ట్రెండ్ సెట్టర్ సినిమా… తెలంగాణ‘మల్లేశం’

ఇవాళ్ళ తెలుగు సినిమా లో ఒక కొత్త దృశ్యం కనిపించింది. ఒక కొత్త స్వరం వినిపించింది. ఒక కొత్త భాష ధ్వనించింది. ఇంతకు ముందు మనము అనుభవించని ఒక కొత్త దృశ్య శ్రవణ అనుభవం కలిగింది. మామూలు అనుభవం కాదు. సినిమా చూసినంక కొన్ని రోజుల పాటు మరచి పోలేని అనుభవం. వెన్నంటే ఉండే అనుభవం. కళ్ళల్లో మెదిలే సన్నని కన్నీటి పొరల్లో జీవితం ప్రయాణాన్ని, వాతావరణాన్ని ప్రతిబింబించే ఫ్రేమ్స్ . చెవుల్లో తేనె పోసినట్టుగా ధ్వనించే భాష. పెదవుల మీద చిరునవ్వులని మొలిపించే నవ్వుల సన్నివేశాల జల్లులు. మనసుని ఎక్కడికో తీసుకుపోయే పాటల సంగీత తరంగాలు.

అవును నేను మల్లేశం సినిమా గురించే మాట్లాడుతున్నాను. బహుశా తెలుగు వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా కండ్లు కాయలు కాసేటట్టు ఎదిరిచూస్తున్న ఒక అద్భుత అనుభవాన్ని అందించిన గొప్ప సినిమా ‘మల్లేశం’ . యేండ్లకేండ్లు ఎదిరి చూసి ఎదిరి చూసి ఎన్నో సినిమాలు చూసి నిరాశ చెంది, కొన్ని చూసి పర్వాలేదనుకుని అరకొర సంతృప్తి తో సర్దుకుపోతున్న సందర్భమిది. అన్ని రకాలుగా గొప్ప అనుభూతినిచ్చి, అనుభవాన్ని మిగిలించే సినిమాలు, మిగతా భాషల్లో తమిళం లో బెంగాలీ లో మలయాళం లో చివరకు కన్నడ లో కూడా వస్తున్నాయి కానీ తెలుగు లో ఎందుకు రావడం లేదని ప్రతి సారీ నిరాశ చెంది చివరికి సబ్ టైటిల్స్ తో ఇతర భాషల సినిమాలు చూసి సంతృప్తి పడి పోయి, మన భాష లో కూడా ఇటువంటివి రావాలని కలలు కని, కండ్లల్లో వత్తులు వేసుకుని చూసిన నా లాంటి ప్రేక్షకులకు మల్లేశం సినిమా ఒక గొప్ప ఒయాసిస్. నీళ్ళు లేక పొలాలు ఎండిపోయి నేల బీటలు వారి, కనీసం దాహం తీర్చుకోవడానికి నీటి బొట్టు కూడా లేక అలమటిస్తున్నవేళ, అక్కడక్కడా కొన్ని చిన్న చిన్న జల్లులు అప్పుడప్పుడు వస్తున్నా ఒక జడివాన లా కురిసి తడిపి ముద్ద చేసి వూళ్ళూ, బీళ్ళూ ఏకం చేసిన గొప్ప సినిమా మల్లేశం.

ఇంతకీ ఏముందీ సినిమాలో అంత గొప్పగా? మనల్ని తడిపి ముద్ద చేసేంతగా? మనకో గొప్ప అనుభవాన్నిచ్చి అనుభూతిని మిగిలించేలా?

ఇది సినిమాల్లో బయోపిక్ ల కాలం. తెలుగులో కూడా బయోపిక్ లు (జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమాలు) చాలానే వస్తున్నాయి. అట్లాగే పీరియడ్ సినిమాలు కూడా చాలానే వస్తున్న సందర్భమిది. బహుశా జ్ఞాపకాలు బాగుంటాయనో, ఆ పాత మధురమనో, గతం తలచీ సంతోషించదమూ, వగచడమూ కన్నా సౌఖ్యం మరొకటి లేదనో ఏమైతేనేమి పీరియడ్ సినిమాలు చూడడానికి ప్రేక్షకులిష్టపడుతున్నారు. తెలుగులోనే కాదు మిగతా అన్ని భాషల్లో కూడా ఇదే మూడ్, ఇదే వాతావరణం ఉన్నది. అట్లాగే బయోపిక్ లది కూడా. ప్రముఖుల జీవిత చరిత్రలను ఆధారంగా తీసుకుని చాలానే సినిమాలు వస్తున్నాయి. ఒక ప్రముఖ నటి జీవితం లోని విభిన్న కోణాలను ఎగుడు దిగుడులను ఆధారంగా తీసిన ‘మహానటి’ గొప్పగా విజయవంతమైంది. అట్లే ఒక రాజకీయ నాయకుని పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ కూడా విజయవంతమైనట్టే. ఒక సినిమా కథానాయకుని జీవితం లోని ఘట్టాలను ఆ హీరో రాజకీయ నాయకుడయ్యాక జరిగిన పరిణామాలను ఎటువంటి సంఘర్షణ, వైరుధ్యాలు లేకుండా తీసిన రెండు సినిమాలు బోల్తా పడడమూ మనం చూశాం.

ఐతే ‘మల్లేశం’ సినిమా తెలుగులోనే కాదు బహుశా భారత దేశం లోనే ఇంతకు ముందు ఎవరూ, ఎప్పుడూ చేయని ప్రయత్నం. హిందీ లో పాడ్ మాన్ ఈ ప్రయత్నం చేసినా అది అంత సహజంగా లేకపోవడమూ, ఎక్కువ నాటకీకరించడం వల్ల ఆకట్టుకోలేక పోయింది. అట్లే మేరీ కొమ్ కూడా.

నిజానికి చింతకింది మల్లేశం ఒక పాపులర్ సెలెబ్రిటీ ఏమీ కాదు. దేశవ్యాప్తంగా కాదు, రాష్ట్రవ్యాప్తంగా కూడా ఒక పద్మశ్రీ విజేతగా తప్ప చాలమందికి ఆయన చేసిన పని ఏమిటి, సాధించిందేమిటీ అని తెలియదు. తెలంగాణ నల్గొండ జిల్లా చేనేత కుటుంబాలకు తప్ప, వారికి సహాయం చేయాలని ముందుకు వచ్చే కొందరు ఉదార దేశీ, విదేశీయులకు (ఎన్ ఆర్ ఐ ) లకు తప్ప ఆయన గురించి కానీ, ఆయన కథ కానీ పెద్దగా తెలియదు. బహుశా కొంతమంది ఆయన టెడ్ టాక్ చూసివుంటే తప్ప ఆయన వివరాలు బయటకు రాలేదు. ఎందుకంటే చింతకింది మల్లేశం సాధించిన విజయం అత్యంత ప్రాంతీయమైనది, దేశీయమైనది, ఒక సామాజిక సమూహానికి సంబంధించినది.

స్థూల దృష్టికి అట్లా కనబడ్డా సూక్ష్మ దృష్టికి నిజానికి అతనికి విశ్వజనీన, గ్లోబల్ స్వభావమున్నది. ఎప్పుడైనా ఎక్కడైనా, యే కాలం లో నైనా యే ప్రాంతం లో నైనా అత్యంత సామాన్యుడైన మనిషి తన వాళ్ళ కష్టాలను పోగొట్టటానికి, కన్నీళ్లు తుడవడానికి నడుం కట్టి, అందుకు ఎన్నెన్నో కష్టనష్టాలనుభవించి , ఎగుడు దిగుళ్లను ఎదుర్కొని యేమీ లేని స్థాయి నుండి ఒక విజయాన్ని సాధించడం, ఆ విజయం వల్ల ఆ ప్రాంత, ఆ సామాజిక సమూహ ప్రజలు బాగుపడడం నిస్సందేహంగా విశ్వజనీన స్వభావమున్న కథనమే.

సరిగా ‘మల్లేశం’ సినిమా దర్శకుడు ఈ పాయింట్ ను పట్టుకోలిగాడు. అదీ ఆయన గొప్పతనం. ‘ఒక సామాన్యమైన మనిషి అసామాన్యమైన కథ’ అనే టాగ్ లైన్ ఉన్న ఈ సినిమా నిజానికి ఒక సామాన్య మానవుని గ్లోబల్ కథ. విశ్వజనీన విజయం. ఈ తాత్విక అంశాన్ని చాలా గొప్పగా, శక్తివంతంగా చిత్రీకరించిన సినిమా ‘మల్లేశం’. ఈమధ్యే ఇంగ్లీషు లో వచ్చిన ‘ద బాయ్ హు హార్నెస్సేడ్ ద విండ్’ ఇదే కోవకు చెందినా, ఇంత శక్తివంతంగా లేదనే చెప్పాలి.

‘మల్లేశం’ సినిమా గొప్పతనం వెనుక ఉన్న నిజం ఆ సినిమా ను నిర్మించిన దర్శకుడు రాజ్ రాచకొండ , అతని టీం, ప్రాంతీయతకూ , సామాజిక సమూహాల ప్రత్యేకతకూ ఉన్న విశ్వజనీనతను గుర్తించడమే. గుర్తించి దాన్ని అత్యంత నిజాయితీగా, అత్యంత సహజంగా తెరకెక్కించి ఒక అద్భుత, నిశ్శబ్ద, నిగూఢ దృశ్యకావ్యం గా మలచడమే.

ఈ సినిమా మల్లేశం అనే ఒక సామాన్య, ప్రాంతీయ, ప్రత్యేక సామాజిక సమూహానికి చెందిన వ్యక్తి చేసిన ఒక విశ్వజనీన ప్రయాణ కథనం. అందుకే అది తెలుగు లో మొట్టమొదటిదీ, గొప్పదీ. అందుకే అంత గొప్ప అనుభవాన్నిస్తుంది.

ఇప్పటికీ చాలా మండి చాలా చోట్ల ప్రస్తావించిన సినిమా కథలోకి ప్రత్యేకంగా వెళ్లడం కన్నా , సినిమా లో ఉన్న ప్రత్యేకతలను, గొప్ప తనాన్ని ప్రస్తావించడం మరింత సమంజసం.

స్థూలంగా నల్గొండ జిల్లాలో పోచంపల్లి చుట్టుపక్కల ఉండే గ్రామాల చేనేత కుటుంబాలు, పద్మశాలి కులానికి చెందిన కుటుంబాలు, వారి ప్రత్యేకత ఐన ఇక్కత్ చీర నేయడానికి, ముందుగా దారాన్ని ఆసు పోసి, దాని మీద చీరకు కావల్సిన డిజైన్లు వేసి రంగులద్ది తర్వాత మగ్గం మీదకు ఎక్కిస్తారు. ఆసు పని ఆడవాళ్ళు చేస్తే మగ్గం మగవాళ్ళు నేయడం ఆనవాయితీ. ఒక చీరకు పదుల వేల సార్లు ఆసు పోసి ఆడవాళ్ళ ఎముకలు అరిగిపోయి చేతులు పడిపోయిన సందర్భాలెన్నో. వాళ్ళు ఆసు పొయ్యక పోతే మగ్గాలు మూలకుపడి, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలెన్నో. అట్లాంటి ఒక కుటుంబం లోంచి వచ్చిన చింతకింది మల్లేశం, ఆరవ తరగతి కన్నా ఎక్కువ చదవక పోయినా, ఇంగ్లీష్ అంతగా రాక పోయినా, యేడేండ్లు నానా కష్టాలు పడి , పెద్ద పెద్ద ఇంజినీర్లను సైతం అబ్బురపరిచేలా ఆసు యంత్రం తయారు చేసిన కథ ఇది. తర్వాత కాలం లో ఆ యంత్రానికి ఆయన చేసిన మార్పులు చేర్పులు ఇంప్రొవైజషన్లు సినిమా లో కనబడవు. ఒక వ్యక్తి ఎన్ని కష్టాలెదురైనా యెన్నో అడ్డంకులను అధిగమించి తను కలగన్న దానిని సాధించి విజయం సాధించడం అనే విశ్వజనీన సూత్రం సినిమాకు ప్రధాన థీమ్.

‘Dream is the highest point of life. Actions is its manifestation’ .

‘మల్లేశం’ సినిమా ను ప్రత్యేకంగా, గొప్పగా నిలిపింది దాని థీమ్ ఐతే దాన్ని సినిమాగా అత్యున్నత స్థాయికి అనేక అంశాలు తీసికెళ్ళాయి.

ముందుగా చెప్పాలంటే దర్శకుడు రాజ్ రాచకొండ రాసుకున్న స్క్రీన్ ప్లే. మల్లేశం బాల్యం నుండి యవ్వనం దాకా, అతను యంత్రం కనుక్కునే దాకా లీనియర్ ఫార్మాట్ లోనే   ఐనా ఒక్కొక్క దృశ్యాన్ని, ఒక్కొక్క సన్నివేశాన్ని, ఒక్కొక్క ఘట్టాన్ని, చాలా జాగ్రత్తగా, అత్యంత ప్రతిభావంతంగా, ఎటువంటి భేషజాలకు పోకుండా , ఎక్కడా నాటకీకరించకుండా, నిగూఢతను పాటిస్తూ, చాలా సూక్ష్మతతో స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. స్క్రిప్ట్ లో మరో గొప్ప విషయం యేమిటంటే ముగింపు అందరికీ తెలిసినా, దాని కోసం జరిగే ప్రయాణం ప్రతి అడుగునూ ఉత్కంఠ కలిగించేటట్టు, ప్రేక్షకులను కట్టి పడేటట్టు రాయడం. అందుకు రాజ్ ను ప్రత్యేకంగా అభినందించాలి.

రాజ్ ముందు రాసుకున్న సంభాషణలకు జవా జీవాలు నింపి ఒక అత్యున్నత స్థాయికి తీసికెళ్లిన ఘనత రచయిత పెద్దింటి అశోక్ కుమార్ ది. ఇటీవలి కాలం లో ఇంత గొప్ప సంభాషణలను యే సినిమాలోనూ వినలేదంటే అతిశయోక్తి కాదు. మినిమలిస్టు ధోరణిలో, క్లుప్తంగా, సూటిగా, అచ్చమైన తెలంగాణ నుడికారం తో, పద పదానా తెలంగాణ భాష గుబాళింపులతో అద్బుతంగా మాటలు రాశారు పెద్దింటి అశోక్ కుమార్. అట్లే మొదలు టైటిల్స్ అప్పుడు నేపథ్యం లో వినిపించే అద్భుతమైన తత్వాన్ని కూడా రాశారు.

రాజ్ రాసిన స్క్రిప్ట్ కూ, అశోక్ రాసిన సంభాషణలకూ ప్రాణం పోసింది లక్ష్మణ్ యేలే కళ. ప్రతి సన్నివేశం లో ప్రతి దృశ్యం లో దేశీయతనూ, ప్రాంతీయతనూ ఉట్టిపడేటట్టు తన కళతో తీర్చి దిద్దిన ఘనత లక్ష్మణ్ దే. కథ 1984 లో ప్రారంభమైనప్పటి నుండి 1990 లో అయిపోయే దాకా ప్రతి దృశ్యాన్ని అతి జాగ్రత్తగా తీర్చి దిద్ది అద్బుతమైన మీజాన్ సెన్ (mise en scène) ను సమకూర్చారు లక్ష్మణ్. ఇటీవలి కాలం లో ఇంత అద్భుతమైన మీజాన్ సెన్ ఉన్న సినిమా మరొకటి కనబడదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ దేశీయత, పోచమ్ పల్లి ప్రాంతీయత, పద్మశాలీ సామాజిక సమూహ ప్రత్యేకత ఉట్టిపడేలా లక్ష్మణ్ కళా దర్శకత్వం నెరపారు.

లక్ష్మణ్ మీజాన్ సెన్ ను, దర్శి, అనన్య, ఝాన్సీ, చక్రపాణి లాంటి నటుల అత్యంత సహజ నటనను, హావభావాలను, తెలంగాణ నల్గొండ జిల్లా లాండ్ స్కేప్ ను అద్భుతంగా రంగుల వెలుగు నీడల సమ్మేళనం తో చిత్రించిన ఛాయాగ్రహకు డు బాలు శాండిల్యస. ప్రతి ఫ్రేమ్ హృద్యంగా చిత్రించారు. బాలు చిత్రించిన దృశ్యాలను ఎడిటర్ చక్కగా కూర్పు నిస్తే మార్క్ రూబెన్ మంచి సంగీతాన్నందించాడు.

సినిమాకు మరో ప్రాణం దర్శి అద్భుతమైన నటన. నటులందరూ గొప్ప గా, అతి సహజంగా నటించినా దర్శి తన పూర్వ కమెడియన్ ఇమేజి నుండి పూర్తిగా బయట పడి మల్లేశం పాత్ర లో ఒదిగిపోయాడు. మల్లేశం తానే అన్నట్టుగా జీవించాడు. అద్భుతమైన హవ భావాలు, గొప్ప డయలాగ్ టైమింగ్, ఉద్వేగభరిత సన్నివేశాల్లో కళ్ళల్లో నీళ్ళు తెప్పించిన నటన, అనేక సార్లు నవ్వుల పువ్వులు పూయించిన అమాయకత్వపు మాటలు – అన్నీ రకాలుగా దర్శి ఒక గొప్ప నటుడిగా తెలుగు వాళ్ళకు దొరికిన ఒక వెలకట్టలేని వజ్రంగా చెప్పుకోవచ్చు. ఇక ఝాన్సీ, చక్రపాణి, అనన్య, మల్లేశం దోస్తులుగా నటించిన జగదీష్, అన్వేష్ అందరూ గొప్పగా నటించారు. వాళ్ళ వాళ్ళ పాత్రల్లో అత్యంత సహజంగా ఒదిగిపోయారు. ఉద్వేగ భరిత సన్నివేశాల్లో మల్లేశం నాన్నగా చక్రపాణి నటన అమోఘం. ఝాన్సీ లో ఇంత గొప్ప నటి ఉన్నదా అనెటట్టు జీవించారు. అనన్య కొత్త అమ్మాయి ఐనా ధీటుగా నటించింది. చిన్న పిల్లలుగా నటించిన ప్రతి ఒక్కరూ గొప్పగా సహజంగా చేశారు. సినిమా లో సహజ హాస్యం, దాదాపు ప్రతి సన్నివేశం లో నవ్వుల పువ్వులు పూయించింది.

సినిమాలో అడుగడుగునా తెలంగాణ ప్రాంతీయతనూ, సంస్కృతినీ గొప్పగా అద్దం పట్టడం మరో గొప్ప విషయం. శారద కాండ్ర కథ , పీర్ల పండగ, తర్వాత పద్మశాలీ ల కులపురాణం భావనా ఋషి మార్కండేయుల కథను పటం కథగా చెప్పడం, దుబ్బుల వాళ్లతో యెల్లమ్మ కథను చెప్పించడం, మల్లేశం పద్మలకు పెండ్లి అయినంక ఇంట్లోకి వస్తున్నప్పుడు భార్యా భర్తలను పేరడిగిన సన్నివేశం లో పద్మ చెప్పిన జానపదుల గాథ – ఇట్లా ఒకటేమిటి తెలంగాణ సంస్కృతినీ జానపదాలు సినిమాలో అడుగడుగునా గుబాళిస్తాయి. అందుకు కళా దర్శకులు లక్ష్మణ్ నూ చిత్ర దర్శకులు రాజ్ నూ ప్రత్యేకంగా అభినందించాల్సిందే. అట్లే దశాబ్దాల పాటు తెలుగు సినిమా లో హేళనకూ, అవమానానికీ గురైన తెలంగాణ భాషను అద్భుతంగా, చెలిమలో నీటి ఊటలా, స్వచ్చంగా పలికించిన గొప్పదనం కూడా ‘మల్లేశం’ దే.

సినిమాలో మేకప్ మరో గొప్ప విషయం. జాతీయ అవార్డు గ్రహీత పట్టానమ్ రషీద్ ప్రతి పాత్రనూ అతి సహజంగా తీర్చి దిద్దారు. ఆద్యంతమూ సింక్ సౌండ్ తో నిర్మించిన ‘మల్లేశం’ లో ధ్వని ప్రత్యేకంగా నిలుస్తుంది.

గోరటి వెంకన్న రాసిన రెండు పాటలూ, అశోక్ రాసిన తత్వమూ సినిమాకు హైలైట్ గా నిలిస్తే, దాశరథి అద్భుత గీతం ‘ఆ చల్లని సముద్ర గర్భం’ సమయోచితంగా ఉపయోగించడం చాలా బాగుంది.

సినిమా అంటే కోట్లాది రూపాయల ఖర్చు, భారీ సెట్టింగులు, విదేశాల్లో పాటలు, పొట్టి గుడ్డల హీరోయిన్లు, అనేకానేక ఆస్తుల ధ్వంసం, అర్థరహిత ఫైటింగులు, బూతు డయలాగ్ లు , ఐటెమ్ సాంగులు ఇంకా అనేకానేక భరించలేని చెత్త అనుకునెట్టు చేస్తున్న ప్రస్తుత తెలుగు సినిమా లో ‘మల్లేశం’ సినిమా ఒక గొప్ప మార్పు. ఒక మైలు రాయి. ఒక గొప్ప ఒయాసిస్. కరువులో తడిపెసే జడివాన.

ఇంత గొప్ప సినిమాను నిర్మించిన శ్రీనివాస్ అధికారికీ , రాజ్ రాచకొండకూ మనసారా అభినందనలు. తెలుగు సినిమాకు ‘మల్లేశం’ నిస్సందేహంగా ఒక ట్రెండ్ సెట్టర్.

*

నారాయణ స్వామి వెంకట యోగి

నారాయణ స్వామి వెంకట యోగి

43 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • మల్లేశం మూసను బద్దలు కొట్టాడు..
  Thanks for the detailed review

 • అన్నా… సినిమా చూసి నంత అనుభూతి..సినిమా నేపథ్యం వెనుక ఉన్న ఆ సినిమా టీమ్ మొత్తం కృషి వాళ్ళు పడిన శ్రమ..వారి ప్రత్యేకత అద్బుతంగా ఒక గొప్ప సినిమా రివ్యూ రాశారు.. కుడోస్

 • ట్రెండ్ సెట్టర్ సినిమా మల్లేశం గురించిన మీ రివ్యూ చాలా బాగుంది.సర్!💐మాకు అయితే చూడాలి అనివుంది. చూస్తాం,కూడా త్వరలో.ఆంధ్రా లో,ఎన్ని రోజులు అడతాది అనేది,సందేహమే!.

  • Thank you madam. If people like you support it widely it will play well anywhere. It is a universal theme and story with human spirit.

 • Wonderful review… touching all the aspects involved in making such a trendsetter. Happy to get lovely reaction. to the honest effort.

 • “ఇవాళ్ళ తెలుగు సినిమా లో ఒక కొత్త దృశ్యం కనిపించింది. ఒక కొత్త స్వరం వినిపించింది. ఒక కొత్త భాష ధ్వనించింది. ఇంతకు ముందు మనము అనుభవించని ఒక కొత్త దృశ్య శ్రవణ అనుభవం కలిగింది. మామూలు అనుభవం కాదు. సినిమా చూసినంక కొన్ని రోజుల పాటు మరచి పోలేని అనుభవం. వెన్నంటే ఉండే అనుభవం. కళ్ళల్లో మెదిలే సన్నని కన్నీటి పొరల్లో జీవితం ప్రయాణాన్ని, వాతావరణాన్ని ప్రతిబింబించే ఫ్రేమ్స్ . చెవుల్లో తేనె పోసినట్టుగా ధ్వనించే భాష. పెదవుల మీద చిరునవ్వులని మొలిపించే నవ్వుల సన్నివేశాల జల్లులు. మనసుని ఎక్కడికో తీసుకుపోయే పాటల సంగీత తరంగాలు.”
  అలాగే ఇవ్వాళ ఒక కళా రూపాన్ని అన్నీ కొణాలనుంచి నిశితంగా పరిశీలించి అద్భుతమయిన విశ్లేషణ రాశారు మిత్రులు నారాయణస్వామి గారు. అసలు ఈ విశ్లేషణకు వారు ఉపయోగించిన స్టిల్ ఫోటోయే చాలా గొప్పగా ఉంది. దర్శకత్వం, స్క్రీన్ప్లే , రచన, నటీ-నటుల ఎన్నిక, కెమెరా పని, సంగీతం, మేకప్ , ఎడిటింగ్, ఒక గొప్ప సినిమా తీయడానికి ఎంత అవసరమో అంత బాగా ఉండడం ఈ సినిమాలో ఉన్నాయని మిత్రులు ఉదాహరణ లతో చెప్పారు.
  నాకు రాచకొండ విశ్వనాధ శాస్త్రి (రావి శాస్త్రి) గారంటే పిచ్చ అభిమానం. అలాగే ఈ సినిమా దర్శకులు కూడా రాజ్ రాచకొండ గారు కూడా తెలంగాణ లో ఉన్న రాచకొండ ప్రత్యేకత అయ్యుంటుంది.
  సినిమాలో వాడిన సాహిత్యం గురించి కూడా బాగా రాశారు.
  తెలంగాణ లో ఉన్న జనపద రూపాలను ఈ సినిమాలో వాడిన పద్ధత గురించి మిత్రులు పత్యేకంగా రాయడం చాలా బావుంది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనపద రూపాలు చాలా విలువయినవి. మన అర్ధంలేని ఆధునికతలో వాటినెవ్వరూ పట్టించుకోవటం లేదు.
  ఈ విశ్లేషణలో నారాయణస్వామి వెంకటయోగి ముద్ర (బ్రాండ్) బాగా కనిపించింది. తప్పకుండా సినిమా చూస్తాను .

 • 360* angle lo review saginattu anipinchindi…katha vastuvu,daani venakunna nepadhyam,patra dharula natanaa shaili,itara cinimalato polchukunte ee chitram endulo vibhinnamainadi anna vishayalapai meeru rasina write up chala effective ga undi sir. Meeku, mallesham team ki abhinandanalu 💐💐💐

 • Loved the review; I can understand where it came from.
  Infact, the traits you identified: concreteness, simplicity, honesty, directness, restraint — those are the ones made the movie what it is, can be found, in most places, in the review (except for the first two paragraphs).

  The first two paragraphs is generic stuff, without really tying it the movie at hand. The subsequent sections played off the movie, explaining why you loved it, comparing it to previous efforts.

 • అన్నా… మీ రివ్యూ చదువుతా ఉంటే ఎప్పుడెప్పుడా చూస్తానా అన్నట్లు ఉంది.
  ఈమధ్య కాలంలో కొత్త ఆలోచనలకు , యువకులకు అవకాశాలు ఇస్తే ఇలాంటి అద్భుతాలు సృష్టించగలరు. నేను సినిమాలు చాలా ఎక్కువ చూసేవాడ్ని ఒక్కప్పుడు. ఈమధ్య కాలంలో అయితే కేరాఫ్ కంచరపాలెం ఒక అద్భుతం. మీ రివ్యూ ప్రకారం చూస్తే మల్లేశం మరొక అద్భుత కళాకాండం ( నేనింకా చూడలేదు )
  బాలు గాడి
  మంచి సినిమాల ప్రేమికుడు

  • నెనర్లు తమ్ముడూ – అవును తెలుగు సినిమాలకు మంచి రోజులొస్తున్నాయి – చాల సంతోషంగా ఉన్నది

 • Review చదివితే సినిమా ను ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది . వాళ్ళు పడ్డ శ్రమ , తపన, కళ్ళకు కట్టినట్టు మీ review లో కనిపిస్తుంది. మల్లేశం సినిమా టీం ఇంత మంచి సినిమా తీసినందుకు అభినందనలు

 • మల్లేశం సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నిర్మాణ బాధ్యతల్లో చాల పెద్ద పాత్రను పోషించి సినిమా విజయవంతం కావడానికి అన్ని రకాల మాధ్యమాల్లో అనుక్షణం అహరహం కృషి చేస్తున్న వెంకట సిద్దా రెడ్డిని ఈ రివ్యూ లో ప్రస్తావించక పోవడం నేను చేసిన పెద్ద పొరపాటు. ఈ సినిమా ఇంత అద్భుతంగా నిర్మించబడడానికి వెంకట్ నిర్వహించిన పాత్ర అసాధారణమైనది, నేను చేసిన పొరపాటుకు మన్నించమని అడుగుతూ , వెంకట్ కు వేన వేల జయహోలు. సినిమా లో ప్రత్యక్ష పరోక్ష సైనికుడి పాత్ర ఇంత సమర్థవంతంగా నిర్వహించడం తనకే చెల్లింది. ఉన్న నియమాలను ఛాందస పద్దతులను పాత విధానాలను ఇంకా ఇంకా అనేక కాలం చెల్లిన మూర్ఖత్వాలను విచ్చేదనం చేసి వాటి స్థానే నిరంతరం కొత్తదనం కోసం అహరహం కృషి చేసి positive disruptor వెంకట్. ఆయనకు నా అభినందనలు

 • మీతో పూర్తి ఏకీభావం నారాయణయోగి గారూ. తెలుగు సినిమా లో ఇది ఒక మైలు రాయి. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి.

 • Swami garoo,
  No sir. You are a telangite and you better understood the film. For me those details like after maariage the exchange of couplets, and other traditions. This film deserves a much more detailed review explaining all those things.

  At least 6,7 dialogues i could not follow. The last time this happened with me was when i watched Dasi.

  • Paresh garu – I understand and I appreciate your sincere and honest feedback. If you can point out what you did not follow I am more than happy to explain if I can.

 • ఝాన్సీ ఆసు పోస్తూ భుజాన్ని పట్టుకునే దృశ్యం ట్రైలర్ లో చూసి చలించిపోయాను అన్న.నేతల కష్టం ఎట్లుంటదో ఆ ఒక్క దృశ్యం చాలు. వ్యాసం అద్భుతంగ ఉందన్న.నిజంగా మల్లేషం సినిమా ట్రెండ్ సెట్టరే.గోరటివెంకన్న ఓహో జంబియా పాట ఎంతో గొప్పగుంది.ఆ ఆట,ఆ పాట చూస్తుంటే ఇది కదా మనం కోరుకున్న తెలంగాణ అనిపించింది.ఈ సినిమా మీద వచ్చిన రివ్యూలలో మీది అగ్రస్థానంలో ఉంటది అన్న.

  • తమ్ముడూ నీకు నచ్చినందుకు బోలెడన్ని నెనర్లు. సినిమా తప్పకుండా చూడు.

 • చాలా బావుంది మీ రివ్యూ.నిన్ననే సినిమా చూసా.సెల్యులాయిడ్ మీద వొక అధ్బుతమైన భాష సముద్రమైంది.అందరు చూడాల్సిన సినిమా.

 • అన్నా నమస్తే,documentary లాగా ఉంటుందేమో అనుకునేవాళ్లకు సినిమా చూసి తీరాలి అని అనిపించేతట్టు review రాసినవు!

  • Thank you Narsanna. Documentary laga asalu undadu. Utkantha udvegam Cinema lo kshanakshanam untayi. Tappaka chudu. Idi Mana Cinema.

 • ఒక అద్భుత జీవన దృశ్యానికి, ఒక శ్రమైక సౌందర్యానికి నిజమైన చిత్రిక పట్టావు నా స్వామీ!

  • కృష్ణుడూ బోలెడన్ని నెనర్లు! వీలయితే సినిమా తప్పకుండా చూడు.

 • సమగ్రంగా, సమున్నతంగా…. నా లోలోపల కొన్ని సందేహాలకు సమాధానంగా వ్రాసారండీ… ధన్యవాదములు…

  • శైలజ గారూ మీకు ఉపయోగపడినందుకు చాలా సంతోషం. దయచేసి సినిమా చూడండి వీలైతే .

 • అన్నవరం దేవేందర్, కందుకూరి అంజయ్య,ముదునూరి రాజేశ్వరి మొదలగు సాహితీ వేత్తలతో కాలిసి మల్లేశం సినిమా మా కరీంనగర్ లో చూసినం. తెలంగాణ భాష, సాహిత్యం, సంస్క్రుతుల అస్తిత్వం కోసం రచనలతో పాటు ఉద్యమాలనూ చేసిన మనకు మల్లేశం సినిమా ఓ గొప్ప దావత్. సకల కళల సమ్మిశ్రమమైన సినిమా మాధ్యమాన్ని ఇంత ప్రతిభావంతంగా వినియోగించుకోవడం తెలంగాణ సాంస్కృతిక రంగానికి అందించిన కొత్త టానిక్.తెలంగాణ సాంస్కృతిక ఐకాన్స్ గోరటి, పెద్దింటి, ఏలె, నారాయణస్వామి, మొదలైన వారు ఈ సినిమా కు ఆత్మ.ఇకపై సాహిత్యమే కాదు..నవ్య సినిమాకూ చిరునామా తెలంగాణ కానుంది.

 • స్వామి గారు, మల్లేశం ఆత్మను పట్టుకున్నారు మీరు. రెండ్రోజుల క్రితమే అనుకోకుండా మల్లేశం చూశాను. మీ సమీక్ష చదివిన తర్వాత నా వైపునుంచి ఏం చెప్పినా దానికి అర్థం ఉండదనిపించింది. అంత బాగా రాశారు . సినిమా చూస్తున్నంత సేపు కళ్ళముందు నా బాల్యమే గిర గిర తిరిగింది . సినిమా అంటే ఇరానియన్ వాళ్ళదే అనే నాలో ముద్రపడ్డ భ్రమ తొలగించారు దర్శకుడు రాజ్ రాచకొండ. ఒకే ఒక్క మాటలో చెప్పమంటే – అద్భుతానికి పర్యాయపదం మల్లేశం .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు