తప్పంతా ఇళయరాజాదేనా! ఇంతకీ మనకేం తెలుసని?

సెక్షన్ 14, కాపీరైట్ చట్టం ప్రకారం సాహిత్య, నాటక, సంగీత సృజనలపైన వాటి సృజనకర్తలకు హక్కులున్నాయి. ఆ సృజనకర్తల అనుమతి లేకుండా వాటిని ఎక్కడ పునరుత్పత్తి చేయకూడదనీ, భద్రపరచకూడదనీ (పైరసీ అనే అర్థంలో) బహిరంగ స్థలాలలో ప్రదర్శించకూదదనీ ఈ సెక్షన్ చెబుతున్నది.

తన పాటను మంజుమ్మేల్ బాయ్స్ అనే సినిమాలో వాడుకున్నందుకు ఇళయరాజా ఆ సినీ నిర్మాతలకు నోటిసులు పంపాడు. దాని చాలా మంది తప్పు పడుతున్నారు. అయితే, ఈ రాయల్టీకి సంబంధించిన చర్చ/గొడవ ఈనాటిది కాదు. 1960ల నాటినుండి ఉన్నదే. “పాట పాడినందుకు పారితోషకమే కాదూ నిర్మాతలు ఆ తదనంతరం రాయల్టీ కూడా చెల్లించాలి” అని వాదన చేసింది లతా మంగేష్కర్. “నిర్మాతలు మనకు డబ్బులు ఇస్తున్నారు కదా!? మళ్ళీ రాయల్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు” మహమ్మద్ రఫీ. ఆ విషయంలో ఇద్దరికీ భిన్నాభిప్రాయాలు వచ్చి రెండు మూడేళ్ళ దాక కలసి పాడలేదు.

ఆ తదనంతర కాలంలో ఎం.బీ. శ్రీనివాసన్ అనే దక్షిణ భారత కంపోజర్, కమ్యూనిస్ట్ ట్రేడ్ యూనియన్ నాయకుడు “ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ లిమిటెడ్ (IPRS)” అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ సంస్థ భారతదేశంలోని సంగీత సృజనకారుల హక్కులను కాపాడేందుకు వారిని రిప్రసెంట్ చేస్తుంది. ఆ సంగీత సృజనకారుల్లో గీత రచయితలూ, సంగీత దర్శకులు, సంగీత ప్రచురణకర్తలూ ఉంటారు. రేడియో, టీవిల్లో పాటలు వాడుకున్నందుకు గానూ, ప్రైవేటు షోస్ లో ప్రదర్శనలు ఇచ్చినందుకు గానూ వారి నుండి రాయల్టీ వసూలు చేసి తన ఫీజుని మినహాయించుకుని మాస్టర్ ఓనర్‌కి 50%, మిగతా 50% కంపోజర్, రచయిత, గాయకుడికి పంచుతుంది. ఒకనాడు కో-ఆపరేటివ్ సొసైటిగా మొదలైన ఈ సంస్థ  పూర్తిగా కార్పోరేట్ రూపాన్ని సంతరించుకుని మధ్య దళారి పాత్రను పోషించింది. అందుకే, తన 6000 పాటలకు గాను IPRS తనకు చెల్లించిన మొత్తం మరీ తక్కువ అని రాజా అందులో నుండి బయటకి వచ్చాడు. అప్పటి నుండే తనే తన రాయల్టీలను అడుగుతున్నాడు.

చట్టపరంగా చూస్తే సంగీత కారుడిగా తన సృజనపైన తనకు హక్కున్నది. అది పాటగా మారినప్పుడు ఆ పాట రాసిన రచయితకీ, పాడిన గాయకుడికీ హక్కు ఉంటుంది. బాలూ, చిత్ర – ఇళయరాజా రాయల్టీ విషయంలో చర్చ వచ్చినప్పుడు ఇళయరాజా తన వాదనను స్పష్టంగా చెప్పాడు “నేనేమీ మిమ్మల్ని పాడకుండా ఆపడం లేదు. మీరు పాటలు పాడటం ద్వారా డబ్బులు సంపాదిస్తే అందులో నా వాట రాయల్టీ నాకివ్వాలి. ఒకవేళ మీరు ఉచితంగా పాడితే నాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు పాడటం ద్వారా డబ్బులు అర్జిస్తున్నప్పుడు నా వాటా నేను అడగడంలో తప్పేమి ఉంది? ఆ పాట నాదే అయినప్పుడు నా వాటాను మీరు ఎలా నిరాకరిస్తారు?”. అంతే తప్పా బాత్రూముల్లోనో, కిచెన్‍లోనో, నలుగురూ కూడి నవ్వుకునే వేళలోనో,  పాడుకోవడంతో ఇబ్బందేమీ లేదు. ఈ చర్చ జరుగుతున్నప్పుడే రాయల్టీల విషయం చాలామందికి అర్థమైంది. ఆ పాటను పాడిన గాయకుడికి కార్యక్రమాల్లో పాడే హక్కు ఎంత ఉన్నదో, దానికి గానూ రాయల్టీ పొందే హక్కు సంగీతకారుడికీ అంతే ఉంది.

తనకు ఓ మ్యూజిక్ కంపెనీ బకాయిపడిన రాయల్టీ విషయమై కోర్టుకు పోయిన రాజాకు అనుకూలంగా తీర్పు రావడమే గాక, అదే కేసును ఇంకో కేసుతో కలిపి ఇచ్చిన తీర్పులో మద్రాస్ హైకోర్టు “ఇళయరాజాకే తన పాటలపై సర్వహక్కులు ఉన్నాయి” అని పేర్కొన్నది. దాంతో అప్పటి వరకు తాను చేసిన పాటలన్నిటికీ చట్టపరమైన హక్కును సంపాదించాడు. అయితే, ఎకో అనే కంపెనీ దానిపై మద్రాస్ హై కోర్టు ద్విసభ్య ధర్మాసనంకి అప్పీల్‌ చేసింది. ఆ ధర్మాసనం కూడా “మ్యూజిక్ కంపోజర్”గా తన హక్కు రాజాకు ఉంటుంది. మొత్తం పాటపై ఉండదు. ఎందుకంటే రచన కూడా దానికి దోహదం చేస్తుంది కనుక” అని చెప్పింది. కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నది.

ఇక ఇప్పుడు చర్చ జరుగుతున్న ‘మంజుమ్మెల్ బాయ్స్’లో ‘గుణ’ సినిమాలోని ‘కన్మణి’ పాట వాడుకోవడం విషయానికి వస్తే; తన అనుమతి లేకుండా సినిమాలో వాడుకున్నారు అని రాజా లీగల్ నోటిస్ పంపాడు. “పిరమిడ్ అనే కంపెనీ నుండి ఆ పాట వాడుకునేందుకు అనుమతిని తీసుకున్నాం” అని అంటున్నాడు సినిమా నిర్మాత. గతంలో తన పాటల హక్కులను మలేషియన్ బేస్డ్ పిరమిడ్ అనే కంపెనీకి రాజా ఇచ్చిన మాట వాస్తవమే. అయితే, కొన్నాళ్ళకే మళ్ళీ వాళ్ళ దగ్గరి నుండి హక్కులను వెనక్కి తీసేసుకున్నాడు. వాళ్ళ దగ్గర హక్కులే లేనప్పుడు ఆ సినిమా నిర్మాతలకు ఎలా ఇస్తారు అనేది ఇప్పుడున్న ప్రశ్న. కాపీరైట్ చట్టం ప్రకారం ఆ పాటను వాడుకున్నందుకు ఆ పాటను స్వరపరచిన రాజానే కాదూ ఆ పాట పాడిన గాయకుడూ, ఆ పాట రచయితా కేసు వేయవచ్చు. ఒకవేళ పిరమిడ్ తనదగ్గర హక్కులున్న కాలంలో అనుమతి ఇచ్చినా అది రాజా వరకు మాత్రమే. గాయకుడి, రచయిత హక్కులు కావు. ఈ విషయం తేల్చాల్సింది ఖచ్చితంగా మనమైతే కాదు. వారి కాంట్రాక్ట్ కాలం ఏమిటి? ఎప్పుడు వెనక్కి తీసుకున్నారనేది తెలిసిన వాళ్ళు మాత్రమే. ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం మేరకు “మంజుమ్మెల్ బాయ్స్” చిత్రీకరణకు ముందే రాజా హక్కులు వెనక్కి తీసేసుకున్నాడు అని తెలుస్తుంది.

మిగతా వాళ్ళ విషయంలోనూ ఈ వివాదాలు తలెత్తుతున్నా అది IPRS చూస్తుంది కనుక ఎవరికీ ఆ విషయాలు తెలియట్లేదు. ఇళయరాజా మాత్రం తనే dispute చేస్తున్నాడు గనుక చర్చ అవుతోంది. IPRS ఒక్క కోవిడ్ పాండెమిక్ సమయంలోనే దాదాపు 220 కోట్ల రూపాయల రాయల్టీ డబ్బులను మ్యుజిషియన్స్‌కి చెల్లించింది. IPRS అనేక మందిని రిప్రసెంట్ చేస్తూ రాయల్టీ వసూలు చేస్తున్నప్పుడు, అందులోని ఆర్థిక అవకతవకలను ప్రశ్నించి బయటకు వచ్చిన రాజా తన వాటా తను అడగడంలో తప్పేమి ఉంది? ఈ సమస్య ఒక్క రాజాదే కాదు. ఆమధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందిన  “Enjoy Enjaami” అనే పాటకు గానూ తమ రాయల్టీలు తమకు అందడం లేదని గీత రచయితా అరివు, గాయని ధీ, సంగీతకారుడు సంతోష్ నారాయణ్ ఫిర్యాదు చేశారు. ఇట్లా అనేక రాయల్టీ ఫిర్యాదులు ఉన్నాయి. అవేవీ చర్చకు రావడం లేదు. కారణం IPRS లేదా వారిని రెప్రసెంట్ చేస్తున్న ఏదో కంపెని వారి తరఫున నోటిసులు పంపడమే.

ఇళయరాజా తన చట్టపరమైన హక్కులను ఉల్లంఘించిన వారి నుండి న్యాయాన్ని కోరుతున్నాడు. మనం తేల్చుకోవాల్సింది న్యాయం వైపా? ఉల్లంఘనల వైపా అని.

*

అరుణాంక్ లత

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • హైకోర్టు స్పష్టం గా చెప్పలేదు
  ఇళయరాజా పక్షాన
  ఎకో కంపెనీ యే గెలిచింది..
  కానీ ఇళయరాజా మోరల్ రైట్ ని సపోర్ట్ చేసిందంతే..
  నిన్ననే వైర్ పత్రిక లో వచ్చింది

 • మనం బిజెపి వైపు ఉండాలి. ఎందుకంటే ఇళయరాజా బిజెపి వాడి కనుక.

 • 1960-70 లలో తరవాతా కూడా ఆలిండియా రేడియోలో ప్రసారం చేసిన పాటలకు గాయకులకి పారితోషికం ఇచ్చేవారని తెలుసు. ప్రోగ్రాం స్పాన్సర్ చేసినవారు ఇవ్వాలి లేదా టివి చానెల్ వారు ఇవ్వాలి. ఇస్తున్నట్టు లేదు. దోపిడి వ్యవహారమైంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు