తండ హరీష్ గౌడ్ కవితలు రెండు

1

ఏకాంతద్వీపంలోంచి సామూహికంగా

నేను
ఏకాంతద్వీపంలోంచి
సమూహంలోకి వచ్చాను

నాలుగు భుజాలు
బాధ్యతలను మోస్తున్న
సమాజముఖచిత్రం
కంటబడింది

ఆకులురాలిన చెట్టు
చిగురించడమెలాగో
నేర్పటం చూశాను

బటన్లరిగిన కీపాడ్ లోంచి
బతుకుదృశ్యాలను
పోగు చేసుకున్నాను

కళ్ళు మసకబారే సమయంలో
ఇంట్లోకి దారిని చూపే
వీధిలైట్ లాంటి
మనుషుల అవసరాన్ని కూడా గమనించాను

ఎందుకో
కిటికీలను చుట్టుకున్న
తెరల్లోంచి
ఇన్నాళ్ళు వెలుపల కురుస్తున్న
ఆహ్లాద చినుకులను లెక్కించలేకపోయాను

పూర్తిగా ఇప్పుడు
నాలోపలికి
ప్రేమపూర్వక వర్షాన్నే కాదు
ఆరురుచుల
ఆనంద బాధామయజీవితాన్ని కూడా
స్వాగతిస్తున్నాను

మనిషిని కదా
ఎన్నాళ్ళని
నాకు నేనుగానే
కలుగులో దాక్కుంటాను
ఒంటరితనాన్ని మోసి మోసి
సగం కాలిన శవాన్నయ్యాను

ఏకాంతంలోంచి దూరంగా
అందరి మనసుల మమతల్లోకి దగ్గరగా
సామూహిక ప్రేమయుద్ధం చేయటానికి
బయలుదేరాను

2

మొగ్గతొడిగిన ప్రాణం

మా ఇంటివెనకున్న
మర్రిఊడల వేలు పట్టుకొని
ఊయలూగాను

ఆకాశంరంగు
నా ముఖం నిండా
ప్రేమనదయి కుమ్మరించబడింది

అప్పుడే
ప్రకృతి
మబ్బుచీర కట్టుకొని
ముస్తాబవుతుంది

వీస్తున్న గాలి
చల్లగా తాకుతూ
ఆనందమనే బూస్టర్ డోస్ వేసింది

కళ్ళల్లోకి
రంగులప్రపంచం
దూరినట్టయింది

అంతలోనే
కొత్తగా కళ్ళను తాకించుకున్న
అనుభూతి

‘మా ఊరు
మా ఇల్లు
ఇంటివెనుక మర్రిచెట్టు
అమ్మ,నాన్న
దోస్తులు

వీళ్ళను  కలిసినప్పుడల్లా
నా పాతకళ్ళను
ఎవరో వచ్చి
దొంగిలిస్తారనుకుంటా’

అప్పటినుంచీ
కొంతకాలంపాటు
లోకమంతా
హాయిగా
నవ్వుతూ కనిపిస్తుంది

ఊరు నుండి తిరిగొస్తున్నప్పుడు
కొత్తగా చిగుర్లేసి
మొగ్గతొడిగిన ప్రాణమొకటి
నాలోపలికి దారులు వేసి
కొంతకాలం పాటు
జన్మదినాన్ని జరుపుకుంటుంది.

*

తండ హరీష్ గౌడ్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రెండు కవితలు ఫ్రెష్ గా ఉన్నాయి. శుభాకాంక్షలు సార్.

  • “బటన్లరిగిన కీపాడ్ లోంచి
    బతుకుదృశ్యాలను
    పోగు చేసుకున్నాను”
    చాలా అరుదైన, అద్భుతమైన వర్ణన….

    బాగుంది అన్న…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు