒక సవాల్తోమొదలవ్వటం, మధ్యలో వైరం , ఘర్షణా ముదరటం, దాని తాలూకు ఫలితంతో ముగియటం. ఇదీ ఈ నమూనా క్రమం.

‘Rain’ అని Somerset Maughm ఒక కథ రాశాడు. అందులో Miss Thomson అని ఒక వ్యభిచారి ఉంటుంది. ఆమె activities తో విసిగెత్తిన  క్రైస్తవమతాచారి Davidson  ఆమెను ఎలాగైనా జైల్లో పెట్టించటానికి గవర్నర్ తో మాట్లాడి ఫోర్స్ తో ఒప్పిస్తాడు..ఇప్పుడు మిస్ Thompson  జైలుకు వెళ్లక తప్పని స్థితి. ఇలా ఒక అనివార్యమైన అర్జెంట్ సమస్యలో పడిన మిస్ Thompson ముందు గవర్నర్ ని ప్రభావితం చెయ్యటానికి ప్రయత్నిస్తుంది. అది బెడిసికొట్టటంతో మతాచారికి లొంగిపోతుంది. పూర్తిగా పరివర్తన చెందినట్లు అతన్ని మభ్యపెట్టి మెల్లగా అతన్ని తన ఆకర్షణలోకి లాక్కుంటుంది. ఆమె వ్యామోహంలో పడిన మతాచారి ఆ నేరభావంతో ఆత్మహత్య చేసుకుంటాడు. మరుసటిరోజు నుంచి Miss Thompson తన కార్యకలాపాల్ని యధావిధిగా ఇనుమడించిన ఉత్సాహంతో కొనసాగిస్తుంది. ఘర్షణ నిర్మాణంలో తెగువతో కూడిన నిశ్చయాన్ని ఒక లాజికల్ ఎండ్ కు తీసికొని వెళ్లే క్రమంలో రీడర్ మిస్ direction కి గురి కావటమే ఇక్కడి ప్రత్యేకత. అందుకే  కధ ఐపోయేవరకు Miss Thompson వ్యూహం పట్టుదల పాఠకులకు గానీ ప్రత్యర్థి పాత్రకు గానీ తెలీదు.

ఈ పద్ధతి గురించి మాట్లాడుతూ Damon Knight : ” In practice, what usually happens is that the author uses the conflict structure to misdirect the reader —- the real meaning of the story turns out to be something altogether different.” అని అంటాడు.

వేంపల్లి షరీఫ్ రాసిన ‘తలుగు’ ఈ పద్ధతిలో చాల క్రియేటివ్ గా imaginativeగా నిర్మితమయ్యిన కధ. తెలుగులో ఈ నమూనా కథకు ఇది సరైన  ఉదాహరణ. ముస్లింలలో బోరేవాల తెగకు చెందిన పేద జీవితాల అభద్రతనీ ఆత్మగౌరవాన్నీ అత్యంత వాస్తవికంగా కదిలించే రీతిలో చిత్రించిన కధ ఇది. వస్తువు, రూపం ఎడం లేకుండా కలిసిపోయిన well made షార్ట్ స్టోరీ.

కథలోకి వెళితే, గొడ్డుని కోసుకుని మాంసం అమ్ముకు పొట్టబోసుకునే పేద బోరేవాల ముస్లిం దౌలు. అదే ఊర్లో నివసించే మోతుబరీ, పెత్తందారీ  వెంకటప్ప. కడుపులో చచ్చిన దూడను యీన లేక చావటానికి సిద్ధంగా ఉన్న గేదెను దౌలుకు  1200లు తీసుకొని అంటగడతాడు వెంకటప్ప. దాన్ని , చావక ముందే ,ఎంత తొందరగా కోస్తే అంత సేఫ్ అయ్యే స్థితి దౌలుది. గేదె చచ్చిందంటే కొంప మునిగినట్లే. కనుక గేదెను ఇంటికి తెచ్చిన రాత్రే కొయ్యటానికి పూనుకునే లోపు అనుకోకుండా ఆ గేదె ఈనుతుంది. దూడ బతికే వుంటుంది. కొడుకు తో కలిసి ఆ దృశ్యాన్ని గొప్పగా అనుభూతి చెందుతాడు దౌలు. తమ కష్టాలు తీరినట్లే అని కుశాల పడతాడు. ఆనోటా ఈనోటా  ఇది విన్న వెంకటప్ప దౌలు మీద కోపంతో ఊగిపోతాడు.   దౌలు ఇంట్లో లేని సమయంలో ఎనుమును తన మనుషులతో ఇంటికి తెప్పించుకుంటాడు. పెద్ద మనుషుల్ని తీసుకుని దౌలు వెంకటప్ప ఇంటికెళతాడు. దౌలును క్రూరంగా కొడతాడు వెంకటప్ప. కనీసం తన డబ్బులు తనకివ్వమని అడిగినా కూదరదంటాడు . దౌలుకు  సహనం చచ్చి తెగించి తిరగబడతాడు. వెంకటప్ప తనమీదికెత్తిన కట్టెను అలాగే గాల్లో పట్టుకుంటాడు.కసికొద్దీ తన చేతుల్లోకి లాక్కుంటాడు. అతని వెనకాల దూరంగా ఎనుము  కొమ్ముల్ని నేలకేసి కొడుతూ తలుగు (కట్టు) తెంపుకుంటుంది.

ఈ కథని గమనించినప్పుడు పైన మనం చర్చించిన నిర్మాణ పద్ధతి పూర్తి స్థాయిలో కళాత్మకంగా అవసరమైన సృజనతో అమరిపోవటం కనిపిస్తుంది. “కథకు పనికి వచ్చే కధా వస్తువు జీవితపు బీటలనుంచి , ఎగుడుదిగుళ్లనుంచి, అరాచకం నుంచి రావాలి” అన్నాడు కొడవటిగంటి కుటుంబరావు. ఈ కథలో  మంచి కధా వస్తువుంది. ఇది క్రమబద్ధంగా సాఫీగా సాగిపోయే  రోజువారీ సంఘటనలకు చెందింది కాదు. ప్రధాన పాత్ర ఐన దౌలు తన ప్రమేయం లేకుండానే ఒక ఆరాచకానికి గురికావడముంది. ఆ పేచీ నుంచీ దాని అనివార్యతనుంచీ ఒక సవాలను స్వీకరించటముంది. అందులో భాగంగా వచ్చిన క్రైసిస్ ను ఎదుర్కోవడం ఉంది. తప్పించుకోలేని స్థితిలో తెగింపు చూపటం ఉంది. ఇదంతా నమ్మశక్యతను సంతరించుకోవటం ఉంది.

పాఠకుల్ని తాను చేస్తున్న పనినుంచి పక్కకు మళ్లించటంలో  నియంత్రించడంలో షరీఫ్ దిట్ట.నిత్యజీవితంలో రాజకీయ నాయకులూ , మేజీషియన్లూ  తాము చేస్తున్న పనినుంచీ  వ్యూహాలనుంచీ ఆడియన్స్ ను పక్కదోవ పట్టించి సక్సెస్ అయినట్లు   కళాకారులు పాఠకుల్ని బోల్తాకొట్టించి  రంజింప చేస్తారు. ఈ కధకుడు అక్కడితో ఆగకుండా కదిలించి ఆలోచింప జేశాడు.  విషవలయంలో చిక్కుకున్న పాత్రని తగిన తార్కిక ముగింపుకు , అనివార్య   తెగింపుకూ పట్టుకొచ్చాడు.ఎనుము ఈనబోవటాన్ని  చూపించబోయే ముందు పాఠకుల్లో ఆ స్పృహే లేకుండా చేసి అది కోసే దాకా బతికితే చాలు  అనే అదుర్దాతో  వాళ్ళు సతమతమయ్యేట్లు చేస్తాడు. ఆ తరవాత వెంకటప్ప రియాక్షన్ కూడా ఊహించిన దానికి  భిన్నంగానే  వుండటమూ ఈ స్కీం లో భాగంగానే జరిగిపోతుంది. చివరికి దౌలు ప్రతిఘటన ఎనుము కట్టు తెంపుకోవడం   దీని సహజ పరా కాష్ట అనే స్థాయిలో చోటు చేసుకుంటాయి.ముందునుంచే దౌలు పాత్రలో ఎంత తగ్గి వుండే స్వభావం ఉందో అంత కంట్రోల్డ్ అగ్రెషన్ ఉంది. ఇది చూపించటానికి మాంసం కొట్టు కరీం తో గొడ్డు మాంసం తినటానికి చెందిన సంభాషణ ఒకటి కధాక్రమంలో ఏర్పాటు చేస్తాడు రచయిత. అది గమనించిన పాఠకులకి దౌలు అంతిమ తిరుగుబాటు విశ్వసనీయత కు దూరంగా అనిపించదు.

పాలగుమ్మి పద్మరాజు ఒక సందర్భంలో అన్నట్లు సరైన కధకుడు భ్రాంతిమయ వాస్తవికతని గాక వాస్తవిక భ్రాంతిని కలిగిస్తాడు. ఈ కధకుడు ఆ పని చేస్తూనే అన్యాయం మీదా అడ్డగోలుతనం మీదా అనివార్యంగా ప్రతిఘటన రెక్కవిప్పుతుందనీ అదే న్యాయమనీ  చెప్పటమ్ కాకుండా కళ్ళకు కట్టినట్లు చూపగలిగాడు.అయితే కధ ప్రారంభంలో రెండు పేజీల్ని మించిన ఉపోద్ఘాతం అవసరం లేదనిపించింది నాకు. అది సాధించిన అదనపు ప్రయోజనం ఏంటో నాకు అర్ధం కాలా. అది లేకుండా చదివితే కధ  ఏమీ మిస్ కాకపోగా మరింత ఆసక్తిదాయకంగా తటాలున ప్రారంభమై ఉండేది. నాకనిపించిన ఈ ప్రారంభ సమస్య ఒక లోపం కాదు. ఈ కథను గొప్ప కథల జాబితాలో చేరకుండా అడ్డుకునే లోపం అసలు కాదు.

*

గుంటూరు లక్ష్మి నర్సయ్య

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సార్ మంచి కథను పరిచయం చేశారు. ధన్యవాదాలు

  • ఒక తెలుగు కథను తెలుగులో పరిచయం చేసే సమీక్షా వ్యాసంలో, 11 చోట్ల కథకు బదులు కధ, తోడుగా మరో పదమూడు అక్షరదోషాలు. కాకుండా, ఆంగ్ల లిపిలో 54 ఆంగ్లపదాలు-తెలుగు లిపిలో 24 ఆంగ్లపదాలు, అదనంగా ఆంగ్ల/తెలుగు లిపిల్లో మరో ఏడు ఆంగ్లపదాలు.

    ఎంతగా పట్టించుకోకుండా చదువుదామన్నా విషయం మీద దృష్టి నిలుపనివ్వకుండా ఎన్ని ఆటంకకంటకాలు.

    టి. చంద్రశేఖర రెడ్డి

  • తలుగు పై లక్ష్మీనర్సయ్య గారి విశ్లేషణ అద్భుతంగా ఉంది

  • చాలా బాగుంది సార్ మీ సమీక్ష….. వెంటనే బుక్ చదవాలనే కోరిక బలంగా నాటుకుంది….దొరికితే తప్పకుండా చదువుతాను….షరీఫ్‌ సార్ కి అభినందనలు… మీకు ధన్యవాదాలు సార్…

  • సార్ మీ విశ్లేషణ మరియు కథకులకు మార్గదర్శనం చాలా బాగుంది.రచయితకు ఎంతో ఉపయోగకరంగా ఒక పాఠం లాగా ఉన్నాయి.దయచేసి మీరు తెలిపిన కథల పిడిఎఫ్ పెడితే మా లాంటి ఎందరో పూర్తి కథ చదివితే ఇంకా లాభసాటిగా ఉంటుంది. మన్నే ఏలియా ఆదిలాబాద్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు