తక్షణ న్యాయం – శాశ్వత అన్యాయం!

ఈ దేశంలో జనం ఒక భావోద్వేగ మూకగానో, ఉద్రేకాల గుంపుగానో కాక బాధ్యతాయిత సమాజంగా ఎప్పటికి ఎదిగేనో!!

ఒక దేశంగా, ఒక సమాజంగా “స్వతంత్ర” భారతంలో ఇప్పుడున్నంత అభద్రత, కల్లోలం, అనుమానం, సందిగ్దత ఇంతకు మునుపెప్పుడూ లేదేమో.  వ్యక్తిగత జీవితం అభద్రంగా, సామాజిక జీవితం కల్లోలంగా, భవిష్యత్తు సందిగ్దంగా పరిణమించి ఎప్పుడేం పిడుగు పడుతుందోనన్నట్లు జనం గాభరాగా చూస్తున్నారు.  భయం ఇప్పుడున్నంతగా ఇంతకు ముందెప్పుడూ ఇంతగా స్వైర విహారం చేయలేదు. ప్రజల అభద్రత ఏ స్థాయిలో పెరిగిందంటే చట్టాలు తమకి ప్రయోజనకరం, భద్రదాయకం అనే విషయం పక్కకెళ్ళి అవి తమకు నష్టకరమని భావించటం మొదలైంది. చట్టాల్ని, రాజ్యాంగాన్ని గౌరవించడం మానేస్తున్నారు.  చట్ట పరిధిలో తాము సుఖంగా వుండగలమని అనుకోవడం లేదు.  దానికి బాధ్యత చట్టాల్ని నిర్వీర్యం చేసిన ప్రభుత్వ యంత్రాంగానిదా లేక అసలు అవి పనికిరాని చట్టాలా అన్న విషయం పక్కన పెడదాం.  ముఖ్యమైన విషయం ఏమంటే అసలు చట్టాలకు పక్కగానో లేక విరుద్ధంగానో వెళ్ళడం కూడా ఒక విలువగా భావించే స్థితికి ప్రజలొచ్చేశారు లేదా తీసుకు రాబడ్డారు.  అలాగని ప్రజలేమీ చట్ట సంస్కరణల కోసమో లేదా చట్టాల అమలులో ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యాల మీదనో ఉద్యమించటం లేదు లేదా ఉద్యమించటానికి సిద్ధంగానూ లేరు.  కానీ చట్టాల్ని చేతుల్లోకి తీసుకొని వాటిని ఉల్లంఘించటాన్ని మాత్రం హర్షిస్తున్నారు.   ఇందుకు కారణాలేమిటన్నది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం.

ప్రజల్లో ఒక మూక మనస్తత్వం విపరీతంగా పెరిగిపోతున్నది.  ఆమాజిక జీవితం అస్థిరమై, ప్రజల్ని సంఘటిత పరిచి ఒక దిశానిర్దేశం చేయగల సానుకూల సామాజిక మార్పుల్ని తీసుకురాగల ఉద్యమ నాయకత్వం లేనప్పుడు కూడా ఈ మూక మనస్తత్వం ప్రబలుతుంది.  ఆ మూక తత్వంలో సాధారణంగా లోలోపలి అణచబడిన నిస్పృహ ఒక్కసారిగా హింసాత్మక రూపు తీసుకుంటుంది.  అలా చేయటాన్ని ఒక విలువగా ఆయా సమూహాలు భావిస్తాయే కానీ అవి చట్ట వ్యతిరేకమని పెద్దగా పట్టించుకోవు. ఒక దొంగ దొరికితే వాడిని చితకబాది చంపేయటంతో మొదలుపెడితే ఆవుల్ని వధశాలకి తరలిస్తున్నారన్న నెపం మీద మైనారిటీల్ని చంపేసే వరకు ఈ మూక మనస్తత్వం కనబడుతున్నది.  ఈ రెండు రకాల సంఘటనలు ఒకటే కాకపోవచ్చు కానీ ఆ రకమైన వాతావరణం సృష్టించబడటానికి ఒకే రాజకీయ, సామాజిక భావజాలం కారణం.   ఒక మైనారిటీ ఇంట్లో గోమాసం వున్నట్లు అనుమానం వస్తే చాలు ఆ ఇంటి మీద మూకుమ్మడిగా దాడి చేసి ఆ ఇంటి యజమానిని తన్ని చంపేయొచ్చన్న భావన ఊరకనే పుట్టదు.  గోవు, గోమాంసం చుట్టూ అల్లుకున్న రాజకీయాలు సృష్టించిన మూర్ఖ భావోద్వేగ వాతావారణమే ఒక చిన్న దొంగ దొరికితే కొట్టి చంపేయాలన్న ఉన్మాదానికి కూడా కారణభూతమౌతుంది.

క్రితం నెల దిశ అత్యాచార, హత్యానంతరం రేగిన కల్లోలం, ప్రజాగ్రహం, మీడియా హడావిడి మనకందరికీ తెలిసిందే.  నిజానికి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా వెంటనే బైటపడేది లా అండ్ ఆర్డర్, పోలీసుల విధి నిర్వహణా వైఫల్యమే.  ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతున్న పిల్ల కొన్ని గంటల్లోనే ఓ బ్రిడ్జి కింద సగం కాలిన శవమై కనబడితే తట్టుకోకగలగటం ఏ కుటుంబానికైనా కష్టమే.  అదే విషయం ప్రజలందరినీ కదిలించింది.  తల్లిదండ్రుల్ని వణికించింది.  నగరమన్నా, చీకటన్నా, ఏకాంతమన్నా ఆడపిల్లలు భయపడేలా చేసింది.  ఏ నేర చరిత్ర లేని వాళ్ళు కూడా “అడ్రినాలిన్ ఫోర్స్”లో హఠత్తుగా అప్పటికప్పుడు నేరస్తులై పోయే భీతావహ పరిస్తితుల్లో ఎవరైనా పోలీసుల నుండి తక్షణ సాయం ఆశించటం సహజం.  దిశ కుటుంబం కూడా అదే పని చేసింది.  కానీ పోలీసుల నుండి వారిదైన పద్ధతిలో అతి సహజంగానే నిర్లక్ష్యమే సమాధానంగా వచ్చింది.  పోలీసులు వెంటనే స్పందిస్తే ఆ అమ్మాయి బతికేదా లేదా అనే ప్రశ్న ఎవరైనా వేయొచ్చు కానీ బతికే అవకాశం వున్న చోట కూడా పోలీసుల స్పందన అలాగే వుంటుందనేది విషాద వాస్తవం.  ఇంతకు ముందు వరంగల్ యాసిడ్ దాడి సందర్భంగా కూడా ఒక అమ్మాయి చనిపోయినప్పుడు కూడా ముందు పోలీస్ నిర్లక్ష్యమే బైటపడింది.  దాడికి గురైన ప్రణతి కుటుంబం ముందుగానే ప్రధాన నిందితుడి మీద ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.  పోలీసులు తమ నిర్లక్ష్యం గురించి ఆరోపణలొచ్చిన ప్రతిసారీ తమ వైఫల్యాల్ని తిప్పి కొట్టడానికి, అపరాధ భావనని తుడిచి పారేయటానికి ఏం చేయాలో అదే చేసారు రెండు సార్లు.  అదే ఎన్ కౌంటర్.  అంతే.  చేతకాని వారిగా ముద్రపడిన పోలీసులు ఒక్క రాత్రిలో హీరోలై పోయారు రెండు సందర్భాల్లోనూ.  రెండు సందర్భాల్లోనూ “హీరో” అయిన అప్పటి ఎస్పీ/ఇప్పటి కమిషనర్ గారు రాఖీలు కట్టించుకున్నారు.  పూల వానలో తడిసిపోయారు.  తాము చేయాలనుకున్నదేదో పోలీసులు చేసారు కాబట్టి హర్షించటంలో కూడా ప్రజల మూక మనస్తత్వమే వుంది. విక్టింస్ తిరిగి ఎలాగూ రారు కానీ వారికి ఈ ఎన్ కౌంటర్లు ఏదో గొప్ప న్యాయం చేసినట్లు సాధారణ ప్రజలు ఫీలై పోయి పోలీస్ హింసని ఆమోదించేలా మీడియా తన సాంస్కృతిక దగుల్బాజీ దళారీ పాత్రని పోషిస్తుంది. నిజానికి నిందితుల కుటుంబాల్లో విషాదమే కొత్త హింసాత్మక పరిణామం.  సాధారణంగా ఎన్ కౌంటర్ చేయబడిన నిందితులెప్పుడూ కింది కులాలకి, అల్పాదాయ వర్గాలకి చెందిన వారే అయుంటారు.  ఇందులో సందేహం లేదు.  వారెంత దుర్మార్గులైనప్పటికీ వారి కుటుంబ సభ్యులు, ఆలు బిడ్డలు దుర్మార్గులు కారు కదా.  వారి పిల్లలకి సంఘంలో దొరికే స్థానం ఏమిటని కానీ, వారి భవిష్యత్తు ఏమిటనేది ప్రభుత్వం కానీ, మీడియా, ప్రభుత్వం, అలాగే భావోద్వేగాలతో కుదేలైపోయే జనం కానీ పట్టించుకోరు.  టీవీల్లో సీరియళ్ళతో పాటు, అత్యాచార వార్తల్ని, నిందితుల ఎన్ కౌంటర్ వార్తల్ని ఒకే ఊపులో చూసేస్తారు.  ప్రజలు ఎప్పుడు దేనికి ఎలా స్పందించాలో మీడియా నియంత్రించేస్తున్నది. ఎన్ కౌంటర్లు చేసిన పోలీసులకి, వారి “వీరోచిత” కార్యానికి చప్పట్లు కొట్టే ప్రజలకి వాస్తవాలతో పని లేదు.  ఈ సమాజంలో అదే చిట్ట చివరి నేరం అన్నట్లు మూక సంబరాలు చేసుకుంటారు.  “ఆ తుపాకులకు వందనం” అంటూ సినిమా హీరోలు ట్వీట్స్ చేస్తారు.  అవును ఎందుకు చేయరు?  సినిమాల్లో వాళ్ళు కూడా ఇటువంటి పోలీసు స్వభావంతో వుండే హీరోలే కదా!

జాగ్రత్తగా గమనిస్తే మన వర్తమాన రాజకీయ, సాంస్కృతిక వాతావరణంలో చట్టాన్ని వ్యతిరేకించే స్వభావంతో కూడిన అంశాలు పుష్కలంగా కనిపిస్తాయి.  అన్యాయానికి వ్యతిరేకంగా సినిమాల్లో హీరోలు చేసే హింసాత్మక చర్యలు కానీ, సంకుచిత మత దృక్పథంతో భావోద్వేగాల్ని రెచ్చగొట్టే రాజకీయ భావజాలాలు కానీ చట్ట వ్యతిరేక చర్యల్ని ఒక విలువగానే చూపిస్తుంటాయి.  ఎన్ని సినిమాల్లో హీరోలు భగవద్గీతలో కృష్ణుడు మీదకి నెపం పెట్టి హింసని ప్రాక్టీస్ చేయలేదు?   “పోకిరీ” సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ అయిన హీరో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని అమలు చేసే చట్ట వ్యతిరేక వ్యక్తిగత హింసని శ్లాఘిస్తూ దర్శకుడు మరో పాత్ర చేత “నా కొడుకు వ్యవసాయం చేస్తున్నాడు.  కలుపు మొక్కల్ని ఏరిపారేస్తున్నాడు” అన్నప్పుడు ప్రేక్షకుల విజిళ్లతో థియేటర్లు హోరెత్తిపోయాయి.  “అమ్మ తోడు… అడ్డంగా నరుకుతా” అని మరో హీరో అన్నప్పుడు అది కాసుల పంట పండించింది.  ప్రజలు చట్ట ప్రక్రియకికి వ్యతిరేకమైన తక్షణ న్యాయాన్ని ఎందుకంతగా ఆశిస్తున్నారు?  అది బహుశా చట్టాల బలహీనతలు, అమలు యంత్రాంగం నిర్లక్ష్యం, భయంకర అవినీతి, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన రాజకీయులు, వారి ప్రభుత్వాలు కారణం.

అసలు విశ్వాసాలు చట్టాలకి లోబడి ఉండవని ఎంతమంది పాలకులు కోర్టు తీర్పుల్ని ధిక్కరించలేదు?  శబరిమల ఆలయంలోకి స్త్రీల ప్రవేశం గురించి అధికార పార్టీ పాత్ర గురించి మనకి తెలియనిదా?   ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడే స్వయంగా కోర్టు తీర్పుని తప్పు పట్టి మరీ తీర్పు అమలుకి వ్యతిరేకంగా మూకోన్మాదంలో వున్న జనాన్ని ఎంత రెచ్చగొట్టాడంటే పోలీసు యంత్రంగామే శాంతి భద్రతల పరిస్తితి దృష్ట్యా ఇరుముడితో వచ్చిన స్త్రీలని స్వయంగా వెనక్కి పంపేసారు.  మత విశ్వాసాలతో ఊగిపోయే ప్రజలకి చట్టం ప్రకారం తీర్పుని వ్యతిరేకిద్దాం, అప్పటి వరకు తీర్పుని అమలు కానిద్దాం అనే నాగరీకమైన, సంస్కారవంతమైన దృక్పథం కొరవడి అంతా అప్పటికప్పుడే తేలిపోవాలి అనే ఉద్రేకమే ఎక్కువ.   ఆ మాటకొస్తే బాబ్రీ మశీదు విధ్వంసంలో కూడా మత రాజకీయం ఈ మూక మనస్తత్వాన్నే ఉపయోగించుకొని అన్ని చట్టబద్ధ నిషేధాల్ని ఉల్లంఘిస్తూ లబ్ది పొందింది   అయితే దీనికి ఎవరు బాధ్యులనేది స్పష్టమే కదా!

చట్టాల్ని నమ్ముకుంటే న్యాయం జరగదనే బలమైన పాయింటే చట్ట వ్యతిరేక ఆచరణలోని అన్యాయాల పట్ల నోరు మూసేలా, మూయించేలా చేస్తుంది.  ఈ అభిప్రాయం సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి నోటి నుండే, అదీ రాష్ట్ర శాసనసభలోనే వచ్చింది.  ఆయన దిశ హత్య కేసు అనంతరం జరిగిన నిందితుల ఎన్ కౌంటర్ సందర్భంగా చేసిన చట్ట బద్ధ సంస్థ అయిన జాతీయ మానవ హక్కుల కమిషన్ని ఉద్దేశించి భయంకరంగా వెటకారం చేసారు.  ఎన్ కౌంటర్ చేసిన పోలీసులకి, చేయించిన (?) కేసీఆర్ కి శాసనసభలోనే హాట్సాఫ్ చెప్పారు. ఒక ముఖ్యమంత్రే న్యాయ ప్రక్రియని వెటకారం చేస్తూ చట్ట వ్యతిరేక హత్యల్ని శ్లాఘించటం ఏ సందేశాన్నిస్తుంది?  అంటే శాసనకర్తలకే శాసనాల్ని గౌరవించే బాధ్యత, జవాబుదారీతనం లేదనుకోవాలా?  ఇంక ప్రజలు చట్టాలకి అతీతంగా తక్షణ న్యాయం కోసం మూక మనస్తత్వంతో ప్రవర్తిస్తే అందుకు ఎవరు బాధ్యులు?  అసలు గుజరాత్లో జరిగిన పాలకుల ప్రేరేపిత మారణహోమం ప్రజల్ని ఏ వైపుకి నెట్టిందో మనకి తెలియంది కాదు.  అక్కడ ప్రజలు హింసాత్మకంగా విభజింపబడ్డారు.

చట్టాలు ప్రజల్ని శిక్షించటానికి వున్నాయనే నమ్మకాన్ని బ్రిటీష్ కాలం నుండీ మన దేశంలో బలంగా ఏర్పరచటం జరిగింది.  చట్టాలు భరోసని, భద్రతని కల్పించి, హక్కుల్ని పరిరక్షించే రాజ్యాంగ సాధనాలుగా కాక చట్టాలు కేవలం శిక్షించటానికి ఉద్దేశించినవిగా ప్రొజెక్ట్ చేయటం జరిగింది.  అంటే ప్రజలు నేరాలు చేస్తుంటారు.  ప్రజలు చేసే నేరాలకి శిక్షలు విధించటం ద్వారా నేరాల కట్టడి జరిగి సమాజం శాంతియుతంగా వుంటుందనే వక్రీకరించబడిన అవగాహనే ప్రధానంగా వుంది.  స్వతంత్రం వచ్చాక కూడా ఈ పరిస్తితి మారలేదు.  అందుకే ప్రజలు ఈ చట్టాలు తమకి వ్యతిరేకంగా వున్నాయని భావిస్తుంటారు.  వాళ్ళు తక్షణ న్యాయం కోసం చట్ట వ్యతిరేక సంస్కృతిని ప్రోత్సహిస్తుంటారు.  స్వార్ధపర శక్తులకి ఇంతకంటే ఏం కావాలి?
****

ఈ దేశంలో జనం ఒక భావోద్వేగ మూకగానో, ఉద్రేకాల గుంపుగానో కాక బాధ్యతాయిత సమాజంగా ఎప్పటికి ఎదిగేనో!!

*

అరణ్య కృష్ణ

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీరు వ్రాసిన విషయములకు మతము ప్రధాన పాత్ర పోషించింది ,పోషిస్తున్నది .

  • మతం కంటే మత రాజకీయాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

  • కొంచెం ఘాటుగా నిజాలు చెప్పారు సార్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు