తండా వాళ్ల అమ్మాయి

టు మా వూళ్లకు చుట్టు పక్కలంతా కొండలూ, గుట్టలూ, అడువులే. వాటిల్లో తండాలు. అన్నీ చిన్న చిన్న తండాలే. యాబయి, అరవయి ఇళ్లుంటాయి. ప్రతింట్లో ఒక ఆవయినా, దూడయినా ఉండాల్సిందే. వాళ్లు వాట్ని తమతో పాటు చేలకి తీసుకెళ్లి మేపు కొస్తుంటారు. చేలల్లో మిరపా, పత్తీ, బంతిపూల పంటలు వేస్తారు.

అప్పుడప్పుడు పసిపిల్లలకి ఒంట్లో బాగో లేకపోతే యంత్రాల కోసవో, తాయెత్తు కోసవో, డాటరు కోసవో మా వూరొస్తుంటారు.

దసరా పండగప్పుడు మామూళ్ల కోసమని ఆడవాళ్లు పదిమంది వరకూ వచ్చి, దారిలో చేతులు పట్టుకొని చుట్టూ తిరుగుతూ లంబాడి పాటలు పాడి పదోపరకో వసూళ్లు చేసుకొని పోయేవాళ్లు.

వాళ్లలో ఒక ముసలావిడ చిత్రంగా అద్దాలున్న లంబాడి బట్టలు కట్టుకు వచ్చేది. చేతుల నిండా గాజులు తొడుక్కుని, పచ్చబొట్లు పొడిపించుకుని ఉండేది. ఆమె ముందుగా పాటెత్తుకునేది. మిగతావాళ్లు ఆమెతో కలిసి పాడేవాళ్లు. కొన్నాళ్ల క్రితం ఆ ముసలావిడ చనిపోయింది. ఇప్పుడు ఎవరూ పెద్దగా లంబాడి పాటలు పాడటం లేదు. వాళ్ల బట్టలు కట్టుకు రావడం లేదు. మాములుగానే వచ్చి కనపడ్డవాళ్ల దగ్గరకు, కొట్ల దగ్గరకు వెళ్లి డబ్బులడిగి తీసుకుపోతున్నారు. వాళ్లలో కొందరు పిల్లలు కూడా ఉండేవాళ్లు. మా కుర్రవాళ్లకు ఆ లంబాడి ఆడవాళ్లని చూడటమంటే చాలా ఇష్టంగా ఉండేది.

లంబాడి ఆడవాళ్ల గురించి మా కుర్రవాళ్లలో చాలా కథలు ప్రచారంలో ఉండేవి. వాళ్లు ఎర్రగా మెరిసిపోతూ చాలా అందంగా ఉంటారని, ఎవరన్నా నచ్చితే వాళ్లతో వస్తారని, వాళ్లకి వరసలు వుండవనీ, ఒక సారయినా వాళ్లతో గడపాలని కుర్రవాళ్లంతా చెప్పుకొనేవాళ్లు.

ఒక్క లంబాడి పిల్లనైనా లేపుకుపోవాలని కూడా అనుకునేవాళ్లు. కొందరయితే చేసుకుంటే లంబాడీ పిల్లనే పెళ్లి చేసుకుంటామని శబదం చేసేవాళ్లు. అందుకే లంబాడి ఆడవాళ్లు మా ఊరొస్తే మాత్రం కన్నార్పకుండా వాళ్లకెళ్లే గుడ్లు అప్పగించి చూసేవాళ్లం.‌ వాళ్లు కొటేరు ముక్కుల్తో, బిగువయిన పెద్ద గూడలతో, బలమయిన కాళ్లతో, ఎర్రటిరంగుతో మమ్మల్ని ఆకర్షించేవాళ్లు.

నాకు వాళ్లంటే భయం. వాళ్లని చూస్తున్నామని వాళ్లకు తెలిస్తే కొడతారేమోననుకుని భయపడేవాణ్ణి. నా తోటి కుర్రవాళ్లకు మాత్రం ఆ భయం ఉండేది కాదు.

మా అన్నయ్యకైతే అసలు భయం లేదు. వాడెప్పుడూ వాళ్ల గురించే మాట్లాడేవాడు. వాళ్లు కనబడితే వెళ్లేవరకు వాళ్ల చుట్టూ తిరిగేవాడు. వాడికి వాళ్లంటే యావ. అప్పుడప్పుడు బండేసుకుని తండాలకు కూడా పోయి వచ్చేవాడు. అక్కడ ఒకరిద్దరు మొగపిల్లల్ని మచ్చిక చేసుకున్నాడు. వాళ్ల ద్వారా ఒక్క లంబాడి అమ్మాయినైనా అనుభవించాలని వాడి ఆశ.

ఈ విషయం ఎక్కడ మా పెదనాన్నకి తెలిసిద్దోనని నాకు భయం పుట్టేది. ఈ వ్యవహారం తండాలో మొగవాళ్లకు తెలిస్తే వాణ్ణి చంపుతారని కూడా ఒణికి పోయేవాణ్ణి. వాడు మాత్రం ఇవి ఏవీ పట్టించుకోకుండా తన ప్రయత్నాలు తను చేసుకుంటూ ఉండేవాడు.

ఎండాకాలం మొదలయ్యే ముందు మా వాడు కొత్తగా ఈతకల్లు అమ్మే వ్యాపారం మొదలుపెట్టాడు. వేరే వూళ్లో తనకు తెలిసిన కల్లుగీసే ఆయన దగ్గర రెండు పెద్ద క్యానుల నిండా కల్లు తీసుకొచ్చి ఊళ్లో అమ్మటం వాడి వ్యాపారం. అది చిన్నగా పుంజుకుంటోంది.

ఒక రోజు తన తండా సావాసగాడు వాడి దగ్గరకొచ్చి “కొత్తగా మాకు గద్వాల్నుంచి వో ఇరవై మందిదాకా ముఠావాళ్లు వచ్చారు. ఆడామగా, పిల్లాజెల్లా అంతా కల్లు తాగుతారు. ఎక్కడన్న దొరుకుతదేమో చూడమని చెప్పారు. వాళ్లు కూడ మా లంబాడోల్లే. మాడిజాం ఒక క్యాను తీసుకురా. వాళ్లకి పోసి అక్కడే డబ్బులు తీసుకొని వచ్చేద్దువు” అని చెప్పి పోయాడు.

ఈ వ్యాపారం మొదలుపెట్టాక ఎక్కడా పెద్దగా బయటికి తిరగడం వీలుపడని మా వాడికి ఇది మంచి అవకాశంగా తోచింది. అదీగాక, ఆ ముఠావాళ్లు లంబాడోళ్లు అనే సరికి ఆడవాళ్లని చూడొచ్చని తెగ సంబరపడ్డాడు.

ఆ సాయంత్రం మా వాడూ, నేనూ కలిసి తన సావాసగాడి తండా బయలుదేరాం. నిండా కల్లున్న క్యాను పట్టుకొని వెనకమాల బైకు మీద కూర్చున్నాను. మా వాడు బండి తోలుతూ  దారిపొడుగునా వాళ్ల గురించే చెబుతూ ఉన్నాడు. నేను అన్నిటికీ ఊ కొడుతూ ఉండిపోయాను. వాళ్లంటే వాడికి అంత వెర్రి ఎందుకో?

తండా చేరినాక తన సావాసగాడికి ఫోను చేస్తే మా దగ్గరకు వచ్చి కలిశాడు. వాళ్లకి మిరపకాయలు కోయను వచ్చిన ముఠావాళ్ల వద్దకు తీసుకుపోయాడు.

వాళ్లు తండాకు కాస్త దూరంలో పంటలేని చేలో కర్రలు పాతి, పట్టలు కట్టుకొని, చుట్టూ చిన్న పాకల్లాగా వేసుకొని ఒక్క చోటే ఉన్నారు. ఒక్కొక్క పాకలో ఒక కుటుంబం ఉంటుంది.

ఆ పాకల ముందు రాళ్లు పేర్చి పొయ్యిగడ్డలు చేసుకుని వాటి పక్కనే ఏరుకొచ్చిన కర్రా, కంపా, చిదుగూ, చిత్తా మోపులు పెట్టుకున్నారు. ఆడవాళ్లు పొయ్యి ముందు కూర్చుని, జొన్నరొట్టెలు ఒత్తుతూ, పెనం మీద కాలుస్తున్నారు. మెళ్లో తాళిబొట్టు, నల్లపూసలదండ, కాళ్లకి కడియాలు ఉన్నాయి. అందరూ గొంతుక్కూర్చొని  రొట్టెలు కాల్చే పనిలో ఉన్నారు.

మేము అక్కడికి వెళ్లగానే అంతా గుమ్మిగూడారు. అంతా ఇరవై పాతిక  మంది దాకా ఉంటారు. తండా సావాసగాడు “ఇయిగో కల్లొచ్చింది. కావాల్సినోల్లు పోపిచ్చుకొని తాగండి” అన్నాడు.

బైకు దిగి క్యాను దింపుతుంటేనే అందరూ మా దగ్గరకు వచ్చారు. మేము ఆ క్యాను తీసుకుపోయి ఆ పాకల మధ్యలో ఉంచాం. అక్కడ వెల్తురు బాగుంది. పక్కనే కర్ర పాతి దాని మీదకి ఎక్కన్నుంచో తీగలాగి బల్బు తగిలించారు. అదే ఆ పాకలన్నిటికీ వెల్తురిచ్చేది. అందుకేనేమో వాళ్లంతా పాకల్లో ఉండకుండా బయట చేరి ఉన్నారు.

క్యాను మూత తియ్యగానే తేనెటీగల్లా అంతా చుట్టూ చేరారు. అందులో చీమిడికారుతున్న చిన్నపిల్ల నెత్తుకున్న ఒకాయన “ఇయ్యి చెట్టు కల్లేనా?” అనడిగాడు.

మా వాడు ఆయన వైపు చూసి “చెట్టు కల్లేనన్నా! కావాలంటే తాగు. లేకపోతే లేదు” అన్నాడు కరుగ్గా.

ఆయన “కాదులేన్నా! చిన్న పిల్లలకి కూడా తాపుదాం, మంచిదని. ఒకేళ మందుబిళ్లలు కలిపుంటారేమోనని అడిగా” అన్నాడు.

దానికి మావోడు కోపంగా “మందుబిళ్లలు కలపాల్సిన అవసరం నాకెందుకు?” అన్నాడు.

తర్వాత అందరూ చెంబులూ, తపెలాలూ, నీళ్ల బాటిల్లు పట్టుకొచ్చి, వాళ్లకి ఎన్ని చెంబులు కావాల్నో పోయించుకుపోతున్నారు. ఆడవాళ్లు కూడా వచ్చి పోతున్నారు.

మా వాడు డబ్బులు తీసుకుంటూ ఎవరెవరికి ఎంతెంత కావాల్నో తన దగ్గరున్న కల్లుచెంబుతో కొలిచి పోస్తున్నాడు. వాళ్లందరూ ఎగబడకుండా ఒక్కొక్కరిని పోయించుకు వెళ్లమని చెబుతూ తండా సావాసగాడు పెత్తనం చేస్తున్నాడు. పోయించుకున్నోళ్లు ఎవరి పాకల్లోకి వాళ్లు పోయి వాటిని దాచిపెట్టి వస్తున్నారు. కొందరు పక్కకెళ్లి తాగుతున్నారు.

కాసేపట్లో అందరూ అయిపోయారు. క్యాను కూడ ఖాళీ అయింది. అడుగున ఒక చెంబు మిగిలిందంతే!

ఆ రోజు మా వాడికి డబ్బులు బాగా వచ్చాయి. కల్లంతా ఒక్కచోటే, అదీ కాసేపట్లో అమ్ముడయ్యే సరికి వాడు ఆనందపడ్డాడు. అప్పటికే చీకటి పడింది. ఇక బయలుదేరదామనుకుంటుంటే ఒకమ్మాయి గళాసు తీసుకొచ్చి అడగటానికి బిడియపడుతూ నిల్చుంది.

తండా సావాసగాడు “ఆ గళాసుకి కావాలా?” అనడిగాడు.

ఆ అమ్మాయి కాస్త తల వంచి “అవునని” తలాడించి గళాసు అతనికిచ్చింది.

మా వాడు ఆ గళాసు నిండా కల్లు పోసి, ఆ పిల్ల చేతికిచ్చాడు. అది తీసుకుని ఆ అమ్మాయి వెళ్లబోతుంటే తండా సావాసగాడు “డబ్బులు త్యాపో” అన్నాడు. ఆ అమ్మాయి తలకాయ ఊపింది. మా వాడు “వద్దులే పో” అన్నాడు.

ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసి వెళ్లిపోయింది.

ఆ అమ్మాయికి పదహారేళ్ల వరకూ ఉండవచ్చు. మంచి రంగు. సన్నగా కాస్త పొడుగున్న ముక్కు. దానికి పుడగుంది. కళ్లు పెద్దవి. మెళ్లో ఏదో పిచ్చి దండ వేలాడేసుకుంది. జడ ముందుకి వేసుకుని చేత్తో పట్టుకుంది. చిన్నగా నడిచిపోయింది. అదీ ఆ పిల్ల. ఆ పిల్ల కూడా కల్లు తాగుతుందంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. అవి మజ్జిగ నీళ్లనుకొని కొనుక్కొని పోయి ఉంటుంది అని నా నమ్మకం.

మేవు ఆ తండా సావాసగాడికి చెప్పి బండి మీద క్యానుతో బయలుదేరాం. తండా దాటి ముందుకి పొయ్యాక మా వాడు బండి ఆపి సిగిరెట్టు ముట్టిచ్చుకొని డబ్బులు లెక్క చూసుకున్నాడు.

“ఈ రోజు బాగా లాబం వొచ్చింది” అన్నాడు.

నేను “అయ్యి చెట్టుకల్లేనా? నేను కూడ కాత్త తాగుతా. వొళ్లు కాక జేసింది. తగ్గిద్ది” అన్నాను.

మావోడు నా వైపు తిరిగి “చెట్టుకల్లు కాదు, పాడు కాదు. మనకిచ్చే నాయాలే సగం మందుబిళ్లలేసి జేసినియి. ఇంక చెట్టుకల్లు యాన్నుంచొత్తయి. ఇందులో గూడ పదిచెంబులు కల్లుబోసి, బిళ్లలేసి మొత్తం నీల్లు బోసా. ఈ ఇరవయి లీటర్ల క్యానులో పది చెంబులే కల్లు” అన్నాడు.

“మరి వాళ్లకి ఇది తెలిత్తే ” అన్నా.

“వాళ్లకి దెలిసినప్పుడ్లే” అని బండెక్కాడు.

“ఆడోల్లు మాత్తరం బలే వున్నర్రా! అసలు సివర్లో గలాసు పట్టుకొచ్చిన పిల్లయితే ఏవుందిలే..” అన్నాడు. దారి సాంతం ఆడాళ్ల గురించే మాట్లాడుతూ ఉన్నాడు. అంత ఆదరబాదరాగా కల్లమ్ముతూ వాడు ఆడవాళ్లనెప్పుడు చూశాడో?

బాగా చీకటి పడినాక కానీ మేవు ఇళ్లు చేరలేదు.

ఆ తండా ముఠావాళ్లు మా వాణ్ణి ప్రతి ఆదివారం కల్లు తీసుకురమ్మన్నారని తండా సావాసగాడు ఫోన్ చేసి చెప్పాడు. అప్పట్నుంచి మా వాడు ప్రతి ఆదివారం తప్పకుండా కల్లు తీసుకొని ఆ ముఠావాళ్ల కాడికి వెళ్తున్నాడు. నాకు వాడితో తడవకి పోవటం వీలు పళ్లేదు. వాడి వద్దకు ఏ పనీబాట లేకుండా తాగటానికి వొచ్చే వాళ్లలో ఎవరో ఒళ్లని వెంట తీసుకెళ్తున్నాడు.

ఒక తడవ వెంట వచ్చేవాళ్లు ఎవరూ లేకపోతే నన్ను రమ్మని బతిమాలాడు. సరేనని వెంటవెళ్లాను. ఆ ముఠావాళ్లు మునుపు నేను చూసినట్టు లేరు. అన్నుబట్టి, మొకాలు పీక్కుపోయి, ఎండ దెబ్బకి కాస్త నల్లబడ్డారు. మా వైపు పొలం పనులంటే అలాగే ఉంటాయి. ఎలాంటి మనిషయినా గుల్లయిపోతారు.

మా వాడు ఎప్పట్లాగే చెంబుతో కల్లు తూచి పోస్తున్నాడు. వాడికి వాళ్ల మధ్య చనువు పెరిగింది. కొందర్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. తండా సావాసగాడి అవసరం కూడ అంతగా లేకపోయింది వాడికి.

నేను దూరంగా నిల్చోని చూస్తూ ఉన్నాను. నాకు ఆనాడు కనపడ్డ అమ్మాయిని చూడాలనిపించింది. చుట్టూ చూసాను. ఎదురుగా ఉన్న పాకలో పాతి ఉన్న కర్రకి ఆనుకొని నిల్చోనుంది.

మా వైపే చూస్తోంది. కాస్త చీకట్లో ఉండేసరికి ఆ అమ్మాయి మొహం సరిగ్గా కనపడటం లేదు. లంగా జాకెట్టు తొడుక్కున్నట్టుంది. ఎర్ర రంగనుకుంటా. మా వాడు కూడా ఆ అమ్మాయి వైపే చూస్తున్నాడు. వాడు కళ్లతో ఆ అమ్మాయికేదో సైగ చేశాడు.

ఆ అమ్మాయి కళ్లు నేలకు దించింది. మళ్లీ చూసింది. మా వాడు కాస్త బెదిరింపుగా మళ్లీ సైగ చేశాడు. ఆ అమ్మాయి ఈ తడవ తలదించుకుంది. కింద కూర్చుంది. నాకు ఇదంతా చిత్రంగా ఉంది.

మా వాడు ఆ అమ్మాయికి ఎలా సైగ చేస్తున్నాడో, ఆ పిల్ల కాస్త సిగ్గుపడి, కాస్త భయపడి ఎలా వాణ్ణి చూస్తూ ఉందో నాకు అంతు పట్టలేదు. మా వాడు, ఆ అమ్మాయి వాణ్ణి ఇష్టపడేలా ఎలా చేసుకున్నాడా అన్నది నాక్కొంచెం ఆశ్చర్యం కలిగించింది.

ఇదంతా ఏ విధంగా జరిగిందో మరి! వాడు ఏ మాయమాటలు చెప్పి ఆ పిచ్చిదాన్ని నమ్మించాడో? నేను వాళ్ల తంతు చూస్తూ ఉన్నాను.

ఆ అమ్మాయి కాసేపటికి తలెత్తి రెప్పవేయకుండా మా వాణ్ణే చూస్తోంది. మా వాడు అటువైపు చూడలేదు. తల తిప్పలేదు. ఇప్పటివరకూ ఆ అమ్మాయి వైపే సైగలు చేస్తూ గుడ్లప్పగించి చూసిన వాడు ఇప్పుడు ఎందుకో తల కూడా తిప్పలేదు.

కల్లంతా అయిపోగానే “పోదాం రా” అన్నాడు. వెళ్లి క్యాను తీసుకొని బండి మీద కూర్చున్నాను. మా వాడు పోయేటప్పుడు కూడా ఆ అమ్మాయి వైపు చూడలేదు. వెళ్తూ నేను వెనక్కి తిరిగి అటు వైపు చూశాను. ఆ చీకటి పాకలో రెండు కళ్లు మూయకుండా చూస్తోంది ఆ అమ్మాయి.

మరుసటి రోజు కూడా మా వాడితో తండా వెళ్లాల్సి వచ్చింది. ఈ తడవ మా వాడి కోసం కాకుండా ఆ అమ్మాయిని చూద్దామనే వెళ్లాను. మేవు వెళ్లేసరికే ఆ అమ్మాయి పాక ముంగల వెల్తురు కింద నిల్చోనుంది. సుబ్బరంగా స్నానం చేసి తల దువ్వుకుంది. మెకానికి కాస్త పౌడరు కూడా రాసినట్టు ఉంది. ఎప్పట్లాగే మా వాణ్ణి చూస్తూ ఉంది. ఆ పిల్ల మా వాణ్ణి నిజంగానే ఇష్టపడుతుందేమోనని నాక్కొంత భయమేసింది.

కాసేపటికి మా వాడు కల్లు అమ్మటం నాకు అప్పగించి ఎక్కడికో పోయాడు. చూస్తే ఆ అమ్మాయీ లేదు. నాకు ఏయేయో ఆలోచనలు బుర్రలో మెదిలాయి.

నేను కల్లన్నీ అమ్మినాక, అప్పుడు వచ్చాడు. ఆ అమ్మాయి మాత్రం నాకు కనపడలేదు. తర్వాత ఇంటికి పోయేటప్పుడు మా వాణ్ణి ఎక్కడికెళ్లావని అడిగాను.

“ఆ ఎర్రపిల్లని ముద్దియ్యమని నిన్న అడిగితే ఇయ్యలేదు. ఇయ్యాల తీసుకుందావని ఎల్లాను. ఆ పిల్లకి ముద్దియ్యటానిగ్గూడ బో బయం. నేను బలవంతంగ దగ్గరకి లాక్కొని నడువుమ్మీద చెయ్యేసి ముద్దుపెట్టుకున్నా. అలా చిన్నగ పని గూడ కానిద్దావనుకున్న. కానీ కుదర్నియ్యలేదు. ‘ఏవన్న మాట్టాడు’ అని చెయ్యి పట్టుకుంటది. నాకేవో ఏం మాట్టాడాలో తెలీదు. అసలెట్ట మాట్టాడతం. పాకెనకాలకి ఎవురన్న వత్తారేవో దూరంగ పోదాం రమ్మంటే కదల్దు. రమ్మంటే రాలేదని ఇసుకొచ్చి ఆడే వొదిలి పెట్టొచ్చా” అన్నాడు.

వీడు ఆ అమ్మాయిని గిచ్చి ఉంటాడు. కొరకబోయి కూడా ఉంటాడని నా అనుమానం.

చాన్నాళ్లు మా వాడితో తండా పోవటం నాకు వీలు పడలేదు. వాడే ఎవరో ఒకళ్లని వెంటబెట్టుకొని  పోయి వస్తున్నాడు. నాకు ఆ అమ్మాయి అప్పుడప్పుడు కళ్లలో మెదులుతూనే ఉంది. మళ్లా ఎప్పుడో మా వాడు పిలవంగా పోయాను, ఆ అమ్మాయిని కూడా చూడవచ్చని.

మేవు అక్కడికి వెళ్లాక ముఠావాళ్లు రెండ్రోజుల్లో వాళ్లూరు వెళ్తున్నామని చెప్పారు. ‘వొచ్చి రెన్నెల్లు అయుతుంది. ఇంక మా వూరెళ్లాలి. ఇళ్లు జూసుకోవాలి’ అన్నారు.

నిజంగానే వాళ్ల కళ్లల్లో సొంతూరు చూసుకోవాల్నానే ఆశ కనపడింది. అన్నాళ్లు ఇంటికి దూరంగా ఉండే సరికి వాళ్ల మొకాల్లో దిగులు కనిపించింది. వచ్చినప్పటి మీద ఇప్పుడు కాస్త తగ్గారు. మొకాల్లో అప్పటి కళ లేదు. అందరు అలిసి పోయినట్టున్నారు.

మా వాడితోపాటు నేనక్కడికి వెళ్లాను ఆ వేళ ఆ అమ్మాయి నాకస్సలు కనిపించలేదు.

మా వాడు కల్లమ్మకం నాకప్పగించి ఎక్కడికో పోయాడు. నేను కల్లంతా అమ్మి క్యాను పట్టుకొని బండి దగ్గరకు వచ్చి కూర్చున్నాను. పోయిన వాడు ఎంతకీ తిరిగి రాలేదు. నాక్కాస్త భయంగా ఉంది. ఫోను చేస్తే తీయటం లేదు. ఎదురుచూస్తూ ఉన్నాను.

ఆ ముఠావాళ్లు ఎవరో ఒకళ్లు “ఏం బాబు ఇంకా పోలేదు?” అని అడుగుతున్నారు. “మాన్నాయి పనుండి తండాలోకి పొయ్యాడు” అని చెబుతున్నా.

నాకు చిరాకు, విసుకు పుట్టుకొస్తున్నాయి. బాగా పొద్దుబోయి, చీకటి పట్టి తల మీద పింఛాల్లా చుక్కలు విచ్చుకుంటున్నాయి. ఎంతోసేపు అలాగే కూర్చోనుఝటే అప్పుడు వచ్చాడు మా వాడు. నాకు పిచ్చి కోపమొచ్చింది.

ఏమంత విరగ పొడవను పోయాడు? ఇంత సేపా రాకుండా ఉండటానికి అని కడుపులో మండిపోతున్నా ఏమీ అనలేదు.

ఇద్దరం బండెక్కాము. పోయేతప్పుడు ఒకసారి వెనక్కు తిరిగి చూశాను. ఆ అమ్మాయి నాకు కనిపించలేదు.  దారి మధ్యలో మా వాడు బండి ఆపాడు. సిగిరెట్టు వెలిగించాడు. వాడు చేస్తున్న ఆలస్యానికి నాకు ఒళ్లు మండుకొస్తోంది. దాన్ని అణచుకొని “ఎక్కడికి పోయావురా?” అనడిగాను.

వాడు దమ్ములాగి పొగ వదిలి “ఆ లంబాడి పిల్లకాడ పడుకోడానికి పొయ్యా” అన్నాడు.

నాకర్థం కాలేదు. మతి పోయినట్టు అనిపించింది.

“ఎన్ని రోజులు బతివిలాడితే వొప్పుకుంది అనుకున్నవ్? కోపంతో ఒకసారి కొట్టినా గూడ. ముద్దు పెట్టుకోనిత్తది గానీ పడుకోటానికి మాత్తరం వొప్పుకోదు. నువ్వు రాకపోతే నీతో వుండనని బెదిరిత్తే చెయ్యి బట్టుకొని బేల మొకంబెట్టి అయితే వత్తాలే అంటది. మరిప్పుడు రావొచ్చుగా అంటే కదల్దు ఇట్టా ఎన్ని సాళ్లు ఇసికిచ్చింది అనుకున్నవ్. అందుకని కొన్ని రోజులు సూడకుండ, మాట్టాడకుండ వుంటే ఏడ్చింది గానీ రాటానికొప్పుకో లేదు. ఇంక సివరకి సచ్చిపోతానని జెప్తే అప్పుడొప్పుకుంది. అందుకే ఇయ్యాలొచ్చింది.

వొచ్చాకేనా చానా సేపు పని కానియ్యలేదు. ‘పడుకోకపోతే ఏవైంది. ఇలాగే వుండొచ్చుగా’ అంటది. ఇంక నేను సత్తాలే అని ఎనక్కి తిరగ్గానే సరేనంది. పడుకున్నప్పుడు గూడ ఇసికిచ్చింది. బట్టలిప్పమంటే అసలొప్పుకోదు. లయిటేత్తానంటే వొప్పుకోదు. అందుకే కొరికా. అయిపొయ్యి వొత్తంటే కాసేపు వుండమంది. చానా సేపయిందని చెప్పొచ్చా. వొత్తుంటే ‘మేవు ఎల్లుండి వూరికి పోతన్నం. ఈడికొత్తవా? నిన్ను సూడాలి’ అంది. సరేలే అన్నా” అని చెప్పి బండెక్కాడు.

నాకు ఆ వేళ ఏం తోచలేదు. గమ్మునుండి పోయాను. ఎందుకో ఆ అమ్మాయి మొకం మొదటిసారి చూసింది గుర్తుకు వచ్చింది.

మా వాడు ఆ రెండ్రోజులు ఎక్కడికీ కదల్లేదు. తండా సావాసగాడు రమ్మని ఫోను చేసినా, రావడం కుదరదని, వేరే పనిలో ఉన్నానని చెప్పాడు. ఆ రెండ్రోజులు మా వాడు ఏ పనీ చేయలేదు. కల్లు తాగి బాగోలేదని ముసుగు కప్పి పడుకున్నాడు. మూడోనాడు మాడిజాం మా వాడి దగ్గరకు వెళ్లాను. ఏయేయో మాట్లాడాడు.

“ఆ అమ్మాయి వాళ్లూరు పొయ్యుంటది గదూ” అన్నాను మాటల మధ్యలో.

“మనకెందుకు వాళ్లతో?” అన్నాడు.

మా వాడు చానా మారినట్టు అనిపించింది నాకు. కాసేపు అక్కడే కూచ్చున్నాను. చీకటి ఆకాశం నిండా పడతూ ఉంది. పనులకు వెళ్లిన జనాలు అప్పుడే అందరూ ఇళ్లకు చేరారు.

ఎవరో అమ్మాయి ఇంటి ముంగలకొచ్చి, చీకట్లో నిలబడి “కల్లమ్మే అబ్బాయిల్లు ఇదేనా?” అనడిగింది.

అవునన్నా.

ఆ అమ్మాయి కాస్త లోపలికి నడిచి వచ్చింది. వెల్తుర్లో చూస్తే అగుపడింది. ఆ అమ్మాయే. నాకొక్కసారిగా బుర్ర దిమ్మరకపోయింది.

ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుంది? వాళ్లూరికి వెళ్లలేదా? అసలెందుకు వచ్చింది? నాకు తల తిరిగిపోయింది.

ఒళ్లంతా మట్టి పట్టింది. జుట్టు సింపిరిసింపిరిగా చెరిగింది. కళ్లు ఎర్రగా ఉన్నాయి. ఒంటి నుంచి చెమట్లు కారిపోతున్నాయి. రొప్పుతూ ఉంది. బాగా అలిసిపోయినట్టు ఉంది

మా వాడు వచ్చి ఆ అమ్మాయిని చూసి బిత్తరపోయాడు “ఏందమ్మాయ్?” అన్నాడు.

ఆ అమ్మాయి “నీతొనే ఉంటా” అన్నది ఆశగా.

అప్పుడే మా పెదనాన్న వచ్చాడు.

“ఎవురీ అమ్మాయి?” అని అడిగాడు.

ఎవరం మాట్లాడలేదు.

“ఏం కావాలని?” ఆ అమ్మాయిని అడిగాడు.

ఆ అమ్మాయి మెదలకుండా తల దించుకుంది.

నాకు భయం పట్టుకుంది, ఏం జరిగిద్దా అని. అసలీ అమ్మాయి ఒక్కతీ ఎలా వచ్చింది ఇక్కడికి? వాళోళ్లు ఆ తండాలోనే ఉన్నరా? వాళ్లూరికి పోయారా? అసలేం అంతు చిక్కలేదు.

మా వోడు “ఇక్కన్నుంచి పో” అని గదిమాడు.

ఆ పిల్ల బిత్తరపొయ్యింది. కదల్లేదు.

“చెబుతుంటే నీక్కాదూ” అన్నాడు.

ఇంతలోకి మా పెదమ్మ వచ్చింది. ఆవ రావటం నాకింకా భయం వేసింది. ఎక్కడ తగువాడుతుందోనని. ఆ అమ్మాయి ధైర్యం ఏంది? అసలు కదలదు?

“ఇక్కడే ఉంటా. నిన్నొదిలి పోను. అందుకే వొచ్చా” అంది. నాకయితే గుండెలు జారినాయి. చుట్టు పక్కలోళ్లందరూ వస్తారేమో అనిపిస్తోంది. మా వాడూ అలాగే అనుకుని ఉంటాడు. వాడికి పిచ్చి కోపమొచ్చింది.

“పో.. ఇక్కన్నుంచి” అని గట్టిగా అరిచాడు.

ఆ అమ్మాయి “నేను పోను” అని వచ్చి వాడి చేయి పట్టుకుంది మొండిగా.

మా వాడు ఆ అమ్మాయి చేయి విదిలించుకొని, ఇక లాభం లేదనుకొని ఆ అమ్మాయిని నెట్టాడు. పోయి మట్టిలో వెనక్కి పడింది. పదహారేళ్ల అమ్మాయి. లంబాడి వాళ్ల పిల్ల. ఇష్టపడి సాహసం చేసి వచ్చింది.

ఆ అమ్మాయి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

మా పెదమ్మ చూసినంతసేపు చూసి ‘ఎవతివే నువ్వు?’ అని తిట్టడం మొదలుపెట్టింది.

ఆ అమ్మాయి దేనికీ కదలటం లేదు. మా వాడి దగ్గరకు వచ్చి మళ్లీ చేయి పట్టుకొని “నీతోనే ఉంటా” అంది. చెంపలు తుడుచుకుంటూ, కళ్లలోకి చూస్తూ. ఆమె కళ్లల్లో వాడిపై ప్రేమ.

వాడు చేయి విడిపించుకొని “అసలెవతివే నువ్వు? పో! లంజా”అని వెనక్కి తోసాడు.

తూలి పడబోయింది. నిలదొక్కుకుంది. నిలదొక్కోని “నీతో వుండొద్దా” అంది గెట్టిగా.

మా వాడు తల తిప్పుకొని ఆ అమ్మాయి మాటలు వినిపించుకోకుండా ఇంట్లోకి పోయాడు.

ఆ అమ్మాయి అంతే నిలబడింది. కళ్లు ముద్దగా మారాయి. చేతులు దోక్కుపోయి, నెత్తురు కనిపిస్తోంది. ఆ అమ్మాయి కళ్లు కూడా అంతే ఉన్నాయి. ఎంతో సేపు నిలబడింది. ఎంతో సేపు చూసింది. మా వాడు ఇంట్లో నుంచి బయటికి రాలేదు. మా పెదమ్మ తిడుతూనే ఉంది.

ఆ అమ్మాయి వెనక్కు తిరిగింది.

చీకటి విపరీతంగా పట్టింది. చుక్కలు కూడా మూసుకుపోయినాయి.

ఇళ్లు దాటి వెళ్లిపోయింది తండా వాళ్ల అమ్మాయి.

*

నాదైన చూపు లేదని అవన్నీ చింపేశాను

* హాయ్ వెంకట నారాయణ! మీ గురించి చెప్పండి.

మాది పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గరికపాడు గ్రామం. డిగ్రీ నరసరావుపేటలో చదివాను. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎమ్మే చేశాను.

* సాహిత్యంపై ఆసక్తి చిన్నప్పటి నుంచి ఉందా?

సాహిత్యంపై ఆసక్తి ఇంటర్ నుంచే మొదలైంది. పాఠ్యపుస్తకాల్లో ఉన్న కథలు చదివాక అలాంటివి మరిన్ని చదవాలని అనిపించింది. నరసరావుపేట గ్రంథాలయం గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లాను. కాలేజీలో కన్నా అక్కడే ఎక్కువగా గడిపాను. చాలాసార్లు క్లాసులు ఎగ్గొట్టి మరీ అక్కడ కూర్చుని పుస్తకాలు చదివేవాణ్ని. గోపిచంద్, కొడవటిగంటి కుటుంబరావు లాంటివారి రచనలు అక్కడే పరిచయమయ్యాయి.

* తొలి కథ ఎప్పుడు రాశారు?

మొదట్లో చాలా ఉత్సాహంగా రోజుకు 12 కథలు రాసి నా స్నేహితులకు వినిపించేవాణ్ని. ఇంటర్‌లోనే దాదాపు మూడు వందల దాకా కవితలు రాశాను. ఆ సమయంలోనే 160 పేజీల నవలొకటి రాశాను. ఆ తర్వాత అవన్నీ చింపేశాను.

* చింపేశారా! ఎందుకని?

వాటిల్లో నాదైన చూపు లేదని అర్థమైంది. అందుకే అలా చేశాను. గతేడాది చలసాని ప్రకాశ్ గారు నడిపే ‘రమ్యభారతి’ అనే పత్రికలో కథలపోటీకి ‘గిరిగిరోళ్లు’ అనే కథ రాసి పంపాను. మూడో బహుమతి వచ్చింది. ప్రచురితమైన నా తొలి కథ అదే! ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో ‘గరికపాడోడి కథలు’ సిరీస్ రాస్తున్నాను. ఇప్పటికి 8 కథలు రాశాను.

* ‘భూమి పతనం’ నవల రాశారు కదా? దాని గురించి చెప్పండి.

దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ముప్పై ఏళ్లు దాటాకే నవల రాద్దాం అన్న ఆలోచనతో ఉండేవాణ్ని నేను. ఒకసారి అంపశయ్య నవీన్ గారిని కలిసినప్పుడు ఆయన ఇస్తున్న ‘తొలి నవలా పురస్కారం’ గురించి చెప్పి నన్నూ ఓ నవల రాయమన్నారు. రెండు, మూడు సార్లు ఆయన అడిగాక రాయాలన్న ఆలోచన మొదలైంది. అయితే ఏ అంశం మీద రాయాలని చూసినప్పుడు నాకు మా ఊరే కనిపించింది. మాది వ్యవసాయ కుటుంబం. ఆ నేపథ్యంలో నవల మొదలు పెట్టి మూడు నెలల్లో పూర్తి చేశాను. ఆ తర్వాత అంపశయ్య నవీన్ తొలి నవలా పురస్కారం కోసం పంపాను. ఎంపిక కాలేదు. ఆయన కొన్ని మార్పులు సూచించడంతో మళ్లీ రెండు సార్లు నవల మొత్తం తిరగరాశాను.

నా నవల పుస్తక రూపంలో రావడంలో తమ్మిన రాజేశ్వరరావు, వారి అబ్బాయి తమ్మిన వెంకట నారాయణల ప్రోత్సాహం ఉంది. వారి ఇంట్లో ఉండే ఈ నవల రాశాను. ఆ తర్వాత విజయవాడ శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావుగారు దాన్ని ప్రచురించారు. 2021 మార్చి 13న నా ‘భూమి పతనం’ నవల ప్రచురితమైన రోజును మర్చిపోలేను.

* మీకు నచ్చిన రచయితలు?

పాలగుమ్మి పద్మరాజు, బుచ్చిబాబు, వడ్డెర చండీదాస్, గోపిచంద్‌, మా గోఖలే రచనలు చాలా ఇష్టం. వారి కథల్లో జీవన తాత్వికత బాగుంటుంది. కథలకన్నా కవిత్వాన్ని బాగా ఇష్టపడతాను. శ్రీనాథుడు, పాల్కురికి సోమనాథుడు రాసిన కవిత్వం ఇప్పుడు చదివినా ఆశ్చర్యం కలుగుతుంది. దీంతోపాటు ప్రాంతాల అస్తిత్వ కథలు నన్ను ఆకట్టుకుంటాయి. స.వెం.రమేశ్, ఎండపల్లి భారతి, సంక్రాంతి విజయ్‌కుమార్ లాంటి రచయితలు వారి ప్రాంతం గురించి రాసిన కథలు ఇష్టంగా చదువుతాను. వాళ్ల కథలు చదివాకే మా ఊరి కథలు రాయాలన్న ఆలోచన మొదలైంది. ఆఫ్రికన్ సాహిత్యంపైనా ఆసక్తి ఉంది.

* ఇంకా ఎలాంటి రచనలు చేయాలని ఉంది?

ప్రస్తుతం ఓ నవల రాస్తున్నాను. దాంతోపాటు ‘గరికపాడోడి కథలు’ సిరీస్ పూర్తి చేయాలి.

*

గూండ్ల వెంకట నారాయణ

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కత చాలా ఆసక్తికరంగా నడిచింది. లంబాడీల జీవితంలో ఉన్న కొన్ని కోణాల్ని జాగ్రత్తగా చూపించే ప్రయత్నం ఈ కథలో కనిపించింది. కంగ్రాట్స్ అన్న

  • తమ్ముడూ… నువ్వు కథల మొనగాడివి రా…
    మనం కలిసినప్పుడు నీచేతుల్ని కళ్ళకు అద్దుకుంటాను…
    💐💐💐💐

  • గూండ్ల వెంకట నారాయణ గారి కవిత్వంలో, కథల్లో తన ఊరూ, ఆ ఊరుమ్మడి బతుకులూ, తమవైన సజీవ భూమికలతో పాఠకుల మనసులను ముప్పిరిగొంటాయి. ప్రామిసింగ్ రైటర్ తను. అభినందనలు…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు