టీచరమ్మ (సింహళ భాష కథ)

    సీతా కులతుంగే  సింహళ రచయిత్రి. 1937లో బందరగామాలో జన్మించింది. ఆమె పెరడేనియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివింది. శ్రీలంక, నైజీరియా దేశాల్లో టీచరుగా పని చేసింది. ఆమె రాసిన ఆంగ్ల నవల “దరి ది థర్డ్ వైఫ్” కు 1988లో అవార్డు వచ్చింది. 

*

నివారం సాయంత్రం. కూతురు డాన్సు క్లాసు ముగించుకుని వస్తుందని పేవ్మెంట్ పై నిలుచుని ఎదురు చూస్తోంది, ప్రియాని తన కారుకు ఆనుకుని-

ఆలస్యం అవుతోంది. దూరంగా సముద్రం సూర్యుణ్ణి మెల్లగా కొంచెం కొంచెం మింగేయటం కనిపిస్తూనే ఉంది.

చీకటితో మెల్లగా చిక్కబడుతున్న సంధ్యపు కాంతులు ప్రియానీని దుఃఖంలోకి లాగేస్తున్నాయి.  చక్కటి దృశ్యానికి కారణభూతుడైన సూర్యుడు కనుమరుగయిపోతుండడం వలనా?

వచ్చిపోయే కార్లన్నీ వేగంతో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ నగరం దాటిపోవాలని అసహన పడుతున్నట్లు అనిపిస్తోంది.

ప్రియాని ఆ నగరంలో ఒక స్కూల్ టీచర్. వేరే అవకాశాలు ఏవీ అందిరాక తను టీచర్ అయ్యింది కానీ తానుగా కోరుకుని కాదు.

“నీకు  సైన్స్ లో ఒక డిగ్రీ ఉండివుంటే మంచి జీతంతో  మంచి ఉద్యోగం రావటం కష్టమేంకాదు” అని డిగ్రీ ప్యాసవుతున్నప్పుడు తన స్నేహితులు అన్నారు. తన టీచరు ఉద్యోగంలో చేరదామా అని ఆలోచిస్తున్నప్పుడు “టీచరైతే పెద్దగా ఏం సంపాదించ గలవ్?” అని కూడా కొందరు అన్నారు.

ప్రియాని ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నించి ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళినా తనకు సంతృప్తి అనిపించే ఉద్యోగం దొరకలేదు. ఎక్కువ దూరం వెళ్ళేందుకు ఇష్టం లేకపోవడంతో తను నివసించే ఇంటికి దగ్గరగా ఉండే ఒక చిన్న స్కూలులో ఉద్యోగం చేయాలని నిశ్చయించుకుంది. రానుపోనూ ప్రయాణం సమస్యా కాలేదు.

తనకు ఇంకెక్కడా ఉద్యోగం దొరక్కపోవడానికి తనకు ఆంగ్ల భాషపై పట్టు లేకపోవడమే కారణం అన్న భావన కూడా మనసులో ఉంది. ఎలాగో కూడదీసుకుని జవాబులైతే చెప్పగలదు గానీ ఆంగ్లంలో ఏ ముఖ్యమైన సమస్యనూ చర్చించ లేనని తనకు తెలుసు. తను చదువుకుంటున్న రోజుల్లో టెక్స్టు పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు చదివేందుకు సమయం చిక్కలేదు సరికదా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అవకాశం దొరికినా వినియోగించుకోలేదు.

ప్రియానీకి ఆర్ధిక సమస్యలేమీ లేవు.ఆమె భర్త మంచి జీతం తెచ్చుకుంటాడు. ఆమె తల్లిదండ్రులు కూడా కావలిసినంత ధనం, భూమి ఇచ్చారు. కానీ తనకు కావలసిన వస్తువులు ఎన్నో ఉన్నాయి: తీర్చుకోవాలనుకుంటున్న కలలూ చాలా ఉన్నాయి. తను కొలంబో నగరానికి కొంచెం దూరంలో శివార్లలో ఉంటోంది. కొలంబో నగరంలో ధనవంతులూ, అధికారులూ ఉండే చోట ఇల్లు కట్టుకోవాలని ఆమె కల.

“ఎంత ధనం కావాలో కదా దానికి” అని ఆమె ఆశ్చర్య పోతూండేది.

ఆమె స్నేహితులు ప్రియానీకి ఏ సమస్యలూ లేవని అసలు ఆమె ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉండిపోయినా ఏ తేడా ఉండదని అంటూంటారు.

కానీ ఆమె మస్తిష్కంలో నీటి బుడగల్లా పుట్టే కోర్కెల గురించి వాళ్ళకెలా తెలుస్తుంది? ఆమె కూతురు, కొడుకుల స్పెషల్ క్లాసుల సంగతి వారికెలా తెలుస్తుంది? గొప్ప జాతికి చెందిన కుక్క ఖరీదు వారికెలా తెలుస్తుంది?

అసలు వారికి ఈ సంగతులేవీ తెలియవు. తనకు తానూ పిల్లలకూ నాగరికతకు చిహ్నమైన- ఆంగ్లంలో మాట్లాడేందుకు తరగతులూ, ఉపన్యాసం ఎలా ఇవ్వాలో చెప్పే శిక్షణా తరగతులూ, పాశ్చాత్య బేలెట్ నాట్యమూ, టెన్నీసూ, ఈతనేర్చుకోవడమూ ఇంకా యిలా ఎన్నో?

ప్రియాని తన పిల్లలిద్దరూ ఈ శిక్షణా తరగతులకు తప్పక వెళ్ళేలా ఏర్పాటు చేసింది. వాళ్ళకి ఆడుకోవడానికి సమయం చిక్కడం లేదని  ఆమెకు తెలుసు కానీ ఇవీ ముఖ్యమే కదా!

గ్రామాల్లో ఉండే ప్రియానీ బంధువుల్లో చాలా మందికి ఆంగ్లంలో మాట్లాడ్డం చేతకాదు, తన పిల్లలూ ఎక్కువగా సింహళ భాషలోనే ఎక్కువగా మాట్లాడతారన్న భయమూ ఉంది. అందువలన ఆమె ఎప్పుడూ వారితో ఆంగ్లంలోనే సంభాషించేది. ఆమె తండ్రి జయలాల్ కూడా ఆంగ్లంలోనే మాట్లాడేవాడు

ఎవరైనా ఇంటికి వచ్చినా ఇద్దరూ వారి ముందు పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక్క సింహళ భాష  పదం కూడా దొర్లకుండా జాగ్రత్త పడేవారు.

గ్రామం నుంచి వచ్చిన ఏ వ్యక్తైనా “ప్రియానీ పిల్లలు ఆంగ్ల భాష మంచినీళ్ళ ప్రాయంగా మాట్లాడుతారు” అని పొగిడినా తమ ఇంగ్లీషు స్థాయి ఎంతదో తెలుసుకునే విద్వత్తు వారికి లేదని ప్రియానీకి తెలుసును.

ప్రియానీ తల్లికి ఆంగ్లం తెలియదు. కానీ ఆమె వచ్చినప్పుడు మాత్రం వింద్యా, వినోద్ ఇద్దరూ మనసు తీరా ఆమెతో  సింహళ భాషలోనే మాట్లాడేవారు. ఆమెతో నవ్వుతూ, తుళ్ళుతూ, కథలు చెప్పేవారు. అమ్మమ్మ చెప్పేది కథలు విని ఆనందించేవారు. అయితే అన్నీ సింహళ భాషలోనే!

ఈ మధ్యనే జయలాల్ అమెరికా చూసి రావడంతో దీర్ఘాలు తీస్తూ ఆంగ్లం మాట్లాడుతున్నాడు.

కారు దగ్గరే వేచి ఉండడంతో ప్రియానీకి ఆలస్యం అవుతోందని అనిపించింది. సూర్యాస్తమయం అయిపోవడంతో మారా చెట్ల పైభాగాన్ని మెల్లగా చీకటి మింగేస్తోంది‌. చాలా మోటారు కార్ల లైట్లు వెలగడం మొదలయ్యింది. శనివారం సాయంత్రమైతే కొలంబోలో చాలా మంది సినిమా లేదా థియేటర్కి వెళ్తారని ఆమెకు తెలుసు.

జుట్టు చెదిరిపోయి, శరీరం ముందుకు వంగిపోయి

సైకిలు తొక్కుతూ వెళ్తున్న ఓ యువకుడిని చూసింది. అతన్ని చూస్తుంటే ఆమెకు యువకులకు మార్గదర్శనం చేయాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ప్రొఫెసర్.గుణవర్ధనే ఉపన్యాసం వార్తా పత్రికలో చదివిన విషయం గుర్తొచ్చింది. కానీ ఆమెకు అలాంటి విషయాలకు సమయం లేదు.తను పనిచేస్తున్న స్కూలు ప్రిన్సిపాల్ కూడా అలాంటి విషయమే ప్రస్తావించడం కూడా గుర్తొచ్చింది. కానీ ప్రియానీకి తాను చెప్పాల్సిన పాఠాలు చదవడానికే సమయం దొరకడం లేదు ఇక స్నేహితులు టీచర్లు తప్పకుండా చదవాల్సిన వార్తా పత్రికల మధ్య పుటల్లో సామాజిక, మానసిక విషయాలపై వచ్చే పెద్ద పెద్ద వ్యాసాలు గురించి చెప్పినా చదివే తీరిక ఎక్కడ దొరుకుతుంది? ప్రతీ రోజూ ఆమె చెప్పే ట్యూషన్ క్లాసులూ ఉండేవి. మిగిలిన వాటికి సమయమే ఉండేది కాదు.

ఆమె చెప్పే ప్రైవేట్ ట్యూషన్లకు గొప్ప గిరాకీ ఉంది. అలాంటప్పుడు వార్తాపత్రికల్లో అప్పుడప్పుడూ ముఖ్య వార్తల శీర్షికలూ, సంస్మరణలూ లాంటివి తప్ప ఇతర వార్తలూ, వ్యాసాలూ చదివే సమయం ఎలా చిక్కుతుంది?

ఇంటిలో గడిపే సమయంలో కూడా ఆమెకు ఎంత పని ఉంటుందనుకుంటున్నారు. తాళం వేసిన కప్ బొర్డ్స్ ఆమే తీయాలి ఎందుకంటే తాళాలు ఆమే ఉంచుకుంటుంది కనుక-టీ పొడి, పంచదార, కాఫీ పొడి, పప్పులూ ఇతర సరుకులూ పనివాళ్ళకు అందించాలి. ఇవన్నీ రోజూ ఆమె సమయాన్ని చాలా తీసేసుకునేవి.

అలీస్ మంచి పనిగత్తే కాక సరుకులని కూడా పొదుపుగా వంటలో ఉపయోగించేది. కానీ ధరలు ఆకాశానికి అంటుతున్న ఈ రోజుల్లో పనివాళ్ళకే  ఈ మొత్తం  పని అప్పచెప్పటం ఎలా కుదురుతుంది?

ఆంగ్లం బాగా వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా ఆంగ్ల సాహిత్యం గురించి చర్చించుకుంటుంటే, ప్రియానీ మనసులో నేనూ ఆ పుస్తకాలు చదివుంటే‌ ఎంత ‌బాగుండేది అని ఆలోచించేది. కానీ అది కష్టపడి ఆంగ్లం నేర్చుకోవడం వలన దక్కిన ఫలితం అని మాత్రం ఆలోచించేది కాదు.

మిసెస్.రణవీరాని చూడు. ఆమె ఆంగ్లంలోనూ సింహళ భాషలోనూ ఎన్నో నవలలు చదివింది. ఆమెకు ఇంట్లో పని ఉండదా? బహుశా ఆమె తన భర్త నుంచి వేరైపోవడం వలన ఆమెకు చదివేందుకు అంత సమయం దొరుకుతోందేమో?

ప్రియానీకి తన పిల్లల్లో చదివే అలవాటును పెంపొందించాలని అనుకునేది కానీ వారికి చదవడానికి ఎలాంటి పుస్తకాలు ఇవ్వాలో ఆమె ఊహకు అందలేదు. ఆంగ్ల పుస్తకాలు కాదు కదా కనీసం సింహళ భాషలోనైనా ఏ పుస్తకాలు ఇవ్వాలో ఆమెకు తట్టలేదు.

ఎ-లెవెల్ తరగతిలో ఉన్న చాలా మంది విద్యార్థులు బొమ్మల పుస్తకాలు, కార్టూన్లు చదువుతారు. వాళ్ళలో ఒకరో ఇద్దరో పుస్తకాలు చదివేవారు. తను క్లాసులో అటెండెన్స్ తీసుకుంటున్నప్పుడు నిహాల్ వీరవర్ధనే ప్రశాంతంగా పుస్తకం చదువుకోవడం చూసింది.

ఒక్కోసారి ప్రియానీ ఆ అబ్బాయి చదువుతున్న పుస్తకాన్ని తీసుకుని అటుఇటూ తిప్పి చూసేది. ఆ సమయాల్లో నిహాల్ సైన్సు చదవకుండా ఉండాల్సింది అని అనుకునేది. పుస్తకాలు చదవడం ఆంగ్ల భాషను పటిష్ఠం చేయటం మాత్రమే కాకుండా మనిషి మెదడునీ, ప్రవృత్తినీ అర్ధం చేసుకోడానికి సహాయపడుతుందని మాత్రం ప్రియానీకి తోచలేదు.

చీకటి కమ్ముకుంటోంది. ఎర్రటి బంతిలా ఉన్న సూర్యుడు సముద్రంలో పూర్తిగా మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. గజిబిజిగా జుట్టు చెదిరిపోయి ఉన్న ఒక కుర్రాడు సముద్ర తీరం వైపుగా నడుచుకుంటూ వస్తున్నాడు. వాడిని చుసాక ప్రియానీకి తన క్లాసులో విద్యార్థి విరాంగ హేమంత్ జయశేఖర గుర్తుకొచ్చాడు. మొన్న సైన్సు పాఠం చెబుతున్నప్పుడు వాడు దీర్ఘ ఆలోచనలో మునిగి ఆకాశం కేసి చూస్తున్నాడు. ఆమె ఏమీ అనలేదు. సాధారణంగా ఆమె విద్యార్థులు ఆమెతో స్నేహితంగా ఉంటారు. తను వారితో స్నేహంగా ఉంటే తమలో తాము విద్యార్థులు మాట్లాడుకునే నప్పుడు తనని విమర్శించరని ప్రియానీకి తెలిసినందుకు ఎంతో ఆనందంగా వుంది.

కానీ పిల్లల వ్యక్తిగత విషయాలు తవ్వి, వారి సమస్యలు తెలుసుకునేంత సమయం ఆమెకు లేదు. అలాంటి స్పందనా చర్యలకు ఆమె ఆమడ దూరం.

ఏమైనా, విరంగా విచారకరమైన ముఖం చూడగానే ఆమెకు యువత సమస్యలపై, వారి అశాంతిపై ప్రొఫెసర్.గుణవర్ధనే ఉపన్యాసం గుర్తుకు వచ్చింది. కానీ ఆ ఉపన్యాసం గురించి రాసుకున్న నోట్సు ఎక్కడ పెట్టిందో గుర్తుకు రాలేదు. “నేను చదివిన పుస్తకాల పేర్లు ఒక్కటి కూడా గుర్తుకు రావట్లేదు” అని ఆమె తనలో తాను అనుకుంది.

కానీ బుధవారం నాడు విరాంగ తనతో చేసిన అభ్యర్ధన గుర్తుకొచ్చి బాధతో హృదయం మెలి తిరిగింది. ఆరోజు తన పిల్లలిద్దరినీ ఎలక్యూషన్ క్లాసుకు తీసుకువెళ్ళే పని లేకపోయుంటే, కొంచెం సేపు ఉండి విరంగా ఏమిటి చెప్పదలుచుకున్నాడో వినేది.

“రేపు నన్ను కలుసుకో! విరంగా! నీకేం తొందర లేదు కదా!” అని దయార్ద్ర పూర్వకంగా అడిగింది.

“అదేం లేదు! సరే మేడమ్!” అని విరంగా కూడా వెళ్ళిపోయాడు.

వాడికి ఆమె సమయం కావాల్సింది చాలా కొంచెమే! మరింకేం అక్కర్లేదు కాసింత మాట్లాడదాం అనుకున్నాడు. ఆమె కూడా మనసులో వాడికి ఎలాగైనా  కాస్త మాట్లాడేందుకు సమయం కేటాయించాలని ఒట్టు వేసుకుంది. కానీ ఎప్పుడు?

కూతురు వింద్యాని స్పెషల్ క్లాసులకు తీసుకు వెళ్ళడమే తనకున్న సమయంలో అధిక భాగం తినేస్తోంది. ఒకవేళ మరో పనివాడు కేవలం ఆ పని కోసమే ఇంట్లో ఉంటే తన ఈ సమస్య పరిష్కారం అయ్యేదా? డబ్బులకు ఏ కొదవా లేకపోయినా ఆచితూచి ఖర్చు చేసేది ఆమె.

అవసరానికి మించి పనివాళ్ళు, మనుషులూ ఉండడమంటే తన డబ్బును వ్యర్థం చేయించేందుకే అని ఆమె వారిని ప్రత్యర్థులుగానే భావించేది. నా ఆస్తిని కాపాడుకోవడం నా అత్యంత ప్రధానమైన కర్తవ్యం అని ఆమె తనకుతాను ఒకటికి పదిసార్లు చెప్పుకునేది. ఏదైనా ఫారమ్ నింపేప్పుడు మతం అనే కాలమ్ లో “బుద్ధిష్ట్” అని రాసేది కానీ ఏనాడూ బుద్ధుని గురించి ఆలోచించ లేదు. ఆమెకు క్రైస్తవ మతం గురించి కూడా ఏమీ తెలియదు. ప్రియానీని  ఎన్నడూ నేను టీచర్ని ఎందుకు అయ్యాను? ఎందుకు డబ్బులు పోగు చేస్తున్నాను? అన్న‌ ప్రశ్నలు బాధించలేదు. అదొక బాధ్యత, తన పిల్లల‌ కోసం ఆ బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తున్నాను‌ అనే భావించేది.

ఆ రోజు కొద్ది సేపైనా ఉండి విరాంగాతో మాట్లాడ లేకపోవడానికి ఒక కారణం ఎలక్యూషన్ క్లాసుకి వెళ్ళిన పిల్లల్ని వెనక్కు తీసుకురావడమైతే, తన విద్యార్థులు ట్యూషన్ కోసం ఇంటికి రావడం రెండవ కారణం.

ఆమె ఆ కుర్రవాడితో మాట్లాడేందుకు వీలు చేసుకోలేక పోయింది.

నిన్న శుక్రవారం, మొన్న లక్ష్మి వారం నాడు కూడా విరాంగ్ స్కూలుకు రాలేదు.

కూతురు వింద్యతో పాటు ఆమె  ఇల్లు చేరేసరికి చాలా ఆలస్యమైంది. అలీస్ అప్పటికి డిన్నర్ తయారు చేసేసింది. జయలాల్ స్నానం చేస్తున్నాడు.

ప్రియానీ  బట్టలు మార్చుకుని రోజూ సాయంత్రం  వచ్చే వార్తాపత్రిక చూస్తూ యధాలాపంగా సంస్మరణల కాలమ్ వైపు దృష్టి సారించింది. జయశేఖర అనే పేరు కనిపించగానే ఆమె ఆగిపోయింది. మరు క్షణంలో విరాంగ్ హేమంత పేరు చూడగానే గుండె ఆగినంత పనైంది. ఆమెకు తన లోలోపలే గట్టిగా కేక వినిపించినట్లైంది.

అవును! అవును! అవే అక్షరాలు “వి..హెచ్”. తను అటెండెన్స్ రిజిస్టర్లోంచి పలికే రెండు అక్షరాలే.

చాలా విషాద పరిస్థితుల్లో అతడు చనిపోయాడు.

విషాద పరిస్థితులు?

ట్రైన్ ముందు దూకేశాడు?

సముద్రంలో మునిగిపోయాడు?

తను కారు దగ్గరే ఉండి కూతురు కోసం ఎదురు చూస్తూండగానే ఆ యువకుడు సముద్రం వైపుగా నడచి వెళ్ళడం ఆమెకు గుర్తొచ్చింది. తల పట్టుకుని బెడ్డు పై కూర్చుండిపోయింది. కాళ్ళ కింద ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్లు అనిపిస్తోంది.

కూతురు వింద్య రూములోకి వస్తూ “ఏమైంది అమ్మా? ఏమిటి విషయం?” అని అడిగింది.

ప్రియానీ ధనశేఖర “ఏమీలేదు, కేవలం తలనొప్పి అంతే!” అని బదులు ఇచ్చింది. అంతకన్నా ఆమె ఏం చెప్పగలదు?!

*

 

ఆర్ . ఎస్ . వెంకటేశ్వరన్ .

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు